ఈ ప్రార్థన గీతంలో..
ఆ ఆశ్విక యోధుని హృదయంలో
మనమొక సామూహిక స్వప్నాన్ని పరుద్దాం!
అతని చివరి చొక్కాను
విజయ కేతనంగా పైకెత్తుదాం
మన ఆఖరి తలుపు తాళంచెవిని
గుప్పిట పట్టుకొనే వెళ్దాం
మనం అనంత ప్రవాసంలో
మొదటి సముద్రంలోకి అడుగుపెట్టాం
కాసింత చోటైనా మిగలని
ఈ స్థలానికి సోదరుడా!
నీకు శాంతి కలుగుగాక!
నీ పాదాలకు శాంతి కలుగుగాక—
మట్టిలో మెరుస్తున్న నీ కళ్లను
ఏ గొర్రెల కాపరులూ గమనించలేరు.
నీ బాహువులకు శాంతి కలుగుగాక—
అవి అడవి పక్షులై
మళ్లీ ఇక్కడ
స్వేచ్ఛగా రెక్కలు ఆడిస్తాయి.
నీ పెదవులకు శాంతి కలుగుగాక—
పొలాల్లో నీ ప్రార్థనలు
పూలై పూస్తాయి.
నీ కళ్లలోని నిప్పుకణికలకు ఏం చెప్పగలం?
నీవు లేని శూన్యం నీ తల్లికి ఏం చెప్తుంది?
"అతడు ప్రశాంతంగా నిద్రపోయాడు" అని చెప్తుందా?
ఆక్రమణదారులు
ఏమని మురిసిపోతారు?
"ఆగస్టు నెలలో
గర్జించే మేఘాన్ని సైతం
మేము జయించాము! "
మహమూద్ దర్వీష్‌కు
జీవితం ఏం చెప్తోంది?
"నువ్వు బతికావు,
ప్రేమించావు,
నేర్చుకున్నావు...
కానీ... చిట్టచివరికి
నువ్వు అమితంగా ప్రేమించేవారంతా
మరణించారా?"
ఈ ప్రార్థన గీతంలో
మనమొక కలని పరుద్దాం!
ఒక విజయ సంకేతాన్ని పైకెత్తుదాం,
ఆఖరి తలుపు తాళంచెవిని
వెంట తీసుకొని వెళ్దాం
ఒక కలలో
మనల్ని మనం బంధించుకోవడానికి!
ఎన్ని చావులైనా
మనం జీవించే ఉంటాము,
ఎందుకంటే జీవితమంటే జీవించడమే!
మూలం : ఫీ హాదా అన్-నషీద్ (In this Hymn)
- దర్వీష్ మహమూద్
స్వేచ్ఛానువాదం : రహీమొద్దీన్
మహమూద్ దర్విష్
పాలస్తీనా జాతీయ కవిగా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...
రహీమొద్దీన్
కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.
