కదిరిమామ కస్టం  

Spread the love

“మే నరిసీ, మన మల్లో టమాట చెట్టు మూర పెరిగింది,ఇబుడే   కట్టి నాటుకుని  వైరు లాగి పెట్టుకుంటే మంచిది . దీని ముందుండే కార్తులన్నీ వాన కార్తులు.  ఆవిటి గాలి కూడా ఎత్తుకుంటుంది. అవిటన్నిటికీ తట్టుకొని చెట్టు నిలబడాలంటే కట్టి బలంగా నాటుకోవల్ల . ఆ పనిని  అంత గట్టిగా చేసే నమ్మకస్తుడు మీ కదిరి మామ వొగడే.ఈ దిక్కల నాలుగైదు ఊర్లు రైతులందరూ ఆయప్ప చేతనే  కట్టి నాటించినారు. మనం కూడా ఆయప్పను  పట్టుకుంటే మంచిది. పద్దినాల్ల నుండి వాళ్ళింటి కాడ  గస్తీ  కాస్తా  ఉంటే   ఆయప్ప చిక్కలే .  నేను వాళ్ళింటికి తిరిగి తిరిగి దావబడి పోయింది. నెల ముందే పనికి పిలిచినోళ్ళు ఉండారంట. మన ఊరి మంగ అయితే  నెలదినాల ముందే నేను పైరు పెడతా ఉండా నువ్వు అండ చెక్కే దానికి రావాలని పది రూపాయలు చేతిలో పెట్టి చెయ్యి గిచ్చి చెప్పి వొచ్చినాదంట. మన చుట్టుపక్కల రైతులు వాళ్ళింటికాడ ఎడతెరుపు  లేకుండా ఉండారు. మనకు రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో ఏమో మీ మేనమామే కదా నువ్వు పోయి ఏదో ఒక రకంగా బంగ పోయి పిలుచుకొని  రాపో” అని నాకు చెప్పకొచ్చే  నా మొగుడు.

మా కదిరి మామ గురించి చెప్పల్ల.  ఆయప్పేమీ పదారేండ్ల బాల కుమారుడు కాదు అరవై  ఏండ్లు   పైబన్నోడు  గవర్నమెంటిచ్చే అరవై ఏండ్ల పించినీ    తీసుకుంటాడు. ఐదు మంది బిడ్లు. ముగ్గురు మొగోళ్ళు, ఇద్దరు ఆడోళ్ళు.  అందరికీ పెండ్లి నోము చేస్తే  వాళ్ల బిడ్డలు కూడా పెండ్లికి ఎదిగినారు. మా యత్త గెట్టి మనిసి .  ఆయమ్మ వొల్లే కాదు గుండికాయి, తలకాయి అన్ని గట్టివే . ఈ చింతకు ఆచింతకు పొదరదు. యట్లాఉపద్రమన్నా రానీ  ఆ యమ్మ మాట మగము మారదు.అంత గుండె నిబ్బరం కలిగిన ఆడది ఊరి పైకి లేదు అనోల్లే  అందరూ . 

బిడ్లందరు ఏరు బాగాలు పొయి వాళ్ల కాపరాలు వాళ్ళు చేసుకుంటా ఉంటే కదిరిమామ,పెండ్లాము వాళ్ళిద్దరూ  ఎవరి  సంగు  మాకొద్దు అని  వాళ్ల బతుకు వాల్లు బతకతావున్నారు.  నాకు బుద్ధి తెలిసి నప్పుడికి  కదిరి మామ గెట్టి పిడసకండ్లతో ఉండేవాడు. ఇప్పుడు ఆ కండలు అన్ని ఎమక్కంటినాయి. తలకాయి తెల్లబడింది. నోట్లో పొండ్లు సల్లుబన్నాయి ఇదే మార్పు.  మిగతా ఏమీ  మారలేదు. ఆయప్ప ఏ ఇంటికి కొచ్చిన తలకాయి దాల ముందరం తగులుతుంది.అంత జంపు, తాటికాయి వర్ణం రంగు,  ఆయప్ప  మగములో కోతి ఎలుగుబంటు మగాలు  రెండూ  అతుకులు వేసినట్టు కనపడతాయి . బూమి పుట్నబుడు పుట్న ఆదిమానవుడు ఈ యప్పెనేమో అనేటట్లు ఉంటుంది. 

మగం కొలమానాలు పక్కన పెట్టి మిగతా ఒళ్లంతా కొలిసినా  అందరికంటే మేటైన మొగోడే! రోగం రొచ్చు ఇబుటికీ  ఆయప్ప ఇరుపచ్చాలకు రావు ఎందుకంటే నాటిన వొరి మడికి నీళ్లు ఎక్కువైతె  పాచిపోతుంది తక్కువైతె  ఒలిపోతుంది. నీళ్లు ఏబుడూ వొరికర్రకి కాసుకొని(కమ్ముకొని) ఉండేటట్టు మడికి ఉద్దితీరు పెడతారు.  నీళ్లు ఎక్కువైతే  ఆ తీరింటి బయటకు ఎలిపోతాయి.   ఉద్దితీరే గతం కష్టాన్ని తిండిని ఏది ఎక్కువ తక్కువ కాకుండా వొల్లును సకత్తుగా  సమాలించుకుంటాడు మామ . పై మెరుగులు పక్కనపెట్టి చూస్తే  ఆయప్ప లోపల కండ,రగతం మెరుపే . బుద్ది  కూడా అంతే ! కాకపోతే ఆ యప్ప  పెళ్ళానికి  కొంచెం నాటకాల పిచ్చి . ఈ యప్ప మాత్రానికి ఒంటి మాటోడు. దిక్కల ఊర్లంతా మెచ్చేదల్లా ఆయప్ప నిజాయితీ అయిన పనే.   మీకు ఎంత చెప్పినా నాకు ఈ పొద్దు  మామ చిక్కుతాడో లేదో అనే లోబెరికి ఎలిబెరికి తోనే వాళ్ళ ఇంటి కాడికి పోతి. మామ ఇంటి ముందర కుసోని  తెగిన ఉట్టి సరి చేస్తా ఉండాడు ఆ యప్పను చూస్తానే  ఏరువాకుల పున్నానికి దేవరకొండ మీద జరిగే తిరనాల గుంపులో  పానబీకరాన ఆ జనాన్నంతా  తొలగదొ బ్బుకుంటా పోయి ఆ గుళ్లో ఉండే రామస్తామిని సూచినంత సంబరమయింది. 

అబుటికే వాళ్ళింటి ముందర నలుగురైదుగురు  మొగోళ్ళు కాసుకోనుండారు. నేను వాళ్లను చూసి నా పని జరిగినట్లేలే అనుకుంటా ”మామా ” అంటి . ఆ మాటతో నా కల్ల ఎగ చూసి “ఏమి నాయనా చాన్నాళ్లకు ఇట్లా వచ్చినావు ”అనే. “ నీకోసమే మామ సీఎం అన్న దొరకతాడు గానీ నువ్వు దొరికేటిగా లేవు. నా మొగుడు ఇరవై   దినాల నుండి తిరగతా ఉంటే నువ్వు చిక్క లేదంట. లేక లేక ఈసారి టమాటా రెండు కయ్యల పంటేసినాము. నువ్వే వాటికి కట్టినాటి వైరు లాగెయల్ల . ఈసారికి మమ్మల్ని నువ్వే గడ్నేయల్ల . రెండు దినాలు దయదలిస్తే అయిపోతుంది. ఈ పంట వేయడం ఇదే తొలిసారి.  అప్పు చేసి పెట్టుబడి పెట్టినాము. అందులోనూ ఇబుడు గాలివాండ్ల   కాలం.  నువ్వైతే గట్టి బద్రం పనిచేస్తావు మామ, ఈసారి మమ్మల్ని ఒగింటోళ్లను చెయ్యి” అని బంగ బోతి.   ఆయప్పకి ఆడోళ్ళ మీద కనికరం ఉంది. 

మా అత్త కూడా “ బిడ్డ అంతగా అడుక్కుంటా ఉంది వాళ్ళ పని అట్ల కంగానిచ్చిరాపో “అనే ఆ మాటకు మామ “ఎట్లమ్మ ముందుగా పిలిచినోళ్ళు ఉండారే” అనే.  నా పక్కనే వాడెవడో గోపాల్ రెడ్డి కుదరనే కుదరదు నాకు పంచేటు ,నా పనికి రావలసిందే  అని  వాదిస్తా ఉంటే మామ “ఆడబిడ్డయ్య ఎబుడు  రాదు వాళ్ల పని ఒక నాటికి ముగించుకొని వచ్చేస్తా ఈ పొద్దు కి ఇడసండయ్య “అని టవాలు బుజానేసుకుని గడ్డపార, కొడివిలెత్తుకొని నా యనకంటి వచ్చే . నేను మామను పిలుసుకొని పొలం కాడికి పోతే నా మొగుడు తెల్లమగ మేస్కొని  ఎట్లనో పట్టుకున్నావే అంటా  ఇద్దరూ పనిలోకి దిగిరి . 

నేను ఇంటికి బోయి కడి, చారు చేసుకొని, అన్నీ  తట్టకి పెట్టుకొని పైటాలన్నం(పొద్దున్న అన్నం ) ఎత్తుకొని పోతి . మామ ఆ యాలకే బండెడు కట్లు జెవిరినాడు.   ఆయప్ప పని కాడ ఉంటే నెత్తిన తడిగుడ్డేసుకుని పనుకోవచ్చు. చేసే పనిలో జూట (ఎగరగొట్టడం ) అనేదే ఎరగడు. అందరి కాటికి మేటైన పని చేసేదే కాక  పొద్దు కాటికి ఎంత పనైనా చేస్తాడు. డబ్బులు మాత్రానికి కంట్రోల్ గా ఇచ్చేయల్ల. పొలం పని పతొకటి సాదువేకతం సాదించి సంకలో పెట్టుకోనున్నాడు. సేద్యం పని ఏది చేసినా పంట ఒడిపేదంకా ఆ పని చెక్కు చెమరదు. అంత కొలబద్దంగా చేస్తాడు.  అయినోనికి కానోనికి, ఉన్నోనికి లేనోనికి అందరికీ ఒకటే నాణ్యంగా పని చేస్తాడు . మనిసి  అంచున ఉన్నీ  లేకపోనీ  ఆ పనిలో అలపము చెయడు. అందుకే పతి ఒక్కరు ఆయప్ప అంటే పానం ఇడుపు చేసి తోడుకొని పోతారు. అంత నమ్మకంగా పనిచేసే మనిసి  ఊరి పైకి ఒకడే ఉండేది. ఇద్దరి  మనుసుల పని కచ్చితంగా చేస్తాడు.

అన్నం పెట్టి “తిందువు రా మామ” అంటే వచ్చి కూసుండే .  ముద్ద సంగటి తినేసి పైకి లేయబోతే ”ఇంకా అర ముద్ద పెట్టుకో  పని మాత్రం చానా చేస్తావు తిండి తినకంటే ఎట్ల ” అంటే ఆ మాటకు మామ “వద్దమ్మా నా తిండి తగ్గిపోయి సుమారు ఇరవై  ఏళ్లయిపాయ.  పని ఎంతైనా చేస్తా కానీ తిండి తినలేను. ఇబుడి వరకు తలకాయి  నొచ్చి  పనుకొని ఎరగను నాకు వచ్చిన గండమల్ల కాలు యాక్సిడెంట్ అయ్యి  ఇనప రాడ్లు రెండు ఏసుకున్న . ఒకసారి గాజు పెంకు  తొక్కి బిందెడు రగతం పోయింది. ఈ రెండు గండాలు తిప్పుకోలేనివి. మనిషికి ఏగులేస్తే ఎయ్యి  గండాలంటారే అట్లా అన్ని తప్పించుకొని నిలబన్న . అయినా  నాయంత కాలించుకొని బింకంగా నిలబడి ఉండేది నేనే” అనే మామ. 

అది నిజమే సేద్యం చేసే తీరు చూస్తే మామకు విలువైన పతకాలే కట్టబెట్టొచ్చు. అంత పనిమంతుడు. మామ చేసే పనిలో నేను ఒక చెయ్యేసి  కట్టి అందిస్తా “కాదు మామ నీ కింత వొయిసొచ్చినా   నిన్ను పనికి పిలసను  ఇరు పోటీలు మింద వస్తా ఉండారంటే మంచి వయసులో ఇంగెట్ల  చేసుంటావు” అంటి. ఆ మాటతో ఆయప్ప మన ఇంటికి పిరుమైన సుట్టమొచ్చినబుడు వాళ్లకు కడుపు నింపను  ఇంట్లో ఉండే విలువైనవి పెట్టే దానికి ఎట్లా ఎతుకులాడతామో, అట్లా గతాన్ని ఎతుకులాడే . “నా కత  చెప్పాలంటే ఏడు పొగుల్లు  ఏడురేత్రిల్లు  అయితాయి. అంతకతుంది . నువ్వు ఇంటా నంటే నీకు కాసింత సోలిగా సెప్తా చూడు” అని మొదలుపెట్టే. 

“ మా ఇంటికి నేను పెద్ద కొడుకు.  ఇంటికి పెద్ద కొడుకై పుట్టే దానికంటే సాకలోల్ల గాడిదై   పుట్టేది నయమనేది పెద్దలు. నా ఎనక నలుగురు తోడబుట్టినోళ్ళు. మాయమ్మ యా నచ్చిత్రాన  నను  కనిందో గాని నేను తప్పటడుగులు ఏసేటబుడే మాయమ్మ నా చేత ”నాయనా ఆ గలాసందుకో, ఆచొంబందుకో,  ఆ కట్టందుకో   అని 

అబుటి  నుండే నా దగ్గర పనులు చేపిచ్చింది. “ఆవు పొల్లుబడేస్తే కట్టాలంటారు. మొగోడు పొల్లు పడేస్తే పని చేయాల . ఈ ఊర్లో పెద్ద నా కొడుకులు కి ఆ కాలాన సదువు అంటే

 ఆదీకంలేని(ఆదాయం లేని ) పని అని,  పైగా కర్సు  ఎక్కువ అని పోనిచ్చేదిలే . 

ఈ చుట్టుపక్కల అందరి కాడికి పెద్ద ఆస్తిపరులు, సావుకారులైన  రంగారెడ్డోళ్లది పెద్ద సంసారం. ఆ యప్ప కి ఐదు మంది కొడుకులు. నా ఈడొల్లే. వాళ్లు బడికి పోతే   నన్ను   మా నాయన ఆ  రంగారెడ్డోల్లింటికాడ తొలిత ఆవులు కాడికి జీతానికి ఏసినాడు. రంగారెడ్లోళ్ల ఆవుల దొడ్డి పెద్దది . మడకదున్నే ఎద్దులు పన్నెండ్లు గాండ్లు(జత), పాలావులు చిన్నచితకా అన్నీ యాభై పై మాటే .  ఇన్నూరు మేకలు, ఇన్నూరు గొర్రెలు, సుమారు ఎనబై ఎకరాల  సాగుబూమి ఉంది .  వాళ్ళ ఇంటికాడ ఇర వై  మంది జీతగాళ్లు, మూడు పూట్ల సంగటి గెలుకే దానికి ఆరు  మంది ఆడోల్లు .  రెండు మాల పల్లెలు రెండు మాదిగ  పల్లెల్లోని ఆడ మగ ముసలి ముతక  కూలికి వాళ్ళ దగ్గరనే పనిచేసే వాళ్లు.  వాళ్ళ ఇంటికాడ జీతానికి చేసే వాళ్లకు అన్నాలు తినేదానికి నీళ్లు తాగే దానికి సత్తు గిన్ని, సత్తుగలాసు ఇస్తారు. సంకురాత్రి కి జత గుడ్లు తీసిస్తారు. సంవత్సరానికి పది రూపాయలు దుడ్లు ఇస్తారు. యాలకు అంత తిని ఆ సత్తు గలాసు గిన్ని   కడుక్కోని మల్ల వాటిని కొట్టాల కప్పడంలోని  వాసాల కింద దూర్చుకునేది. మేము నీళ్లు పోసుకోవాలంటే వారానికకో లేక పదహైదు  దినాలకోనాడు  ఇండ్లకొచ్చి నీళ్లు పోసుకుని గుడ్లుతుక్కొని గొడ్డు తునకల కూర చేసుకోని తిని పోదుము.

ఆవులు తోలుకొని అడివికి పోతే నా ఈడోల్లు   శీనుగాడు, ఈరిగాడు నారిగాడు, నేను ,మా ఎనకాల  వొగ  పెద్దోడు. వొగొగదిక్కున వొగరం నిలబడి ఆవులు వంగెసేది. ఈరిగాడి దిక్కు పోయే ఆవులు సక్రంగా ఇంటికి రావు.ఎందుకంటే ఈరిగాడు ఎప్పుడు తిండిపోతు. సీతాపలం కాయలు, కొరడకాయలు, ఉలింజి కాయలు కోసం  చెట్లెంటిఎలిపోయేది. ఆవులు మళ్లేసేది వంగేసేది సక్కరంగా చేసేది లేదు. రకానికి ఒగ  మనిసున్నట్లు ఆవుల్లో కూడా రకానికి వొగావు  ఉంటాయి. కొన్ని ఒకటో రకం ఆవులు.  అవి  మందావులన్నిటినీ చూసుకొని మందలో విడిపోకుండా  ఉండే ఆవులు . వాటితో బయం లేదు . అవి యాటికి పోయి గెడ్డిమేసినా  ఒక్కంట ఆవులను  కనిపెట్టుకొని ఆయావుల్లోకి వచ్చేస్తాయి. ఇవి మంచి తీరుబాకైన ఆవులు. రెండో రకం యాడగెడ్డుంటే  ఆడ మేస్తా ఉండిపోతాయి. మల్ల వాటంచుకు మనిషి పోయి తారాడి తోలక రావల్ల, సామాన్యంగా అరసవు . ఇవి మూగావులు, సొప్పావులు, వీటితో కూడా బాదే !ఇక  మూడో రకంవి  దొంగావులు.  పచ్చని పొలాలు ఎంత దూరంలో ఉన్నా  మన కంట్లో కనుపాపను కత్తిరిచ్చి  ఆడికి ఎలిపోతాయి. పొలం మేసి పొలం గల్లోల్ల దగ్గర  తిట్లు దెబ్బలు తిని మనకి పట్టిస్తాయి . ఈ దొంగ గొడ్లతో  చానాపమా దం. నాలుగో రకం కడుపాత్రం ఆవులు . అవి  ఎక్కువ తిండికే ఎంపర్లాడుతాయి .వాటిని  ఎంత అరిసినా,తోలినా  రాకుండా మేస్తానే ఉంటాయి. ఐదో రకం రంపు ఆవులు . మనసుల నైనా ఆవుల నైనా  పొడిచే దానికి కాలుగీకి కండ్లు  ఎర్రజేసి తలకాయ పైకెత్తుకుని బుసపెడతా పైకి కలబడతాయి .పానాలు తీస్తాయి.  ఈ రకంగా ఐదు రకాల బుద్ది కలిగిన ఆవులుంటాయి.  

ఈరిగాడు ఎబుడూ  వాని తిండి ఎతుకులాటకోసం ఆవుల్ని దినామూ  ఇష్టానుసారం ఇడిసేదో  లేదా పొడిపించేదో  లేదా దొంగమరిపేదో చేస్తాడు. శీనుగాడేమో  ఎంచేపు   కోతి కొమ్మ,కర్ర బిల్లా, జిల్లా కోడి  ఆడతా వాడు కూడా ఆవుల్ని సరిగ్గా వంగెయ్యడు. నారిగోడు చానా సార్ధం నా కొడుకు.  పక్కనోనికి సాయి పడదామని ఉండదు. వాని ఉద్ది వరకు వాడు చూసుకుంటాడు. పతి పని వొంతేస్తాడు. నేను ఆ వయసులో కూడా ఆవులన్నిటిని మట్టంగా వంగేసుకొచ్చేది. పొడిచే ఆవులకు దూర దూరంగా ఉండి అదిలిచ్చేది. వాటి కాళ్ళ కాడికి సరిపోయేది నేను,  అయినా సరే నాకు చెప్పిన పని నేను సక్కగా చేసేది. నా ఎనకంటి ఉండే పెద్దాయన కూడా నా పని గురించి రంగారెడ్డికి ఆ వయసులోనే చెప్పేది. ఆవులు బాగా వంగేస్తాడని ఈరిగాడు నారిగాడు ఆవులు మేపలేదని రెడ్డి వాళ్ళిద్దర్నీ ఇండ్లకి ఎలిపొమ్మనే !

ఆ గొడ్ల  కాడ తిరిగి తిరిగి  నా కాల్లో ఇరగని ముళ్ళు లేదు.  తుమ్మ ముళ్ళు, బులిసి ముళ్ళు అయితే ఇరగతానే చీములు పట్టేది. కలమంద ముల్లించుకొని, ఆ ముల్లుతో ముండ్లు కుట్టుకొని, ఆ గాయాలకు నొప్పి సచ్చేదానికి  చిన్న కలమంద ఉడికించి కట్టేది. అట్లే చిన్నెరగడ్డ కూడా  ఉడికించి కట్టేది. అట్లే కుంటుకుంటా ఆవులు కాడికి పోయేది. ఈ రకంగా రెండేండ్లు మేపినా  . ఈ రెండేండ్లు ఆవులకు ముగుధాలు కుట్టేది, మెడ తాళ్లు కట్టేది, ఎదగొడ్లును  కనిపెట్టేది, ఆవులకు వచ్చే రోగాలు, అవిటికి నూరి  పెట్టే మందులు గురించి తెలుసుకుంటి. అబుటికి నా వయసుతొ మ్మిదేండ్లు.  ఆయాలకు ఈతకొట్టేది ,మాండ్లు ఎక్కేదినేర్చుకోనుంటి . మల్ల పది పదకోండేండ్లు కంతా గొర్లు కాటికి ఏసిరి.  అవి అంతే గుట్టడివి తిరిగి మేపాల్సిందే ,వాటిని నక్కలు తోడేన్లు రేసు కుక్కల నోటికి చిక్కకుండా కాపాడల్ల.  వాటికొచ్చే రోగం రొచ్చు చూసుకోవల్ల.  ఇట్లా రెండేన్లు గడిసె .  మళ్ళ రెండేళ్లు మేకల కాడికి ఏసిరి .ఆ మేకలు  నోటొక్క ఆకు తింటాయి .నూటొక్క  చెట్టు తిరగతాయి . అవి ఒగ  తావున నిలబడవు . అవి యాడికి పోతే ఆటికి   తిరగతానే ఉండల్ల.  అట్లా రెండేడ్లు  గడిచిపాయ . నాకు పదమూడేడ్లు వచ్చే , సేద్యం కాటికి ఏసిరి.  తొలిత పార చేతికిచ్చి నీళ్లు కట్టమనేది ,  తీర్లు నిలైమనేది,ఆ పని నేరస్తానే   ఎద్దులతో మడక  తగలగట్టేది. వలపటఎద్దు, దాపట ఎద్దును ఏ పక్క ఏ ఎద్దు లాగుతుందో ఆ ఎద్దును ఆ పక్కనే తగల గట్టాల.   చిన్న చిన్నగా కాడి మేడి కట్టించి దున్నమనేది. మేడిబట్టి మడక నిలేసే శక్తి కూడా ఉండేది కాదు. ముందర మడక ఎనకింటి సాలు దున్నల్ల.   తొలిత చేన్లు దుక్కి దున్నమంటారు. మడకెనకంటి సక్రంగా పోకుంటే ముందర మడకోడు దుక్కేలి బర్ర తో చెయ్యి గెనుపులు మిందనే  కొడతాడు. సక్కరంగా నడని ఎద్దులు కొన్ని ఉంటాయి,  పొగురుగా మనిసిని ,మడకను ఈడ్చుకొని పోయే ఎద్దులు కొన్ని ఉంటాయి, కొన్ని పొడిసేటివి  ఉంటాయి. వాటన్నిటి దగ్గర బయంగా మెసులు కోవల్ల, వాటిని సదుపు ,మచ్చిక  చేసుకొని సాలు నూలుకు(నేరుగా) తోలల్ల . అబుడే మడక నేర్సినట్టు.  బురద మడి దున్నేదానికి అబుడు  పంపిస్తారు.

బురద మల్లో మడక కట్టి సక్రమంగా దుక్కి జేసి , అండ మూల కొట్టి ,గెనాలు అలికి, సదరంగా నాటుకు సిద్ధం చేస్తే. ఆటికి సేద్యగాడు అయినట్టే .  ఈ పనులన్నీ నేర్సి సంకలో పెట్టుకునేసరికి నాకు పదైదు ఏండ్లు.  ఆయాలకే నేను బీడీలు తాగేది నేర్సుకున్న.  అదెట్లా అంటే నా ఎనకంటి ఉండే పెద్దోళ్ళు తాగేది. మాడాల కాలం బురద మల్లో మడక గడితే కింద బురద పైన వాన కురస్తానే ఉండేది . చలికి వనకతావుంటే ఏమి కాదు ఒక దమ్ము కొట్టరా అని ఇచ్చేది. అట్లా నేర్చుకుంటి. పనుల కాడ  కతలు,పాటలు,  పలక కొట్టేది. కపిల బానలు కుట్టేది,గూడ కుట్టేది,మెట్లు కుట్టేది,చర్మాలు ఉడకేసేది. వాటికి కర్రేసేది, పలక మూసేది, పిలంగాయి  కట్టి ఊదేది, ఇవన్నీ కూడా ఒక పక్క నేర్చుకుంటానే. రంగారెడ్డి ఇంటికాడ జీతానికి నిలిపేస్తి. ఎందుకంటే ఆయాలకు నాకు బుద్దొచ్చే. ఆ రెడ్లు కాడ జీతాని కుంటే వాల్లు కుసో అంటే కుసోల్ల  లే అంటే లేయల్ల, చేతికి అడ్డం వొచ్చిన పనల్లా  చేయల్ల.   దుడ్డు సరిగ్గా ఇచ్చేది లేదు. పొగులంతా కూలి  చేసుకొని మావిటాలకాడ ఇంట్లో నిమ్మలంగా పొనుకోవచ్చులే అనుకొని ఇంటికి ఎలిపోతి.  అబ్బుడు తల్లిదండ్రులకు బిడ్లను  సాకేది భారమయ్యేది కాదు.  ఏడేండ్లలబుడు నుండి బిడ్లు కండ్ల ముందర సంపారిస్తా ఉంటే ఏమి బాద . నాకు మీసకట్టు మొలిసింది. అబుడే నేను మగానికి సబ్బేసింది, పాపిట్లో  ఎంటికి  పడకుండా తలకాయ దువ్వుకునేది. అబ్బా అంటే అప్పుడు నాలుగైదు జతల గుడ్డలు ఉండేవి . అవే తెల్లగ  ఉతుక్కొని  ఏసుకునేది. ఊర్లో ఉండే ఈడైన వరసైన ఆడబిడ్ల తల్లిదండ్రులకు బుద్దిగా కనపడేది.సంపాదించింది అరదము ఇంట్లో ఇచ్చేది మిగతా నేనుకర్సు పెట్టుకునేది.

ఎబుడూ  జతలమింద్ద  ఎల్లి పోయేది. ఇది చూసి మా నాయన పెండ్లి చేద్దామని అనుకున్నాడు. నేను చేసే కష్టం చూసి ఊర్లోనే బిడ్డ నిచ్చేదానికి ఒచ్చిరి.  మీ అక్కను చేసుకుంటి . నేనెంత కష్టం చేస్తానో మీ అక్క అంతా పని దొంగ. నన్ను వుదిరిచ్చి,బెదిరించుకొని ఇబుటికీ  ఇంగరొంచేడికి  బతుకుతావుంది. పెళ్లయిన ఎనకింటినే  బిడ్లు పుట్రి .ఇప్పుడు నాకు డెబ్బైఏండ్లు . నేను పదేడుఏళ్ల వయసు నుండి ఇబుడి వరకు కూడా పార గడ్డపార పని చేస్తా ఉండా . నా ఈడోల్లు  ఎవరు  గాని నాతో పాటు ఇప్పుడు పని చేయలేరు. కొన్ని వందల ఎకరాలు బూములు అచ్చు కట్టింట ,ఎన్నో గెనాలు పోసుంట , ఎన్నో కట్లు నరికింటా ,నేను తొగిన మొన్నంతా ఒగ రాసి పోస్తే అది పెద్ద గుట్ట అవుతుంది. ఇప్పుడిదంకా  నేను చేసిన పని అంతా ఒక తావికేస్తే   ఒక పెద్ద చెరువవుతుంది. నేను నమ్మిన సిద్ధాంతమొకటే నాకు చెప్పిన పని నేను తూచా తప్పకుండా చేస్తా.  నా పని నాణ్యంగా ఉండల్ల. యజమానులు ఉంటే వొగ రకంగా లేకుంటే వొగ   రకంగా పని చేసేది నాకు తెలియదు. పనిచేసి కావాలంటే ఒగ రూక  కొట్లాడి తీసుకుంటా . నేను పనికి పోయిన తావనల్లా  నా పని చూసి వాళ్లే పది రూపాయలు తినుపో అని ఇచ్చినోల్లే  గాని నా కూలి డబ్బులు ఎగరగొట్టినోల్లు లేరు. ఆబులు డూబులు పనిచేయను.  పని నాకు చెప్తే దాన్ని నాలుగు రకాలుగా ఆలోచించి గట్టి బద్రమైన పనిగానే చేస్తా. ఇదొక్కటే నా జీవితంలోని నమ్మిండేది. ఇరవై  ఏళ్లకే సారాయి దాగేది మరిగినా  . అది కూడా పలకలు  కొట్టనుపోయినపుడు   అలవాటు చేసుకుంది.  ఇప్పుడు చేసే కష్టానికి నిత్య రోజు ఉండాల్సిందే.అబుడు ఒక ఇడుపుకి  మూడుముద్దలు సంగటి తినేది. తునకల్లు బాగా తిన్నా .ఆ తిండి ఇప్పుడు తినలేను కానీ  కొంచెం అట్లా ఇట్లా అదే పని చేస్తా .  వయసులో ఉన్నప్పుడు ఎన్ని చేస్తామో వయసు వొడిగినంక అవన్నీగెవనాని కొస్తాయి. మీ అక్క అంత మంచిదేమీ కాదు నా వాళ్లను పట్టించుకునిందే లేదు.దాని మీద   సూపడ  ఏసి తప్పించుకోను. నేను కూడా  అంత మంచోడిని కాదు. మాయమ్మా నాయన్ను సరిగ్గా ఇసారించలే . వాల్లు  సచ్చేసావుదల్లో  సూల్లా. ఈ పొద్దు నేను నా బిడ్ల మీద  ఆదారపన్ను, అంగలార్సను. ఆ పొద్దుటికి, ఈ పొద్దుటికి కస్టాన్ని నమ్ముకున్న. ఇది నా కత .ఇప్పుడు నీకు చెప్పింది గోరంతే l ఇంగా కొండంతుంది. ఇంకోనాడు చెప్పుకుందాం లే పో”  అనేసి మామ పని ముగించుకొని పార,గడ్డ పార బుజాన పెట్టుకొని ఇంటికి పాయ.  

మామ  నలుగురు చిన్నపెద్ద  మనుసులతో కుసున్నబుడు  ఈ పాట పాడతాడు.మామ గొంతు బాగుంటుంది

 ఏమి జేతయ్యా సోమీ  ఏమి జేతయ్యా  నాకూ  ఆ  సచ్చిపోయే  దశలే తెలియదు సోమి సత్తయ్యా !

 “చాలూ, చాలయ్యా సోమీ  నాకు, చాలునయ్యా సోమి  నాకు, ఈ సచ్చి పుట్టే సంసారాము చాలునయ్యా!”

 కొడుకులు మంచోళ్ళు అని కోరికయ్యా, సామి కోరికయ్యా,ఆ కొడుకు చేతులతోనే నాకు కొరివి పెట్టయ్యా, నాకు అగ్గిపెట్టయ్యా! 

“చాలు చాలయ్యా సోమి నాకు, చాలునయ్యా సోమి  నాకు, ఈ సచ్చి పుట్టే సంసారాము చాలునయ్యా!”

మంచి కోడలు కావాలని ,కోరి తెస్తయ్యా సోమీ కోరి తెస్తయ్యా ,ఆ కోడలమ్మ కడుపుకాలా  కొట్టేసయ్య కూడూ  తిట్టివేసెయ్య  

“చాలు చాలయ్యా సోమి నాకు, చాలునయ్యా సోమి  నాకు, ఈ సచ్చి పుట్టే సంసారాము చాలునయ్యా!”

మిద్దిలు  మేడాలు కడితి బుద్దిలేకయ్యా సామీ ,బుద్దిలేకయ్యా   

ఈ ఒక్క నవ్వూ   రాణీ కిచ్చి నిద్రపోతయ్యా,  నేనూ నిద్రపోతయ్యా  

“చాలు చాలయ్యా సోమి నాకూ, చాలునయ్యా సోమి  నాకు, ఈ సచ్చి పుట్టే సంసారాము చాలునయ్యా!”

మురుగు వాసన కొడతావని ముట్టుకోరయ్య సోమీ,పట్టుకోరయ్యా ,మట్టిలోపల  పారేసిరి ఒట్టిదాయయ్యా,  బతుకు వట్టిదాయయ్యా! 

“చాలు చాలయ్యా సోమి నాకు, చాలునయ్యా సోమి  నాకు, ఈ సచ్చి పుట్టే సంసారాము చాలునయ్యా!”

మామ పాడే ఈ పాట ఇంటానే మా బతుకంతా  మా  కళ్ళముందర కనపడుతుంది ! 

ఎండపల్లి భారతి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *