కవిత్వం ఓ ధార, ఈ మధ్య కవిత్వాన్ని చదవక, రాయక చాలా కాలమైంది. చాన్నాళ్ల తర్వాత కవిత్వం చదివా…
సుబ్బు ఆర్వీ
“ వల్లకాడు వేదన” పేరు చూడగానే కాస్త ఆ పదం మింగుడు పడలా.. వల్లకాడు అంటే వేదన కొందరికి, మరికొందరికి ప్రశాంతత. అన్నీ అల్లకల్లోలాల్ని దాటుకొని మరణించిన మనిషి ప్రశాంతతను పొందే చోటుగా చూస్తాము వల్లకాటిని. మరటువంటి స్థలానికి కూడా వేదనని పట్టుకొని పోవడం గురించి మాట్లాడుతున్నాడా!? లేదా మనిషి జన్మ ఎక్కడ ఎత్తినా చివరికి చేరేస్తానం ఈ వల్లకాడే అన్న సత్యం తెలిసిన ఆ వల్లకాడు, ఎందరి బతుకుల్ని తనలో కలుపుకుంటుందో అలా కలుపుకుంటున్నప్పుడు ఆ వల్లకాటి ఆత్మ ఘోష ఎంతగా ఉందో విపిస్తోందా రండి చూద్దాం.
సుబ్బు ఆర్వీ తన కవిత్వాన్ని స్మశానవాసి స్నేహానికి గుర్తుగా అంటూ మొదలుపెడతాడు.
ఇతని కవిత్వం వేదనాభరితం. మనిషి ఎన్ని పార్శ్వాలలో జీవిస్తాడో, అన్ని పార్శ్వాలను తీసుకుని తన కవిత్వంలో అక్షరబద్ధం చేశారు.
ఈ పుస్తకంలోని కవిత్వం చీకటి గురించి మాట్లాడుతుంది చీకటి చేదించే తత్వం గురించి మాట్లాడుతుంది. మనిషి మరుగున పడేసిన ఆలోచనని వెతికి పట్టుకుంటుంది. ప్రజల నాడిని వినిపించడానికి ప్రయత్నిస్తుంది. నువ్వెలా ఉన్నావు అంటూ నిన్ను నీకు గుర్తు చేస్తుంది. సమాజాహితం కోరుకునే స్ఫూర్తి కనిపిస్తుంది.
ఏ మనిషి అయినా సాయం పొందకుండా బ్రతికినోడు ఉన్నాడా!?
ఎవడైనా సాయం చేయకుండా చచ్చినోడిని చూసావా!?
ఎప్పుడైనా అని ప్రశ్నిస్తూనే ..,
నిన్ను నువ్వు తెలుసుకోవడమే నీ గమ్యం అని చెప్తాడు సుబ్బు ఆర్వి తన కవిత్వంలో.
ప్రజాస్వామ్యాన్ని ఎంత భద్రంగా భద్రపరిచిందో ఈ సమాజం
‘శవపేటిక’ కవితలో వివరిస్తాడు.
సమాజం కోసం త్యాగాలు చేసిన అడవి తల్లి బిడ్డలు ఏడ బోయినారో!? ఎర్రటి సూర్యుడు మసకబారేనా అంటూ అంతరించిపోతున్న పోరాట స్ఫూర్తిని గురించి చింతిస్తాడు.
శ్రీశ్రీని మరల ఒక్కసారి రా అని పిలుస్తూ… మరో ప్రస్థానానికి దారి చూపించమంటాడు.
నేను ఆశాజీవినే కానీ మనిషిలో అత్యాశ సర్వస్వాన్ని ఎలా కాల్చేస్తుందో ఆశ మనిషిని ఎలా చిద్రం చేస్తుందో అంటూ చింతిస్తాడు.
నేను సమాధానం లేని ప్రశ్నల్ని వెతుకుతూ, యుద్ధం చేయాల్సినప్పుడు నీతో నీవు మమేకమై బతుకు బాటలో యుద్ధం చేయమంటూ నడిచే ఓ బాటసారిగా, నిషీధి ప్రేమికుడిగా, స్మశాన వైరాగ్యంలో చీకటించేదిస్తున్న పగటి వెలుతురుని వెతుకుతాడు.
మాయదారి వరదల్లో మిగిలింది అధికారుల హామీ మాత్రమే అంటూ, వరదల కాలంలో వినపడే మృత్యుఘోషని విలపిస్తాడు. అభివృద్ధి పేరుతో ప్రకృతి విపత్తులను సృష్టించకూడదని వేడుకుంటాడు.
రాజ్యం ఏం మారింది!? చేయడానికి పని లేదు, తినడానికి మెతుకు లేదు అంటూ మారుతున్న సమాజాన్ని ప్రశ్నిస్తాడు.
మత్తులో ఉన్న యువతని మేల్కొలుపుతాడు.
స్త్రీ పట్ల మాన మర్యాదలు మరవద్దని హెచ్చరిస్తాడు.
ఆడపిల్లలపై పెరుగుతున్న మానవత్వం లేని హింసను ఆపలేకపోతున్న అశక్తతను వ్యక్తం చేస్తాడు.
రాజ్యం ముందు నిజం మాట్లాడే పాడు అలవాటు అబ్బితే శాపం అవుతుందని హెచ్చరికల్లో మాట్లాడలేక మూగ పోవడం కంటే మాటలు రాకపోవడమే మేలని బాధని వ్యక్తం చేస్తాడు.
మహానుభావుడిని అంటూ తలకెత్తుకోవద్దు నన్ను. ఈ సమాజంలో ప్రశ్నని సంధించ లేనప్పుడు నిషేధి సంచారిలా నన్నిలా విశ్రమించనివ్వమని వేడుకుంటాడు.
పొగిడితే పొంగిపోయే బోలా శంకరుని ప్రతీకగా తీసుకొని పొగిడితే పొంగిపోయి తబ్బిబ్బయ్యే మనిషి ఎలాంటి చిక్కుల్లో పడతాడో. మేక వన్నె పులుల చేతికి ఎలా చిక్కుతాడో చెప్తాడు.
ఊతమిచ్చారని ఎగబాకకు చేయి వెనక ఉద్దేశం తెలుసుకొని నడవమని హెచ్చరిస్తాడు.
ఊ కొడుతూ పొగిడితే సన్మానం.
ప్రశ్న పేరు ఎత్తితే స్మశానాసనం.
పొంచి ఉన్న తోడేళ్లను ప్రేరేపించే ధృతరాష్ట్రులతో.. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు.
అంతలోనే..,
ఒక సందర్భంలో గొంగళి పురుగును నేను, రేపటి రంగుల కలను కనే సీతాకోకచిలకను అంటూ ఆశల తీరం వైపు అడుగులు వేస్తాడు.
‘నేను మీలా లేనందుకు’ అంటూ ప్రశ్నించుకుంటాడు.
‘శిఖరం’ కవితలు అతనిలోని అంతర్మదనానికి గుర్తుగా ఉంటుంది.
‘ జ్వలనం ‘పోరాటాల ప్రతిఘటనలపై అతని ఆలోచనల వేగాన్ని చూపిస్తుంది.
బాల్యమే మనం అనుకునే స్వర్గం కోరికలు మొదలయితే అంతా నరకమే. అంటూ..,
నాతో నేనే, నాలో నేనే, నాతో నాకే పరిచయం, నన్ను ప్రేమిస్తావా, నాతో చీకటి నాలో చంద్రుడు, నాలోని రాత్రుళ్ళు, ఇలా సుబ్బు ఆర్వి లో ఉన్న ప్రతి ఆలోచనని కవిత్వం చేస్తాడు.
ఈ కవిత్వంలో ఓ పెనుగులాట ఉంటుంది. చీకటిని చీల్చుకుని సూర్యోదయాలకై పరుగు ఉంటుంది. చీకటి నిండిన రాత్రిలో వెలుగు దిబ్బల కోసం వెతుకులాట ఉంటుంది. ప్రశ్నించలేక పోయిన నిరాసక్తత వీడమంటుంది. ప్రశ్నించాలన్న ఉచ్చుకత ఉంటుంది.
ఈ కవిత్వంలో కావలసినంత వస్తు వైవిద్యంఉంటుంది. ప్రతి సందర్భాన్ని కవిత్వం చేయగల వొడుపు ఈ కవిత్వకారుడి కలం సొంతం. స్త్రీ వేదన గురించి మాట్లాడతాడు, బాల్యం వస్తువుని తీసుకుని అంతకు మించిన స్వర్గం లేదంటాడు, వృద్ధాప్యంలో చేయూతనిచ్చే హస్తం, మనిషికి మనిషి ఆసరా అయ్యే గుణాన్ని తాత్వికతలోకి వంపుతాడు. కరోనా కాలంలో ఎదురైన చేదు అనుభవాలను అల్లకల్లోల స్థితులను వివరిస్తాడు. అయితే ఇతని కలం, కవిత్వ నడక మాత్రం ఒక ప్రతికూలమైన ఆలోచనకు ప్రతీకగా సాగుతుంది.
ఈ కవిత్వ సృజన కారుడు… కలాన్ని గళంగా వినిపిస్తూ, ప్రకృతిని,సమాజాన్ని పరిభాషగా ఉపయోగించి. సూర్యుడిని, చీకటిని సమానమైన ప్రతీకలుగా వాడి తనలోని చింతను కవిత్వంగా మలిచి మన ముందుకు ఈ కవిత్వ సంపుటిని తీసుకొస్తున్నాడు. ఈ పుస్తకంలో మొత్తం 147 కవితలు ఉన్నాయి..
కవిత్వాన్ని ప్రేమించే వారంతా తప్పక ఈ పుస్తకం చదవండి.
అభినందనలు సుబ్బు ఆర్వీ.
పుస్తకం పేరు: వల్లకాడు వేదన
రచయిత: సుబ్బు ఆర్వీ
ప్రచురణ : ఎన్నెలపిట్ట





































