సముద్రం

Spread the love

దేవుడా! ఈయన్తో ఎందుకీ బ్రతుకు రాసి పెట్టావు అనుకుంది వసుంధర దూరంగా కనిపిస్తున్న కృష్ణా నదినీ, కొండల్నీ, ఎలక్ట్రిక్ స్తంభాల్నీ చూస్తూ.

ఒంటరితనపు బాధ తేలు విషంలా మెల్లమెల్లగా ఒళ్ళంతా పాకుతున్నట్టుంది.

దుమ్ముతో, పవర్ హౌస్ పొగ గొట్టంలోచి చిరాగ్గా గాలికి చిందరవందరగా లేస్తున్న పొగతో ఉక్కిరి బిక్కిరైపోతున్న ఆదివారం సాయంత్రం సూర్యుడు కొండవెనక ఎర్రటి ఆందోళనని రేపుతున్నాడు.

ఈయనెప్పుడొస్తాడు క్యాంపునుంచి? జీప్‌లో యింటికొస్తూ వొస్తూ లారీకి గుద్దుకుంటే ఎలా వుంటాడు? ఈ సూర్యుడి ఎర్రదనం ఆకాశంలో చిరిగిపోయినట్లై పోతాడా? మెదడేమవుతుంది? ‘నేను స్కూల్లో చదివేటప్పుడు నీది గొప్ప బుర్రరా’ అనేవారు మా లెక్కల మాష్టారు’ అని యింకెప్పుడూ గర్వంగా అనలేడు. ‘ఇవాళ సినిమా కొద్దుసుంధరా, చిరాగ్గా వుంది’ అని సిగరెట్ పొగ వొదుల్తూ అనలేడు. ఖరీదైన సిగరెట్ కాల్చే పెదాలూ, లండన్ నైట్స్ సెంట్ రాసుకునే శరీరమూ, తెలివి తప్ప యింకేం లేనితల ఏమీ వుండవు. పంగచీరి, ఒక తొడ నెత్తుర్లో తడిసి తలా, నడుం దాకా శరీరం, ఒరిగిపోయిన జీపు కప్పుకుపోయి చావులో నెత్తుర్లో – మృత్యువు గొప్ప ఆర్టిస్ట్ – వెయ్యి పికాసోల కంటే గొప్పది.

“చావుకీ, బతుక్కీ అర్థం లేదు వసూ” అంటాడు రవి. ప్రపంచంలో దేనికీ అర్ధం లేదంటాడేమిటతను? మనుషుల అస్తిత్వాలు అబ్సర్డ్, మీనింగ్‌లెస్ అంటాడే – రవి యివాళ రాత్రికొస్తాడా? రా రవీ! స్వీట్ రవీ!

“ఏమండీ…. సుదర్శన్రావు గారి జీపు లారీకి గుద్దుకుని…..” అని ఆఫీసు నుంచి ఫోన్ వస్తే, సినిమాలో హీరోయిన్‌లాగా “ఏమండీ!” అని గొంతు ఉలిపిరి కాయితంలా చిరిగిపోయేటట్లు అరవాలా? “ఛీ! ఛీ! అలా అరవడం చూస్తే నాకు చికాకు” అని ఒకసారి చావు ప్రసక్తి వచ్చినప్పుడు రవి అంటే “అయ్యా! రచయితగారూ! కాస్త మనుషుల్లో బతకాలి మీరు” – అన్నారాయన.

“అమ్మా! నే వెళ్తున్నా” వంటమనిషి.

బతికించింది. రవి వస్తానన్నప్పుడు మొన్నట్లాగా సాకులు చెప్పి దీన్ని పంపించాల్సిన గొడవ లేదు.

“ఎక్కడికే? రాత్రెవరు పడుకుంటారనిక్కడ?”

“మా ఆయనివాళ సినిమాకెళ్దామన్నాడండీ… మా పెళ్లై యివాల్టికి అయిదేళ్లమ్మా…. అందుకనీ” సిగ్గులు.

దీని మొగుడు దీన్ని సినిమాకు తీసుకువెళ్తాడు. హాయిగా పక్కన పడుకుని కబుర్లు చెబుతాడు. కావలసినంత తృప్తీ, సంతోషం యిస్తాడు…. ఫో! యూ ఆరె లక్కీ వుమన్….

“సరే! వెళ్లు.”

భోంచేయాలి. ఏ చెత్త యింగ్లీషు నవలో పట్టుకు పడుకోవాలి. దాన్నిండా సెక్స్. జాకెట్లు చిరిగిపోతాయి. శూన్యంలోకి రాకెట్లు పోతాయి…. తృప్తి. తృప్తీ…. తృప్తీ…. నాన్సెన్స్… నాకెందుకు లేదది?

వసుంధరకి చికాకనిపించింది. చర్మం కింద మనిషిలో ఎంత నీచమైన మృగం వుంది అనుకుంది.

సోఫాలో జార్లబడి కూచుంది. పొద్దుట చూచి మడత పెట్టకుండా పడేసిన పేపరు పొడుగ్గా వున్న సోఫాకి ఒక మూలగా అలాగే పడుంది. కళ్లు గాబరా పడ్డ గండుచీమల్లా పేపరులో అక్షరాల మీద పరుగెత్తాయి :

చదవడం ఆపేసి మనసులో ఉత్తరాలు రాసింది వసుంధర.

డియర్ ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్…. రీడ్ గిన్స్‌బెర్గ్స్ పొయిట్రీ…. డ్యాం యువర్ వియత్నాం పాలెసీ…. డియర్ ఇందిరాగాంధీ…. యు లుక్డ్ నైస్ వెనై సా యూ యిన్ విజయవాడ. హూ ఐరన్స్ యువర్ శ్యారీ? ఇండియా యిజె పూర్ కంట్రీ…. సిక్ కంట్రీ…. ఓ యువర్ గవర్‌న్మెంట్…. ఓ! ఓ!…..

రాయాలి. రాయాలి. రవిచ్చిన పెన్‌తో రాయాలి. కొత్త శానిటరీ టవల్సున్న బాక్స్‌లోంచి ఆ పెన్నుని తీసి యింకెక్కడైనా దాయాలి.

వాచీ చూసుకుంది వసుంధర. ఆరున్నరవొస్తుంది.

పగలంతా ఏమైపోయింది?

లేచి వెళ్ళి లైటాన్చేసింది.

ఆవులిస్తున్న ఎడారిలా వున్నట్టు గది. కిందికి వేళ్ళాడుతున్న పాముల్లాగా టేబుల్ కాళ్ళు. ఒంటరితనపు ముళ్ళకంపలకి సమాధి చేసినపట్టు ఒళ్ళు. రవి చెప్పినట్టు అస్తిత్వంలో ఎంత బాధ వుంది. గాయాలు చేస్తుంది అస్తిత్వం….. యివాళొస్తానని మొన్న చెప్పాడు రవి. వస్తాడా? వస్తే బావుణ్ణు.

హఠాత్తుగా మళ్ళా ‘చావు’ సంగతి మనసులోకి వచ్చింది వసుంధరకి. చికాకనిపించింది.

చచ్చిపోతే యీ ప్రపంచంతో వున్న కమిట్‌మెంట్ పోతుంది. అంతకంటే ఏంకాదు. కాని ఎంత స్వీట్ కమిట్‌మెంట్ యిది? ఇంకోసారి బతకడానికి అవకాశం వస్తే యీ మనుషులందరూ ఏం చేస్తారు? ఎక్కిన కొండేగదా ఎందుకు లెద్దురూ అంటారా? పూర్ మనుషులు!

హద్దులు కనిపించని పెద్ద ఖైదులో తిరుగుతూ స్వేచ్ఛగా వున్నామనుకుంటున్నారు. ఆందోళననీ, భయాల్నీ, ఆయిల్‌కంపు దుమ్మునీ శ్వాసిస్తూ, సిగరెట్ల మధ్య, సినిమా హాళ్ళలో, సింగారాల్లో అస్తిత్వాన్ని మరచిపోతున్నామనుకుంటూ దాన్ని నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నవాళ్ళు…. నేను ……. నేనూ యింతే….. మీనింగ్లెస్, అబ్సర్డ్.

అర్థం కాని వెగటేదో అనిపించి వసుంధర భోజనం చేయకూడదనుకుంది. కాని తర్వాత ఆకలేస్తుందని భోజనం చేసేసింది.

బయట సన్నగా చినుకులు పడుతున్నాయి. కింది తలుపులకి గడియపెట్టి మేడమీదకి వచ్చేసింది వసుంధర,

రవి రాడేమో! చినుకులు కాస్తా వర్షమైతే! హెల్! చినుకులు చినుకులుగానే వుండాలి. ‘చలి వేస్తుందండీ’ అని చినుకులు పడుతున్నప్పుడంటే ‘రగ్గు కప్పుకో వసూ… కప్పనా!” అని రగ్గు కప్పాడాయన. పూర్ ఫెలో! నాకిప్పుడది కావాలి అని ఆడది నోరు తెరచి అడక్కుండా సటిల్‌గా అంటే అర్థం చేసుకోని మగాడు…. ‘మీరు క్యాంపులకెళ్ళి రాత్రులు రాత్రులక్కడే వుండిపోతే భయమేస్తోందండీ’ అంటే ‘పనిమనిషుందిగా పడుకోమంటే పడుకుంటుంది…. మన ఆల్సేషియన్ కూడా వుంది కదా…. భయమెందుకు?’ అంటాడాయన. ‘మా ఆల్సేషియన్‌కి రోజుకి నాల్రూపాయలు ఖర్చండీ…. ఈ గులాబీ బెంగుళూర్ నుంచి తెప్పించా. రోటరీ సెక్రటరీ అయినప్పుడు పార్టీకి రెండు వేలొక్క మూలకి రాలేదంటే నమ్మండి – అందమైన భార్యా, కుక్కలూ, రోటరీ…. మగాడికి ఎంత వానిటీనిస్తాయి…. ఈ ఆల్సేషన్ రవిని చూచి మొరక్కుండా గదిలో కట్టేయాలి.

మేడమీద వరండాలో కూచుంటే చీకటి కుప్పగా గడ్డకట్టుకుపోయినట్టు కొండలు. ఎలక్ట్రిక్ దీపాల వెలుగుని అలల మీద ముక్కలు చేస్తున్న కృష్ణ. పవర్ హవుస్ గొట్టం…. వంతెన మీద పోతున్న రైలుబండీ చేస్తున్న చప్పుడు….. చికాకు…. విసుగు….

సోఫాలో నడుం వాల్చింది వసుంధర. నిద్ర పట్టేసింది కొంచెంసేపట్లో. వులిక్కిపడి లేచింది తర్వాత.

నిద్రెప్పుడు పట్టింది? మళ్ళీ అదే కల…. ఆయన లారీకింద పడిపోయాడు. శవాన్ని -నెత్తురు ముద్దని నలుగురు మోసుకు తీసుకువెళ్ళి పెద్ద నీళ్ళగుంట పక్కనున్న పొట్టి, మొండి తాటిచెట్టు కింద పడుకోబెట్టారు. గుంటకి ఇవతలివేపు ఎత్తుగా వున్న యింకో తాటిచెట్టు గాలికి బరువుగా కదుల్తున్న ఆకుల్తో ఠీవిగా నిటారుగా వుంది. దాన్నీడ గుంటలోని నీళ్ళలో పడుతూ విచిత్రంగా నల్లటి అందంతో మెరుస్తోంది. ఇంతలో ఆయన శవం లేచి కూచుని ‘నేన్చావలేదు’ అని అరిచింది. ఆకులున్న తాడిచెట్టు మాయమైపోయింది.

కాలింగ్ బెల్ మోగుతోంది…. బెల్ విని తను వులిక్కిపడి లేచిందో, వులిక్కిపడి లేచినప్పుడు బెల్ మోగిందో వసుంధరకి తెలీలేదు.

రవే వచ్చుంటాడు.

కిందికి వెళ్ళి తలుపు తీసింది వసుంధర. రవే…. రెయిన్‌కోట్ వేసుకుని.

“ఓ నిమషం ఆగు” అని వెళ్ళి అక్కడే తిరుగుతున్న ఆల్సేషియన్ కుక్కని గదిలో కట్టేసి వచ్చింది వసుంధర “రా! లోపలికి రా!” అంది.

అటూ యిటూ చూసి, గుమ్మం దాటి లోపలికి నాలుగడుగులు వేసిన రవి, వసుంధర అతని రొమ్ముల మీద కుడిచేయి వేసి వెనక్కి తోస్తున్నట్టుగా ఆపితే ఆగి, “నిమిషంసేపు బెల్నొక్కినా రావే….. నిద్రపోయావా?” అన్నాడు.

“అవునుగానీ…. బూట్ల బురద గుర్తులు గచ్చుమీద పడ్తున్నాయి… బూట్ల నక్కడ వదిలేయరాదూ!” అని వెళ్ళి కాళ్ళు తుడుచుకునే తివాచీని కుడికాలుతో జరుపుకుంటూ వచ్చి బురద గుర్తుల్ని తుడిచేసింది వసుంధర. “రెయిన్‌కోట్‌ని బాత్రూంలో వేలాడదీసి వస్తాను” అని రవి దగ్గర రెయిన్‌కోట్‌ని తీసుకుని బాత్‌రూంలో కొక్కానికి తగిలించి వచ్చింది.

“నువు రావేమో అనుకున్నా రవీ!”

రవి నవ్వుతూ వసుంధర నడుం మీద ఎడంచేయి వేసి మెట్లెక్కుతున్నాడు.

“మై స్వీట్ డార్లింగ్!” అంది వసుంధర.

వదుల్తున్న కంప్రెస్‌డ్ గాలిలా ఆనందం శరీరంలో.

ఇద్దరూ మేడమీద వరండాలోకి వచ్చారు.

“మన గదిలోకి పోదామా? బయటెందుకూ చలిగా వున్నట్టుంది” అన్నాడు రవి.

వసుంధర నవ్వింది – ఫకాలున.

“ఎందుకు నవ్వుతావ్?” ఆశ్చర్యంగా అడిగాడు రవి.

“మన గదిలోకి వెళ్తున్నామని!” ‘మనగదిలోకి’ నొక్కి పలికి నవ్వుతూ అంది వసుంధర.

రవీ నవ్వేశాడు. వసుంధర నడుం మీద చెయ్యి తీసి జేబులోంచి సిగరెట్ పెట్టి తీశాడు. అందులోంచి ఒక సిగరెట్ తీస్తూ వసుంధరతో గదిలోకి నడిచాడు. వసుంధర గదిలో లైటాన్చేసింది. అతను అగ్గిపుల్ల గీసి సిగరెట్ వెలిగించుకుని గాడ్రెజ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు – సిగరెట్ పెట్టె మీద చూపుడు వేలితో టకటక కొడ్తూ.

“మంచినీళ్ళు కావాలి వసూ”.

“తెస్తానుండు”.

వెళ్ళి గాజు గ్లాసు నిండా మంచినీళ్ళు తెచ్చింది వసుంధర.

“సిగరెట్టైన తర్వాత తాగుతాలే… టేబుల్ మీద పెట్టేయ్”.

పెట్టింది. “భలేవాడివే!” అంది నవ్వుతూ, అతనూ నవ్వాడు.

సిగరెట్ పెట్టెని ఎడమ తొడమీద పెట్టుకుని దానిమీద ఎడం చేతి చూపుడు వేలితో మెల్లిగా టకటకకొడ్తూ చూస్తున్నాడు.

“ప్లీజ్! కం డియర్….” అంది వసుంధర కుర్చీ పక్కన నిలుచుని.

కుర్చీని చూశాడు రవి. చీరా జాకెట్ అన్ని కుర్చీమీద కుప్పగా కాలిన రబ్బరు

ముడుచుకు పోయినట్టు, వాటికి అంతకుముందున్న అందమైన ఆస్తిత్వం అంతా పోయి…….

“కొవ్వు బొమ్మలా వున్నావ్” అన్నాడు వసుంధర్ని చూస్తూ.

వసుంధర అతని దగ్గరికొచ్చి భుజాల మీద చేతులు వేసింది.

అతను సిగరెట్ కింద పడేసి కాలితో తొక్కాడు పాదం చుర్రుమంటుందేమో అనుకుంటూ.

“ప్లీజ్ ! డార్లింగ్! రవీ!”

కుర్చీమీదున్న జాకెట్ చీరల కుప్ప అతని స్లాక్ షర్ట్‌నీ, ప్యాంట్‌నీ ఆహ్వానించింది.

బట్టలకుప్ప అతనికి ముడతల ముడతల పెద్ద మొద్దుపాములా అనిపించింది.

అసహ్యం అనిపించింది.

“ఓ! స్వీట్!…. అబ్బ…. చెమట కంపు…. స్నానం చేయలేదా రవీ!” వసుంధరకి ఏదో వెగటనిపించింది. ఉత్సాహం మెట్టు కిందికి జారినట్టనిపించింది.

“పెదాలేకాదు ముద్దు పెట్టుకునే చోటు….” అన్నాడు రవి వసుంధర మాటనసలు విననట్టే.

పిచ్చికుక్క కాటులాంటి మాటన్నాడు రవి – అనుకుంది వసుంధర. మళ్ళీ ఉత్సాహం పుంజుకున్నాగానీ ఏదో చికాకుమాత్రం గుండెలో సుడి తిరుగుతూనే వుంది.

మంచం దగ్గరకు వెళ్తూ. “వాచీలు బద్దలు చేసేద్దామా!” అన్నాడు రవి.

“నువ్వు మీ రచయితల భాష మాట్లాడుతున్నావ్ చికాకు నాకు”.

అతను నవ్వాడు.

“ఆగు… గుక్కెడు మంచినీళ్ళు తాగనీ దప్పిగా వున్నట్టుంది-” లేచి వెళ్ళబోతూ వసుంధర అంటే, “నిట్టూర్పులాయె మరి!” అన్నాడు రవి.

నవ్వుతూ వెళ్ళి గ్లాసులో నీళ్ళు సగానికైనా తాగకుండా వచ్చేసింది వసుంధర – సంతోషం ఉబుకుతుంటే – గుండెలో గొంతులో.

అతను వసుంధర్ని దగ్గరకు తీసుకోబోతున్నాడు; కాలింగ్‌బెల్ రింగ్‌మంది.

ఇద్దరూ వులిక్కిపడ్డారు. గాబరా పడ్డారు. అర్థం కాని చూపుల్తో మొగాలు చూసుకున్నారు.

గంగబా మంచం దిగి కుర్చీ దగ్గరకు పోయారు. ఆదరా బాదరా బట్టల్ని లాక్కున్నారు.

పాములు – అనుకున్నాడు రవి.

కాలింగ్ బెల్ అలానే మోగుతోంది.

వసుంధర చికాగ్గా, కోపంగా, అసంతృప్తిగా రవి వైపు చూసింది. కాలింగ్ బెల్ మోగుతున్న వైపు చూసింది.

“వస్తున్నా!” అంటూ అరచి, “రవీ బట్టలేసుకో తొరగా…” – లంగా వేసుకుంటూ “ఆయనగానీ కొంపతీసి….” ‘బ్రా’ వేసుకుని, జాకెట్ తొడుక్కుని (రవి ప్యాంట్ తొడిగేసుకున్నాడు – అండర్వేర్‌ని ప్యాంటు జేబులోకి కుక్కేసి)

“ఇదిగో…. జాకెట్టు గుండీలు పెట్టుకుంటూ “ఈ గదిలోనే వుండు” చీర కట్టుకుంటూ (రవి ప్యాంట్ గుండీలు పెట్టేశాడు. బనీను వేసుకుని….) “తలుపేసేస్తా… నేనూ ఆయనా…..” – కుచ్చిళ్ళు సరిచేస్తూ “మా గదిలోకి వెళ్ళిపోతాం….” తల సరిచేసుకుంటూ (రవి స్లాక్ షర్ట్

వేసేసుకుని) – “తర్వాత నువ్వు వెళ్ళిపోదువుగాని వీల్చూసుకుని….” చెంగు కప్పుకుంటూ (స్లాక్ గుండీలు పెట్టుకుంటున్నాడు రవి.) “వస్తున్నా….”

కిందకి వెళ్ళబోతూ రవి పూర్తిగా కాల్చని సిగరెట్‌నీ, తను పూర్తిగా తాగని నీళ్ళగ్లాసునీ చూసింది వసుంధర.

నిట్టూర్చి, “రవీ సిగరెట్ బయట పారేయ్” అంటూ అతనున్న గది తలుపుకి బయట నుంచి గొళ్ళెం వేసేసి, కిందికి పరుగెత్తింది.

తను కింద పడేసిన సిగరెట్‌ని తీసి సిగరెట్ పెట్టెలో పెట్టేశాడు రవి. సిగరెట్‌ని కాలితో కింద రాసినప్పుడైన నుసిని పాదంతో తుడిచేశాడు.

గదిలో గోడలు దగ్గరకు జరుగుతూ తనని జీవసమాధి చేస్తున్నట్టనిపించింది అతనికి. రాకపోయినా బావుండేది. వర్షం పడుతున్నా వచ్చా…. ఛా! ఛా! సుదర్శన్రావు వచ్చుంటాడు, సినిమాలో హీరోయిన్ తండ్రిలాగా, విలన్‌లాగా. ఇంతరాత్రి ఎవడేడవమన్నాడు వీణ్ణి. (టైం చూసుకున్నాడు.) ఎప్పుడో యింకా రెండు రోజుల తర్వాత మంగళవారం వస్తాడంది. వసుంధర…. బ్యాడ్‌లక్…. రెయిన్‌కోటూ, బూట్లూ ఏంచేస్తుంది వసుంధర? బూట్ల బురద గుర్తులు తుడిచేసింది. మంచిదే అయింది.

గదిలో ఉక్కపోస్తున్నట్టనిపించింది అతనికి. ఫ్యాన్ వేయాలనుకున్నాడు. భయం వేసి వేయలేదు. జేబురుమాల తీసి నుదిటినీ, మెడనీ తుడుచుకున్నాడు.

గది తలుపు తెరుచుకుంది.

“బతికాం…. ఆయనకాదు…. టెలిగ్రాం…. రేపొస్తున్నాడు…. మీ ఫ్రెండ్ క్రిష్ణ కూడా వస్తున్నాట్ట….” గదిలోకి వచ్చి అంది వసుంధర.

రవేం మాట్లాడలేదు. వసుంధరని చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో అసంతృప్తినీ, మొగంలో ఏదో చికాకు కనిపించాయి.

“హు….” – నిట్టూర్చి – “కబుర్లేవైనా చెప్పు….. అబ్బ….. ఆ రెయిన్కోటూ, బూట్లూ, ఎక్కడ దాయాలో తెలియక చచ్చాననుకో – తీసికెళ్ళి బొగ్గుల్డబ్బాలో పారేసా…. రెయిన్‌కోటుకి మసై వుంటుంది. ఏవనుకోకు….” అని మంచం మీద కూచోబోయి నెరవేరని కోరిక అక్కడ కూచుంటే జ్ఞాపకం వస్తుందని కూచోకుండా వెళ్ళి టేబుల్ ముందున్న కుర్చీలో కూచుంది వసుంధర.

రవేం మాట్లాడలేదు. అక్కడ నిలబడి వుండటం అతనికి వెగటుగా, చికాగ్గా వున్నట్టనిపించింది. “వెళ్ళిపోతా వసూ!” అనాలనుకున్నాడు. అనలేకపోయాడు. మగతనాన్ని కించపరచే మాటది – వసుంధర దృష్టిలో చులకనైపోవాలి. నేను మగాణ్ణి.

తను పూర్తిగా తాగని గ్లాసులో నీళ్ళని చూసి, అంతకుముందు రవి కిందపడేసిన సిగరెట్ అక్కడ వుందేమోనని చూసింది వసుంధర.

“కూచో” అంది.

“నే వెళ్తా, ఒంటిగంటవ్వస్తుంది”.

“నీ యిష్టం”.

“స్వీట్ డార్లింగ్! ఉండబ్బా!” అంటూ తనే భుజాల మీద చేతులు వేసి మంచం దగ్గరకు లాగుతూ అడుగుతుందేమో అనుకున్నాడు రవి. మళ్ళా అతనికి చికాకనిపించింది. కుర్చీలూ, మంచం, గోడలూ గదిలో వున్నవన్నీ చచ్చి కుళ్ళికంపు కొడుతున్న కుక్కల్లాగా అనిపించాయి. వెగటేసుకువచ్చింది.

“రేపు సాయంత్రం రా! ఆయనా క్రిష్ణా వస్తున్నారు గదా. అంతా కబుర్లు చెప్పుకోవచ్చు”.

“సరే!” రవి గదిలోంచి బయటకు నడుస్తూ వుంటే అతని వెనకే నడిచింది వసుంధర కూడా. ఇద్దరూ కిందికొచ్చారు. కింద చిన్న బల్బు మసగ్గా వెలుగుతోంది.

నీ రెయిన్కోటూ, బూట్లు తెస్తానుండు” అని వెళ్ళి వాటిని తీసుకొచ్చింది. రెయిన్‌కోటుని అందుకుని చేతిమీద వేసుకుని, బూట్లు వేసుకున్నాడు రవి.

వసుంధర తలుపు తీసింది. బయట చినుకుల్లేవు. ఆకాశం నల్లగా వుంది. బయటికి వెళ్ళబోతూ రవి వసుంధరని ముద్దు పెట్టుకోబోయాడు.

“నో రవీ! ప్లీజ్!” అతని మొగానికి చెయ్యి అడ్డుపెడుతూ అంది.

రవి కొంచమే కాల్చిపారేసిన సిగరెట్టూ, తను కొంచమే తాగి వదిలేసిన మంచినీళ్ళ గ్లాసూ వసుంధర కళ్ళముందు మెరిసాయి.

“వోకే! వెళ్తా మరి”. అని రవి అటూ యిటూ చూసి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్తుంటే, కొంచెం దూరంగా వున్న ఎలక్ట్రిక్ స్తంభం లైటు వెలుగులో అతని నీడ పాడుగ్గా కనిపిస్తూ అతను వెళ్తున్నకొద్దీ పొట్టిదైపోతుంటే చూసి చిరునవ్వు నవ్వుకుంది వసుంధర.

తలుపు వేసి, వెళ్ళి గదిలో వున్న ఆల్సేషియన్ కుక్కని వదిలింది. మేడమీద గదిలోకి వెళ్లింది. తలనొప్పిగా వున్నట్టుంటే వెళ్లి మంచంమీద పడుకుంది అసంతృప్తి, నిరాశా గదిలో నిండిపోయాయనిపించింది…. రవీ తనూ బట్టల్ని కుప్పగా పడవేసిన కుర్చీ దగ్గర, కింద, అరచేయంత వున్న చిన్న నోటు బుక్కు కనిపించింది. మంచం దిగి వెళ్లి పుస్తకం తీసి చూసింది. కొత్త నోటుబుక్కు, రవిది. పుస్తకంలో మొదటి పేజీ మీద ‘రవి’ అని వుంది. లోపల ఏవన్నా రాసుందేమోనని తర్వాత పేజీలు తిప్పింది. మూడో పేజీలో –

‘యానీ ఫ్రెంచ్, స్కూటర్, యార్డ్‌లీ పౌడర్, హకోబా చీర, లిబర్టీ బ్రా కొన్లేను.

ఇవన్నీ యింకా ఎన్నో వుంటే తనకు అస్తిత్వం వుంటుందనుకుంటుంది ఆడది. మొగాడి మీద ఆడదాని ప్రేమకు యివన్నీ పునాదులు. ఇన్నీ యిచ్చి ఆడదాని కామం తీరేట్లు చేయాలి మగాడు. లేకపోతే వాడికి అస్తిత్వం లేదు ఆడదాని దృష్టిలో, మీనింగ్లెస్…..

కథ రాయాలి”.

ఇంకో రెండు పేజీల తర్వాత-

“Marriage is popular because it combines the maximum of temptation with the maximum of opportunity – Shaw”.

దానికిందే

“విజయవాళ్ళో ఎండలు, కొండలు, ముండలు

దాని తర్వాత పేజీలో

“దట్టమైన అడవులలోని నిగూఢ రహస్యాలు దాచుకున్న కన్నులు కలదానా ఆడదానా….

నాకు తల్లివి నెచ్చెలివి చెలివి.

నన్ను కౌగలించుకున్న పెద్దపులివి”.

ఎంత బాగా చెప్పాడు తిలక్-

ఆ తర్వాత పేజీల్లో ఏం రాసిలేదు.

ఆ నోట్‌బుక్కుని బయటకు విసిరి పారేయాలనుకుంది కానీ రవి అడుగుతాడేమోనని దాన్ని దిండుకింద పడేసి పడుకుంది.

మరుసటి పొద్దుట వస్తారనుకున్న క్రిష్ణా. సుదర్శన్రావూ రాలేదు.

సాయంత్రం వస్తాడనుకున్న రవీ రాలేదు. ఎందుకో వసుంధరకి అంతుబట్టలేదు.

సాయంత్రం అయిదింటికి క్రిష్ణా, సుదర్శన్రావు వచ్చారు విచారం కనిపిస్తున్న మొగాల్తో.

“వసూ! మన రవి చచ్చిపోయాడు” మెల్లగా అన్నాడు సుదర్శన్రావు.

“రవా? ఎట్లా!” అంది వసుంధర ఆశ్చర్యంగా. ‘రాత్రే కదా వచ్చాడు’ అనేయాలన్నంత ఆవేశం వచ్చింది వసుంధరకి. ‘మన రవి’ అనుకుంది తర్వాత. అతని కళ్లూ, కాళ్లూ, పెదాలూ, తొడలూ అన్నీ యిప్పుడు మట్టి. వాటికిప్పుడు అర్థం లేదు. మట్టి. మీనింగ్లెస్.

“ఆత్మహత్య చేసుకున్నాట్ట…. ఏదో పుస్తకం పబ్లిష్ చేసే సంగతి వాడితో మాట్లాడాలని బయల్దేరొచ్చాడు కృష్ణ. మధ్యాహ్నం మేం వస్తూ వాణ్ణి పలకరించి వద్దామని వాడింటి దగ్గర జీప్ ఆపాం….. గుంపూ… ఏడుపులూ….” సుదర్శన్రావు చెప్పుకుపోతున్నాడు.

“ఏమొచ్చిందని ఆత్మహత్య చేసుకున్నాడు…… బుద్ధిలేని మనిషి….”

శానిటరీ టవల్సున్న బాక్స్‌లో వున్న రవిచ్చిన పెన్నూ, దిండుకిందున్న అతని నోటుబుక్కూ మురికి కాలవలో ఎక్కడైనా పారేయాలి ఈయన లేనప్పుడు చూసి –

“వాడి పెళ్ళాం ఆడదాని అవసరం ఏమిటో తెలీనివాడివని అందుకని ఇంకో మగాడితో వెళ్ళిపోతున్నానని వీడికో చీటి రాసిపెట్టి లేచిపోయిందట నిన్నరాత్రి… గొడవ గొడవగా చెప్పుకుంటున్నారందరూ….”

“నిన్నరాత్రా?” అంది వసుంధర.

కొంచమే కాల్చిన సిగరెట్టూ, కొంచెమే నీళ్ళు తాగి వదిలేసినగ్లాసూ వసుంధరకి మళ్ళా జ్ఞాపకం వచ్చాయి. ఇక్కడ మేం యిద్దరం చికాకుగా అసంతృప్తిలో వున్నప్పుడు ఆవిడెళ్ళిపోయుంటుంది. హెల్.

“అవమానమని వాడు వురిపోసుకున్నాడు. వాడి తల్లీ చెల్లీ ఒకటే ఏడుపు… ప్చ్…. మంచి మిత్రుడు పోయాడు” అన్నాడు సుదర్శన్రావు మాట్లాడవలసింది అంతే అన్నట్లుగా.

క్రిష్ణ తలవంచుకుని కొంచెంసేపూ, తలెత్తి కొంచెంసేపూ ఒక కాలిమీదనుంచి యింకో కాలిమీదికి బరువు మార్చుకుంటూ నిలబడి వున్నాడు.

“సర్లెండి… ఆ సంగతులు తర్వాత మాట్లాడుకోవచ్చుగానీ…. స్నానాలు చేద్దురుగాని పదండి…. పాపం క్రిష్ణగారు షాక్ తినేసినట్టున్నారు ఏమండీ” నవ్వుతూ అంది వసుంధర.

“ఆఁహ! ఏంలేదండీ!” అన్నాడు క్రిష్ణ.

“ఒరే క్రిష్ణా! మేడమీదకెళ్ళు – బాత్రూంకెళ్ళి నిమిషంలో వచ్చేస్తాను” అన్నాడు సుదర్శన్రావు.

క్రిష్ణ మెల్లగా అడుగులేస్తూ మేడమీదకి వెళ్ళాడు.

సుదర్శన్రావు బాత్‌ రూంలోకి అడుగు పెట్టబోతుంటే వెనకనుంచి అతని భుజాలు పట్టుకుని బాత్‌రూంలోకి వచ్చింది వసుంధర. ఎడంచేత్తో బాత్‌రూం తలుపు మూసుకునేట్లు తోసింది. సుదర్శన్రావుని గట్టిగా కౌగిలించుకుంది. మెడమీద ముద్దుపెట్టింది.

“మీరు….. మీరు…. ఎంత మంచివారండీ-” అంది.

“ఎందుకట?” నవ్వుతూ అని. వసుంధరవైపు తిరిగాడు సుదర్శన్రావు

ఎందుకో ఎట్లా చెప్పను. నో. ఈయన మనిషి.

“మీరొచ్చేశారుగా” అంది. ఈసారి అతని నుదుటిమీద ముద్దు పెట్టింది.

“అబ్బ! మరీ బాత్రూంలో ఏమిటిది చికాగ్గా!” అన్నాడు సుదర్శన్రావు.

వసుంధరకి ఆమాటకి చికాకనిపించింది. ఈయన మళ్ళా మామూలే స్విచ్ వేసినా వెలగని బల్బు – అనుకుంది.

కాని –

“మీరు మంచివారోచ్…” అని సుదర్శన్రావు బుగ్గమీద చిటికేసి బాత్‌రూంలోంచి బయటికొచ్చేసింది.

వెళ్ళి టేబుల్ మీదున్న రేడియో ఆన్చేసింది.

స్మైల్

'స్మైల్' పేరుతో ఎన్నో వ్యాసాలు, కవితలు, కథలు రాసిన ఇస్మాయిల్ గారు 'ఒఖడే' అనే కవితా సంకలనం, 'ఖాళీసీసాలు' అనే కథలు, కవితలు ఉన్న పుస్తకం వెలువరించారు. రాజమండ్రిలో 'రైటర్స్ కార్నర్' అనే సాహిత్య సంస్థను ఏర్పాటు చేశారు. 2008 డిసెంబరు 5న ఏలూరులో  మరణించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *