తల్లి

Spread the love

బెలోరష్యన్ పట్టణమైన జోడినో సమీపంలో ఒక దేశభక్తురాలు అయిన తల్లి  స్మారక చిహ్నం ఉంది. ఆ తల్లి  అనస్తాసియా కుప్రియానోవా. ఆమె తన ఐదుగురు కొడుకులను యుద్ధానికి సాగనంపింది. కానీ ఆ ఐదుగురు కొడుకులు ఎప్పటికీ తిరిగి రాలేదు.

***

అనస్తాసియా తన గుండె  పట్ల వైద్యులు సంతోషంగా లేరని అనుమానించింది. వారు ఆమెకు ఒక ఇంజక్షన్ కొన్ని మందులు ఇచ్చారు, ఆమె ఎటువంటి అడ్డు పెట్టకుండా తీసుకుంది. ఆమె అక్కడి నుండి బయలుదేరడానికి ఆత్రుతగా ఉంది. కానీ వైద్యులు మాత్రం ఆమె బి పి ను  చూస్తూ, నాడిని చూస్తూ, ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి తొందరపడనట్లు కనిపించారు.

ఎండిపోయిన, ముడతలు పడిన చేత్తో ఆమె తన నల్లటి శాలువాను నిమిరింది. ఈ రోజు తన కొడుకులను చూడటం కోసం,జరగబోయే మీటింగ్ కోసం ఆమె నిన్ననే ప్రత్యేకంగా దానిని తీసి పక్కన పెట్టుకుంది.  ఎదురుగా వున్న పెద్ద గడియారం వైపు ఆందోళనగా చూసింది.  సమీపంలోని పాఠశాల విద్యార్థులు  అప్పటికే రోడ్డు పక్కన వేచి ఉన్నారని ఎవరో చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు.

అసలు తనను ఇక్కడ ఎందుకు వెళ్లకుండా ఉంచారు? తెల్లటి కోట్లు వేసుకున్న ఈ వైద్యులకు, తన పిల్లలను కలవడానికి వారు అనుమతించకపోతే తన గుండె ఎప్పటికీ కొట్టుకోకుండా ఆగిపోతుందని అర్థం కాలేదా?

అనస్తాసియా ఇంటి వద్ద అంబులెన్స్ ఉందనే వార్త అప్పటికే పట్టణమంతటా తెలిసింది,  ప్రజలంతా ఏదైనా వార్త వస్తుందేమోనని అసహనంగా ఎదురుచూస్తున్నారు. రోడ్డు పక్కన నిలబడి, జనం ఒక్కసారిగా ముందుకు దూసుకురావడం, ఆపై అనస్తాసియాకు దారి ఇవ్వడానికి అకస్మాత్తుగా వెనక్కి తగ్గడం కనిపించింది. వాలెంటినా తెరెష్కోవా (మొదట స్పేస్ లోనికి వెళ్లిన మహిళ) ఆమెను  కలవడానికి త్వరత్వరగా ముందుకు వచ్చి, ఆమెను కౌగిలించుకుని, ఎంతో జాగ్రత్తగా ఆసరా ఇస్తూ, ప్రజల గుంపు మధ్య నుండి ఆమెను నడిపించుకుంటూ తీసుకువెళ్లింది.

“నాకు అనస్తాసియా కుప్రియానోవా తెలిసినంత కాలం, ఇంత బలహీనమైన మహిళ అంతటి శక్తిని ఎలా సంపాదించుకోగలిగింది అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుండేదాన్ని,

ప్రజలు పెద్ద కుటుంబం గురించి మాట్లాడినప్పుడు, నేను ఎల్లప్పుడూ భూమిలోకి బలంగా పాతుకుపోయిన వేర్లు ఉన్న ఒక భారీ వృక్షం గురించే ఆలోచిస్తాను. కుప్రియానోవ్ అనే ఆ వృక్షానికి బలమైన కొమ్మలు ఉన్నాయి. ఐదుగురు కొడుకులు, ఒక కుమార్తె, అందరూ బలవంతులు, దయాగుణం కలవారు, అందమైనవారు. ఆ చెట్టు పెరగడానికి, పచ్చని ఆకులను తొడగడానికి, ప్రజలకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది. కానీ యుద్ధం అనే విపత్తు ఆ చెట్టును తాకింది.” అని ఆమె అంది.

***

అనస్తాసియా కు  అందరికంటే చిన్నవాడైన కొడుకు మరణవార్త అందినప్పుడు, పొరుగువారు అనస్తాసియా

యొక్క సగం పాడైన ఇల్లు వైపు భయంగా చూశారు. వారు వెళ్లి ఆమెను ఓదార్చాలని అనుకున్నారు, కానీ వారి కాళ్ళు అసలు ముందుకు సాగలేదు. ఒక తల్లి దుఃఖాన్ని తగ్గించే, ఆ ఘోరమైన బాధ నుండి ఉపశమనం కలిగించే పదాలేవీ వారి దగ్గర లేవు.

ఆమె ఐదు రోజుల ఏకాంతం తర్వాత బయటకు వచ్చింది, తీవ్రమైన దుఃఖం కారణంగా ఆమె జుట్టు పూర్తిగా తెల్లబడిపోయింది.

బెలోరష్యన్ గ్రామాలలో తమకు అత్యంత సన్నిహితులైన, ప్రియమైన వారి ఫోటోలను గోడపై ఎంబ్రాయిడరీ చేసిన తువ్వాళ్ల క్రింద వేలాడదీయడం ఆనవాయితీ. వారు తమ ఇంటికి దూరంగా ప్రయాణించినా, లేదా క్రూరమైన మరణం వారిని బలితీసుకున్నా, వారంతా తమ తల్లి ఇంట్లోనే, అసలు ఎన్నడూ వదిలి వెళ్ళనట్లుగా ఒకే ఇంటిలో ఉంటారు.

అలాగే అనస్తాసియా తన కొడుకులు స్టెపాన్, మిఖాయిల్, వ్లాదిమిర్, ప్యోత్ర్‌లను తన చెంతనే ఉంచుకుంది. అందరికంటే పెద్దవాడైన నికోలాయ్ ఫోటో ఉండాల్సిన స్థలం మాత్రం ఖాళీగా ఉంది. అది యుద్ధంలో మిగలలేదు.

యువ కుప్రియానోవ్‌లకు గ్రిగోరి తండ్రి ఇచ్చిన చిన్న భూమి ముక్క మాత్రమే ఉంది. అయినప్పటికీ అది అనస్తాసియాకు గర్వకారణం, సంతోషాన్ని ఇచ్చే విషయం. ఎందుకంటే ఆమె కుటుంబం ఒక భూస్వామి వద్ద పనిచేయవలసి వచ్చింది, వారికి సొంతంగా ఎలాంటి భూమి లేదు.

గ్రిగోరిని కలవడం అనస్తాసియాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. యువకుడు, అందగాడు,ఎప్పుడూ ఉత్సాహం ఉండే అతను ఒక మంచి భర్త, అంకితభావం గల తండ్రి. ఒక సంవత్సరం కరవు కారణంగా వారి భూమిలో తక్కువ పంట పండినప్పటికీ, అతను తన కుటుంబాన్ని ఎప్పుడూ ఆకలికి బాధ పడనివ్వలేదు. వసంతకాలం నాటికి వారి రొట్టె సగం అయినప్పటికీ, వారు సంతోషంగానే జీవించారు.

అయితే, ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. మొదటి ప్రపంచ యుద్ధం గ్రామాలలో ‘సైన్య సమీకరణ’ అనే అపరిచిత, భయంకరమైన పదాన్ని మోసుకొచ్చింది. మహిళలు,పిల్లలు ఏడ్చారు, పురుషులు మాత్రం గంభీరమైన ముఖాలతో ఒక వృత్తాకారంలో చేరి, నిశ్శబ్దంగా సిగరెట్లు చుట్టుకుని తాగారు. సైనికులను తీసుకెళ్లే రైళ్లు పగలు, రాత్రి తేడా లేకుండా జోడినో చిన్న స్టేషన్ గుండా రొద చేస్తూ వెళ్ళాయి.

ఆ తర్వాత గ్రిగోరి వెళ్లాల్సిన వంతు వచ్చింది. అతను పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అనస్తాసియాకు చెప్పి, తిరిగి వస్తానని మాట ఇచ్చాడు.

అతను తన మాటను నిలబెట్టుకున్నాడు, కానీ ఈ భూమిపై ఎక్కువ కాలం బ్రతకలేదు. తీవ్రమైన గాయాలతో, వికలాంగుడిగా అతను తిరిగి వచ్చాడు, అతని పీక్కుపోయిన ముఖంలో కేవలం కళ్ళు మాత్రమే పూర్వంలా నవ్వుతూ కనిపించాయి. ఆ విధంగా గ్రిగోరి జీవితం నిశ్శబ్దంగా ముగిసిపోయింది.

అనస్తాసియా యొక్క రెండవ సంతోషం ఆమె పిల్లలు. వారిలో ప్రతి ఒక్కరికీ ఆమె జ్ఞాపకాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

ఆమె మొదటి సంతానం, నికోలాయ్, వారి తండ్రి మరణం తర్వాత తమ్ముళ్లను పెంచడంలో ఆమెకు సహాయం చేశాడు. అతని ఫోటో ఉండాల్సిన ఖాళీ స్థలాన్ని చూస్తూ అనస్తాసియా అతనిని గుర్తుచేసుకుంటున్నట్లు అనిపించింది.

“అతను చాలా శాంతస్వభావుడు, దయాగుణం కలవాడు. చిన్న పిల్లలు ఎప్పుడూ అతని వెంటే తిరిగేవారు. అతను పక్క ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కష్టపడే మనస్తత్వం కలది, మంచి గృహిణి. ఆమె నాకు నా మొదటి మనవడిని ఇచ్చింది.” అనుకుంది.

ఆమె కొడుకులు గోడపై నుండి ఆమె వైపు చూసేవారు. వారిలో ప్రతి ఒక్కరూ ఆమె స్వంత రక్తం, మాంసం, ఆమె ఆనందం పంచుకుని పుట్టారు.

“స్టెపాన్ అస్సలు ఒకచోట కుదురుగా ఉండేవాడు కాదు. క్షణం కూడా ప్రశాంతత ఉండేది కాదు. అతనికి సామూహిక క్షేత్రం లో చేరడానికి తగిన వయస్సు వచ్చినప్పుడు, పొలంలోనైనా, గుర్రాలతోనైనా ఏ పనీ అతనికి కష్టం అనిపించలేదు. అతను ఎంత బాగా గడ్డి కోసేవాడో!”

ఆమె సంతోషకరమైన సాయంత్రాలు ఎప్పుడంటే,పిల్లలు నూనె దీపం చుట్టూ చేరినప్పుడు, ఆమె కుమార్తె అన్యా ఒక పుస్తకం నుండి గట్టిగా చదివి వినిపిస్తున్నప్పుడు. అనస్తాసియా టేబుల్ దగ్గర కూర్చుని కుట్టుకుంటూ వింటూ ఉండేది. ఒకవేళ దీపం ఆరిపోతే, అబ్బాయిలు తమ తల్లిని ఒక జానపద కథ చెప్పమని బ్రతిమిలాడేవారు.

దాంతో ఆమె వారికి ఒక కథ చెప్పేది, ఆ కథల్లో నిజం ఎక్కడ ముగిసిందో, కల్పన ఎక్కడ మొదలైందో పిల్లలు  గుర్తించలేకపోయేవారు. వారు నవ్వేవారు,  జాలితో ఏడ్చేవారు. కథ ముగిసినప్పుడు, ఆమె వారి చిన్నతనంలో పాడినట్లుగా జోలపాటలు పాడేది. “పిల్లి మార్కెట్‌కు వెళ్లి చాలా మిఠాయిలు కొని తెచ్చింది. చిన్నారి మిఖాయిల్‌ను  నిశ్శబ్దంగా, సంతోషంగా ఉంచడానికి ఆమె వాటిని అతనికి ఇచ్చింది.”

“గ్రామంలోని ప్రజలు నా మిఖాయిల్‌ను ‘మంగోల్’ అని పిలిచేవారు. అది అతని మీసం వల్ల కావచ్చు, కానీ బహుశా అతను రైలులో టికెట్ కలెక్టర్‌గా మంచూరియా వరకు ప్రయాణించినందువల్ల కావచ్చు.”

యుద్ధం ఎల్లప్పుడూ తెచ్చే చీకటి శోకం నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఒక యుద్ధం అనస్తాసియా భర్తను బలితీసుకుంది, తదుపరి యుద్ధం ఆమె ఎదుగుతున్న కొడుకులను పిలిచింది. జూడినో వీధుల్లో పచ్చటి యూనిఫారాలు కనిపించగానే వారు పార్టిసన్ దళాలలో  పోరాట యోధులుగా చేరారు. వారి ఇల్లును శత్రువు తగులబెట్టాడు, దాంతో అనస్తాసియా, ప్యోటర్ శిథిలాల పక్కన ఒక తాత్కాలిక గుడిసెలో నివసించారు.

అది ఆమెను పెద్దగా బాధించలేదు. ఆమె తన కొడుకుల కోసమే దుఃఖించింది. కొన్నిసార్లు వారు రాత్రి వేళల్లో రహస్యంగా వచ్చేవారు,  వారు మంచం మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆమె వారి బట్టలు ఉతకడానికి, చిరిగిన బట్టలను కుట్టడానికి సహాయం చేసేది…

ఆమె తను ఏడవకుండా ఉండటానికి అప్పుడప్పుడు వెచ్చదనంలో ఒక హాస్యభరితమైన జోలపాట పాడుతుండేది.

కానీ అప్పుడే దుఃఖం తలుపు తట్టింది. వ్లాదిమిర్ గుమ్మం దాటగానే, ఏదో విపత్తు జరిగిందని ఆమె గ్రహించింది. ఆమె కళ్ల ముందు అంతా చీకటి కమ్మింది. ఇంతకీ ఎవరు చనిపోయారు? అందరికంటే ముందుగా మిఖాయిల్ మరణించాడు.

ఒక పార్టిసాన్స్ బృందం రైల్వే మార్గంలో తమ పనిని పూర్తి చేసుకుని తిరిగి శిబిరానికి వస్తున్నారు. దారిలో వారిపై శత్రువు మెరుపు దాడి చేసాడు, దాంతో వారు పోరాటాన్ని నివారించాలని అనుకున్నారు. వారికి రక్షణగా వెనుక మిఖాయిల్ ఉండిపోయాడు. అతను నాజీలను అడ్డుకోగలిగాడు, కానీ రెండు కాళ్లకూ తీవ్రంగా గాయాలయ్యాయి.. అతనికి జైలులో స్పృహ వచ్చింది.ఆ యువ విప్లవకారుడు తమ విప్లవ శిబిరం ఎక్కడ ఉందో చెబుతాడనే ఆశతో వారు అతడిని క్రూరంగా హింసించారు. కానీ అంతా వ్యర్థమైంది.

తమ వీర కామ్రేడ్ మరణానికి ఆ విప్లవకారులు తీవ్రంగా విచారించారు. కమీషనర్ వారందరినీ ఒకచోట చేర్చి ఇలా అన్నాడు: “ధైర్యవంతుడైన దేశభక్తుడైన మిఖాయిల్ చర్య మన హృదయాలలో ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. కొత్త పోరాటాలకు మనల్ని ప్రేరేపిస్తుంది.”

ఆ తర్వాత కొంత కాలానికి ప్యోటర్ పట్టుబడటం, జైలుపాలవ్వడం జరిగింది. కొన్ని నెలల తర్వాత అతడిని జర్మనీకి పంపారు, కానీ అతను అక్కడి నుండి తప్పించుకుని, ఆకలితో, అలసిపోయినప్పటికీ ఎలాగోలా ఇంటికి చేరుకున్నాడు. వారు వెంటనే అడవికి వెళ్ళిపోతున్నారని అతను తన తల్లికి చెప్పాడు, దాంతో అనస్తాసియా ఆ విప్లవకారులకు తల్లిగా మారింది. ఆమె వారికి వంట చేసి, బట్టలు కుట్టి, ఉతికేది. ఎర్రనక్షత్రం కలిగిన ట్యాంకులు జూడినో లోకి ప్రవేశించే రోజు వరకు ఆమె అడవి జీవితంలోని అన్ని కష్టాలను, ఆందోళనలను పంచుకుంది.

1944 వేసవిలో అనస్తాసియా, ఆమె కుమారులు వారి కాలిబూడిదైన ఇంటికి తిరిగి వచ్చారు: అంతా లూటీ అయ్యిపోయింది, ధ్వంసమైంది.  అప్పుడు కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి సమయం లేదు. యుద్ధం ఇంకా ముగియలేదు, అది కేవలం పశ్చిమ వైపుకు కదిలింది.

***

 అనస్తాసియా కుమారులు ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి ఆమె ముందు నిలబడ్డారు.

ఆ తెల్లటి ముసుగు నెమ్మదిగా క్రిందికి జారి, ఆమె బలమైన, ఎదిగిన కుమారులు తమ తల్లి వద్ద సెలవు తీసుకుంటున్నట్లుగా ఉన్న దృశ్యాన్ని ఆవిష్కరించింది.

“మిమ్మల్ని చూసి ఎంత కాలమైంది నా కుమారులారా,” అని ఆ తల్లి మెల్లగా గుసగుసలాడుతూ, ఆ కంచు శిల్పం చుట్టూ తిరుగుతూ తన కుమారులను వారి పేర్లతో పిలిచింది. ఇప్పుడు వారంతా ఆమెకు దగ్గరగా, కలిసి ఉంటారు. పోలాండ్ విముక్తి సమయంలో మరణించిన నికోలాయ్, వార్సా సమీపంలో ఎక్కడో సమాధి చేయబడిన స్టెపాన్, నాజీల చేతిలో హింసించబడి మరణించిన మిఖాయిల్, లాట్వియన్ గడ్డపై జరిగిన తన చివరి యుద్ధానికి ‘హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్’ అవార్డు పొందిన ప్యోటర్,  ఇంట్లోనే గాయాల వల్ల మరణించిన వ్లాదిమిర్.

ఇద్దరు తల్లులు. ఒకరు కాంస్య తల్లి, విపత్తును ముందే ఊహిస్తూ, శత్రువుల బుల్లెట్లు తన కుమారులను వదిలిపెడతాయని అత్యాశతో ఎదురుచూస్తోంది. ఇంకొకరు ఎముకలు తేలిన, ముసలిదైన నిజమైన రక్తమాంసాల తల్లి, తన కుమారుల కంటే ఎక్కువ కాలం బ్రతికి ఉండి కూడా, వారి మరణాన్ని నమ్మడానికి నిరాకరిస్తోంది. ఆమె చెంపలపై నుండి కారుతున్న ఆ కన్నీళ్లు ఎక్కడి నుండి వచ్చాయి? అంత సుదీర్ఘ నిరీక్షణ కాలంలో తన కన్నీళ్లన్నీ అయిపోయాయని ఆమె అనుకుంది.

ఆ రోజు నుండి, అనస్తాసియా తరచుగా రోడ్డు పక్కన ఉన్న తన కాంస్య సైనికుల (కుమారుల) పక్కన నిలబడి కనిపించేది.

***

ఒకసారి తాము అనస్తాసియాతో కలిసి ఆ స్మారక చిహ్నం  వద్దకు ఎలా వెళ్ళామో శిల్పులలో ఒకరైన ఇవాన్ మిస్కో  చెప్పారు.

“ఆమె తన కొడుకులను పలకరిస్తున్నట్లుగా ఆ స్మారక చిహ్నం చుట్టూ నడిచింది. అప్పుడు అకస్మాత్తుగా ఆమె, ‘ప్యోత్ర్, నీ టోపీ పెట్టుకో, ఈ రోజు చలిగా ఉంది’ అని అనడం నేను విన్నాను. ఆమెకు వంద ఏళ్లు పైబడటంతో, బహుశా ఆమె ఏదో పిచ్చిగా మాట్లాడుతోందేమో అని నేను అనుకున్నాను. కానీ ఆమె నా వైపు తిరిగి ఇలా అంది. ‘ప్యోత్ర్ వైపు చూడు, అతని మెడ నొస్తోంది, అందుకే తలను అలా పట్టుకున్నాడు’.  మీకు తెలుసా, నేను ఆ  కుటుంబపు చిన్నవాడిని చూసిన ప్రతిసారీ, నా మెడలో ఆ పదునైన, బాధాకరమైన మెలికను నేను అనుభూతి చెందగలను. కానీ అతని తల్లి దానిని అందరికంటే ముందే గ్రహించింది.”

ప్యోత్ర్ తన ఇంటి వైపు తన భుజం పైనుంచి వెనక్కి తిరిగి చూస్తూ నిలబడి ఉన్నాడు. అతనికి తన బాల్యపు ఆటలను ముగించడానికి సమయం దొరకలేదు, అతనికి తన తల్లిని విడిచి వెళ్ళడం ఇష్టం లేదు.

అనస్తాసియా ఎల్లప్పుడూ అందరితో కలిసే వ్యక్తిగా ఉండేది. ఆమె వయసులో ఉన్నప్పుడు, ప్యోత్ర్ సేవ చేసిన సైనిక విభాగాన్ని  సందర్శించేది,  అతనిదిగా ఉన్న నీట్ గా సర్దిన మంచం పక్కన నిలబడేది. ఆమె ప్యోత్ర్ వయసులోనే ఉన్న ఒక సైనికుడు కుడి వైపు నుండి రోల్-కాల్ కు సమాధానం ఇవ్వడం వినేది. “లాన్స్-కార్పోరల్ ప్యోత్ర్ కుప్రియానోవ్, హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్, తన దేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ వీరమరణం పొందాడు.” ఆ విభాగంలోని సైనికులు వస్తూ పోతూ ఉంటారు, కానీ ఆమెప్యోత్ర్ మాత్రం ఆ పందొమ్మిదేళ్ల బాలుర జాబితాలో ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు.

ప్యోత్ర్ సమాధిని సందర్శించే వరకు అనస్తాసియా మనశ్శాంతిగా ఉండలేకపోయింది. ఆమె లాట్వియన్ గ్రామం నిక్రాస్ సమీపంలోని పొలం గుండా నడిచి వెళ్లింది, అక్కడ ‘1944 శరదృతువు  లో శత్రువుల కాల్పులు ఆమె కొడుకును పొట్టనబెట్టుకున్నాయి. ఆమె సగం ధ్వంసమైన పిల్‌-బాక్స్ (రక్షణ బంకర్) వద్ద నిలబడింది, ఆ నిశ్శబ్దంలో అతని చివరి మాటలు వింటున్నట్లు అనిపించింది. అతను ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, కానీ అతను ఇచ్చిన మాటను ఎల్లప్పుడూ నిలబెట్టుకునేవాడు. తాను తిరిగి వస్తానని తన తల్లికి మాట ఇచ్చాడు, కానీ శత్రువు తూటా అతని గుండెల్లోకి బలంగా దూసుకుపోయింది.

అనస్తాసియా అతని సమాధి నుండి ఒక గుప్పెడు మట్టిని,  దాని పక్కనే పెరుగుతున్న ఓక్ చెట్టు నుండి మూడు ఆకుపచ్చని గింజలను తనతో పాటు తీసుకువెళ్లింది.

అనస్తాసియా వందో పుట్టినరోజున ఆమెను అభినందించడానికి చాలా మంది ప్రజలు వచ్చారు. ఆమెకు అనేక బహుమతులు లభించాయి. ఐదుగురు కొడుకులకు జన్మనిచ్చి, వారిని పెంచి పెద్ద చేసినందుకు గాను ఆమెకు జోడినో గౌరవ పౌరసత్వం లభించింది.

సయానో-షుషెన్స్కాయ హెచ్ఇపి  స్టేషన్‌లోని కొమ్సోమోల్ బృందానికి చెందిన బిల్డర్లు అనస్తాసియా 107వ పుట్టినరోజున ఆమెను సందర్శించారు. వారు ఆమెకు తమ బృందం చేస్తున్న పని గురించి చెప్పారు, అందులో ఆమె ప్యోత్ర్‌ను గౌరవ సభ్యునిగా చేర్చామని  అతనికి రావలసిన వేతనాలను పీస్ ఫండ్‌కు పంపుతున్నామని చెప్పారు. అప్పుడు అనస్తాసియా తన కోసం ఒక ప్రశాంతమైన, పాటని పాడమని వారిని కోరింది.

అనస్తాసియా అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా, ఆమె కొడుకు పేరు మీద ఉన్న యంగ్ పయనీర్ స్క్వాడ్‌కు చెందిన పాఠశాల పిల్లలను చూడటానికి ఆమె ఎప్పుడూ వెళుతూ ఉండేది. ఆమె మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా ప్రజలు ఆమె చుట్టూనే ఉన్నారు. పట్టణ ప్రజలందరూ ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు,  దగ్గరి, దూర ప్రాంతాల నుండి ఆమెను ఎరిగిన ప్రజలు వచ్చారు.

రోడ్డు పక్కన, ఆ తల్లి అయిన అనస్తాసియా కుప్రియానోవా, తన కొడుకుల వైపు ఆశతో చూస్తోంది. ఈ ప్రపంచంలో ఆచారం ఇలాగే ఉంది. కొడుకులు తమ తల్లి ఒడిని విడిచి వెళ్తారు, తల్లులు మాత్రం నమ్మకంతో, ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటారు.

—–

ఎమ్మా లుకాన్స్కాయా
కె. కుమార్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *