గొర్రెల కాపరి

Spread the love

ఇది నా స్నేహితుడి కథ. అతను నాకు చాలా కాలంగా తెలుసు, నాకు ఎంతో ఇష్టమైన వాడు కూడా.

సుమారు పదిహేనేళ్ల క్రితం, అప్పటి ‘కల్మిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాక్-బ్రీడింగ్ ఫర్ మీట్’ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ నర్మాయేవ్ నాతో అన్నారు, “నా దగ్గర పని చేయడానికి ఒక అద్భుతమైన వ్యక్తి వస్తున్నాడు. అతని పేరు గాఖా ఆండ్రీయేవ్, చాపాయేవ్ కోల్‌ఖోజ్ నుండి వస్తున్న ఒక గొర్రెల కాపరి. అతను ప్రయోగాత్మక విభాగంలోని ఒక కాంప్లెక్స్ బృందానికి ఇన్‌ఛార్జ్‌గా ఉంటాడు. మనలాంటి శాస్త్రవేత్తలకు అతనికున్న ప్రాక్టికల్ జ్ఞానం నిజంగా ఒక గొప్ప వరం!”

ఆ తర్వాత కొద్ది రోజులకే ఎలిస్టాలో జరిగిన ఒక పార్టీ కాన్ఫరెన్స్‌లో నాకు గాఖాతో పరిచయం ఏర్పడింది. నర్మాయేవ్ నన్ను అతని దగ్గరకు తీసుకెళ్లి, “గాఖా, నీ దగ్గర ఇంట్లో కుగుల్తినోవ్ రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా, ఇదిగో ఇతనే ఆ రచయిత” అని పరిచయం చేశారు.

ఇప్పుడే కొత్తగా పరిచయమైన వ్యక్తుల మధ్య సాధారణంగా జరిగేటట్లే, మొదట్లో మా మధ్య కొంచెం ఇబ్బందికరమైన నిశ్శబ్దం ఉంది. కానీ పుస్తకాల గురించి చర్చ రాగానే ఆ ఇబ్బంది అంతా మాయమైపోయింది. మా ఇద్దరికీ ఇష్ట మైన అంశాన్ని మేము కనుగొన్నాము. గాఖా దగ్గర ఒక పెద్ద లైబ్రరీ ఉంది. అతను నివసించే వెర్ఖ్నీ యాష్కుల్ అనే గ్రామంలో, కల్మిక్ రచయితలు రాసిన ఏ కొత్త పుస్తకాలు వచ్చాయో తెలుసుకోవాలంటే ఎవరైనా సరే అతనిని అడగవచ్చని, అతనికి తప్పకుండా తెలుస్తుందని అందరికీ తెలుసు.

“పుస్తకాలు మనిషిని మరింత ఉత్తముడిగా, అందరితో సులభంగా కలిసిపోయేలా చేస్తాయి,” అని ఈ నా కొత్త మిత్రుడు అన్నాడు.

అతని పొడవైన రూపాన్ని, వెడల్పైన భుజాలను, ఎండకు కాస్త నల్లబడిన అతని ముఖాన్ని చూసి, మన జాతీయ పురాణ గాథ,జాంగర్  ను చిత్రీకరించే చిత్రకారునికి ఇతను క ఆదర్శవంతమైన మోడల్‌గా సరిపోతాడని నేను అనుకున్నాను. కల్మిక్ పురాణ గాథ కేవలం యోధులను మాత్రమే కాకుండా ఆర్కిటెక్ట్‌లను, సంగీతకారులను, కవులను కూడా కీర్తిస్తుందని చెప్పాలి. వారితో పాటు గొర్రెల, పశువుల కాపరులను,  స్టెప్పీ మైదానాల్లో కష్టపడే శ్రామికులను కూడా అది కొనియాడుతుంది.

నా మొదటి అభిప్రాయం సరైనదేనని నాకు త్వరలోనే నమ్మకం కుదిరింది. గాఖా ఆండ్రీయేవ్ తన జాతి యొక్క అత్యుత్తమ లక్షణాలన్నింటినీ తనలో నింపుకున్న వ్యక్తి.

ఇన్‌స్టిట్యూట్ యొక్క ప్రయోగాత్మక విభాగం ఉన్న వెర్ఖ్నీ యాష్కుల్ గ్రామం, ఆ రిపబ్లిక్ రాజధాని అయిన ఎలిస్టా నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను అతనిని అక్కడ కలవాలని నిర్ణయించుకున్నాను. వాతావరణం బాగా చల్లగా, మంచుతో ఉన్న గాలి వీస్తోంది. మేము వెర్ఖ్నీ యాష్కుల్‌కు చేరుకున్నప్పుడు, డ్రైవర్ నేరుగా గాఖా ఇంటికే వెలదామా? అని అడిగాడు.

“లేదు, పని ఎక్కడ జరుగుతుందో అక్కడ అతని కోసం వెతకడం మంచిది, అక్కడే అతను ఉండే అవకాశం వుంది “

అది శనివారం కావొచ్చు, లేక సెలవు దినం, కానీ గఖాకు దీనివల్ల పెద్దగా తేడా ఏమీ ఉండదని నాకు బాగా తెలుసు, అతను గొర్రెల షెడ్ లోనే ఉంటాడు. ముఖ్యంగా అతని బృందంలో ఎక్కువగా యువకులు, పెద్దగా అనుభవం లేని వ్యక్తులు ఉండటం వల్ల. నేను అంత ఖచ్చితంగా ఎందుకు ఉన్నానో చెప్పడానికి,  పద్దెనిమిది నెలల క్రితం జరిగిన ఒక సంఘటనను చెప్తాను, అప్పుడు గఖా, అతని భార్య ఆంటోనినా వారి  పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. బల్ల బయట, చెట్ల కింద వేసారు. అది ఒక శనివారం. అకస్మాత్తుగా అతను బల్ల నుండి లేచి, తాను కొన్ని పుచ్చకాయలు తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పి, తన కారు ఎక్కి వెళ్ళిపోయాడు. అతని భార్య నవ్వింది. “ఓహ్, అతను వెళ్ళింది పుచ్చకాయల కోసం కాదు, అవి ఇక్కడే ఉన్నాయి, ఒక బస్తా నిండా ఉన్నాయి. ఇది మధ్యాహ్నం గొర్రెలకు నీరు పెట్టే సమయం అంతా సరిగ్గా ఉందో లేదో చూడటానికి అతను వెళ్ళాడు. మీరు ఎక్కడ ఫీల్ అవుతారో అనే భయంతో ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ మీరు నిజంగా అలా అనుకోకూడదు, అతని స్వభావమే అంత.”

కాబట్టి ఇప్పుడు మేము నేరుగా పశువుల సముదాయం వైపు వెళ్ళాము. కానీ అతను అక్కడ లేడు. “అతను ఇంట్లో ఉండవచ్చా?” అని నేను గొర్రెల కాపరులను అడిగాను.  వారు నవ్వారు. “అస్సలు అవకాశం లేదు! అతను గొర్రెల కోసం పశుగ్రాసం సేకరించడానికి స్టోర్స్ దగ్గర ఉన్నాడు.”

ఖచ్చితంగా, అతను అక్కడే ఉన్నాడు. స్టోర్‌కీపర్ ఆ గ్రాసాన్ని తూకం వేస్తున్నాడు. గఖా ఇలా అంటూనే ఉన్నాడు. “ఎక్కువగా వెయ్యి, వెనకాడకు, నాకు తెలుసు అక్కడ చాలా ఉంది.”

ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే గొర్రెల ఈత కాలం కోసం సిద్ధమవ్వడం చాలా ముఖ్యమైన సమయమని అతను ఆ తర్వాత నాకు వివరించాడు. గొర్రెలను బలంగా చెయ్యాలి .

మేము కలిసి మళ్ళీ గొర్రెల మంద వద్దకు తిరిగి వచ్చాము.

“నిన్ను నేరుగా ఇంటికి తీసుకెళ్లనందుకు నన్ను క్షమించు,” అని అతను నా వైపు తిరిగి అన్నాడు. “కుర్రాళ్ళు దేనిలోనూ పొరపాటు చేయకుండా చూసుకోవడానికి నేను ఇక్కడే షెడ్ దగ్గర ఉండాలి.”

దొడ్డిలో అంతా సక్రమంగా ఉన్నట్లు అనిపించింది. బహుశా చాలా మంది ప్రజలకు ఈ దొడ్లు ఎలా ఉంటాయో తెలియదు. ఇది ఒక ఆధునిక తెల్లటి ఇటుకల భవనం, వెలుతురు,వెచ్చదనంతో ఉంది. ఇటీవలి వరకు గొర్రెల కాపరులకు, గొర్రెలకు ఆశ్రయంగా సేవలందించిన గడ్డితో చేసిన ఊగిసలాడే షెడ్డులా ఇది అస్సలు లేదు. కల్మిక్స్ ఒక

సామెత చెప్పేవారు: “నీ శౌర్యం గురించి గొప్పలు చెప్పుకోకు, అది మొదటి బాణం వచ్చే వరకే ఉంటుంది. నీ సంపద గురించి గొప్పలు చెప్పుకోకు, అది మొదటి తుఫాను వచ్చే వరకే ఉంటుంది.” ఒక మనిషి సంపదను అతను కలిగి ఉన్న గొర్రెల సంఖ్యతో కొలిచే రోజుల్లో ఈ సామెత పుట్టింది; ఒక పెద్ద తుఫాను అంటే మందను కోల్పోవడం. ఆ మనిషి ఒకే రాత్రిలో పేదవాడిగా మారిపోవచ్చు. కానీ ఇప్పుడు గొర్రెలు గానీ, గొర్రెల కాపరులు గానీ గడ్డిభూముల్లో చలికి గడ్డకట్టి చనిపోయే సమయం దాటిపోయింది, తుఫానులు  భయపెట్టలేకపోతున్నాయి.

సరే, నేను చూసినంత వరకు దొడ్డిలో అంతా సక్రమంగానే ఉంది. తొట్లలో గడ్డి ఉంది కానీ గొర్రెలకు దానిపై ఆసక్తి ఉన్నట్లు కనిపించలేదు. స్పష్టంగా వాటి కడుపు నిండిపోయింది. కానీ ఆండ్రీవ్ సంతృప్తి చెందలేదు.

“గొర్రెలు కదలకుండా ఎందుకు నిలబడి ఉన్నాయి? వాటిని వెంటనే బయటకు తోలండి, వాటిని అటు ఇటు తిరగనివ్వండి, ఎంత ఎక్కువ తిరిగితే అంత మంచిది. వాటికి కదలిక అవసరం, ఆడ గొర్రెలు బలంగా ఉండాలి.”

ఒక విషయం నన్ను అయోమయంలో పడేసింది. “నాకు

చెప్పు గాఖా, గొర్రెల దొడ్డిని గోడకట్టి ఎందుకు వేరు చేశారు,  రెండు వైపులా గొర్రెలు ఎందుకు ఉన్నాయి?”

“ఆ వైపు ఉన్నవన్నీ కవలలకు జన్మనిస్తాయి.”

“నీకు ఎలా తెలుసు?”

“అవి సన్నగా ఉన్నాయి, వాటి ఎముకలు బయటకు కనిపిస్తున్నాయి. ఒకే ఒక పిల్లకు జన్మనిచ్చే గొర్రె తల్లి నుండి అంతగా పోషకాలను తీసుకోదు. అది గమనించిన వెంటనే నేను వాటిని వేరు చేస్తాను. రెండు గొర్రె పిల్లలను మోస్తున్న వాటికి మంచి ఆహారం, ఎక్కువ సంరక్షణ అవసరం.”

అరుస్తూ, గొర్రెలు బయిటికి వెళ్లే ద్వారం వైపుగా వెళ్ళాయి. అవి ముందుకు సాగడానికి నేను కాపరులకు సహాయం చేసాను. నా వెచ్చని దుస్తులు ఉన్నప్పటికీ, నేను ఎముకల వరకు గడ్డకట్టుకుపోయాను. గాలి కోసేస్తున్నట్లుగా ఉంది.  ఈ చలిని రెండు గంటలు భరించాల్సి వచ్చింది. గొర్రెలకు రెండు గంటల వ్యాయామం ఖచ్చితంగా అవసరమని ఆండ్రీవ్ చెప్పారు. ఆ మంచు వాటికి మేలు చేసింది.

“అవి అటు ఇటు పరిగెత్తినప్పుడు ఎక్కువ తింటాయి.వాటి వంటిలో రక్తం వేగంగా ప్రవహిస్తుంది.”

నేను నా కోటు కాలర్‌ను  పైకి లాక్కున్నాను. ఆ స్టెప్పీ మైదానం ఏమాత్రం ఆహ్లాదకరమైన ప్రదేశం కాదు. అవును,

ఈ రోజుల్లో కూడా గొర్రెల కాపరి ఉద్యోగం అంత తేలికైనది కాదు. ఒకసారి గాఖా గొర్రెలను పచ్చిక బయళ్ల నుండి ఇంటికి తోలుకువస్తున్న సమయం అది. అది శరదృతువు మాత్రమే, కానీ హఠాత్తుగా మంచు కురవడం ప్రారంభమైంది. అది చాలా తీవ్రంగా కురిసింది. పెద్ద పెద్ద మంచు ముక్కలు గొర్రెల ముఖాలపై పడ్డాయి, వాటి శ్వాసకు కరిగి, గడ్డకట్టి మంచు పొరలా మారి, వాటి చూపును నిలిపివేసాయి. గొర్రెలు ఒకదానికొకటి ఢీకొట్టుకుని వెనక్కి పడిపోయాయి, చూపు కోల్పోవడంతో పాటు భయం తోడై అవి నిస్సహాయంగా మారిపోయాయి  వాటిని నియంత్రించడం  అసాధ్యమైంది. అలాంటి క్షణంలో మనిషి కూడా అంతే నిస్సహాయంగా భావించవచ్చు. చలికి గడ్డకట్టుకుపోయి, అలసిపోయి, అతను తన విచక్షణను కోల్పోవచ్చు. ముందుకు సాగడానికి ధైర్యం కావాలి,  గొర్రెల కాపరి యొక్క ప్రాచీన నైపుణ్యం, ఇది మానవాళి అంతటి ప్రాచీనమైన నైపుణ్యం,  అతని మిత్రులు , ఇంకా అన్ని జీవుల పట్ల ప్రేమ.

గాఖా తన మందను సురక్షితంగా ఇంటికి చేర్చాడని చెబితే సరిపోతుంది.

అన్ని జీవుల పట్ల ప్రేమ. బాల్యంలో శ్వాస తీసుకుంటున్న,

పట్టులాంటి గొర్రెపిల్లను హత్తుకోవడం, దాని గుండ్రటి తలపై వంగడం, దాని శ్వాసను అనుభూతి చెందడం… ఒక గుర్రపు పిల్ల కళ్లలోకి చూసి, అది ఎంత నమ్మకంతో మీ వైపుకు వస్తుందో చూడటం సరిపోతుంది…

గొర్రెల కాపరి ఉద్యోగం ఖచ్చితంగా అత్యంత ప్రశాంతమైనది.

యుద్ధ సంవత్సరాల్లో గాఖా దీనిని నేర్చుకున్నాడు.

’42 జూలైలో నాజీ బాంబు దాడిలో మరణించిన తన గుర్రాన్ని చూసి అతను కన్నీరు కార్చాడు. అతను ఇతర కాపరుల పిలుపులను విన్నాడు, తల పైకెత్తి చూసి భయంతో గడ్డిపై కుప్పకూలిపోయాడు. అన్ని గొర్రెలు చనిపోయి ఉండటం చూడటం చాలా ఘోరంగా, నమ్మే లా లేదు . రోజంతా బాంబులు పడ్డాయి. ఫిరంగి దళాల గర్జనలతో గాలి నిండిపోయింది. గొర్రెలను తూర్పు వైపుకు తరలించాలని సామూహిక వ్యవసాయ క్షేత్రం నుండి ఆదేశాలు వచ్చాయి. బాంబు దాడులు తగ్గిన రాత్రి సమయంలో, అవి తెప్పలపై వోల్గా నదిని దాటించారు. ఆ తర్వాత ఉరల్ నది వరకు సుదీర్ఘ ప్రయాణం సాగింది. మరికొన్ని నదులు కూడా దాటాయి. ఆ సంవత్సరాల్లో కాపరులకు చాలా కష్టమైన పని ఉండేది. వారు రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసేవారు. ఆ కాపరులు పిల్లలు,

ఎందుకంటే పురుషులు యుద్ధం చేస్తున్నారు. పన్నెండేళ్ల బాలుడికి అంత బలం ఎక్కడి నుండి వస్తుంది? లేదా అంత అనుభవం ఎక్కడి నుండి వస్తుంది?

గొర్రెల తరలింపు బాధ్యత వహించిన వ్యక్తి నర్మ నిమ్గిరోవ్, ఆయన ఒక అనుభవజ్ఞుడైన గొర్రెల కాపరి, కమ్యూనిస్ట్. అతన్ని సాధారణంగా మెడ్యాతాఅని పిలిచేవారు, దీని అర్థం “జ్ఞానం ఉన్న మనిషి”. వారు తమ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు నిమ్గిరోవ్ వారి తల్లులకు  మాట ఇచ్చాడు: “మీ కుమారులు నిజమైన పురుషులుగా తిరిగి వస్తారు.” వారికి వారి వృత్తిని నేర్పింది ఆయనే.  వారి వృత్తిని మాత్రమే కాదు. ఆయన ఈ పిల్లలకు వందలాది కిలోమీటర్లు ప్రయాణించడం, తమ శక్తిని తెలివిగా ఉపయోగించడం, రోడ్డుపై ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం, మంచి సహచరులుగా ఎలా ఉండాలో నేర్పాడు.

పన్నెండేళ్ల గాఖా మందతో కలిసి కజాఖ్స్తాన్‌కు వెళ్లి, పదమూడేళ్ల వయసులో అనుభవజ్ఞుడైన గొర్రెల కాపరిగా తిరిగి వచ్చాడు.

సంవత్సరాలు గడిచాయి. అతను ఒక బృంద నాయకుడు (టీమ్ లీడర్) అయ్యాడు. అతని ఎంపికను ఎవరూ

ఎప్పుడూ ప్రశ్నించలేదు. అతని పనిలో అతనికి సమానమైన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రికార్డు స్థాయిలో మాంసం, ఉన్ని ఉత్పత్తి చేసినందుకు గాను అతనికి లభించిన ‘ఆర్డర్ ఆఫ్ లెనిన్’ పురస్కారం అతనిని రిపబ్లిక్ అంతటా ప్రసిద్ధి చెందేలా చేసింది.

ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో చాలా మంది వ్యక్తుల ప్రభావాలు కనుగొనవచ్చని నేను కొన్నిసార్లు అనుకుంటాను. అతను వారి ఆలోచనలను, వారి భావాలను తనలో లీనం చేసుకుంటాడు. అతను ఆ విధంగా రూపుదిద్దుకుంటే, వారి ఆలోచనలలోని భావాలలోని ఉత్తమ భాగాన్ని స్వీకరిస్తాడు. అటువంటి వ్యక్తి గురించి అతను జాతీయ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాడని చెప్పవచ్చు. అతనిలో మనలోని ఉత్తమ రూపాన్ని మనం చూస్తాము  అందుకే మనం అతనిని గౌరవిస్తాము.

ఈ వ్యక్తి మారడానికి తమ వంతు సహకారాన్ని అందించిన ఆ వ్యక్తులు ఎవరు? అతని భార్య ఆంటోనినా కూడా ‘బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్’తో సత్కరించబడిన ఒక పశువుల పెంపకందారు. అల్లిన దుస్తుల (కిట్‌వేర్) ఫ్యాక్టరీలో దర్జీగా పనిచేసే అతని సోదరి మరియా, కల్మిక్ అటానమస్ రిపబ్లిక్ యొక్క సుప్రీం సోవియట్ డిప్యూటీగా ఉన్నారు. డ్రైవర్‌గా

పనిచేసే ఆమె భర్త లియోనిడ్ నామినోవ్, ‘ఆర్డర్ ఆఫ్ లెనిన్’ పురస్కారాన్ని కలిగి ఉన్నారు.  గాఖా పెద్ద సోదరుడు, అతను కూడా ఒక గొర్రెల కాపరి, స్థానిక సోవియట్ సభ్యుడిగా ఉన్నాడు.

అతని భార్య తల్లిదండ్రులైన దంబా, ఓస్మా షోవునోవ్ పేర్లు యాషాల్టా గ్రామంలోని ఒక స్మారక చిహ్నంపై బంగారు అక్షరాలతో లిఖించబడ్డాయి. నాజీలు వారిని కాల్చి చంపారు. వారు చురుకైన ప్రతిఘటన పోరాట యోధులు.

ఈ ప్రజల గొప్పతనం, మంచిదనం సమాధుల క్రింద పడి ఉండవు, అవి సజీవంగా ఉన్న హృదయాలలో జీవిస్తాయి.

గొర్రెల కాపరిగా, ఒక మంచి మనిషిగా ఆండ్రేయేవ్‌ను తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేసిన కోల్‌ఖోజ్ గొర్రెల కాపరి నర్మా నిమ్గిరోవ్ గురించి నేను మాట్లాడాను. 1962లో ఆయన ఆండ్రేయేవ్‌ను పార్టీకి సిఫార్సు చేశారు.

గాఖాకు పదిహేనేళ్ల వయసున్నప్పుడు, అతను త్యుమెన్‌లోని షిప్‌యార్డ్‌లకు వెళ్లాడు, అక్కడ అతను కమ్మరి (బ్లాక్‌స్మిత్) అలెక్సీ వాజెనిన్ వద్ద శిష్యుడిగా చేరాడు. ఆ రష్యన్ కార్మికుడు ఆ బాలుడికి కేవలం లోహాన్ని మాత్రమే కాదు, తనను తాను ఎలా మలచుకోవాలో కూడా నేర్పాడు. అది యుద్ధం ముగిసిన తర్వాతి కష్టకాలం,  వాజెనిన్ తరచుగా ఆ బాలుడిని ఇంటికి ఆహ్వానించి, అతని ముందు ఒక గిన్నెడు సూప్, ఒక పెద్ద రొట్టె ముక్కను పెట్టేవాడు.

అది కేవలం సహాయం మాత్రమే కాదు. అది జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిన ఒక పాఠం.

“ఇది చాలా కష్టమైన పని, మీది,” అని మేము మంచులో రెండు గంటల పాటు నడిచిన తర్వాత నేను గాఖాతో అన్నాను.

“అంత సులభం కాదు,” అని అతను అంగీకరించాడు, “కానీ ప్రధాన ఇబ్బందులు వాతావరణం నుండి రావు, మనుషుల నుండి వస్తాయి. మైదానంలో మాకు పుష్కలంగా గడ్డి ఉంది కానీ నీటిని కంటైనర్లలో తీసుకువచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒక డ్రైవర్ ఒక గొర్రెల కాపరికి ఎక్కువ నీరు, మరొకరికి తక్కువ నీరు తీసుకువచ్చేవాడు, ఒక ప్రదేశానికి సమయానికి వచ్చేవాడు. మరొక ప్రదేశానికి సమయానికి వచ్చేవాడు కాదు. నేను వారిని అలా వదిలేయలేకపోయాను. ఏ మంచి బృంద నాయకుడు మాత్రం అలా వదిలేయగలడు? డ్రైవర్లు ఎక్కువగా చిన్న వయసు కుర్రాళ్ళు, మంచి చేతుల్లో పడిన మట్టి లాంటివారు. ఎక్కువ కాలం కాలేదు, అక్కడ ఒక…”

ఒక కుర్రాడు, అతని పేరుతో పనిలేదు. నాకు తెలిసిన వ్యక్తుల గురించి నేను అతనికి చెప్పాను. మంచి వ్యక్తులు. వజెనిన్ లాంటి వ్యక్తులు. అప్పట్లో ఒకసారి నేను ఎలా తప్పుడు అడుగు వేయబోయానో, అతను నన్ను ఎలా వెనక్కి లాగాడో చెప్పాను. ఆ తర్వాత నా మీద నాకే ఎంత అసహ్యం వేసిందో కూడా చెప్పాను. మీకు తెలుసా, అది పనిచేసింది.”

గొర్రెలు విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాయి. తుఫాను సద్దుమణిగింది. ఆకాశం నిర్మలమైంది. తిరిగి వెళ్ళే సమయం అయింది. “మీలాంటి రచయితలు గడ్డి మైదానాల వైపు తరచుగా వస్తూ ఉండాలి,” అని గాఖా  అన్నాడు. “మీకు కొన్ని మంచి ఆలోచనలు దొరుకుతాయి.”

అతను  కొనసాగిస్తూ, “ఉదాహరణకు, ఈ మైదానానికి ఎలా సహాయం చేయాలి? ఒంటెలను ఎలా సంరక్షించాలి? అక్కడ అసలు ఒంటెలే మిగలలేదు. ఇక్కడ వాటిలాగా చాలా తక్కువ ఆహారం/నీటితో జీవించగలిగే వేరే జంతువులు ఏవీ లేవు. గొర్రెల కోసం అర టన్ను దాణా మోయడానికి పెద్ద ట్రాక్టర్‌ను ఎందుకు ఉపయోగించాలి, దానికి బదులు ఒంటెను ఉపయోగించవచ్చు కదా, పైగా ట్రాక్టర్ వెళ్ళలేని చోటికి కూడా ఒంటె వెళ్ళగలదు. ఒంటె అనేది ఈ గడ్డి

మైదానాల ప్రకృతి దృశ్యంలో ఒక భాగం. అది లేకపోతే ఈ మైదానానికి అందమే లేదు!”

ఇక్కడ, తన భూమి, ప్రకృతిని కాపాడుకోవాలనే అవసరాన్ని గుర్తించిన ఒక మనిషి ఉన్నాడని నేను అనుకున్నాను. మైదానం, మాతృభూమి, ఆనందం, కలలు, ఆశలు, అన్వేషణలు ఇవన్నీ అతని మనస్సులో ఒకే గొలుసులోని లింకుల లాంటివి.

తీవ్రమైన కర్తవ్య దీక్ష కలిగిన ఒక కదిలే మనస్సు.

ఆ రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. శీతాకాలపు గడ్డి మైదానంపై ఆకాశం చాలా క్రిందికి వాలినట్లు ఉంది. చేయి చాపి నక్షత్రాన్ని అందుకోవచ్చు అన్నట్లుగా అనిపించింది.

———-

డేవిడ్ కుగుల్తినోవ్
కె. కుమార్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *