గీతం – 9
చిత్రం: నర్తనశాల (1963) సంగీత దర్శకత్వం – సుసర్ల దక్షిణామూర్తి
గానం : ఘంటసాల & పి సుశీల రచన – శ్రీ శ్రీ
ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే … సొగసరీ ఒకపరి వివరించవే
చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతునో … గడుసరి ఏమని వివరింతునో
వలపులు చిలికే వగలాడి చూపు పిలువక పిలిచి విరహాల రేపు
యదలో మెదిలే చెలికాని రూపు ఏవో తెలియని భావాల రేపు
ఈ నయగారం ప్రేమ సరాగం (2)
అందించు అందరాని సంబరాలే
ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే … సొగసరీ ఒకపరి వివరించవే
పరుగులు తీసే జవరాలి వయసు మెరుపై మెరిసి మరిపించు మనసు
ప్రణయము చిందే సరసాల చందం ఇరువురినొకటిగా పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం(2)
చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో
ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే … సొగసరీ ఒకపరి వివరించవే
చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతునో … గడుసరి ఏమని వివరింతునో
తెలుగు సినీచరిత్రలో ఒక ఆణిముత్యం ‘నర్తనశాల’. ఈ సినిమాలోని తొమ్మిది పాటలలో ఎనిమిది సముద్రాల సీనియర్ గా పిలవబడే సముద్రాల రాఘవాచార్య రాసారు. నిజానికి ఈ సినిమాకు మొత్తం ఇరవై ఒక్క పాటలు రికార్డు చేశారట. కాని చివరకు తొమ్మిది మాత్రమే ఉంచారు. ఉంచిన పాటల్లో ఒకే ఒక పాట శ్రీ శ్రీ రాసిన ‘ఎవ్వరి కోసం’ అంటు సాగే ఓ యుగళ గీతం. అభిమన్యుడు ఉత్తర కుమారిల మధ్య నడిచే ప్రేమ సన్నివేశంలో వచ్చే పాట ఇది. ఈ సినిమాలో ప్రతి పాట ఒక ఆణిముత్యమే. సుసర్ల దక్షిణామూర్తి సంగీతం ఆ పాటలను అమరం చేసింది. అయితే సముద్రాల సీనియర్ రాసిన అన్ని పాటలతో పాటు శ్రీ శ్రీ రాసిన ఈ ప్రేమ గీతం కూడా పోటీ పడి ఆ పాటలన్నిటి సరసన ప్రజాభిమానం చూరగొని నిలబడి నేటి గాయకులనూ అలరిస్తూ ఎవర్ గ్రీన్ యుగళ గీతంగా నిలిచి ఉండడం విశేషం. అప్పట్లో పాటల రారాజుగా పేరు గాంచిన సముద్రాల సీనియర్ రాసిన అన్ని పాటలతో పోటీపడి అదే స్థాయిలో పాపులర్ అయిన పాటను రచించి శ్రీ శ్రీ సినీ కవిగా తన ప్రతిభను చాటుకున్నారు.
సామాజిక ప్రజా గీతాలకు, చారిత్రిక గీతాలకు, పౌరాణిక గీతాలకు భాషలో కొంచెం వైవిధ్యం ఉండి తీరాలి. దాన్ని పాటిస్తూనే వ్యావహారిక ప్రేమ గీతాల పంధాలో, జాగ్రత్తగా కూర్చిన పదాలతో ఈ పాటను జనరంజకం చేసారు శ్రీ శ్రీ.
శ్రీ శ్రీ ప్రేమ గీతాలలో ఒక గాంభీర్యం ఉంటుంది. ప్రేమ పట్ల ఆయనకున్న అభిప్రాయం, అందులోని సామ్యవాదం, స్త్రీ పురుష సంబంధాలలో ఆయన కనబరిచే సమానత్వం ప్రకటితమవుతుంది. రాచరికరపు హంగుల మధ్య స్త్రీ పురుష ప్రేమ ప్రసంగాలలో స్త్రీని కాస్త తక్కువగా చూపే అలవాటున్న సంస్కృతి మధ్య శ్రీ శ్రీ తనదైన పంధాలో పాటలు రాసారు. ఎక్కడా స్త్రీ పురుషుని పాదాలు స్పృశిస్తూ, పాదాల చెంత వాలిపోతూ కనిపించదు. అప్పటి ప్రేమ గీతాలన్నిటినీ పరిశీలిస్తే, శ్రీ శ్రీ శైలిలోని ప్రదర్శించిన ఆ సమానత్వం అర్ధం అవుతుంది. దీన్ని చర్చించడానికి ఈ పాటను ఉదాహరణగా తీసుకోవచ్చు.
ఈ పాటను కవి రాసిన పంధా బావుంటుంది. పల్లవిలో మొదటి వాక్యం ప్రియుడు వేసే ప్రశ్న అయితే తరువాతి వాక్యం ప్రియురాలు ఇచ్చే జవాబు. చరణం దగ్గరకు వచ్చేసరికి ఈ ప్రశ్న జవాబు పద్దతికి కొనసాగింపుగా వచ్చే మూడవ వాక్యం వారిద్దరూ కలిసి అంగీకారంతో ఒకరినొకరు సమర్ధించుకుంటూ వెలిబుచ్చే అభిప్రాయంగా వినిపిస్తుంది. యుగళగీతాలలో శ్రీ శ్రీ చేసిన మరో ప్రయోగం ఇది.
తనను చూసి చిరునవ్వు చిందిస్తున్న ప్రియురాలితో ఎవరి కోసం ఈ మందహాసం, ఒక పరి అంటే ఒక సారి వివరించమని అడుగుతున్నాడు ప్రియుడు. ఇక్కడ ‘పరి’ అన్న పదం ఈ పౌరాణిక ఇతివృత్తం కోసం, రైం కోసం కూడా ఉపయోగించిన పదం. ‘పరి’ బదులుగా ‘సారి’ అంటే అక్కడ పాట కాస్త దీర్ఘంతో కొద్దిగా మారుతుంది. త్యాగయ్య అన్నమయ్య కీర్తనలలో ఈ ‘పరి’ అనే పదం వాడగా చూస్తాం. ‘ఎవ్వరికోసం’, ‘మందహాసం’ అన్న రెండు పదాలలో దీర్ఘం ఉంది, తర్వాత వాక్య భాగంలో ‘సారి’ అని వస్తే అదే దీర్ఘం అ పక్కన పదంలో పడాలి. దానికి బదులుగా ‘పరి’, ‘వివరించవే’ అనే రైంతో ఆ వాక్యాన్ని నడిపించారు కవి. ‘పరి’ అన్న చిన్న పదంతో ఆ వాక్యంలోని సున్నితమైన అందం చెడకుండా ఎక్కడా ఏ పదంలో దీర్ఘం రాకుండా స్వరం మారకుండా కవి చేసిన రచన ఇది. ఎన్ని సార్లు ఈ పాట విన్నా ఈ పల్లవికి ఆ ‘పరి’ అన్న పదమే గొప్పగా కుదిరినట్లు అనిపిస్తుంది. (ఈ పరి అన్న పదాన్ని సాంఘిక సందర్భాలలోనూ వాడిన ఆధునిక సినీకవులు ఉన్నారు)
ప్రియుడి ప్రశ్నకు బదులుగా ప్రియురాలు ఇచ్చే జవాబు ఎంత గొప్పగా ఉంటుందో గమనించండి. చెలిమి కోసం చెలి మంద హాసం ఏమని వివరింతునో గడసరీ అంటుంది ఆమె. ప్రేమ గీతాలలో నాకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమైన వాక్యం ఇది. స్త్రీ ప్రేమ నుండి, నిర్మించుకునే బంధాల నుండి ఏం ఆశిస్తుందో ఒక్క వాక్యంలో తేల్చేసారు కవి. చెలిమి అంటే స్నేహం కోసం చెలి మందహాసం అట. నిజానికి మరొక మనిషిని చూసి చిరునవ్వు నవ్వడం స్నేహం కోసం చేసే పలకరింపే. మనిషుల మధ్య ముందు ఉండాల్సింది స్వచ్చమైన స్నేహమే. స్నేహం లేని ప్రేమ ఆకర్షణ దగ్గరే ఆగిపోతుంది. చెలిమి చెలి పదాలను రైం కోసం వాడుతూనే, ఈ వాక్యంతో స్త్రీ మనసును సంపూర్ణంగా ఆవిష్కరించారు కవి. అతని స్నేహం ఆశిస్తూ ఆమె మందహాసం చిందిస్తుంది అట, అది కూడా నేనే వివరించాలా గడుసరి అని జవాబిస్తుంది ఆమె.
చాలా ప్రేమ గీతాలలో ప్రేయసి ప్రియురాళ్ల సంభాషణలన్నీ ఒకరి పొందు కోసం మరొకరు పలికే పదాలుగా ఉంటాయి. ఇక్కడ ఆమె మందహాసం అతని కోసం అని ఉంటే అది శారీరికంగా మిగిలిపోయి వాంచ్ఛ దగ్గరే ఆగిపోయే బంధం అవుతుంది. అతని పొందు కోసం కాదు అతని స్నేహం కోసం ఆమె అతనితో బంధాన్ని కోరుతుంది. అంటే ఆ కలయిక వారిద్దరి శారిరిక స్థాయిని దాటి బలపడే ఓ అద్భుతమైన బంధం. వారున్నా లేకున్నా నిలిచి ఉండే సంబంధం. ఒకే ఒక చిన్న వాక్యం కాని ఎంత గొప్పగా స్త్రీ మనసును చూపించారు ఆ మహాకవి.
ప్రియుడు ఆమె చూపు తనను ఎలా ప్రభావితం చేస్తుందో ఇంకాస్త వివరిస్తూ, ఆ చూపు చిలకరించే ప్రేమలు ఆమె తనను నోటితో పిలవకున్నా తనను పిలిచీ పిలవట్లు పిలుస్తూ విరహాలు రేపుతున్నాయని అంటాడు. ప్రేమికుల నడుమ నడిచే ఆ కళ్ల భాషను కవి మాత్రమే ఇంత అందంగా వివరించగలడు కదా. ఇలాంటి చూపుల సయ్యాటను ఉర్దూ కవిత్వం గొప్పగా పట్టుకుంటుంది. ఎక్కడా శారీరిక వాంఛ ప్రస్తావనే లేకుండా కళ్ల భాషను గొప్పగా చిత్రీకరించే పదజాలం ఉర్దూ భాషలో ఉంటుంది. ఇతర భాషలలో అది ఎక్కడో ఓ చోట కోరిక స్థాయిలో ప్రకటితమవుతూ ఉంటుంది. కాని ఆ ఉర్దూ శైలిని అలతి అలతి పదాలతో శ్రీ శ్రీ చాలా పాటల్లో ఆ భాషకు సరిసమానంగా వాడినట్లు నాకనిపిస్తుంది. ఉర్దూ కవి సాహిర్ లుధియాన్వి ఓ పాటలో “ఫిర్ న కీజియె మేరి గుస్తాఖ్ నిగాహీకా గిలా, దేఖియే ఆప్నే ఫిర్ ప్యార్ సే దేఖా ముఝ్కో” అని రాసారు. “తప్పుగా నేను నిన్ను చూస్తున్నానని నా చూపులకు సంజాయిషీ అడగకు. నువ్వు నన్ను మళ్ళీ ప్రేమగా చూసావు మరి” అని ప్రేమికుడు అంటాడు. ఆ పదప్రయోగానికి అర్ధం తెలిసిన ఎవ్వరికయినా గొప్ప రసానుభూతి కలుగుతుంది.
శ్రీ శ్రీ రాసిన అతి తక్కువ ప్రేమ గీతాలు అదే స్థాయిలో ఉండి ఎన్నో సార్లు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఆయన్ని విప్లవకవిగా, సామ్రాజ్యవాదాన్ని విమర్శించే సామాజిక కార్యకర్తగానే అకడమిక్ గా చదువుకున్నవారికి ఆయన ప్రేమగీతాలలోని ఆ లోతు పరిచయం అయితే అమితాశ్చర్యం వేస్తుంది. ఇలాంటి లోతైన అనుభూతుల్ని రాసిన ఆయనను కేవలం విప్లవ కవిగా మాత్రమే ఇతర తరాలు గుర్తుంచుకోవడం ఆయనను అసంపూర్ణంగా తెలుసుకోవడం అనిపిస్తూ ఉంటుంది. నా వరకు మాత్రం సాహిర్, శ్రీ శ్రీలలో ఎన్నో పోలికలు కనిపిస్తాయి.
ప్రియుడు తనలో రేగుతున్న విరహాల ప్రస్తావన తీసుకురాగానే, ఆమె కూడా దాన్ని అంగీకరిస్తూ తన మనసులో మెదిలో ఆ ప్రియుని రూపం తనలో ఏవో భావాలను రేపుతుంది అని బదులిస్తుంది. ఇద్దరూ తాము ఒకేలా అనుభూతి చెందుతున్నామని ఒప్పుకుంటూ ఆ తర్వాత ఇరువురి స్థితిని అంగీకరిస్తూ ఈ నయగారం, ప్రేమ సరాగం అందరాని సంబరాలని అందించబోతుంది అంటూ తమ భవిష్యత్తు జీవితాన్ని ఊహిస్తున్నారు. నయగారం, అంటే తమ మురిపాలు, ప్రేమ వినోదాలు, సరసాలు అన్నీ రాబోయే అందమైన భవిష్యత్త్తుకు పునాదులుగా వారు నిర్ణయించుకుంటూ తమ బంధానికి అందమైన భవిష్యత్తు ఉందని ఆశపడుతున్నారు.
చలాకీగా పరుగులు తీసున్న ప్రియురాలి వయసు మెరుపులా మెరిసి తన మనసును మురిపిస్తుందని అంటున్నాడు ప్రియుడు. పరుగులు జవరాలు, తీసే వయసు, మెరుపై మరపించు, మెరిసి మనసు. ఇలా ఈ వాక్యంలో వచ్చిన ప్రతి పదం మరో పదాన్ని ఎలా కలుపుకుని శబ్ధానికి అందాన్ని చేకూరుస్తుందో గమనించండి. వాక్యంలోని నాలుగు పదాలలో మొదటిది మూడవది, రెండు నాలుగవది ఒక రైంతో అలా సులువుగా సంగీతంలో కలిసిపోయి ద్వనించడం అర్ధవంతంగానూ అందంగానూ వినిపించడం కవి భాషా పటిమకు నిదర్శనం కాదా. తన జేబులోని సిగరెట్టు పెట్టెలపై, ఆ లోపల మడిచి ఉండే చిన్ని కాగితంపై శ్రీ శ్రీ పాటలు రాసి ఇచ్చేవారని ఆయన గురించి వెటకారంగా అనేవాళ్లూ ఉన్నారు. కాని పాట రచనను అంత ఆసువుగా చేసి చూపించడానికి కవికి భాషపై ఎంత పట్టు ఉండాలి. కవులు భాషతో, పదాలతో ఆడుకోగలరని ఇలాంటి పాటలు విన్నప్పుడే అనిపిస్తుంది.
ఇక్కడ కొంత టేక్నికల్ సమాచారం ఇవ్వడం అవసరం అనిపిస్తుంది. ఆంగ్ల కవిత్వంలో షేక్పియర్ అనుసరించిన ABAB రైం పద్దతి ఒకటుంది. ఒక పద్య చరణంలో మొదటి వాక్యం మూడవ వాక్యం, రెండవ వాక్యం నాలుగవ వాక్యం రైమింగ్ లో ఉండడం ఒక పద్దతి. ఈ ABAB పద్దతి తరువాత రాబర్డ్ ఫ్రోస్ట్ లాంటి ప్రసిద్ద అంగ్ల కవులూ ఉపయోగించారు. దీన్ని ఒకే వాక్యంలో పదాల మధ్య ఉపయోగించిన వారు చాలా తక్కువ. దీన్ని ABAB ఇంటర్నల్ రైం అంటారు. దాన్ని మొట్టమొదట ఉపయోగించింది ఆంగ్లంలో ఎడ్గర్ ఆలెన్ పో, కొంత వరకు లార్డ్ బైరన్. తెలుగులో యతి ప్రాస నియమాలను అనుసరించి పద్య రచన చేసిన కవులున్నారు. అయితే ఆంగ్ల కవిత్వ శైలికి, యతి ప్రాస శైలికి మధ్యస్థంగా ఈ పాటలో పదాల అల్లిక కనిపిస్తుంది. శ్రీ శ్రీకి తెలుగు పద్య రచన, ఆంగ్ల కవిత్వ రచనపై ఉన్న పట్టుని నిరూపిస్తుంది ఈ పాటలోని పదాల కూర్పు.
ప్రియుడు అన్న మాటకు బదులుగా ఆమె ప్రణయము చిందే సరసాల చందం ఇరువురినొకటిగా పెనవేయు బంధం అంటూ బదులిస్తుంది. ఇక్కడా అదే ABAB పదాల ఇంటర్నల్ రైం కనిపిస్తుంది. తెలుగు కవిత్వం గురించి పెద్దగా తెలియని మా తరానికి ఇందులో ‘పో’ శైలి కనిపించి ఆశ్ఛర్యపరుస్తుంది. ఇక తర్వాత ఆ ఇద్దరూ కలిసి ఈ వయ్యారం ఈ సింగారం, చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో అంటో తమ ఆనందాన్ని తెలియజేస్తారు. ప్రతి పదం ఆ తర్వాత వచ్చే మరో పద శబ్దంతో కలిసి ఉంటుంది.
శ్రీ శ్రీ ఆధునిక కవి అని కవిత్వానికి ఏ గ్రామరూ జోడించకుండా పద శబ్దాల ఆధారంగా రాసుకుంటూ వెళ్ళిపోయాడని అంటారు చాలా మంది. ఆధునిక కవిత్వానికి భావం తప్ప గ్రామర్ అవసరం లేదంటూ, శ్రీ శ్రీ పేరుతో ఆధునిక కవిత్వ పంథాను సృష్టించుకుని దాన్ని తమ మార్గంగా ప్రకటించుకుని అనుసరిస్తున్న ఆధునిక కవులు శ్రీ శ్రీ ని పూర్తిగా చదవలేదేమో అనిపిస్తుంది. ఇలాంటి సినీ పాటల్లో శ్రీ శ్రీ ఆచరించిన శైలిని అర్ధం చేసుకోవడానికి చేసిన నా ప్రయత్నంలో ఆయన ప్రాచీన కవిత్వ శైలులను అర్ధం చేసుకుని ఉపయోగించారని, తన ప్రయోగాలకు ఆ సాంప్రదాయాలను పునాదిగా మార్చుకున్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది. నా అభిప్రాయం ఎంత వరకు సరైనదో తెలియదు కాని, శ్రీ శ్రీ కేవలం ఆధునిక కవిత్వాన్ని చందస్సు, యతి ప్రాసల నుండి విముక్తి చేస్తూ రాసారని మాత్రం నేను నమ్మను. అయన సాంప్రదాయ కవిత్వాన్నీ చదివారని, ఆ వ్యాకరణాన్ని ఆధునీకరించుకుంటూ తర్వాత కవిత్వాన్ని రచించారు కాని దాన్ని పూర్తిగా వదిలివేయలేదని నాకు ఇలాంటి పాటలు విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది.
ఈ పాటను మధురంగా గానం చేసారు ఘంటసాల, సుశీల. ఇప్పటికీ తెలుగు యుగళగీతాలలో వినిపిస్తూ ఉండే ఈ పాట శ్రీ శ్రీ కలం నుండి జన్మించిన ఓ అందమైన ప్రేమ గీతం.
పాట – 10
చిత్రం: దేవత (1965) సంగీతం: కోదండపాణి
గీతరచయిత: వీటూరి, శ్రీ శ్రీ నేపధ్య గానం: ఘంటసాల
బ్రతుకంతా బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరగిపోయే….
తలచేది జరుగదు జరిగేది తెలియదు
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా (2)
గారడి చేసి గుండెను కోసి, నవ్వేవు ఈ వింత చాలిక..
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా..
అందాలు సృష్టించినావు దయతో నీవు.. మరలా నీ చేతితో నీవె తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే.. గాఢాంధకారాన విడిచేవులే
కొండంత ఆశ అడియాస చేసి…(2)
పాతాళలోకాన త్రోసేవులే..
బొమ్మను చేసి ప్రాణము పోసి.. ఆడేవు నీకిది వేడుకా
ఒకనాటి ఉద్యానవనము నేడు కనము.. అదియే మరుభూమిగా నీవు మార్చేవులే (2)
అనురాగ మధువు అందించి నీవు.. హాలాహలజ్వాల చేసేవులే
ఆనందనౌక పయనించు వేళ… (2)
శోకాల సంద్రాన ముంచేవులే ..
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
గారడి చేసి గుండెను కోసి..నవ్వేవు ఈ వింత చాలిక..
బొమ్మను చేసి ప్రాణము పోసి..ఆడేవు నీకిది వేడుకా
‘దేవత’ సినిమాలో మొత్తం ఎనిమిది పాటలున్నాయి. అందులో నాలుగు పాటలు రాసారు వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి. ఇప్పటి తరం మర్చిపోయిన ఈ కవి ఒక నాటక రచయిత, సంగీతకారుడు, పండితుడు, పద్య రచయిత కూడా. ఈయన కాక దాశరధి, పాలగుమ్మి పద్మరాజు, కొసరాజు చెరో పాటను ఈ సినిమాకు రాసారు. వాటన్నిటికీ కోదండపాణి సంగీతాన్ని అందించారు. అయితే ఈ పాటలన్నిటి నడుమ ఓ విషాద గీతం అతి పెద్ద హిట్ గీతంగా నిలిచింది. అదే “బొమ్మను చేసి ప్రాణము పోసి”. ఈ పాటను వీటూరి శ్రీ శ్రీ ఇద్దరూ కలిసి రాసారు. అంటే కలిసి కూర్చుని రాసారని కాదు కాని ఈ పాట రచనలో వీరిద్దరూ పాలుపంచుకున్నారు.
ఈ పాటకు ప్రారంభంలో ఒక సాకీ వస్తుంది. దాన్ని వీటూరి రాసారని కొందరు సినీ విశ్లేషకులు చెబుతారు. కాని ఫిభ్రవరి 1983లో విశాలాంధ్ర ప్రచురించిన ‘శ్రీ శ్రీ సినిమా పాటలు – పాడవోయి భారతీయుడా’ అనే పుస్తకంలో 40,41 పేజీలలో “బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక’ అనే పల్లవి వేటూరిది. అతని అనుమతి మీద, పద్మనాభం కోరిక మీద ప్రారంభంలోని సాకీతో సహా దీన్ని పూర్తి చేశాను. కీర్తిశేషుడు కోడండపాణి తయారు చేసిన బాణీ రచయితను తికమక పెట్టేదిగా ఉంది. కష్టపడి నేను రాసిన పాటలలో ఒకటిగా దీనిని చెప్పుకోవాలి” అని శ్రీ శ్రీ రాసిన ఫుట్ నోట్ ఉంది. శ్రీ శ్రీ మరణించింది జూన్ 15, 1983. ఈ పుస్తకం దానికి మూడు నెలల ముందు అంటే ఫిభ్రవరి 1983లో మొదటి ముద్రణతో బైటికి వచ్చింది. శ్రీ శ్రీ జీవితకాలంలొ ఇది బయటకు రావడం వల్ల దీన్ని ప్రామాణికంగా తీసుకున్నా ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ శ్రీ ఈ పుస్తక ప్రచురణ విషయంలో ఎంత వరకు పాలు పంచుకున్నారో చెప్పలేం. కాని వారి ముందు మాట కూడా ఈ పుస్తకంలో ఉండడంతో ఆయన చెప్పినదాన్నే ప్రామాణికంగా తీసుకుంటూ ఈ పాటను చర్చించుకుందాం.
శ్రీ శ్రీ ఎన్నోవందల పాటలు రాసినా , వాటి నడుమ ఈ పాటను వదిలేయకుండా విశ్లేషణకు తీసుకోవడానికి కారణం దీనిలో కనిపించే భక్తి, విరక్తితో కూడిన దార్శనికత. శ్రీ శ్రీ ఇంతకు ముందు, ఆ తర్వాత రాసిన పాటలన్నిటికీ భిన్నమైన ధోరణిలో సాగుతుందీ గీతం. భగవంతుని ప్రశ్నిస్తూ అసలు దైవమే లేడనే నాస్తికుడిగా ఆయన ఎన్నో గంభీరమైన ప్రశ్నలను అవసరం ఉన్న ప్రతి చోటా లేవనెత్తారు. కాని ఇది అలాంటి పాట కాదు. జీవితమంతా దుఖంలో ముంచేసి వేడుక చేసుకునే క్రూరత్వం నీకెందుకని దైవాన్నినిలదీసి అడిగే ఓ సామాన్య మానవుడి హృదయహోష. విన్నవారి కళ్ళు చెమర్చకుండా ఉండవు. దీన్ని ఘంటసాల గానం చేసిన విధానం మర్చిపోలేం. కడుపులో బాధనుతోడి బైటకు తీసి, అది చుట్టూ ముట్టీ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అనుభవంలోకి శ్రోతలను ముంచేయగల పాట ఇది.
జీవితంలో అన్నీ కోల్పోయి నిస్సహాయంగా మిగిలిపోయిన వ్యక్తి తన జీవితాన్ని పరిశీలించుకుంటూ, తనకు జరిగిన నష్టాన్నిగుర్తు చేసుకుంటూ వేదాంతంతో నిండిన విజ్ఞ్తత, అలసిపోయిన నిస్సహాయతతో ఆలాపించే గీతం ఇది. పాటకు ముందు బ్రతుకంతా బాధగా, కలలోని గాథగా కన్నీటీ ధారగా కరిగిపోయిందంటూ తలచినదేది జరగదని, జరిగేదేది తెలియదని, ఇదేమి వింత అని ఆశ్చర్యపోతున్న కవి ఆలోచనగా ఓ సాకీ వస్తుంది. మనిషి జీవితంలోని అనిశ్చితను అత్యంత విషాదంగా పరిచయం చేస్తుందీ సాకీ. తెలుగు జానపద గేయాలు, హరికథలు లేదా బుర్రకథల్లో పాటకు ముందు లేదా పాట మధ్యలో భావాన్ని వివరించేందుకు చెప్పే పరిచయ వాక్యాలను, పద్యాలను లేదా సంభాషణలను ‘సాకీ’ అంటారు. పాటలోని భావానికి ప్రాణం పోసి శ్రోతలను ఆకట్టుకునే రెండు నుండి నాలుగు వాక్యాల రచన ఇది. వేదాంత ధోరణిలోను గాఢమయినా భావాలతోనూ నిండి ఉండే పాటలకు ప్రారంభంలో వచ్చే సాకి ఆ పాట భావాన్ని స్పష్టపరచడానికి ఆ దిశగా శ్రోతలను సిద్దం చేయడానికి సాహిత్యంలో కవులు ఉపయోగిస్తారు.
అశాశ్వతాలతో నిండి ఉన్న ప్రపంచంలో బొమ్మను చేసి, దానికి ప్రాణము పోసి, ఆడిస్తాడు ఆ కఠినమైన దైవం. ఇది అతనికి వేడుకేమో. మాయలు చేసి ఆ ప్రాణం ఉన్న బొమ్మ గుండేను పిండేసే విషాదంతో నింపి నవ్వుతూ చూస్తుంటాడు. ఇదెక్కడి వింత. ఇక చాలు దాన్ని నేను భరించలేను అనే అర్ధంతో, ఈ పాటను అసహాత నింపుకున్న గాత్రంతో గానం చేసారు ఘంటసాల. ఆయన గొంతులో పలికే విషాదం భాష తెలియని వారిని సైతం కరిగిస్తుంది.
సాకీ, పల్లవి అయిపోయాక, ఇక మిగిలిన చరణాలన్నీ నిస్సందేహంగా శ్రీ శ్రీ సృష్టే. పైన ప్రస్తావించిన ఆయన పాటల పుస్తకం ప్రకారం, సాకీ కూడా ఆయనదే. కేవలం పల్లవి మాత్రమే వీటూరిది. ఏదేమయినా మరో రచయిత రాసిన వాక్యాలకు కొనసాగింపుగా అదే భావాన్ని అందుకుని పాటను రాసుకు వెళ్ళడం ఓ చేయి తిరిగిన కవి మాత్రమే చేయగల పని.
నిజంగా ఆ దైవం ఎంత క్రూరుడో కదా. ఎంత అందంగా ఈ భువిని సృష్టించాడు. ఎంత దయతో ప్రతి దాన్ని అద్భుతమైన అందంతో నింపేసాడు. కాని మళ్ళీ తన చేతితో తానే ఆ అందాలన్నిటినీ తుడిచేస్తాడు. అసలు అతనికి దేనిపై ప్రేమ ఉండదు. ఉంటే తాను సృష్టించిన అందాలను అలా ఎలా తుడిచిపారేయగలడు? ఎంత నిర్దయగా ప్రవర్తించి తన సృష్టినే అతి క్రూరంగా నాశనం చేసేస్తాడు? ఈ భువిలో, జీవుల జీవితాలలో దీపాలను ఎంతో ప్రేమతో శ్రద్దతో వెలిగించేది ఆ దైవమే, మళ్ళీ ప్రపంచాన్ని,జీవితాలను గాఢాంధకారంతో నింపేసేదీ దైవమే.వె లిగించిన దీపాలను ఆర్పేయడం దైవానికి ఎలా సాధ్యం? జీవితం పట్ల కొండంత ఆశను రగిలించి, దాన్ని అడియాశ చేసి ఆ మానవుడిని పాతాళలోకానికి, అదఃపాతాళానికి తోసేసే క్రూరత్వం ఆ దైవానికి ఎందుకుంటుంది? అసలు అంత దయ, అంత ప్రేమ వెనుక అంత క్రూరత్వం, రాక్షసత్వం ఎలాదాక్కుంటాయి?
ఈ సమాజంలో మనుషుల జీవితాలను పరిశీలిస్తే దైవం ఆడే క్రూర నాటకం అడుగడుగునా కనిపిస్తుంది. ఎలాంటి మాయా ప్రపంచాన్నిసృష్టించాడు. చుట్టూ ఎన్ని అందాలు, ఎంత ప్రశాంతత, కాని ఏ జీవి ఆ అందాలను శాశ్వతంగా పొందలేడు. కాస్త ఆనందాన్ని అనుభవించాడో లేదో భయంకరమైన పరీక్షల నడుమ నలిగిపోవలసిందే. మనిషి చేతిలో ఏదీ ఉండడు. నాది అనుకున్న ఏ శక్తీ అతనిది కాదు. ఎంతో సాధించినా అన్నిటిని పోగొట్టీ నిర్వీర్యం చేసి అతన్ని అసహాయుడిగా మార్చే స్తాడు అతనికి అన్నీ అందించిన దైవమే. ఆనందం అంచున విషాదం, అందం అంచునే అపరిపూర్ణత, పరిపూర్ణత్వానికి నోచుకోని జీవితేచ్చ, ఇన్నిటి నడుమ మనిషి జీవితాన్ని నలిపేసి తాను ఇచ్చినవన్నీ లాగేసుకుని, అతన్ని మానసికంగా విరాగిగా మార్చే దైవం ఎంత కఠినాత్ముడో కదా.
ఈ చరణంలో ఘంటసాల గానం వింటుంటే, ఆ విషాదం, నిర్వేదం మనలోకి పాకి ఒక రకమైన భయాన్ని కలుగ చేస్తాయి. అందాలు సృష్టించినావు, దయతో నీవూ అంటున్నప్పుడు ఆధ్రత, మరల నీచేతితో నీవే తుడిచేవులే అన్నప్పుడు ఆ గొంతులోని విషాదం, దీపాలు నీవే వెలిగించినావే.. గాఢాంధకారాన విడిచేవులే అన్నప్పుడు కోపం, కొండంత ఆశ అడియాస చేసి పాతాళలోకాన త్రోసేవులే అంటూ హెచ్చు స్వరంలో రాగాలాపన చేస్తూ అందులో నిస్సహాయతను ద్వనింపజేయడం ఆయనకే సాధ్యం. శ్రీ శ్రీ ఈ చరణంలో ఎన్నో భావాలను రంగరించి రాసారో, వాటన్నిటిని ఆ పదాల నడుమ ఘంటసాల పలికించగలగడం ఈ పాట గొప్పతనం. ఇలా ఇక ఎవ్వరూ రాయలేరు పాడలేరు అన్నంత గొప్పగా వినిపించే పాట ఇది. చరణం తర్వాత వచ్చే పల్లవిలో ఆ గాన గంధర్వుడి గొంతులోని నిర్వేదం గుండెను పిండేస్తుంది.
ఒకనాటి పచ్చటి తన జీవితాన్ని ఉద్యానవనంతో పోలుస్తూ అది ఇప్పుడు ఎక్కడా కనపడట్లేదని బాధపడుతున్నాడు కవి. ఈ చరణంలో ఒకనాటి ఉద్యానవనము నేడు కనము..అనే ప్రయోగాన్ని ఉపయోగించారు శ్రీ శ్రీ.’ కనము’ చూడము, కనిపించదు అనే అర్ధంతో ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఉపయోగించే పదం. కనము అంటే మేము చూడము, కనుము అంటే చూడు అనే అర్దంతో పద్యాలను రచించేవారు ప్రాచీన కవులు. ఇక్కడ కవి తన స్వీయ జీవితాన్ను తలచుకుంటూ, ఏకవచనం నుండి బహువచనంలోకి దిగడం, పాటలోని రైం కోసం, సందర్భోచితంగా భావాన్ని పదాలలోకి చొప్పించి రాయడం కోసం చేసిన ప్రయోగం. ఒకనాటి ఉద్యాన వనమూ నేడు చూడలేము. అది స్మశానంగా నీవు మార్చేశావే అని ఆ దైవాన్ని ప్రశ్నిస్తున్నాడు కవి. అనురాగం అనే అమృతాన్ని అందించి, జీవితాన్ని హాలాహలజ్వలగా చేసేసాడు. ఇక్కడ శ్రీ శ్రీ వాడిన ఆ బరువైన ప్రదప్రయోగం అతని శైలిని స్పష్టపరుస్తుంది. హాలాహలజ్వాల అనే పదంలోని బరువు, ఈ పాటలోని విషాదానికి సరిగ్గా సరిపోయింది. ఆ పాత్ర అనుభవిస్తున్న విషాద తీవ్రతను ఒకే ఒక పదంతో శ్రోతలకు చేరవేయగలగడం ఇక్కడ శ్రీ శ్రీ ఉద్దేశం.
ఆనందనౌక జీవితంలో పయనిస్తున్నసమయంలో శోకం అనే సముద్రంలో దాన్నిముంచేసినా మౌనంగా అంతా చూస్తూ ఉన్నాడు ఆ పైవాడు. ఎంత క్రూరత్వం అతనిలో. సృష్టించేది అతనే, నాశనం చేసేది అతనే. ఎంతటి విడంబన ఇది. తాను సృష్టించిన దాన్నితానే నిర్మూలించడం అతని హక్కు అనుకున్నా, అతి క్రూరంగా ఏ మాత్రం జాలీ, దయ లేకుండా అన్నిటినీ నాశనం చేయగల శక్తిని దైవం అని ఎలా కొలవగలం.
నిజానికి శ్రీ శ్రీ నాస్తికుడు. ప్రకృతిని మానవ శక్తిని నమ్మినవాడు. పాటంతా వింటుంటే ఓ భక్తుడు తన జీవితాన్ని చిందర వందర చేసిన దైవాన్ని ప్రశ్నిస్తున్నట్లే అనిపిస్తుంది. మరో పక్కన ఓ మానవుడు సృష్టించే శక్తిని, సృష్టిని నాశనం చేసే శక్తిని ఒకే స్థాయిలో కలిగి ఉన్న ప్రకృతి చేసే అతలాకుతలాన్ని చూస్తూ, ఈ ప్రతికూల శక్తులు ఒకే చోట నిక్షిప్తమై ఉండడంలోని జీవ రహస్యాన్ని, జీవిత విషాదానుభవాల నుండి అర్ధం చేసుకునే ప్రయత్నంగా ఈ పాటగా కూడా ద్వనిస్తుంది. అందుకే ఇది భక్తులకూ, నాస్తికులకూ, సామాన్య జనులకు, మేధావులకు ఒకేరకమైన అనుభూతిని, అనుభవాలని పంచుతుంది. ఎవరికి వారు ఈ పాటలోని అంశాలను అంగీకరించకుండా ఉండలేరు. దాన్ని తమ ఆలోచన, నమ్మకాల స్థాయిలో అన్వయించుకుంటూ జీవితాన్ని, మానవ ప్రస్థానాన్నిఅర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది స్పష్టమైన శాస్త్రీయ కోణం ఉన్నపాట కూడా.
ప్రకృతి విధ్వంసం, నిర్మాణ చక్రం, జీవావరణ వ్యవస్థల జన్మ కోసం నిరంతరం జరుగుతూ ఉండే ప్రాకృతిక పరిణామాలు. కొత్త జీవం కోసం శక్తిని, పదార్థాన్ని విడుదల చేయడానికి పాత నిర్మాణాలను ప్రకృతి విచ్ఛిన్నం చేస్తుంది. ఈ గతిశీల సమతుల్యత వ్యవస్థ స్తంభించిపోకుండా నిరోధిస్తుంది. మరణం, క్షయం, పునర్జన్మ అనే దశలు ఈ ప్రాకృతిక నిర్మాణ చక్రంలోని భాగాలే. మానవ జీవితం, జన్మలోనూ జరిగేది అదే. ఈ దశలు మనిషి భావోద్వేగాలతో ఆటాడుకుంటాయి. ఈ దశలన్నిటిని తటస్థంగా నిలబడి అనుభవించడం యోగులు మాత్రమే చేసే పని. మనిషి ఈ దశలలో ఎన్నో అనుభవాల నడుమ తీవ్రమైన భావోద్వేగాల సంఘర్షణను ఎదుర్కుంటాడు. మతం, దైవం పట్ల నమ్మకం ఉన్నవాళ్ళు తమ దారిలో ఈ శక్తిని అంగీకరిస్తే, శాస్తీయ అవగాహనతో జీవితాలను నడుపుకునే వాళ్ళు ఈ అంగీకార స్థితిని శాస్తీయ దృక్పదంతోనే చేరతారు. అయితే ఈ రెండు విభిన్న మార్గాలను ఆచరించే వాళ్లు కూడా ఈ తీవ్ర భావోద్వేగ స్థితిలను దాటుకుంటూనే ఆ అంగీకార స్థితికి చేరాలి. మరో మధ్యస్థ మార్గం ఉండదు. అందుకే శ్రీ శ్రీ రాసిన ఈ గీతం అటు శాస్తీయ దృక్కోణంతో జీవించే వారికి, ధార్మిక దారిలో నడిచేవారికీ తమ అంతర్గత సంఘర్షణగానే అనిపిస్తుంది. భువిలో నిరంతరం జరిగే సృష్టి, విద్వంసాల నడుమ మానవ సంఘర్షణను వ్యక్తీకరించే ఈ పాట అందుకే మానవ సంఘర్షణకు సజీవ చిత్రంగా నిలుస్తుంది.
శ్రీ శ్రీ రాసిన పాటల్లో జీవ తత్వాన్ని, తాత్వికతను చర్చించిన ముఖ్యమైన గీతం ఇది. జీవితంలోని విషాదాన్ని బుద్దినిగా మారకముందు గౌతముని మనసులోని ప్రశ్నలను అర్ధం చేసుకునే సాధారణ మానవ ప్రయత్నాన్ని వివరించిన అద్భుత గీతం ఇది.


లోతైన విశ్లేషణ.
ముఖ్యంగా ఆంగ్ల కవిత్వం లోని రైమింగ్ తో శ్రీ శ్రీ తెలుగు కవితల పోలిక గొప్పగా ఉంది.
సినీ గీతాలు సరే సరి… ఆయన ప్రేమ కవితలు రాయలేదనేవారికి “ఆనందం ఆర్ణవమైతే… ” కవిత తెలియకపోవచ్చు.
నా జీవన నిర్మాణంలో
నీ కంకణ నిక్వావాణంలో
ఎంత గొప్ప చరణాలు!