ఇంకా మనకు సరిహద్దుల్లేని దేశాలున్నాయి
మన అపరిచిత ఆలోచనల్లాగా!
ఇరుకైన, విశాల దేశాల పటాలగుండా
వాటి సన్నని బూడిద రంగు సొరంగాల
చిక్కుల బోనులో నడుస్తూ అరుస్తాం!
"... ఇంకా'నిన్ను' ప్రేమిస్తూనే ఉన్నాం!"
మన ప్రేమ ఒక అనువంశిక వ్యాధి!
తెలియని ప్రాంతాల్లోకి
మనల్ని చెల్లాచెదురుగా విసిరేస్తూ
ఈ దేశాలు విస్తరిస్తాయి.
వాటి "విల్లో" చెట్లు , భౌగోళిక చిత్రాలు
పచ్చిక బయళ్లు, నీలి రంగు పర్వతాలు
ఆత్మకు ఉత్తరాన
ఒక సరసు విశాలమమవుతుంది
దక్షిణాన
గోధుమచేలు మొలకెత్తుతాయి.
ప్రవాసి రాత్రుల అంతులేని చీకట్లలో
నిమ్మ పండు
చిక్కని జ్ఞాపకాల దీపమై వెలుగుతుంది
భూగోళశాస్త్రం నుండి
పవిత్ర గ్రంథాలు ఉదయిస్తాయి.
గొలుసుల వరుసలా పర్వతాలు
అంతకంతకూ ఆకాశందాకా పెరుగుతాయి
దేశ బహిష్కృతుడు
తనకు తానే చెప్పుకుంటాడు:
"నేనొక పక్షినైతే సొంత గూటికి చేరలేని
నా నిస్సహాయ రెక్కలను నేనే కాల్చుకుందును! "
శరత్కాల వాసనలు
"ప్రియమైన వాళ్ళ" రూపుగడతాయి!
మృదువైన వాన
తడి తడిగా
పొడిబారిన గుండె పొరల్లోకి ఇంకుతుంది
ఇంకా ఒక ఉహ దాని వేర్లనుండి
నిజమైన భూమిగా,
ఏకైక సొంత నేలగా మొలకెత్తుతుంది
దూరంగా ఉన్నదంతా
పురా గ్రామీణంగా,
అప్పుడే స్వర్గము నుండి
కిందికి దిగి వస్తున్న ఆదామును కలుసుకోడానికి, తనను తాను
సమీకరించుకుంటున్న భూమిలా ఉంటుంది.
నేనంటాను :
ఇవే మనల్ని మోసే దేశాలా...
అయితే మనమెప్పుడు పుట్టి ఉంటాము?
"ఆదాము" కు ఇద్దరు భార్యలా?*
లేక
పాపాన్ని మరిచిపోడానికి
మనం మళ్లీ పుడుతామా?**
*” ఆదాముకు ఇద్దరు భార్యలా? “
ఇది మతపరమైన ప్రశ్న కాదు. పాలస్తీనా విభజన మరియు గుర్తింపు సంక్షోభానికి ప్రతీక.
ఇది భూమిపై ఇద్దరి హక్కుల సంఘర్షణను సూచిస్తుంది.
నిర్వాసిత పాలస్తీనీయులు, ఆదాములాగా రెండు వైపులా చీలిపోయారు:
1 హవ్వ → కోల్పోయిన స్వదేశం (స్వర్గం) కోసం ఆరాటం
2 లిలిత్ → వలసలో ఉన్న నిజమైన జీవితం (ప్రతిఘటన).
**పాపాన్ని మరచిపోవడానికి మేము మళ్లీ పుడతామా?”:
“పాపం” = వలస/భూమి కోల్పోయిన బాధ. ఆదాము ఏదేన్ (స్వర్గం) నుండి బహిష్కరించబడినట్లే, పాలస్తీనీయులు తమ భూమి నుండి బహిష్కరించబడ్డారు.
