ఎవరికి తెలుసు?

Spread the love

హెరాడ్ అనే రాజు హయాంలో బెత్లహామ్
లోని జూడియా ప్రాంతోలో యేసు జన్మించిన
తర్వాత, తూర్పుదిక్కు నుండి కొందరు జ్ఞానులు
వచ్చి ఇలా అడిగారు: “ఇక్కడి ఒక ఉత్కృష్ట జన్మకు
సూచకంగా మా ప్రాంతపు ఆకాశంలో ఒక
నక్షత్రం మెరిసి పైకి ఎగసింది. అతడు
పుట్టుకతోనే యూదులకు రాజు అనతగినవాడు.
ఆ శిశువు ఎక్కడ?” ఈ వార్తను వినగానే మొత్తం
జెరూసలెంతో పాటు హెరాడ్ రాజు భయపడ్డాడు.
(2:24)

… దేవుని దగ్గరినుంచి వచ్చిన ఒక
దేవకన్య మేరీ భర్త ఐన జోసెఫ్ కు కలలో
కనిపించి, “లే, శిశువునూ అతని తల్లినీ తీసుకొని
ఈజిప్టుకు పారిపో. నేను చెప్పేంత వరకు అక్కడే
నివసించు. ఎందుకంటే, శిశువును
వెతికిపట్టుకుని చంపడం కోసం హెరాడ్ ఈ
ప్రాంతాన్నంతటినీ గాలించబోతున్నాడు,” అని
చెప్పింది. (2:13)

హెరాడ్ కోపంతో రగిలిపోయి,
బెత్లహామ్ లోని చుట్టుపక్కల ప్రాంతాలలోని
చిన్నపిల్లలందరినీ చంపమని తన సైనికులకు
ఆజ్ఞ జారీ చేశాడు. రెండు సంవత్సరాలు,
అంతకంటే తక్కువ వయసున్న పిల్లలెవరినీ
వదలకుండా వధించాలన్నాడు. ఆ శిశువు పుట్టిన
సమయాన్ని కొందరు జ్ఞానుల సహాయంతో
అంచనా వేశాడు. (2:16)

(ద గోస్పెల్ ఆఫ్ మాత్యూ)

తలుపును తోసుకుని ఒక సైనికుడు లోపలికి వచ్చాడు. అతడు బాగా అలసిపోయి ఉండటం చేత కొంచెం తూలుతున్నాడు. మంచంమీద పడిపోయి, కళ్లు మూసుకున్నాడు. గదిలోని వెనుక తలుపు కిర్రుమని చప్పుడు
చేస్తూ కొంచెం తెరుచుకుంది. తర్వాత ఎవరో దాన్ని మూసి, గొళ్లెం పెట్టారు.

సైనికుని బూట్లమీది ఎండిన రక్తం మీద ఈగల గుంపు వాలింది. గదిలోని ఒక మూలన ఒక కందిరీగ జుయ్యిమని శబ్దం చేసింది. పెరట్లో ఎండలో వెచ్చదనాన్ని అనుభవిస్తున్న కోళ్లు కొక్కొ అంటూ గోల చేస్తున్నాయి. దూరంనుంచి
అరుపులు, ఏడ్పులు గాలిలో ఎగురుకుంటూ వచ్చి, తెరిచివున్న కిటికీల ద్వారా లోపలికి ప్రవేశించాయి. కొంతసేపైన తర్వాత కోళ్లు వెళ్లిపోయాయి. కందిరీగ మూగబోయింది. అస్పష్టమైన శోకాలు, మూల్గులు ఆ సైనికునిమంచాన్ని పిశాచపు సాలెగూడులా ఆక్రమించాయి.

సైనికుడు లేచి కూర్చునేసరికి ఎండ దాదాపు పూర్తిగా పోయింది. అతడు తన చేతులను, బట్టలను చూసుకుని, “నేనిప్పుడు స్నానం చేయాలి,” అని గొణుక్కున్నాడు తనలో తానే.

ఆ వేశ్యాగృహ యజమానురాలు లోపలికి వచ్చి, “నేను నీళ్లను కాగబెడతాను. ఏ సుగంధద్రవ్యం వేయాలి నీళ్లలో?” అని అడిగింది. వాలిపోతున్న తన తలకు చేతులను ఆసరాగా నిలిపి, “ఏదైనా సరే” అన్నాడతడు.

తర్వాత, “ఇక్కడంతా నెత్తురుకంపు కొడుతోంది.” అని గొణిగాడు.

ఆ యజమానురాలు ఎత్తైనది. వయసు యాబై దాటి వుంటుందేమో. తన పాత అందపు ఛాయలు ఆమెలో ఇంకా ఉన్నాయి. అతని మాటలను వినగానే, బేరీజు వేయలేని ఒక గంభీరమైన భావం కనిపించింది ఆమె ముఖం మీద. కానీ, అతడు తన చూపును మరల్చుకోగానే అది అదృశ్యమైంది.

“ముఖ్యంగా చిన్నపిల్లల రక్తపు వాసన,” అన్నది.

సైనికుడు తన చేతులవైపు చూస్తూనే ఉన్నాడు.

“నిన్ను ఏ వీధికి కేటాయించారు,” అని అడిగింది ఆమె.

సైనికుడు మౌనంగా ఉన్నాడు. ఆమె వచ్చి అతని ముందు కూర్చుంది. తర్వాత ఇలా అడిగింది: “నువ్వు ఏ పిల్లలనైతే చంపావో, ఆ వని చేస్తున్నప్పుడు వాళ్లకు తాము చనిపోబోతున్నామని తెలుసా?”

సైనికుడు తన ముందున్న గోడను తదేకంగా చూస్తూ కూర్చున్నాడు.
జవాబు కోసం వేచిచూస్తూ అతని ముఖంమీదనే దృష్టిని నిలిపింది ఆమె.

“నేను స్నానం చేయాలి” అన్నాడతడు.

ఆమె కేవలం అతని ముఖాన్ని చూస్తూవుంది.

తర్వాత అతడన్నాడు,
“నాకు తెలియదు. చిన్నపిల్లలు చావు తాలూకు అనుభవానికి లోనౌతారా? మరణం గురించి ఎలా ఆలోచించాలో వాళ్లకు తెలుసా?”

ఆమె జవాబివ్వలేదు.

“నేను విన్నదల్లా వారి తల్లుల అరుపులు, ఏడ్పులే.” అన్నాడు సైనికుడు.

ఆమె లేచి లోపలికి పోయింది. సైనికుడు తన బెల్టుమీద ఉన్న ఒరను ఖడ్గం సహా తీసి నేలమీద పెట్టాడు. తర్వాత బెల్టును కూడా తీసి, ఒర పక్కన ఉంచాడు. ఆపైన, తన చేతులమీద మీద ఎండిపోయి అట్టకట్టి ఉన్న నెత్తురు చారికలను చేతిగోళ్లతో తీసివేయడం ప్రారంభించాడు.

వేశ్యాగృహ యజమానురాలు మళ్లీ వచ్చి, అతనిముందు కూర్చొని, “నీళ్లను వేడి చేస్తున్నాను,” అన్నది. తర్వాత కొంచెం ముందుకు వంగి, “ఎంత మంది పిల్లల్ని చంపావు,” అని అడిగింది.

సైనికుడు జవాబివ్వలేదు. ఆమె ఎగతాళి చేస్తున్నట్టుగా, “నువ్వొక దుర్మార్గుడైన సైనికుడివి. వంద మంది శిశువులను చంపడానికీ వంద మంది సైనికులను చంపడానికీ మధ్య ఏమైనా భేదం ఉందంటావా?” అన్నది వెటకారంగా.

సైనికుడు మౌనంగా ఉన్నాడు.

“చిన్నపిల్లలు నీతో యుద్ధం చేయడం లేదు కదా. అదే అసలు సమస్య.”

“సైనికులు యుద్ధం చేస్తున్నది ఎవరితో?” అని అడిగాడు అతడు.

ఆమె నేలమీద ఉన్న ఖడ్గాన్ని చూస్తూ, “ఈ కరవాలం ఎవరితో యుద్ధం చేస్తున్నది?” అని ప్రశ్నించి, తన కుర్చీని అతని దగ్గరికి జరుపుతూ తగ్గుస్వరంలో ఇలా అడిగింది: “హెరాడ్ రాజు శత్రువులు ఎవరు? ఈ శిశు వెవరు? హెరాడ్ రాజు చిన్నపిల్లలకు ఇలా భయపడుతున్నాడెందుకు?”

“ఇంకా తెలియదా నీకు?” అని ప్రశ్నించాడు సైనికుడు.

“తెలియదు,” అన్నదామె.

“యూదుల రాజు అనతగిన ఆ శిశువును వెతుక్కుంటూ వచ్చారు మహనీయులైన జ్ఞానులు. ఆ వార్తను విని హెరాడ్ భయకంపితుడైనాడు. ఆ జ్ఞానులు ఈ ప్రాంతంలో ఉన్న శిశువును రహస్యంగా సందర్శించి వెళ్లిపోయారు. మేము ఆ శిశువుకోసం వెతుకుతున్నాం. ఆ శిశువునే చంపాలి మేము,” అన్నాడు సైనికుడు.

అతడు తన ఒక చేయిని మరొకదానితో అదిమిపెట్టి వాటినే చూస్తూ, “యూదులను రక్షించబోయే ఆ శిశువు ఇవాళ నా ఈ చేతులతోనే చంపబడ్డాడేమో! ఎవరికి తెలుసు?” అన్నాడు.

“ఔను, ఎవరికి తెలుసు?” అన్నదామె.

సైనికుడు ముందుకు వంగి, ఆమెముఖం లోకి చూస్తూ ఇలా అడిగాడు: “యూదుల రక్షకుడు తన ఒంటిమీద రక్తంతో వస్తాడా ఈ లోకంలోకి?”

ఆమె నిశ్శబ్దంగా ఉంది. అతడు ముందుకు వంగి, ముఖాన్ని కళ్లను ఒత్తుకుని, “నువ్వు పిల్లల్ని కనలేదు కనుక, అది నీకు అర్థం

కాదు. చనిపోయేముందు నేను చంపిన పిల్లల ముఖాలమీద ఆశ్చర్యంతో నిండిన చూపులను నువ్వు చూడలేదు,” అన్నాడు.

కొద్దిసేపటి దాకా ఎవరూ మాట్లాడలేదు. తర్వాత “పాపం బిడ్డ,” అన్నది ఆమె.

సైనికుడు ఉలికిపడ్డాడు. బలమైన ఆశ నిండిన చూపులను సారిస్తూ, “ఎవరు? ఆ బిడ్డ ఎవరు?” అని అడిగాడు.
ఆమె ఇలా జవాబిచ్చింది: “ఆ రాజకుమారుడు యూదుల రాజుగా తలచబడినవాడు. ఈ లోకంలో జన్మిస్తాడని మనం అనుకుంటున్నవాడు. మనుషుల విధి ఎలా నిర్ణయింపబడుతుందో తెలియదు నాకు. నన్ను వేశ్యను చేసిన విధే ఈ శిశువు రక్తపు మరకలతో ఈ ప్రపంచంలోకి రావాలని నిర్ణయించిందా?” కొంచెంసేపు ఆగి మళ్లీ, “రక్షకుడు ఈ లోకంలోకి వైభవంతో రావాలి కదా. తన కారణంగా ఎంతో రక్తం చిందినందుకు ఈ శిశువు సంజాయిషీ ఇచ్చుకోవద్దా? రక్తానికి సంబంధించిన ఋణాన్ని ఈ శిశువు ఎలా తీర్చుకోబోతున్నాడు?” అన్నది.

“అతడు ఈ రోజు బతికితే కదా ఆ ప్రశ్న తలెత్తేది!” అన్నాడు సైనికుడు.

మళ్లీ ఇద్దరూ మౌనంగా ఉన్నారు.

కొంతసేపైన తర్వాత, “నేను ఆ బాబును గుర్తించగలిగితే బహుశా చంపేవాడిని కాదేమో. ఎవరికి తెలుసు?” అన్నాడు సైనికుడు.

“ముందే నువ్వతణ్ని గుర్తించి చంపితే, ఇతర శిశువులను చంపే అవసరమే ఉండేది. కాదేమో. ఆలోచించు,” అన్నదామె.

“కానీ, అప్పుడు రక్షకుడు అవతరించేవాడే కాదు. ఇప్పుడు కనీసం ఆ అవకాశం ఉంది. కాదా?” అని ప్రశ్నించాడు సైనికుడు.

“ఔను నువ్వు చెప్పింది నిజం” అని దగ్గరికి జరిగి, ఆమె అతని మోకాళ్లను ముట్టుకుంది. తర్వాత, “ఔను. వాళ్లు వైభవంతో వచ్చినా రక్తంలో తడిసి వచ్చినా మనకు రక్షకులు కావాలి. సైనికులకు, వేశ్యలకు రక్షకులు అవసరం,” అన్నది.

సైనికుడు తల ఊపి, “నీళ్లు వేడయ్యాయా?” అని అడిగాడు.

అకస్మాత్తుగా వెనుకగది లోంచి ఒక పాప ఏడువు వినిపించింది. ఎవరో పాపను ఊరుకోబెట్టారు. సైనికుని ముఖం మీద ఒక సన్నని చిరునవ్వు మెరిసింది. రక్షకుణ్ని వెతుకుతూ వేశ్యాగృహానికి ఎవరు వస్తారు! ఊ, ఇంతకీ ఏడుస్తున్న ఆ పాప ఎవరిది? అతడు బాబేనా? ఇంకా అతడిని బిచ్చగాళ్లకు అమ్మలేదా?” అన్నాడు.

ఆమె ఏ భావమూ కనపడని ముఖంతో ఇలా అన్నది: “మా పిల్లి ఈనింది. పిల్లిపిల్లల ఏడుపు చిన్నపిల్లల ఏడుపులాగానే ఉంటుంది.”సైనికుడు నవ్వి ఇలా అన్నాడు.
“నువ్వు ఇబ్బంది పడుతూ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అతడు యూదులకు కాబోయే రాజైతే మాత్రం నాకేమిటి! నేను స్నానం చేసి కొంచెం విశ్రాంతి తీసుకునేందుకు వచ్చానిక్కడికి. నీళ్లు ఇంకా వేడి కాలేదా?”

అతడు తన బూట్లను విడిచి పక్కన పెట్టాడు. నిర్వికారమైన ఆమె ముఖం మరింత అగోచరంగా మారింది. పెదవులమీదికి ఒక నిర్భావపు నవ్వును తెచ్చుకుంటూ, “ఈ రాత్రికి కొత్త అమ్మాయినెవరినైనా నీ గదికి పంపించమంటావా?” అని అడిగింది.

“వద్దు. స్నానం చేసేందుకు వేడినీళ్లూ, తొడుక్కునేందుకు శుభ్రమైన గుడ్డలూ ఇస్తే చాలు,” అన్నాడు. తర్వాత, “నేను స్నానం చేయాలిప్పుడు,” అని తనలో తానే గొణుక్కున్నాడు.ఆమె లేచి లోపలికి పోయింది. సైనికుడు రక్తపు మరకలు నిండిన తన దుస్తులను విడిచాడు. స్నానాల గదిలోంచి కుండల చప్పుడు, నీళ్లు కిందకు పడుతున్న ధ్వని వినిపించాయి. అతడు స్నానాలగదిలోకి పోయాడు. ఒక అమ్మాయి వచ్చి విసుక్కుంటూ, అతడు విడిచిన బట్టలను, బూట్లను, అప్పటిదాకా అతడు పడుకున్న మంచంమీది దుప్పట్లను లాగేసింది.

*

మధ్యరాత్రి దాటింది. సైనికుడు గురక పెడుతున్నాడు. లోపల్నుంచి ఎవరో గుసగుస పెడుతున్న శబ్దం వస్తోంది. మెల్లగా ఒక తలుపు తెరుచుకుంది. చీకట్లో పడుకున్న సైనికుని పక్కనుంచి ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడు వెళ్లారు. ఒక స్త్రీ దేన్నో తన ఛాతీకి హత్తుకుని వుంది. వాళ్లు నెమ్మదిగా తలుపు తీసి, బయట చుక్కల వెలుగుతో మెరుస్తున్న వీధిలోకి ప్రవేశించారు. అక్కడ ఒక కంచరగాడిద సిద్ధంగా ఉంది.

వేశ్యాగృహ యజమానురాలు మరొక స్త్రీనుంచి శిశువును తీసుకుంది. బాబు ముఖం మీద వెన్నెల పడేలా పైకెత్తింది ఆమె. ఆ ముఖాన్ని చూస్తూ, “పాపం భవిష్యత్ రాజు,” అన్నది. తర్వాత శిశువును కిందకు జరిపి వంగి, బాబు నుదురు మీదా బుల్లి పాదాల మీదా సుతారంగా ముద్దు పెట్టుకుంది. ఆ మరో స్త్రీ అప్పటికే కంచరగాడిద మీద ఎక్కి వుంది. యజమానురాలు బాబును ఆ స్త్రీకి ఇచ్చింది. ఆ చీకట్లో మరికొందరు ఆడవాళ్లు వేశ్యాగృహంలోంచి బయటికి వచ్చారు. కంచరగాడిద మీద ముందర కూర్చున్న పురుషుడు కళ్లెంను చేతిలోకి తీసుకున్నాడు.

అతని వెనకాల కూర్చునివున్న స్త్రీ, “మాకు ఆశ్రయమిచ్చినందుకు ధన్యవాదాలు. నా బాబు తరుపు నుండి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఋణాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు,” అన్నది.

“మీరు ఆ పని చేయవచ్చు. మీ కొడుకు పెరిగి పెద్దవాడై రాజయ్యాక మమ్మల్ని కూడా రక్షించమని చెప్పండి. మేము వేశ్యలమే కావచ్చు. ఐనా మీ కొడుకు మీ మాటను వింటాడు.”

కంచరగాడిద ముందుకు కదిలింది.

యజమానురాలు ముందుకు పరుగెత్తి, “లోపలున్న సైనికుణ్ని కూడా రక్షించమని

చెప్పండి. మీకు శుభం కలుగు గాక,” అన్నది.

కంచరగాడిద మీద ఉన్నవాళ్లందరూ మూలమలుపు తిరిగి చీకట్లో అంతర్ధానమయ్యారు.

యజమానురాలు చీకట్లో నిద్రిస్తున్న సైనికుని పక్కనుంచి లోపలికి పోతుంటే, “నీళ్లు ఇంకా వేడి కాలేదా?” అని గొణుక్కున్నాడతడు.

(మూలకథ ఇండియన్ లిటరేచర్ మార్చ్ – ఏప్రిల్, 328వ సంచికలో ప్రచురింపబడింది. సాహిత్య అకాడమీ సౌజన్యంతో…)

పాల్ జకారియా

1945లో ట్రావంకోర్ లో జన్మించిన పాల్ జకారియా మలయాళ సమకాలీన సాహిత్యంలో సీనియర్ రచయిత. ఎన్నో అసంఖ్యాకమైన కథలతో పాటు, నవలికలు, వ్యాసాలు, ట్రావెలాగులు రచించారు. మళయాళ సాహిత్యం ఆయనను కేరళ సాహిత్య అకాడమీ, ఓ. వి.విజయన్ అవార్డులతో గౌరవిస్తే, కేంద్ర సాహిత్య అకాడెమీ అతడిని అకాడెమీ అవార్డుతో గౌరవించింది. వాసుదేవ నాయర్ తరువాత కేరళలో అంతటి ప్రజాదరణ పొందిన రచయిత. అతని ఏసు కథలు చాలా పాపులర్.

ఎలనాగ
కరీనంగర్ జిల్లాలోని ఎలగందుల గ్రామంలో 1953 లో పుట్టిన ఎలనాగ వృత్తి రీత్యా డాక్టరైనా ప్రవృత్తి రీత్యా కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. వీరి తండ్రి అయిన నాగరాజు తిరుమలయ్య ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో పేరొందిన ఆయుర్వేద వైద్యులు. తల్లి నాగరాజు రంగమ్మ సాధారణ గృహిణి. ఎలనాగ  1980 నుండి 1986 వరకు నైజీరియాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో, ఆ తర్వాత 1989 నుండి 2012 వరకు ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్ లో పని చేసి, రాష్ట్రస్థాయి అధికారిగా పదవీ విరమణ పొందారు.
ఎలనాగ గారిది  విస్తృతమైన సాహితీ నేపథ్యం. హైస్కూల్లో ఉన్నప్పటినుండే రచనలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు రాసిన మొదటి కవిత, కరీంనగర్ నుండి వెలువడుతుండిన గౌతమి అనే పత్రికలో ప్రచురితమైంది. మెడిసిన్ చదువుతున్న కాలంలో భారతి, కృష్ణా పత్రిక,  స్రవంతి, ఆంధ్రప్రభ, తరుణ, పొలికేక, విపుల మొదలైన పత్రికల్లో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. తర్వాతి కాలంలో మరెన్నో పత్రికల్లో అచ్చయ్యాయి. సోమర్సెట్ మామ్ రచన అయిన ది ఏలియెన్ కార్న్ అనే నవలికకు వీరు చేసిన తెలుగు అనువాదం కలుపుమొక్క శీర్షికతో 2005 లో అచ్చైంది. 2005 వరకు చేసిన రచనలన్నీ నాగరాజు సురేంద్ర అనే పేరుతో వచ్చాయి. తర్వాత ఎలనాగ అన్న కలంపేరు పెట్టుకున్నారు. 2009 లో మొదటి కవితా సంపుటి వాగంకురాలు వెలువడింది.
తెలుగులోనూ, ఆంగ్లంలోనూ అనేక స్వతంత్ర  రచనలు వెలువరించారు. అనేక అనువాదాలు చేశారు. సుమారు అనేక పద్యకవితలు, వచన కవితల పుస్తకాలు వెలువరించారు. ఆగ్లం నుండి తెలుగు లోకి చేసిన అనువాదాలు - కలుపు మొక్క: సోమర్సెట్ మామ్ ఆంగ్ల నవలిక The Alien Corn కు అనువాదం (2005); ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు: అనువాద కథల సంపుటి (2013); పొరుగు వెన్నెల: అనువాద కవితల సంపుటి (2013); ఉత్తమ ఆఫ్రికన్ కథలు: అనువాదకథల సంపుటి (2014); సోమర్సెట్ మామ్ కథలు: అనువాద కథలు (2016); ఊహల వాహిని: భారతీయ భాషల కవితలకు తెలుగు అనువాదం (2017); కథాతోరణం: వివిధ దేశాల భాషల కథలకు తెలుగు అనువాదం (2017);  గాలిబ్ –నాటి కాలం: పవన్ కె వర్మ రచించిన Ghalib: The Man, The Times కు తెలుగు అనువాదం. కేంద్ర సాహిత్య అకాడమీ వారి ప్రచురణ (2017); ఆత్మగానం: ఒడియా కవి ప్రదీప్ బిస్వాల్ రాసిన A House Within, Pilgrimageto Ayodhya ఆంగ్ల కవితా సంపుటుల అనువాదం.(2023); శవాలను మోసేవాడి కథ: సైరస్ మిస్త్రీ రాసిన Chronicle of a Corpse Bearer కు అనువాదం (2023).
పైవన్నీ కాక కాళోజీ,  వట్టికోట ఆళ్వారు స్వామి, దాశరధి, కాళోజి మొదలగు సుప్రసిద్ధ సాహితీవేత్తల కథలను ఆంగ్లం లోకి అనువదించారు.
వీరికి 2023 సంవత్సరానికి గాను అనువాద రంగంలో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *