జీవితం ఒక పుష్పమైతే
ఫణిమాధవి కన్నోజు కవిత్వం ఒక పూలవనం
జీవితం అగ్నికీలల అంతరంగమైతే
ఫణిమాధవి కవిత్వం ఘూర్ణిల్లే బడబాగ్ని జీవితమే పగబట్టిన పామైతే
ఫణి కవిత్వం పడగమీద ధగద్ధగాయమానమైన మణి
జీవితం యుద్ధరంగమైతే
ఫణి కవిత్వం సామభేద ఆయుధాల ప్రయోగం
*
ఆకాశంలో సూర్యుడు ఒక్కడే.
నేలమీది మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో సూర్యుడు
కోట్లాది సూర్యుళ్ళు భూగోళంపై
సముద్రం ఒక్కటే. కోట్లాది కెరటాలు. దాని ఘోషే కవిత్వం.
ఇంతవరకూ, ఏ ప్రపంచభాషల్లోకి ఎవరివల్లా అనువాదం కానిది సాగరఘోష.
హృదయంలో నిద్రపోని ఘోష- స్త్రీని కడలితో పోల్చారు.
కవిత్వంలోని, ప్రతి పదంలోని భావం ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా అర్ధమవుతుంది.
నాలుగు రోడ్ల కూడలిలో ఒక ఆకారాన్ని నిలబెడితే, అది నాలుగువైపుల నుండి వచ్చేవారికి నాలుగు రకాలుగా అర్ధమవుతుంది.
ఆవిధంగా- బహుముఖీన కవిత్వాలు, బహువ్యాఖ్యానాలకు ఆవాసాలు
అవుతాయి.
ఫణిమాధవి కవిత్వం కనబడని అంతర్గత అగ్నిపర్వతం.
*
అగ్నిపర్వతం అనగానే మానవ మనుగడకు సంబంధించిన ఎన్నో కథనాలు గుర్తుకువస్తాయి. అందులో- ఒకానొక పురాగాధనం. పురాణకాలం దాటి వచ్చిన వాస్తవ కథనం.
నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఓ కొండ వుంది. శతాబ్దాల క్రితం మహర్షులు ఆ కొండని, ఇంకా బద్దలవని అగ్నిపర్వతంగా కనుకున్నారు. అది పేలితే ప్రళయం సంభవిస్తుంది. కనుక, అది అగ్నిపర్వతమనీ, పేలితే ప్రమాదమనీ, దూరంగా వెళ్ళి ఆవాసాలు ఏర్పాటు చేసుకోమని చెప్పినా, ఎవరూ వినరు.
మరేం చెయ్యాలి?
ప్రకృతిలోని ప్రతి అంశం ప్రతీకల మయమని వారికి తెలుసు. ఆ రోజుల్లో శాస్త్రజ్ఞులను కూడా మహర్షులుగా పరిగణించేవారు.
ఏ విధంగానైనా ప్రజలను రక్షించాలనే వుద్దేశంతో భక్తిమార్గాన్ని ఎంచుకుని ఆ కొండని దేవుని నిలయంగా మార్చారు. ఇది- యితర దేవాలయాలకు భిన్నమైనది. కొండకిందా, పైనా రెండు విభాగాలుగా కలగలిసివున్న మహాదేవాలయం. కొండకింద శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేంచేసి వున్నారు. పైన పానకాల స్వామి.
శిఖరంపై వున్న దేవాలయంలో విగ్రహం వుండదు. నోరు తెరిచినట్లు వుండే ఒక పెద్ద రంధ్రం- మహాబిలం వుంటుంది. ఆ బిలమే పానకాల స్వామిగా ప్రతీతి.
ఆ అగ్నిపర్వతం బద్ధలైతే- నిప్పుల మంటల లావాతో ప్రళయం మొత్తం బూడిద చేస్తూ ప్రవహిస్తుంది. దానికి విరుగుడుగా బిందెలతో బెల్లం పానకం ఆ బిలంలో పొయ్యమని మహర్షులు సూచించారు. అప్పటినుండి- ప్రజలు అగ్నిపర్వతాన్ని శాంతింపజెయ్యడానికి బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించుకోవడం జరుగుతూ వస్తున్నది.
ఇంతకుముందు- ప్రకృతి ప్రతీకల మయమని చెప్పడం జరిగింది. ప్రతీకలను తెనిగిస్తే, లోని విషయాలు స్పష్టంగా అర్ధమవుతాయి.
అగ్నిపర్వతం పైని మహాబిలం స్త్రీకి ప్రతీక అయితే, స్త్రీ తిరగబడకుండా పానకం- పురాణ పాతివ్రత్య గాథలను సాంప్రదాయంగా పూస్తూ వుంటాడు- ప్రతీక పురుషుడు.
దాదాపుగా అర్థశతాబ్ది క్రితం- అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధమైంది- అదే మహోద్యమం.
ఫణిమాధవి కవిత్వం ఆ అగ్నిపర్వతం అంతరంగంలో ఓ భాగం.
**
సామబేధ కవిత్వాల్లో వాక్య నిర్మాణమేగాక, భావనల నిర్మాణంలో కూడా సరిహద్దులు దాటిన వాక్యాలు కొన్ని వున్నాయి. అంటే- మామూలుగా వూహలకు అందని వాక్యాలన్నమాట.
శీర్షిక- ‘నేనొక నిద్రను కలకంటున్నా’-
“సీతాకోకల రంగుల కోసమో
ఎగిరే రెక్కల కోసమో కాదు
కల యిచ్చే మెలకువకై
మెలకువ నింపే వేకువకై
ఓ మెలకువకై
నా కలపై నాకే హక్కనే వేకువకై
నేనొక నిద్రను కల కంటున్నా”-
ఈ పదాలు పైకి మామూలుగా కనిపిస్తాయి. కానీ, ఈ పదాల్లోని భావాలు వాస్తవ అధివాస్తవ రేఖలు దాటి మార్మిక అభివ్యక్తిలోకి ప్రవేశించినట్టనిపిస్తాయి.
‘నే కనే కలపై నాకు హక్కు వుందనే ఎరుకకై, కలకోసం నిద్రను కలగంటాను’ అనడం- హక్కుల గురించిన ఆలోచనలో ఒక నూత్న కోణాన్ని ప్రవేశపెట్టినట్లు అనిపిస్తుంది.
హక్కు అనేది ఒకటే అయినా, స్థాయీభేదాల్లో రూపాలెన్నో వుంటాయ్. వ్యక్తిగా-స్వేచ్ఛాజీవిగా, కోరే ఓ హక్కు, సంసారంలో సమానత్వం కోసం ఓ హక్కు, సమాజంలో మనుగడకై ఓ హక్కు, రాజకీయరంగంలో పౌరహక్కు- యిలా ఎన్నో పోరాడి తెచ్చుకోవలసిన హక్కులు. మనిషి పుట్టిన దగ్గర్నుంచి మరణించేవరకు మనుగడ జరిగే పెనుగులాటలోంచి పుట్టిందే హక్కు. ఈ మానవహక్కు అనేదొకటి వున్నదనే స్పృహ లేని కోటానుకోట్ల జనం బతుకును యీడుస్తూ బతికేస్తున్నారు.
మరో స్థాయిలోనిదే మరో హక్కు- నిద్రలో కలలో ఆమడ దూరంలో అందీ అందని హక్కు. ఆ కలపై తనకు హక్కు వున్నదనే ఎరుకకై, ముందుగా ఓ నిద్ర కోసం కల కనడం. ఇదే- మార్మిక మానసిక స్థితి.
శతాబ్దాల క్రితం భారతదేశంలో మాతృస్వామ్యం అమల్లో వుండేది. వ్యవసాయం మొదలు సంసార వ్యవహారాలన్నీ స్త్రీయే నిర్వహించేది. ఆర్యులు ప్రవేశించాక పురుషస్వామ్యం విజృంభించి, స్త్రీ ని భౌతికంగా, మానసికంగా
అణగదొక్కడం ప్రారంభమైంది. సాంప్రదాయమైంది. ఆచారమైంది.
అలవాటయింది. రక్తమాంసాల స్త్రీ వ్యక్తిత్వం నీడగా మారింది.
క్రమంగా- తన అస్తిత్వం- తాను తనుగా, తన వూపిరిని తనే పీల్చే హక్కు గురించిన ఆలోచన యీ కవిత- ‘నేనొక నిద్రను కలకంటున్నా’లో అద్భుతంగా వ్యక్తమైంది.
“ఔను
నేను ఖండించలానుకుంటున్నా”
ఓ కవితా శీర్షిక. పచ్చినిజాలపై ఓ ప్రకటన.
“దేశమా
ఏం చేస్తున్నావ్
ఎందుకు చట్టం కాటికాపరి వేషం వేసింది ఎందుకు
న్యాయాలయాల్లో న్యాయం కరువైంది
ఎందుకు
నిజాలన్నీ చితిలో కాలి బూడిదవుతున్నాయ్
దేశమా
నువ్వేం చేస్తున్నావ్
మేం చూస్తున్నాం
రోజురోజుకీ పెచ్చరిల్లుతున్న
నీ మూఢాంధ రాజకీయాల
వికృతరూపాన్ని
మేం నిరసిస్తున్నాం
మేం ఖండిస్తున్నాం
మొదట్లో సమాజాభివృద్ధి కోసం పరిపాలనా ప్రయాణ సాధనాలుగా గుర్రాలుండేవి. క్రమంగా వాటి స్థానంలోకి గాడిదలొచ్చాయి. తరువాత, మరింత అభివృద్ధి సాధించామని పాలకులు డప్పులు కొట్టుకుంటూ, ప్రచారంలో రొమ్ములు విరుచుకుంటున్నప్పుడు కొయ్యగుర్రాలొచ్చాయి. అభివృద్ధి సమాజానికి గాక, తమకే ముందు జరగాలని, తమకు జరిగితే, సమాజానికే జరిగినట్లు భావించాలని సమాజానికి గంతలు గట్టారు. తొండలు ముదిరి ఊసరవెల్లులైనై. ఎన్నికల ప్రహసనంలో- ప్రజలను కొనబడే ఓటర్లుగా, ఎన్నికల్లో గెలిచినవారినీ కొనేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజకీయాన్ని వ్యాపార మార్కెట్గా మార్చి, పాలకులు నియంతలైనారు. ఇది ఒక్కరోజులో జరగలేదు.
భారతదేశానికి స్వాతంత్ర్యం అర్ధరాత్రి వచ్చింది. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి కాలంలో రోజులు ప్రశాంతంగానే కొనసాగాయి. శ్రీమతి ఇందిరాగాంధీ గారు వచ్చాక, న్యాయస్థానం ఆమె ఎన్నిక చెల్లదన్నాక, ఆమె దేశంపై ఎమర్జెన్సీ విధించింది. ప్రతిక్షణం నాయకుల్నేగాక, దేశంలోని ఆలోచనాపరులందర్నీ అరెస్ట్ చేయించి జైళ్ళలో కుక్కింది. మొత్తం దేశాన్నే ఒక పెద్ద జైలుగా మార్చేసింది. ప్రజాస్వామ్యం పేరుతో పోలీసు రాజ్యం తీసుకువచ్చింది. కోర్టులు, ప్రచారమాధ్యమాలు, అన్ని వ్యవస్థల గొంతు నొక్కేసింది.
రాజ్యాంగం, పార్లమెంటు, శాసనసభలు, చట్టాలు, నియమనిబంధనలు, సాంప్రదాయాలు, హక్కులు మొదలైనవాటినన్నింటిని తన కాళ్ళకింద నొక్కిపెట్టింది. తన మాటే చట్టం అన్నట్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వికటాట్టహాసంతో తనలోని నియంతను బయటకు తీసుకువచ్చింది. పాలనలో, సమాజంలో విలువలన్నింటినీ ధ్వంసం చేసింది.
ఆ తరువాత వచ్చిన పాలకులు, ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వం ఎలా కొనసాగించాలో ఆమె నుంచి నేర్చుకున్నారు. దేశాన్ని దోచుకోవడం ప్రారంభించారు. ప్రజలను బతకలేని స్థితికి తీసుకొచ్చారు. ఆత్మహత్యలు పెరిగినై. సుదూరంలో కూడా వెలుగు కనబడని అంధకార రాజకీయాలు దేశాన్ని చుట్టుముట్టినై.
ఇటువంటి సందర్భంలోనే-
‘చట్టం కాటికాపరి వేషం వేసింది. నిజాలన్నీ చితిలో కాలి బూడిదవుతునన్నాయ్’
ఇవి- ఫణిమాదవి ప్రవచనకర్తవలె చెప్పిన విలువైన వాక్యాలు.
ఇవి-శిలాక్షరాలవంటి పచ్చినిజాలు
ఇవి-వర్తమాన కవిత్వం స్థాయిని పెంచే వాక్యాలు
ఇవి- కవిని తపస్విని చేసే వాక్యాలు.
*
1965లో- నేను- ప్రభుత్వ అసమర్థ పరిపాలన సహించలేక, ఆగ్రహంతో నిరసన తెలిపే ‘దిగంబర కవితోద్యమం తీసుకువచ్చాను.
ఇది- స్వాతంత్ర్యానంతరం సాహిత్యంలో వచ్చిన మొట్టమొదటి ఉద్యమం. దీనిద్వారా మరో ఐదుగురు కవులును పరిచయం చేశాను. మూడు కవితా సంపుటాలు ప్రకటించాను. అప్పటి స్థబ్దతపై విరుచుకుపడిన తుఫాన్. ప్రజలు ఉద్వేగంతో ఆహ్వానించిన ఉప్పెన.
ఆ సమయంలో ఒకరో, యిద్దరో కవయిత్రులను కూడా పరిచయం చేద్దామని తీవ్రంగా ప్రయత్నించాను. కాని, ఆరోజుల్లో రచయిత్రులు కథలు, నవలలు, రాసేవారు. కవిత్వం వైపు వచ్చేవారు కాదు.
1980లో ఒక దుస్సంఘటనపై వూహించని విధంగా నారీలోకం స్పందించింది. మహిళోద్యమం ప్రారంభమైంది. కవితారంగంలో చిన్న మంటవలె అంటుకుని కార్చిచ్చువలె వ్యాపించింది. ఒక్కరు కాదు, యిద్దరు కాదు. దేశమంతా వందలమంది కవయిత్రులు కలం పట్టారు. అణగదొక్కబడిన గొంతులు నిర్భయంగా లేచినై, చాలాకాలం తరువాత, తమ బాధలు, గాథలు ఘంటారావం వలె వినిపించాయి. ఆధునిక కవిత్వానికి రంగూ రుచీ పరిమళాలు అద్దాయి. ఈ లోతైన అంశాలు స్త్రీలు మాత్రమే రాయగలరు అనేంతగా తమ అంతరంగంలోని ఆలోచనలు, వూహలు, ధైర్యంగా అభివ్యక్తీకరించారు. మహిళోద్యమం ప్రధానంగా మాతృస్వామ్యం, పితృస్వామ్యం మధ్య ప్రవేశించిన అసమానత్వంపై తిరుగుబాటు ప్రకటించిన ఉద్యమం.
దీని తరువాత- దళిత, మైనారిటీ, ప్రాంతీయ ఉద్యమాలొచ్చాయి. ఆధునిక సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఐతే, స్త్రీ, పురుష సంబంధ బాంధవ్యాలు కొనసాగినంతకాలం మహిళోద్యమం తాత్కాలికంగా ఆగినట్లు కనబడినా, తిరిగి ఎప్పుడో మరో కోణంలోంచి పుంజుకునే అవకాశం వుంది.
ఫణిమాధవి కవిత్వాల్లో మహిళోద్యమంలోని అంశాల ప్రస్తావన వున్నప్పటికీ, ఆమె సార్వత్రిక కవయిత్రి కూడా అయి వుండడం వల్ల- ప్రధానమైన రాజకీయ రంగం ఎంత వికృతంగా మారిందో నిర్భయంగా తెలియజేస్తోంది.
‘చట్టం కాటికాపరి వేషం వేసింది. నిజాలన్నీ చితిలో కాలి బూడిదవుతున్నాయ్”
ఈ వాక్యాలు మేధావుల కళ్ళు తెరిపిస్తే, సంతోషమే.
హిందువుల దేవుళ్ళు దేవతలు 33 వేలమంది అని పెద్దలు లెక్క వేశారు.
జీవన విధానంలో పాటించవలసిన విలువలు పూజనీయమని భావిస్తూ, ప్రతి అంశానికొక దేవుణ్ణి ప్రతిష్టించారు. ఎంతటి పరీక్షా సమయంలోనైనా సరే సత్యమే పలకాలనే నిబంధనను సూచిస్తూ- ‘సత్యనారాయణ’ దేవుణ్ణి వ్రత రూపంలో పూజించవలసిందిగా నిర్దేశించారు.
ఆధునిక కాలంలో- కోర్టుల్లో, బోనులో నిలబడి ‘సాక్ష్యాదారులు’- ‘నిజమే చెబుతాడు’ అని ప్రమాణం చేస్తారు. ఎలక్షన్లలో గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసి, పార్లమెంటు, శాసనసభల ప్రాంగణంలోకి సభ్యులుగా ప్రవేశిస్తారు.
ప్రతి సందర్భంలో నిజం విజయవంతమైందనే అనుకుంటాం. కాని, నీడ- నిజం నీడగా అబద్ధం ప్రవేశిస్తుంది. ఎక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుందో అక్కణ్ణుంచి అబద్ధం నిజాన్ని వెంటాడి హత్య చేస్తుంది. అబద్ధం సత్యం దుస్తుల్ని ధరిస్తుంది. ‘నిజం’గా చెలామణి అవుతుంది.
కవితా శీర్షిక- ‘సత్యం వధ’
‘పొగకి నిప్పక్కర్లేదు
అంటుకోవడానికి గాలీ వీచక్కర్లేదు
నాలిక పైన పుట్టే ప్రతీ అబద్ధం
పులికంటే ముందు తోకతో పునరుత్థానం!!
నోట్లో అమంగళ స్నానమాడి
నిజం కంటే అందంగా ముస్తాబై
సమాజపు పందిరిపైకి ప్రాకి
అవాస్తవాల జిలుగులతో
వల్లెక్కమ్ వందే జగద్గురుమ్
ఇప్పుడిక
నిజానిది నిత్యపోరు!
మన దేశంలో స్త్రీ స్థానం చిత్ర విచిత్రంగా వుంటుంది. రెండు భిన్నమైన పార్శ్వాలు గల స్థానాలలో మనుగడలో వుంటుంది. ఒకవైపు పూజనీయ భరతమాతగా దైవస్థానంలో వుంటుంది. మరోవైపు ఆచరణలో, మగజంతువు కామం తీర్చే వుత్తి తిత్తి- శరీర అవయవంగా మారిపోతుంది.
‘అమ్మ’- ఎవరికైనా సరే- పూజనీయ స్థానంలో వుంటుంది. ఎవరైనా తన తల్లిని తిడితే హత్యలు జరుగుతాయి. అదే సమయంలో విచిత్రంగా అన్ని ప్రపంచ భాషల్లో తిట్లు అమ్మతోనే ప్రారంభమవుతాయ్. ఇద్దరి మధ్య, లేక రెండు వర్గాల మధ్య ఏ రెంటి మధ్యనైనా వాడూ వీడూ, వారూ, వీరూ- తిట్టుకునే సమయంలో- అమ్మని తీసుకొస్తారు. ‘లం. కొడకా’ అంటారు. యింకాస్త దాటి- ‘నీ అమ్మని దెం…’ అని యిష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు. మంటలు లేస్తాయ్, హత్యలు జరుగుతాయ్.
కొందరు కామం తీర్చుకోడానికో, కసి తీర్చుకోడానికో సామూహిక మానభంగాలు చేస్తారు. వయసుతో సంబంధం లేకుండా పసిపిల్లలను కామానికి బలిచేస్తారు. మొగ్గలను చిదిమేస్తారు.
మన దేశం కామపీడితుల దేశం. సైకోల దేశం. తాగుబోతుల దేశం. తాగుడు ఆదాయం మీద ప్రభుత్వాన్ని నడిపే దేశం. నిజానికి సరిగ్గా అర్ధం చేసుకుని సేవిస్తే మద్యం అమృతంతో సమానం. గొప్ప భావాలు సృష్టించే శక్తినిచ్చే పానీయం. సృజనాత్మక కార్యక్రియాత్మక మూలాల్లోకి ఉత్సవంగా తీసికెళ్లే వైభోగం, జీవనంలోని యాంత్రికకు కాసేపు విరామమిచ్చే సమయం.
కానీ- చదువుకున్నవారు, సంస్కారవంతులనుకునేవారు, పెద్ద పెద్ద ఉద్యోగాలో, వ్యాపారాలో చేసేవారు కూడా- తాగినప్పుడు, చీకట్లో రోడ్డు పక్కనో ధ్యాసలో లేనప్పుడో మూత్ర విసర్జన చేస్తే అర్థం చేసుకోవచ్చు. మరి- విమానంలో పక్కనున్న మహిళ మీద ఉచ్చపొయ్యడం ఎలా అర్థం చేసుకోవాలి?
శీర్షిక- ‘ఎడారి శోకం’
”ఈ దు:ఖ ఎడారిలో
అశృగీతాల్నెప్పుడూ ఆలపించొద్దనుకున్నా
సీసంతో నిండిన చెవులున్న లోకంలో శ్రోతలెవరు?
వాడు
కామసర్పమై కర్కశ కోరలతో
కనిపించిన ప్రతి కుసుమంపై
కాలకూటాన్ని స్థలించే పనిలో!
ఎవడు
గుండెలేని అష్టావక్రుడో
ఎవడు
సర్పముఖుడై కామోన్మాద జ్వరపీడితుడై
సంచరిస్తున్నాడో
ఆమెకేం తెలుసు
తెలిస్తే
ఓ ఆయేషా అవుతుందా
ఓ నిర్భయగా పేరు తెచ్చుకుంటుందా
ఓ ఆసిఫా అయి తనువు చాలిస్తుందా
ఓ ప్రియాంకై ఆహుతవుతుందా
ఓ మానసై కనుమరుగవుతుందా
అవుతుందా బలైపోతుందా???
బేటీ బచావో
వాడికి
బేటీ హఠావోగా వినిపిస్తుందా?
సృష్టి గీతానికి
తుదివాక్యం లిఖిస్తున్న
ఈ మానసిక కాలుష్యాలకు అంతమెప్పుడు?
సృష్టిలో మానవజాతి మాత్రమే కాదు మొత్తం ప్రకృతి అంతా పరంపరలో మనుగడ సాగిస్తోంది. ఆ పరంపరకు ఆధారభూతమైనది స్త్రీ. పురుషుడు కార్యకారకమైనప్పటికీ, పురుషుణ్ణి సృష్టించేదీ స్త్రీయే. జగజ్జనని అన్నారు స్త్రీని. అటువంటి జననికి నవమాసాలు, ప్రసవప్రళయార్ణవం దాటడం మరోజన్మ. కాలక్రమంలో పురుషుడే స్త్రీకి వెయ్యబడ్డ శిక్షగా మారాడు.
కవిత శీర్షిక- ‘ఓ స్త్రీ పగటి కల’
కర్ణభేరిని పీల్చేస్తున్న గర్భసంచి గోడల్లో
విస్ఫోటనాల ప్రతిధ్వనులు
మనుషుల్ని కన్న మాలాంటి తల్లులమేనా
ఆ కఠినశిలలకూ ప్రాణం పోసింది
రోదనలే రౌద్రంగా మార్చేసి
మెలి తిప్పుతున్న పేగుల్నే నడికట్టుగ కట్టేసి
నరాల్లో పొంగే లావానే లాలాజలంగా మార్చేసి
నా జాతి మొత్తం ఒక్కసారి తుపుక్కున ఉమ్మేస్తే
ఆ వరదలో ఆ అమానవులంతా కొట్టుకుపోతే!!
జన్మనివ్వగల జాతిలో పుట్టిన నేరానికేనా ఈ రాక్షస శిక్ష!?
ఇక ముగింపుగా-
‘సామభేద’ జన్మంతర తొలి ఝాములో కదలాడే కవిత ఒకటి వుంది. చిలికి పాలలో, వెన్నలో కలగలిసిన కవిత, మిధునాంతరమో, మధనాంతరమో హృదయాంతరాళాల్లో సంగీత సమ్మేళనం ప్రారంభమయ్యే సంరంభంలో వినిపించే, మధురమైన అలజడి కురిపించే కవిత.
అదే- ‘ప్యారా గ్రాఫిక్స్!’
కోకిల గొంతు సవరించుకునే సమయం అన్ని ఋతువులూ ఏకమయ్యే వేళ సృష్టికి ప్రతిసృష్టినీ ధ్వనికి ప్రతిధ్వనినీ సృష్టించే పారవశ్య ధ్యానంలో-
నిజంగా ముందు తెలియదు నువ్వుంటే ఇదనీ నువ్వంటే ఇలా ఉంటుందనీ
అల్లంత దూరాన నువ్వు ఇక్కడ నేను ఉంటూనే మనంలా వుడటం ఏమిటో ఈ దూరం తలెగరేస్తోంది మనం కలవమని అదే మన దగ్గర అతిదగ్గర చేస్తోందని దూరానికెప్పటికీ తెలియదు
నీవా సుదూర తీరం నుంచీ వేవేల అనురాగాల చేవ్రాలై నా చుట్టూ పరిభ్రమించే కాంతి వలయమై నాలోలోపలి నీరవ నిశీధిని మాయం చేయటం ఓ అరుదైన అద్భుతం. నేనంతా నీలో వేడుకై నీ వూహే నాలో ఉత్సవమై ఋతుమారని వాసంతమయ్యా! ఓహ్ అసలు నువ్వెవరు నాలో దాగిన ఇంకో నీవా!? నాకై మారిన నా వూపిరివా!?
ఫణిమాధవి కన్నోజు కవిత్వం రేగిన, చెలరేగిన తేనెతుట్టె లాంటిది. తేనెటీగలు వెంటాడి తీవ్రంగా కుట్టగలవు. బొట్లుబొట్లుగా మధురిమనియ్యగలవు. ఈ సంపుటికి బంగారు భవిష్యత్తును ఆశిస్తాను.వెనువెంటనే మరో కొమ్మకి మరొక తేనెతుట్టెకై ఎదురుచూస్తాను. ఆసక్తిగా ఆహ్వానిస్తాను.
హైదరాబాద్, 13.01.2023