చిన్న తమాషా

Spread the love

అది ఒక నిర్మలమైన శీతాకాలపు మధ్యాహ్నం. గడ్డకట్టే చలి.

‘నాడెంకా’ చెంపల మీద ముంగురులు, ఆమె పైపెదవి మీద ఉన్న సున్నితమైన రోమాలు మంచుతో వెండిలా మెరుస్తున్నాయి. ఆమె నా చేతిని పట్టుకుని ఉంది. మేమిద్దరం ఒక ఎత్తైన మంచు కొండ మీద నిలబడి ఉన్నాం. మేమున్న చోటు నుండి కింద నేల వరకూ నున్నటి మంచు వాలుగా పరుచుకుని ఉంది. అది సూర్యకాంతిని అద్దంలా ప్రతిబింబిస్తోంది. మా పక్కనే ఎర్రటిగుడ్డతో అలంకరించిన ఒక చిన్న స్లెడ్జ్ (మంచుమీద జారే బగ్గీ) ఉంది.

‘నాడెంకా పెత్రోవ్నా, మనం కిందకి వెళ్దాం పద!’ నేనామెను బ్రతిమాలుతూ అడిగాను; ‘ఒక్కసారి మాత్రమే! మనకేం కాదు… నాది పూచీ.’

కానీ నాడెంకా భయపడింది. తన పాదాల కింది నుండి మైదానం వరకు ఉన్న ఆ మంచు వాలు ఆమెకు భయంకరమైన అగాధంలా అనిపించింది. నేను స్లెడ్జ్ ఎక్కమనగానే ఆమెకు ప్రాణాలు పోయినంత పనైంది. ఊపిరి బిగబట్టి కిందకు చూసింది. ఇక ఆ అగాధంలోకి దూసుకుపోతే ఏమైపోతుందో? చచ్చిపోతుందేమో, పిచ్చిదైపోతుందేమో అన్నంత భయం!

‘బతిమాలుకుంటున్నాను. దయచేసి భయపడకు. పిరికితనం వద్దు!’ అన్నాను నేను.

చివరికి నాడెంకా ఒప్పుకుంది.

కానీ ఆమె ముఖంలో చావు భయం కనిపిస్తోంది.

వణికిపోతున్న ఆమెను స్లెడ్జిలో కూర్చోబెట్టి, ఆమె చుట్టూ నా చేయి వేసి, ఇద్దరం ఆ అగాధంలోకి దూసుకెళ్ళిపోయాం.

బగ్గీ బుల్లెట్టులా దూసుకుపోతోంది. వేగంగా వీస్తున్న గాలి మా ముఖాల మీద కొడుతోంది. చెవుల్లో హోరుమని శబ్దం చేస్తోంది. మా తలలను భుజాల నుండి వేరు చేయాలన్నంత కోపంగా ఉన్నట్టుంది. గాలి ఒత్తిడికి మాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోతోంది. ఏదో దెయ్యం మమ్మల్ని పట్టుకుని నరకానికి లాక్కుపోతున్నట్టు అనిపించింది. చుట్టుపక్కల ఉన్నవన్నీ ఒక పొడవాటి గీతలా వేగంగా కదులుతున్నాయి. ఇంకొక్క క్షణం ఉంటే మేము చచ్చపోతామేమో అన్నంత వేగం!

‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాడ్యా!’ మెల్లగా అన్నాను నేను.

స్లెడ్జి వేగం క్రమంగా తగ్గింది. ఇప్పుడు గాలి హోరు, స్లెడ్జి పట్టాల చప్పుడు అంత భయంకరంగా అనిపించడం లేదు. ఊపిరి తీసుకోవడం తేలికైంది, చివరకు మేము కిందికి చేరుకున్నాం. నాడెంకా అయితే ప్రాణం పోయి మళ్ళీ బతికొచ్చినట్టుగా ఉంది. ముఖం తెల్లగా పాలిపోయింది. కష్టంగా ఊపిరి పీలుస్తోంది. ఆమె లేవడానికి సాయం చేసాను.

‘ఇంకెప్పుడూ రాను నేను.’ భయంతో కూడిన కళ్లతో నన్నే చూస్తూ అంది; ‘ప్రపంచంలో దేనికోసమైనా సరే, నేను మళ్ళీ రాను! చచ్చిబతికినంత పనైంది నాకు!’

కాసేపటికి తేరుకుంది. నా కళ్ళలోకి ఆరాటంగా చూసింది.

ఆ నాలుగు మాటలు నేను నిజంగానే అన్నానా లేక ఆ గాలి హోరులో ఆమెకు అలా వినిపించిందా అని ఆమె అనుమానం. నేను మాత్రం పక్కనే నిలబడి సిగరెట్ తాగుతూ, నా గ్లౌజుల వైపు శ్రద్ధగా చూస్తున్నాను.

ఆమె నా చేయి పట్టుకుంది. ఇద్దరం ఆ మంచుకొండ దగ్గర చాలా సేపు నడిచాం. ఆ ప్రశ్న ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఆ మాటలు నేను అన్నానా లేదా? అవునా కాదా? అది ఆమె ఆత్మగౌరవానికి సంబంధించిన, ఆమె జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న. నాడెంకా నా ముఖంలోకి తీక్షణంగా చూస్తూ, నేను మళ్ళీ ఆ మాటలు అంటానేమో అని ఎదురుచూసింది. ఆమె ముఖంలో కనిపిస్తున్న భావాలను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను ఏదో అడగాలని ప్రయత్నిస్తోంది కానీ మాటలు రావడం లేదు.

‘నిన్ను ఒకటి అడగనా?’ నా వైపు చూడకుండానే అంది.

‘ఏంటి?’ అని అడిగాను.

‘మనం… ఇంకొక్కసారి వెళ్దామా.’

మేము మళ్ళీ ఆ మంచు కొండ మెట్లు ఎక్కాం. వణుకుతున్న నాడెంకాను మళ్ళీ స్లెడ్జిలో కూర్చోబెట్టాను. మళ్ళీ ఆ అగాధంలోకి దూసుకెళ్లాం. గాలి హోరు పెరిగింది. స్లెడ్జి అత్యంత వేగంగా ఉన్నప్పుడు నేను మళ్ళీ మెల్లగా అన్నాను;

‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాడెంకా!’

స్లెడ్జి ఆగినప్పుడు, నాడెంకా ఆ కొండ వైపు, తర్వాత నా ముఖం వైపు ఒక దీర్ఘమైన చూపు చూసింది. నా గొంతులో ఎలాంటి భావం లేదు. ఆమె ముఖంలో విపరీతమైన అయోమయం ఉంది.

‘దీని అర్థం ఏంటి? ఆ మాటలు ఎవరన్నారు? అతను అన్నాడా, లేక నా భ్రమనా?’ అన్న భావం ఆమెను వేధించింది.

పాపం, ఆ అమ్మాయి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, ఏడుస్తున్నట్టుగా ముఖం పెట్టింది.

‘మనం ఇంటికి వెళ్దామా?’ అని అడిగాను.

‘నాకు… ఈ ఆట నచ్చింది.’ ముఖం ఎర్రబడుతుండగా అంది; ‘ఇంకొక్కసారి వెళ్దామా?’

ఆట నచ్చింది అంటోంది కాని స్లెడ్జి ఎక్కేప్పుడు మాత్రం మునుపటిలాగే ముఖం తెల్లగా పాలిపోయి, భయంతో వణికిపోతోంది.

మూడోసారి వెళ్లాం. ఆమె నా ముఖాన్ని, నా పెదాలను గమనిస్తోందని నాకు అర్థమైంది. నేను రుమాలును అడ్డం పెట్టుకుని, కొంచెం దగ్గి, సరిగ్గా మధ్యలోకి రాగానే మళ్ళీ అన్నాను;

‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాడెంకా!’

ఆ రహస్యం రహస్యంగానే ఉండిపోయింది! నాడెంకా నిశ్శబ్దంగా ఏదో ఆలోచిస్తోంది. నేను ఆమెను ఇంటి దగ్గర దించాను. ఆమె మెల్లగా నడుస్తూ, నేను మళ్ళీ ఆ మాటలు చెబుతానో లేదో అని ఆగుతోంది. ఆమె మనసు ఎంత తపన పడుతుందో నాకు అర్థమవుతోంది.

‘అవి గాలి మాటలు కాదు! అవి గాలి పలికిన పలుకులు అని నేను నమ్మను!’ ఆమె లోలోపల అనుకుంటోంది.

మరుసటి రోజు నాకు ఒక చిన్న ఉత్తరం వచ్చింది:

‘ఈరోజు నువ్వు మంచు కొండ దగ్గరకు వెళితే, నన్ను కూడా తీసుకెళ్ళు – నాడెంకా.’

అప్పటి నుండి ప్రతిరోజూ నేను నాడెంకాతో కలిసి వెళ్ళడం మొదలుపెట్టాను. స్లెడ్జి కిందకు వెళ్తున్న ప్రతిసారీ నేను అదే మాట అనేవాడిని, ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాడెంకా!’

త్వరలోనే నాడెంకాకు ఆ మాటలు ఒక అలవాటుగా మారిపోయాయి. ఆ మాటలు వినకుండా ఆమె ఉండలేకపోయింది. మంచు కొండ మీదనుండి పడటం ఆమెకు ఇంకా భయంగానే ఉన్నా, ఇప్పుడు ఆ భయం ఆ ప్రేమ మాటలకు ఒక వింతైన అందాన్ని ఇచ్చింది. గాలి, నేను – ఈ ఇద్దరిలో ఎవరో ఒకరం ఆమెను ప్రేమిస్తున్నాం. అది ఎవరో ఆమెకు తెలీదు. కానీ ఆమెకిప్పుడు అది ముఖ్యం కాదు; తాగే పానీయం మత్తునిస్తుంటే అది ఏ పాత్రలో ఉంటే ఏంటి?

ఒకరోజు మధ్యాహ్నం నేను ఒక్కడినే అక్కడికి వెళ్ళాను. జనాల్లో నాడెంకా కనిపించింది. ఆమె మెట్లెక్కి ఒంటరిగా వెళ్లడానికి ప్రయత్నిస్తోంది. భయంతో వణికిపోతోంది, కానీ పట్టుదలతో ముందుకు వెళ్తోంది. నేను లేనప్పుడు కూడా ఆ మాటలు వినిపిస్తాయో లేదో అని ఆమె పరీక్షించుకోవాలనుకుంది.

ఆమె స్లెడ్జి ఎక్కి, కళ్ళు మూసుకుని కిందకు దూసుకెళ్లింది. స్లెడ్జి ఆగినప్పుడు ఆమె ముఖం పాలిపోయి ఉంది. ఏమైనా వినిపించిందో లేదో ఆమెకే తెలీదు. ఆ భయంలో ఆమెకు ఏమీ వినిపించి ఉండదు.

తర్వాత మార్చి నెల వచ్చింది. ఎండలు పెరిగాయి. మంచు కొండ కరిగిపోయింది. మేము మంచు మీద ఆటలు ఆపేసాం. నాడెంకాకు ఆ మాటలు వినే అవకాశం లేకుండా పోయింది. పైగా నేను సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్ళిపోతున్నాను – బహుశా ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చేమో.

నేను వెళ్లడానికి రెండు రోజుల ముందు, ఆమె ఇంటి వెనుక ఉన్న తోటలో కూర్చుని ఉన్నాను. చలి ఇంకా ఉంది, కానీ వసంతకాలపు సువాసన తెలుస్తోంది. నేను గోడ సందులో నుండి చూశాను. నాడెంకా బయటకు వచ్చి ఆకాశం వైపు దీనంగా చూస్తోంది. వాసంత సమీరం ఆమె మొహాన్ని తాకుతోంది. అది ఆమెకు ఆ మంచు కొండ మీది చల్లటి గాలిని గుర్తు చేసింది. ఆమె కళ్ల నుండి ఒక కన్నీటి చుక్క రాలింది. గాలి మళ్ళీ ఆ మాటలను మోసుకురావాలని వేడుకుంటున్నట్టు ఆమె చేతులు చాచింది. నేను మెల్లగా అన్నాను:

‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాడెంకా!’

దేవుడా… నాడెంకాలో ఎంత మార్పు! ఆమె ఒక్కసారిగా కేక వేసింది, ఆమె ముఖం వెలిగిపోయింది. అందంగా చేతులు చాచి, సంతోషంగా ఆ గాలిని హత్తుకుంది.

నేను సామాన్లు సర్దుకోవడానికి వెళ్ళిపోయాను.

ఇదంతా జరిగి చాలా కాలమైంది. ఇప్పుడు నాడెంకాకు పెళ్లయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె జీవితంలో ఆ మంచు కొండలో ఆడిన ఆట, ఆ గాలిలో వివయిపించిన ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే మాట అత్యంత మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.

కానీ ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత ఆలోచిస్తే… నేను ఆ మాటలు ఎందుకు అన్నానో, ఆ తమాషా వెనుక నా ఉద్దేశ్యం ఏంటో నాకే అర్థం కావడం లేదు.

——

Anton Chekhov
కె. కుమార్

Spread the love

One thought on “చిన్న తమాషా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *