భూటాన్ యాత్ర అంటే? ఆనంద, ఆరోగ్యాల కలగలిసిన యాత్రే !

Spread the love

‘చెలిమ తవ్వినా కొద్ది నీరు ఊరుతూనే వుంటుంది’ అన్నట్టు యాత్రలు చేస్తున్నా కొద్ది ఇంకా ఇంకా చెయ్యాలన్పిస్తూనే వుంటుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మా భూటాన్ యాత్రే.
గత సంవత్సరం మా కాశ్మీర్ యాత్ర ముగింపుకు వస్తూనే మా బృంద సభ్యుల మధ్య “వచ్చే సంవత్సరం ఎటువెళ్దాం?” అన్న చర్చ వచ్చింది. ఆ చర్చలో భాగంగా “భూటాన్ వెళ్దాం” అన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దాని పర్యావసానంగా జనవరి, 2024 నుండి నేను, మండవ సుబ్బారావు గారు, గోనెల జనార్ధన్ గారు భూటాన్ యాత్రకు సంబంధించి వివరాల సేకరణ ప్రారంభించాము. ముందుగా సథరన్ ట్రావెల్స్ ప్రాంతీయ శాఖాధికారులతోనూ, ఇంతకు ముందు భూటాన్ వెళ్ళి వచ్చిన మా మిత్రుల ద్వారా పరిచయం అయిన భూటాన్ టూర్ ఆపరేట్ సుమిత్రా శర్మ గార్లతో పాటు, మరికొందరితోనూ మాట్లాడే సందర్భంలో కథకురాలు, పర్యాటకురాలు అయిన శ్రీమతి పూదోట శౌరీలు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా వారు ‘మేక్ మై ట్రిప్’ టూర్ ఆపరేటర్స్ వారికి సంబంధించి హైదారాబాద్ శాఖకు చెందిన శ్రీ రుఖేష్ గారి సెల్ నెంబర్ ఇచ్చారు. మేము అతనితో మాట్లాడిన సందర్భంలో “మేం మొత్తం పదహారు మందిమి వున్నాము. మేమంతా సీనియర్ సిటిజన్స్ ము. అంతా రిటైర్డ్ ఉద్యోగులము. కాబట్టి మమ్ముల్ని జాగ్రత్తగా తిప్పి చూపించుకుని రావాలి” అంటూ వివరించాము.
మా గురించి ఆసక్తిగా విన్న రుఖేష్ కొంతసేపు ఆలోచించిన మీదట “ఈ వయసులో కూడా మీరింత మంది ఇంత ఉత్సాహంతో ఓ మంచి టూర్ చెయ్యాలనుకోవడం చూస్తుంటే, మీరంతా ఎలా తిరుగుతారో చూడాలన్న ఉత్సాహం నాలో పుట్టుకొస్తుంది. నేను కూడా ఇంతవరకు భూటాన్ వెళ్ళలేదు. కాబట్టి నేనూ మీతో పాటు వస్తాను. దగ్గరుండి అన్నీ చూపిస్తాను” అంటూ వాగ్దానం చేశాడు.
ఇచ్చిన మాటకు కట్టుబడి అతను సాధ్యమైనంత తక్కువ ఖర్చుతోనే మమ్ముల్ని భూటాన్ మొత్తం తిప్పి చూపించాడు. అందుకతనికి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము.
ఎప్పుడైతే రుఖేష్ మేమో అవగాహన కొచ్చామో ఇక అప్పటి నుండి మేము మా ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించిన ప్రయత్నాలు మొదలు పెట్టాము. 2 ఫిబ్రవరి, 2024 నాడు నేను, జనార్ధన్ గారు, సుబ్బారావు గారు కొత్తగూడెం రైల్వే స్టేషన్ కి వెళ్ళి విజయవాడ నుండి న్యూ జల్పాయిగురి, న్యూ జల్పాయిగురి నుండి విజయవాడకు పోను, రాను త్రీ టైర్ ఏ/సి రిజర్వేషన్ చేయించాము.
12 ఏప్రియల్, 2024 రాత్రి 10.30 గం. విజయవాడలో రైల్ ఎక్కితే 14 ఏప్రియల్, 2024 ఉదయం 4.30 గం.కు న్యూ జల్పాయిగురి స్టేషన్ లో దిగి భూటాన్ యాత్ర పూర్తి చేసుకుని తిరిగి 23 ఏప్రియల్ మధ్యాహ్నం 02.30 గం.లకు తిరుగు ప్రయాణం కోసం న్యూ జల్పాయిగురిలో రైలెక్కి 24 ఏప్రియల్, రాత్రి 08.30 గం.లకు విజయవాడ స్టేషన్ లో దిగేలా మా ప్రయాణ నిర్ధారణ జరిగిపోయింది.
ఇక అప్పటి నుండి ఎప్పుడెప్పుడా అన్నట్టు యాత్రకోసం ఎదురుచూస్తూ ఏర్పాట్లు చేసుకోసాగాం. మధ్యలో అనారోగ్య కారణాలతో మల్సూర్ గారు యాత్ర నుండి విరమించుకోవడం జరిగింది. అట్లాగే రవి కుమారి మేడమ్ గారు, సారంగపాణి గారు కూడా చివరిక్షణం వరకు యాత్రకు వస్తారో? రారో! అన్న డోలాయమాన పరిస్థితి కొనసాగినా, చివరికి వారిరువురు కూడా యాత్రకు రావడం మా అందరికీ ఆనందాన్ని చ్చింది.
డెబ్బై రోజుల ఎదురు చూపుల తరువాత 12-04-0-24 నాడు సాయంత్రం ఐదు గం.లకు కొత్తగూడెం నుండి మమ్ముల్ని ఎక్కించుకు పోడానికి బాడుగ కారు వచ్చి మా ఇంటి ముందు ఆగింది. వెంటనే మేము మా లాగేజీని కారు మీద కెక్కించాము. మా రెండో అమ్మాయి, అర్చన, అల్లుడు క్రాంతి వారి పిల్లలు గగన ధృతి, శ్రీరామ్ లు వీడ్కోలు చెబుతుండగా కారెక్కాము.
ఇరవై నిమిషాల్లో కారు కొత్తగూడెంలోని విధ్యానగర్ కాలనీలో మిత్రులు జనార్ధన్ గారి ఇంటి ముందు ఆగింది. పదినిమిషాల్లో వారి సామాన్ని, వారినీ ఎక్కించుకుని ఆ పక్క సందులోనే గల సుబ్బారావు గారి ఇంటి ముందుకెళ్ళి ఆగాము. అక్కడ ప్రియ దర్శిని డిగ్రీ కళాశాల కరస్పాన్ డెన్స్ శ్రీ చలపతిరావు గారు, వారి గారలపట్టి చిరంజీవి ఆహ్లాదిని ల సహాయంతో పదే పది నిమిషాల్లో వారి సామాను సార్ధడం పూర్తి చేసుకుని, సుబ్బారావు సార్ వాళ్ళను ఎక్కించుకున్నాము. రవి కుమారి మేడమ్ కాలు బ్యాండెజ్ తోనే కారెక్కడాన్ని చూసిన మేము, వారి సాహసానికి ఒకింత ఆశ్చర్యానికి లోనైనప్పటికీ వారిని మనసులోనే అభినందిస్తూ, తనకు ఎటువంటి ఇబ్బందీ కలక్కుండా యాత్ర జరగాలని మేము బలంగా ఆకాంక్షించాము. మరి కాసేపట్లోనే కారు విజయవాడ దిశగా పరుగందుకుంది.
ఇక హైదరాబాద్ నుండి పొద్దున్నే బయలు దేరిన అందెశ్రీ గారు మధ్యాహ్నం రెండున్నరకల్లా విజయవాడలోని వారి మిత్రుని ఇంటికి చేరుకున్నారు. జనగాం నుండి బయలుదేరిన శ్రీ లింగయ్య, రేణుకా దంపతులు రెండున్నరకు గోల్కొండలో ఎక్కగా అదే రైల్లో మహబూబాద్ లో శ్రీ సారంగా పాణి, సునీత దంపతులు, ఖమ్మంలో మరోజంట శ్రీ నాగేశ్వరరావు, సుభద్ర గార్లు ఎక్కారు. ఆ మూడు జంటలూ మాకన్నా ముందే విజయవాడ చేరుకున్నాయి.
ఇక అద్దంకి నుండి శ్రీ పాటిబండ్ల రంగారావు, సౌభాగ్యలక్ష్మి గార్ల దంపతులు కూడా మాకన్నా ముందే విజయవాడ చేరుకున్నారు.
మేము విజయవాడ/గొల్లపూడిలోని ఓ హోటల్లో టిఫిన్ చేసుకుని తొమ్మిది గంటలకల్లా రైల్వే స్టేషన్ చేరుకున్నాము.
మేమంతా స్టేషన్లో కలుసుకుని పలకరింతలు పూర్తి చేసుకుంటుండగానే విజయవాడ వాసి, నా సాహితీ మిత్రులు, శిఖర స్కూల్ కరస్పాండెంట్, కవి అయిన శ్రీ బండ్ల మాధవరావు గారు ఈ రోజు పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడడంతో ఆ హడావిడిలో వుండి కూడా, వారి తెలుగు ఉపాధ్యాల వారిచేత మా యాత్ర విజయవంతం కావాలన్న సందేశంతోపాటు కొన్ని మిఠాయిలను పంపించి స్నేహానికి వారిచ్చే గౌరవాన్ని చాటుకున్నారు. వారి వదాన్యతకు ధన్య వాదాలు తెలియజేసుకున్నాను.
నిర్ధారిత సమయానికన్నా అర్ధగంట ఆలస్యంగా వచ్చి ఆగిన రైలెక్కి కూరుచున్నాము. కొద్ది రోజుల్లో ఒడిస్సా, బెంగాల్, ఆస్సాం, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగబోతూ వుండడంతో, ఆ రాష్ట్రాలకు చెంది, బెంగళూరు, చెన్నై తదితర రాష్ట్రాల్లో వలస కూలీలుగా వెళ్ళిన వందలాది మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం మూకుమ్మడిగా తమ తమ స్వస్థలాలకు బయలు దేరారు. ఆ రద్దీని దృష్టిలో వుంచుకుని భోగీలను పెంచని రైల్వేవారి నిష్క్రియా పరత్వానికి సూచికగా ఆ వలస కార్మికులంతా మా రిజర్వేషన్ భోగీల్లోకి సైతం చొచ్చుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ కూర్చుని వున్నారు. అదంతా మాకు కొంత అసౌకర్యమే అయినప్పటికీ చేసేదేమీలేక మెల మెల్లగా కుంచంలో సజ్జల్లా సర్ధుకు పోయాము. మే మెక్కిన రైలు ఆ రాత్రి కళింగాంధ్రను దాటి, పగలు ఓండ్ర దేశాన్ని అధిగమిస్తూ పరుగులు తీస్తూ తన గమ్యం వైపుగా సాగి పోతూనే వుంది.
మేము వెళ్ళ బోతున్న భూటాన్ దేశ చరిత్రను గురించి విచారిస్తే..
అది హిమాలయ పర్వత శ్రేణుల మధ్య వుండే ఓ చిన్న దేశం. భూటానియులు తమ దేశాన్ని డ్రక్ యు ( ఉరుముల డ్రాగన్ భూమి) అని పిల్చుకుంటారు. అక్కడ 2007 వరకు రాచరిక పాలనా వ్యవస్థ వుండేది. 2008లో ప్రజాసామ్య, రాచరిక పద్దతి అమల్లోకి వచ్చింది. దేశ జనాభా సుమారు ఏనభై లక్షలు. అందులో తొంభై శాతం మంది ప్రజలు వజ్రయాన భౌద్ధ మతస్తులు. పది శాతం మంది ప్రజలు హిందువులు. వారంతా కలిసి మెలిసి జీవిస్తుంటారు. భూటాన్ రాజధాని థింపూ. అధికార భాషలు ఢ్జోంగ్ఖా మరియు ఇంగ్లీష్ . వాళ్ళ కరెన్సీ ని గుల్ట్రమ్ అంటారు. భూటాన్ వైశాల్యం 14,824 చ.మైళ్ళు/ 38, 394 చ.కి.మీ.
భూటానీయులు భారత దేశాన్ని తమ పెద్దన్నగా గౌరవిస్తారు. అందుకు కారణం మన ప్రథమ భారత ప్రధాని నెహ్రూ గారు 1957లో ఆ దేశంలో పర్యటించినప్పుడు ఆ దేశంలో గల అతి పెద్ద జాతీయ రహదారి నిర్మాణానికీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించడంతో పాటు, ఆ రోడ్డుకి శంకుస్థాపన కూడా చేశారు. అంతేకాదు వాణిజ్య, శాస్త్ర సాంకేతిక, సైనిక రంగాలలో సైతం సహాయ సహకారాలను అందిస్తామని మాట ఇచ్చి అందుకు తగినట్టుగా అనేక చర్యలు చేపట్టారు.
అనుకున్న ప్రకారం మా రైల్ 14 ఏప్రియల్, 2024 ఉదయం నాలుగున్నర గంటలకు న్యూ జల్పాయిగురి స్టేషన్ లో మమ్ముల్ని దించేసి తన గమ్యం దిశగా సాగిపోయింది.
హైదారాబాద్ నుండి విమానంలో మాకన్నా ఒకరోజు ముందుగానే భూటాన్ కి చేరుకున్న రుఖేష్ మా కోసం ఏర్పాటు చేసిన వాహనమొచ్చి స్టేషన్ బయట తయారుగా వుండడంతో మేమంతా మా సామాన్లు మోసుకుంటూ మెల్లగా దాని దగ్గరికి చేరుకున్నాము. అక్కడ డ్రైవర్ సంతోష్ మాకోసం ఎదురుచూస్తున్నాడు.
– 2 –
అర్ధ గంటలో మా బ్యాగేజీ అంతా బస్ మీదికి ఎక్కించిన తరువాత మేమంతా మెల్లగా ఎక్కి సీట్లల్లో సర్ధుకుని కూర్చున్నాము.
వాహనం మెల్లగా ‘సిలిగురి’ మీదుగా మనదేశ సరిహద్దు గ్రామమైన ‘జై గాం’ దిశగా పరుగందుకుంది. రోడ్డుకు రెండు దిక్కులా పెద్ద పెద్ద వృక్షాలు మంద్రంగా కొమ్మల్ని కదిలిస్తూ మమ్ముల్ని ఆహ్వానిస్తున్నట్టుగా కన్పించసాగాయి. హరితవనాలతో సుందరమైన ఆ ప్రాంతాన్ని చూస్తున్న నా మనసు ఎన్నో ఏండ్లుగా కలలుగంటున్న ఈ భూటాన్ యాత్ర ఈ నాటికీ నెరవేరబోతుందన్న ఆనందంతో దూది పింజ మాదిరిగా గాలిలో తేలిపోసాగింది.
కంటికి విశ్రాంతినిచ్చే పచ్చటి ‘టీ’ ప్లాంటేషన్స్, ఆ ప్లాంటేషన్స్ ని మధ్య మధ్య విడదీస్తూ వున్న సన సన్నని కాలి బాటలు. మధ్య మధ్యలో మనమెరుగని పెద్ద పెద్ద వృక్షాలు. స్వచ్చమైన ‘టీ’ సువాసను మించి ఆ ప్లాంటేషన్స్ హరితవర్ణం కళ్ళకు విశ్రాంతిని ప్రసాదిస్తుంటే, ఆ విశ్రాంతి మెదడుకు చేరి హాయిగా కళ్ళు మూతలు పడసాగాయి. ఆ ద్వైదీ భావోన్మత్తతలో మేమెప్పుడు ‘సిలిగురి’ దాటామో గూడా తెలుసుకోలేక పోయాము.
ఇంతలో మా వాహనం తీస్తా, జల్ ధకా నదులు మీది వంతెనల మీదుగా పోతున్నప్పుడు ఆ కుదుపులకు ఉలిక్కిపడి లేచి చూస్తే ఆ నాదీమా తల్లుల సోయగాలు కళ్ళు తిప్పుకోనివ్వని స్థాయిలోవున్నాయి. గాలి వురవడికి నాదీ జలాల్లో ఏర్పడిన తరంగాలు మీటుతున్న తంత్రీనాదాల మృదుధ్వని మమ్ముల్ని మరో ప్రపంచంలోకి తీసుకుపోసాగాయి.
మధ్యలో ఓ పెద్ద డాబా హోటల్ దగ్గర ఆగిన మేమంతా లఘు శంకలు తీర్చుకుని, వేడి వేడి తేనీరు సేవించి వెంటనే బస్సెక్కాము. ఆ హోటల్లో ఓ జువ్వి జాతి చెట్టు చాలా విచిత్రంగా కొమ్మలు చెక్కి వుండి చూపరులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది.
ఎనిమిదిన్నర కల్లా మా బస్సు వెళ్ళి జైగాంలో ఆగింది. అక్కడ రుఖేష్ మాకోసం ఎదురుచూస్తున్నాడు.
మేమంతా బస్సు దిగి చుట్టుపక్కల పరికించి చూస్తే.. అది పశ్చిమ బెంగాల్ కి చెందిన ఓ మాదిరి వాణిజ్య ప్రధాన మైన పట్టణంగా అన్పించింది. వీధి వీధంతా చెత్తా-చెదారంతో, గుంపులు గుంపులుగా వున్న మనుషులతో, వీధి పశువుల స్పీడ్ బ్రేకర్లతో, చాయ్ వాలాల, చిరువ్యాపారుల కేకలతో నిజంగానే అది మదేశానికి చెందిన ఆఖరి చెత్తకుండీలా అన్పించి ఒళ్ళు జలదరించింది.
ఇంతలో రుఖేష్ మా దగ్గరికొచ్చి “మీరంతా మీ మీ ఓటర్, ఆధార్ కార్డులను తీసుకుని నా వెనుకే రండీ!” అంటూ దారి తీశాడు. మేమంతా మెల్లగా అతన్ని అనుసరించాము. మన దేశాన్ని, భూటాన్ దేశాన్నీ విడదీస్తూ మాకు ఎదురుగా సుమారు ఏడెనిమిది అడుగుల ఎత్తైన గోడ దర్శనమిచ్చింది. ఆ గోడ పక్కగా ఏడమ దిశకు తిరిగి సుమారు వంద మీటర్లు నడవగానే భూటాన్ లోకి వెళ్ళే గేట్, దాని ముందు సెక్యూరిటీ సిబ్బంది కనిపించారు.
వాళ్ళను చూడగానే నా మనసులో “నేను మరోసారి ఓ విదేశీ గడ్డ మీద కాలు మోపబోతున్నాను” అన్న ఆలోచన సూడులు తిరుగుతూ నన్ను కొద్దిగా ఉద్విగ్నతకు గురిచేసింది.
ఆ ప్రధాన ద్వారంలో మా ఆధార్ కార్డులను మాత్రమే పరిశీలించి అందులో వున్న ఫోటోతో మమ్ముల్ని సరిపోల్చుకుని లోపలికి వదిలిపెడుతున్నారు. మొట్ట మొదటి తనిఖీని అధిగమించిన మేమంతా మా చేతుల్లో వున్న బ్యాగుల్ని మెటల్ చెక్ కన్వేయర్ గుండా పంపించి, ఆ చెకింగ్ ను కూడా ముగించుకుని మరికాస్త ముందుకు వెళ్ళాము. అక్కడ ఓ పెద్ద హాల్లో ఏడెనిమిది టేబుల్స్ ముందు ఇద్దరిద్దరు యువ ఉద్యోగినీ, ఉద్యోగులు కూర్చుని వున్నారు. మేమంతా క్యూల్లో నిల్చుని వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు మా ఓటర్ ఐ.డి.లను చూపించమని అడిగారు.
ఇక్కడో చిన్న గమ్మత్తు జరిగింది. మా పదిహేను మందిలో పన్నెండు మంది పాత ఓటర్ కార్డులనే తెచ్చుకున్నారు. వాటినే చూపించారు. వాటిని పరికించి చూసిన సిబ్బంది వాటిని అంగీకరించి వాళ్ళను లోపోలికి అనుమతించారు. ఇటీవల జరిగిన మన రాష్ట్ర శాసనసభా ఎన్నికలప్పుడు మనకిచ్చిన ఓటర్ ఐ.డీ స్లిప్పుల్లో సవరించిన నెంబర్లను పొందుపరిచారు. ఓట్ల సందర్భంలో వాటిని అనుమతించిన అధికారులు “మీరు వెంటనే ఆన్ లైన్లో వాటిని సరిదిద్దుకొండి!” అన్నారు. కొత్త గవర్నమెంట్ రాగానే ఆధార్ కార్డులను, ఓటర్ కార్డులను సవరించుకోడానికి పెద్ద ఎత్తున ప్రాపగాండా చేసింది. దాంతో ప్రజలంతా తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్ళి ఆధార్ కార్డ్ సెంటర్ల ముందు క్యూలు కట్టి రోజుల తరబడి నిల్చుని మార్పించున్నారు. అలాంటి పిచ్చోల్ల గుంపులో నేనూ ఒకణ్ణి. మేము సర్కార్ వారు చెప్పినట్టు అన్నీ సవరణలు బరాబర్ చేయించుకున్నాముగదా! మనం హాయిగా లోపలికి వెళ్లిపోతాంలేమ్మని మా దంపతులిద్దరం అనుకున్నాం. ఓ పావుగంట తరువాత సిబ్బందికి మా ఓటర్ కార్డులు అందించాము. వాటిని పరిశీలించిన సిబ్బంది ఈ కార్డ్స్ చెల్లవు. మీకు ఇరవై నాలుగ్గంటల సమయం ఇస్తాం. వెళ్ళి సరిచేయించుకుని రండీ! అప్పటి దాకా మీ ఆధార్ కార్ఢ్ నెంబర్ నోట్ చేసుకుంటాము. ఆ కార్డ్ ఇవ్వండీ! అంటూ తీసుకుని నోట్ చేసుకుని మమ్ములను లోపలికి వదిలిపెట్టారు.
“నా ఊరెక్కడా? నేనెక్కడా? ఇరవైనాలుగు గంటల్లో నేను మరో కార్డ్ తెచ్చుకునేదెలా?” అన్న అయోమయంలో నేను కొట్టు మిట్టాడుతుండగా నా దగ్గరికి వచ్చిన రుఖేష్ “మీరేం కాంగారు పడకండి సార్! నిన్న నా కార్డ్ కూడా చెల్లదంటే నేను బైటికెళ్ళి ‘జైగాం’ లో మార్పించుకున్నాను” అంటూ కృష్ణ పరమాత్ముడి మాదిరిగా అభయ హస్తమందించాడు. అప్పటికి నా మనసు తాత్కాలికంగా ఊరట చెందింది.
తనిఖీ కేంద్రం నుండి బయట పడిన మేమంతా అక్కడికి పదినిమిషాల నడక దూరంలో వున్న పార్క్ హోటల్ కి చేరుకున్నాము. అప్పటికే అక్కడికి మా లాగేజీ వచ్చేసి వుంది! అదెలా? అన్న నా మీమాంసకు సమాధానంగా ఇందాక మేము హోటల్ కి నడిచి వస్తూ వస్తూ చూసిన ఇండియా గేట్ మార్గం గుండా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, లోపలికి వదులుతారట. అట్లా మా వాహనం కూడా తనిఖీ పూర్తి చేసుకుని వచ్చి మా బ్యాగేజిని రిసెప్షన్ హాల్లో ఓ మూలకు దించి ఎటో వెళ్ళిపోయింది. రిసెప్షనిస్ట్ పేరు సోనమ్. చిన్న పిల్ల. అందరితోనూ సాదరంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న హిందీ పదాలను వల్లెవేస్తుంటుంది.
మేమంతా కీస్ తీసుకుని రూముల్లోకి వెళ్లిపోయాము. ఓ గంటలో అందరం స్నానించి కిందికి దిగాము. అప్పటికి పదిన్నర కావస్తుంది. మావాళ్ళంతా “వెంటనే టిఫిన్ చేయకపోతే కష్టం” అంటూ ఏకవాఖ్య తీర్మానం చేయడంతో గ్రౌండ్ ప్లోర్లో వున్న హోటల్లోకి వెళ్ళాము. అక్కడ మాకు తెలిసిన అనధికార సమాచారం ప్రకారం ఆ హోటల్లో అధిక ధరలుంటాయని. దాంతో మేమంతా కిందికి వచ్చాము. విషయం తెలుసుకున్న సోనమ్ ఓ మనిషినిచ్చి అక్కడికి దగ్గర్లో వున్న హోటల్ అశోకా కి పంపించింది. అక్కడ కూడా టిఫిన్ అంతంత మాత్రంగానే వుండడంలో ఏదో మమా అనిపించాము.
టిఫిన్ కాగానే అందరితోపాటు నా శ్రీమతిని హోటల్ కి పంపించి రుఖేష్ తో పాటు సెక్యూరిటీవాళ్ళ అనుమతితో మళ్ళీ ‘జైగాం’ వెళ్ళాను. అక్కడ మాలాంటి బకరాలకోసమే ఎదురుచూస్తూ చాలామంది కంప్యూటర్లు పెట్టుకుని కూర్చున్నారు. నిన్న తన ఓటర్ కార్డ్ మార్పించిన షాప్ కే నన్నూ తీసికెళ్లి పరిచయం చేశాడు రుఖేష్. మా ఓటర్ ఐ.డి.లను పరిశీలించిన కంప్యూటర్ ఆపరేటర్ ఇప్పుడు మీ దగ్గర మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వుందా?” అంటూ అడిగాడు. లేదు, సెల్లో ఫోటో తీసుకోండి!” అన్నాను . దాంతో అతను వెంటనే నా ఫోటో తీసుకున్నాడు. ఆ వెంటనే “మరి మీ మేడమ్ ఫోటో ఎలా?” అంటూ తేలుకొండిలా నా మీద ప్రశ్నను సంధించాడు. ఆక్షణంలో “నా ఫోటోనే నా దగ్గర లేనప్పుడు ఆవిడ ఫోటో ఎలావుంటుందన్న జ్ఞానం గూడా లేదు వెధవికి” అనుకున్న నేను వెంటనే లింగయ్యకు ఫోన్ చేసి విషయం తెలియజేశాను. లింగయ్య వాళ్ళది కూడా మాలాంటి సమస్యే. అదృష్టవశాత్తు మా ఆవిడ హ్యాండ్ బ్యాగ్ లో దొరికిన తన ఫొటోని లింగయ్యకి అందజేసింది. వాళ్ళావిడ ఫొటో కూడా తీసుకుని మా దగ్గరికి వచ్చాడు.
రెండు గంటల పాటు అక్కడ పాడిగాపులు పడి డూప్లికేట్ ఓటర్ ఐ.డి.లు తయారు చేయించుకుని, మనిషికి నాలుగు వందల చొప్పున సమర్పించుకుని తిరిగి లోపలికి వెళ్ళాము.
అప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు కావస్తుంది. మేము వెళ్ళేసరికి సుబ్బారావు గారు వాళ్ళు ఏదో హోటల్ కి వెళ్ళారని తెలిసింది. దాంతో మేము, నాగేశ్వరరావు, లింగయ్య గార్ల దంపతులు. అందెశ్రీ, రుఖేష్ గార్లు అందరం కలిసి హోటల్ ‘కుయెంగ’ కి వెళ్ళాం. అక్కడ మేము భూటాన్ స్పెషల్ ‘రెడ్ రైస్’ భోజనం చేశాము.
అప్పటికి మూడు దాటిపోయింది. మరొకసారి సెక్యూరిటీకి వెళ్ళి, వాళ్ళ దగ్గర తయారైన మా లిస్ట్ తీసుకున్న రుఖేష్ గైడ్ కోసం ఎదురుచూడసాగాడు. అప్పటికి నాలుగు దాటింది.చీకటి పడడానికి ఇంకా రెండు గంటల సమయముంది. కాబట్టి ఎటన్నా పొయొద్దామన్న ఉద్దేశంతో రెండు వాహనాలను మాట్లాడాము.
మొదటిగా హరిపట్టి బౌద్దారామానికి వెళ్ళాము. ఆరామంతో పాటు కొండకింద వున్న దొర్సా నదీ తీరంలో వెలసిన అందమైన ఓ పెద్ద నగరాన్ని కూడా సందర్శించాము.
అక్కణ్ణుండి బయలుదేరి పన్నెండు కి,మీ.దూరంలో వున్న ‘అమంచు’ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. అదో అందమైన దర్శ నీయ స్థలం. ఆరున్నరకల్లా తిరిగి హోటల్ కి చేరుకున్నాము.

– 3 –

భూటాన్ ప్రజల్లో మనకు పౌర (సమాజ) స్పృహ బాగా కన్పిస్తుంది. అక్కడి ప్రజల్లో ఎనభై శాతం మంది హిందీ ఇంగ్లీష్ భాషను మాట్లాడ్డమో, అర్ధం చేసుకోవడమో చేయగలరు. వారి జాతీయ భాష పేరు ‘జోంకా’. గ్రామీణ ప్రాంతాలకు వెళితే ఏమైనా లిపి రహిత స్థానిక భాషలు వుంటాయేమో తెలియదు.
ప్రపంచంలో కార్బన్ రహిత దేశాల్లో భూటాన్ ప్రథమస్థానంలో వుంది. భారత్ భూటాన్ ల మధ్య నున్న సరిహద్దు గోడను దాటి భూటాన్ లోకి వెళితే మనసుతో ఆలోచించేవారికి అనేక విషయాల్లో తేడాలు తెలిసొచ్చాయి. రోడ్ల మీద ఎక్కడా ఒక్క చిత్తుకాగితం కూడా కనిపించదు. రోడ్ల మీద ఎక్కడా ఉమ్మినట్టు కన్పించరు. అక్కడ పొగాకు వినియోగం నిషేధించబడింది. రహదారుల పొడవునా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉచిత మూత్రశాలలనే వినియోగించుకుంటారు. బహిరంగ మూత్ర విసర్జన చేసిన వారికి వంద రూపాయలు జరిమానా విధిస్తారు. రోడ్లన్ని పరిశుభ్రంగా వుంటాయి. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఎక్కడో తప్ప కనిపించదు. పోలీస్ విజిల్స్ వేయకుండా చేతి సైగలతోనే ట్రాఫిక్ ను నియంత్రిస్తుంటారు. ట్రాఫిక్ ఎంతున్నా ఎవ్వరూ హారన్ కొట్టడం వినిపించదు. పాదచారులు జీబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రమే రోడ్డు దాటుతారు. వారిని చూస్తూనే వాహనాలు అటు ఠక్కున నిలిచిపోతాయి.
భూటాన్ ప్రభుత్వం దేశవాసులందరికీ విధ్య, వైధ్యం ఉచితంగా అందజేస్తుంది. 2008లో దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటికీ ప్రధాన నిర్ణయాలన్నీ రాజు అనుమతితోనే తీసుకోబడతాయి. ప్రజలంతా ఆయన్నే అభిమానిస్తుంటారు. దేశంలో కులవ్యవస్థ లేదు. మన దేశంలో మాదిరి అక్కడ సాంప్రదాయ వివాహలుండవు. అక్కడ జరిగే వివాహాలన్నీ ప్రేమ వివాహాలే. ఆ పెళ్ళిళ్లు గూడా కేవలం ఐదు వేల రూపాయల ఖర్చుతో పూలదండలు మార్చుకోవడంతో ఆయిపోతుందట. కానీ, చావు తంతుకు మాత్రం బాగా ఖర్చు చేస్తారట. దేశంలో పురుష జనాభాకన్నా స్త్రీ జనాభా అధికం. దాని కారణంగా అవాంఛనీయమైన బహుభార్యత్వం కొనసాగురుంది. దేశంలో పొగాకు వాడకం పూర్తిగా నిషిద్ధం కావడంతో తాంబూల సేవనంలో కేవలం కాసు, సున్నం, పచ్చొక్కలను మాత్రమే ఉపయోగిస్తారు. కొద్దిపాటి వ్యవసాయం నుండి మొదలుపెట్టి అన్ని రకాల వర్తక వ్యాపారాల్లో స్త్రీల పాత్ర ప్రస్పుటంగా కన్పిస్తుంటుంది.
దేశంలో ప్రధాన ఆదాయ వనరులు రెండు. ఒకటి జలవిద్యుత్. రెండు టూరిజం. దేశ అవసరాలకు పోను మిగులు విద్యుత్ ను మనదేశంలోని పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఆలుగడ్డలు, రెడ్ రైస్. మొక్కజొన్న వంటివి కూడా కొద్ది మోతాదులో పండిస్తారు.
యాత్రీకులను ఎంతో మర్యాదగా చూసుకుంటారు. బస్సు హోటల్ ముందికెళ్ళి ఆగడంతోనే సిబ్బంది మొత్తం బయటకొచ్చి చిరునవ్వుతో స్వాగతిస్తుంటారు. హోటల్స్ లో లాగేజ్ బాయ్స్ కన్నా గాళ్సే ఎక్కువగా కన్పిస్తుంటారు. కస్టమర్స్ అడిగిన సేవలకు తక్షణమే స్పందిస్తుంటారు.
మద్యం ధరలు మన దేశంతో పోలిస్తే చాలా తక్కువగా వుంటాయి. మన దేశంలో 2,500/- వుండే ఓ బాటిల్ అక్కడ 1100 మాత్రమే వుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పాన ప్రియులకు భూటాన్ ఓ మధుశాలలాంటిది. బీరు ధర కేవలం అరవై రూపాయలు మాత్రమే. హోటాల్ రూమ్స్ లో చిన్న చిన్న కప్ బొర్డ్స్ లో రకరకాల టిన్నుడ్ బాటిల్స్ వుంటాయి. అవసరం వున్నవారు నచ్చిన బ్రాండ్ వాడుకుని బిల్ పే చేయవచ్చు. హోటేల్స్ లో మనం ‘టీ’ ఆర్డర్ చేసి తీరిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తాగినట్టు అక్కడ మద్యం తాగుతూ కన్పిస్తుంటారు. స్థానికంగా చాలా బాట్లింగ్ కంపెనీలుండడంతో చిన్న చిన్న పాన్ షాపుల్లో కూడా మందు బాటిల్స్ కూల్ డ్రింక్స్ మాదిరిగా అమ్ముతుంటారు. గమ్మత్తెమిటంటే రోడ్ల మీద తాగి తూలుతూ పడిపోయిన వారు కనిపించరు.
15 ఏప్రియల్,2024 ఉదయం నిద్రలేచిన మేము వెంటనే తయారై కిందికి దిగాము. మాతోపాటే మా బ్యాగెజీ వచ్చేసింది. మేము ఫలహారం చేయడానికి హోటల్ ‘కొయంగా’ కి వెళ్ళాము. ఫలహారం చేసి తిరిగి వస్తుంటే కొంతమంది ఉద్యోగులు డివైడర్స్ మధ్యలో వున్న క్రోటాన్స్ ను ట్రిమ్మిగ్ చేస్తూ, కలుపు మొక్కలను పీకేస్తున్నారు. చెత్తను మనదగ్గరిలాగా ఎక్కడి దక్కడ వదిలేయకుండా తమ వెంట తెచ్చుకున్న ఖాళీ సంచుల్లో నింపుకుంటున్నారు.
అదంతా గమనించిన నేను నేరుగా వారి దగ్గరికి వెళ్ళి పలుకరించాను. వాళ్ళల్లో ‘పార్వతీ రాయ్’ అనే యువతి ఎంతో హుషారుగా నేను అడిగిన ప్రతి ప్రశ్నకు టక టకా సమాధానాలు ఇచ్చింది. పునొస్తోలింగ్ పట్టణ మున్సిపాల్ కార్యాలయంలో పారిశుధ్య, ఉద్యాన, విద్యుత్, వాటర్ మొదలైన విభాగాలన్నింటిలో కలిపి సుమారు ఐదు వందల మంది ప్రత్యక్ష, పరోక్ష పద్దతిలో పనిచేసే ఉద్యోగులున్నారట. అందులో అధిక శాతం పరోక్ష ఉద్యోగులేనట. పార్వతి రాయ్ బృందమంతా పరోక్ష పద్దతి ఉద్యోగులేనట. వారికి నెల జీతం, పన్నెడున్నర వేలట. పి.యఫ్.కట్టింగ్ లాంటివేమీవుండవట. వారాంతపు శలవులు మాత్రం వుంటాయి.ఏదైనా అనారోగ్యం వస్తే ఉచిత వైద్య సదుపాయం వుంటుంది. మొత్తం మీద వున్నంతలో సంతోషంగానే జీవిస్తుంటామని చెప్పారు. ప్రాంతాలు, దేశాలు ఏవైనా శ్రమజీవుల జీవితాలన్నీ ఒకే తీరున వుంటాయన్న కఠోర నిజం కన్నుల ముందు కన్పిస్తుంటే ప్రాణం ఉస్సూరుమంది. పార్వతీ రాయ్ బృందం దగ్గర శలవు తీసుకుని ఆ పక్కనే వున్న టూరిస్ట్ పాసులు ఇచ్చే ఆఫీస్ కి చేరుకున్నాము. అక్కడ చామంది టూరిస్ట్ లున్నారు. మా టూర్ ఆపరేటర్ రుఖేష్ ‘జైగాం’ లో పేరున్న టూర్ ఆపరేటర్ బి.కె.ప్రసాద్ గారితో లైజన్ పెట్టుకున్నాడు. కాబట్టి మమ్ముల్నా దేశంలో తిప్పే వాహనాన్ని, డ్రైవర్ని , గైడ్ ని, కావాల్సిన పర్మిషన్స్ ని తానే చూసుకుంటాడు. కాబట్టి బి.కె. గారు మాకంటే ముందే ఆ ఆఫీస్ కొచ్చారు. ఆయన రావడం వల్ల మా పర్మిట్ల కార్యక్రమం కాస్త వేగవంతంగా జరిగింది. టూరిస్ట్ పాస్ లు రాగానే ప్రతి టూర్ ఆపరేటర్ బౌద్ధ ధర్మంలో శుభ సూచకమైన తెల్లని వస్త్రాలను యాత్రీకుల మెడల్లో అలంకరిస్తారు. యాత్ర నిరపాయకరంగాను, దిగ్విజయంగానూ జరగాలని కోరుకుంటారు. బి.కె.గారు కూడా మా బృంద సభ్యులందరినీ ఓచోట నిల్చోబెట్టి శుభసూచిక చిత్రాలను ముద్రించిన ధవళ వస్త్రాలను మా అందరికీ కప్పి కాగితాలను రుఖేష్ చేతికందించారు.
ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగి హోటల్ రిసెప్షన్ హాల్ కి చేరుకున్న మేమంతా బస్సుకోసం ఎదురుచూస్తూ కూర్చుని మాట్లాడుకోసాగాము. అదే హోటల్లో దిగిన మంచిర్యాల వాసి, భూటాన్ లో మన ప్రభుత్వసంస్థ ఉద్యోగి అయిన ఒక వ్యక్తి మా మాటలు విని “మన తెలుగువాళ్ళు వచ్చినట్టున్నారు. వారిలో ఓ గొంతు అందెశ్రీ గారి గొంతులా విన్పిస్తుంది” అనుకుంటూ మెల్లగా మాదగ్గరికి వచ్చాడు. అక్కడ నిజంగానే అందెశ్రీ గారు కనిపించడంతో ఆయన సంతోషం అవధులు దాటిందని చెప్పవచ్చు. మాతోపాటు తనూ గ్రూప్ ఫోటో దిగారు. తనకు మాకూ కూడా అదో మంచి అనుభవం.
ఇంతలో బస్ వచ్చింది. గైడ్ పేరు ‘ఫెమా’. డ్రైవర్ పేరు దోరో. లగేజ్ ఎక్కించుకుని ‘పారో’ దిశగా ప్రయాణాన్ని ఆరంభించాము. మధ్యలో ఓ చోట కడుపు బరువు దించుకోడానికి వాహనాన్ని అపారు. అక్కడ ద్రాక్ష, ఆరటి, యాపిల్స్ వున్నాయి. కానీ ధరలు మాత్రం చుక్కల్లో వున్నాయి. దాంతో ఎవ్వరూ కొనడానికి సాహసించలేదు. రుఖేష్ మాత్రం యాభై రూపాయల చొప్పున ప్రతి జంటకీ ఓ కాల్చిన మొక్కజొన్న కంకి తీసుకున్నాడు. అక్కడ కారం రాసిన కీరా దోసముక్కల్ని ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి అమ్ముతున్నారు. కీరా అంటే సహజంగా అందరం ఇష్టపడుతుంటాము. దానికితోడు ముక్కలకి కారం కూడా పట్టించడంతో వాటిపట్ల మోజుపడిన మిత్రుడు జనార్ధన్ గారు ఒక సంచి కొన్నారు. అందులో ఎన్ని ముక్కలున్నాయో? వాటిల్లో వారు ఎన్ని ముక్కలు తిన్నారోగాని!? ఆ సాయంత్రంకల్లా వారి కడుపులో చల్లకవ్వం తిప్పులాట, ఉరుముల, మెరుపుల గందరగోళం మొదలయ్యింది.
మరోగంట ప్రయాణం తరువాత ఓ చోట రోడ్డు మధ్యలో నిర్మించిన ఎనిమిది స్థూపాలు ఎదురయ్యాయి. అక్కడ మా వాహనం ఆగింది. అక్కడికి కి.మీ.దూరంలో ఓ సాంకేతిక కళాశాల వుంది. ఆ కళాశాల నిర్మించే సమయంలో ఒక పెను ప్రమాదం జరిగిందట. ఆ ప్రమాదంలో ఇంజనీర్లు, ఉద్యోగులూ కలిపి మొత్తం ఎనిమిది మంది మరణించారట. వారి స్ర్ముత్యర్ధం ప్రభుత్వంవారు ఆ దారిని వెళ్ళే ప్రజలంతా విధి నిర్వాహణలో అమరులైన ఆ వ్యక్తులను స్మరించుకోవాలాన్న తలంపుతో వాటిని నిర్మించారట. వాటిని దర్శించుకుని తిరిగి బస్సెక్కాము.
మరో గంట ప్రయాణం తరువాత రోడ్డు పక్కనే వున్న ‘డివైన్ మిడ్ వే’ అనే హోటల్ ల్లో భోజనం కోసం ఆగాము. భోజనం బాగానే వుంది. కానీ, ఆక్కడ నాకు జరిగిన ఓ అనుభవం మాత్రం బావోలేదు. మా ఊళ్ళో మా డాక్టర్ రమేష్ గారి దగ్గరికొచ్చే వారి మిత్రుల్లో చాలామంది మాకూ స్నేహపాత్రులే, వారితో కలిసి స్థానికంగా వుండే దర్శనీయ స్థలాలను చూస్తుంటాము. అట్లా చాలా సార్లు మా దగ్గర కలిసి తిరిగిన ఓ వ్యకి నేను భోజనం చేస్తుండగా నా పక్క నుండే లోపలికి వెళుతూ కనిపించాడు. నేను వెంటనే తనను గుర్తుపట్టి ఆపుకోలేని ఆనందంతో “సార్! బావున్నారా? మేడమ్ కూడా వచ్చారా?” అంటూ అడిగేశాను. ఆయన నింపాదిగా నాదిక్కు చూస్తూ నేనొక్కన్నే మా ప్రెండ్స్ తో వచ్చాను. ఔనూ ఇంతకూ మీరెవరు? మీదేవురు? అంటూ ఆగ్నేయాస్త్రం లాంటి ప్రశ్నలను నా మీదకు సంధించారు. వారి మాటలను విన్న నా మిత్రులు ఆశ్చర్యంగా నా వంక చూడసాగారు. నేనంతటితో ఆగినా బావుండేది. కొత్తగూడెం, డా.రమేష్ బాబు గారు, నా పేరు అంటూ బిత్తిరి సత్తిగాడి మాదిరిగా సమాధానాలు ఇస్తుండగానే ఆ పెద్దమనిషి తన మిత్రుల దగ్గరికి దూసుకుపోయారు.
నాలో మొదటి నుండీ “‘నాతో ఒకసారి పరిచయమైన వ్యక్తి ఎవరైనా సరే జీవితంలో నన్ను మరిచిపోరన్న ఒక అహంభావం వుంటూ వస్తుంది. ఈ సంఘటన తరువాత నాలోని ఆ అహంభావం పటాపంచలైపోయింది. అందుకు ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నా తనకు ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను.
దారిలో చుకా జిల్లాలో వాంగ్ఛూ నది మీద ఏర్పాటు చేసిన ‘తల’ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ 1997లో నిర్మాణ పనులు మొదలు పెట్టి పదెండ్లపాటు నిర్మాణ కార్యకలాపాలు సాగిన మీదట 2007లో రోజుకి 1020 మెగా వాట్ల విద్యుదుత్పత్తి శక్తితో పని ప్రారంభించబడింది. డ్యాము ఎత్తు = 302, పొడవు = 422 అడుగులు. ఎక్కడో లోయలో వున్న అంత గొప్ప ప్రాజెక్ట్ ను దూరంనుండైనా చూడడం ఓ గొప్ప అనుభూతి నిస్తుంది.
అక్కణ్ణుండి మరికొంత దూరం ముందు కెళ్ళగానే చుకా బైపాస్ లో రోడ్డు పక్కనే ఎదురౌతుందో అద్భుతమైన, అందమైన జలపాతం. సుమారు వంద అడుగుల ఎత్తు నుండి బుసలు కొట్టే కోడెనాగులా కిందకు దుముకుతూ ఆ దారిని వెళ్ళే ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. అక్కడ ఎంతసేపున్నాతనివి తీరదు. కానీ కదలక తప్పదు కదా?
రాత్రి ఏడు గంటలకు హోటల్ ‘గక్యిడియాన’ లో దిగాము. మమ్ములను హోటల్ ల్లో దించిన తరువాత డ్రైవర్, గైడ్ ఇద్దరిదీ ఆదే వూరు కావడంతో వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోయారు.
మేము దిగిన హోటల్ ల్లో భోజనం రేట్ ఎక్కువగావుందని చెప్పి అక్కడికి అరఫర్లాంగ్ దూరంలో వున్న హోటల్లో మన భోజనానికి ఆర్డర్ చేశాడు. ఆ ఊళ్ళో చలి చాలా విపరీతంగా వుంది. లింగయ్య వాళ్ళు స్వెటర్స్ తెచ్చుకొక పోవడంతో బజార్ ఆ రాత్రి బజార్ కి వెళ్ళి వాళ్ళిద్దరికీ కొనుక్కోచ్చాము.
మా హోటల్నుండ కాలినడకన భోజనం చేయడానికి హోటల్ దాల్మియా కి వెళ్లొచ్చి రూమ్ హీటర్స్ ఆన్ చేసుకుని పడుకున్నాము.

– 4 –

16 ఏప్రియల్, 2024 ఉదయం తొమ్మిది గంటలకు మేము దిగిన హోటల్ ‘గక్యిడియాన’లోనే ఫలహారాలు చేశాము. ఇక డ్రైవర్ రావాడమే ఆలస్యం బస్సెక్కడమే తరువాయి. రాత్రి తెల్లవార్లూ జనార్ధన్ గారికి విరేచనాల్తోపాటు కాస్త జ్వరం కూడా తగిలింది. కాబట్టి తను “నేను హోటల్ రూంలోనే వుంటాను. మీరంతా వెళ్ళిరండి!” అంటూ తన అశక్తతను తేల్చి చెప్పారు. ఇంక దాంతో వారిని హోటల్లోనే వదిలేసి, మిగతా వాళ్ళమంతా తొమ్మిది గంటల కల్లా బస్సెక్కము. ముప్పావు గంటలో బస్సెళ్లి ఆరోజు మేము చూడబోయే టైగర్ నెస్ట్ మోనెస్ట్రీ దగ్గరికి చేరుకున్నాము.
బస్సులో వుండగానే ఎక్కడో ఆకాశంలో కొండకొమ్మున కన్పిస్తున్న మోనెస్ట్రీని చూస్తూనే మా కందరికీ గుండే జారీ గల్లంతౌతున్నట్టుగా అన్పించింది. అయినా “చూడాలని వచ్చిన తరువాత భయపడడంలో అర్ధం లేదు. ఎటువంటి కఠిన పరిస్థితి ఎదురైనా తట్టుకుని అనుకున్న దగ్గరికి వెళ్ళాల్సిందే” అన్న తీర్మానానికి వచ్చాము. ఇంతలో బస్సు వెళ్ళి పార్కింగ్ ప్లేస్ లో ఆగింది. గైడ్ ఫెమా వెంటనే కిందికి దిగాడు. అతని వెనుకే కిందికి దిగిన మా అందర్నీ ఒకచోట వలయాకారంగా నిల్చోబెట్టినా తను “ఇక్కడ మనిషికి వెయ్యి రూపాయలు ఎంట్రెన్స్ టిక్కెట్టు తీసుకోవాల్సి వుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కుతామనుకున్నవాళ్ళు మాకు డబ్బులిస్తే, నేను మీతోపాటు పైకొస్తాను. డ్రైవర్ ‘దోరో’ ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేస్తాడు” అంటూ చెప్పుకొచ్చాడు.
అతని మాటలిన్న వెంటనే సుబ్బారావు గారు కలుగజేసుకొని “ముందుగా మేమంతా కలిసి కొంత దూరం ఎక్కిన తరువాత ఎవరెవరు ఎక్కగలరో? ఎవరెవరు ఎక్కలేరో? తెలిసిపోతుంది. ఎక్కగల మనుకున్నవాళ్ళు ముందుకు సాగుతారు. ఎక్కలేము అనుకున్నవాళ్ళు ఆగిపోయి కిందకొచ్చి బస్సులో కూర్చుంటారు. ఎక్కేవాళ్ళు టిక్కెట్ డబ్బులు ఇస్తారు” అంటూ ఒక సూచన చేశారు.
ఇక దాంతో అందరం కలిసి ఆ పక్కనే చేతి కర్రలు అద్దెకిచ్చే ఆవిడ దగ్గరికెళ్ళి ఎవరికి నచ్చిన కర్రను వాళ్ళు తీసుకున్నారు. ఆ షాపావిడ మా ఉత్సాహం మీద నీళ్ళు చల్లుతూ “కర్ర ఒక్కింటికి వంద రూపాయలు అద్దే” అంటూ చెయ్యి సాచింది.
వెంటనే నేను “ఇప్పటి వరకు మేము చేసిన ఎన్నో యాత్రాల్లో ఎక్కడ కూడా ముప్పై రూపాయలకంటే ఎక్కువ తీసుకోలేదు. మరీ వంద రూపాయలంటే చాలా ఎక్కువ. ఇంకో మాట చెప్పు” అన్నాను.
దాని కావిడ “ఎక్కడి సంగతో మాకనవసరం. ఇక్కడ మా లెక్క ఇంతే నచ్చితే తీసుకోండి! లేకపోతే లేదు” నా వైపు చూస్తూ పుల్ల విరిసినట్టుగా బదులిచ్చింది.
ఇక చేసేదేంలేక ఆవిడ అన్నట్టుగానే వంద రూపాయలు ఆవిడకు సమర్పించుకొని మెల్లగా కొండ దారిలో ముందుకు కదిలాము. పెండ్లి కూతురు వ్యవహారశైలి మనుగుడుపులనాడే తెలుస్తుందన్నట్టు. ఒక ఫర్లాంగ్ దూరం నడిసే సరికే ఆ దారి వ్యవహారం మాకందరికీ అర్ధం కావడంతో నేను వెంటనే “ఈ దారి మొదట్లోనే ఇంత అధ్వాన్నంగా వుందంటే పైకి పోను పోను ఇంకెంత కఠినంగా వుంటుందో చెప్పలేం. కాబట్టి చేతకాదనుకున్న వాళ్ళు ఇక్కడే ఆగిపోతే మంచిది” అంటూ ఖచ్చితంగా తెగేసి చెప్పాను.
“ఎంతవరకు చేతనైతే అంతవరకు ఎక్కి తిరిగొస్తాం” అంటూ చెప్పుకొచ్చారు.
కష్టపడి కొంతదూరం ఎక్కి, తరువాత పైకెక్కలేకపోతే కిందికీ దిగలేక ఇబ్బంది పడకుండా చూసుకుని ఎక్కండి. ఆపైన మీ ఇష్టం” అంటూ మేము ముందుకు కదులుతుండగా రెండు ఖాళీ గుర్రాలు, వాటి రౌతులు కిందికొస్తూ కనిపించడంతో “సవారి వుంది పైకి తీసుకుపోతారా?” అంటూ అడిగాము.
“తీసుకుపోతం”
“మనిషికెంత?”
“పదమూడొందలు”
“రానూ పోనా?”
“పోను మాత్రమే”
“మరి దిగడానికి?”
“సవారికి మూడువేలు”
“అదేంది!?
“ఘోడా సవారీని ఎక్కించుకొని దిగడం కష్టం కాబట్టి”
“పైకంటే గుడిదాకా తీసుకుపోతారా?”
“పోదు”
“మరి!?”
“మేం పొయ్యేకాడికి పోతామ్”
“అది ఎంతదూరం వెలుతుంది?”
“దూరం సంగతి తెలియాదు. టైమ్ మాత్రం గంటన్నర పడుతుంది”
“అదేం చెప్పడం!?” అనుకున్న నేను ఆ వివరాలన్నీ మావాళ్ళకు తెలియజేయడంతో వాళ్ళు ప్రయాణం కష్టంతో కూడుకున్నదేనని అర్ధం చేసుకుని “మేము వెనక్కెళ్లి పోతాం గాని, కనీసం మా గుర్తు కోసమన్నా అంతా కలిసి ఇక్కడో గ్రూప్ ఫోటో దిగుదాం” అన్నారు.
వెంటనే దిగిన తరువాత మా దంపతులం, సారంగపాణి గారి దంపతులు, సుబ్బారావు గారు, నాగేశ్వరరావు గారు, లింగయ్య గారు, అందెశ్రీ గారు వెరసి ఎనిమిది మందిమి ముందుకు వెళ్ళే బృందంగాను, రంగారావు గారి దంపతులు, రవికుమారి గారు, అరుణ గారు, సుభద్ర గారు, రేణుకా గారు వెరసి ఆరుగురు క్రిందనే ఆగిపోయే బృందంగాను విడిపోయాము.
ఇక అక్కడి నుండి మా నడక మెల మెల్లగా ముందుకు సాగడం ఆరంభమయ్యింది. దారంతా రాళ్ళతో కఠినంగా వుంది. అడవి చిక్కబడుతూ వుంది. మాకు కుడి పక్క కొండ, ఎడమపక్క అంతా అంతులేని లోయ. రాళ్ళు లేని చోట మెత్తటి మట్టిని మెట్టు మాదిరిగా చదును చేశారు. అట్లా చదును చేసిన మెట్టు అంచున సరిగ్గా దానంత పొడవైన, సుమారు పది ఇంచుల కైవారంతో వుండే గట్టి దుంగను అడ్డం వుంచి, కిందికి జారకుండా మేకుల మాదిరిగా చెక్కిన మూడేసి కర్రలను నెలలోకి దిగగొట్టి వుంచారు.
నడక కష్టంగా తోస్తున్న సమయంలో అందెశ్రీ గారు మా అందరినీ ఉద్దేశించి “మీరెవ్వరూ నిఠారుగా నిలబడి కుండా నడుము కాస్త ‘యూ’ ఆకారంలో ముందుకు వంచి నడిస్తే కష్టం లేకుండా తేలిగ్గా ఎక్కొచ్చు” అంటూ ఓ సూచన చేశారు.
కానీ అది ఆచరణలో నిలబడలేదు. ఎవరికి అనుకూలంగా వున్న పద్దతిలో వాళ్ళం పైకెక్కడం మొదలు పెట్టాము. మా దంపతులం కావాలనే అనుకుని మా వాళ్ళందరినీ అధిగమించి వడి వడిగా ముందుకు వెళుతుంటే, మేము ఊహించినట్టుగానే వాళ్ళంతా “అరే! వాళ్ళిద్దరూ ముందుకు మిగులుతున్నారు” అన్న దుగ్ధతో వాళ్ళూ కాస్త వేగం పెంచారు. మేమట్లా వెళ్ళగా వెళ్ళగా గుర్రాలు ఆగిపోయే చోటు కనిపించింది. మేం వెళ్లాల్సిన దూరంలో అది పదిహేను పైసల వంతు కూడా లేదనిపించింది.
అప్పటికే పైకెళ్ళి దర్శనం చేసుకుని దిగి వస్తున్న నానా దేశాల సందర్శకులు మాకేదురవ్వసాగారు. దారి అనాయాసంగా సాగడం కోసం నేను కావాలనే వారందరినీ పలుకరిస్తూ, వాళ్ళు ఏ దేశస్తులో తెలుసుకుంటూ వాళ్ళతో కలిసి ఫోటోలు దిగుతూ ముందుకు నడవసాగాను. ఇంకా ఎంత దూరముందంటూ ఎవరినడిగినా సమాధానం మాత్రం చిత్రంగా కాలంతో చెబుతున్నారు గాని దూరంతో చెప్పడంలేదు. పోను పోను అడవి మరింత చిక్కబడసాగింది. పెద్ద పెద్ద వృక్షాల మీద పరాన్న జీవులైన ఒక రకం గడ్డి మొక్కలు వాతావరణంలో జరిగిన మార్పులతో ఎండిపోయి, గొంగళి పురుగుల మీది వెంట్రుక (బొచ్చు) ల్లా కన్పించ సాగాయి. ఆ తావుల్లో వున్న అడవిని చూస్తుంటే మా చిన్నప్పుడు చందమామ పుస్తకాల్లో చదివిన రాకాసి లోయ గుర్తుకురాసాగింది. ఇంకా అక్కడక్కడా ‘ర్హోడోడెండ్రోన్’ అనే ఎర్రగులాబీల్లాంటి అందమైన పూలున్న అద్భుతమైన పొదలు కనులవిందుగా దర్శనమివ్వసాగాయి. నిజానికా పూవు నేపాల్ దేశ జాతీయ పూవట! వాటి అందానికి ముగ్ధులమైన మేము చిన్నపిల్లా మాదిరిగా పులకించిపోతూ పిచ్చి పిచ్చిగా ఫోటోలు తీసుకోసాగాము.
పైకి ఎక్కుతున్నా కొద్ది అందెశ్రీ గారికి శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారడంతో మాకంటే చాలా వెనుకబడిపోయారు. వారికితోడుగా మరో మిత్రుడు సారంగపాణి గారు జతకలవడంతో ఇద్దరూ కలికి మెల్లగా రాసాగారు. మా వెనుక సునీత గారు, సుబ్బారావు గారు, నాగేశ్వరరావు గారు, లింగయ్య గార్లు కొంచం ముందు వెనుకగా రాసాగారు.
దారి పొడవునా అక్కడక్కడా మన దగ్గర కోతుల్ని పట్టేంత ఇనుప జాలీల్ని ఏర్పాటు చేసి వుంచారు. ఎవరు ఏది తిన్నా. ఏది తాగినా ఆ వ్యర్ధాలను తీసుకుపోయి ఆ జాలీల్లో వెయ్యాల్సిందే. మేము వెళ్ళిన మరునాడు అక్కడికి ఎవరో విదేశీ అతిథులు రానున్నారని తెలిసి కొంతమంది సిబ్బంది (యువతీ యువకులు) కింద నుండి పైదాకా అడవి దారిలో పొరపాటున ఏవైనా ప్లాస్టిక్ వ్యర్ధాలు, చిత్తు కాగితాలు పారవేశారేమోనని జాగ్రతగా ఏరి బస్తాల్లో నింపుకుని తీసుకుపోయి జాలిల్లో వేస్తున్నారు. పరిశుభ్రతపట్ల ఆ దేశవాసుల సంకల్పం ప్రపంచానికే ఆదర్శం అనిపించింది.
దాదాపు రెండు గంటల తరువాత ఒక ప్రార్ధనా స్థలం. దాని తరువాత ఒక కెఫటేరియా వచ్చింది. అప్పటిదాకా మాతోపాటే వచ్చిన గైడ్ ‘ఫైమా’ ఇక్కడ భోజనంతో పాటు టిఫిన్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్స్ లాంటివన్నీ దొరుకుతాయి” అంటూ తను లోపలికి వెళ్ళాడు. అక్కడ భోజనం ఆరు వందలట. డబ్బులు ఎంతైనా తిందామంటే తరువాత నడక కష్టమౌతుందన్న ఉద్దేశంతో మేము చెరో నాలుగు బిస్కెట్స్ తిని, బ్లాక్ టీ తాగాము. ఆ హోటల్ ముందు నుండి చూస్తే మేము వెళ్ళాల్సిన మోనిస్ట్రీ భయదసౌందర్యంతోనూ అయస్కాంత శక్తితోనూ ఆకర్షిస్తూ దర్శనమివ్వసాగింది.
ఇంతలో మిగతా మిత్రులు కూడా కలవొచ్చారు. అందరం అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని అక్కణ్ణుండి దూరంగా వున్న మోనిస్ట్రీని, అడవిని, కింద ఎక్కడో వున్న లోయ, ఆ లోయలోని గృహాసముదాయాన్ని ఫోటోలు తీసుకుని తిరిగి గ్యారా నంబర్ బస్సెక్కాము.
– 5 –
ఇప్పటిదాకా నడిచొచ్చిన సగం దూరం ఒక ఎత్తైతే హోటల్ నుండి ఎక్కాల్సిన మిగతా సగం దూరం మరోఎత్తు అసలు కష్టమంతా ఇక్కన్నుండే మొదలవుతుంది. ఇప్పటిదాకా వచ్చిన రాళ్ళ, మట్టి దార్లతోపాటు ఇక్కణ్ణుండి సిమెంట్ మెట్ల దారి కూడా సందర్శకులకు ఎదురవుతుంది. కొంతదూరం నిట్ట నిలువుగా పైకెక్కి, ఆ వెంటనే అంతే దూరం కిందికి దిగాల్సి వుటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కల్లోల కడలిలో భీకర అలల మాదిరి పైకి కిందికీ ఎక్కుతూ దిగుతూ వెళ్ళాల్సి వుంటుంది.
చిక్కనౌతున్న అడవితో పాటు ‘ర్హోడోడెండ్రోన్’ పూలచెట్ల పొదలు ఎదురౌతూ సందర్శకుల అలసటను కొంతలో కొంత తగ్గిస్తుంటాయి. ఒక మెరక మీదికి ఎక్కి మోనెస్ట్రీ దిక్కు చూస్తే అక్కడి కొండశిఖరంలో ఏర్పడిన చీకటి గుహ, నోరు తెర్చుకున్న శాపగ్రస్త భీకరాకార మొసలి మాదిరిగా వుంది. అది ఒకేసారి అనేక ఏనుగుల్నీ పట్టి ఆ నోట కర్చుకున్నట్టుగా వుంది. గుండెలు చెదిరిపోతున్న భయాన్ని అదిమిపెట్టుకుంటూ మరింత తీక్షణంగా దాని దిక్కే చూస్తే కొన్ని వేల అడుగుల ఎత్తులోవున్న దాని కింది దవడ ఎముకల అంచున ఆ మోనెస్ట్రీ నిర్మించినట్టుగా గోచరమవ్వసాగింది.
ఈ టైగర్ నెస్ట్ మోనెస్ట్రీ చరిత్రను గురించి కొంత అవలోకనం చేసుకుంటే దీన్ని ‘పరో తక్త్సంగ్’ అని కూడా అంటారు. ఇది హిమాలయన్ పర్వతశ్రేణిలో అంతర్భాగమైవుంటుంది. వజ్రాయాన బౌద్ధ ధర్మానికి సంబంధించిన పదమూడు ముఖ్యమైన మోనెస్ట్రిల్లో ఒకటి. నేపాల్ దేశంలో పుట్టి, టిబెట్ లో బౌద్ధాన్ని అనుసరించిన గురు పద్మసంభవుడు ఇక్కడికి రాకముందు ఆ గుహలో అనేక రకాల దుష్ట, తాంత్రిక శక్తులు నివాసముంటూ స్థానికంగా వుండే సామాన్య ప్రజలను నానారకాలుగా పీడిస్తుండేవట. అది తెలుసుకున్న గురు పద్మసంభవుడు ఆ దుష్ట శక్తులను రూపుమాపాలన్న సంకల్పంతో టిబెట్ నుండి నేరుగా ఈ గుహ దగ్గరికొచ్చి అందులోని దుష్టశక్తులన్నింటినీ పారదోలాడట.
తరువాత ఆ గుహలోనే కూర్చుని మూడు సంవత్సరాల, మూడు మాసాలా, మూడు వారాల, మూడు రోజుల, మూడు గంటల, మూడు నిమిషాలు తపస్సుచేసి జ్ఞానసిద్ధిని పొందాడట. ఈ మూడులన్నింటినీ కలిపిచూస్తే పద్ధెనిమిది వస్తుంది. పద్ధెనిమిది అనేది పౌరాణికంగా ఎంతో విలువైన అంకే. గురు పద్మ సంభవుడు అక్కడ ఎనిమిది రకాలుగా తనకు తాను ఆవిస్కృతుడయ్యాడట. అందుకు తార్కాణంగా అక్కడ ఎనిమిది మందిరాలుంటాయి. ఆ ఎనిమిది మందిరాల్లో ఎనిమిది రకాల పేర్లతో బోధగురువులుంటారు.
పద్మసంభవుడు ఈ గుహలోకి రెక్కలున్న పులిమీద వచ్చి ఇక్కడున్న దుష్ట శక్తుల్ని పారదోలిన తరువాత ఆ దుష్టశక్తులన్నీ కలిసి ఒక దుష్టరాజుకు తమ శక్తులను ధారపోసి ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజానీకాన్ని పలురకాలుగా హింసకు గురిచేయసాగారు. అది గమనించిన గురు పద్మసంభవుడు మరో గురువు అవతారంలో పులి మీద వచ్చి ఆ రాజును సంహరించాడట. ఆ విషయంలో టిబెట్ దేశానికి చెందిన ఓ మహారాణి అతనికి అనుంగు శిష్యురాలై తనను తాను పులిగా మార్చుకుని గురువును తన మీద కూర్చొబెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చి ప్రజా కంటకుడైన ఆ రాజును సంహరించడంలో తనవంతు కర్తవ్యాన్ని తాను నిర్వహించి ముక్తిని పొందిందట.
హిందూ ధర్మంలో మాదిరిగానే బౌద్ధ ధర్మంలో కూడా ఈ విధంగా ఎన్నెన్నో ఆస్పష్ట గాధలు వేల ఏండ్లుగా ప్రజల్లో పాతుకుపోయివున్నాయి.
ఇప్పటికీ ఆ కొండల మీద మనకు భీతిగొల్పేటంతటి అడవి కళ్ళముందు కన్పిస్తుందంటే, ఎప్పుడో 1692లో నాలుగవ గురువు ద్రుదేశి తెన్ జిన్ రబ్జీ ఈ మోనెస్ట్రీని నిర్మించారట. అది ఏవిధంగా సాధ్యమయ్యిందో ఆలోచిస్తే మనకు అనూహ్యంగా అన్పిస్తుంది. ఎంత మంది బౌద్ధ పరివ్రాజకులు, ఎంత మంది సాధారణ ప్రజలు ఎన్నెన్ని కష్ట నష్టాలకు ఓర్చి ఆ మోనెస్ట్రీని నిర్మించారో?ఎంత స్వేదాన్ని చిందించారో? చరిత్ర పుటల్లో వారంతా చిరునామా లేకుండా పోయారుగదా?. అదంతా తల్చుకుంటే గుండే దిగులుతో నీరైపోతుంది.
కారణాలు ఏవైనప్పటికీ ఈ మోనెస్ట్రీ ఇప్పటికీ మూడు మార్లు కాలిపోయిందట. ఎంతో విలువైన సమాచారం, అమూల్యమైన గ్రంధాలు, గాధా చిత్రిత చిత్రాలు బూడిదైపోయాయట. అయినప్పటికీ చాలావరకు వివిధమార్గాల్లో, వివిధపద్దతుల్లో వాటిని సేకరించి మళ్ళీ చాలావరకు పునర్నిర్మించారు. అవే ఇప్పుడు మనకు గతవైభ చరిత్ర పాఠాలను బోధిస్తుంటాయి. మా బృందం ఎనిమిది మందిలో మా దంపతులం, మాతోపాటు సునీత గారు,అందరికన్నా కాస్త ముందుగా నడుస్తుంటే మా వెనుకనే లింగయ్య, నాగేశ్వరరావు, సుబ్బారావు గార్లూ వస్తూనే వున్నారు. కానీ అందెశ్రీ, సారంగపాణి గార్లు మాత్రం చాలా వెనుకబడిపోయారు.
మేము ప్రధాన మోనెస్ట్రీకి చాలా దగ్గరికి చేరుకున్నాము. గుడికి సమీపంలో రెండువందల అడుగులకు పైచిలుకున వున్న కొండ మీది నుండి ఓ అందమైన జలపాతం కుబుసం విడిచిన కోడె తాచులా కిందికి దుముకుతూ సందర్శకులను ఆశ్చర్యచకితుల్నిచేస్తుంది. కొంతసేపు దాని అందాలను వీక్షించిన మేము తిరిగి మెల్లగా ముందుకు సాగుతుంటే గుడి తలవాకిట రెండు కొండల సందున ఏర్పాటుచేసిన మెట్లమీదుగా కొంత దూరం పైకెక్కిన తరువాత ఆ పైన ఎక్కడో వున్న, ఏదో ఒక మందిరం దగ్గర్నుండి వేలాడదీసిన మోట బావి మోకంత లావు మోకుని సగానికి పైగా మెట్ల కిందికి వచ్చే విధంగా వెళ్ళాడ దిశారు. అక్కడికి వెలుతున్న కొద్దిపాటి మంది ధైర్యస్థులైన భక్తులు ఆ మోకును పట్టుకుని, దానిసాయంతో మెట్ల మీదుగా పైకి వెళుతున్నారు.
అది చూసిన నేను మా ఆవిడ దిక్కు తిరిగి “అందెశ్రీ గారు వాళ్ళు వచ్చెలోపుగా నేను ఆ తాడుపట్టుకుని పైకెక్కి ఆక్కడున్న విశేషం ఏమిటో చూసి వస్తాను” అంటూ నా ప్రతిపాదనను ఆవిడ ముందు వుంచాను. దానికి తను “మీరు ఆ తాడుపట్టుకుని పైకి వెళ్ళే ప్రయత్నానికి నేను ససేమిరా ఒప్పుకొను” అంటూ నా ప్రతిపాదనను నిర్ధయగా వీటో చేసేసింది.
ఎక్కడైనా హోంశాఖకు పవర్స్ అధికంగా వుంటాయి. కావున ఆ నా ప్రయత్నాన్ని విరమించుకుని తిరిగి ప్రధాన మందిరం దిశగా కదిలాను. తానూ నా వెనుకే పదం కదిపింది.
ఇంకా కేవలం నాలుగు మెలికలు తిరిగితే మందిరాన్ని చేరుకుంటాము. ఇగిరి పోయిన ఉత్సాహాన్ని తిరిగి చిగిరింప జేసుకుంటూ “నాలుగు ఇరవైలు ఎనభై మెట్లుంటాయేమో? అంతేగదా?” అనుకుంటూ మొదటి మెట్టు మీద పాదం మోపి రెండో మెట్టు మీదికి మరో పాదం లేపుతుంటే మెట్టు మెట్టుకూ తొడకండరాలు పఠ పఠ పఠ మంటూ నరాలు చిట్లి పోతాయేమోనన్నంత బాధకు గురిచేయ సాగాయి. పొద్దుటి నుండి మేము ఎక్కి వచ్చిన బాధ దీని ముందు పూచిక పుల్లతో సమానం అనిపించింది. మెట్ల పక్కనున్న రాతి గోడను ఆసరాగా చేసుకుంటూ బ్రహ్మ ప్రళయంగా ఇరవై, ముప్పై నిమిషాల పాటు మా ఆమ్మా నాన్నలను స్మరించుకుంటూ ఎట్టకేలకు మందిర ప్రాంగణంలో అడుగుపెట్టాము.
మా కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. అక్కడ కనీసం మంచినీళ్ళ బాటిల్స్ కూడా దొరకవు. సుబ్బారావు గారి సంచీలో రెండు బిస్కట్లు, ఓ చిన్న యాపిల్ కాయా వున్నాయి. పక్కన నాగేశ్వటావు ఓ ముప్పావు భాగం నీళ్లున్న సీసా కనిపించింది. నేను వెంటనే “నాకో బిస్కెట్” అన్నాను. వారు వెంటనే “నేనివ్వను. ఇక్కడ అవసరం వుంటుందని మీకు ముందుగా తెలియదా? ఎవరి ప్రాణం వారికి తీపి. ఒక బిస్కెట్ మీకిస్తే మీకేటూ సరిపోదు. అదే నేను ఈ రెండు బిస్కెట్లు, యాపిల్ తిని ఇన్ని నీళ్ళు తాగితే ప్రాణం కుదుటపడుతుంది” అంటూ సహజంగా ఏ ప్రాణికైనా వుండే ప్రాణం మీది తీపిని, తనకు మాలిన ధర్మం చేయగూడదన్న నగ్న సత్యాన్నీ ఆక్షణంలో నాకు విప్పి చెప్పిన నిఖార్సైన భౌతికవాది సుబ్బారావు సార్ జ్ఞానం పునః ప్రాప్తమయ్యింది.
ఇంతలో కిందెక్కడో అందెశ్రీ, సారంగపాణి గార్లు వస్తూ కనిపించారు. “వాల్లోచ్చేసరికి ఎంతలేదన్నా మరో గంట పడుతుంది. కాబట్టి మీరు దర్శనం టిక్కెట్లకు డబ్బులిస్తే నేను వెళ్ళి టిక్కెట్లు తీసుకుంటాను” అన్నాడు గైడ్ ఫెమా. దాంతో మేము వెంటనే తలో వెయ్యి ఇచ్చేశాము. తను మాముందే వెళ్ళి కౌంటర్లో డబ్బులు కట్టాడు. కానీ, ఆ టిక్కెట్లు మాకు చూపించలేదు. మా తొందర్లో మేమా టిక్కెట్లను గురించి అస్సలు పట్టించుకోలేదు. అదే విషయంలో తరువాత మాకు అతని నిజాయితీ పట్ల సందేహ కారణమయ్యింది. జరిగిపోయినదానికి వగపేల? అనుకున్న మేము అంతటితో ఆ విషయాన్నివదిలేశాము.
కౌంటర్ ముందు నుండి వచ్చిన గైడ్ ఫెమా ఆ మోనెస్ట్రీ చరిత్రను గురించి సంక్షిప్తంగా వివరించాడు. ఆ మోనెస్ట్రీకి మూల యంత్రం లాంటి ఓ శంకాకారపు పెద్దరాయి, దాని మీద మన బొటన వేలు పరిమాణంలో కన్నులాంటి చిన్న గుంటా వుంది. ఒక వ్యక్తి ఆ రాతి దగ్గరి నుండి కళ్ళు మూసుకుని రెండు అడుగులు వెన్నక్కి వెళ్ళి, కళ్ళు తెరవకుండానే మనసులో ఒక కోరిక కోరుకుని ఆ రెండు అడుగులు ముందుకొచ్చి కుడి చేతి బొటన వేలును మూడు ప్రయత్నాల్లో ఆ చిన్న గుంటలో పెట్టగలిగితే ఆ కోరిక నెరవేరుతుందనేది అక్కడి ప్రజల విశ్వాసం. గైడ్ ఫెమా మా అందరినీ ఓ ప్రయత్నం చేయమన్నాడు. అటువంటి వాటికి సుబ్బారావు గారు దూరం కాబట్టి వెంటనే తను చేయనన్నారు. తను తప్పుకుంటే ముందుగా వచ్చిన మా ఆరుగుర్లో అయిదుగురం మిగిలాము. ఆ అయిదుగుర్లో నేను, లింగయ్య మూడో ప్రయత్నంలో సఫలమయ్యము.
అ వెంటనే మా సెల్ ఫోన్స్ తదితరాలు బ్యాగులో పెట్టి ఆక్కడి సెక్యూరిటీ వారు ఇచ్చిన లాకార్లో పెట్టి వేరే గైడ్తో పాటు లోపలికెళ్ళాము. ఇంతలో అందెశ్రీ, సారంగపాణి గార్లు కూడా వచ్చి ఫెమాకు కలియడంతో అతను వాళ్ళను వెంటపెట్టుకుని వచ్చి మాతో కలిసిపోయారు. ఆ మోనెస్ట్రీలో గురు పద్మసంభవ ఎనిమిది రూపాలలో ఎనిమిది మందిరాలు వున్నాయి. ఒక్కో మందిరం తిప్పి చూపించిన గైడ్ వాటిని గురించి క్లుప్తంగా వివరించాడు.
మా జీవితాలలో ఇంత క్లిష్టమైన ట్రెక్కింగ్ ను ఎక్కి మందిరాలను దర్శించుకోవడంలోనిని ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ తిరుగు ముఖం పట్టము. కిందకి చేరేసరికి సాయంత్రం ఆరుగంటలయ్యింది.
కిందవున్న మా మిత్రులంతా పొద్దుగూకులూ మా కోసం ఆతృతగా ఎదురుచూస్తూ వుందడంతో వాళ్ళ స్నేహశీలతకు పైకి వెళ్లొచ్చిన మేమంతా అభినందనలు తెలియజేసుకున్నాము.
అంతా కలిసి ఆరున్నర ఏడు గంటలకు హోటల్ చేరుకున్నాము.

సిరంశెట్టి కాంతారావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *