పాట 15
చిత్రం : ఆరాధన (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : శ్రీ శ్రీ
నేపధ్య గానం : సుశీల
వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా (2)
వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయి..
నిదురించుము ఈ రేయి..
వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వాడని పూవుల తావితో..కదలాడే సుందర వసంతమీ కాలము
కదలాడే సుందర వసంతమీ కాలము..
చెలి జోలగ పాడే వినోద రాగాలలో…(2)
తేలెడి కలల సుఖాలలో… నిదురించుము ఈ రేయీ..
నిదురించుము ఈ రేయీ
వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
భానుని వీడని ఛాయగా… నీ భావము లోనే చరింతునోయీ సఖా
నీ భావములోనే చరింతునోయీ సఖా
నీ సేవలలోనే తరింతునోయీ సదా…(2)
నీ ఎదలోనే వసింతులే… నిదురించుము ఈ రేయీ
నిదురించుము ఈ రేయీ
వెన్నెలలోనీ వికాసమే వెలిగించెద నీ కనులా
వేదన మరచీ ప్రశాంతిగా నిదురించుము ఈ రేయి..
నిదురించుము ఈ రేయి… నిదురించుము ఈ రేయి
నిత్య జీవితంలోని సమస్యలనుండి మనిషికి ఉపశమనం పొందడానికి అవసరమైనది ప్రశాంతమైన నిద్ర. అందుకే జోల పాటలు ఎంతో ప్రత్యేకమైనవి. మనసుకు ఆహ్లాదం కలిగించే సంగీతాన్ని వింటూ నిద్రలోకి జారుకోవడం అత్యంత గొప్ప అనుభూతి. మనం ఎంతో ప్రేమించే వ్యక్తి మన ప్రక్కన ఉండి, మన కోసం పాడుతుంటే ఆ ఆనందం వర్ణనాతీతం. ఒకప్పుడు తల్లులు జోలపాడి బిడ్డలను నిద్రపుచ్చేవారట. వేగం పెరిగిన జీవితాల్లో ఇప్పుడు అలాంటి అనుభూతులు అందుకోలేం కాని చక్కటి పాటలు వింటూ నిద్రపోవడంలోని హాయి మాత్రం అనుభవించిన వారికే అర్ధం అవుతుంది.
సినీ గీతాలలోనూ ప్రేమ, స్నేహాం, వాత్సల్యాన్ని ప్రతిఫలిస్తూ గొప్ప జోల పాటలు వినిపిస్తాయి. అత్యంత ఆహ్లాదభరితమైన స్వరాలతో వీటిని ఆనాటి సంగీతదర్శకులు స్వరపర్చారు. ఆరాధన సినిమా కోసం శ్రీ శ్రీ ఒక చక్కని మధురమైన జోల పాటను రాసారు. హృదయానికి హత్తుకునే సాహిత్యం, అంతే అందమైన సంగీతంతో ఈ పాట సినీ ఆణీముత్యాలలో ఒకటిగా నిలిచిపోయింది.
కథానాయకుడు గుడ్డివాడు. అతని స్నేహితురాలు తోడుగా ఉండి సేవలు చేస్తూ ఉంటుంది. ఇది సన్నివేశం. కాని శ్రీ శ్రీ రాసిన పాట ఆ సన్నివేశానికి పూర్తి న్యాయం చేస్తూనే అక్కడే ఆగకుండా, దాన్ని దాటుకుని శ్రోతల మనసులను రంజింపజేస్తుంది. పాట వింటుంటే వెన్నెల రాత్రి, చల్లటిగాలి మంద్రంగా వీస్తూ మనల్ని తాకుతున్న అనుభూతి కలుగుతుంది. ‘వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా’ అని తీయగా సుశీల గానం చేస్తుంటే పులకించని మనసు ఉండదు.
వికాసం అనే పదాన్నిఇంత అందంగా ఉపయోగించవచ్చని ఈ పాట విన్నాకే తెలిసింది. దీన్ని సాధారణంగా అభివృద్ది, పురోగతి అర్ధాలలో వాడతారు. ప్రజాకవి కదా, ఈ పదం శ్రీ శ్రీ కలానికి అలవాటు కూడా. కాని దాన్ని ఇక్కడ వెన్నెలతో జతకలపడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. కవిత్వంలో ఈ పదాన్ని వికసించడం అనే అర్ధంతో కవులు వాడేవారు. వెన్నెల వికసించడం అన్నప్పుడు అచ్చంగా పువ్వులా రేకులు విప్పుకుని కురుస్తున్న వెన్నెల అనుభూతి కొస్తుంది. కాని శ్రీ శ్రీ ఇక్కడ వెన్నెలలోని వికాసం అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆనందం, మెరుపు, లేదా వెలుగుగా దీన్ని అన్వయించుకోవాలి. ఎందుకంటే వికాసం అంటే ప్రకాశం అన్న అర్ధం కూడా వస్తుంది. ఇక్కడ వెన్నెల లోని ప్రకాశం అంటే వెన్నెల లోని వెలుగు, అందులోని మెరుపు. ఒక్కసారి పండు వెన్నెలను గుర్తు చేసుకుంటే, అందులోని వెలుగు అనుభూతికి వచ్చాక ఈ వాక్యాన్ని వింటుంటే ఆ ఫీల్ అద్భుతంగా ఉంటుంది. వెన్నెల లోని వెలుగును అతని కళ్లల్లో ఆమె వెలిగిస్తుందట. ఎంత గొప్ప భావుకత. వెన్నెల వెలుగు చల్లనైనది కూడా. వేదనను మర్చిపోయి ప్రశాంతంగా, చల్లగా ఆ రాత్రి నిద్రపొమ్మని అతన్ని ఆమె కోరుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలున్నా ఇలా చెంత నిల్చి వాటిని మరపింపజేయగల వారు మనతో ఉంటే అంత కన్నా మరో అదృష్టం ఏం ఉంటుంది.
ఆ అందమైన రేయిని ‘వాడని పూవుల తావితో కదలాడే సుందర వసంతమీ కాలము’ అని ఆమె వర్ణిస్తుంది. తావి అంటే సువాసన. వాడని పూవుల మదురమైన సువాసనతో నిండిన అందమైన వసంత కాలపు రేయి ఊహల్లో కొస్తుంది. ఇక్కడ ‘వాడని పూవులు’ అనే ప్రయోగం కవి కల్పనాశక్తిని నిదర్శనం. పూవు, తావి జంట పదాలే, కాని వాడని పూవు అనేది కవి ఉపయోగించిన అతిశయోక్తలంకారం. ఇదే ఇక్కడ ఈ వాక్యానికి వింత అందాన్నిస్తుంది. వాడిపోని పూలు ఉంటాయా ఆలోచించండి…ఉంటాయి పూవుల్లాంటి జ్ఞాపకాలుగా.
వారిద్దరూ కలిసి గడిపే ఆ కాలం ఆమెకు అత్యంత ఆనందాన్నిస్తుంది. ఆ కలయిక మిగిల్చిన మధురానుభూతులు, ఆ గుభాళింపులు ఆమె జ్ఞాపకాలలో శాశ్వతం. వారిద్దరూ కలిసి గడిపే ఆ కాలం ఎప్పటికీ వాడని సువాసనలతో వారి స్మృతిలో మిగిలిపోతుంది. ఆమె మనసులో ముద్రించుకుంటున్న ఆ ఘడియలని వాడని పూవుల తావితో కవి పోలుస్తూ భావకవిత్వపు సౌందర్యానుభూతిని శ్రోతలకు అందిస్తున్నాడు. అనుభూతులకున్న బలం అదే, అవి శాశ్వతానందాలుగా మనసుల్లో నిలిచిపోతాయి. మనుష్యులు ఉన్నా లేకపోయినా ఆ జ్ఞాపకాల సువాసనల అనుభూతి శాశ్వతానందం. అలాంటి మధురమైన వసంత కాలంలో, చెలి వినోద రాగాలతో జోల పాడుతుండగా, కలలలో తేలిపోతూ ఆ రాత్రి సుఖంగా నిద్రించమని ఆమె అతన్ని అడుగుతుంటే, అంతటి ఆనందాన్ని అనుభవిస్తున్న అతని పట్ల కించత్తు ఈర్ష్య కలగడం తప్పు కాదేమో.
సినీ ప్రేమ గీతాల్లో శ్రీ శ్రీ పండించిన భావుకత రమణీయం. ఈ పాట సున్నితంగా మనసు తంత్రులను మీటుతూ సాహచర్యంలోని ఆనందాన్ని పరిచయం చేస్తుంది. ఇలాంటి పాటలకు ఎస్. రాజేశ్వరరావు కుదిర్చిన బాణీలు జీవం పోస్తాయి. తేనెలూరు తెలుగుపదాల సొగసును శ్రీ శ్రీ పరిచయం చేస్తే, ఆ పదద్వనులలోని మాధుర్యాన్ని ఎస్. రాజేశ్వరరావు శ్రోతలకు అందిస్తారు. ఆ తేట తేట తెలుగు మాధుర్యం శ్రీ శ్రీ పదాలతో, ఎస్. రాజేస్వరరావు బాణీతో సుశీల మనకు అందిస్తుంటే స్వర్గానికి అతి చేరువలో ఉన్నట్లుంటుంది.
తర్వాతి చరణంలో ‘భానుని వీడని ఛాయగా… నీ భావము లోనే చరింతునోయీ సఖా’ అంటూ సాగే వాక్యం ఒక భావోద్వేగ తాదాత్మ్య స్థితికి మనల్ని తీసుకెళుతుంది. పరిపూర్ణమైన సమర్పణా భావం ఇది. పూర్తిగా ఇద్దరు ఒకటవడం అంటే మనదంటూ ఏమీ మిగుల్చుకోకుండా సమర్పించుకోవడం. ప్రేమలోని ఈ లొంగుబాటులో అహం ఉండదు. స్వచ్చమైన సమర్పణ అది. భౌతిక ఆకర్షణను అధిగమించి, పరస్పర గౌరవం, షరతులు లేని లోతైన, ఆత్మీయమైన అనుబంధం అది. ఇదే పరిపూర్ణమైన భక్తి కూడా. ఈ వాక్యంలో మీరాబాయి భక్తితత్వం కనిపిస్తుంది.
సూర్యిడిని వదిలిపెట్టని నీడగా, అతని భావాలలో తాను కలిసిపోయి అతని భావనాప్రపంచంలో తానూ విహరిస్తానని ఆమె అనడంలో తామిద్దరిదీ విడదీయలేని సాహచర్యం అన్న భావం ఉంది. తాను నిద్రపోతే ఆమె తనను వదిలి వెళ్లిపోతుందేమో అని అతను భయపడి మేలుకుని ఉంటే, నేను నిన్ను వదిలి వెళ్లిపోవడం అంటూ జరగదు. సూర్యుడిని నీడ వదిలడం ఎంతటి అసాధ్యమో నీకు నేను దూరం అవడం కూడా అలాంటిదే అని ఆమె చెప్తూ అతడ్ని ‘సఖా’ అని సంబోధించడం మీరాబాయి కృష్ణభక్తిని గుర్తుచేస్తుంది.
నిజానికి ఈ వాక్యంలో ‘ప్రియా’ అన్నా అది సరిగ్గా అతుకుతుంది. కాని శ్రీ శ్రీ ‘సఖా’ అన్న పదంతో ఆమెలోని ప్రేమకు భక్తిభావాన్ని జోడించాడు. ఇది ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది కూడా. నిజానికి ఇద్దరి మధ్య బంధం గట్టిపడాలంటే వారి మధ్య పరిపూర్ణమైన స్నేహం ఉండాలి. దూరంగా ఉన్నా ఒకరి కోసం ఒకరుగా జీవించగలగడం, స్నేహభావంలోనే కనిపించే సహజమైన గుణం. ప్రేమలో రహస్యం ఉంటుంది. పరస్పర ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ అది. స్నేహంలో నిస్వార్ధమైన నిర్మలమైన బహిరంగత ఉంటుంది. ఈ చరణంలో ‘సఖా’ అన్న పదం విన్న ప్రతి సారి మనసు పులకరిస్తుంది. వారిద్దరి నడుమ ప్రేమను మించిన స్నేహం ఉంది. ‘నీ భావములోనే చరింతునోయీ సఖా’ అన్న వాక్యం అందుకే ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. మనిషిని భౌతికంగా దక్కించుకోవడం అంత ముఖ్యం కాదని, అంతకు మించిన ఆత్మల కలయికలోని ఆనందానుభూతిని అందుకోవడంలో పరిపూర్ణత ఉంటుందని తెలియజేసే వాక్యం అది. అందుకే ఇక్కడ ‘సఖా’ అన్న పదమే అర్ధవంతంగా అనిపిస్తుంది.
అతని సేవలోనే ఎప్పుడూ తరిస్తానని, అతని మనసులోనే నివసిస్తానని చెబుతూ తానెక్కడికీ వెళ్లనని అతనిలోనే ఉండిపోతానని ఆ రాత్రి ప్రశాంతంగా ఏ భయాలు లేకుండా నిద్రపొమ్మని ఆమె అతనిలో ధైర్యాన్ని నింపుతుంది. ‘నీ ఎదలో నే వసింతులే’ వాక్యంలో వసింతులె అనే పదప్రయోగం చాలా బావుంటుంది. వసింతులే అంటే ఉంటాను, నివసిస్తాను అని అర్ధం వస్తుంది. ‘నీ ఎదలో నివసింతులే’ అన్నా అదే అర్ధం వస్తుంది. అదీ బాణికి సరిగ్గా సరిపోతుంది. కాని ఇక్కడ ‘నీ ఎదలో నే వసింతులే’ అని పలకడంలో ఒక అద్భుతమైన స్పష్టత ఉంది. ‘నీ ఎదలో నివసింతులే’ అంటే నీ మనసులో ఉంటానులే అని అర్ధం వస్తుంది. అతనికి సర్ధి చెబుతున్నట్లు. కాని అదే ‘నీ ఎదలో నే వసింతులే’ అంటే నీ మనసులో నేనుంటాను అని అర్ధం వస్తుంది. ఆ ‘నేను’ ఇచ్చే భరోసా, ధైర్యం దేనికీ సాటిరావు. నీకు నేను ఉన్నాను అని బలంగా ఒత్తి చెప్పడం అనమాట. ఒకే వాక్యం, అక్షరాలు ఇటు అటు మారిస్తే ఆ భావనాస్థాయిలో ఎంత మార్పు వచ్చిందో చూడండి.
కవి తన పదాల కూర్పుతో ఆ కవితకు సౌందర్యాన్నితీసుకొస్తాడు. శ్రోతలకు రససిద్ది కలిగించడానికి కవి భావానికి తగ్గ పదాలను ఎంపిక చేసుకోవాలి. మృదుమధురమైన ప్రేమ సంభాషణ కోసం అతి సున్నితమైన పదాలతో ఆ భావావేశాన్ని పలికిస్తూ అది మనిషిని మత్తులోకి నెట్టేలా పాటను కట్టగలగడం కవి ప్రతిభకు తార్కానం. ఈ పాటను వింటుంటే మనకూ గాలిలో తేలిపోతున్న భావం కలుగుతుంది. తాను అతన్ని వీడిపోనని, అతని నీడలా వెన్నంటే ఉంటానని ఓ భద్రతను, భరోసాను ఆమె అందిస్తుంటే వింటున్న శ్రోతలూ ఆనందానుభూతికి లోనవుతారు.
ఈ పాటలోని అతి సున్నితమైన భావుకత కారణంగా కావచ్చు ఇది ఆత్రేయ రాసిన గీతంగా కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. ఇలాంటి పాటలను శ్రీ శ్రీ రాసాడంటే నమ్మడం చాలా మందికి కష్టం. తన పదాలతో విప్లవ శంఖం మోగించే ప్రజాకవి ఇంతటి తీవ్రమైన ప్రేమానుభూతిని అక్షరబద్దం చేయగలడని నమ్మేవారు చాలా తక్కువ. శ్రీ శ్రీ ప్రేమ గీతాలన్నిటిని పరిశీలిస్తే అందులో మనల్ని ఆకర్షించేదీ ఆయన ప్రదర్శించే భావతీవ్రత. ఆయన రాసిన ప్రతి పాటలోనూ తీవ్రమైన భావావేశం నవరసాలలోనూ ద్వనిస్తూ ఉంటుంది. మనుష్యుల్ని, సమాజాన్ని, సిద్దాంతాల్ని ప్రేమించడంలో ఒకే రకమైన తీవ్రత కనపర్చిన శ్రీ శ్రీ ఏ భావోద్వేగాన్ని పై పైన తాకలేదు. మానవానుభూతులను గౌరవిస్తూ, వాటి లోతులను పరిశీలిస్తూ, ఆ భావ తీవ్రతను అనుభవిస్తూ, ఆ అనుభవాలను పదాలతో అలంకరించి సంపూర్ణమైన నిజాయితీతో ఆ అనుభూతులను అక్షరబద్దం చేసిన ప్రజా కవి శ్రీ శ్రీ. ప్రేమను గెలిపించుకోగల ప్రపంచం కోసం కాంక్షించారు. వ్యక్తిగత ప్రేమ నుండి సామాజిక ప్రేమ వైపుకు ప్రయాణించారు. అందుకే ఆయన ప్రేమ గీతాలలోనూ అద్భుతమైన సహచర భావం ప్రధానంగా కనిపిస్తుంది. ‘భానుని వీడని ఛాయగా’ మనుషులు తమ జీవన మార్గాలలో ప్రయాణించాలని కోరుకోవడం కేవలం వ్యక్తిగత ప్రేమ సూత్రమే అనుకోకూడదు కదా.
పాట 16
చిత్రం : మంచు పల్లకి (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : శ్రీ శ్రీ
నేపధ్య గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
పగలు రేయిలో జారక ముందే, వెలుగు చీకటిగా మారక ముందే… హా
కలుసుకుంటాం ప్రతి సాయంత్రం(2)
ఈ నిముషాలే మా సొంతం ఈ అనుభవమే అనందం
కలుసుకుంటాం ప్రతి సాయంత్రం(2)
హే హే ర రా రా ఓ హో….. ల లా లా
ఆశయాలు మాకెన్నో ఉన్నవీ… అవి ఆకాశంలో విహరిస్తున్నవీ…
దిగిరాలేక అణీగీమణీగీ దిగులుదిగులుగా నిదిరిస్తున్నవి
అందుకే… ఏం ఛేయాలో ఏమీ తోచక ఎటు పోవాలో అసలే తెలియక
కలుసుకుంటాం ప్రతి సాయంత్రం (2)
నిరాశ నిండిన ఈ కలికాలం,
అశాంతి మండిన ఆ కలికాలం
ఆకలి కాలం
నిరుద్యోగమే పండిస్తుంటే, ప్రతిభను కానక ఖండిస్తుంటే
ఇన్నాళ్లు… ఊరడింపులే దూరం కాగా, ఒకచో చేరిన కాకులాగా
కలుసుకుంటాం ప్రతి సాయంత్రం ఆ హా(2)
చిటారు కొమ్మని మిఠాయి పొట్లం… అహ అహ దొరికి తీరునని కలలే కంటూ
కఠోర జీవిత దురంత దుఖం కరిగిపొవునని కధలే వింటూ’
ఇలాగే.. ఒకరి బాధలే ఒకరికి తెలుపగ, ఒకరికి ఒకరు తోడై నిలువగ
కలుసుకుంటాం ప్రతి సాయంత్రం(2)
ఈ నిముషాలే మా సొంతం ఈ అనుభవమే ఆనందం (2)
హే హే ర రా రా ఓ హో….. ల లా లా
యువతరానికి చాలా దగ్గరగా వచ్చిన తలుగు కవి శ్రీ శ్రీ. యువత ఆశలను, కోరికలను, వారిలోని తృష్ణను, జీవితేచ్చను శ్రీ శ్రీ కవిత్వం ఎంతో లోతుగా ఆత్మీయంగా స్పృశించింది. ఆయన కవిత్వంలోని ఉత్తేజానికి తరువాతి తరాల యువకులూ ఆకర్షింపబడకుండా ఉండలేరు. తెలుగు సాహిత్యంలో యువత ఈ రోజుకీ ఇష్టంగా, ఆత్మీయంగా స్మరించేది శ్రీ శ్రీ కవిత్వాన్నే. యువకులలోని ఆవేశం దేశ భవిష్యత్తుకు పునాది అని నమ్మిన వ్యక్తి శ్రీ శ్రీ. అందుకే ఆయన వారి కోసమే రాసేవారు. వారిలోని ఆవేశానికి, ఆలోచనలకు, శక్తికి, సరైన సమయంలో దిశానిర్దేశం జరగాలని తపించేవారు.
చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో ఉండే యువత దేశ పరిస్థితులను, సమాజ అసమానతలను అనుభవిస్తూ పడే బాధ, వారిలోని కోపం కసి, దాని వెనుక తమ భవిష్యత్తు పట్ల ఆందోళనను శ్రీ శ్రీ ఎన్నో సందర్భాలలో అక్షరబద్దం చేసి వారికి అండగా నిలబడ్డారు. పెద్దలతోనూ వారి సాంప్రదాయ జీవితాలతోనూ ఘర్షణ ప్రతి తరంలో యువత అనుభవిస్తూనే ఉంది. దీన్ని ఛాందసవాదం నుండి పురోగతి వైపుకు దారి నిర్మించుకునే సంఘర్షణగా ప్రస్తావిస్తారు శ్రీ శ్రీ. స్వార్ధపు జీవితాలకు, విలాసాలకు, వ్యాపారాత్మకను సమర్ధించే యువకుల శైలిని ఆయన తీవ్రంగా ఖండిస్తూనే, ఆధికారానికి, అహంభావానికి తలవంచక పోరాడే యువతను ఆయన మనస్పూర్తిగా ప్రేమించారు. వారి పక్షానే నిలుస్తూ వారే ఈ ప్రపంచాన్ని ప్రగతి పథంలోకి నడిపించగల ధీరలని ప్రస్తావించేవారు. అందుకే ఆయన యువత మెచ్చే కవిగా తెలుగు సాహితీ ప్రపంచంలో నిలిచిపోయారు.
యువత హృదయాలను తడిమే సందర్భం సినీ కవిత్వంలో ఎప్పుడు వచ్చినా ఆ రోజుల్లో అందరికీ గుర్తుకు వచ్చిన కవి శ్రీ శ్రీ మాత్రమే. యువతరం ఆలోచనలను, ఆశయాలను, వీటి నడుమ సంఘర్షణను శ్రీ శ్రీ కలం సినమా సాహిత్యంలోనూ అత్యంత హృద్యంగా చితీకరించింది. ఉదాహరణకు మంచు పల్లకి సినిమాలోకి ఈ పాట చూద్దాం.
యువతరానికి సంబంధించిన సినీ కథలలో ఒక స్నేహ బృందాన్ని తెరపై చూపడం రివాజు. నిజానికి ఆ వయసులో స్నేహితుల చుట్టూ మన జీవితాలు తిరుగుతాయి. కుటుంబ కథలనుండి ప్రేమ కథలు, సామాజిక కథల వైపుకు సినీ ప్రపంచం మళ్లిన రోజుల్లో హీరో చుట్టూ ఓ స్నేహ బృందం ఉండటం రివాజుగా మారింది. మారుతున్న సామాజిక జీవిన పరిస్థితులకు ఈ స్నేహ బృందం ఆలోచనలు అద్దం పట్టేవి. డెభ్భైల చివరి నుండి కాలేజి రోజులకు సంబంధించిన సినీ కథలు తెరకెక్కడం మొదలెట్టాయి. అప్పటి సినిమాలలోని స్నేహ బృందాల నుండి ఇప్పటి సినిమాలలో హీరో స్నేహితుల దాకా ఒక పరిశీలనాత్మక దృష్టితో తెరపై జరిగిన చిత్రీకరణలను గమనిస్తే సమాజంలో క్రమంగా యువతలో వచ్చిన మార్పు, వేగంగా మారుతున్న వారి ఆలోచనల సరళి, ప్రామాణికతలు, సమాజం పట్ల వారి దృష్టికోణం, గమనించవచ్చు. యువతపై ప్రభావం చూపుతున్న ఎన్నో సామాజిక స్థితిగతులను విమర్శనాత్మక దృష్టితో గమనించడానికి ఆనాటి సినీ స్నేహితులకు సంబంధించిన చిత్రీకరణలతో నేటీ సన్నివేశాలను పోల్చి చూసుకుంటే అదే ఓ గొప్ప సామాజిక అధ్యయనం అవగలదు.
ఎనభైలలో యువత జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల కొన్ని నిగూఢమైన అభిప్రాయలతో కనిపించేవారు. పెద్దలతో ఘర్షణ సాధారణమే అయినా అది ప్రపంచ పోకడల పట్ల ఆలోచన కలిగించేది. ప్రగతి మార్గం గురించి ఆలోచింపజేసేది. ఆదర్శాల చర్చ విస్తృతంగా జరిగేది. వామపక్ష భావజాల ప్రభావం కూడా ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లో యువతలోని తిరుగుబాటు ధోరణికి ఈ పాట చక్కని ఉదాహరణ.
ఐదుగురు స్నేహితులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగ వేటలో ఉన్నారు. ఉల్లాసభరితమైన విధార్ధి దశ నుండి భాద్యతలలోకి ప్రవేశిస్తూ, తాము అంగీకరించలేని పెద్దల ఆలోచనలతో సంఘర్షిస్తూ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. తమను తాము ఎలా ప్రకటించుకోవాలో, నిలకడ కోసం ఆలంబనను ఎక్కడ వెతుక్కోవాలో తెలియని స్థితిలో ఉన్న రోజుల్లో వారంతా కలిసి సాయంత్రాలు గడుపుతుంటారు. చూసేవారికి ఏ గమ్యంలేక తిరుగుతున్న యువకుల్లాగే కనిపిస్తూనే ఉన్నా వారిలో సంఘర్షణ వారికి మాత్రమే సొంతం. తమను అర్ధం చేసుకోని పెద్దలకు, జీవితంలో ఆర్ధిక సుస్థిరతతోనే గౌరవాన్ని అందించే సమాజ వైఖరికి విసిగి ఒకరితో ఒకరు సమయం గడుపుతూ తమలోని ఆలోచనల వేడిని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్న ఆ ఐదుగురు స్నేహితుల మనసులను, జీవితంలో సెటిల్మెంట్ కు ముందు ప్రతి తరం పడే ఘర్షణగా అర్ధం అయేలా ఆ స్థితిని ఎంతో హృద్యంగా ఈ పాటలో చిత్రీకరించారు శ్రీ శ్రీ.
‘పగలు రేయిలో జారక ముందే, వెలుగు చీకటిగా మారక ముందే, కలుసుకుంటాం ప్రతి సాయంత్రం’ అంటూ సాగుతుంది ఈ పాట. పగలు రాత్రిలోకి మారక ముందు, వెలుగు పూర్తిగా చీకటి కాక ముందు అంటే అచ్చంగా సాయం సంధ్యలో తమ నేపధ్యాలను, కుటుంబాలను పక్కకు నెట్టి అచ్చమైన స్నేహ సౌరభం కోసం వీళ్ళు కలుసుకుంటూ ఉంటారు. ప్రతి సాయంత్రం, ఇంట్లో వయసుకు వచ్చిన పిల్లలు స్నేహితులను కలవాలని వెళ్ళిపోతూ ఉంటే పెద్దలకు వచ్చే కోపానికి అంతు ఉండదు. అది వారి భాధ్యతారాహిత్యం అని వారి అభిప్రాయం. కాని ఈ యువకులు ‘ఈ నిముషాలే మా సొంతం ఈ అనుభవమే అనందం’ అంటున్నారు. ప్రొద్దుటంతా వారు జీవించేది, గడిపేది ఇతరులు నిర్దేశించిన జీవితాన్ని. ఇతరుల అంచనాలకు అనుగుణంగా తమ అభిప్రాయాలను మార్చుకుంటూ రాజీపడిపోతూ సమయం గడిపే వారికి తమదైన స్పేస్ కోసం రోజులో కాస్త సమయం కావాలి. అందుకే ‘కలుసుకుంటాం ప్రతి సాయంత్రం’ అంటున్నారు. ఈ సాయంత్రాల సమావేశాలు జీవితాన్ని ఎదుర్కునే శక్తిని, వారికి అందిస్తాయి. ఇవి అందుకే ఊసుపోక కలుసుకునే సొల్లు కబుర్ల సమావేశాలు కావు. తమని తాము రీ చార్జ్ చేసుకునే అవకాశాలు. ఇంత లోతుగా యువత మనసు తెలుసుకుని వారి పక్షాణ రాసే కవి కాబట్టే శ్రీ శ్రీ ని అభిమానించే యువత ప్రతి తరంలోనే ఎక్కువే.
తమని పని పాటలేని పోకిరీలుగా అందరూ అనుకుంటారని, వెనుక గేలిచేస్తారని వాళ్ళకి తెలుసు. అందుకే ‘ఆశయాలు మాకెన్నో ఉన్నవీ… అవి ఆకాశంలో విహరిస్తున్నవి’ అని వాళ్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ ఆశయాలు ఆకాశం అంత ఎత్తులో ఉన్నాయి. అవి నేల మీద సాము చేస్తున్న వారికి అర్ధం కావు. అవి తీరని ఆశలుగానే కనిపించవచ్చు. కాని ఆశయాలు ఉండడం ముఖ్యం. అప్పుడే కదా వాటికోసం పని చేయాలనే కోరిక కలుగుతుంది. ఏ ఆశయం లేకుండా రాజీ పడిపోతూ జీవించే వారితో ఈ ప్రపంచానికి లాభం లేదు. మూసలో బతికే జీవితాలు ఎవరికీ మేలు చేయవు. కాని ఈ యువతకు ఆశయాలున్నాయి. అవి అందనంత ఎత్తులో ఉన్నాయి. వాటిని భూమికి దింపలేక కొట్టు మిట్టాడుతున్నారు. ఊహలకు, ఆశలకు, వాస్తవానికి నడుమ జీవితం మొదలయే తొలి నాళ్లలో ప్రతి మనిషి అనుభవించే సంఘర్షణను ప్రస్తావిస్తుంది ఈ చరణం. ‘దిగిరాలేక అణీగీమణీగీ దిగులుదిగులుగా నిదిరిస్తున్నవి’ అంటూ తమను ఏ దారి లేక సొంబేరులుగా తిరుగుతున్నవారిగా జమ కడుతున్న వారికి జవాబిస్తూ ‘అందుకే… ఏం ఛేయాలో ఏమీ తోచక ఎటు పోవాలో అసలే తెలియక కలుసుకుంటాం ప్రతి సాయంత్రం’ అని ఆ యువత గొంతుకగా మారి నినదిస్తున్నాడు కవి.
జీవితాలలోకి భాద్యతాయుతంగా ప్రవేశించబోతున్న రోజుల్లో మన చుట్టూ ఎందరో స్నేహితులను ఏర్పరుచుకుంటాం. దారి వెతుక్కునే క్రమంలో స్నేహితుల నడుమ గడిపే సమయం నుండే ఉత్సాహాన్ని, శక్తిని జుర్రుకుంటాం. మన అయోమయాలు, అనుమానాలు పంచుకోవడానికి అదే దారిలో ప్రయాణిస్తున్న వారి తోడు ఒక సాంఘిక అవసరం. ఆ స్నేహాలే మన ఆత్మవిశ్వాసానికి పునాదిగా మారతాయి. అప్పుడు ఏర్పడే బాంధవ్యాలు జీవితాంతం మన వెన్నంటి ఉండే విలువైన జ్ఞాపకాలు. దీన్ని ఈ పాట ద్వారా చాలా నిజాయితీగా స్పష్టటతతో ప్రస్తావిస్తున్నారు కవి.
ఈ రెండో చరణంలో శ్రీ శ్రీ ఓ చక్కని పద ప్రయోగం చేసారు. “నిరాశ నిండిన ఈ కలికాలం, అశాంతి మండిన ఆ కలికాలం” ఈ వాక్యంలో తాము అనుభవిస్తున్న సంఘర్షణను ఆ యువకులు ప్రకటిస్తూ తాము ఉంటున్నది ఓ కలికాలం అని అది నిరాశతో నిండి అశాంతి కలిగిస్తుందని చెబుతూ అదే వాక్యంలో ఆ కలికాలం వెంటనే ఆకలి కాలంగా మార్చి చిన్న ట్విస్ట్ ఇవ్వడం పాట లోతును పెంచుతుంది. వీళ్లు భాద్యత తెలియక తిరుగుతున్న యువత కానే కాదు. ప్రపంచాన్ని అర్ధం చేసుకోలేక కొన్నినిజాలను జీర్ణీంచుకోలేక ఒక రకమైన సాంస్కృతిక, మేధోపరమైన షాక్ కు లోనై తిరుగుబాటు చేస్తున్న యువత. ఈ, ఆ కలికాలాలను గమనిస్తూ ఇది ఆకలి కాలం అని గుర్తించే మేధస్సు ఉన్న యువత అది. ఆకలి అంటే ఏ రకమైన ఆకలి అన్నది చర్చించదగ్గ విషయం. ఆర్ధిక అసమానతలతో వచ్చిన ఆకలి, మేధోపరమైన అలజడలు రగిల్చిన ఆకలి, సాంప్రదాయపు ఛాందసబావాలతో యుద్దం చేస్తూ అనుభవిస్తున్న ఆకలి, ప్రేమ కోసం, తోడు కోసం మనసు, బుద్ది, శరీరం తపిస్తూ అలజడికి గురి చేసే ఆకలి. ఆ వయసులో ఇవన్నీ ఒకేసారి అనుభవంలోకి రావడం ఎంతో ఘర్షణకు లోను చేస్తుంది. ఆ ఆకలిని అనుభవించే యువత ఒకరికొకరు తోడుగా, ఒకరితో ఒకరుగా నిలిచి కాసేపు సమయం గడపడానికి తపన పడుతుంది. వారి ఆ సాయంత్రపు సమావేశాల ఆకలిని, అవసరాన్ని చాలా గొప్పగా ఈ పాట ద్వారా శ్రోతలకు వినిపిస్తారు కవి.
‘నిరుద్యోగమే పండిస్తుంటే, ప్రతిభను కానక ఖండిస్తుంటే, ఇన్నాళ్లు… ఊరడింపులే దూరం కాగా, ఒకచో చేరిన కాకుల్లాగా కలుసుకుంటాం ప్రతి సాయంత్రం’ అంటూ వచ్చే వాక్యాలలో ఉద్యోగాలు దొరకని అసహాయత, ప్రతిభను చులకనగా చూసే ప్రపంచం పట్ల కోపం, కసి, తమను ఊరడించేవారు లేని ఒంటరితనం వీటన్నిటి నడుమ ఈ సాయంత్రాల సమావేశాలు తమకెంత అవసరమే చెప్తున్నారు వాళ్లు. తమను కాకులంటూ విమర్శిస్తున్నవారితో ఒక చోట చేరిన కాకుల వలే తాము కలిసి కొంత సమయం గడపడమే ప్రస్తుతం తమ జీవితాలలోని ఆనంద క్షణాలని చాటుకుంటున్నారు. వ్యవస్థ పట్ల కోపం దానికి ఎదురొడ్డి నిలబడడానింకి శక్తిని కూడదీసుకోవలసిన యువత అవసరాన్ని నినాదంలా వినిపించే పాట ఇది. ఈ చరణంలో ‘ఒక చో కలిసిన కాకుల్లాగా’ అనే వాక్యం వస్తుంది. ‘ఒకచో అంటే ఒక ప్రదేశంలో అనే అర్ధం వస్తుంది. ఎంత పొదుపుగా శ్రీ శ్రీ పదాలు వాడతారో చెప్పడానికి ఈ వాక్యం ఉదాహరణ. సాధారణంగా ఒక చోట అన్న ప్రయోగాన్ని అందరం ఉపయోగిస్తాం. ఇక్కడా అలాగే ఉపయోగించవచ్చు. ఆధునిక యువత వాడుక భాషా పద ప్రయోగంగా దాన్ని చూపనూ వచ్చు. పాత చందోబద్దమైన పద్య రచనలో “ఒకచో నేలను బవ్వళించు…” లాంటి ప్రయోగాలు కనిపిస్తాయి. కాని సినీ పాటలో ఇలాంటి ప్రయోగాలను, అదీ ఆధునిక తరం ఉచ్చరించే తెలుగు భాషా పదాలకు జోడించి భాషా సౌందర్యం విషయంలో రాజీ లేదని, అది పాత కొత్తల మేలు కలయికగా ఉండాలని శ్రీ శ్రీ ఎన్నో సందర్భాలలో తన పద ప్రయోగాలతో చూపించారు. ఈ తరం వారికి ఇవన్నీ తెలుగు కవితా పాఠాలే.
అప్పటి దాకా కలల ప్రపంచంలో విహరిస్తూ, తమ శక్తి యుక్తులపై అపారమైన నమ్మకంతో, అంతులేని ఆత్మవిశ్వాసంతో జీవించిన ఈ యువకులకు వ్యవస్థలోని కఠోరతత్వం పరిచయమయ్యాక వారిలో భవిష్యత్తు పట్ల భయం కలగడం సహజం. కాని తమకూ మంచి రోజులు వస్తాయన్న ఆశ వారిని ముందుకు నడిపిస్తుంది. దీన్ని బ్రతికించుకోవడం వారికి అత్యవసరం. అందుకే తరువాతి చరణంలో ‘చిటారు కొమ్మని మిఠాయి పొట్లం దొరికి తీరునని కలలే కంటూ, కఠోర జీవిత దురంత దుఖం కరిగిపొవునని కధలే వింటూ ఒకరి బాధలే ఒకరికి తెలుపగ, ఒకరికి ఒకరు తోడై నిలువగ కలుసుకుంటాం ప్రతి సాయంత్రం’ అని చెప్తున్నారు వాళ్లు. తాము కలలు కన్న భవిష్యత్తు చిట్టరు కొమ్మన మిఠాయి పొట్లం అన్ననిజాన్ని గ్రహిస్తూనే ఈ అసంతృప్తులు, ఓటములను దాటి సుందర భవిష్యత్తు వైపుకు తాము ప్రయాణించగలమనే నమ్మకాన్ని బ్రతికించుకుంటూ, ఒకరి కష్టాలు మరొకరికి చెప్పుకుంటూ, ఒకరికి మరొకరు తోడుగా నిలుస్తూ తమ జీవన ప్రయాణంలో ఈ మజిలీని కలిసి దాటడానికి శక్తిని సంపాదించుకోవడానికి ఈ సాయంత్రాలు తమకు అవసరమని ‘ఈ నిముషాలే తమ సొంతమని ఈ అనుభవమే ఆనందమని’ ప్రకటిస్తున్నారు. ఈ చరణంలో వాడిన ‘దురంత’ అనే పదం విషాదాన్ని, ఊహించని వినాశనాన్నిసూచిస్తుంది.
తమ జీవితపు సంధికాలంలో తోడుగ నిల్చిన స్నేహాల విలువ, ఆ సమావేశాల శక్తి తెలిసిన ప్రతి ఒక్కరినీ ఈ పాట వారి గతంలోకి తీసుకెళుతుంది. అల్లరి చిల్లరగా తిరుగుతున్నారని భావించే యువతలోని మానసిక ఒంటరితనాన్ని, అభద్రతా భావాన్ని, భయాలను, తోడు కోసం, ఆలంబన కోసం వారు పడే ఆరాటాన్ని వివరించిన ఈ పాట యువతరం పట్ల శ్రీ శ్రీ కున్న అపారమైన ప్రేమకు నిదర్శనం. దీన్ని ఎస్.పి. అంతే ప్రేమతో గానం చేశారు. యువక రక్తపు వేడిని శ్రోతలు అనుభూతించేలా ఈ పాటకు రాగాలని, స్వరాలను కలుపుకుంటూ రజెన్ నాగేంద్రలు కట్టిన బాణీ చాలా ఉత్సాహంగా సాగుతుంది.











