ఎవరూ ఏమీ అనలేదు

Spread the love

వంటగదిలో వాళ్ళు మాట్లాడుకోవడం నాకు వినిపిస్తోంది. వారు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు కానీ, వారు గొడవ పడుతున్నారు. ఆ తర్వాత అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. నేను జార్జ్‌ని మోచేత్తో పొడిచాను. అతను నిద్రలేచి వారితో ఏదైనా చెబితే, వారు తప్పుగా భావించి గొడవ ఆపుతారని నేను అనుకున్నాను. కానీ జార్జ్ ఒక పెద్ద మూర్ఖుడు. అతను కాళ్లతో తంతూ, గట్టిగా అరవడం మొదలుపెట్టాడు.

“నన్ను పొడవడం ఆపు, నువ్వు ఒక పనికిమాలిన వాడివి,” అని అతను అన్నాడు. “నేను చెప్పేస్తాను!”

“నువ్వు ఒక తెలివిలేని పిరికివాడివి,” అని నేను అన్నాను. “ఒక్కసారైనా తెలివిగా ప్రవర్తించలేవా? వారు గొడవ పడుతున్నారు, అమ్మ ఏడుస్తోంది. విను.”

అతను తన తలని దిండు పైనుంచి ఎత్తి విన్నాడు. “నాకు అనవసరం,” అని చెప్పి గోడ వైపు తిరిగి మళ్లీ పడుకున్నాడు. జార్జ్ నిజంగా ఒక పెద్ద మూర్ఖుడు.

కొంతసేపటి తర్వాత నాన్న తన బస్సు పట్టుకోవడానికి వెళ్లడం నాకు వినిపించింది. అతను ముందు తలుపును గట్టిగా వేసి వెళ్ళాడు. నాన్న ఈ కుటుంబాన్ని విడగొట్టాలని అనుకుంటున్నాడని అమ్మ అంతకుముందే నాతో చెప్పింది. నాకు అది వినాలని లేదు.

కాసేపటికి ఆమె మమ్మల్ని స్కూల్‌కి వెళ్ళమని పిలవడానికి వచ్చింది. ఆమె గొంతు వింతగా ఉంది. నాకు తెలియదు. నాకు కడుపులో బాలేదని చెప్పాను. అది అక్టోబర్ మొదటి వారం, నేను అప్పటివరకు ఒక్క రోజు కూడా స్కూల్‌కి సెలవు పెట్టలేదు, కాబట్టి ఆమె ఇంకేం చెప్పగలదు? ఆమె నన్ను చూసింది, కానీ ఆమె ఏదో వేరే ఆలోచనలో ఉన్నట్లు అనిపించింది. జార్జ్ మేల్కొనే ఉన్నాడు, వింటున్నాడు. అతను బెడ్‌లో కదిలిన విధానాన్ని బట్టి అతను మేల్కొనే ఉన్నాడని నాకు అర్థమైంది. పరిస్థితి ఎలా మారుతుందో చూసి, దాన్ని బట్టి తను కూడా ఏదో ఒకటి చేయాలని అతను వేచి చూస్తున్నాడు.

“సరే.” ఆమె తల అడ్డంగా ఊపింది. “నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అయితే ఇంట్లోనే ఉండు. కానీ టీవీ చూడకూడదు,  గుర్తుంచుకో.”

జార్జ్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. “నాకు కూడా ఒంట్లో బాలేదు,” అని అతను ఆమెతో అన్నాడు. “నాకు తలనొప్పిగా ఉంది. వీడు రాత్రంతా నన్ను పొడుస్తూ, తంతూనే ఉన్నాడు. నేను అస్సలు నిద్రపోలేదు.”

“అది చాలు ఇక!” ఆమె అంది. “జార్జ్, నువ్వు స్కూల్‌కి వెళ్తున్నావు! నువ్వు ఇక్కడ ఉండి రోజంతా నీ తమ్ముడితో గొడవ పడటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు లేచి బట్టలు వేసుకో. నేను సీరియస్‌గా చెబుతున్నాను. ఈ ఉదయం నాకు మరో గొడవ భరించే ఓపిక లేదు.”

ఆమె గది వదిలి వెళ్లే వరకు జార్జ్ వేచి చూశాడు. తర్వాత అతను బెడ్ అడుగు భాగం నుండి కిందకు దిగాడు. “నువ్వు ఒక దుర్మార్గుడివి,” అని అంటూ నా మీద ఉన్న దుప్పట్లన్నింటినీ లాగేసి, బాత్రూమ్‌లోకి  పారిపోయాడు.

“నిన్ను చంపేస్తాను,” అని నేను అన్నాను, కానీ అమ్మకు  వినిపించనంత మెల్లగా.

జార్జ్ స్కూలుకు వెళ్లే వరకు నేను పడక మీదనే ఉన్నాను. ఆమె పనికి వెళ్లడానికి సిద్ధమవటం మొదలుపెట్టినప్పుడు, సోఫా మీద నా కోసం పడక సిద్ధం చేయమని నేను ఆమెను అడిగాను. నేను చదువుకోవాలనుకుంటున్నానని చెప్పాను. కాఫీ టేబుల్ మీద నా పుట్టినరోజుకు వచ్చిన ఎడ్గర్ రైస్ బరోస్ పుస్తకాలు, నా సోషల్ స్టడీస్ పుస్తకం ఉన్నాయి. కానీ నాకు చదవాలని అనిపించలేదు. ఆమె వెళ్ళిపోతే నేను టీవీ చూడాలని అనుకున్నాను.

ఆమె టాయిలెట్ ఫ్లష్ చేసింది.

నేను ఇక ఎంతమాత్రం ఆగలేకపోయాను. వాల్యూమ్ లేకుండా టీవీ ఆన్ చేశాను. నేను కిచెన్‌లోకి వెళ్ళాను, అక్కడ ఆమె తన సిగరెట్ ప్యాకెట్ వదిలేసింది, అందులోంచి మూడు సిగరెట్లు బయటకు తీశాను. వాటిని కప్‌బోర్డ్‌లో దాచిపెట్టి, తిరిగి సోఫా దగ్గరకు వచ్చి ‘ద ప్రిన్సెస్ ఆఫ్ మార్స్’ పుస్తకం చదవడం మొదలుపెట్టాను. ఆమె బయటకు వచ్చి టీవీ వైపు ఓసారి చూసింది కానీ ఏమీ అనలేదు. నేను పుస్తకాన్ని తెరిచి ఉంచాను. ఆమె అద్దం ముందు నిలబడి తన జుట్టును సరిచేసుకుని, తర్వాత కిచెన్‌లోకి వెళ్ళింది. ఆమె మళ్ళీ బయటకు వచ్చినప్పుడు నేను పుస్తకం వైపు చూశాను.

“నాకు ఆలస్యమవుతోంది. బై, స్వీట్‌హార్ట్.” ఆమె టీవీ ప్రస్తావన తీసుకురాలేదు. నిన్న రాత్రి ఆమె మాట్లాడుతూ, “కలత చెందకుండా”  పనికి వెళ్లడం అంటే ఏమిటో తనకు తెలియడం లేదని అంది.

“ఏమీ వండకు. దేనికోసం బర్నర్లు వెలిగించాల్సిన అవసరం లేదు. నీకు ఆకలిగా ఉంటే ఐస్‌బాక్స్‌లో ట్యూనా ఫిష్ ఉంది.” ఆమె నా వైపు చూసింది. “కానీ నీ కడుపు బాగోలేకపోతే, దాని మీద ఏమీ వేయకుండా తినడమే మంచిదని నా అభిప్రాయం. ఏదేమైనా, నువ్వు బర్నర్లు వెలిగించాల్సిన అవసరం లేదు. వింటున్నావా? ఆ మందు తీసుకో, బంగారం, ఈ రాత్రికి నీ కడుపు నొప్పి తగ్గుతుందని ఆశిస్తున్నాను. బహుశా రాత్రికి మనందరికీ బాగానే అనిపించవచ్చు.”

ఆమె తలుపు దగ్గర నిలబడి నాబ్‌ను తిప్పింది. ఆమె ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా కనిపించింది. ఆమె తెల్లటి బ్లౌజ్, వెడల్పాటి నల్లటి బెల్ట్,  నల్లటి స్కర్ట్ ధరించి ఉంది. కొన్నిసార్లు ఆమె దానిని తన డ్రెస్ అని, మరికొన్నిసార్లు యూనిఫామ్ అని పిలిచేది. నాకు గుర్తున్నంత కాలంగా, అది ఎప్పుడూ అలమరాలో వేలాడుతూనో, బట్టల తాడు మీద ఆరుతూనో, రాత్రిపూట చేత్తో ఉతకబడుతూనో లేదా కిచెన్‌లో ఇస్త్రీ చేయబడుతూనో ఉండేది.

అమ్మ బుధవారం నుండి ఆదివారం వరకు పని చేసేది.

“బై, మమ్మీ.”

ఆమె కారు స్టార్ట్ చేసి, అది వేడెక్కే వరకు నేను వేచి ఉన్నాను. ఆమె రోడ్డు పక్క నుండి కారు తీసి వెళ్ళిపోవడం నేను విన్నాను. అప్పుడు నేను లేచి టీవీ సౌండ్ పెంచాను, తర్వాత ఆ సిగరెట్ల కోసం వెళ్ళాను. నేను ఒక సిగరెట్ కాలుస్తూ, డాక్టర్లు  నర్సుల గురించిన షో చూస్తూ ఆనందం పొందాను.

అప్పుడు నేను ఇంకో ఛానెల్ మార్చాను. తర్వాత టీవీ కట్టేసాను. నాకు చూడాలనిపించలేదు.

తార్స్ తార్కాస్ ఒక పచ్చటి స్త్రీతో ప్రేమలో పడటం, ఆ మరుసటి రోజే ఆమె అసూయపరుడైన బావ ఆమె తల నరకడం చూసే అధ్యాయాన్ని చదవడం పూర్తి చేశాను. నేను దీన్ని చదవడం ఇది సుమారు ఐదవ సారి. అప్పుడు నేను వాళ్ల పడకగదిలోకి వెళ్లి చుట్టూ చూశాను. నాకు ప్రత్యేకంగా ఏదీ కావాలని లేదు, బహుశా మళ్ళీ ఆ ‘రబ్బర్లు’ (కాండమ్‌లు) దొరుకుతాయేమో అని వెతికాను, కానీ నేను అంతటా వెతికినా అవి ఎప్పుడూ కనిపించలేదు. ఒకసారి ఒక డ్రాయర్ వెనుక భాగంలో ఒక వాసెలిన్ డబ్బా దొరికింది. దానికి దీనితో ఏదో సంబంధం ఉందని నాకు తెలుసు, కానీ అదేంటో నాకు అర్థం కాలేదు. నేను ఆ లేబుల్‌ను శ్రద్ధగా చదివి, ఏమైనా తెలుస్తుందేమో అనుకున్నా. అంటే ప్రజలు దానితో ఏం చేస్తారు, లేదా వాసెలిన్ ఎలా పూయాలి వంటి విషయాలు అన్నమాట.

కానీ అందులో ఏమీ లేదు. ముందు భాగంలో కేవలం ‘ప్యూర్ పెట్రోలియం జెల్లీ’ అని మాత్రమే ఉంది. కానీ అది చదవడం కూడా ఉత్తేజాన్ని  కలిగించడానికి సరిపోయింది. వెనుక వైపు, నర్సరీలో ఒక అద్భుతమైన సహాయకారి అని రాసి ఉంది. నేను ఆ ‘నర్సరీ’కి, అంటే ఊయలలు, జారుడు బల్లలు, ఇసుక పెట్టెలు, మంకీ బార్‌లు ఉండే చోటుకి, వాళ్ల మధ్య మంచం మీద జరిగే దానికి  సంబంధాన్ని వెతకడానికి ప్రయత్నించాను. నేను చాలా సార్లు ఆ డబ్బాను తెరిచి, లోపల వాసన చూసి, గత సారి కంటే ఇప్పుడు ఎంత వాడారో అని చూసేవాడిని. ఈసారి ఆ ‘ప్యూర్ పెట్రోలియం జెల్లీని’ వదిలేశాను. అంటే, ఆ డబ్బా ఇంకా అక్కడే ఉందో లేదో అని చూశాను అంతే. నేను కొన్ని డ్రాయర్‌లను వెతికాను, నిజానికి ఏమీ దొరుకుతుందని ఆశించలేదు. మంచం కింద చూశాను. ఎక్కడా ఏమీ లేదు. వాళ్ళు సరుకుల డబ్బులు ఉంచే అల్మారాలోని డబ్బాలో చూశాను. అందులో మార్పు ఏమీ లేదు, కేవలం ఒక ఐదు డాలర్ల నోటు, ఒక డాలరు నోటు మాత్రమే ఉన్నాయి. అవి తీస్తే వాళ్ళు కనిపెట్టేస్తారు. అప్పుడు నేను బట్టలు వేసుకుని బిర్చ్ క్రీక్‌కి నడుచుకుంటూ వెళ్లాలని అనుకున్నాను. ట్రౌట్ చేపల సీజన్ మరో వారం పాటు ఉంటుంది, కానీ అప్పటికే అందరూ చేపలు పట్టడం మానేశారు. అందరూ కేవలం జింకలు, నెమళ్ల వేట సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని వేచి చూస్తూన్నారు.

నేను నా పాత బట్టలు తీశాను. మామూలు సాక్సుల మీద ఉన్ని సాక్సులు వేసుకుని, నిదానంగా బూట్లు కట్టుకున్నాను. రెండు ట్యూనా సాండ్‌విచ్‌లు, కొన్ని డబుల్ డెక్కర్ పీనట్ బటర్ క్రాకర్లను తయారు చేసుకున్నాను. నా నీళ్ల సీసా నింపి, నా వేట కత్తిని, కాంటీన్‌ను నా బెల్టుకు తగిలించుకున్నాను. తలుపు బయటికి వెళ్తుండగా, ఒక చీటీ రాయాలని అనుకున్నాను. కాబట్టి ఇలా రాశాను: “నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, బిర్చ్ క్రీక్‌కి వెళ్తున్నాను. త్వరలోనే వస్తాను. R. 3:15.” అది ఇప్పటి నుండి సుమారు నాలుగు గంటల సమయం. జార్జ్ స్కూల్ నుండి రావడానికి సుమారు పదిహేను నిమిషాల ముందు వస్తాను. బయలుదేరే ముందు, నేను ఒక సాండ్‌విచ్ తిని, దాంతో ఒక గ్లాసు పాలు తాగాను.

బయట వాతావరణం బాగుంది. అది శరదృతువు. రాత్రిపూట తప్ప ఇంకా చలి మొదలవ్వలేదు. రాత్రిపూట వాళ్ళు పండ్ల తోటలలో పొగ పెట్టే పాత్రలు వెలిగించేవారు, దీనివల్ల ఉదయం నిద్రలేచేసరికి ముక్కులో నల్లటి మసి పేరుకుపోయేది. కానీ ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఆ పొగ వల్ల చిన్న పిందెలు మంచుకు గడ్డకట్టకుండా ఉంటాయని వాళ్ళు చెప్పేవారు, కాబట్టి అంతా సవ్యంగానే ఉండేది.

బిర్చ్ క్రీక్‌కు వెళ్లాలంటే, మా వీధి చివర వరకు వెళ్లి పదహారో ఎవెన్యూను చేరుకోవాలి. అక్కడ ఎడమ వైపుకు తిరిగి, కొండ పైకి శ్మశాన వాటికను దాటుకుంటూ వెళ్తే లెనాక్స్ వస్తుంది, అక్కడ ఒక చైనీస్ రెస్టారెంట్ ఉంటుంది. ఆ కూడలి నుండి విమానాశ్రయం కనిపిస్తుంది, బిర్చ్ క్రీక్ ఆ విమానాశ్రయం కింద ఉంటుంది. ఆ కూడలి వద్ద పదహారో వీధి కాస్తా వ్యూ రోడ్‌గా మారుతుంది. వంతెన వచ్చే వరకు, కొంచెం దూరం వ్యూ రోడ్‌లో వెళ్లాలి. రోడ్డుకు ఇరువైపులా పండ్ల తోటలు ఉంటాయి. కొన్నిసార్లు  ఆ తోటల గుండా వెళ్తున్నప్పుడు చెట్ల వరుసల మధ్య నెమళ్లు పరిగెత్తడం కనిపిస్తుంది, కానీ అక్కడ వేటాడలేము ఎందుకంటే మ్యాట్సోస్ అనే గ్రీకు వ్యక్తి మిమ్మల్ని కాల్చేసే అవకాశం ఉంది. వెళ్ళడానికి మొత్తం నలభై నిమిషాల నడక పడుతుందని నా అంచనా.

నేను పదహారో వీధిలో సగం దూరం వెళ్ళేసరికి, ఒక ఎర్రటి కారులో ఉన్న ఆవిడ నా ముందు రోడ్డు పక్కన కారు ఆపింది. ఆమె కిటికీ అద్దాన్ని కిందకు దించి నాకు లిఫ్ట్ కావాలా అని అడిగింది. ఆమె సన్నగా ఉంది, ఆమె నోటి చుట్టూ చిన్న చిన్న మొటిమలు ఉన్నాయి. ఆమె జుట్టుకు ‘కర్లర్స్’ చుట్టుకుని ఉన్నాయి. కానీ ఆమె చూడటానికి ఆకర్షణీయంగానే ఉంది. ఆమె వేసుకున్న గోధుమ రంగు స్వెటర్ ఆమె శరీర ఆకృతిని చక్కగా చూపిస్తోంది.

“స్కూలు ఎగ్గొట్టావా ?”

“అవుననే అనుకుంటున్నా.”

“లిఫ్ట్ కావాలా?”

నేను తల ఊపాను.

“లోపలికి రా. నేను కొంచెం హడావిడిలో ఉన్నాను.”

నేను చేపలు పట్టే గాలం, బుట్టను వెనుక సీటులో పెట్టాను. కారు కింద భాగంలో  వెనుక సీటులో ‘మెల్స్’ దుకాణానికి చెందిన సంచులు చాలా ఉన్నాయి. నేను మాట్లాడటానికి ఏదైనా విషయం కోసం ఆలోచించాను.

“నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను,” అన్నాను. నేను నా టోపీని తీసి, కూర్చోవడానికి వీలుగా క్యాంటీన్‌ను సరిచేసుకుని, కిటికీ పక్కన కూర్చున్నాను.

“అవునా, నేను అస్సలు ఊహించలేదు,” అని ఆమె నవ్వింది. ఆమె తిరిగి కారును రోడ్డు మీదకు పోనిచ్చింది. “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బిర్చ్ క్రీక్‌కా?”

నేను మళ్ళీ తల ఊపాను. నేను నా టోపీ వైపు చూసుకున్నాను. మా మామ హాకీ మ్యాచ్ చూడటానికి సియాటిల్ వెళ్ళినప్పుడు అది నా కోసం కొన్నాడు. నేను…

చెప్పడానికి నా దగ్గర ఇంకేమీ మాటలు లేవు. నేను కిటికీలోంచి బయటకి చూస్తూ నా బుగ్గల్ని లోపలికి పీల్చుకున్నాను. ఈమె నన్ను ఎక్కించుకోవాలని నువ్వు ఎప్పుడూ అనుకుంటూ ఉంటావు. మీరు ఒకరినొకరు ఇష్టపడతారని, ఆమె నిన్ను తన ఇంటికి తీసుకెళ్లి, ఇల్లంతా నీతో గడపనిస్తుందని నీకు తెలుసు. దాని గురించి ఆలోచిస్తుంటే నాకు కోరిక కలగడం మొదలైంది. నేను నా ఒళ్ళో ఉన్న టోపీని అటు ఇటు జరిపి, కళ్ళు మూసుకుని బేస్ బాల్ గురించి ఆలోచించడానికి ప్రయత్నించాను.

“నేను ఎప్పటికైనా చేపలు పట్టడం నేర్చుకోవాలని అనుకుంటూనే ఉంటాను,” అంది ఆమె. “అది చాలా ప్రశాంతంగా ఉంటుందని అంటారు. నేనొక కంగారు పడే మనిషిని.”

నేను కళ్ళు తెరిచాను. మేము ఒక కూడలి దగ్గర ఆగాము. ‘మీరు బాగా బిజీగా ఉన్నారా? ఈ రోజే మొదలుపెడదామా?’ అని అడగాలనిపించింది. కానీ ఆమె వైపు చూడటానికి నాకు భయం వేసింది.

నేను ఇక్కడ మలుపు తిరగాలి. క్షమించు, ఈ ఉదయం నేను కొంచెం హడావిడిగా ఉన్నాను,” అంది ఆమె.

“పర్వాలేదు. ఈ సహాయం చాలు.” నేను నా సామాన్లు బయటకు తీశాను. ఆపై నా టోపీని పెట్టుకుని, మళ్ళీ తీస్తూ ఆమెతో మాట్లాడాను. “సరే వెళ్లొస్తాను. ధన్యవాదాలు. బహుశా వచ్చే వేసవిలో…”

కానీ నేను మాట పూర్తి చేయలేకపోయాను.

“చేపలు పట్టడమా? తప్పకుండా,” అంటూ ఆడవాళ్లు చేసినట్టుగా తన వేళ్లతో సైగ చేస్తూ వీడ్కోలు పలికింది.

నేను నడవడం మొదలుపెట్టాను, నేను ఏమి చెప్పి ఉండాల్సిందో ఆలోచిస్తూ. నేను చాలా విషయాలు ఆలోచించగలిగాను. అసలు నాకు ఏమైంది? నేను గాలిలో గాలపు కర్రను ఊపుతూ రెండు మూడు సార్లు గట్టిగా అరిచాను. అసలు మొదట నేను అడగాల్సింది మేమిద్దరం కలిసి భోజనం చేయవచ్చా అని. మా ఇంట్లో ఎవరూ లేరు. అకస్మాత్తుగా మేము నా పడకగదిలో దుప్పటి కింద ఉన్నాం. ఆమె స్వెటర్ వేసుకునే ఉండవచ్చా అని అడిగితే, నేను పర్వాలేదు అని అంటున్నాను. ఆమె తన ప్యాంటు కూడా అలాగే ఉంచుకుంది. అది కూడా ఫరవాలేదు, నాకు అభ్యంతరం లేదు అని నేను చెబుతున్నాను.

చిన్న విమానం ల్యాండింగ్ కోసం నా తల మీదుగా కిందకు దూసుకుపోయింది. నేను వంతెన నుండి కొన్ని అడుగుల దూరంలో ఉన్నాను. నీరు ప్రవహిస్తున్న శబ్దం నాకు వినిపిస్తోంది. నేను గట్టు దిగి వేగంగా వెళ్లి, వాగులోకి ఐదు అడుగుల దూరం వరకు మూత్రం పోశాను. అది ఒక రికార్డు అయి ఉండాలి. నేను ఇంకో సాండ్‌విచ్, పీనట్-బట్టర్ క్రాకర్స్ తింటూ కొంత సమయం గడిపాను. క్యాంన్‌ లోని నీళ్లలో సగం తాగాను. అప్పుడు చేపలు పట్టడానికి సిద్ధమయ్యాను.

ఎక్కడ మొదలుపెట్టాలా అని ఆలోచించడానికి ప్రయత్నించాను. మేము ఇక్కడికి మారినప్పటి నుండి, గత మూడేళ్లుగా నేను ఇక్కడే చేపలు పడుతున్నాను. నాన్న, జార్జ్‌ని నన్ను కార్లో

ఇక్కడికి తీసుకువచ్చేవారు, సిగరెట్ తాగుతూ మా కోసం వేచి చూసేవారు, మా గాలాలకు ఎర వేసేవారు, గాలం ఎక్కడైనా చిక్కుకుంటే మా కోసం కొత్త వాటిని కట్టేవారు. మేము ఎప్పుడూ వంతెన దగ్గరే మొదలుపెట్టేవాళ్ళం. కిందకి వెళ్ళాము, ఎప్పుడూ కొన్ని దొరికేవి. అప్పుడప్పుడు, సీజన్ ప్రారంభంలో, మేము చాలా చేపలు పట్టేవాళ్ళం. నేను ముందుగా వంతెన కింద గాలం వేయడానికి సిద్ధమయ్యాను.

అప్పుడప్పుడు నేను ఒడ్డు కింద, ఒక పెద్ద రాయి వెనుక గాలం వేసేవాడిని. కానీ ఏమీ దొరకలేదు. నీరు నిశ్చలంగా ఉండి, అడుగున నిండా పసుపు రంగు ఆకులు ఉన్న ఒక చోట, నేను వంగి చూడగా కొన్ని పీతలు తమ పెద్ద కొమ్ములను పైకి ఎత్తి అక్కడ పాకుతూ కనిపించాయి. పొదల గుట్ట నుండి కొన్ని కౌజు పిట్టలు  ఎగిరిపోయాయి.

నేను ఒక కర్రను విసిరినప్పుడు, ఒక మగ నెమలి  కూస్తూ పది అడుగుల దూరంలో పైకి ఎగిరింది, ఆ దెబ్బకు నేను గాలాన్ని దాదాపు వదిలేసినంత పని చేశాను.

ఆ వాగు నెమ్మదిగా పారుతోంది. అంత వెడల్పుగా లేదు. నా బూట్లు మునిగిపోకుండా నేను ఎక్కడైనా నడిచి అవతలికి వెళ్ళగలను. ఆవు పేడతో నిండిన ఒక పచ్చిక బయలును దాటి నీరు ఒక పెద్ద పైపు నుండి ప్రవహించే చోటికి వచ్చాను. ఆ పైపు కింద ఒక చిన్న గుంట ఉందని నాకు తెలుసు, అందుకే నేను జాగ్రత్తగా, గాలం వేయడానికి సరిపడా దగ్గరకు వెళ్ళినప్పుడు నేను మోకాళ్లపై కూర్చున్నాను. అది నీటిని తాకిన వెంటనే నాకు ఒక కుదుపు తగిలింది, కానీ నేను దానిని మిస్ అయ్యాను. అది గాలంతో పాటు దొర్లడం నేను గమనించాను. తర్వాత అది వెళ్ళిపోయింది గాలం వెనక్కి

ఎగిరి వచ్చింది. నేను గాలానికి మరో సాల్మన్ గుడ్డును తగిలించి మరికొన్ని సార్లు ప్రయత్నించాను. కానీ నాకు అదృష్టం కలిసిరాదని అప్పటికే అర్థమైంది.

నేను కట్ట పైకి వెళ్లి ‘KEEP OUT’  అని రాసి ఉన్న బోర్డు ఉన్న ఫెన్సింగ్ కింద నుండి అవతలికి వెళ్ళాను. విమానాశ్రయ రన్వేలలో ఒకటి ఇక్కడ నుండే మొదలవుతుంది. పక్కా రోడ్డు పగుళ్లలో పెరుగుతున్న కొన్ని పువ్వులను చూడటానికి నేను ఆగాను. టైర్లు నేలను తాకినప్పుడు ఏర్పడిన నల్లటి జిడ్డు గుర్తులు ఆ పువ్వుల చుట్టూ ఉండటం గమనించాను. నేను మళ్ళీ అవతలి వైపు ఉన్న వాగు వద్దకు వెళ్లి, ఆ గుంట దగ్గరకు  చేపలు పడుతూ వెళ్ళాను. నేను ఇంతకు మించి ముందుకు వెళ్లకూడదని అనుకున్నాను.

మూడేళ్ల క్రితం  మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు, నీరు ఒడ్డు పైవరకు ఉధృతంగా ప్రవహించేది. అప్పుడు నీరు చాలా వేగంగా ఉండటంతో చేపలు పట్టలేకపోయాను. ఇప్పుడు ఆ వాగు ఒడ్డు నుండి ఆరు అడుగుల కిందకు ఉంది. అది బుడగలు వస్తూ, గుంట పైభాగంలో ఉన్న చిన్న ప్రవాహం గుండా ప్రవహిస్తోంది, అక్కడ అడుగు భాగం సరిగ్గా కనిపించడం లేదు. మరికొంచెం ముందుకు వెళ్తే, అడుగు భాగం పైకి తేలి మళ్ళీ లోతు తక్కువగా ఉంది, ఏమీ జరగనట్లుగా ఉంది. గతసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు పది అంగుళాల పొడవున్న రెండు చేపలను పట్టాను. అంతకంటే రెట్టింపు పరిమాణంలో ఉన్న ఒక దానిని వదిలేశాను, అది ఒక ‘సమ్మర్ స్టీల్‌హెడ్’ అని మా నాన్నతో చెప్పినప్పుడు ఆయన అన్నారు. వసంతకాలం ప్రారంభంలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు అవి వస్తాయని, కానీ నీటి మట్టం తగ్గకముందే అవి మళ్ళీ నదిలోకి వెళ్లిపోతాయని ఆయన చెప్పారు.

నేను గాలానికి మరో రెండు సీసపు గుండ్లను  తగిలించి  పళ్ళతో గట్టిగా నొక్కాను. తర్వాత ఒక తాజా సాల్మన్ గుడ్డును తగిలించి గాలాన్ని విసిరాను.. నీరు కింద ఉన్న కొలనులోకి పడుతోంది. నేను ఆ ప్రవాహాన్ని గాలపు అంచుని కిందకు తీసుకువెళ్లనిచ్చాను. సీసపు గుండ్లు రాళ్లపై టప్-టప్ అని కొట్టుకుంటున్నట్లు నాకు అనిపిస్తోంది, చేప గాలం కొరికినప్పుడు వచ్చే శబ్దానికి ఇది భిన్నంగా ఉంది. ఆ తర్వాత గాలం గట్టిపడింది, ప్రవాహం ఆ గుడ్డును కొలను చివర కనిపించేలా తీసుకువచ్చింది.

ఇంత దూరం వచ్చి ఏమీ దొరకలేదని నాకు చాలా నిరాశగా అనిపించింది. ఈసారి గాలాన్ని బాగా వెనక్కి లాగి మరోసారి

విసిరాను. నేను ఆచేపల గాలం కర్రను ఒక కొమ్మ మీద ఉంచి, నా దగ్గర ఉన్న రెండో చివరి ‘వీడ్’ను తగిలించాను. నేను లోయ వైపు చూస్తూ ఆ స్త్రీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఆమె కిరాణా సామాన్లు మోయడానికి సహాయం కావాలని కోరడంతో మేము ఆమె ఇంటికి వెళ్తున్నాము. ఆమె భర్త విదేశాలలో ఉన్నాడు. నేను ఆమెను తాకాను, ఆమె వణకడం మొదలుపెట్టింది. మేము సోఫా మీద కూర్చుని ముద్దుపెట్టుకుంటుండగా, ఆమె బాత్‌రూమ్‌కు వెళతానంది. నేను ఆమెను అనుసరించాను. ఆమె తన ప్యాంటు విప్పి టాయిలెట్ మీద కూర్చోవడం నేను చూశాను. నాకు తీవ్రమైన కామోద్రేకం కలిగింది, ఆమె నన్ను తన చేత్తో రమ్మని సైగ చేసింది…, ఇంతలో వాగులో ఏదో పడిన శబ్దం వినిపించింది. నేను చూసేసరికి నా గాలం కర్ర చివర వణుకుతోంది.

చేప అంత పెద్దదేమీ కాదు, పెద్దగా పోరాడలేదు కూడా. కానీ ఎంతసేపు వీలైతే అంతసేపు దాన్ని ఆడిస్తూనే ఉన్నాను. అది ఒక పక్కకు తిరిగి కింద ప్రవాహంలో పడుకుంది. అది ఏమిటో నాకు తెలియలేదు. అది వింతగా కనిపిస్తోంది. నేను గాలాన్ని గట్టిగా లాగి, దాన్ని గట్టు మీద ఉన్న గడ్డిలోకి ఎత్తాను, అక్కడ అది కొట్టుకుంటూ నన్ను తీక్షణంగా చూస్తోంది. అది ఒక ట్రౌట్ చేప. కానీ అది ఆకుపచ్చ రంగులో ఉంది. నేను అలాంటి దానిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు. దానికి ఆకుపచ్చని పార్శ్వాలు, నల్లటి చుక్కలు, ఆకుపచ్చని తల,  ఆకుపచ్చని పొట్ట ఉన్నాయి. అది నాచు రంగులో, అంటే ఆకుపచ్చ రంగులో ఉంది. అది చాలా కాలం పాటు నాచులో చుట్టబడి ఉండి, ఆ రంగు దానికంతా అంటుకున్నట్లుగా ఉంది. అది లావుగా ఉంది, కానీ ఎందుకు పెద్దగా పోరాడలేదా అని నేను ఆశ్చర్యపోయాను. దానికి అంతా బాగానే ఉందా అని నేను ఆలోచించాను. నేను దాన్ని కాసేపు చూసి, తర్వాత దాని చంపేశాను.

నేను కొంచెం గడ్డిని పీకి, దానిని చేపల బుట్టలో  వేసి, దాని మీద ఆ చేపను పడుకోబెట్టాను.

నేను మరికొన్ని సార్లు గాలం వేశాను, అప్పటికి సమయం రెండు లేదా మూడు అయి ఉంటుందని అనుకున్నాను.  వంతెన దగ్గరకు వెళ్లడం మంచిదని అనుకొన్నాను. ఇంటికి వెళ్లే ముందు కాసేపు వంతెన కింద చేపలు పట్టాలని అనుకున్నా. రాత్రి అయ్యే వరకు ఆ స్త్రీ గురించి మళ్ళీ ఆలోచించకూడదని నిర్ణయించుకున్నాను. కానీ వెంటనే ఆమెను తలుచుకుని నాకు మళ్ళీ కోరిక కలిగింది. అప్పుడు నేను దీని గురించి ఇంత ఎక్కువగా ఆలోచించడం మానేయాలని అనుకున్నా. దాదాపు ఒక నెల క్రితం, ఒక శనివారం అందరూ వెళ్లిపోయినప్పుడు, నేను తీసుకున్నాను..

బైబిల్ మీద ఒట్టు వేసి మరీ ఇక ఎప్పుడూ అలా చేయనని మాట ఇచ్చాను. నేను చేసిన వాగ్దానాలు, ప్రమాణాలు నేను మళ్ళీ ఒంటరి అయ్యే వరకు, అంటే కేవలం ఒక రోజు లేదా రెండు రోజులు మాత్రమే నిలిచాయి.

నేను వెళ్లే దారిలో ఎక్కడా చేపలు పట్టలేదు. నేను వంతెన దగ్గరకు చేరుకున్నప్పుడు, గడ్డిలో ఒక సైకిల్‌ను చూశాను. జార్జ్ అంత పరిమాణంలో ఉన్న ఒక పిల్లాడు ఒడ్డు వెంబడి పరిగెత్తడం గమనించాను. నేను అతని వైపు వెళ్లడం ప్రారంభించాను. అప్పుడు అతను వెనుతిరిగి నా వైపు రావడం మొదలుపెట్టాడు, నీళ్లలోకి చూస్తూ.

“హేయ్, ఏమైంది!” అని నేను గట్టిగా అరిచాను. “ఏం జరిగింది?” అతను నా మాట వినలేదని అనుకుంటాను. ఒడ్డు మీద అతని గాలం, చేపల సంచిని చూశాను, వెంటనే నా సామాన్లను కింద పడేశాను. అతను ఉన్న చోటికి పరుగెత్తాను. అతను చూడటానికి ఒక ఎలుకలా ఉన్నాడు. అంటే, అతనికి ఎత్తు పళ్లు, సన్నని చేతులు ఉన్నాయి, అతను వేసుకున్న చిరిగిన పొడుగు చేతుల చొక్కా చాలా చిన్నదిగా ఉంది.

“దేవుడా, నా మీద ఒట్టు, నేను ఇప్పటివరకు చూసిన వాటిలో ఇదే అతి పెద్ద చేప!” అని అతను కేక వేశాడు. “త్వరగా! చూడు! ఇక్కడికి చూడు! అదిగో ఇక్కడ ఉంది!”

అతను చూపించిన చోటికి నేను చూశాను, నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అది నా చెయ్యి అంత పొడవు ఉంది.

“దేవుడా, ఓ దేవుడా, దాన్ని ఒక్కసారి చూడండి!” అన్నాడు ఆ అబ్బాయి.

నేను చూస్తూనే ఉన్నాను. అది నీటిపై వేలాడుతున్న ఒక కొమ్మ నీడలో విశ్రాంతి తీసుకుంటోంది. “సర్వశక్తిమంతుడైన దేవుడా,” నేను ఆ చేపతో అన్నాను, “నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?”

“మనం ఏం చేద్దాం?” అని ఆ పిల్లాడు అడిగాడు. “నా దగ్గర ఇప్పుడు తుపాకీ ఉంటే బాగుండు అనిపిస్తోంది.”

“మనం దాన్ని పట్టుకోబోతున్నాం,” అని నేను అన్నాను. “దేవుడా, దాన్ని చూడు! దాన్ని  నీటి ప్రవాహంలోకి  వచ్చేలా చేద్దాం.”

“అయితే మీరు నాకు సహాయం చేస్తారా? మనం కలిసి పని చేద్దాం!” అని ఆ పిల్లాడు అన్నాడు.

ఆ పెద్ద చేప కొన్ని అడుగుల దూరం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి, స్వచ్ఛమైన నీటిలో తన మొప్పలను నెమ్మదిగా కదిలిస్తూ ఉంది.

“సరే, మనం ఏం చేయాలి?” అని ఆ పిల్లాడు అడిగాడు.

“నేను పైకి వెళ్లి వాగు గుండా నడుచుకుంటూ వస్తాను, దాన్ని కదిలేలా చేస్తాను,” అని నేను అన్నాను. “నువ్వు ఆ ప్రవాహంలో నిలబడు, అది లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడు, దాన్ని బలంగా తన్ని బయట పడెయ్యి. దాన్ని ఎలాగైనా సరే ఒడ్డుకు చేర్చు, నాకు సంబంధం లేదు ఎలా చేస్తావో. ఆ తర్వాత దాన్ని గట్టిగా పట్టుకో.”

“సరే. ఓరి నాయనో, దాన్ని చూడండి! చూడు, అది వెళ్ళిపోతోంది! ఎక్కడికి వెళ్తోంది?” అని ఆ అబ్బాయి అరిచాడు.

నేను ఆ చేప మళ్ళీ వాగు గుండా పైకి వెళ్ళడం, ఒడ్డుకు దగ్గరగా ఆగడం చూశాను. “అది ఎక్కడికీ వెళ్ళదు. దానికి వెళ్ళడానికి

వేరే చోటు లేదు. చూశావా? అది చచ్చేంత భయంతో ఉంది. మనము ఇక్కడే ఉన్నామని దానికి తెలిసిపోయింది.”

“అది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లాలని చుట్టూ తిరుగుతోంది. చూడు, మళ్ళీ ఆగిపోయింది. అది ఎక్కడికీ వెళ్లలేదు. ఆ విషయం దానికి  తెలుసు. మనం దానిని పట్టేసుకుంటామని దానికి తెలుసు. దాని పరిస్థితి బాగోలేదని దానికి తెలుసు. నేను పైకి వెళ్లి దానిని కిందకు భయపెడతాను. అది ఇటు రాగానే నువ్వు పట్టుకో.”

“నా దగ్గర తుపాకీ ఉంటే బాగుండేది,” అని ఆ అబ్బాయి అన్నాడు. “దాంతో దాని పని అయిపోయేది,” అని చెప్పాడు.

నేను కొంచెం దూరం పైకి వెళ్లి, వాగులోకి దిగి నడవడం మొదలుపెట్టాను. వెళ్తున్నప్పుడు నా ముందు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాను. హఠాత్తుగా ఒక చేప ఒడ్డు నుండి దూరంగా జారి, నా ముందే కుడి వైపుకు ఒక పెద్ద బురద సుడిగుండంలా తిరిగి, వేగంగా ప్రవాహానికి ఎదురుగా వెళ్లిపోయింది.

“ఇదిగో వచ్చేస్తోంది !” అని నేను గట్టిగా అరిచాను. “హే, హే, ఇక్కడికి వస్తోంది !”

కానీ ఆ చేప రాళ్ళ మధ్య ఉన్న లోతు తక్కువ నీటిని చేరుకోకముందే వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. నేను నీటిని చిమ్ముతూ అరిచాను, అది మళ్ళీ తిరిగింది. “అది వస్తోంది ! పట్టుకో, పట్టుకో! ఇదిగో వచ్చేస్తోంది !”

కానీ వాడు తన దగ్గర ఒక కర్రను ఉంచుకున్నాడు. చేప లోతు తక్కువ నీటిలోకి రాగానే, ఆ అబ్బాయి దాన్ని కాలితో తన్ని బయటకు పడేయడానికి ప్రయత్నించాల్సింది పోయి, కర్రతో దానిపైకి దూకాడు. ఆ చేప తప్పించుకుని, పిచ్చిదానిలా ఒక పక్కకు వాలి లోతు తక్కువ నీటిలో వేగంగా వెళ్ళిపోయింది. అది తప్పించుకుంది. ఆ అబ్బాయి దాని కోసం నీటిలోకి దూకి బోర్లా పడ్డాడు.

అతను తడిసిపోయి ఒడ్డుకు లాక్కుంటూ వచ్చాడు. “నేను దాన్ని కొట్టాను!” అని ఆ అబ్బాయి అరిచాడు. “దానికి  దెబ్బ తగిలిందని నేను అనుకుంటున్నాను. నేను దాని ని పట్టుకున్నాను, కానీ వదిలిపెట్టేశాను.”

“నువ్వు దేన్నీ పట్టుకోలేదు!” నాకు ఊపిరి ఆడటం లేదు. ఆ పిల్లాడు నీళ్లలో పడినందుకు నాకు సంతోషంగా ఉంది. “నువ్వు కనీసం దాని దగ్గరకు కూడా వెళ్ళలేదు, వెధవా. ఆ కర్రతో నువ్వేం చేస్తున్నావు? నువ్వు దాన్ని తన్నాల్సింది. చేప ఇప్పుడు ఎక్కడో మైలు దూరంలో ఉంటుంది.” నేను ఉమ్మి వేయడానికి ప్రయత్నించాను. తల అడ్డంగా తిప్పాను.

“నాకు తెలియదు. మనం ఇంకా దాని ని పట్టుకోలేదు. బహుశా మనం దానిని పట్టుకోలేకపోవచ్చు,” అని అన్నాను.

“దేవుడి సాక్షిగా, నేను దానిని కొట్టాను!” అని ఆ అబ్బాయి కేకలు వేశాడు. “నువ్వు చూడలేదా? నేను దానిని కొట్టాను, నా చేతులతో పట్టుకున్నాను కూడా. నువ్వు ఎంత దగ్గరకు వెళ్ళావు? అయినా, అది ఎవరి చేప?” అని అతను నా వంక చూశాడు. అతని ప్యాంటు నుండి నీళ్లు షూస్ లోకి కారుతున్నాయి.

నేనేమీ అనలేదు, కానీ నాకూ అదే సందేహం కలిగింది. నేను భుజాలు ఎగరేస్తూ, “సరే, అది మన ఇద్దరిదీ అని నేను అనుకున్నాను. ఈసారి ఎలాగైనా పట్టుకుందాం. మనలో ఎవరూ తప్పులు చేయకూడదు,” అని అన్నాను.

మేము ప్రవాహానికి దిగువన నడిచాము. నా బూట్లలో నీళ్లు ఉన్నాయి, కానీ ఆ పిల్లాడు మెడ వరకు తడిసిపోయాడు. వణుకు వల్ల తన పళ్లు కొట్టుకోకుండా ఉండటానికి అతను తన పై పెదవిని పళ్లతో గట్టిగా నొక్కి పట్టుకున్నాడు.

చిన్న అలలున్న ప్రాంతం కింద ఉన్న నీటి ప్రవాహంలో ఆ చేప లేదు, ఆ పక్కన ఉన్న ప్రాంతంలో కూడా మాకు అది కనిపించలేదు. మేము ఒకరినొకరు చూసుకున్నాము, ఆ చేప నిజంగానే ప్రవాహానికి ఎదురుగా కిందకు వెళ్ళిపోయి లోతైన గుంటలలో ఎక్కడో చేరిపోయిందేమోనని ఆందోళన పడటం మొదలుపెట్టాము. కానీ అప్పుడే, ఆ దౌర్భాగ్యపు చేప ఒడ్డు దగ్గర నీటిలో దొర్లింది, దాని తోకతో నీటిలోకి మట్టిని కొట్టి, మళ్ళీ దూసుకుపోయింది. అది ఇంకొక రిఫిల్ గుండా వెళ్ళింది, దాని పెద్ద తోక నీటి నుండి బయటకు కనిపిస్తోంది. అది ఒడ్డుకు దగ్గరగా వెళ్ళి ఆగిపోవడాన్ని నేను చూశాను, దాని తోక సగం నీటిలో ఉంది, ప్రవాహానికి ఎదురుగా నిలబడటానికి తన రెక్కలను ఆడిస్తోంది.

“అది నీకు కనిపిస్తోందా?” నేను అడిగాను. అబ్బాయి చూశాడు. నేను అతని చేయి పట్టుకుని వేలితో చూపించాను. “సరిగ్గా అక్కడ. సరే ఇప్పుడు విను. నేను ఆ ఒడ్డుల మధ్య ఉన్న చిన్న ప్రవాహం దగ్గరకు వెళ్తాను. నేను చెప్పేది అర్థమవుతుందా? నేను నీకు సిగ్నల్ ఇచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. తర్వాత నువ్వు కిందకు రావడం మొదలుపెట్టు. సరేనా? ఈసారి అది మళ్ళీ వెనక్కి వస్తే దాన్ని వెళ్ళనివ్వకు.”

“సరే,” అన్నాడు ఆ అబ్బాయి, పళ్ళతో తన పెదవిని నొక్కుతూ. “ఈసారి దాన్ని పట్టుకుందాం,” అన్నాడు ఆ అబ్బాయి, అతని ముఖంలో  చల్లని చూపు ఉంది.

నేను ఒడ్డు పైకి లేచి కిందకు నడిచాను, శబ్దం కాకుండా జాగ్రత్తగా వెళ్ళాను. నేను ఒడ్డు నుండి జారి నీటిలోకి వెళ్ళాను. కానీ ఆ పెద్ద చేప నాకు ఎక్కడా కనిపించలేదు, నా గుండె ఆగిపోయినంత పని అయింది. అది అప్పటికే వెళ్ళిపోయిందేమోనని అనుకున్నాను. ఇంకొంచెం దూరం కిందకు వెళ్తే అది గుంటల్లోకి చేరుకుంటుంది. అప్పుడు మేము దాన్ని ఎప్పటికీ పట్టుకోలేము.

“అది ఇంకా అక్కడే ఉందా?” అని నేను అరిచాను. ఊపిరి బిగబట్టి ఆగాను.

ఆ అబ్బాయి చేయి ఊపాడు.

“సిద్ధమా!” అని నేను మళ్ళీ అరిచాను.

“ఇదిగో వచ్చేస్తున్నా!” అని అబ్బాయి తిరిగి అరిచాడు.

నా చేతులు వణికిపోయాయి. ఆ ఏరు దాదాపు మూడు అడుగుల వెడల్పు ఉండి,

మట్టి ఒడ్డుల మధ్య ప్రవహిస్తోంది. నీరు తక్కువగానే ఉన్నా ప్రవాహం వేగంగా ఉంది. ఆ అబ్బాయి ఇప్పుడు ఏటి గుండా కిందకు వస్తున్నాడు, నీరు అతని మోకాళ్ళ వరకు ఉన్నాయి, అతను తన ముందు రాళ్లను విసురుతూ, నీటిని చిమ్ముతూ, అరుస్తూ వస్తున్నాడు.

“ఇదిగో ఇటు వస్తోంది!” అని ఆ అబ్బాయి తన చేతులు ఊపాడు. ఇప్పుడు నేను ఆ చేపను చూశాను; అది నేరుగా నా వైపు వస్తోంది. నన్ను చూడగానే అది వెనక్కి తిరగడానికి ప్రయత్నించింది, కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. నేను నా మోకాళ్లపై కిందకు దిగి, చల్లని నీటిలో దాన్ని గట్టిగా పట్టుకున్నాను. నేను నా చేతులతో దాన్ని పైకి లేపి, నీటిలో నుండి బయటకు విసిరాను, మేమిద్దరం ఒడ్డున పడ్డాము. నేను దాన్ని నా చొక్కాకు అదుముకుని

పట్టుకున్నాను, అది గిలగిలలాడుతూ మెలికలు తిరుగుతోంది, చివరికి నా చేతులతో దాని జారే చర్మం మీద నుండి మొప్పల వరకు పట్టుకోగలిగాను. నేను ఒక చేయి లోపలికి పోనిచ్చి దాని నోటి ద్వారా గోళ్లతో గట్టిగా పట్టుకున్నాను…

అతని దవడ చుట్టూ నా చేతులు బిగించాను. వాడు నాకు చిక్కిందని నాకు తెలుసు. అది ఇంకా విలవిలలాడుతూ పట్టుకోవడానికి కష్టంగానే ఉంది, కానీ నేను దానిని గట్టిగా పట్టుకున్నాను, వదిలిపెట్టలేదు.

“మనం దానిని పట్టేశాం!” అని ఆ కుర్రాడు నీళ్లలో పైకి వస్తూ అరిచాడు. “మనం చేపని పట్టేశాం, దేవుడా! అది అదిరిపోయింది కదా! దానిని చూడు! ఓ దేవుడా, నన్ను ఒక్కసారి పట్టుకోనివ్వు,” అని ఆ కుర్రాడు కేకలు వేశాడు.

“మనం ముందు దానిని చంపాలి,” అని నేను అన్నాను. పళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటూ, నా చేతనైనంత గట్టిగా వాడి తల వెనుకకు లాగాను; ఆ ఎముకలు విరుగుతున్న శబ్దం నాకు తెలుస్తోంది. అది ఒకసారి గట్టిగా వణికి, చలనం లేకుండా ఉండిపోయింది . నేను దానిని ఒడ్డున పెట్టాను, మేమిద్దరం దానినే చూస్తూ ఉండిపోయాము. అది కనీసం రెండడుగుల పొడవు ఉంది , వింతగా సన్నగా ఉంది , కానీ నేను ఇప్పటివరకు పట్టిన వాటన్నింటికంటే పెద్దచేప. నేను మళ్ళీ దాని దవడను పట్టుకున్నాను.

“హే,” అని ఆ కుర్రాడు ఏదో అనబోయి, నేను ఏం చేయబోతున్నానో చూసి ఆగిపోయాడు. నేను రక్తాన్ని కడిగేసి, ఆ చేపను తిరిగి ఒడ్డున పెట్టాను.

“మా నాన్నకు దీన్ని చూపించాలని నాకు

చాలా ఆశగా ఉంది,” అన్నాడు ఆ కుర్రాడు.

మేము తడిసిపోయి వణుకుతున్నాము. మేము వాడినే చూస్తూ, పదే పదే స్పృశిస్తున్నాము. మేము చేప పెద్ద నోరు తెరిచి, వరుసగా ఉన్న పళ్ళను చూశాము. వాడి పక్కభాగాలు గాయాలతో ఉన్నాయి, పావు వంతు పరిమాణంలో తెల్లటి వాపులు ఉబ్బిపోయి ఉన్నాయి. కళ్ళ చుట్టూ తల మీద, ముక్కు మీద చిన్న చిన్న గాట్లు ఉన్నాయి; బహుశా రాళ్ళను ఢీకొట్టడం వల్ల లేదా పోరాటాల వల్ల అవి వచ్చి ఉండవచ్చు. కానీ వాడు చాలా సన్నగా ఉంది, ఉండాల్సిన దానికంటే మరీ సన్నగా వుంది. దాని పక్కటెముకల మీదున్న గులాబీ రంగు గీత అసలు కనిపించడం లేదు. వాడి పొట్ట భాగం తెల్లగా గట్టిగా ఉండటానికి బదులు బూడిద రంగులో వదులుగా ఉంది. కానీ అది ఏదో ప్రత్యేకమైన చేప అని అనుకున్నాను.

“నేను త్వరగా వెళ్ళాలి,” అన్నాను. సూర్యుడు అస్తమిస్తున్న కొండల వైపు మేఘాలను చూశాను. “నేను ఇంటికి వెళ్ళాలి.”

“అవును, నేను కూడా. నాకు గడ్డకట్టేంత చలిగా ఉంది,” అని ఆ కుర్రాడు అన్నాడు. “హే, నేను దీన్ని మోస్తాను,” అని అడిగాడు.

“ఒక కర్ర తీసుకుందాం. దాన్ని  నోటి గుండా దూర్చి ఇద్దరం కలిసి మోద్దాం,” అని నేను అన్నాను.

ఆ కుర్రాడు ఒక కర్ర వెతికాడు. మేము దాన్ని చేప మొప్పల గుండా దూర్చి, చేప కర్ర మధ్యలోకి వచ్చే వరకు నెట్టాము. ఆ తర్వాత మేమిద్దరం ఒక్కో వైపు పట్టుకుని వెనక్కి నడవడం మొదలుపెట్టాము, కర్ర మీద ఊగుతున్న చేపను చూస్తూ సాగాము.

“మనం దీన్ని ఏం చేద్దాం?” అని ఆ కుర్రాడు అడిగాడు.

“నాకు తెలియదు,” అన్నాను. “బహుశా దీన్ని నేను పట్టుకున్నాను అనుకుంటా,” అన్నాను.

“మనమిద్దరం పట్టాం. పైగా, దానిని మొదట నేనే చూశాను.”

“అది నిజమే,” అన్నాను. “సరే, మరి టాస్ వేద్దామా లేక ఇంకేమైనా చేద్దామా?” అని నా ఖాళీ చేత్తో జేబులు తడుముకున్నాను, కానీ నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఒకవేళ నేను ఓడిపోయి ఉంటే ఏమి చేసేవాడిని?

ఏదేమైనా, ఆ పిల్లాడు, “వద్దు, టాస్ వేయడం వద్దు,” అన్నాడు.

నేను, “సరే. నాకు అభ్యంతరం లేదు,” అన్నాను. నేను ఆ అబ్బాయి వైపు చూశాను, అతని జుట్టు చెల్లాచెదురుగా నిక్కబొడుచుకుని ఉంది, పెదవులు పాలిపోయి బూడిద రంగులో ఉన్నాయి. ఒకవేళ గొడవ జరిగితే నేను అతన్ని సులభంగా ఓడించగలను. కానీ నాకు గొడవ పడాలని లేదు.

మేము మా వస్తువులు వదిలేసిన చోటికి వెళ్ళాము. కర్ర చివర పట్టుకున్న చేతులు వదలకుండానే, ఒక్క చేత్తో మా సామాన్లు తీసుకున్నాము. తర్వాత అతని సైకిల్ ఉన్న చోటికి నడిచాము. ఆ పిల్లాడు ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాడేమోనని నేను కర్రను గట్టిగా పట్టుకున్నాను.

అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. “మనం చేపను చెరి సగం చేసుకుందాం,” అన్నాను.

“అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు?” అన్నాడు ఆ అబ్బాయి, అతని పళ్ళు వణుకుతున్నాయి. కర్రపై అతని పట్టు మరింత బిగుతుగా మారడం నాకు తెలిసింది.

“సగం చేయడమే. నా దగ్గర ఒక కత్తి ఉంది. మనం దాన్ని రెండు ముక్కలుగా కోసి, చెరి సగం తీసుకుందాం. నాకు తెలియదు కానీ, మనం అలా చేయగలమని అనుకుంటున్నాను.”

అతను తన జుట్టును నిమురుకుంటూ చేప వైపు చూశాడు. “నువ్వు ఆ కత్తిని వాడబోతున్నావా?”

“నీ దగ్గర ఉందా?” అన్నాను. ఆ అబ్బాయి లేదని తలూపాడు. “సరే,” అన్నాను.

నేను కర్రను బయటకు లాగి, పిల్లాడి సైకిల్ పక్కన ఉన్న గడ్డిలో ఆ చేపను పెట్టాను. నేను కత్తి తీశాను. నేను ఒక గీతను కొలుస్తుండగా, రన్‌వే మీద నుండి ఒక విమానం వెళ్ళింది. “ఇక్కడేనా?” అన్నాను. పిల్లాడు తలూపాడు. ఆ విమానం రన్‌వే పై గర్జిస్తూ మా తలల పైనుండి పైకి ఎగిరింది. నేను చేపను కోయడం మొదలుపెట్టాను. నేను లోపలి భాగాలను తీసేసి, అతన్ని తిప్పి మొత్తం శుభ్రం చేశాను. పొట్ట మీద ఉన్న చర్మం తప్ప మిగతాదంతా విడిపోయే వరకు కోస్తూనే ఉన్నాను. నేను రెండు సగాలను నా చేతుల్లోకి తీసుకుని,చేపను రెండుగా చీల్చాను.

నేను తోక ఉన్న భాగాన్ని ఆ పిల్లాడికి ఇచ్చాను.

“వద్దు,” అన్నాడతను తల ఊపుతూ. “నాకు ఆ సగం కావాలి.”

నేను అన్నాను, “రెండూ ఒకటే కదా! ఇప్పుడు జాగ్రత్తగా విను, నాకు త్వరలోనే కోపం వస్తుంది.”

“నాకు అనవసరం,” అన్నాడు ఆ అబ్బాయి. “రెండూ ఒకటే అయితే, నేను అది తీసుకుంటాను. అవి రెండూ ఒకటే కదా, అవునా?”

“అవును, రెండూ ఒకటే,” అన్నాను. “కానీ ఈ సగం నేనే ఉంచుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కోసింది నేనే కాబట్టి.”

“నాకు అది కావాలి,” అన్నాడు ఆ పిల్లాడు. “నేనే అతన్ని ముందు చూశాను.”

“మనం ఎవరి కత్తిని వాడాం?” అని నేను అడిగాను.

“నాకు తోక భాగం వద్దు,” అన్నాడు ఆ కుర్రాడు.

నేను చుట్టూ చూశాను. రోడ్డు మీద కార్లేవీ లేవు, చేపలు పట్టేవాళ్లు కూడా ఎవరూ లేరు. ఒక విమానం హోరు వినిపిస్తోంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు ఒళ్లంతా చలిగా ఉంది. ఆ కుర్రాడు వణుకుతూ వేచి చూస్తున్నాడు.

“నాకో ఉపాయం తోచింది,” అన్నాను. నేను చేపల బుట్ట తెరిచి అతనికి ఆ ట్రౌట్ చేపను చూపించాను. “చూడు? ఇది ఆకుపచ్చ రంగులో ఉంది. నేను చూసిన వాటిల్లో ఇదొక్కటే ఆకుపచ్చది. కాబట్టి ఒకరు తల భాగాన్ని తీసుకుంటే, ఇంకొకరికి ఈ ఆకుపచ్చ చేప మరియు తోక భాగం వస్తుంది. ఇది న్యాయమే కదా?”

ఆ కుర్రాడు ఆ ఆకుపచ్చ చేప వైపు చూసి, బుట్టలోంచి బయటకు తీసి పట్టుకున్నాడు. చేప యొక్క రెండు సగ భాగాలను పరిశీలించాడు.

“అలాగే అనుకుంటా,” అన్నాడు. “సరే, అలాగే కానివ్వు. నువ్వు ఆ సగం తీసుకో. నా దాని మీద మాంసం ఎక్కువ ఉంది.”

“నాకు అభ్యంతరం లేదు,” అన్నాను. “నేను దీన్ని కడుగుతాను. నువ్వు ఎక్కడ ఉంటావు?” అని అడిగాను.

“ఆర్థర్ ఎవెన్యూలో కిందకి,” అతను ఆ ఆకుపచ్చ చేపను మరియు తన దగ్గర ఉన్న చేప సగ భాగాన్ని ఒక మురికి కాన్వాస్ సంచిలో వేసుకున్నాడు. “ఎందుకు?”

“అది ఎక్కడుంది? బాల్ పార్క్ దగ్గరా?” అన్నాను.

“అవును, కానీ ఎందుకు అని అడుగుతున్నా,” అన్నాడు. ఆ కుర్రాడు భయపడిపోయినట్లు కనిపించాడు.

“నేను దానికి దగ్గరలోనే ఉంటాను,” అన్నాను. “కాబట్టి నేను హ్యాండిల్‌బార్ మీద కూర్చుని రావచ్చు. మనం మారుస్తూ తొక్కవచ్చు.నా దగ్గర ఒక చుట్ట  ఉంది, అది తడవకపోతే మనం తాగవచ్చు.”

కానీ ఆ కుర్రాడు కేవలం, “నాకు గడ్డకట్టేంత చలిగా ఉంది,” అని మాత్రమే అన్నాడు.

నేను నా దగ్గర ఉన్న సగ భాగాన్ని వాగులో కడిగాను. దాని పెద్ద తల భాగాన్ని నీటిలో ముంచి నోరు తెరిచాను. నీటి ప్రవాహం దాని నోటి ద్వారా వెళ్లి, మిగిలిన శరీర భాగం గుండా బయటకు వచ్చింది.

“నాకు చలిగా ఉంది,” అన్నాడు ఆ కుర్రాడు.

వీధి చివర జార్జ్ సైకిల్ మీద వెళ్లడం చూశాను. అతను నన్ను చూడలేదు. నేను నా బూట్లు విప్పడానికి ఇంటి వెనక వైపుకు వెళ్లాను. నేను చేపల బుట్టను విప్పి, మూత తెరిచి, నవ్వుకుంటూ గర్వంగా ఇంట్లోకి నడవడానికి సిద్ధమయ్యాను.

వాళ్ల మాటలు వినిపించాయి, కిటికీ గుండా లోపలికి చూశాను. వాళ్లు టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. వంటగది అంతా పొగతో నిండి ఉంది. పొయ్యి మీద ఉన్న గిన్నె నుండి ఆ పొగ వస్తోందని గమనించాను. కానీ వాళ్లిద్దరూ దాని గురించి పట్టించుకోవడం లేదు.

“నేను నీకు చెబుతున్నది ముమ్మాటికీ నిజం,” అన్నాడు అతను. “పిల్లలకు ఏం తెలుసు? నువ్వే చూస్తావుగా.”

ఆమె అంది, “నేనేమీ చూడను. నేను అలా అనుకుంటే, వాళ్లు చనిపోవడమే చూడాలనుకుంటాను.”

అతను అన్నాడు, “నీకేమైంది? నువ్వు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది!”

ఆమె ఏడవడం మొదలుపెట్టింది. అతను యాష్‌ట్రేలో సిగరెట్‌ను గట్టిగా నలిపి ఆర్పివేసి, లేచి నిలబడ్డాడు.

“ఎడ్నా, ఈ గిన్నె కాలిపోతోందని నీకు తెలుసా?” అని అడిగాడు.

ఆమె ఆ గిన్నె వైపు చూసింది. తన కుర్చీని వెనక్కి నెట్టి, గిన్నె పిడిని పట్టుకుని, సింక్ పైన ఉన్న గోడకు విసిరి కొట్టింది.

అతను అన్నాడు, “నీకు పిచ్చి పట్టిందా? నువ్వు ఏం చేశావో చూడు!” అతను ఒక వంటగది గుడ్డను తీసుకుని, గిన్నె నుండి పడిన పదార్థాలను తుడవడం మొదలుపెట్టాడు.

నేను వెనుక తలుపు తెరిచాను. నేను నవ్వడం మొదలుపెట్టాను. నేను అన్నాను, “బిర్చ్ క్రీక్ దగ్గర నేను ఏమి పట్టుకున్నానో మీరు నమ్మరు. ఒక్కసారి చూడండి. ఇటు చూడండి. నేను పట్టుకున్నది చూడండి.”

నా కాళ్లు వణికాయి. నేను సరిగ్గా నిలబడలేకపోయాను. నేను చేపల బుట్టను (creel) ఆమె ముందు ఉంచాను, చివరికి ఆమె అందులోకి చూసింది. “ఓహ్, ఓహ్, నా దేవుడా! ఏంటది? పామా! ఏంటది? దయచేసి, దయచేసి నాకు వాంతి రాకముందే దాన్ని బయటకు తీయండి.”

“దాన్ని బయటకు తీయ్!” అని అతను కేకలు వేశాడు. “ఆమె చెప్పింది నీకు వినబడలేదా? దాన్ని ఇక్కడి నుండి బయటకు తీయ్!” అని అరిచాడు.

నేను అన్నాను, “కానీ చూడండి నాన్నా. అది ఏంటో చూడండి.”

అతను అన్నాడు, “నాకు చూడాలని లేదు.”

నేను అన్నాను, “ఇది బిర్చ్ క్రీక్ నుండి తెచ్చిన ఒక భారీ సమ్మర్ స్టీల్‌హెడ్ చేప. చూడండి! ఇది అద్భుతంగా లేదు? ఇది ఒక రాక్షస చేప! నేను దీన్ని పట్టుకోవడానికి క్రీక్ వెంట పిచ్చివాడిలా అటు ఇటు పరిగెత్తాను!” నా స్వరం వెర్రిగా ఉంది. కానీ నేను ఆగలేకపోయాను. “అక్కడ ఇంకొకటి కూడా ఉంది,” అని నేను గబగబా చెప్పాను. “ఆకుపచ్చ రంగులో ఉంది. నేను ఒట్టు వేసి చెబుతున్నాను! అది ఆకుపచ్చ రంగులో ఉంది! మీరు ఎప్పుడైనా ఆకుపచ్చ రంగు దాన్ని చూశారా?”

అతను ఆ బుట్టలోకి చూశాడు, అతని నోరు తెరిచే ఉండిపోయింది.

అతను అరిచాడు, “ఆ దరిద్రపు వస్తువును ఇక్కడి నుండి బయటకు తీయ్! అసలు నీకేమైంది? దీన్ని వంటగది నుండి బయటకు తీసుకెళ్లి ఆ చెత్తబుట్టలో పడేయ్!”

నేను మళ్ళీ బయటకు వెళ్ళాను. బుట్టలోకి చూశాను. వరండా లైటు వెలుతురులో అది వెండి రంగులో మెరుస్తోంది. అది ఆ బుట్ట నిండా ఉంది.

నేను దాన్ని పైకి తీశాను. దాన్ని పట్టుకున్నాను. దానిలో సగ భాగాన్ని పట్టుకుని నిలబడ్డాను.

—————-

రేమండ్ కార్వర్
కె. కుమార్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *