ఆ రోజు ట్రాఫిక్ కూడలి దగ్గర ట్రాఫిక్ ఆగి పోయింది . అప్పుడే ఒక గంట కి పైగా అయింది. ఎర్ర లైట్ , పసుపుకి , ఆ తర్వాత ఆకుపచ్చకి మారటం లేదు. ఎర్రలైట్ పక్కకి తొలగ కుండా అలాగే నిల్చుని వుంది. కాస్త నిదానం గా చూస్తే, ఏదో చెప్పాలను కుంటోంది అని అనిపించేటట్లు . కానీ అంత నిదానంగా ఎవరు ఆలోచిస్తున్నారు ? అంత పరుగులే కదా . అందుకే ఎవ్వరూ దాని గురించి పట్టించు కో లేదు . ఎప్పుడు వెళ్ళాలా అనే ఆదుర్దా తప్ప ఇంకో ఆలోచన లేదు అక్కడ ఆగిన వాళ్ళకి.
అదే ఆ ఎర్ర లైట్ కంప్లైంట్ కూడా. పక్కన పసుపు లైట్ , ఆకు పచ్చ లైట్ మాత్రం చాలా కంగారు పడ సాగాయి . ” నువ్వు పక్కకి వెళ్తే కదా మేము వచ్చేది. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగి పోయారు. మమ్మల్ని బ్లేం చేస్తారు , సరిగా పని చేయటం లేదని. ” అని ఎంత చెప్పినా ఎర్ర లైట్ మాత్రం కాస్త కూడా చలించలేదు . ఇంకా గట్టిగా నిలుచుంది.
” నాకు చాలా విసుగు గా వుంది . ప్రతీ రెండు నిమిషాలకి మారుతూ ఎన్నేళ్ళనుంచి పని చేస్తున్నాను ?! ‘టిక్ ! టిక్ !’ అంటూ , ఇంక నా వల్ల కాదు బాబూ ! ఈ మనుషుల కి ఎందుకో విసుగు రాదు. అలా అని మొహాలమీద నవ్వూ వుండదు . మనుషులు అయినా , కాస్త కూడా భావోద్వేగాలు లేకుండా వుంటున్నారు . వాళ్ళని చూస్తూంటే జీవం లేని యంత్రాలు లా వున్నారు. ” ఎర్ర లైట్ చిరాకు పడుతూ అంది.
” నీకెందుకు వాళ్ళ గొడవ ? నీపని ఏదో నువు చేసుకు పోక . నీ పని నువ్వు చేయి .మాపని మమ్మల్ని చేయనియ్యి . తనిఖీ వాళ్ళు వస్తే నీ తో పాటు మమ్మల్నీ తిడతారు .” పసుపు , ఆకుపచ్చ లైట్స్ , బిక్క మొహాలు వేసుకుని అన్నాయి . ఎప్పుడూ రూల్స్ ని పాటిస్తూ , చక్క గా చదువుకునే మంచి పిల్లలు , హఠాత్తుగా వాళ్ళనుంచి , పుస్తకాలు లాక్కుంటే ఎలా వుంటారో , ఆవిధం గా వున్నాయి, ఆ రెండూ ఏమి చేయాలో తెలియక .
” తప్పంతా నాదే అని చెపు తాను సరేనా ? అయినా మీకు , ఇక్కడ ఆగిన మనుషులకి ఏమీ తేడా లేదు. . చాలా సేపటినుంచి ఆగే వున్నారు . కాస్త వూపిరి పీల్చుకుని , మొహం మీద నవ్వు తెచ్చుకుని , పక్క వాళ్ళ కేసి కాస్త స్నేహపూర్వంగా చూడ వచ్చు కదా . అదేమీ లేదు . ఒకటే ఆందోళన ….”
పసుపు , అకుపచ్చ లైట్స్ , అసహనంగా దాని మాటలు. వింటున్నాయి, “దీనికి ఏమయింది ఈ రోజు ?” అనుకుంటూ ..
మళ్ళీ అంది. ఎర్ర లైట్ ,” పక్కవాడు పడిపోయినా ఏమి పట్టించు కోరు . అదే కాదు , చుట్టుపక్కల ఏమయినా అసలు పట్టించుకోరు. ఎవరికి వారు వాళ్ళు ఒక్కరే వున్నారన్నట్లు వుంటారు . చూసి చూసి నాకు విసుగు వచ్చింది. కాస్త ఎక్కువ సేపు ఆగితే అయినా స్పృహ లోకి వస్తారేమో అని ..”
” ఈ మనుషులు నా వెనకే పరిగెడతారు . నన్ను తరుముతున్నట్లు అనిపించి నేనూ భయ పడి పరిగెడతాను . ” అంది అక్కడ ఆగిన సమయం కాస్త రొప్పుతూ
” ఎందుకు భయం ? నువ్వు కూడా అలా పరి గెట్ట కూడదు. ” అంది ఎర్ర లైట్ , కాస్త కోపం గా .
” అది అలానే చెప్తుంది లే. మేమూ భయ పడతాము . అందరూ తిట్టుకుంటారు అని .” అన్నాయి పసుపు లైట్ ఆకుపచ్చ లైట్ .
” ఊ ! ..” అంటూ నిట్టూర్చింది సమయం .
మళ్ళీ నిరాశగా అంది ” నా నిండా వీళ్ళ ఆందోళనలు . నేను మాత్రం ఏమి కుదురుగా వుండ గలను ? “చూడు నేను ఎలా అయిపోయానో ! ” , దాని మొహమంతా నల్లగా చీకటిఆవరించి వుంది.
****
ట్రాఫిక్ కంట్రోల్ రూం కి వార్త వెళ్ళింది . ట్రాఫిక్ అక్కడ గంట సేపటి నుంచి ఆగిపోయిందని . .. సిగ్నల్ పని చేయటం లేదని. .ట్రాఫిక్ పోలిసులని ఇద్దరిని అక్కడకి పంపిస్తూ ఉత్తరువులు జారీ చేస్తున్నారు. అంతలో అన్నీ కూడలిలనుంచీ , వార్తలు , అన్ని చోట్లా ట్రాఫిక్ సిగ్నల్స్ , పని చేయటం లేదని . ఎర్ర లైట్స్ కదలటం లేదని. పట్టణం అంతా గందర గోళం చోటు చేసుకుంది. అన్ని చోట్లకి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి మనుషులని పంపినా తొందరగా జరిగే పని ఏమి కాదు . ఇంక ఆరోజంతా ఆ ట్రాఫిక్ గందర గోళం తో అన్ని రకాల ఆఫీసులు , సంస్థల లోనూ పనుల కి అంతరాయం జరిగింది .
అధికారులంతా ట్రాఫిక్ లైట్స్ రెపైరు కి పురమాయించారు. .. టెక్నీషియన్ వాటిని పరీక్షించి , ” సమస్య ఏమీ లేదు . చాలా ఏళ్ళ నుంచిపని చేస్తున్నాయి కదా . అప్పుడప్పుడు ఆ విధం గా అవడం సహజమే . అందుకే కొత్తవి తీసుకుంటే ఈ సమస్య రాదు . ” అని చెప్పి వెళ్ళిపోయాడు.
సోషల్ మీడియా రోజులు కదా . ఆగి పోయిన ట్రాఫిక్ గురించిన ఆగకుండా కధనాలు సాగడం తో ముఖ్య మంత్రి వరకూ విషయం వెళ్ళింది. ఆయన , సంబంధిత అధికారులని , ఈ విషయం గురించి రిపోర్ట్ చేయమనడం , వారు ఆయనకి
టెక్నిషియన్ రిపోర్ట్ గురించి అతను ఇచ్చిన సలహ గురించి చెపుతూ ఇపుడు వున్న ట్రాఫిక్ లైట్స్ చాలా ఏళ్ళ నుంచి వున్నాయి కాబట్టి , వాటి స్థానం లో కొత్తవి పెట్టాలంటూ ప్రతి పాదించారు.
” బాగుందయ్యా ! రోడ్డు మరామత్తులకి డబ్బులు లేవు ఖజానాలో . బాగున్న ట్రాఫిక్ లైట్స్ ని తీసేసి కొత్తవి కొనడానికి డబ్బులు ఎక్కడవి ? రెండు రోజులు చూడండి .. అప్పుడు ఆలోచిద్దాం ” అంటూ వారి ప్రతి పాదన ని పక్కకి పెట్టేయడం జరిగింది.
” అంటే ఇంత ట్రాఫిక్ ని కంట్రోల్ చేయ డానికి తగ్గ స్టాఫ్ లేరు సార్ . కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి ..” అంటూ సంబంధిత అధికారులు నానుస్తూ కాస్త నసిగారు .
” ఇప్పుడే చెప్పాను కదా డబ్బులు లేవు అని ” అన్నాడు ముఖ్య మంత్రి .
ఇంక చేసేది ఏమీ లేక వున్న కొద్దిమంది స్టాఫ్ తో ట్రాఫిక్ మేనేజ్ చేయడం మొదలు పెట్టారు. ఎర్ర లైట్ జరుగుతున్నది కళ్ళు ఆర్ప కుండా చూస్తోంది.
కొత్తగా ఏర్పడిన పరిస్థితి కి అనుగుణంగా అన్ని సంస్థలు , ఆఫీసులు వారి వారి పని తీరుని మార్చుకోవడం మొదలు పెట్టాయి. కొత్తగా ఏర్పడిన పరిస్థితి వలన ఉద్యోగులు సమయానికి రాలేకపోయినా , పని పెండింగ్ పడకుండా బాధ్యత వహించాలని ఉత్తరువులు జారీ చేసారు. దానితో ఉద్యోగులు , కాస్త ఊపిరి పీల్చుకున్నారు. విద్యా సంస్థలు కూడా ఈ పరిస్థితి కి తగ్గట్లు, వారి పని చేసే విధానం లో మార్పులు తెచ్చుకున్నాయి .
పనికి హాజరు అయ్యే సమయం లో నూ, ముగించే సమయం లో నూ , కాస్త సడలింపు చేయ డం తో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు . పనులు కూడా యధావిధిగా కొన సాగడం తో , అధికారులు కూడా ఊపిరి
పీల్చుకున్నారు . సమయం వెనక అందరూ పరిగెడుతూంటే అదీ భయ పడి పరుగులు పెట్టేది. ఇప్పుడు అదీ ఊపిరి పీల్చుకుంటోంది.
ట్రాఫిక్ ఆగడంతో , అందరూ అక్కడ ఆగారు . ఆ అవకాశం తీసుకుని , కాలం ఆగి , నిల్చున్న ఎర్ర లైట్ తో అంది, ” నాకు పరుగులు తీయడం ఇష్టం లేదు. నేను నిల్చునే వుంటాను. కానీ నన్నూ పరిగెట్టిస్తారు, ఈ మనుషులు . ఎంత కాల మయింది నేను ఊపిరి పీల్చుకుని ? .. నీ మూలం గా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాను. థేంక్స్ ! ” అంది గౌరవం గా తల వంచుకుని .
ఎర్ర లైట్ నవ్వింది. ” నాకు ఇదే కావల్సింది . ఇది వరకూ ఎప్పుడూ నన్ను నువ్వు పలకరించ లేదు. ఇప్పుడు చూడు ఎంత చక్క గా పలకరిస్తున్నావో ..”
సమయం హాయిగా నవ్వింది ” అవును ! ” అంటూ, మళ్ళీ అంది , ” నేను ఇప్పుడు అందంగా లేనూ? “
” ఆహా! కాస్త తెల్ల బడ్డావ్ . జీవ కళ కనబడుతోంది. ఇదివరకూ భయంతో ఆందోళనలతో నల్లగా వుండే దానివి .. నువ్వే కాదు . ఇప్పుడు అందరి మొహాల్లోనూ కాస్త జీవం చూస్తున్నాను . మొహాల మీద నవ్వు కనిపిస్తోంది. అప్పుడప్పుడు ఒకరిని ఒకరు పలకరించుకుంటున్నారు. అలా, అందరినీ చూస్తూంటే నాకూ సంతోషం గా వుంది. ”
పసుపు లైట్ , ఆకుపచ్చ లైట్ కూడా ఇదివరకూ లాగా ఆందోళన పడడం , భయపడడం మానేసాయి. ధైర్యం గా అవీ నవ్వు మొహం తో , పరిసరాలు చూస్తూ అందరినీ పలకరించడానికి చూస్తున్నాయి. ఎర్ర లైట్ ని వెనక బెంచీ వాడిని చూసి నట్లు చూసేవి. ఇప్పుడు అవీ ఎర్ర లైట్ ని చాలా గౌరవిస్తున్నాయి. ” నీ మూలం గా అందరి మొహాల్లో కి కాస్త నవ్వులు కనిపిస్తున్నాయి .” అంటూ.
ఆ తర్వాత , కొన్నాళ్ళకి ఎర్ర లైట్ పని చేయడం మొదలు పెట్టింది. కానీ ఎక్కువ సేపు నిల్చుంటుంది. పచ్చ లైట్ కూడా ఎటువంటి హడావిడీపడకుండా నిదానంగా నే ఆకుపచ్చ లైట్ కి దారి ఇస్తుంది. ..
ఇప్పుడు , అందరూ కాస్త పరుగులు తగ్గించారు. ఆగి ఆగి , అందరినీ పలకరిస్తున్నారు .ఎవరయినా వెనక పడితే విచారిస్తున్నారు. మంచి చెడులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంట్లో కూడా రిలాక్స్డ్ గా పొద్దున్న కాఫీ తాగుతున్నారు. ఎటువంటి పరుగులూ లేకుండా నెమ్మదిగా వంట చేసుకుని తింటున్నారు. తల్లి తండ్రులు నెమ్మది పడడంతో , పిల్లలని బాగా చూసుకో గలుగుతున్నారు. సడలించిన పని వేళలతో, పొద్దున్నే పిల్లలు, తల్లి తండ్రులు పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా , అంతా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. .
సమయం కాస్త నెమ్మదించింది.
ట్రాఫిక్ అధికారులు ముఖ్య మంత్రికి పరిస్థితి గురించి వివరిస్తూ , “ట్రాఫిక్ లైట్స్ పని చేస్తున్నాయి కానీ , కాస్త ఎర్రేటిక్ గా వున్నాయి ” ,అని చెప్పారు.
” నేను చెప్పనుగా వేచి చూద్దామని. చూడండి! .. ఖర్చు లేకుండా అంతా బాగానే జరుగు తోందిగా ” అన్నాడు నవ్వుతూ .
ఎవరికీ తెలియని సంగతి, ఒకటి వుంది. అదే ఎర్ర లైట్ ఆగిపోయిన రోజు , ఆ విషయం రకరకాలుగా అన్ని చోట్లా చక్కెర్లు కొడుతూ, ముఖ్య మంత్తి చెవిలో కూడా పడింది. ఆరోజు రాత్రి , అదే ఆలోచిస్తున్న , ఆయన కలలో ట్రాఫిక్ ఎర్ర లైట్ కనపడి, అంది , ” ఈ పరుగులకి నాకే అలసట గా వుంది. మరి మీరేమిటి అలా పరుగులు పెడుతున్నారు. ఎవరి మొహం లో నూ జీవ కళ లేదు. ఆగినప్పుడల్లా వాళ్ళని చూడలేకపోతున్నాను. . మిమ్మల్ని మీరు పోగొట్టుకుని ఏమి సాధిస్తారు? కాస్త నిదానించండి. మీకు మీమ్మల్ని గుర్తు చేసుకోండి. నిదానంగా ఊపిరి పీల్చుకోండి .” అది గర గర లాడుతూ మాట్లాడుతూంటే ఉలిక్కిపడి లేచాడు.
ఆ విషయమే ఆలోచిస్తూ పడుక్కున్నాను . అందుకే ఆ విధం గా కల వచ్చి వుంటుంది అనుకున్నాడు.
నెమ్మదిగా మార్పులు చోటు చేసుకున్నాయి . అందరూ కాస్త నిదానం గానే ఊపిరి పీల్చుకుంటున్నారు.
జరుతున్న మార్పుల గురించి ఆలోచిస్తూ , ఆఫీసుకి వెళ్తూ న్న ముఖ్య మంత్రి ఎర్ర లైటు చూసి మనసులో అనుకున్నాడు. ” ఇప్పుడు సంతోషమేగా ?! ” అంటూ. ఆయన మొహం లో ఒక నవ్వు పువ్వులా ఒక వెలుగు వెలిగింది .
” ఎర్ర లైట్ తల ఆడించింది .. ” అవును అంటూ, పచ్చ లైట్ కి దారి ఇస్తూ. తర్వాత ఆకుపచ్చ లైట్ . నెమ్మదిగా ఎటువంటి కంగారూ లేకుండా ముందుకు జరిగింది ట్రాఫిక్ . అందరి మొహాలలోనూ ఇదివరకటి ఆందోళన కన పడటం లేదు. దాని స్థానంలో ఒక చిన్న నవ్వు .
