పోలీసులు భాస్కర్‌ను అరెస్ట్ చేసి తీసుకుపోయిన వార్త సుభద్రతో చెప్పేపని చివరికి నా మీద పడింది. సదాశివుకు తెలిసే ఈ పని నాకు అప్పగించాడు. భాస్కర్‌తో పోట్లాట తరువాత గత ఏడాదిగా ఆ గడప తొక్కటం మానేశాను. ఆ సంగతి సదాశివుకు తెలిసిందే.
సుభద్ర, నాకు – భాస్కర్‌కూ మధ్య జరిగిన పోట్లాట పట్టించుకోకుండా, సభల్లో కనిపించినప్పుడు పూర్వపు చనువుతో పలకరించి అభిమానంగా మాట్లాడుతుంది. ఆమెలో పాత ప్రేమాభిమానాలు చెక్కు చెదరలేదు. సుభద్రకూ, నాకూ మధ్య ఉన్న స్నేహసంబంధాలను భాస్కర్‌తో పోట్లాటకు ముడిపెట్టటం మంచిది కాదని చాలాసార్లు అనుకున్నాను. సుభద్ర ముందు నా స్నేహితురాలు. సుభద్రను భాస్కరు తొలిసారి పరిచయం చేసింది నేనే. తర్వాత వాళ్ళు స్నేహితులుగా దగ్గర కావటం, పెళ్లి చేసుకోవాలన్న తమ నిర్ణయాన్ని ముందుగా నాతోనే చెప్పటం, పూలదండల పెళ్లిని స్నేహితులం ఏర్పాటు చేయటం, ఉభయపక్షాలనుంచి తల్లిదండ్రులు పెళ్లికి హాజరు కావటం అంతా సంతోషంగా సాగిపోయింది. వరకట్న దురాచారాల మీద తిరుగుబాటుగాను, కులతత్వ దుర్మార్గం మీద పోరాటంగాను, కులాంతర ప్రేమ వివాహాన్ని తాము ఆదర్శప్రాయంగాను భావించి జీవిత భాగస్వాములుగా భవిష్యత్తులో అడుగుపెడుతున్నట్టు వేదిక మీదినుంచి ఆ ఇద్దరూ ప్రకటించటం ఎంతో హుందాగా, హర్షోత్సాహ వాతావరణంలో ఆ వేడుక జరిగి పోయింది. సామాజిక చైతన్యం కోసం మానవతా విలువల బావుటా ఎగురవేయాలన్న మా సంకల్పానికి సుభద్రా భాస్కర్ పెళ్లి అప్పట్లో ఒక ఆచరణ కార్యక్రమం అయింది.
దరిమిలా భాస్కర్ రాజకీయంగా ఎదిగిపోయాడు. ముందు సంస్కరణ కార్యకలాపాలతో మొదలై, అభ్యుదయ రాజకీయాల మెట్టెక్కి, భాస్కర్ విప్లవ రాజకీయాల్లో చివరికి స్థిరపడ్డాడు. రాష్ట్రస్థాయిలో అగ్రగామి కార్యకర్తగా నాయకత్వ శ్రేణిలో అతడి పేరును వాడుకోవటం అనివార్యమయిపోయింది. పౌరహక్కుల సంఘాలలో, నిజనిర్ధారణ ప్రతినిధివర్గాలలో, ప్రజాస్వామ్య మానవహక్కుల పరిరక్షణ ఉద్యమాల్లో, కార్మిక రైతాంగ పోరాటాల్లో, జనసాంస్కృతిక వేదికల మీద, విద్యార్థి ఉద్యమ సదస్సులలో అతడి పేరు తప్పనిసరి అయిపోయింది. అతడి మీద పోలీసుల నిఘా సంగతి వేరే చెప్పనక్కరలేదు. రాష్ట్రంలో నానాటికీ ఉధృతమవుతున్న విప్లవోద్యమ నాయకత్వంతో గట్టి సంబంధాలు అతనికి ఉన్నట్టు ధృవపడింది. ఆ మేరకు ప్రభుత్వ నిఘా యంత్రాంగం తన ఉద్యోగ ధర్మాన్ని ఘనంగానే నిర్వర్తించింది.
చివరికి భాస్కరును మరో నలుగురు విప్లవోద్యమ ప్రముఖులతోపాటు అరెస్టు చేశారు. దేశంలో ఆపత్కాల పరిస్థితి ప్రకటించినప్పుడే విప్లవకారుల మీద పోలీసు హస్తం పడుతుందని తెలిసినప్పటికీ, విప్లవ రాజకీయాలతో ప్రత్యక్షపాత్ర లేకుండా ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేసుకుంటున్న భాస్కర్‌ను ఇంత త్వరలోనే అరెస్టు చేస్తారని భావించలేదు.
ఇప్పుడు ఈ అరెస్టు సంగతి, భాస్కర్‌ను పోలీసులు తీసుకుపోయిన తొలి అర్ధగంటలోనే సదాశివు వచ్చి తనతో చెప్పి వెళ్లాడు. అప్పటికే రాత్రి పదకొండు దాటింది. ఈ అర్ధరాత్రి సికింద్రాబాదు శివార్లలో ఉన్న అల్వాల్ వెళ్లి సుభద్రకు ఈ వార్త అందజేయటం కష్టమే. వేకువ జామునే వెళ్లి చెప్పి రావచ్చునని ఇద్దరం అనుకున్నప్పటికీ, ఆ రాత్రే ఆ వార్త చేరవేయాలని నా ప్రయత్నాలు నేను చేశాను. ఈ అరెస్టులో అజ్ఞాతవాసంలో ఉంటున్న- ప్రముఖ విప్లవకారులు కూడా ఉండటంతో ప్రమాదం మరింత తీవ్రమయింది.
ఇంకా చాలా పనులున్నాయని సదాశివు వెంటనే వెళ్లిపోయాడు. సదాశివు, భాస్కర్‌లాంటి వాళ్లు ఏ ఉద్యమంలో ఉన్నా ఆ ఉద్యమానికి కొండంత బలం వస్తుంది.
వాళ్ల కార్యదీక్ష, ఏకాగ్రత చూస్తే ఉద్యమం పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. ఎంతటి కష్టమైన బాధ్యతను అప్పజెప్పినా సరే ముందూ వెనుకా చూడకుండా తమ కర్తవ్యం అని భావించి నెత్తిన వేసుకుంటారు.
జంటనగరాలలో ఒక ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు బోధిస్తున్న భాస్కర్‌కు వాళ్ల ప్రధానోపాధ్యాయుడు పంతులుగారు అండగా నిలడబటం నైతికంగా పెద్ద బలాన్నిచ్చింది. దీక్షాదక్షుడైన ఆర్యసమాజ్ కార్యకర్తగా పేరు మోసిన పంతులుగారు వర్తమాన సమాజంలోని క్షుద్రత్వాలకు బలయిపోతున్న జాతిని చూసి క్షోభపడని సందర్భం లేదు. దాంతో భాస్కర్ కార్యకలాపాలను పంతులు గారు హృదయపూర్వకంగానే హర్షించారు. ఉపాధ్యాయుడుగా కూడా భాస్కర్ శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో పనిచేయటం పంతులుగారికి నచ్చింది. తరగతి గదిలో భాస్కర్ పాఠాలు బోధించే తీరులో పంతులుగారికి అతడి బోధన ప్రతిభ కనిపించింది. భాస్కర్ నడవడి, పెద్దలపట్ల వినమ్రత, విద్యార్థులతో చెలిమి, నిరాడంబరమైన అతడి వేషభాషలు పూర్వకాలపు ఋషులలో ఒకరు ఈ అవతారం ఎత్తి ఈ పాఠశాలలో పనిచేస్తున్నారా అనిపించేది. విద్యార్థులు భాస్కర్‌ను ఎప్పుడూ చుట్టుముట్టి ఉండేవారు. తోటి ఉపాధ్యాయులకు అతడు అవసరమైన స్నేహితుడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడి మీద చెయ్యివేయటానికి చాలాకాలం వెనుకాడారు. ఇప్పుడు రాజద్రోహనేరానికి పాల్పడుతున్న వర్గాలతో కుమ్మక్కయినాడన్న ఆరోపణతో నిర్బంధంలోకి తీసుకున్నారు. అజ్ఞాతవాసంలో ఉన్న ప్రముఖ విప్లవనాయకులు నలుగురుతో పాటే భాస్కర్ దొరకటంతో పరిస్థితి ప్రాణాపాయకరంగా తయారయింది.
భాస్కర్‌ను ఎంతోకాలం బయట ఉండనివ్వరని, అజ్ఞాతవాసంలోకి తీసుకుంటారని అనుకుంటున్నదే అయినా, సదాశివు ఈ వార్త మోసుకొచ్చినప్పుడు నమ్మశక్యం కాలేదు. భయం పట్టుకుంది. రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసుల చేతుల్లో వాళ్లు చిత్రహింసలకు గురవుతారన్నది కూడా అందరికీ తెలిసిందే. ఆత్మరక్షణ కోసం పోలీసుల ఎదురుకాల్పుల్లో వాళ్లు నేలకొరుగుతారు. ఆ వార్తను పత్రికలు ప్రచురిస్తాయి. ఆమర వీరులకు రాష్ట్ర వ్యాప్తంగా గోడల మీది నినాదాలు శ్రద్ధాంజలి ఘటించి జేజేలు చెబుతాయి. నిరసనసభలు, బంట్లు, సమావేశాలు, అశ్రుతర్పణ, విప్లవ ప్రతిజ్ఞ- ఇవన్నీ మామూలే. విప్లవ దీక్ష మరింత పదునెక్కుతుంది. ఈ ఆలోచనతో కంటికి నిద్రలేదు. భాస్కర్ ముగ్గురు పిల్లలు పదేపదే కనిపించారు. లలిత కూడా బెంగ పెట్టుకుంది.
తెల్లారి “నాన్నా!” అంటూ లేచే పిల్లలకు సుభద్ర ఏమని జవాబు చెప్పాలి? మరీ చిన్న పిల్లలు. పెద్దపాప పద్మిని ఆరేళ్లది. రెండో పాప ఉష నాలుగేళ్లది. మూడోవాడు బాబు రెండేళ్లవాడు. పిల్లలతో తండ్రికి ఉన్న మాలిమి గురించి సుభద్ర చెప్పే మాటలు పదేపదే గుర్తొస్తాయి. దెబ్బ తగిలితే పిల్లలు “అమ్మా!” అంటారు. కాని, తన పిల్లలు మాత్రం “నాన్నా!” అంటారట. భాస్కర్ అంత ప్రేమమూర్తి కాబట్టే విద్యార్ధులన్నా అతడికి ప్రేమే.
అప్పుడే కళ్లు విప్పుకుంటున్న విద్యార్థులను చూస్తుంటే ప్రపంచం అందాలన్నీ వాళ్ల నిర్మలమైన ముఖాల్లో కనిపిస్తాయనీ, తరగతిగదికన్నా అందమైన ఆలయం ఈ ప్రపంచంలో మరొకటి లేదనీ అంటూ తనవృత్తిని ప్రేమించే భాస్కర్, పరోక్షంగా విప్లవ రాజకీయాల్లో మునిగిపోవటం నేను సమ్మతించలేదు. సుభద్రతో చెప్పి చూశాను. సుభద్ర ఆశ్చర్యపోయింది నా మాటలకు. భర్త ప్రభావం మరి!
మా స్నేహం తొలిరోజులు గుర్తుకొచ్చినప్పుడు గత ఏడాదిగా మా మధ్య విరోధాల మూలంగా ఎంత నష్టపోయానో, మనసు ఎంత వికలమయిందో నాకు తెలుసు. సత్యజిత్ రాయ్ సినిమాల దగ్గర మా స్నేహం మొదలయింది. సత్యజిత్ రాయ్ అభిమానులంగా నేను, సంపత్‌రావు, సూర్యం, సదాశివు మరింత సన్నిహితులమయ్యాం. ఆబిడ్స్‌లో పాత పుస్తకాల అంగళ్లు, భాష నిలయం, సారస్వత పరిషత్తులలో సాహితీ సమావేశాలు, మాక్స్ ముల్లర్ భవన్, కళాభవన్ ఆర్టిలరీలలో చిత్రకళాప్రదర్శనలు, దిగంబర కవితాభిమానం, వరవరరావు సృజన పత్రిక, అప్పట్లో మా సాంగత్యానికి నేపధ్యం. నిజామ్ కళాశాల మైదానంలో రాజకీయ మహాసభల్లో మా ముఖాలు చిరపరిచితాలు. ఒక మానవతా స్పందనమీద పద్యంరాసి, ఒక సామాజిక సంఘర్షణ మీద నాటకంవేసి, ప్రపంచం మారుమూల జరిగిన చారిత్రక ఘటనల మీద ఒక పాట పాడి, జాత్యహంకారపు పోరాటంలో నేలకొరిగిన ఒక వీరుడి చిత్రం వేసి, దళితులపైన, ఆదివాసి ప్రజలపైన జరిగే దౌర్జన్యాలకు నిరసనగా ఊరేగింపుల్లో గొంతుకలిపి – పొందే ఉత్తేజం కొందరికి ఏమీ కాకపోవచ్చు. భాస్కర్ పట్ల ఆ ఉత్తేజమే అతడి జీవితగమ్యాన్ని శాసించింది.
రాజకీయనాయకులకు ఇలాంటి వాడు ఒకడు దొరికితే వదులుకుంటారా? దాంతో భాస్కర్ తన ప్రమేయం లేకుండానే పతాక శీర్షికల్లో ప్రత్యక్షమయ్యాడు. మా ఇద్దరికీ మధ్య అభిప్రాయభేదాలు అక్కడే మొదలయ్యాయి. తమకు ఉపయోగపడతారు అనుకున్న వాళ్లను చేరదీసి, వెన్నుతట్టి వాళ్ల నెత్తిన కీర్తికిరీటం పెట్టి వదులుతారు. అలాంటిదే జరిగింది భాస్కర్‌కు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఒక మహోన్నత ఆశయం కోసం తనను అంకితం చేసుకోవటంకన్నా జీవితానికి పరమార్ధం ఏముంటుంది అన్నాడు భాస్కర్. నిజమే. భాస్కర్ చిత్తశుద్ధి అట్లాంటిది. ఈ సందర్భంగానే ‘ఒక ఉన్నత ధర్మానికి, ఒక ఉత్తమ ఆదర్శానికీ విధేయుడు కానివాడు సంఘానికి చీడపురుగే’ అన్నాడు భాస్కర్. భాస్కర్ తో పోట్లాటకు అదే బీజం.
తన అభిప్రాయాలను వెల్లడించటంలో జంకూ, గొంకూ లేని భాస్కర్ స్వభావం మూలంగా గాయపడిన స్నేహితుల్లో నేనొకణ్ణి. అతడు ఆ దశలో చాలామంది స్నేహితులనే పోగొట్టుకున్నాడు. అలా పోగొట్టుకున్నందుకు తాను చింతించటం లేదన్నాడు. ఆ లోటును భర్తీ చేసే కొత్త స్నేహితులు చాలామంది దొరికారన్నాడు. సూర్యం లాంటి స్నేహితులు పాత వాళ్లలో మిగిలి ఉండటం కూడా అతడకి ఒక సంతృప్తి.
కీర్తికిరీటం నెత్తికెక్కిన తర్వాత మనుషులు మారిపోవటం మనం చూస్తున్నదే కదా! భాస్కరం సైతం ఈ నమ్మకానికి అతీతుడు కాలేదు.
నా వ్యాఖ్యానాన్ని భాస్కర్ తన మీద నేను సంధించిన విమర్శగా మాత్రమే భావించాడు తప్ప, ఆ నమ్మకంలో ఉన్న వాస్తవాన్ని అతడు గమనించ లేదు. నా చిత్త శుద్ధిని శంకించాడు.
కొందరు రోజు రోజుకూ దిగజారిపోయి గుల్లలో నత్తలాగా లోలోపలికి ముడుచుకుపోతుంటారు. భాస్కర్ అన్న ఈ మాటలు నన్ను ఉద్దేశించే. ప్రపంచం అంతా తనలాగే ఉన్నత భావాలతో ఉండనంత మాత్రాన ప్రపంచాన్నే తప్పు పట్టటం అందరికీ నచ్చకపోవచ్చు. నాకూ నచ్చలేదు.
పత్రికలు పతాక శీర్షికల్లో భాస్కర్ను మోస్తున్నందుకు ఉప్పొంగిపోయే నన్ను, భాస్కర్ అంటే పెల్లుబికే ప్రేమతో పడిచచ్చే నన్ను – భాస్కర్ నత్తగుల్ల సిద్ధాంతంతో విమర్శించటం వెనుక –
★★★
సత్యజిత్‌రాయ్ సినిమాల్లో పరిచయమై సన్నిహితుడయిన మరో మిత్రుడు మా సూర్యం. కెమెరా ఒకటి భుజాన వేసుకుని ప్రపంచం వెలుగు నీడలను, ఉదయాస్తమయాల వర్ణవైభవాన్ని, సమాజ స్వరూప స్వభావాలను, లోకం పోకడలను, చరిత్ర గమనాన్ని, ఛాయాచిత్రాల రూపంలో చట్రాల్లోకి ఎక్కించాలని తిరిగేవాడు. పాత పుస్తకాల అంగళ్లలో, సాంస్కృతిక సమావేశాలలో, చిత్ర కళాప్రదర్శనలలో మాకుమల్లే ప్రత్యక్షమయ్యేవాడు.
” సత్యజిత్‌రాయ్‌ని చూసి వద్దామా?” అని ఓ రోజు మమ్మల్ని అడిగాడు సూర్యం. కింగ్ సర్కిల్ ఇరానీ హోటల్ ముచ్చట్లలో.
సత్యజిత్ రాయ్‌ని ఆహ్వానించి హైదరాబాద్ రప్పిద్దాం” అన్నాడు భాస్కర్.
“ఆ రెండో రోజే సూర్యం ఒక్కడే కలకత్తా బయలుదేరాడు. సూర్యం వెళ్లేసరికి సత్యజిత్‌రాయ్ ఉళ్లో లేకపోతే అయన రాక కోసం పది రోజులు కలకత్తాలో ఉండి, ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని చూసి, ఆయనతో నుంచుని ఫోటోలు తీసుకుని, కొత్త బెంగాలీ స్నేహితులను కొందర్ని సంపాదించుకుని, కలకత్తా అందాల పోటోలతో తిరిగి వచ్చాడు.
చలంగారి ‘ప్రేమ లేఖలు’ చదివి, ఇలాంటి రచయిత ఒకడు ఈ దేశంలోనే ఉన్నాడా అని మేము అభిమానంతో వాదించుకుంటుంటే విన్న సూర్యం, వెంటనే రమణాశ్రమానికి ప్రయాణం కట్టాడు. చలంగారితో వారంరోజులుపాటు గడిపివచ్చాడు. చలంగారితో మాటల్లో శ్రీశ్రీ ప్రస్తావన వచ్చిందట. తిరుగు ప్రయాణంలో మద్రాసులో ఒకరోజు అగి, శ్రీశ్రీని కూడా చూసి వచ్చాడట. బొంబాయి వెళ్లి ఎ.ఎస్. రామన్‌ను చూసి, ఆయనకు తను తీసిన ఫొటోలు ఇచ్చి వచ్చానని చెప్పేవాడు. మేము ఆ రోజుల్లో ‘ఇలస్ట్రేటడ్ వీక్లీ’ గురించి ఎంతో అభిమానంగా మాట్లాడుకునే వాళ్లం. భారతీయభాషల నుంచి కథలూ, కవిత్వమూ, నవలలూ, ప్రఖ్యాత కళాకారుల వర్ణచిత్రాలు అదో మహోజ్వలమైన సాంస్కృతిక వికాసఘట్టం. దాని ప్రభావం అన్నమాట సూర్యం బొంబాయి పర్యటన.
“విశాఖపట్నం అందం ఏమిటో చెప్పండి” అని ఓ ప్రశ్నవేశాడు సూర్యం.
“సముద్రం” అన్నాడు భాస్కర్.
“కొండలూ, అడవులూ, సముద్రమూ ముప్పేటగా కలవడం” అన్నాను నేను.
“రాచకొండ విశ్వనాధశాస్త్రి” అన్నాడు సూర్యం.
సెలవురోజు వచ్చిందంటే చాలు ఈ దేశదిమ్మరి ఉళ్లో దొరికేవాడు కాదు. ఊళ్లో ఉన్నా, తన గదిలో దొరికేవాడు కాదు. అతడే వచ్చి మనల్ని కలవాల్సిందే.
అయితేనేం, ఎందరో పెద్దలతో అపురూపమైన స్నేహాలు సంపాదించి పెట్టాడు మాకు. “మీరు ఢిల్లీ వెడుతున్నారా? అయితే ఉండండి, రఘురాయ్‌కు ఉత్తరం ఇస్తాను, కలవండి. ఆయన ఊళ్లో లేకపోతే మన సుబ్బారావును కలవండి రాజఘాట్‌ని దర్శించటం మాత్రం మరచిపోవద్దు.” అనేవాడు. అలాంటి సూర్యం అప్పుల పాలవటంలో వింత ఏముంది? పోస్టల్ డిపార్ట్ట్‌మెంట్‌లో అతడికి వచ్చే జీతం ఏమూలకు చాలుతుంది? బ్రహ్మచారి కావటం వల్ల సరిపోయింది కాని, లేకపోతే ఆ నౌక అతడి తిరుగుబోతు తనానికి ఎప్పడో మునిగిపోయేది.
ఎంతటి వాడినైనా వయసులో పెద్దా చిన్నా భేదం పాటించకుండా నువ్వూ నువ్వూ అని వ్యవహరించే సదాశివు, వయసులో మా అందరిలో చిన్నవాడైనా సూర్యాన్ని మీరు అనేవాడు. భాస్కర్ ‘సూర్యంగారు’ అనేవాడు. ఆరడుగుల సూర్యం విగ్రహం దగ్గర ఈ అల్పకాయులు తమంతట తామే అతనికి అగ్రపీఠం వేయటం నాకు ఒకంతట అర్ధంకాని ఆశ్చర్యం. మరి ఆ గౌరవం, ప్రేమ, ఆధిక్యగరిమ సూర్యం ఎలా సాధించాడో కొత్తవాళ్లకు విచిత్రంగానే ఉంటుంది. దీని రహస్యం జాతక చక్రంలో దాగి ఉందేమో తెలుసుకోవాలి.
ప్రజల న్యాయమైన వివిధపోరాటాల్లో సంఘీభావం ప్రకటించిన సానుభూతిపరులుగా ఒక్కోసారి మా మీద చిన్న చిన్న బాధ్యతలు పడేవి. చందాలు వసూలు చేయటం, విరాళాలు పోగుచేయటం, సభల నిర్వహణలో తోడ్పడటం, గోడలమీద నినాదాలు రాయటం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, నిర్వాహకులకు సలహాలు అందజేయటం, జనాన్ని సమీకరించటం అలాంటివి. ఈసారి రాష్ట్ర రైతాంగ మహాసభల సందర్భంగా నిధులు వసూలు చేసే పనిని జంటనగరాల శాఖ ముఖ్యుడుగా సూర్యానికి అప్పగించారు. సూర్యం కింద మేము సహాయకులం. సూర్యం పలుకుబడి నిచ్చెనలో సదాశివు, భాస్కర్లతో సహా మేమంతా కింది మెట్టు మీది వాళ్లమే.
ఆ ఏడాది నాకు తెలిసినంతవరకు సూర్యం దాదాపు పాతిక వేల రూపాయల విరాళాలు వసూలు చేశాడు. ఆ విరాళాల సేకరణ రోజుల్లోనే నా ద్వారా ఒక మిత్రుని దగ్గర సూర్యం తీసుకున్న రెండున్నర వేల రూపాయల అప్పు తీర్చవలసి వచ్చింది. నేను నా వంతు పని మీద విరాళాల సేకరణ కోసం వెళ్లినప్పుడు నాకన్నా ముందే సూర్యం వసూలు చేసేసినట్టు అయిదారుగురు చెప్పారు. విరాళాలను పెద్దమొత్తంలో వసూలు చేయటంలో సూర్యం ఘనుడు. నేను వెళ్తే వంద రూపాయలు ఇవ్వటానికి వెనుకా ముందూ ఆడి పైకం చెల్లించటానికి మరో రోజు గడువు పెట్టేవాళ్లు. సూర్యం కనబడితే రెట్టింపు ఎక్కువ రాసి వెంటనే నగదు చెల్లించేవాళ్లు. అంత పెద్దశరీరాన్ని చూసి భయపడేవాళ్లో ఏమో సూర్యం ముందు వినమ్రులయి పోయేవాళ్లు.
ఈ వ్యవహారంలో సూర్యం నాకు దొరికిపోయాడు. ఆ మొత్తం జాబితాలో విరాళాలు ఇచ్చినవాళ్ల పేర్లు నాలుగయిదు లేవు. కొంతమందిని అడిగి మరోసారి యదార్ధాలు తెలుసుకున్నాను. సూర్యం తను పోగుచేసిన విరాళాల నుంచి దాదాపు మూడు నాలుగు వేల రూపాయలు స్వంతానికి వాడుకున్నట్లు రుజువయింది. అదేమాట నేను సదాశివుతో అన్నాను.
“సూర్యంగారు అలాంటివారు కాదు” అని ఒకే ఒక మాటతో నా నోరు మూయించాడు సదాశివు.
భాస్కర్ దగ్గర ఈ ప్రసక్తి వచ్చింది. “సూర్యంగారి మీద పడిందేమిటి నీ కన్ను? సంస్థతో కలిసి పనిచేస్తున్న పెద్దమనిషి మీద ఇలాంటి అపవాదులు వేయటం మంచిది కాదు” అని భాస్కర్ నన్ను హెచ్చరించాడు.
దాంతో నేను సందేహంలో పడ్డాను. నిజం చెప్పటం కూడా నాకు చేతకాలేదు.
పొరపాటయిందనుకున్నాను. పోతే, ఓ సారి సూర్యాన్నే అడుగుదామని, మేమిద్దరమే ఉన్నప్పుడు, ఇచ్చామని చెప్పిన ఆ నలుగురయిదుగురు పేర్లు ఉదహరించి -“ఆ మొత్తం, విరాళాల జాబితాలో ఉన్నట్టు లేదు, సంగతేమిటి?” అని అడిగాను.
సూర్యం నిజం చెప్పేశాడు. మూడువేల రూపాయల వరకు స్వంత ఇబ్బందుల మూలంగా తాను వాడుకున్నట్టు చెప్పి. ఆ పైకాన్ని త్వరలోనే సంస్థకు తిరిగి చెల్లించబోతున్నట్టు తెలియజేశాడు. “దీన్ని గురించి అనవసరంగా గొడవ చేయకు” అని నన్ను కోరాడు.
మహాసభ రెండురోజుల కార్యక్రమం ఘనంగా జరిగిపోయింది. సూర్యం అక్కడున్న తర్వాత ఏర్పాట్లలో, పెద్దరికంలో పోటీ ఉండదు. ముగింపు మరుసటిరోజు ఎవరి ఊళ్లకు వాళ్లు బయలుదేరి వెళ్లేముందు బడలిక తీర్చుకుంటూ ఉండగా హాల్లో ఓ మూల పెద్దగా ఏడుపు వినిపించింది. బావురుమని ఎవరో ఏడుస్తున్నారు. ఉదయం పదిగంటల వరకూ నిద్రపోయి, అప్పుడే లేచి, నిర్వాహకులు ఇచ్చిన ఉప్మా తిని, చాయ్ తాగి, దినపత్రికల్లో మహాసభల వార్తలు, ఫోటోలు చూస్తుండగా ఈ ఏడుపు. నేను వెళ్లేసరికి అక్కడ విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ పట్టణాల నుంచి వచ్చిన అగ్రశ్రేణి నాయకులు ఏడెనిమిదిమంది కనిపించారు. వాళ్లలో సదాశివు, భాస్కర్ కూడా ఉన్నారు.
సూర్యం ఏడుస్తున్నాడు.
అందరి కళ్లూ నా మీద పడ్డాయి. సూర్యం ఏడుపు ఆగటం లేదు. తల్లి పోయినవాడిలా ఏడుస్తున్నాడు. మామూలు వగలు ఏడుపు కాదది. చెట్టంత మనిషి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే చూస్తున్న వాళ్ల కళ్లన్నీ ఎర్ర నయ్యాయి. ఆ కళ్లు సూర్యం పట్ల ప్రేమతోనూ, నా పట్ల ఆగ్రహంతోనూ చూస్తున్నాయి. చాలాసేపు అధిష్ఠానవర్గం మౌనంగా ఉండిపోయింది. నా మీద పెద్ద ఆరోపణ ఏదో పడబోతున్నట్టు నాకు తెలుస్తూనే ఉంది. అంతలో వాళ్లందరిలో చిన్నవాడు, నాకు ఆప్తుడు – భాస్కర్ నన్ను అడిగాడు.
“నీ ఆరోపణల మూలంగా సూర్యంగారు బాధ పడుతున్నారు. విరాళాలు చెల్లించారు అని నీవు చెప్పిన వాళ్లలో ఒకరితో నేను మాట్లాడాను. ఆయన రసీదులో అయిదు వందల రూపాయలు రాసిన మాట వాస్తవమే కాని, ఆ పైకం ఇంకా తాను చెల్లించలేదని నాతో చెప్పాడు. నీ ఆరోపణలు కేవలం కల్పితం. సూర్యంమీద నీవు దుష్ప్రచారానికి తలపడ్డావని దీంతో రుజువయింది. దీనికి నీ సంజాయిషీ ఏమిటీ? జవాబు చెప్పు” అన్నాడు సూటిగా, స్పష్టంగా నా కళ్లలోకి చూసి.
నేనేమీ మాట్లాడలేక పోయాను. నిధుల దుర్వినియోగానికి సంబంధిం చిన ఫిర్యాదులు వచ్చినప్పుడు ఇదివరలో కూడా పెద్దల ధోరణి తమ తమ ఇష్టాయిష్టాలకు లోబడి ఉండేదే కాని, యథార్ధం తెలుసుకోవటానికి ప్రయత్నం జరగలేదు. వాస్తవాలు రుజువు చేయటానికి అది సమయం కాదు.
ఆ తర్వాత నేను భాస్కర్ను. సూర్యాన్ని, సదాశివును కలుసుకోవటం మానేశాను. క్రమంగా అది సిద్ధాంత వివాదరూపం దాల్చింది. ఇక్కడే ఉంది రాజకీయం.
ఉద్యమ నాయకుల మహోన్నత ఆశయాలను నేను శంకిస్తున్నానట! నా వ్యాఖ్యానాల్లో వాళ్ల చిత్తశుద్ధిని అపహాస్యం చేస్తున్నానట! పవిత్రమైన వాళ్ల త్యాగాలను నేను బుద్ధిపూర్వకంగానే కించపరుస్తున్నానట! పరోక్షంగా ఒక ప్రజా ఉద్యమాన్ని అవమానం పాలు చేస్తున్నానట! దాంతో ఉద్యమ వ్యతిరేకిగా తయారయ్యానట.
“క్రమంగా నీలాంటి వాళ్లే ముదిరి విద్రోహులవుతారు. ఈ విద్రోహులే శత్రువర్గాలకు నైతికంగానే కాకుండా ఇతరత్రా కూడా అండదండలు సమకూరుస్తారు.”
భాస్కర్ తో పోట్లాట ఆ స్థాయికి చేరిన తర్వాత ఆ రోజు నుంచి అతడిని చూడటం మానుకున్నాను.
మా ఇద్దరికి మధ్య పోట్లాట ఇంత తీవ్ర స్థాయిలో జరిగినా, అది మూడోవాడికి తెలియదు. సుభద్రకు తెలిసినట్టు లేదు. నేను ఇంట్లో లలితకు చెప్పలేదు.
“ఏమిటి, భాస్కర్ బొత్తిగా కనిపించటం లేదు?” అని లలిత గుర్తు చేసినప్పుడల్లా “ఆయనకు ఇప్పుడు తీరిక ఎక్కడ?” అని లలితను సమాధాన పరిచాను.
ఏదో జరిగిందన్న అనుమానం మాత్రం లలిత మనసులోంచి తీసివేయలేక పోయాను.
★★★
మా ఇంటికి అయిదు నిమిషాల నడక దూరంలో సంపన్రావు ఉంటాడు. ఆయన ఉంటే మోటార్సైకిల్ మీద అల్వాల్ వెళ్లి, సుభద్రకు అరెస్టు సంగతి వెంటనే చెప్పి రావచ్చని తోచటంతో సంపర్రావు కోసం వెళ్లాను. ఇంట్లో ప్రమీల ఉంది. సంపర్రావు స్కూలు నుంచి ఇంతవరకు ఇల్లు చేరనే లేదట. దాంతో మార్గాంతరం తోచక వేకువ జామునే లోకల్ ట్రైన్‌లో వెళ్లటమే మంచిదనుకున్నాను.
వేసవి కాలం. అయిదు గంటలకే తెల్లవారింది. అయిదున్నరకల్లా నేను భాస్కర్ ఇంటి ముందు ఉన్నాను. భాస్కర్ అమ్మగారు పాలు పోయించుకుంటూ వీధిలో కనిపించారు. ఆమెనుచూడటానికి, పశ్చాత్తాపభావంతో సిగ్గనిపించింది. భాస్కర్‌ను తీర్చిదిద్దిన తల్లి ఆమె. సెలవుల్లో కుటుంబాన్ని తీసుకుని భాస్కర్ వరంగల్ వెళ్లి తల్లిదండ్రులతో గడిపి వస్తుంటాడు. అలా చాలాసార్లు నేను భాస్కర్‌తో వరంగల్ వెళ్లాను. నాతో భాస్కర్ యలమంచిలి వచ్చి మా ఊళ్లో ఉన్నాడు. అక్షరం ముక్కరాని మా అమ్మా, నాన్నలంటే భాస్కర్‌కు నా కంటే ఎక్కువ ప్రేమ. మా మధ్య గొడవలు వచ్చిన తర్వాత కూడా ఓసారి విశాఖపట్నం సమావేశం కోసం వెళ్లినవాడు ప్రత్యేకంగా యలమంచిలి పోయి అమ్మనీ, నాన్ననీ చూసి వచ్చాడు.
సుభద్రతో చెప్పాలనుకున్న సంగతి ముందుగా అమ్మతో చెప్పాల్సి వచ్చేటట్టుంది. ఎన్నాళ్లయిందో అమ్మ వచ్చి. ఊళ్లో ఉన్నట్టు తెలిస్తే లలిత వచ్చి అమ్మను చూసి వెళ్లేది.
స్టీల్ గిన్నెలో పాలు పోయించుకుని లోపలికిపోతూ అమ్మ, “రామూ! వచ్చావా?” అని ఆగిపోయింది. ఆమె గొంతు చెప్పేసింది మిగిలిన కథను. ఇంట్లో సుభద్ర కనిపించలేదు. పిల్లల ముఖాల్లో ఏమీ తెలియటం లేదు.
పెద్ద పాప పద్మిని దగ్గరకు వచ్చింది. ఒళ్లోకి తీసుకున్నాను.
“నాన్నను పోలీసులు అరెస్టు చేశారు తెలుసా అంకుల్?” అని పద్మినే అడిగింది నన్ను. అరెస్టు అంటే, పోలీసులంటే ఏమీ ఎరగని ఆరేళ్ల పద్మిని.
అమ్మ వింటున్నది. పాలగిన్నె లోపల పెట్టి వచ్చింది.
“అమ్మా! ఎప్పుడు – ఎన్నాళ్లయింది వచ్చి?”
“ఇప్పుడే రామూ! వచ్చి ఇంకా అర్ధగంట కూడా కాలేదు.”
అంటే భాస్కర్ అరెస్టు వార్త అమ్మకు తెలిసి వరంగల్ నుంచి బయలుదేరి వచ్చిందన్నమాట! ఊళ్లో ఉన్న నేను రాకముందే వరంగల్ నుంచి అమ్మ హైదరాబాద్ చేరుకోగలిగింది. ఇప్పుడు ఇంకా స్పష్టమయింది పరిస్థితి.
బయట మోటార్ సైకిల్ చప్పుడు. సుభద్ర, సంపర్రావు! వాళ్ల ముఖాల్లో రాత్రంతా నిద్రలేని అలసట. లాయర్‌ను కలవటం, అరెస్టును ఖండిస్తూ పెద్దల సంతకాలు సేకరించటం, అరెస్టు వార్తను జంటనగరాల నుంచి వెలువడుతున్న దినపత్రికలకు స్వయంగా వెళ్లిఇవ్వటం, టెలిఫోన్లో మాట్లాడటం… నిర్బంధంలోకి తీసుకున్నవాళ్లను పోలీసులు అడవుల్లోకి తీసుకుపోకుండా దిగ్బంధం చేయటానికి ఇవన్నీనూ.
రాత్రంతా పెద్దవయసు పంతులుగారు నిద్రాహారాలు లేకుండా తమతోనే గడిపారట.
సంపర్రావు చేతిలో ఆ రోజు పత్రికలు. సుభద్ర చేతిలో పత్రికలకు విడుదల చేయగా మిగిలిన ప్రకటన ప్రతులు. పత్రికల మొదటిపుటలోనే భాస్కర్, తదితర నాయకుల అరెస్టు వార్త, ఫొటోలతో, అవన్నీ సూర్యం తీసిన ఫొటోలే.
ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపే కాల్పుల్లో చనిపోయినట్టు కట్టుకథ అల్లకుండా సాగించిన పోరాటంలో నెగ్గిన సంతృప్తి వాళ్ల ముఖాల్లో.
ఇది జరిగిన రెండు మూడురోజుల తర్వాత ఓ రాత్రి ఎనిమిది గంటలప్పుడు నేను ఇంటికి వెళ్లేసరికి లలితతో ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్న సూర్యం కనబడ్డాడు.
“ఆరు గంటలకే వచ్చి నీ కోసం కాపలా. లలిత రెండోసారి కూడా కాఫీ ఇచ్చింది. కాఫీతో సరిపెట్టేటట్టున్నావు! భోజనం ఈ రాత్రికి ఇక్కడే” అని హెచ్చరిక చేశాడు.
“ఆఫీసు తరువాత రెండు గంటల సేపు లాయర్ దగ్గర వేరే కొలువు పెట్టుకున్నాను కదా!” అన్నాను.
ప్రభుత్వోద్యోగంలో వచ్చే జీతం సరిపోదు. ఇంటికి అంతో ఇంతో నెల నెలా పంపించాలి. ఏడాదికొకసారయినా తల్లిదండ్రులను చూడటానికి వెళ్లాలి. సాహిత్య సమావేశాలు, సామాజిక సంస్కరణలు, రాజకీయ ఉద్యమాలు, సాంస్కృతిక కార్యకలాపాలు అన్ని పక్కకు పెట్టి నాలుగురాళ్లు అదనంగా సంపాదించుకునేందుకు ఈ పని తప్పదు. డిపార్ట్‌మెంట్ టెస్ట్ కోసం చదవటం మొదలుపెట్టాను. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిలుపు వచ్చి నెగ్గితే ఈ ఊరు వదిలి పారిపోవాలని ఉంది. సభలు, సమావేశాలదారి మరచి పోయాను. రెండు మాసాలయింది. ఈ కొత్తకొలువులో చేరిన తర్వాత లా చేయాలనిపిస్తున్నది. వచ్చే ఏడాది నైట్ కాలేజీలో చేరాలి. విరాళాలు, చందాలు, ఖర్చులు తగ్గాయి. గత ఏడెనిమిదేళ్లు ఈ స్నేహితులతో దండగమారి ఖర్చులు ఎన్ని చేశానో! బుద్ధి వచ్చింది. సూర్యానికున్న తెలివితేటలు కావాలి ప్రపంచంలో నెగ్గడానికి. మన్ననలు పొందే కళ అందరికీ అబ్బదు.
అదృష్టవశాత్తూ పిల్లల్లేక గాని, పిల్లలూ, ప్రసూతులూ, ఆస్పత్రులూ, వైద్య చికిత్సలూ, వైద్య పరీక్షలూ, మందులూ ఉంటే అప్పులపాలయ్యేవాడినే.
ఒకప్పుడు సూర్యం కనిపిస్తే చాలు, ఎగిరిగంతేసే వాడిని. ఇప్పుడు తెచ్చిపెట్టుకున్న నవ్వొకటి నవ్వి, “మహా సభల తర్వాత ఇదే మనం కలుసుకోవటం. ఏడాది దాటిందనుకుంటాను” అన్నాను.
“భాస్కర్ అరెస్టయినప్పుడు కలిశాం కదా!” అని సూర్యం గుర్తు చేశాడు.
అవును, ఆ రోజు నేను సుభద్ర దగ్గర నుంచి వచ్చేస్తుంటే సూర్యం ఎదురయ్యాడు. గుర్తులేదు. ఆ రూపమే చెరిగిపోయింది మనసు నుంచి. కావాలనే చెరిపేసుకున్నాను.
సూర్యం ఎందుకలా ప్రవర్తించాడన్న సందేహం నన్ను ఆ రోజుల్లో పీడించసాగింది. కాని ఇప్పుడు అది కూడా లేదు. సూర్యం తప్పు చేసిన మనిషిలా కనిపించడు. తనకోసం అతడు బతుకుతున్నట్టు ఉండడు. ఏ దుమ్మూ ధూళీ అంటని పక్షిలా నిర్మలంగా కనిపిస్తాడు, నిజమే.
“నీతో మాట్లాడాలి, రా! ఓ అర్ధగంట సేపట్లో మళ్లీ వద్దాం. రాత్రికి మీ తోనే భోజనం” అని నన్ను బయటికి తీసుకు వెళ్లాడు.
కాచిగూడా చౌరస్తావేపు నడుచుకుంటూ, మాటలు చెప్పుకుంటూ వెళ్లాం. భాస్కర్‌ను ఇంకో కుట్రకేసులో పోలీసులు ఇరికించారట. సదాశివు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడట. సుభద్ర ఇప్పుడు మరింత చురుగ్గా ఉద్యమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నదట. గద్దర్ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆరేళ్ల పద్మిని రంగస్థలం మీద నృత్యాలు చేస్తున్నదట – ఈ ముచ్చట్లన్నీ నాకు తెలియకపోలేదు. సూర్యం చెప్పటంలో కొత్త అర్ధాలు, అందాలు దొరుకుతాయి. మాకు ఇష్టమైన మిరాయి భండార్లో కూర్చున్నాం. సూర్యం ఓ కేజీ మిరాయి తీసుకున్నాడు. అది లలిత కోసం అని నాకు తెలుసు.
“నన్ను క్షమించు రామూ! నేను ఆ రోజు ఆ నాటకం ఆడాల్సి వచ్చింది. లేకపోతే ఆ మూడువేల రూపాయలు నేనెక్కడ తీర్చగలను చెప్పు?” అన్నాడు సూర్యం. “ఇతర పట్టణాల నుంచి వచ్చిన ఆ పెద్దలు ఎలాంటివాళ్లో నాకు తెలియదు కాని సదాశివు, భాస్కర్ లాంటి వాళ్ల ముందు నీవు అంతనాటకం ఎలా ఆడగలిగావన్నదే నా సందేహం. రాటుతేలిన నేరస్తులు తప్ప ఇలాంటి ఘోరాలకు తలపడరని నా నమ్మకం. అందుచేత నేను బాధపడ్డాను.”
“ఉద్యమంలో నిండా మునిగిన వాళ్లకు ఇవన్నీ అల్పవిషయాలు. వాళ్ల బృహద్దీక్ష ముందు ఇవి నిలవవు. వాళ్లు పట్టించుకోరు.”
“ఇది నీకు చిన్న విషయమే కావచ్చు. సూర్యం వాళ్ల దృష్టిలో కూడా అల్పవిషయమే కావచ్చు. కాని, నాలాంటి సామాన్యులకు మాత్రం మీరంతా దొంగలు అనిపిస్తుంది. అయితే నీవు ఒక మేలు చేశావు సూర్యం! నాకు కార్యకర్తల రుజుప్రవర్తన పట్ల, వాళ్ల నిర్దోషిత్వంపట్ల ఉన్న భ్రమలు పోగొట్టావు. వాళ్లతో ఉన్న చివరి బంధం దాంతో తెగిపోయింది. ఇప్పుడు ఆ ఆలోచనలే లేవు. ఇకరావు కూడా.”
అంతటితో ఆ సంగతి అక్కడ విడిచి పెట్టేసి సూర్యం మళ్లీ తన విశాల ప్రపంచంలో పడ్డాడు. ‘సంస్కార’ కన్నడ చిత్రం చూసిన తర్వాత బెంగుళూరు వెళ్లి పఠాభినీ, స్నేహలతా రెడ్డినీ చూసి వచ్చాడట. తను తీసిన ఫొటో ఈ వారం ఇల్లస్ట్రేటడ్ వీక్లీ ముఖచిత్రంగా వచ్చిందట. మాక్స్ ముల్లర్ భవన్‌లో లక్ష్మాగౌడ్, సూర్యప్రకాష్, దేవరాజ్, బి.ఎన్. రెడ్డిల చిత్రకళా ప్రదర్శన మీద తను రాసిన వ్యాసం ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో గతవారం వచ్చిందట.
సూర్యం చెబుతున్నవన్నీ నిజమేనా అన్న అనుమానం వచ్చింది నాకు. ఇదివరలో లేని ఈ అనుమానం రాత్రి సూర్యం వెళ్లిపోయే ముందు వెల్లడించాను.
“సత్యజిత్ రాయ్ అంటే ఎవరు సూర్యం?” అని సూర్యాన్ని అడిగాను. నేను అనుకున్న సత్యజిత్ రాయ్, సూర్యం కలకత్తా వెళ్లి చూసి వచ్చినట్టు చెప్పిన సత్యజిత్‌రాయ్ ఒకరేనా?
మా స్నేహమంతా ఒక అబద్ధం పునాది మీద లేచిన కట్టడమేనేమో అనిపించింది. సత్యజిత్ రాయ్ అభిమాని కావటమే మా మధ్య స్నేహయోగ్యత కావటం వల్ల ఈ అనుమానం.
“నీ ప్రశ్న నాకు అర్ధమయింది రామూ!” అని చాలాసేపు మాట్లాడలేదు. సూర్యం. జవాబు చెప్పటం అవసరమా అన్న సందిగ్ధంలో పడ్డట్టున్నాడు సూర్యం.
సత్యజిత్ రాయ్ లేకపోతే నేనేమయ్యేవాడినో తెలుసా చిట్‌ఫండ్ కంపెనీ పెట్టుకునేవాడిని. పచ్చళ్లు ఎగుమతి చేసి దేశానికి డాలర్లు సంపాదించి పెట్టేవాడిని. ఫైవ్ స్టార్ హాస్పిటల్‌ని జాతికి అంకితం చేసేవాడిని. కార్పొరేట్ నిచ్చెన ఎక్కి బడా పారిశ్రామికవేత్తలతో పోటీ పడేవాణ్ణి. వ్యాపారచిత్రాలు తీసి కళారంగానికి సేవచేసి పద్మవిభూషణ్ సంపాదించేవాడిని. వాణిజ్య పత్రికలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించేవాడిని. ఎక్సైజ్ కాంట్రాక్టర్‌నై మూతపడిన దినపత్రికలను కొనుక్కుని వాటిని పాతేసేవాడిని. అధికార పార్టీలో చేరి కులంతో కొన్ని ప్రాంతాల్లో, మతంతో మరికొన్ని ప్రాంతాల్లో చిచ్చు పెట్టేవాడిని. మంత్రినై గోదావరి నదిని నా చిన్నల్లుడికి కౌలు కిచ్చేసే వాడిని తెలుసా, రామూ, సత్యజిత్ రాయ్ నన్ను రక్షించకపోతే?”
అతడి సమాధానం నాకు ఇంకా అర్ధం కాలేదనుకున్నాడో, ఏమో! “ఇప్పుడు ఉదయాస్తమయాల వెలుగు నీడల అందాలు చూసి బతకగలను.”
★★★
కొత్త ఉద్యోగంలో చేరటానికి ఢిల్లీ వెళ్లే ముందు సుభద్రను చూడటానికి వెళ్లాం. ఆమె ఆరోజు ముషీరాబాద్ జైలులో భాస్కర్‌ను చూసి అప్పుడే వచ్చిందట. ఆమె కళ్లు ఇంకా తడితడిగానే ఉన్నాయి. ఆమె చూపులు ఇంకా బరువు బరువుగానే ఉన్నాయి. తడారిన ఆమె కళ్లల్లో భాస్కర్ కనిపిస్తున్నాడు. ఆమె దుఃఖంలో నాకూ భాగం ఉన్నట్టే అనిపించి కొంతసేపు నోరు విప్పలేకపోయాను. కొత్తఉద్యోగంలో చేరటానికి నేను ఢిల్లీ పోతున్న సంగతి ఆమెకు తెలిసినట్టే ఉంది. ఉన్నాడు కదా సూర్యం. కొత్త ఉద్యోగంలో చేరుతున్న సంగతి నిజానికి నామటుకు నాకు సంతోషవార్తే అయినా సుభద్రతో ఆ సమయంలో చెప్పటం అసందర్భంగా తోచింది. నా గొంతు మారిపోయింది. సంజాయిషీ చెప్పుకుంటున్నట్టుగా నాకే అనిపించింది. సుభద్ర ఎంత దుఃఖంలో ఉన్నదీ లలితకు అర్ధమైనట్టు లేదు. ఇంట్లో కనిపించని పిల్లల గురించి అడిగింది. బాబుని అమ్మ వరంగల్ తీసుకు వెళ్లిందట. పద్మిని, ఉష బడి నుంచి ఇంకా రాలేదట. భాస్కర్ను చూసిన తర్వాత ఆమె వాళ్ల లాయర్ను కలుసుకుని, అటునుంచి స్కూలుకు వెళ్లి పంతులుగారిని చూసి ఇప్పుడే అర్ధగంట క్రితం ఇల్లు చేరుకున్నదట.
భాస్కర్‌ని కలిసినప్పుడు ఇవాళ కూడా సూర్యం ప్రస్తావన వచ్చిందట. సూర్యంలాంటి వాడు రెండుమూడు వేలరూపాయలు దుర్వినియోగం చేశాడే అనుకుందాం. అది ఎవరి కోసం చేసినట్టు? తన జీతం మొత్తాన్ని సైతం అతడు ఈ కార్యకలాపాలకే వెచ్చిస్తున్నాడు తప్ప అతడికి స్వంత ఇల్లా, పెళ్లమా, పిల్లలా, లేక తలిదండ్రులకు పంపించాలా? అతడు చేస్తున్న సేవలు కళాపరమైనవే అయినా వాటికి విలువకట్టగలమా? లేదా అతడు ఈ సంస్థను తన స్వంతానికి ఉపయోగించుకునేది ఏమైనా ఉందా? తనకు సూర్యం మీద ఆ ఆరోపణ చాలా బాధ కలిగించిందని సుభద్ర మరోసారి చెప్పింది.
నిజమే కావచ్చు. సూర్యానికి స్వార్ధం లేదు. సూర్యం నిస్వార్ధపరత్వం గురించి నాకు తెలియదని ఎవరూ అనుకోలేరు. అతడు తన కోసం స్వంత ఆస్తిని పోగుచేసుకోలేదు. ఇల్లూ, పిల్లలూ – ఈ బంధాలు కూడా అతడికి లేవు. సూర్యమే చెప్పుకున్నట్టుగా ఉదయాస్తమయాల అందాలు చూసి అతడు బతికిపోవచ్చు. కాని ఉన్న నిజం చెప్పలేని పిరికితనం, తప్పు ఒప్పుకోలేని బలహీనత, తన గౌరవానికి భంగపాటు కలగకుండా ఉండేందుకు నాటకమాడటం, ఒకరి దగ్గర తప్పయిందని ఒప్పుకుని పశ్చాత్తాపం ప్రకటించి, నలుగురు ముందు దాన్ని మసిపూసి మారేడు కాయ చేయటం అతడిని ఎక్కడికి తీసుకువెళ్తాయో నాకు అర్ధం కాలేదు. అతడి త్యాగశీలం, సేవా భావం, చొరవ, చైతన్యం -ఆత్మసంస్కారమే లోపించినప్పుడు వాటి విలువ శూన్యం.
అలా సుభద్రతో వాదన పెట్టుకోవటం కూడా అసందర్భమే ఇప్పుడు. కొన్ని విషయాలు కొందరికి చెప్పి ఒప్పించలేం. ఆమె అవగాహన లోపాలను ఎత్తి చూపి ఖండించలేను. నా వాదం ఆమెకు పట్టదని నాకు తెలుసు.
సూర్యం సుభద్రతో నిజం చెప్పాడని మాత్రం అర్ధమయింది. అయితే సుభద్ర నిజాన్ని అంగీకరించటం లేదు.
సత్యజిత్ రాయ్ చిత్రాలు సూర్యం మరొకసారి చూడాలేమో!

శ్రీపతి
తెలుగు కథా సాహిత్యంలో శ్రీపతిగా ప్రసిద్ధులైన పుల్లట్ల చలపతిరావుగారు (86) స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని బైరిపురం. చాలాకాలం కిందటే హైదరాబాద్‌లో స్థిరపడి 2024 సంవత్సరంలో మరణించారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో చాలాకాలం పుల్లట్ల చలపతిరావుగా జాతీయ వార్తలు చదివారు. శ్రీకాకుళోద్యమ తొలినాళ్లలో ఆయన రాసిన ‘నర్తోడు’ కథ చాల పేరు పొందింది. ఆయన రాసిన ‘మంచుపల్లకి - మరితొమ్మిది’, ‘కాటుక కళ్లు - కథలు’, ‘సత్యజిత్ రాయ్ ఎవరు’ తదితర రచనలు కథా సంపుటాలుగా వెలువడ్డాయి. ఉద్ధానం ప్రాంత సౌందర్యాన్ని ముఖ్యంగా ‘నెమళ్ళ అడవి’ తదితర ప్రాంతాలను తన కథల్లో శ్రీపతి చాలా అందంగా కళ్ళకు కట్టారు.
