శ్రీ శ్రీ సినీ గీతాలు – 3

Spread the love

పాట సంః 5

కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే

పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే (2)

నుదుట కళ్యాణ తిలకముతో

పసుపు పారాణి పదములతో (2)

పెదవిపై మెదిలే నగవులతో

వధువునను ఓరగ చూస్తూంటే

జీవితాన పూలవాన … (కళ్ళలో)

సన్నాయి చల్లగా మ్రోగి

పన్నీటి జల్లులే రేగి (2)

మనసైన వరుడు దరిచేరి

మెడలోన తాళి కడుతూంటే…

జీవితాన పూలవాన (కళ్లలో)

వలపు హృదయాలు పులకించి

మధుర స్వప్నాలు ఫలియించి (2)

లోకమే వెన్నెల వెలుగైతే..

భావియే నందన వనమైతే..

జీవితాన

పూలవాన… (కళ్లలో)

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత అనుబంధమే కాదు సామాజిక సంబంధం కూడా. ఇది ఇప్పుడు హోదా, పరపతి, వ్యక్తిగత అహాలను ప్రదర్శించే సందర్భంగా మారిపోయింది కాని నిజానికి  వివాహ బంధానికి పునాది పరస్పర నమ్మకం, ప్రేమ, సహకారం. ఇద్దరు వ్యక్తులు ఒకటవడం అంటే రెండు కుటుంబాలు కలవడం, సామాజిక బాంధవ్యాల దిశగా  అడుగులు వేయడం. మానవ జీవన పరిణామంలో దీన్నివేడుకగా జరుపుకునే సాంప్రదాయం అందుకే ప్రాముఖ్యతను సంతరించుకుంది.

సాధారణంగా సోషలిజాన్ని ఆరాధించే వ్యక్తులు, పెళ్లి పేరుతో పరపతి ప్రదర్శనను ఖండిస్తారు. పెళ్లి పద్దతులనూ నిరసిస్తారు. ఎప్పుడో జరిగిన బాల్య వివాహాల సాంప్రదాయలలో ఇద్దరు పసివాళ్లకి వేడుక పంచుతూ పెద్దలు  ఆనందించడానికి మొదలయిన ఈ వేడుకలు అర్ధం లేనివిగా ఆ తర్వాతి తరంలో ఖండించారు సోషలిస్టులు. అందుకే వీళ్లు వివాహలలో వేడుకకు చోటు ఇవ్వకుండా దాన్ని ఒక కార్యక్రమంగానూ ప్రకటనగానూ నిర్వహించే పద్దతిని ప్రోత్సహించారు. వివిధ భావజాలాలకు చేందిన మేధావి వర్గం దీన్ని సమర్ధించింది.

శ్రీశ్రీ విప్లవాన్ని,సోషలిజాన్ని ప్రేమించిన వ్యక్తే. అలాగే వివాహ తంతుతో ముడి పడి ఉన్నమానవ భావోద్వేగాలనూ గౌరవించగల మనవతావాది. లేకపోతే  ఇలాంటి  ఒక గీతం ఆయన కలం నుండి జన్మించేదే కాదు.  వివాహ తంతుని ఒక అందమైన అనుభవంగా మలచి పాట రాయవలసి వచ్చినప్పుడు ఆయన వివాహ తంతుతో ముడిపడి ఉన్న తరతరాల సాంప్రదాయాలు, వీటితో కలగలసి పెరిగిన యువతీ యువకుల సున్నిత మనోభావాలను పరిగణంలోకి  తీసుకుని ‘ఆత్మీయులు’ సినిమా కోసం ఒక అందమైన వివాహ గీతాన్ని రాసారు.

స్త్రీ పురుషులకు, అందులోనూ ప్రేమికులకు పెళ్లి రోజు ఒక మధురమైన అనుభవం. దాని చుట్టూ ఎన్నో కలలూ కోరికలూ దాగుంటాయి. వాటిలో  కల్పన, వ్యక్తిగత  భావోద్వేగాలు, ఊహాచిత్రాలు కలగలిసి ఉంటాయి. అనుభవం కన్నా అనుభూతుల ఆస్వాదన గొప్పగా ఉంటుంది. పెళ్లి రోజును గొప్ప సుదినంగా మలచేవి ఆ అనుభూతులే. అవి ఆ వధూ  వరులకు మాత్రమే అతి ముఖ్యమైనవి.  వీటి చుట్టూ లాజిక్ ఉండదు. జీవితంలో ఇలాంటి కల్పన, అనుభూతుల సంగమం అవసరం కూడా. గుడిపాటి వెంకటాచలం తన  మ్యూజింగ్స్ లో పెళ్లి వెనుక రాజకీయాలను, కౄరత్వాన్ని విమర్శిస్తూనే, మల్లెల పరిమళానికి, పన్నీరు సువాసనలకు పట్టు చీరల  రెపరెపలకు తానూ పులకరించిపోతానని రాసుకున్నాడు. అర్ధం లేని సాంప్రదాయాలంటూ వాటిని విమర్శించినా, ఆ వేడుకల చుట్టూ అల్లుకుని ఉన్న ఆశావాదం, ఆహ్లాదం, కలలు ఊహలు, అందరినీ ఏదో రకంగా ఆకర్షిస్తాయి. ఇది సహజం.

శ్రీ  శ్రీ పెళ్ళి వేడుకలపై రాసిన ఈ పాట అందుకే ఎంతో అందంగా ఉంటుంది. ఆ పెద్దాయన కలంలోని సున్నితత్వం ముగ్ధులను చేస్తుంది. ఆయనలోని భావ కవిత్వపు పరిమళాలను పరిచయం చేస్తుంది. ఈ  సినిమాలో కూడా ఆయన ఈ ఒక్క పాటే రాశారు. కాని ఎంత అందంగా రాయగలిగారో.

కళ్లలో పెళ్ళి పందిరి కనిపిస్తుందట.  పల్లకీలో ఊరేగుతున్న ముహూర్తం మదిలో కదులుతుందట. ఆ యువతీ యువకుల పెళ్లి కుదరడం, ఆ రోజు ఎప్పుడా అని కలలలోకి తేలిపోతూ ఆ  జరిగబోయే వివాహ వేడుకలకోసం ఎదురు చూడడంతో పాట  పల్లవి మొదలవుతుంది.

ఆ తర్వాత ప్రేయసిని పెళ్లి  కూతురుగా ఊహించుకుంటున్నాడు ప్రియుడు, నుదుటున కళాణ తిలకం, పాదాలకు పసుపు పారాణితో,  జీవితం పట్ల ఆశను చిరునవ్వుగా మార్చుకుని, దాన్ని పెదవులలో నింపుకుని, వధువు తనను ఓరగా చూస్తుంటే, ఇక అంతకన్నా మరో ఆనందం ఏం ఉంటుంది. వివాహం, అతను ప్రేమించిన స్త్రీని అతనికి జీవిత భాగస్వామిగా మార్చుతుంది. అప్పటి దాకా వారు ప్రేమికులయినా సామాజికంగా పరాయివారే. పూర్తిగా తన జీవితంలో భాగం అవబోతున్న తన ప్రేయసిని సమాజం ముందు తన వ్యక్తిగా అతను మొదటిసారి అందరి ఎదుట కలవడమే పెళ్లి రోజు.  అది అతనికి ఓ మధురమైన అనుభవం. ప్రతి యువకుడు ఈ రోజుని ఊహిస్తాడు.  కలలు కంటాడు. తాను ఇష్టపడ్డ స్త్రీ, కోరుకున్న భాగస్వామి తన వ్యక్తిగా మారుతున్న రోజును, ఆ  క్షణాలను ఆస్వాదిస్తున ఓ యువకుడి భావావేశాన్ని ఈ చరణం వ్యక్తీకరిస్తుంది.

ఇక్కడ కవిగా శ్రీ శ్రీ ని గమనించండి. పెళ్లి వేడుకలను కాదు ఆ వేడుకలతో నిండి ఉన్న మానవ అనుభూతులను మాత్రమే ఆయన ప్రస్తావిస్తున్నారు. బాహ్య కార్యక్రమాలను కాక వాటితో ముడిపడి ఉన్న మానవ అనుభూతులను వివరిస్తున్నాడు. ఎటువంటి సందర్భంలోనయినా మనిషి, మనిషితనం శ్రీ  శ్రీకి ముఖ్యమైన విషయాలు. పెళ్లి అనే ఓ వ్యక్తిగత బంధం సమాజ ముద్రను సంపాదించుకునే ఆ పెళ్లి రోజు వేడుకలలోని అందాన్ని, వైభవాన్ని సాంప్రదాయంగా ముద్ర పడిన వివాహ తంతును కాక, ఆ ఇద్దరి మనసుల్లో  రేగుతున్న భావావేశాల వైపు శ్రోతలను తీసుకెళ్లడం ఇక్కడ శ్రీ శ్రీ సాధించిన విజయం. అందుకే ఇప్పటికీ ఇది చాలా మంది వ్యక్తిగతంగా ఇష్టపడే వివాహ గీతం. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఈ పాటలోని అనుభూతికి పరవశిస్తారు.  

 అతని కలకు స్పందనగా ఆమె తన కలను జోడిస్తుంది. సన్నాయి చల్లగా మోగి, చుట్టూ పన్నీరు జల్లుగా  పడుతుంటే, తన మనసుకు నచ్చిన వ్యక్తి వరుడిగా మారి దగ్గరకు చేరి  తాళి కడుతుంటే, జీవితంలో పూలవాన కురుస్తున్న అనుభూతి కలుగుతుందని ఆమె బదులిస్తుంది.

ఈ పాటను చిన్నప్పటి నుంచి వింటున్నా, ప్రతి  సారి ఇది  ఇంకా ఇంకా నచ్చుతుంది. మొదటి కారణం కవి ద్వారా జరిగిన ఈ పాట నిర్మాణం అయితే రెండో కారణం ఘంటసాల, సుశీల గార్ల గానం. తెలుగు భాషలో ప్రతి అక్షరానికో విలువ వుంది. సరైన ఉచ్చారణ భాషా సౌందర్యాన్ని పెంచుతుంది. శ్రీ శ్రీ  చాలా సరళమైన పదాలతో ఈ పాటను రాసారు. ఎక్కడా గ్రాంధికం కనిపించదు. కాని ఆయన ఉపయోగించిన  పదాలను గమనించండి. పల్లవిలో ‘ళ’, ‘ల’ అనే అక్షరాలను ఆయన  ఉపయోగించిన తీరు గమనించండి. కళ్లలో, పెళ్లి, పల్లకి, కదలాడే, అనే పదాలలో ల, ళను ఉచ్చరించే పద్దతి వేరుగా ఉంటుంది. పాటలోని సంగీతం మాటున అంత స్పష్టంగా ఆ తేడా తెలిసేలా పలకడం, అదీ గానంలో ఆ  ఉచ్చారణ అంతే స్పష్టంగా రావడం, ఇప్పటి తరానికి చాలా కష్టమైన విషయం. ఘంటసాల సుశీల గార్ల గానంలో ఈ అక్షరాల ఉచ్చారణ ఎంత అందంగా ఉంటుందో. ఆ స్పష్టత ఈ  పాటకి ఇంకా అందానిచ్చింది. తెలుగు అక్షరాలను సరిగ్గా  పలకగలిగితే ఆ ఉచ్చారణ ఎంత మధురంగా ఉంటుందో ఈ పాట నుండి తెలుసుకోవచ్చు.

ఇక ఈ రెండు చరణాలతో పాటను శ్రీ శ్రీ నిర్మించిన శైలిని  చూద్దాం. మొదటి చరణం ప్రియుడు పాడుతున్నాడు.  అతను ఆ ఒక్క చరణంలోనే ప్రియురాలిని పై నుండి క్రింద దాకా చూసేసాడు. నుదుటున కళ్యాణ తిలకం, కాళ్లకు పసుపారాణి, పెదవులపై చిరునవ్వు, కళ్ళతో ఓరగా తనను చూస్తున్న ప్రియురాలి అందాన్నిఆస్వాదిస్తున్నాడు. ఇది పురుషుని దృష్టి, స్త్రీ శరీరం అతని మొదటి ఆకర్షణ. అంతే నిజాయితీగా దాన్ని ప్రస్తావిస్తున్నాడు ఆ ప్రియుడు. పెళ్లి అనే మధురానుభూతిని తలచుకుంటున్న ఆ ప్రియుడికి ఆమె అందం, మొదట ఆకర్షిస్తుంది. ఆమె తనను ఓరగా చూడడం మరీ నచ్చుతుంది. మరి ఆమె, చుట్టూ సన్నాయి వాదం, తలపై రాలే పన్నీటి  జల్లు, అతను తన చెంతనున్నాడన్న భరోసా, అతను కట్టే ఆ తాళిబొట్టు ఇవి ఆమె అనుభూతిస్తున్న మాధుర్యాలు.

పురుషుడు స్త్రీని శరీరంగానే ఆరాధిస్తాడు. స్త్రీ ఆతని సాంగత్యాన్నిఆరాధిస్తుంది ఆ ప్రియురాలికి ఆ పెళ్లినాటి వాతావరణం, ఆ పరిమళాల  నడుమ అతని సాంగత్యం, అతను తన చెంత నిలిచి ఉండడం అందమైన అనుభవాలు. ఈ  స్త్రీ పురుష వైరుధ్యాన్ని  అంతే గొప్పగా ఈ పెళ్లి పాట ప్రస్తావించడం అనుకోకుండా జరిగింది కాదు. కవి స్త్రీ పురుషులను పరిశీలించిన అనుభవంతో, వారి భావావేశాలలోని ఈ  తేడాను పట్టుకోగలిగితేనే సాధ్యం.  పెళ్ళి రోజున స్త్రీ ప్రురుషుల భావోద్వేగాలను, వారి ప్రాధాన్యతలను హృదయంతో పరిశీలించలేకపోతే ఇలా రాయడం సాధ్యపడదు.

విప్లవాన్ని ప్రేమించే కవులు కఠినమైన పదాలతోనూ, ఘాటైన పద ప్రయోగాలతోనూ కవిత్వాన్ని రాస్తారని మహా ప్రస్థానాన్ని ఉదాహరణగా చూపిస్తారు చాలా మంది. కాని శ్రీ శ్రీ సున్నితమైన మానవ మనోభావాలను ఎంత హృద్యంగా తన పాటలలో  పలికించారో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. సినిమాలకు రాస్తూ సినీ పాత్రలకు అనుకూలంగా ఆయన ఇలాంటి  పాటలను రాసారని అనుకున్నా వాటిలో ఆయన ప్రదర్శించిన ఆ మానవ స్వభావంలోని తేడా, ఆ మనోవిశ్లేషణ అయన మేధను పరిచయం చేస్తుంది. కవి ఏదైనా రాస్తాడు, అది అతని వృత్తి అనుకున్నా, ఆ వృత్తిలో బయటపడే కవి వ్యక్తిత్వం ఆ కవి పాటలకు ఒక అస్థిత్వాన్ని ఇస్తుంది.

ఇక మూడో చరణంలో ఆ ఇద్దరూ తమ భవిష్యత్తు గురించి కలల్లో తేలిపోతారు.  వలపు హృదయాలు పులకించి అనే వాక్యం ఇక్కడ చాలా మధురంగా వినిపిస్తుంది. ఇది ఇక్కడ కవి చేసిన ప్రయోగమనే చెప్పవచ్చు. ప్రేమతో  నిండిన హృదయాలు అని చెప్పడం కవి ఉద్దేశం. ఈ వివాహ బంధంతో ప్రేమతో నిండిన  హృదయాలు  పులకరించగా, మధురమైన స్వప్నాలు  ఫలించగా లోకమంతా వెన్నెల వెలుగై వారి భవిష్యత్తంతా నందనవనమైతే వారి  జీవితాలు పూలవానలో తడిచిపోతూ గడిచిపోతాయట.

నిజానికి ఈ మూడో చరణాన్నివేరు చేస్తే ఇది వివాహ పాటగా మాత్రమే అనిపించదు. ప్రతి మానవ జీవితం ఈ ప్రపంచంలో ఎలా ఉండాలని కోరుకుంటుందో చెప్తున్నట్లుగా ఉంటుంది. సందర్భాన్ని  మరచి ఒక్కసారి  ఆ చరణాన్ని వింటే, జీవితం పట్ల ప్రతి మనిషికీ ఉన్న కలను, ఆశను ఈ చరణంలో కవి ప్రకటిస్తున్నాడు. ప్రేమతో హృదయాలు నిండి, మధురమైన కలలు పండి, లోకమంతా వెన్నెల  వెలుగయి, భవిష్యత్తు నందనవనం అవ్వాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. నిజానికి  ఇది మానవ హక్కు కూడా. ఇక్కడ శ్రీ శ్రీ పలికించింది అసలైన సామ్యవాదమే. కుల మత వర్గ జాతి ఆర్ధిక  తేడాలు లేక మనిషి కేవలం ప్రేమతోనూ శ్రమతోనూ తమ కలలను సాకారం చేసుకోగల అందమైన భవ్విష్యత్తు కోసం ఆశ పడడమే ఇక్కడ కనిపిస్తుంది. పూర్తి రొమాంటిక్ వివాహ గీతంలో ఎంతటి సామ్యవాదాన్ని జోడించాడు ఆ మహాకవి. అది కదా శ్రీ శ్రీ వ్యక్తిత్వం. అలా వివాహం, ప్రేమికుల కలలంటూ మొదలెట్టి ఈ పాటను మానవ భవిష్యత్తు వైపుకు నడిపించిన శ్రీ శ్రీ ఆయనకు ఆయనే సాటి.

వివాహబంధం చుట్టూ యువతీ యువకుల ఆశలు, కోరికలు, భవిష్యత్తు పట్ల వారి కలలను సరళమైన పదాలతో ఎన్నో భవిష్యత్  జంటలు అవి  తమ భావాలే అనుకునే టంతటి  అంగీకారంతో రచించిన ఈ పాట ఈ రోజుకీ వినిపిస్తూ ఉంటుంది. ఈ పాటకు సంగీతం అందించింది ఎస్. రాజేశ్వరరావు. ఆయన బాణీ కూడా ఈ పాటకు ఒక ఉత్సాహాన్ని, కలల్లో తేలిపోతున్న భావనను కలిగిస్తుంది.

పాట సంః 6

ఎవరో వస్తారని ఏదో చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా

నిజము మరచి నిదురపోకుమా

బడులేలేని పల్లెటూళ్ళలో…

బడులేలేని పల్లెటూళ్ళలో చదువేరాని పిల్లలకు

చవుడు రాలే చదువుల బడిలో

జీతాల్ రాలని పంతుల్లకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా  (ఎవరో)

చాలీ చాలని పూరిగుడిసెలో…

చాలీ చాలని పూరిగుడిసెలో

కాలేకడుపుల పేదలకు

మందులులేని ఆసుపత్రిలో

పడిగాపులు పడు రోగులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా  (ఎవరో)

తరతరాలుగా మూఢాచారపు

వలలో చిక్కిన వనితలకు

అజ్ఞానానికి అన్యాయానికి

బలియైపోయిన పడతులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా 

కూలిడబ్బుతో లాటరీ టికెట్టు… లాటరీ టికెట్ట్

కూలిడబ్బుతో లాటరీ టికెట్ కొనే దురాశా జీవులకు

దురలవాట్లతో బాధ్యత మరచి

చెడే నిరాశా జీవులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా (ఎవరో)

సేద్యం లేని బీడునేలలో ఓ….

సేద్యం లేని బీడునేలలో

పనులే లేని ప్రాణులకు

పగలూ రేయీ శ్రమపడుతున్నా

ఫలితం దక్కని దీనులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా 

మనిషి చేసే పెద్ద తప్పిదం తన జీవితంలో ఓదార్పు, తన పరిస్థితులలో  మార్పు వేరెవరి ప్రమేయంతోనో వస్తుందని ఆశపడుతూ ఉండిపోవడం. తన జీవితానికి తానే కర్తనని తానే పరిస్థితులతో యుద్దం చేయాలనే నిజాన్ని విస్మరించడం. ఈ స్వభావం మన దేశంలో మరీ ఎక్కువ కనపడుతుంది. కళ్ల ముందు ఏం జరుగుతున్నా మనం మాట్లాడం. వేరెవరో వచ్చి మాట్లాడాలని ఎదురు చూస్తాం. మన రోజూవారి జీవితాలలో మనం ఎదుర్కుంటున్న ప్రతికూలతలకూ భాద్యత వహించం, ఎవరో వచ్చి మన సమస్యలను పరిష్కరించి మన జీవితాలను, మన దేశాన్నీ, మన రాజకీయాలను బాగు చేస్తారని ఆశిస్తాం. ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఉద్దరించాలని ప్రార్థిస్తాం.

నిజానికి ఇది అతిపెద్ద పలాయనవాదం. శక్తి హీనులు, చేతకాని వారు తెలియక చేసే తప్పిదం అయితే, శక్తి యుక్తి ఉండి కూడా పరిస్థితులను సరి చేయడానికి శ్రమ పడవలసి వస్తుందని, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని మౌనంగా అన్నీ చూసి చూడనట్లుగా ఉండడం అలవాటు చేసేసుకుంటారు చాలా మంది. తమ స్వార్ధాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇదే పరువుగా బ్రతికడం అంటూ పలాయనావాదాన్నే మర్యాద అనే ఆదర్శంగా పేరు మార్చుకుని జీవిస్తుంటారు మర్యాదస్తులు. దేశం కొంచెం కొంచెంగా చీడ పట్టిన వృక్షంలా నాశనం అవుతూ ఉంటే దీన్ని బాగు చేసే వ్యక్తి కోసం ఇక్కడి మేధావులూ, సామాన్య జనులూ  ఒకే తీరుగా ఎదురు చూస్తూనే ఉంటారు.

అందుకే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి  ఎవరో వచ్చి ఏదో  చేస్తారని ఆశపడి జీవించినంత కాలం భంగపడుతూనే ఉంటాం. మార్పు కోసం మనం ఏం చేయాలన్న దిశగా మనం ఆలోచించనంతకాలం, మన వంతు భాద్యత తీసుకోనంత కాలం ఎక్కడా ఏ మార్పు సంభవించదు.

కొన్ని దశాబ్దాల క్రితం శ్రీ శ్రీ రాసిన ఈ పాట నేటి పరిస్థితులకూ అన్వయించబడుతుంది అంటే, నిజానికి అది అత్యంత విషాదకర స్థితి. ఎన్నిసంవత్సరాలయినా అవే సమస్యలు, అదే పలాయనవాదం, అదే సిగ్గులేనితనం. ఉచితాల మీద బ్రతికే బడుగు జీవులు, తాత్కాలిక లాభాలకు అశపడి సమస్యను నిద్రపుచ్చడం తప్ప పరిష్కరించడం చేతకాని నిష్క్రియతత్వంతో నిండిన మనుషులతో నిండిన సమాజం మనది. ఎప్పుడు మనం మారేది? ఎప్పుడు మనలో ఆలోచన మేల్కొనేది, ఎప్పుడు సొంత లాభం కొంత  మానుకుని పొరుగువాడికి తోడ్పడే ఆలోచన అలవాటుగా మారేది?

ఈ పాట వింటున్న ప్రతి సారి ఆవేశం, ఆవేదన సమపాళ్లలో అనుభవిస్తాం. ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా ఈ పాటను గుర్తు తెచ్చుకోవాల్సిన సన్నివేశాలు జీవితంలో మనకు అనుభవంలోకి రాలేదు? నిన్నటిని నిన్న తాజాగా పార్లమెంట్లో సామాన్యుని తరపున మాట్లాడిన ఓ ప్రజా ప్రతినిధిని చూసాం. అబ్బా ఇకనేం దేశం మారుతుంది, రాజకీయాలు మెరుగుపడతాయి అని ఆశపడ్డాం. కొన్ని రోజులలోనే ఆ మేధావి అతి మేధావితనం బైటపడి ఎందుకని ఇతరులేదో చేస్తారని ఎన్నో అనుభవాల తర్వాత కూడా ఆశిస్తాం అన్న ప్రశ్న మళ్లీ మళ్ళీ వేసుకుంటున్నప్పుడు కూడా మదిలో శ్రీ శ్రీ రాసిన ఈ పాటే మెదులుతూ ఉంది.

“ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా.”. ఎంత గొప్పగా చెప్పాడో, ఎంత అనుభవంతో చెప్పాడో ఆ మహానుభావుడు. దాన్ని పూర్తిగా మనసుకు పట్టించుకుని మనం చేయాల్సింది చేసుకుంటూ, మనల్ని మనం నమ్ముకుంటూ జీవిస్త్తే ఆశాభంగాలు, మోసపోయిన అనుభవాలు జీవితంలో కాస్త తగ్గుతాయేమో.

దేశంలోని విషాద స్థితిని సూచిస్తూ ముందు పాటలో విద్యావ్యవస్థను వర్ణిస్తాడు కవి. పల్లెటూళ్లలో చదువుకోవాలనుకునే పిల్లలకు బడులు లేవు. ఇక పిల్లలకు చదువేం వస్తుంది. ఉన్న బడులు చవుడు రాలుతూ అతి దీనావస్థలో ఉంటే అందులో జీతం రాని పంతుల్లే మిగిలారు.  నిజానికి ఇప్పుడు పంతుళ్ల విషయంలో కాస్త మార్పు వచ్చినా, సరైన బడులు లేవు, బడులంటూ ఉన్నవి తల్లి తండ్రులను రోడ్డుపాలు చేస్తున్నాయి. ఆ బడులలోని చదువులు ఎవరికీ ఉపయోగపడట్లేదు. ఆ బడులలో చదువుకున్నవారికి జీవితం తెలీదు, దేశం తెలీదు, డబ్బు సంపాదన తప్ప వ్యవస్థ గురించి అవగాహనా లేదు. ఈ పరిస్థితులను ఎవరో మారుస్తారని ఎంత కాలం ఎదురు చూస్తూ ఉంటాం?

ఈ పాట శైలిలో ఒక కొత్తదనం ఉంది. పల్లవి లోని రెండు వాక్యాలలో రెండు పదాలు కలిపి ప్రతి చరణంతో వాటిని జోడిస్తూ తాను చెప్పాలనుకున్న విషయంలో మరింత స్పష్టత తీసుకొస్తూ ఒక నినాదంలా దాన్ని వినిపిస్తాడు కవి. పల్లవిలో “ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకుమా” అంటూ ప్రతి చరణంలో ఓ సమస్యను ప్రస్తావిస్తూ దేశంలోని విషాద పరిస్థితులను వివరిస్తూనే ఆఖరున “ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా” అనడం ఒక నినాదంగా అనిపిస్తుంది. ఈ పరిస్థితులను అనుభవిస్తున్న వాళ్లు వారే పూనుకుని మార్పుకు ప్రయత్నించాలి తప్ప తోడు ఎవరూ రారని, ఏ మేలు చేయరని ఎవరి పోరాటం వారిదేనని కవి చెప్పడంలో ఒక కఠినమైన వాస్తవం ఉంది, అత్యంత విషాదమూ ఉంది. 

చాలీ చాలని పూరి గుడిసెలో, కాలే కడుపులతో జీవిస్తున్న పేదలు, మందులు లేని ఆసుపత్రిలో పడిగాపులు పడే రోగులకు ఎవరూ తోడు రారు, ఏ మేలూ చేయరు. ఏదో జరుగుతుందని చూస్తూ ఆశిస్తూ మోసపోవద్దు అంటున్నాడు కవి. నిజానికి ఈ రోజుల్లో ఆకలి చావులు అంత ఎక్కువ లేకపోవచ్చు, ఆసుపత్రిల నిండా మందులూ ఉండి ఉండవచ్చు కాని ప్రైవేటీకరణ వైద్యాన్ని, విద్యను, ఆకలిని పూర్తిగా మార్కెటీకరణ చేసేసింది. మనం తినేది, చదివేది, వైద్యం అన్నీ మార్కెట్ చేతుల్లోనే ఉన్నాయి. మన జీవితాలను నియంత్రిస్తుంది అదే.

ఒకప్పుడు మనిషులకు కనీస అవసరాలు తీర్చుకునే వెసులుబాటు లేకపోవడంతో వారి జీవిన ప్రమాణాలు అతి దారుణంగా ఉండేవి. ఇవాళ వస్తు మార్పిడి పెరిగింది. అందుబాటులో అవసరాల కోసం కొన్ని వస్తువులు లభ్యం అవుతున్నాయి. కాని అవి సామాన్యులకు చేసే మేలు కన్నా కీడే  ఎక్కువ. సామాన్యుడు అన్ని రకాలుగా మోసపోతూనే ఉన్నాడు. గొప్ప విద్య అందుకుందాం అనుకుంటే అది ఎందుకూ పనికిరావట్లేదు. వైద్యం కోసం పరుగెడితే అందులో మహా ఘోరాతి ఘోరమైన మోసాలను ఎదుర్కుంటున్నాడు. ఇప్పటికీ సామాన్యుల జీవితాలు కాలుతున్న కడుపులతో, మందులు సమకూర్చుకోలేని నిస్సహాయతతో,  కనీసావసరాలంటూ నిండిపోయిన  మార్కెట్ సరుకుల మాటున, నాయకులు చేసే వాగ్దానాల మాయలో నలిగిపోతున్నాయి.  ఇదే తీరులో ఇంకెన్నాళ్లు

స్త్రీల జీవితాలు మూఢాచారపు వలలో పడి నలిగిపోతున్నాయి. అజ్ఞానానికి, అన్యాయానికి స్త్రీలు బలవుతూనే ఉన్నారు. నిజానికి ఇప్పుడు స్త్రీలు సంపాదనా పరులైనా మూఢాచారాలు, అజ్ఞానం, అన్యాయం వారిని అంటిపెట్టుకునే ఉన్నాయి. స్త్రీల దీన గాధలకు కారణాలకు మూడు ముక్కలలో బైట పెట్టారు కవి. మన సమాజంలో స్త్రీల జీవితాలు తండ్రులు, భర్తలు, కొడుకుల అండలో కడతేరిపోవాలన్న ఆలోచనే ఇంకా ఉంది. ఎవరి జీవితాలకు వాళ్లే బాధ్యత వహించాలి తప్ప మనల్ని ఎవరో ఉద్దరిస్తారనే ఆలోచన స్త్రీలకు ఏ మాత్రం మేలు చేస్తుంది?

కూలి చేసి సంపాదించిన డబ్బుతో లాటరీ టికెట్ కొని ఎప్పుడో అదృష్టం కలిసి వస్తుందని, తాను లక్షాధికారిని అయిపోతానంటూ కలలు కంటూ బ్రతికే దురాశాపరులు దేశం నిండా ఉన్నారు. ఆ రోజుల్లో లాటరీ టికెట్ తో దురాశ ప్రకటించుకుంటే ఇపుడు షేర్ మార్కెట్లు, ఆన్ లైన్ బెట్టింగ్లు, ఇంకా ఎన్నో లెక్కకు మించిన కొత్త పద్దతులు మానవ దురాశను రెచ్చకొడుతూనే ఉన్నాయి.  మరో పక్క దురలవాటలకు లోనయి, బాధ్యత మరిచి చెడిపోతున్న యువతతో దేశం నిండిపోయింది. ఆ నాడు తాగుడు ఒక్కటే ఇప్పుడు డ్రగ్స్, మత్తు పదార్ధాలు యదేచ్చగా స్టేటస్ సింబల్ గా ఎవరి తాహతుకి మించి వారిని రోడ్డున పడేయడానికి ఏరులై పారుతున్నాయి. ఈ పరిస్థితులను ఎవరో వచ్చి ఏం మారుస్తారు? ఎదురు చూస్తూ మోసపోవడం తప్ప సామాన్యుల జీవితాలలో ఏ మార్పు ఉండదు కదా.  

ఇక రైతన్నల దగ్గరకు వస్తే, సేద్యం చేసే పరిస్థితులు లేని బీడు నేలలు, ఏ పని లేని రైతు కూలీలు, రోజంతా శ్రమ పడుతున్నా ఫలితం దక్కని దీనులే కనిపిస్తున్నారు. ఆ రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు రైతుల పని ఇంకా దారుణంగా ఉంది. నాటి కన్నా నేడు రైతు ఆత్మహత్యలు ఎంత పెరిగాయి? ఎన్ని కుటుంబాలు చితికిపోయాయి. ఎందరి రైతులు పట్నాలకు వలసలు వెళ్లారు? ఎందరు నగరంలో భవనాల కట్టే దగ్గర కూలీలుగా మిగిలిపోయారో చూస్తే కడుపు తరుక్కుపోతుంది. రైతన్న బ్రతుకు ఎంత ఘోరంగా మారింది. వీరి పరిస్థితులను ఎవరో వచ్చి ఎందుకు మారుస్తారు?

సమస్య సామాజికమైనా వ్యక్తిగతమైనా ఏదో అద్భుత పరిష్కారం కోసం ఎదురుచూడడం మూర్ఖత్వం. మనిషికి మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు నశించిపోతున్నాయి. ఈ పరిస్థితులలో మనుష్యులు సమాజంలో సభ్యులుగా కాక వ్యక్తివాదులుగా ప్రవర్తిస్తున్నారు. మరొకరి సమస్యలతో వారు సంబంధంపెట్టుకోరు.ఇక ఎందుకు కలగజేసుకుని మార్పు కోసం ప్రయత్నిస్తారు? వ్యక్తులుగా, విభజితులుగా మనం జీవించలేం అని సమాజంలో ప్రతి సమస్య పర్యవసానాలు మనదాకా వ్యాపిస్తాయని తెలిసినా మనిషులు సమస్యలపై పోరాడటానికి సిద్దపడట్లేదు. ఆ పోరాటం మరెవరో చేస్తారని, తమ స్థితిగతులను మారుస్తారనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు.

ఏదో అద్భుతం జరుగుతుందని ఎదురుచూడటం వల్ల కాకుండా, స్వీయ కృషి, సామూహిక చర్యల ద్వారానే మార్పు వస్తుందనేది ఈ పాట ఇచ్చే సందేశం. ప్రతి ప్రాణికి కనీస అవసరాలు పొందే హక్కు ఉంది. ఆ హక్కులకై వారే పోరాటం చేయాలి. ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. దశాబ్దాల క్రితం రాసినప్పటికీ, ఈ పాట ఇప్పటికీ సందర్భోచితమే. ఇందులో చర్చించిన గ్రామీణ పేదరికం, వనరుల కొరత, సామాజిక అన్యాయం ప్రస్తుత సామాజిక సందర్భంలోనూ చర్చనీయాంశంగానే ఉన్నాయి.

శ్రీ శ్రీ సమజంలో విప్లవం రావాలని, ప్రజలు చైతన్యవంతులవ్వాలని, కార్యశూరులుగా మారాలని, భౌతిక సౌకర్యాల కోసం కాక ప్రజా జీవితాన్ని  మెరుగు పరచడానికి ఉద్యమాల బాట పట్టాలని కోరుకున్నారు. సినిమా మానసికోల్లాసం కోసం అని చాలా మంది అనుకుంటున్న సమయంలోనే సామాజిక చైతన్యం దిశగా కలం కదిలించిన కవి శ్రీ శ్రీ.. తాను నమ్మిన అభ్యుదయాన్ని సినీ సాహిత్యంలో భాగం చేసూ ఆ దిశగా కలాన్ని పూని పని చేశారు. నిజానికి శ్రీ శ్రీ తరువాత ఇటువంటి సామాజిక సమస్యలను చర్చిస్తూ రాసిన సినీ గీతాల సంఖ్య బహు తక్కువ. ఇది గమనిస్తే ఆయన ఎంతటి గురుతర భాద్యతను ఒంటరిగా నిర్వహించారో అర్ధం చేసుకోవచ్చు.

తెలుగు సాహిత్యంలో  శ్రీ శ్రీ తర్వాత అంతటి  ప్రభావాన్ని  చూపే కవి మరొకరు లేకపోవడానికి కారణం సమాజాన్ని దర్శించే ఆ కవుల దృష్ట్రికోణమే. శ్రీ శ్రీ వ్యక్తిగత బలహీనతల నుండి ఆయన ఆలోచనల దాకా అంతా బహిర్గతమే తప్ప దేనికీ  ముసుగులేసుకుని జీవించిన వ్యక్తి కాదు. ఆ నిజాయితీ ఆయనకెంత ఉపయోగపడిందో తెలీదు కాని ఆయన కవిత్వపు పదునును పెంచింది. చాలా మంది కవులలో కనిపించని వ్యక్తిగత నిజాయితీ అది. అది కవి ఆత్మగా మారి ఆయన కలం గుండా ప్రవహించి నేటికీ వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ పాటలు అంత స్పూర్తిదాయకంగాను, పదునుగానూ  ఉండి ఆలోచించే ధైర్యం ఉన్నవారికి ఎప్పుడూ మార్గనిర్దేశికం చేస్తూ ఉంటాయి.

తెలుగు సినీ ప్రపంచంలో ఎంత మంది కవిరాజులు ఉన్నా కేవలం 42 సినిమాలకు మాత్రమే శ్రీ శ్రీ పాటలు రచించినా, ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరం. తెలుగులో “ఎవరో వస్తారని ఏదో చేస్తారని” అనే  పాట తెలుగు సినీ గీతాల నడుమ ఎలాంటివారు కూడా విస్మరించలేని ఓ పదునైన గీతం.

పి. జ్యోతి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *