మనుషుల్లో జడత్వానికి సహజ చిరునామా ఈ ” స్పర్శ లేని శిల “

Spread the love

* * *        * * *         * * *

మనుషుల్లో జడత్వానికి సహజ చిరునామా ఈ ” స్పర్శ లేని శిల “

                               – మానాపురం రాజా చంద్రశేఖర్

                                                      7794039813

      అక్షరం చేసే ప్రయాణం అనంతం.ఆద్యంతాల్లేని ఈ ఉలికిపాటు స్పర్శలో ఉలిక్కిపడే మానసిక సందర్భాలు అనేకం.వీటి లోతుల్ని జీవనమూలాలతో సజీవంగా తడిమి తియ్యాలంటే ఆ తపన వెనక కనిపించని ఉక్కపోతలు,తారసపడని మానసిక సంవేదనలు కోకొల్లలు.అనుభవిస్తే తప్ప అర్థంకాని ఈ రంపపుకోత ఒరిపిడిని తట్టుకోలేని జీవన సంఘర్షణలు ఎన్నో ప్రత్యక్షమౌతుంటాయి.ఈ కుదుపుల్లోంచి అసహనంతో ఉట్టిపడే సన్నివేశాలు కవిత్వంగా ఉట్టిపడుతుంటాయి.అలా యాంత్రికమైపోతున్న బతుకు గుండెచప్పుళ్ళని అక్షరబద్ధం చేసే ప్రయత్నం ఓ కవయిత్రి చేసింది.ఆమె పేరు ఎన్. లహరి.’స్పర్శ లేని శిల’గా మారిన ఆ హృదయావిష్కరణ బహురూపాల్ని సంతరించుకొని ఉద్వేగభరితమైన సందర్భాల్ని మనకి పరిచయం చేస్తోంది.

     ‘అక్షర నేత్రాలు’తో కళ్లు తెరిచి, ‘నానీల తీరాన’ సేదతీరి, ‘స్పర్శలేని శిల’గా మూడోనేత్రాన్ని తెరిచింది.పత్రికల్లో నిత్యం ప్రత్యక్షమౌతూ,పలు అవార్డులను సొంతం చేసుకుంటూ,తనదైన అక్షరశైలి ముద్రని,సాహితీఉనికిని ఈ పాఠకలోకానికి కానుకగా అందిస్తూ తేటతెల్లం చేసింది.వీటి కుదుపుల్లోని మలుపుల్ని,భావోద్వేగాల తీవ్రతల్ని అనేక ఉలికిపాట్ల మధ్య ఆవిష్కరిస్తూ సృజనాత్మక స్పర్శతో నిరసనల్ని తెలియచేస్తూ వచ్చింది.వీటి తాకిడికి అనుభూతించాలంటే ఒక్కసారి ఆమె మనోనేత్రంలోకి అక్షరాలతో తొంగిచూసే ప్రయత్నం చెయ్యాల్సిందే.

     ” పుడమి సేద్యంతో

       శ్రమజీవి చేసే యుద్ధం

       మట్టి పరిమళాల

       సజీవ జీవన దృశ్యం

       కడసారి బతుకు రూపమై

       ప్రకృతి కళ్ళలో

       తొణికిసలాడుతూ ప్రతిఫలిస్తుంది ” అంటారు ‘సేద్యంతో యుద్ధం’ కవితలో ఓ చోట ఈమె.

     మట్టిని తిండిగింజలతో బువ్వగా మలిచి పండించే అన్నదాతకి పట్టిన ఆర్థిక దుస్థితి ఈ పరిస్థితి.ఏటికి ఎదురీదుతూ అష్టకష్టాల మధ్య నాగలి ఉనికి నానాటికీ దుర్భేద్యమై కనుమరుగవుతూ మూలన పడుతోంది.ఈ బతుకు విలువను వెన్నెముక రెక్కలకష్టంతో అనేక ప్రశ్నార్థకాల మధ్య నిటారుగా నిలబెట్టి,జీవితంతో చేస్తున్న పరోక్ష యుద్ధానికి ప్రత్యక్ష సాక్ష్యమిది.అయినా సరే, కాల స్థితిగతుల్లో మార్పు రావడం లేదు.పిడికెడు అన్నం పెట్టే రైతు జీవనస్థితి మెరుగుపడటం లేదు.వీటి వెనుక ఆశావహ కళాత్మక దృష్టితో బతుకుభరోసాను నింపడానికి వెంపర్లాడుతుంది కవయిత్రి లహరి.

     ” దేహం పంటచేను

       దేశం ఆకుపచ్చని కల

       బతుకు విచ్చుకున్న స్వేదఫలం

       ఈ కలల పంట పొలం” అంటూ సౌందర్యాత్మకమైన తపనతో పరితపించిపోతుంది.ఈ చూపులో ఒక లోతైన విశ్లేషణ తీరని ఆర్తితో కలగా ప్రతిఫలించి అదృశ్యమైపోతుంది.

     ” చెమట చుక్కల నెత్తుటి సేద్యం

        రాలిన ఆకుల మూగ సాక్ష్యం

        మట్టి పరిమళాల మౌనరాగం

        మహికి దొరికిన పట్టెడన్నం ” అంటూ వ్యాఖ్యానించడంలో ఆంతర్య మర్మం ‘నివురు కింద నిప్పులా’ మండే భూమిపుత్రుడి ఆకలి మూగవేదనే పరోక్ష కారణానికి సజీవ ప్రతిబింబం.

     దుర్భేద్యమైన ఈ సంక్లిష్టతల్లోంచి ప్రత్యామ్నాయ జీవనోపాధి దిశగా వలసపోతున్న హాలికుడు జీవనప్రమాణాన్ని మెరుగు పరచడానికి రాజకీయ పార్శ్వాల్ని తడుముతూ ‘ఆకుపచ్చని వస్త్రం’ శీర్షికలో వెదుకులాటను మొదలుపెడుతుంది కవయిత్రి లహరి.

     ” ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే

        తూట్లు పడ్డ ఈ వరిగింజ దేహానికి

         ఏ వాగ్దానాల వస్త్రం కప్పుతారో?

         బువ్వ పెట్టిన నన్ను

         నా మట్టిలోనే సమాధి చేస్తున్నారు!” అంటుంది కడు దీనంగా దయనీయంగా.నిజానికి ఇది కథ కాదు.కరడుకట్టిన నిప్పులాంటి ఓ భయంకర విషాద నిజం.

     ” దళారీలను దాటుతూ వచ్చిన నేను

        దగా పడి దిగులు గుండెతో

        అరిచే పేగులకు అన్నం పెట్టలేకపోతున్నాను

        ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదూ

        నేనే వెన్నెముక విరిగిన రైతును! ” అని అంటున్నపుడు ఆర్ద్రతతో మెలిపెట్టి సుడి తిరిగే బాధ ఈ వ్యవసాయ కృషీవలుడి మౌన అంతర్వేదనగా గడ్డకట్టి చారిత్రక భౌతికసత్యంగా వర్తమానంలో ప్రతిధ్వనిస్తూ నిలిచిపోతుంది.

     ఇదే కంఠధ్వని దళితస్వరంతో కెరటంలా ఎగిసిపడి రసార్ధ్రభరితం చేస్తుంది మరోచోట.” కంచెలు కూల్చండి ” కవితలో అణగారిన వర్గాల ఆర్తిరోదన అట్టడుగు చరిత్ర కోణాల్ని పట్టి చూపిస్తూ నిర్లిప్తమైన సంవేదనకు పరాకాష్టగా నిలబెడుతుంది.

     ” అనాదిగా వెలివేతపై

       యుద్ధం జరుగుతూనే ఉంది

       మీ ద్వేషపూరిత

       అంటరాని చూపుల్ని చూడలేక

       కాలం ఇప్పటికీ

       గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది ” అనే తార్కిక సత్యాన్ని అస్పృశ్యతలోని మానవీయ విషాద కోణంలో ఎలుగెత్తి చాటిచెబుతూ, నిర్లిప్తతలోని నిరసన పార్శ్వాన్ని భావగర్భితంగా వ్యక్తీకరిస్తుంది.

     ఈ కుదుపుల రాపిడిలోంచి మొనదేరిన లోచూపు ధనికవర్గాల పీడిత స్వరంలోంచి తిరుగుబాటుతనాన్ని ప్రదర్శిస్తుంది.

     ” మా భుజాలపై వేలాడే తుండుగుడ్డ

       అగ్రవర్ణాల ఆధిపత్యంపై

       జెండాగా తలెత్తుకొని ఎగురుతుంది ” అనడంలో కవయిత్రి లహరిలో తొంగిచూసే ఆశావహ చైతన్యానికి ప్రతిరూపంగా ఈ కవిత నిలుస్తుంది.

     స్త్రీ శక్తిలోని మాతృత్వానికి చరమగీతం పాడుతూ అతివలోని అందానికి,సౌందర్యానికి,కాము 

కత్వానికి పురుషుడు లోలుడై దిగజారిపోతూ సృష్టి మనుగడకు మూలమైన అబల ఉనికినే ప్రశ్నార్థకం చేసే పరిస్థితుల్ని నర్మగర్భంగా ” ఆమె లేనిదే అవని లేదు ” శీర్షికలో తూర్పారబెడుతుంది కవయిత్రి.

     ” మనిషికి జన్మనిచ్చే

        ఆడజాతి మనుగడకే

        జన్మ లేకుండా చేస్తే

        ఈ భూమిపై మానవజాతికి

        నూకలు చెల్లిపోవూ! ” అంటూ వ్యంగ్యార్థంతో ధ్వనింపజేస్తుంది లహరి.ఇవి వట్టి మాటలు కావు.అక్షరసత్యాలు.లోకం మనుగడ మగువ సహచర్యంలోనే ఇమిడివుందనేది కాదనలేని వాస్తవం.కాదూ కూడదూ అనుకుంటే ఈ సృష్టిలో ప్రపపంచమే గొడ్డుబోయి అమ్మతనంలేని అనాధగా మిగిలిపోతుంది.ఈ భౌతిక వాస్తవికతనే కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించి నిరూపిస్తుంది కవయిత్రి లహరి.ఈమె మాటలు ఎప్పటికీ పొల్లుపోవు.నడిచే చరిత్రకి అద్దంపట్టి శిలాక్షరాలుగా తరుణి లోకంలో ప్రతిధ్వనిస్తుంటాయి.

     ఇంకోచోట ఈమె మాటల్లోనే నారి జీవనభేరి ఆత్మని సజీవంగా ఆవిష్కరిస్తుంది.

     ” ఆకాశంలో సగమంటావు

       అవనిలో అర్థభాగం నువ్వేనంటావు

       ఆమెను ఆకాశానికి ఉరేసి

       పాతాళంలో కప్పెట్టేది నువ్వే ” అని వ్యక్తపరచడం వెనుక అసలు నియంతృత్వ స్వభావాన్ని పురుష సమాజంలోని పితృస్వామిక సుమాజంలోంచి ఎద్దేవా చేస్తూ,అంతర్లీన అణచివేత పార్శ్వాన్ని సామూహిక చైతన్య స్వరంలోంచి మార్మికధ్వనితో వినిపిస్తుంది.

     ” ఆమె ఓ జీవనది ” కవితలో చెప్పినట్టుగా రమణి ఆలిగా,గృహిణిగా,సోదరిగా,అమ్మగా బహుముఖ రూపాల్లో ప్రత్యక్షమౌతూ, వనితగా బాధ్యతల్ని నిర్వహించడంలో ఆమెది ‘అందె వేసిన చేయి’ అని నిరూపించడంలో సఫలీకృతమౌతుంది లహరి.

     ” పొద్దున్నే సూర్యుడిని

       చీపురుతో నిద్రలేపుతుంది

       గడియారంతో పరిగెడుతూ

       పరివారం కోసం పరితపిస్తుంటుంది ” అని వ్యక్తీకరిస్తుంది ఇంకో చోట.ఇది నూటికి నూరుపాళ్లూ సత్యం. పడతి లేనిదే ఈ జగతి లేదు.భూమిని మించిన సహనం,ఓర్పు,తెగువ,తెలివి,చాకచక్యం ఈమె సొంతం.వేకువనే మేల్కొని కాలంతో పోరాడుతూ, పోటీప్రపంచంలో పురుషుడితో సరిసమానంగా,ధీటుగా నిలుస్తూ పలురంగాల్లో తనదైన ముద్రను వెయ్యడంలో వెనుకాడని అతివ ఈ స్త్రీమూర్తి.కుటుంబ వ్యవస్థలో ఓ మూలస్తంభంగా నిలుస్తూ తనకు తానే సాటిగా పురుష ప్రపంచానికి సవాలుగా నిలుస్తుంది.స్త్రీవాద గొంతుకని తారా స్థాయిలో వినిపిస్తుంది.ఈ ప్రవాహశక్తినే ఓ జీవనదిగా నిరూపించే ప్రయత్నం చేస్తుంది లహరి.

     కుటుంబాలను విచ్ఛిన్నం చేసే దురలవాట్లలో తాగుడు ఒకటి.దీనికి బానిసలై మత్తులో తేలి తూలేవాళ్ళ సంఖ్య అపరిమితం.ధనిక, మధ్య,అట్టడుగు వర్గాల్లో తాగుబోతుల్ని ఈ వ్యసనానికి బానిసలుగా చేసి,మనుషుల్ని రాక్షషులుగా,నరహంతకులుగా,వావి వరుసల్లేని మృగాలుగా,కామాంధులుగా మార్చి,లోకం దృష్టిలో అసమర్దులుగా,అల్పాయుష్కులుగా ముద్ర వేసి, చేతకానివాళ్లుగా నిలబెడుతుంది.దీనికి కారణం మద్యం మత్తు.’కల్లు మానండోయ్, కళ్లు తెరవండోయ్’ అని గతంలో పిలుపిచ్చినా,సారా ఉద్యమాలు ఎన్ని లేవనెత్తినా,చివరికి ఫలితం మాత్రం తామరాకు మీద నీటిబొట్ల చందమే.ఈ లిక్కర్ వ్యాపార సంస్కృతిలో భాగస్వాములైనవాళ్లు కోట్లకు పడగలెత్తుతుంటే,మద్యం మత్తులో మునిగితేలుతూ బానిసలుగా మారినవాళ్ళు ఇల్లూ,ఒళ్ళూ గుళ్ల చేసుకుని ఆర్థిక భారంతో కుటుంబ వ్యవస్థను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.ముమ్మాటికీ ఇది స్వయంకృతాపరాధమే.సామాజిక ఎదుగుదలకీ,వ్యవస్థ మనుగడకీ ఇది అత్యంత కీలకంగా మారింది.శ్రుతి మించితే దీని పర్యవసానం అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది.చరిత్రలో దీనికి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ముఖ్యం.ఈ సందర్భాన్ని వాహికగా చేసుకుని ” నిషా పర్వం ” పేరుతో ఓ బలమైన కవితను చిత్రీకరించారు లహరి.

     ” ఓ మద్యమా

        నువ్వు మా మధ్య శత్రువులా దూరి

        పచ్చని సంసారంలో

        నిప్పుల కుంపట్లను రాజేయకు.

        నువ్వు దూరం అవ్వాలంటే

        మేమంతా ఏం చేయాలో చెప్పు

        ఉద్యమించాలో

        ఊపిరి తాళ్ళకు వేలాడాలో

        నువ్వే చెప్పు ” అంటూ ఉద్భోదిస్తారు ఈమె.ఈ నిలదీతలో నిరసనతో నిండిన తిరుగుబాటు ధోరణే వ్యక్తమవుతుంది. ఈ వ్యంగ్యస్వరంలో సందేశపూర్వకమైన ఎత్తిపొడుపే కవిత్వంగా పొడసూపుతుంది.

     ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల ప్రవృత్తి విచ్చలవిడిగా పెరిగిపోతూ వస్తోంది.సామాజిక మాధ్యమాలతోపాటు ఇంటా బయటా వీటి ఆగడాలు శృతిమించిపోతూ హానికరంగా మారిపోయాయి.ఈ నేపథ్యాన్ని సహజరీతిలో విశ్లేషిస్తూ ” సైబర్ మోసం “గా ఓ కవితలో చిత్రీకరిస్తారు.

     ” మోసపూరిత మాటలతో

       అమాయకపు గొర్రెలకు ఉచ్చు పన్ని

       మౌనంగా వల వేసి

       దురాశల్ని ఎరగా వేస్తుంటాయి

       పేరాశతో కీబోర్డ్ మీట నొక్కగా

       అకౌంట్లో నగదు ఇట్టే మాయమౌతుంది ” అని ఆవేదనతో ఆవేశపడతారు లహరి.నేడు ఇది ప్రతిచోటా నిత్యకృత్యమైపోయింది.ఈ ఏమరుపాటుతనంలోంచి సామాజిక వ్యవస్థను మేల్కొలపాలనే జిజ్ఞాస ఈ కవయిత్రి ఆరాటంలోని ప్రధాన ఉద్దేశ్యం.

     నిజాం ప్రభుత్వంలో చెలరేగిన దమనకాండను,అఘాయిత్యాలను,ఆరాచకత్వాన్ని బొమ్మకట్టించే సందర్భాల్ని కవిత్వీకరిస్తూ ” దాస్య విముక్తి ” పేరుతో మంచి కవితను రాశారు కవయిత్రి.

     ” ఈ నేలని తడిమి చూడు

       రజాకార్ల రక్తపాతపు అరాచకాలు

       భూస్వాముల మితిమీరిన దౌర్జన్యాలు

       గోల్కొండ పునాది రాళ్లను

       కదిలించిన గత గాధలు

       కూలిన ఊళ్ల బురుజు శకలాల్లో

       స్పష్టంగా కనిపిస్తాయి ” అంటారు లహరి.రాజాకార్లు సృష్టించిన విధ్వంసంలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాటంలో అసువులు బాసిన  అమాయక ప్రజలు,వీరులు చాలా మంది ఉన్నారు.ఆనాటి రాజ్యం కొనసాగించిన దమననీతి విధ్వంసకాండలో భూస్వాముల పెత్తందారీతనం,ఊచకోత మాయనిమచ్చలా చరిత్రపొరల్లో నిలిచిపోయింది.వీటి ఛాయలను కట్టడాల పునాది రాళ్లలోనూ,గత వీరుల గాథల్లోనూ,కూలిన బురుజు శకలాల్లోనూ తడిమి చూపించే ప్రయత్నంతో పరోక్షంగా స్పష్టపరుస్తారు కవయిత్రి.దీనిలోని మంచిచెడ్డల లోచూపు ఆనవాళ్లను కాలానికి ప్రతీకగా మలిచి చూపిస్తారు కూడా.

     ” ఆధిపత్య అహంకారం ” శీర్షికలో వర్తమాన కాల యుద్ధ పోకడలను సజీవంగా చిత్రిస్తారు ఈమె.

     ” ప్రపంచం ఇప్పుడు

       అశాంతితో తాండవమాడుతోంది

       రాజ్యాలు యుద్ధాన్ని తవ్వి

       మనుషుల్ని పాతేస్తున్నాయి ” అంటూ పాలస్తీనా – ఇజ్రాయిల్ యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అగ్రరాజ్యాలు కొనసాగిస్తున్న యుద్ధసంస్కృతిపై నిరసన జ్వాలలతో కత్తి కడతారు.విధ్వంసం ముసుగులో దాగిన రాజ్య దురాక్రమణలు కారణంగా తలెత్తిన అశాంతి,ఆశ్రిత పక్షపాత ధోరణి,మృతులు,క్షతగాత్రులు,పర్యావరణ విధ్వంసం వంటి అరాచక దృశ్యాలు మనుషుల్ని తవ్వి పాతరేస్తున్న విషాద సందర్భాలను తలపోస్తాయి.లోక వినాశనానికి కారణభూతమైన ఈ అమానవీయ చర్యల్ని ఎద్దేవా చేస్తూ ఆధిపత్య అహంకార జ్వాలల్ని రగిలించే మూలాలను మేధోమథనంతో అన్వేషించడం మొదలుపెడతారు లహరి.ఇవి ప్రపంచ వినాశనానికి దారితీసి చివరికి కాలాన్నే మందుపాతరేస్తాయని అంతర్లీన ధ్వని ఇందులో రూపుకడుతుంది.

      ఆవేశ ప్రధానమైన కవితావస్తువులతో పాటు,అనుభూతిపరమైన అంశాలు కూడా లహరి రచనల్లో కొన్నిచోట్ల ఉట్టిపడతాయి.ఇలాంటి కోవకి చెందిన కవితల్లో “అమ్మమ్మ లేని ఇల్లు ” ఒకటి.ఇందులో సహజత్వంలోని వాస్తవికత కొంచెం ఆలోచింపచేస్తుంది.

     ” మూల పడిన బామ్మ చేతికర్రను చూసినప్పుడల్లా

       మా కళ్ళల్లో చిప్పిళ్ళి ఊరుతున్న

       ఆ హృదయస్పర్శ తడి

       మా ఊహల్లో ఆమె బతికిన క్షణాల్ని

       స్మృతుల పొరలుగా ఆరబెడుతుంటుంది ” అంటున్నపుడు తొంగిచూసిన ఆర్ద్రత ఆవేదనగా ఉట్టిపడుతుంది.బతికిన క్షణాల్లో వెంటాడే సజీవదృశ్యాలు ఇలా ఒక్కొక్కటే ఆకృతి దాలుస్తూ కాలంతోపాటే మనుషుల్ని కూడా వెంటాడుతూ వస్తాయి.వీటి స్మృతుల పరవళ్ళు ఓ పట్టాన నిద్రపోనివ్వవు.గతాన్ని అనుక్షణం జ్ఞాపకాలతో తవ్వితీస్తూ ఊహల్లోని సజీవక్షణాల్ని కళ్ల ముందు ఆరబెడతాయి.ఈ తపనలోని ఉద్వేగాన్ని మౌనంగా బొమ్మ కట్టిస్తూ హృదయావిష్కరణ చేస్తాయి.ఈ అనుభూతులు లహరి స్మృతుల్లో కూడా బామ్మ రూపంలో అంతర్లీనంగా ప్రవహిస్తుంటాయి.

     ” విలోమ దృశ్యం ” కవితలో చెప్పినట్టు మనసుపొరల్లో గూడుకట్టిన సందర్భాలు సహజరీతిలో హత్తుకుంటూ అలరింపజేస్తాయి.

     ” కునుకు పట్టని నిశి జామున

       కాంతిపాపలో కలల అలికిడి

       గడ్డకట్టిన మనసు ద్రవమై

       ధారలా జారిన నేత్ర లవణాలు

       మౌనంలోకి తొంగి చూసినప్పుడల్లా

       ఎదలో ఏదో కదిలిన చప్పుడు ” అని ప్రస్తావించినపుడు గాఢంగా అభివ్యక్తీకరించలేని సందర్భమేదో భావ పరంపరల్ని అక్షరీకరించి మనసుల్ని ద్రవార్ద్రభరితం చేస్తుంది.ఈ ఎడబాటులోని తాత్త్విక జీవన సౌందర్యాన్ని కళాత్మక దృష్టితో ఒడిసిపట్టుకుని మనసుల్ని పులకింపజేస్తుంది.ఇందులోని మాధుర్యం,మృదుత్వం,సౌమ్యత,నిర్మలత,సున్నితత్వం ఓ పట్టాన సేదతీరనివ్వవు.శూన్యం ఆవహించిన గడియల్ని కూడా పరస్పర సంభాషణాత్మక గుర్తులుగా మలుస్తూ ఆత్మలతో ముడిపెట్టే పతాక సన్నివేశాల్ని యాదికి తెస్తుంది.ఈ సంఘర్షణాత్మక తపనే ఈమెని భౌతిక ప్రపంచంలో ఓ కవయిత్రిగా తీర్చిదిద్దింది.వీటిని వేర్వేరు సందర్భాల్లోంచి తవ్వితీస్తూ ఇంకోచోట ఇలా అంటుంది.

     ” అంతా కలగా

       నాలోంచి నీకు

       నీలోంచి నాకు

       ఒక విలోమ స్వప్నం “గా వెలుగుచూసే విషయంగా ఆత్మావిష్కరణ చేస్తుంది.ముమ్మాటికీ ఇదో హృదయ ప్రతిబింబ దృశ్యచిత్రమే అవుతుంది.దీని ఆద్యంతాలు ఎల్లలు లేని భౌతిక ప్రపంచంలోకి విస్తరించి మనసుల్ని పరివ్యాప్తం చేస్తాయి.

     ఈ ఊసుల్ని కాలంతోపాటు నెమరేసుకుంటూ వర్తమానాన్ని స్మరించుకున్నపుడల్లా మరికొన్ని బాల్యస్మృతులు జ్ఞాపకాలుగా వెంటాడి బయటపడతాయి.

      ” నడిసొచ్చిన తొవ్వ నిండా

        మోదుగువనాలు మొలిచినట్టు

        దాటొచ్చిన బాల్యం నిండా

        ముసురుకున్న జ్ఞాపకాలు ” అంటారు ” అచ్చర దీపం ” కవితలో మరోచోట.

     నోష్టాలజీ పేరుతో కాలాన్ని వెనక్కి పరిగెట్టించే స్మృతుల సందర్భాలన్నీ,అనుక్షణం జీవితాలను వెంటాడి తడుముతూ బాల్యంగుర్తుల్లో దాగిన మధురక్షణాల్ని తీపిగుర్తులుగా నెమరేస్తాయి.ఇందులో భాగమే నడిసొచ్చిన తొవ్వ నిండా పరిమళించిన ఈ మోదుగువనాలతో ముసురుకున్న మధుర జ్ఞాపకాలస్పర్శ.ఇవి అనుభూతమైతే తప్ప ఆస్వాదించడానికి,అనుభూతించడానికి వీలుకాదు.ఇలాంటి తపనలోంచి బయటపడిన స్మృతులే ‘ అచ్చర దీపాలు ‘గా వెలుగు చూస్తాయి.

     చివరిగా ఈ కవితాసంపుటి ముఖచిత్రాన్ని ప్రతిబింబింపచేసే కవిత ” స్పర్శ లేని శిల ” చాలా భావోద్వేగాలతో,ఉక్కపోతల మధ్య కళాత్మకంగా ఆవిష్కరించబడింది.

     ” అలల జలతంత్రులు

       నా మునివేళ్లను మీటుతూ

       వెనక్కి తరలిపోతున్నపుడు,

       మదిలో ఎగిసిపడుతున్న మౌనం

       కడలి రాగమై పల్లవిస్తోంది ” అంటారు లహరి.ఇందులో పైకి కనపడని మౌనవిస్ఫోటనాలు అల్లకల్లోలమైన జీవితాన్ని అంతరంగంతో తడిమి పొదివి పట్టుకునే ప్రయత్నం చేస్తాయి.ఈ కుదుపుల తాకిడి అస్తవ్యస్తమైన అలల జలతంత్రులతో మునివేళ్లను మీటి వెనక్కి తరలిపోతున్నపుడు కలిగే అలజడుల స్పర్శ మదిలోతుల్లో ఎగసిపడే హృదయసంఘర్షణల్ని కడలిరాగంతో జ్వలింపజేసి పల్లవింపచేస్తుంది.దీని వెనుక ఆంతర్లీనమైన భావధ్వనిని కవితాత్మకంగా సృజించే ప్రయత్నం చేస్తారు కవయిత్రి లహరి.

     ” ఎరుపు వర్ణాన్ని అద్దుకుని

       ప్రకాశమవుతుంటే

       దర్శనం ఇస్తావనే ఆశ

       పున్నమి వెన్నెల కోసం

       పరితపించే కలువలా

       నాలో ఇంకా

       రెపరెపలాడుతూనే ఉంది ” అంటూ వర్ణించినపుడు,సంధ్యాస్తమయ ఎరుపు వర్ణ భావతీవ్రతలోని మానసిక సౌందర్య పిపాస దృశ్యాన్ని పున్నమి వెన్నెల నీటికొలనులోని కలువలా పరితపించే అరుదైన సన్నివేశాన్ని దృశ్యమానం చెయ్యడమే ఈ కవితలోని రసపట్టుకి ఓ పరాకాష్ట.రెపరెపలాడే కాంతిమయ సౌందర్యదృశ్యాన్ని ఇది అక్షరపరిమళంతో ఆస్వాదింపచేసి హృదయవేదనగా ఆవిష్కరిస్తుంది.ఈ జీవన సంఘర్షణ మామూలుగా ఉండదు.అక్షరమక్షరమూ ఉవ్వెత్తు తరంగమై ఎగిసిపడితే తప్ప,ఇందులోని భావతీవ్రత మానసిక సంఘర్షణగా ఊపిరిపోసుకోదు.ఇలాంటి తపనలోంచే కవయిత్రిలోని కళాత్మక సౌందర్య దృష్టి ఆశావహ దృక్పథంతో బయటపడుతుంది.

     నిజం చెప్పాలంటే- శిలలో నీళ్ళున్నా,భౌతిక ఆచ్ఛాదనతో కూడిన స్పర్శలేనితనం ఉంటుంది.దీనిని అనుభూతించడానికే కాని, ఆస్వాదించడానికి వీలుపడని జడత్వస్పర్శ మనిషిని నిర్జీవుణ్ణి చేస్తుంది.సజీవమైన మనుషుల మనస్తత్వాల్లో కూడా ఈ నిర్లిప్తతతో కూడిన జడత్వం అంతర్లీనంగా ప్రవహిస్తుంటుంది.కాబట్టే స్పర్శలేనితనం ఒక ప్రధాన జీవలోపంగా పరిగణింపబడుతుంది.ఇది అంతరాంతర మనసు పొరలను మౌనస్పర్శతో స్పృశిస్తూ, సేదతీరేటప్పుడు శిలల మౌన సంభాషణతో సాంత్వన పొందే ఉల్లాసభరిత క్షణాలను దగ్గర చేస్తుంది.హృదయ పులకింతతో గుండెచప్పుడులోని మౌనసంభాషణతో, కరడుకట్టిన భావాలను సైతం సున్నితంగా స్వీకరిస్తూ జీవితాన్ని ఆస్వాదమయం చేస్తుంది.ఈ ధ్వని తీవ్రతను తెలియచెప్పడానికే కవయిత్రి లహరి ఈ సంపుటికి ” స్పర్శ లేని శిల “గా నామకరణం చేసి పాఠకులకు మరింత ప్రీతిపాత్రమయ్యారు.కాబట్టే కవిత్వానికి ఉండే సాంద్రత,తీవ్రత,గాఢత,మార్థవం ఇందులో అక్షరాలుగా ధ్వనించి అలరించాయి.

     ఇక ఈ సంపుటి విషయానికి వస్తే, కవిత్వంతో ఉప్పొంగే జీవన సందర్భాలు,సన్నివేశాలు కుప్పలుతెప్పలుగా అక్షరాల్లో ఆవిష్కృతమౌతాయి.వీటి భావ పరంపరలను ఆమె మాటల్లోనే వాక్యాల రూపంలో తడిమే ప్రయత్నం చేద్దాం.

     ” అలల ముఖంతో నవ్వుతూ ” , ” వేకువజామున నిశ్శబ్ద రెక్కల చప్పుళ్లతో ” , ” శిశిర బాధలన్నీ రాలిపోయాక ” , ” వర్ణించలేని దృశ్య కావ్యమై కాంతులీనుతుంది ” , ” సుప్తావస్థలో చిగురు శిశువు ” , ” రైతు ఆశలను పలకరించిన నేలతల్లి ” , “నేల పొత్తిళ్లలో నీటి జోల ” , ” అలిగి చెదిరిన అక్షరాలని ” , ” చీకటిని వెంటాడే మిణుగురులు ” , ” స్వేద బిందువులతో కళ్లాపి చల్లి ” , ” అశాంతి నిప్పులు కురిపిస్తున్న చోట ” , ” నాలోని నీకు వేవేల వందనాలు ” , ” సలపరిస్తున్న గాయాల మధ్య ” , ” చైతన్య జ్వాల రణ నినాదమై ” , ” గోడలు సైతం మెరుస్తూ మురిసిపోతాయి ” , ” ఆమె నవ్వితే / మా ఇంట్లో పూలతోటలు విరబూస్తాయి ” , ” నిండు జాబిలి కమ్మిన మబ్బుల్లా ” , ” కన్నీళ్ళతోనే మనసును కడుగుతున్నా ” , ” గుదిబండలై దేహాన్ని కుదిపేస్తున్నాయి ” , ” అస్తమించని రవికిరణాలమై పోరాడుదాం ” , ” పసిమొగ్గ పువ్వై పరిమళించాలని ” , ” పిల్ల కాలువల్లా కలిపేసుకుంటూ ” , ” బీదోడి గొంతులో గరళాన్ని నింపుతూ ” , ” గుండెల నిండా ఊపిరులూదుతుంటాయి ” , ” రూపం లేని ఆకలికి ” , ” కమ్మటి పసితనపు వాసనలెన్నో ” , ” గాయాల్లోంచి ఉద్భవించిన వాక్యాలను ” , ” ఇంద్రధనస్సు రంగుల్ని వెదజల్లుతోంది ” , ” కన్నీరు కురవని మేఘాలు వాళ్లు ” , ” అణువణువునా మట్టి రేణువులనడుగు ” , ” ఈ నేల ఎగిరిన మువ్వన్నెల పతాకం ” , ” మది కలువల కొలను ” , ”  తనువు తంగేడుపూలు పూసేది ” ,  ” అక్షరం అమ్మలా పిలుస్తోంది ” , ” చిరుజల్లుల్లో మెరుస్తున్నాడు ” , ” కొన్ని చేతులు కొత్త రెక్కల్ని తొడిగి ” , ” నా దేశపు ఆకలిని తీర్చడానికి / అన్నం సృష్టించే యంత్రాన్నవుతాను ” , ” మట్టి దుప్పటి కప్పుకున్న మేను ” , ” కన్నీళ్లు ఇంకిపోయిన చెరువులో ” , ” ఆకాశం వేచి చూసే వెన్నెల నేను ” , ” కృష్ణ పక్షపు తిమిరం ” , ” కండువాలు కప్ప గెంతులేస్తూ ” , ” చూపుడువేలుకి చురకలు పెడుతున్నాయి ” , ” నది తీరాన ఇసుక అక్రమార్కుల కొంగు బంగారమైంది ” , ” కళ్ళలో వెలుగుతున్న ఆశాజ్యోతులు ” , ” విష సంస్కృతి పిడికిళ్ళలో ముడుచుకుపోయింది ” , ” ప్రశ్న చితి మంటలా జ్వలిస్తుంది ” , ” హరివిల్లు రంగుల్ని అద్దుకుంటూ ” , ” అమానవీయం రాజ్యమేలుతోంది ” , ” వేవేల అశ్రు బిందువులను రాల్చుకుంటూ ” , ” ఓ నిశ్శబ్ద ప్రపంచం ఉట్టిపడుతోంది ” , ” పరిగెత్తే కాలం సైతం / మా మధ్య ప్రేక్షకురాలిగా మారిపోతుండేది ” , ” అంతర్జాలమే ఒక ఇంద్రజాలం ” , ” చీకటితో దోబూచులాడే జీవితాల్లో / వికసించే తొలిపొద్దు పుష్పాల్లా ” , ” నాలో కొత్త ఊహలు / ఊసులుగా ప్రవహిస్తుంటే ” , ” ఊరి నిండా ఒంటరితనాలు ” , ” నిశ్శబ్దంలో విషాద స్మృతులుగా ” , ” ఏకాకితనంలో నిట్టూరుస్తున్న మనసు ” , ” కన్నీటి తడి అంటిన మాటలు ” , ” చికిత్సతో గాయపడిన ఈ దేహానికి ” , ” ఈ నేలతో మళ్ళీ యుద్ధం చేస్తాయి ” , ” కాలం జోకొడుతుంటే ” , ” శూన్యం ఆవహించిన క్షణాల్లో ” , ” వెలుతురు లేని ఈ చీకటి క్షణాల్లో ” , ” జ్ఞాపకాల తడిలో కొట్టుకుపోయే మా మనసులు ” , ” ఎముకల గూడు కట్టుకున్న మా బతుకుల్లో ” , ” కడిగి బోర్లించిన పాత్రలా / మనసు ఖాళీ అయిపోయింది ” , ” విషాద తలపుల్ని మొస్తోంది ” , ” ఈ దేహం / గాయపడ్డ ఒక శిశిర ఋతువు ” , ” మాటకీ మౌనానికి మధ్య / బతుకు దూరాన్ని కొలుస్తోంది ” , ” ప్లాట్లుగా విడిపోయిన నేలతల్లి / పగిలిన అద్దంలా చిట్లిపోయింది ” , ” గుండె చెరువై కట్టలు తెంచుకుంటుంది ” , ” మనసు దిగులు మొహంతో మూలుగుతుంటుంది ” , ” చెట్టు కింద సేదతీరే చల్లని సాయంత్రాలు ” , ” వెలుగులు నింపే తొలి అడుగులయ్యాయి ” వంటి కవితాత్మక స్పృహ నిండిన వాక్యాలు మనసులను రసార్ద్రభరితం చేస్తాయి.

     ” ఉరితాడుతో ఊసులు ” , ” శీతల హృదయచంద్రుడు ” , ” ఉన్మత్త వేషం ” , ” ఔషధతుల్యం ” , ” రాతి హృదయాల్లో ” , ” విషాదపాత్ర ” , ” దారి దీపమయ్యావు ” , ” మనసులో నక్షత్రాల్లా ” , ” అక్షర దండయాత్ర ” , ” దిష్టిబొమ్మ సమాజాన్ని ” , ” హృదయ సంద్రం ” వంటి పదబంధాలు సాహితీలోకానికి కొత్త చూపునిస్తాయి.

     కవితా శీర్షికల్లో విలక్షణత ఈ కవయిత్రి మనసును అద్దం పట్టిస్తాయి.వీటిలో ” మది తడిపిన వేదన ” , ” జ్ఞాపకాలను వెదుక్కుంటూ ” , ” జ్ఞాన తరువులు ” , ” ఎగిరే రెక్కలు ” , ” శిల కాదు శిరసు వంచు ” , ” మాట మరిచిన అడుగు ” , ” రెప్పచాటు దృశ్యం ” , ” శిశిర దేహం ” , ” ఉప్పెనలోంచి ప్రవాహంగా ” అతి ముఖ్యమైనవి.

     లహరి కవిత్వంలో వేగంతోపాటు కవిత్వవాక్యాలు ఇంకా బలంగా,లోతుగా,సరళ భాషతో ఆకలింపు చేసుకుని,మరింత రాటుదేలాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను.

      ఇలా చెప్పుకుంటూ పోతే కాలంతో పోటీపడే జీవన్మరణ సమస్యలు కవిత్వంతో పోటీపడుతూ ఈ సంపుటి నిండా పోటెత్తుతాయి.వీటిని ఆస్వాదించి,ఆదరించి,అక్కున చేర్చుకునే బాధ్యత వర్థమాన కవయిత్రి ఎన్.లహరితోపాటు మనందరిపై ఉంది.ఈ రీతిలో సరికొత్త అడుగులతో కాలానికి కొత్త చూపునిచ్చే దిశగా ఆమెతోపాటు అంతా సమిష్టిగా ప్రయాణం చేద్దాం.

                           * * *      * * *       * * *

మానాపురం రాజా చంద్రశేఖర్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *