నా పాలస్తీనా ప్రేయసీ!

Spread the love

నీ కళ్ళు 
నా గుండెకు చిక్కుకొని వేలాడే ముళ్ళు
ముల్లును కూడా
ఇష్టంగా పెంచుకున్న ప్రేమ నాది!
నా దేహ కండరాలను కప్పి
ద్వేష గాలుల నుండీ
చీకటి రాత్రుల చిక్కని వేదన నుండీ
ఆ ముల్లును కాపాడుకున్న!

నీ చూపుల ముల్లు చేసిన గాయం
నిప్పురవ్వై గుండెను కాల్చుతున్నా
ఆ వెలుగురవ్వలు నాలోపలి చీకటి తరుముతూ
వేల లాంతర్లను వెలిగిస్తున్నాయి

ఇప్పటి నొప్పి లోంచే
రేపటి హాయి ఉదయాలను చూస్తున్న!
వెచ్చని ఆ గాయమే నాకిప్పుడు ఊపిరి

2
కన్నూ కన్నూ కలిసాక
మనం చూస్తున్న కల ఒక్కటే
నువ్వూ నేనూ ఇప్పుడు ఇద్దరం కాదు!

పాటల్లాంటి మధురమైన నీ మాటలనే
మళ్లీ మళ్లీ పాడాలని ఆరాటపడే
నా పెదాల మీదికి
వేదన దురాక్రమణ చేసి రాగాన్ని మింగింది
ఇక నీ మాటలు రెక్కలు విప్పి
నిశ్శబ్దంగా ఎగిరిపోయినవి

మన కలల గూడు‌
శరత్కాలపు తలుపులు మూసి
ఆశగా నిన్నే వెతుక్కుంటూ
దేశ దేశాలు వలస పోయింది
అద్దం బద్దలైంది
వేదన వేయి రెట్ల మడతలై పోగుపడింది

ముక్కలయిన పదాల పోగులన్నీ
ఏరి ఒక్కటి చేద్దాం
పుట్టిన మట్టి కోసం మన తండ్లాటనంతా
ఒక విషాద గీతంగా స్వరపరిచి
'లైర్' హృదయాన్ని మీటుదాం

ఆకాశంలోని చంద్రునికీ
నేలమీది రాళ్ళకూ
హృదయం కరిగేలా మన విషాదాన్ని
గొంతెత్తి పాడేలోపే లైర్ తీగల మీదికి దూసుకొచ్చిన ఈ అపస్వరం
నువ్వు వెళ్ళిపోయే సమయానికి సంకేతమా?
నా నిస్సహా నిశ్శబ్దమా?

3
నిన్న ఆ ఓడ రేవులో...
కట్టుబట్టలతోనే
తీరంలేని సముద్ర ప్రయాణానికి
బయలు దేరుతున్నట్టుగా ‌ఉన్న
నిన్ను చూసాను

అనాథబాలుని ఆశలా
నీ దగ్గరకు పరుగెత్తుకొచ్చాను
మన ముత్తాతల అనుభవాల మూట కోసం!

అసలు ఆకుపచ్చని నారింజ తోటను
తల్లి వేరు నుండి ఎలా పెకలిస్తారు?
వెలివేత ఓడలో
దూరాన ఉన్న ఏ జైలుకు తీసుకెళ్తారు?

ఇన్ని బలవంతపు ప్రయాణాల్లో
ఇన్ని సముద్ర ఉప్పు గాలుల్లో‌
ఆ పచ్చదనం ప్రాణంతో ఉంటుందా?

ఓ రాత్రి నా డైరీ లో రాసుకున్నానిలా!

"నేను నా నారింజ తోటను ప్రేమిస్తాను.
వెలివేసే ఓడ రేవును ద్వేషిస్తాను
ఇప్పుడు,
నారింజ తొక్కలాంటి దేహమే‌ నాతో ఉంది
మిగిలిందంతా నీలో ఉంది! "

4
చిక్కుపడ్డ ముళ్ళపొదల పర్వతాలలో
వెంటాడే శిథిలాల మధ్య
గొర్రెల మందను కోల్పోయిన కాపరిలా ఉన్న
నిన్ను చూసాను!

ఒకప్పుడు నువ్వు ప్రేమగాలులు వీచే తోటవి
ఇప్పుడేమో నేను అపరిచితుడిలా
నన్ను నేనే తడుముకుంటున్నాను
దయలేని కాంక్రీటు తలుపులన్నీ మూసేసినట్టు
గుండె బండ బారిపోయింది
5
నీళ్ల తొట్లలో ధాన్యపు కొట్టాల్లో
పగిలిన నీ ప్రతిబింబమే చూసాను

నైట్ క్లబ్ లో పనిమనిషిలా
కన్నీళ్ళ మసక కాంతిలో...
గాయాల దేహంలా ఉన్న నిన్ను చూసాను!

ఎప్పటికీ
నేను పీల్చే ఊపిరి
పలికే శబ్దమూ నువ్వే
నీరువైనా నువ్వే
నిప్పు కూడా నువ్వే

తలదాచుకున్న ఆ గుహ‌‌ల దగ్గర నిన్ను చూసాను
బట్టలు ఆరేసే తీగ మీద వేలాడుతున్న
నీ అనాథ‌ దుస్తులు చూసాను
నిప్పుల కుంపటిలో
నడిచే దారుల్లో
సూర్యుని నెత్తుటి దిక్కులో
దుఃఖిత గీతాల్లో
నిన్నే చూసాను, నిన్నే విన్నాను

నీ కళ్ళలో ఉప్పు నీటి సముద్రాన్ని
నీ పెదాల మీద పొడిబారిన నేలను చూసాను

ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి
పసి పిల్లలా !
అరేబియన్ మల్లెల్లా!
ఈ భూమికే అందానివి!
6
నీకు చూపులతోనే మాటిచ్చిన
నా కళ్ళ‌ నుండి నీ కళ్ళకు
చూపుల దారాలతో
నీ కవితనొకటి అల్లిన
గుండె తడిలో అది మొలకెత్తి
తీగలా అల్లుకుంటుంది

తేనె కన్నా
ముద్దుల కన్నా
తియ్యని వాక్యానొకటి రా‌సాను

" హృదయంలో
ఒక పాలన్తీయురాలు ఉండేది
ఎప్పుటికీ ఉంటుంది!"

7

ఓ తుఫాన్ రాత్రి
గడ్డకట్టిన చంద్రున్ని చూద్దామని
తలుపులన్నీ తెరచాను
అంధకారాన్ని,అడ్డు గోడలనును దాటుకుంటూ
వెళ్ళమని రాత్రితో చెప్పాను

మాటల్లో చేతల్లో
నా వాగ్ధానం నిలబెట్టుకొంటాను
నువ్వు ఎప్పటికీ నా దానివి!
మన పాటల్లో కత్తులు మొలసినంత కాలం
గోధుమ గింజంత నమ్మకాన్ని
గుండెలో సజీవంగా ఉండనీ
సారవంతమైన మన నేలలో నాటితే
మళ్లీ పాటలు మొలకెత్తడానికి

8
నువ్వు నా ఖర్జూరపు మొక్కవి
నాలోపలికి వేళ్లూనుకున్నదానివి
ఏ తుఫానూ కూల్చేయలేదు
ఏ‌ గొడ్డలీ నరికేయలేదు
కానీ నేనిప్పుడు
వెలివేత గోడ అవతలకి నెట్టేయబడ్డవాణ్ణి!

ఎలాగైనా
నీ వెచ్చని చూపుల్లో నాకింత ఆశ్రయం ఇవ్వు!

తీసుకపో నీతో పాటే ఎక్కడికైనా
మన ఇంటి పెరటిలో పెరిగిన
బాదం చెట్టు కొమ్మనో
అటక మీది ఆటబొమ్మనో
మట్టి గోడలోని గులకరాయినో
నా విషాద కావ్యంలోని ఓ పద్యాన్నో...
ఏదో ...
ఏదో ఒకటి తీసుకెళ్ళు ఆనవాళ్ళుగా
తరువాతి తరం త్వరగా
తిరిగి మనఇల్లు చేరడానికి
అవే దారి గుర్తులవుతాయి!
9

నీ గురించి ప్రపంచానికి ప్రకటిస్తానిలా!
"ఆమె పేరు పాలస్తీనా
చేతి మీది పచ్చబొట్టు 'పాలస్తీనా '
ఆమె కళ్ళు
కళ్లలో కలలు,
కళ్ళకింద దిగులు వలయాలు
పాలస్తీనా

ఆమె తలమీది దుపట్టా
దేహమ్మీది పుట్టు మచ్చా పాలస్తీనా
ఆమె మాట , ఆమె మౌనం పాలస్తీనా
ఆమె పాలస్తీనాలో పుట్టింది
ఆమె మరణంలో కూడా
పాలస్తీనా ఉంటుంది "

10

నా కవితల్లోని నిప్పురవ్వలా
నా పాతనోటు పుస్తకంలో
నిన్ను దాసుకున్నాను

దారిపొడవునా
నన్ను బతికించే అన్నం మెతుకుల్లా
నిన్ను వెంటతీసుకెళ్తాను
నీ పేరు ఈ లోయల్లో ప్రతిధ్వనించేలా
గొంతెత్తి పిలుస్తాను

పోరాట కాలం వేరైనా ,
నేను ప్రాచీన బైజాంటియమ్ అశ్విక దళాన్ని చూసాను!

జాగ్రత్త... జాగ్రత్త
పైకి కనపడని లావాలా
నా పాటల్లో పిడుగులు ఉన్నాయి

ప్రేమ కోసం నేనొక పుష్పాన్ని
దేశం కోసం అశ్విక యోధున్ని
జాత్యహంకార విగ్రహాల విధ్వంసకున్ని
రాబందులు వాలకుండా
వాలెంటైన్ సరిహద్దుల్లో
నా పద్యాలను నాటుతాను
శత్రువు ఎదుట‌ నీ పేరే నినదిస్తాను

ఎప్పుడైనా ఆదమరచి నిద్రపోతే
పరాన్న పురుగు
నా మాంసాన్ని తింటుందని తెలుసు

ఎప్పటికైనా చీమలు గుడ్లు
గద్దలకు జన్మనివ్వలేవు
రక్త పింజర గుడ్డు పెంకుకైనా
విషమే అంటుకుంటుంది!

చరిత్రలో
బైజాంటైన్ యుద్ధాశ్వాలను చూసినవాన్ని
నిన్ను ప్రేమించే యువకున్ని నేను
నీ ప్రేమ కోసం యుద్ధం చేసే యోధున్ని!

మూలం:( A lover from palastine ) . --మహమూద్ దర్విష్
స్వేచ్ఛానువాదం: రహీమొద్దీన్
మహమూద్ దర్విష్

పాలస్తీనా జాతీయ కవి‌గా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...

రహీమొద్దీన్

కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్‌ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.


Spread the love

One thought on “నా పాలస్తీనా ప్రేయసీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *