దర్భశయ్య

Spread the love

ఫణిగిరి గ్రామ మొగదల్లోని దేవుని మాన్యంలో ఇండ్లు వేసుకున్న వాళ్ళల్లో ఒకరు ప్రాణం మీది కొచ్చి అమ్మజూపితే “ పశువులకన్న పనికొస్తుందిలే” అనుకున్న సూరయ్య పది ఏండ్ల కిందనే కొనిపెట్టున్నాడు.
సూరయ్య కిప్పుడు డెబ్భై ఐదు ఏండ్లు. అయిదు ఏండ్ల కిందట భార్య గౌరమ్మ అకస్మాత్తుగా పోయింది.
భార్య పోయిన ఆరు నెల్లకే కొడుకులు ముగ్గురూ కూడబలుక్కుని అతన్ని తీసుకుపోయి ఊరి చివరి గుడిశపాలు చేసి పట్టించుకోవడం మానేశారు.
వాళ్ళేమో పాత ఊరులోని డాబా ఇంటిని మూడు భాగాలుగా మల్చుకుని, తల్లి దండ్రులు సంపాదించిపెట్టిన పది ఎకరాల చెలకను సమంగా పంచుకుని, ఎవరి బతుకు వాళ్ళు హాయిగా బతుకుతున్నారు. భార్య వున్నప్పుడు దొర మాదిరిగా బతికిన సూరయ్య ఈ ఐదు ఏండ్లల్లో మానసికంగా, శారీరకంగా కుంగిపోయాడు. ఐనప్పటికి తను ఏనాడు కొడుకుల ఇండ్ల కెళ్లి ఒక ముద్ద పెట్టమనిగాని, ఓ రూపాయి ఇమ్మని గానీ అడిగినోడు కాదు. తనే ఇంత ఉడకేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు.
ముసలితనం భూజాల మీద పందెం గుండై బాధిస్తుంటే తిన్నప్పడు తింటు, లేనప్పుడు కాళ్ళు కడుపులో పెట్టుకుని పడుకుంటూ రోజులు వెళ్లదీస్తున్నాడు. కొడుకులు, కొడళ్లు ఎప్పుడో ఒకసారి చుక్క తెగిపడ్డట్టు అట్లా వచ్చి, ఇట్లా వెళ్ళి పోతారు తప్ప పట్టించుకున్న పాపానపోరు.
ఓ రోజు రేకలు పారంగ లేచిన ఆ వీధిలో వాళ్ళంతా ఎప్పటి మాదిరిగానే పొలం పనులకు వెళ్లాల్సిన ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. అదే సమయంలోనే సూరయ్య పెంపుడు కుక్క ఇంటి చుట్టూ తిరుగుతూ మోర పైకెత్తి గుండెలు జలదరించేలా రోదించ సాగింది.
కుక్క ఏడుపు విన్న ఇరుగు పొరుగు వాళ్ళంతా “ఛీ పాడు కుక్క, పొద్దు పొద్దున్నే అట్ల ఏడుస్తుందెందో!?” అనుకుంటూ అదిలించసాగారు. ఎన్ని సార్లు, ఎంతమంది అదిలించినా అది ఇంటి చుట్టూ తిరుక్కుంటూ ఇంట్లోకి, బైటికి వచ్చిపోతు ఏడుస్తూనేవుంది. చివరికి “కుక్క ఇంతగనం గోలచేస్తున్నా ముసలోడు కుయ్యిలేడు, కయ్యిలేడేంది?” అనుకుంటూ ఇరుగు పొరుగు వాళ్లు సూరయ్య గుడిశ ముందుకెళ్ళి తలుపు తట్టబొయ్యేసరికి అది ఒరగా తెరుచుకునేవుంది.
“ఇదేంది! తలుపు తీసేవుంది?” అనుకుంటూ లోపలికి తొంగి చూసిన వాళ్ళకి నేల మీద వెళ్లికింతలా పడుకున్న సూరయ్య కనిపించేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ “ఇదేంది! ముసలోడేందో తేడాగా కన్పిస్తున్నాడు?” అనుకుంటూ తలుపులు బార్లా తెరిచి, వరి మడి దుగానికి బుంగ పడ్డట్టు జల జలా లోపలికి జొరబడ్డారు. జొరబడ్డ వాళ్ళు, జొరబడ్డట్టే ముసలాయన చుట్టూ మూగి గుస గుసగా చెవులు కొరుక్కోసాగారు. ఆ వీధిలోనే వుండే ఊరు సర్పంచ్ నాగరాజుకి విషయం తెలియజేశారు. దాంతో ఆయన వెంటనే అక్కడి కొచ్చాడు.
సూరయ్య దగ్గరికెళ్ళి వంగి చూసిన సర్పంచ్ “అరే! అంతా చిత్రంగా వుందే!” అనుకుంటూ బయట కొచ్చిన అతను ఓ యువకుని దిక్కు చూస్తూ “అరే కోటన్నా! నువ్వు ఎమ్మటే సైకిల్ ఏసుకొని పొయ్యి వాళ్ళ కొడుకుల్ని పిల్చుకురాపో” అంటూ పురమాయించాడు.
అప్పటికే వాళ్ళకు తెలిసినట్టుంది “బో..బో..” మని ఏడ్చుకుంటూ రానే వచ్చారు.
వాళ్ళను చూస్తూనే ముఖాలు అసహ్యంగా పెడుతూ జనమంతా పక్కకు తప్పుకుని దారిచ్చారు.
వాళ్ళంతా సూరయ్య శవం మీదపడి ఏడ్వసాగారు.
అప్పుడే వచ్చిన కాపోళ్ల నారాయణ “అరే ముసలోడు నిన్న పొద్దున మా ఇంటి కొచ్చి “అల్లుడా! సిత్పాలా పండ్లు మక్కబెట్టుకోవాల, ఇంత ఎండు గడ్డి కావాలంటే, ఇంటిఎననక వామి కాడికి బొయ్యి ఎంత గావాల్నో అంత కట్టకపో అన్నా. ఇందుకు తెచ్చుకున్నడా!? నేల మీద పరిచివున్న గడ్డి దిక్కు చూసి విస్తుబోతూ” అన్నాడు.
అక్కడున్న వాళ్ళంతా “ఔనా!?” అన్నట్టు నారాయణ దిక్కు చూశారు.
“మనుండంగ ముసలోనికి ఎవ్వరన్న పిడికెడు మెతుకులు పెట్టలేదుగాని, ఇయ్యాలేమో మీద బడి మాలావు ఏడ్పు ఏడుస్తున్నా రెందుకయా? ఆగండ్రి!” అంటూ గద్దించాడు సర్పంచ్ నాగరాజు.
బ్యాటరీ స్విచ్ ఆపేసిన ఆట బొమ్మల మాదిరిగా ఏడుస్తున్న వాళ్ళంతా ఠక్కున ఆగి పక్కకు జరిగారు.
సరిగ్గా అప్పుడే వచ్చిన కుమ్మరి ముత్తమ్మ “ఓ నాయినో.. నాయినా! నువ్వు నా ఇంటి కొచ్చింది ఇందు కోసమేనా నాయినా” అంటూ శోకాలుతీస్తూ ఏడవసాగింది.
“ఎందుకోస మొచ్చిండు!?” ఆవిడ చుట్టూ వున్న వాళ్ళంతా విస్తుపోతూ అడిగారు.
“మూడు రోజుల కింద మా ఇంటికొచ్చి, ఇంట్లే నీళ్ల పట్వ పల్గిపోయింది బిడ్డా! చిన్న బిందెడు నీళ్ళు పట్టే పట్వ ఒకటి, దాని మీదికి రెండు మూకుళ్లు గూడ ఇయ్యమన్నడు. నిజమేగదానుకొని తీసిచ్చిన. బేరం గూడ చెయ్యకుంట చెప్పినంత ఇచ్చి కొంచ బోయిండు. తలగోరు కుండ, ఇంటి కాన్నుంచి కాష్టం దాంక తిక్కెట్ల పెట్టకపొయ్యే నిప్పు కోసం ఒకటి, తలాపున దీపంతెకు ఒకటి మొత్తం రెండు మూకుల్లు తీసుకున్నడు. ఆ ఇకమతు నాకు తెల్వక పాయే నాయినా!” అంటూ మళ్ళీ ఏడ్పు అందుకుంది ముత్తమ్మ.
“బడితెలు, మొద్దులేమన్న వున్నయేమో సూసొద్దాం” అనుకుంటూ ఇంటి వెనక్కి పోయిన మాదిగ ఇంగలయ్య ఒక్కసారిగా విస్తుబోతూ ఇంటి ముందరున్న సర్పంచ్ దగ్గరికొచ్చి “ఓ పటేలా! ఆ పెద్దమన్షి ఎన్నాళ్ల నుంచి ఈ పయత్నంల వున్నడో గాని, పాడెగట్టనికి, కాడు పేర్చనికి కావాల్సిన కట్టెల్ని గూడ ఇంటి ఎనక అద్ద బేర్సి వుంచిండు. మొన్నా మద్ధెన ఎందుకో అటు మా గూడెం దిక్కొచ్చిండు. ఏందే సిన్నాయినా! ఎన్నడు లేంది! ఇటుదిక్కొస్తివెంది!? అంట అడిగితే, ఏం లేదు బిడ్డా! నీకోసమే పున్కులాడుకుంటా వచ్చినన్నడు.
నేను గూడ ఎమ్మటే ఎందో సెప్పరాదురి అంటి. దాని కాయిన ఎంలేదు బిడ్డా! మీ అమ్మ పోయినంక ఈ ఐదు ఏండ్ల పొద్దు ఒక్కనాడన్న కడుపు నిండ తిన్నది లేదు. కంటి నిండ పన్నదిలేదు. ముందు ముందు ఏ రోజు ఎట్లుండునో ఏమో చెప్పలేను. నేను పోయిన రోజు ఇంటి ముందటి కొచ్చిన మీరు, మీ కట్నం పైసల కోసం నా కొడుకులతోటి పంచాతి పడుడు నాకిస్టంలేదు. అందుకే ఇగో నాకాడ ఈ మూడు వేలున్నై తీసిపెట్టుకో. వీటికి తోడు వాళ్ళు మన స్పూర్తిగా వాళ్లెంతిస్తే అంత తీస్కోని నా సావు చేసి పోండ్రి బిడ్డా! నేను బతికినంతకాలం ఈ మాట మనిద్దరిమద్దెన్నేవుండాల అనుకుంట బలవంతంగా నా చేతిల పైసలు పెట్టిండు ఇందూకేనేమో!” అంటూ చెప్పుకొస్తుంటే విన్న అక్కడి మనుషులంతా “అయ్యో అట్లనా!?” అన్నట్టు చూస్తూ గుంపులు గుంపులుగా ఇంటి వెనక్కి వెళ్లారు.
ఇంతలో తను కట్టుకున్న గళ్ళ లుంగీని తన్నుకుంటూ వచ్చిన దూదేకుల లాల్ సాహెబ్ “ఓ మామా! నేను కానలేకపోయినగాని, నువ్వింత పనిజేస్తవని అనుకుంటే నిన్ను తప్పకుంట కాపాడుకుందును గాదే మామా!?” అంటూ తల మీది టోపీని తీసి నోటికి అడ్డం పెట్టుకొని పెద్దగా ఏడవసాగాడు.
“అర్రే! నికేమైందివయా? నువ్వెందుకేడుస్తున్నవ్?” విస్తుపోతూ అడిగాడు సర్పంచ్ నాగరాజు.
“పగులల్లా అయ్యోరి కుంటల చాపల కోసం పునుకులాడే కొంగలన్ని మాపటిజాము రెక్క వాలంగనె మా ఇంటి ముందున్న చింత చెట్టు మీద వాలి, తెల్లవార్లు ఒకటే గోల సేస్తుంటై. వాటి రెట్టల వాసనకు ఇంట్ల వుండేటట్టు లేకుంట అయ్యింది. దాంతోటి ఈటూరు నుంచి జింకలోళ్లను పిలిపిచ్చి, చెట్టును కొట్టిస్తుంటే యాన్నుంచో మెల్లగ నా కాడికొచ్చిన సూరయ్య మామ “అల్లుడా! నాకీ చింత చెట్టు కర్ర గావాల అమ్ముతవా? అంట అడిగిండు. నీకెందుకే అంటే? బత్కమ్మ పండుగకు ఆడపిల్ల లిద్దరు వస్తున్నరు. ఇంట్లే చూస్తే నేమో పూసిక పుల్ల గూడ లేదు. చెట్టు మొత్తం ఎంతకిస్తవో చెప్పమన్నడు. ఆ సమయంల నేనో మాటన్న అంతే ఇంగ మల్ల బేరం గూడ జెయ్యలే. ఎమ్మటే అడిగినంత లెక్కబెట్టిండు. ఈటూరోళ్ళ తోటే తుంటలు కొట్టిచ్చి ఇంటికి మోపిచ్చక పొయ్యిండు. ఇందుకోసమని నా కేమెర్క?”చిన్న పిల్ల వాని మాదిరిగా ఏడవసాగాడు లాల్ సాహెబ్.
ఎప్పుడొచ్చాడో వచ్చి నేరుగా ఇంట్లోకి పొయ్యి సూరయ్య శవాన్ని చూసొచ్చి జనంలో కలిసిపోయి నిలబడి లాల్ సాహెబ్ చెప్పిందంతా విన్న చౌక డిపో డీలర్ బిల్ల మల్లారెడ్డి సర్పంచ్ దిక్కు చూస్తూ “నిన్న గాక మొన్న మా దుకాణం కాడికొచ్చి, అయ్యా! పండు గొస్తుంది. బిడ్డలు, అల్లుళ్లు, మానవలు, మానవరాళ్లు ఆందరొస్తున్నరు. ఎట్లనన్న జెసి ఒక కింటా బియ్యం ఇయ్యరాదంటూ గీసులాడిండు. ఎన్నడూ నోరు తెరిసి అడగని పెద్ద మన్షి ఆడిపిల్లలు పండక్కొస్తున్నరని అడిగిండుగదాని ఇస్తి. ఎమ్మటే పైసలు దీసి లెక్కబెట్టిండు. నే నే ఆ బియ్యాన్ని రెండు మూటలు గట్టిచ్చి, సాకలోళ్ల చంద్రన్న బండి మీద ఇంటికి పంపిస్తి. లోపట ఆ కింటా బియ్యం రెండు మూటలు గోడెమ్మటి అట్లనే నిలబెట్టి కనబడుతున్నై” గొంతు రుద్దమౌతుంటే చెప్పుకొచ్చాడు.
తిర్మలగిరిల సౌదాల దుకాణం బెట్టి, ఫణిగిరి నుంచి రోజూ పొయ్యొచ్చే తులసి రామనర్సయ్య శేట్ కి సూరయ్య ముచ్చట తెలవగానే వచ్చి “అయ్యో! ఎంతపనాయే? ఇటువంటి ముచ్చట ఇంతవరకు ఎక్కడ కనలే, ఇనలే! మూడు రోజుల కిందట ఎర్రటి ఎండల బడి తిర్మలగిరి మా దుకాణం కాడికొచ్చి మామిడిపెల్లిల నా సడ్డకుడు సచ్చిపోయిండు. దానం జెయ్యనికి కావల్సిన సరుకులన్నీ కట్టియ్యమని కూసుంటే ఎమ్మటే కట్టిచ్చిన. కానీ, మనుసుల ఇంత కత పెట్టుకొని వచ్చిండని తెల్వకపాయే. ఎంత ఇజ్జత్ గల్లోడు, ఎంత నియ్యతిగల్లోడు ఎంకత!? లోకం మీద జర్గని ముచ్చట ఇయ్యల్ల మనూల్లెనే మొదటిపాలి చూస్తున్నం. బ్రహ్మం గారు చెప్పింది ఏది గూడ ఇంత పొల్లు పోకుంట జర్గుతనేవుంది. మనం ఈ పాపపు కండ్ల తోటి చూస్తనేవున్నం. ఈ చెవులతోని ఇంటనే వున్నం. ఇంకెన్ని ఇచ్చిత్రాలు చూడవల్సి, ఇనాల్సివున్నమో ఏమో?” కంఠం పూడుకుపోతుంటే గుటకలు మింగుతూ సర్పంచ్ తో చెప్పుకొచ్చాడు.
ఇంతలో లోపలికి పొయ్యొచ్చిన బట్టు సోమరాజు “ముసలోడు తలాపున మూకుడు నిండ ఆముదం బోసి, అందుల బొటనేలు లావున సక్కగ ఒత్తి దాల్చి ఏసి, ముట్టిచ్చి పెట్టుకుండు. ఇగ ఆ ఆగ్నేయం దిక్కున పొయ్యిల రెండు చింత ముడ్సులకు నిప్పంటిచ్చి వుంచిండు.
గడ్డిని పరుపు లెక్క మంచిగ పర్సుకుండు. దాని మీద దుప్పటేసిండు. ఆ దుప్పటి మీద ఎల్లికింతల పన్నోడు పన్నట్టే కదలకుంట, మెదలకుంట పానం ఇడిసిండు. ముసలోల్లైనంక అయ్యవ్వలను పట్టిచ్చుకోని కొడుకులు, బిడ్డలకు కర్రు గాల్చి వాతపెట్టినట్టు చేసి, చరిత్రల నిల్చిపొయ్యే సావు సచ్చిండు” అంటూ సర్పంచ్ తోని తన మనసులోని గోసనంతా చెప్పుకొచ్చాడు.
“ముసలోడు మనను నడి బజార్ల బరి బాతల నిలబెట్టినట్టు చేసిపోయెగదా?” అనుకుంటూ సూరయ్య కొడుకులు, కోడళ్లు పిల్లా జెల్లల్తో పాటు ముఖాలు నేల కేసి చూస్తూ కూర్చుండి పోయారు.
ఇంతలో పట్నం నుండి పెద్ద బిడ్డ, బోనగిర్ నుండి చిన్న బిడ్డ వాళ్ళంతా ఒకే బస్సులో స్టేజ్ దగ్గర దిగి, అక్కణ్ణుండే ఆలగోడు బాలగోడుగా ఏడ్చుకుంటూ వస్తుంటే, “వీళ్లకెప్పుడు?ఎట్లా తెల్సింది? ఇంత పొద్దున్నే కల్సొస్తున్నరు?” అనుకుంటూ ఇంటి ముందు గుమి గూడిన జనమంతా గుస గుసలు సాగారు.
అల్లుళ్ళిద్దరు లోపలికెళ్ళి చూసొస్తే, బిడ్డలు మనవళ్లు, మానవరాళ్ళు అంతా లోపలేవుండిపోయారు.
“ఈ ముచ్చట మీ కేవరు చెప్పారు?” అల్లుళ్ళిద్దరి వంకా చూస్తూ అడిగాడు సర్పంచ్ నాగరాజు.
“రాత్రి ఒంటి గంటకు ఎవరో ల్యాండ్ ఫోన్ నుంచి మా నెంబర్ కి ఫోన్ చేసి ‘మీ మామ సూరయ్య ఇంతకు ముందల్నే తిర్మలగిరి సర్కార్ దవాఖానల కాలం జేసిండు. మీరంత తెల్లారిపాటికి సక్కగ ఫణిగిరికే రాండ్రి!” అనుకుంట ఫోన్ పెట్టేసిండు.
ఇగ మేం, పొద్దుగాల మూడు గొట్టంగ పట్నంల ఫస్ట్ బస్సెక్కి భోనగిర్ చేరేటప్పటికి మా సడ్డకుడోళ్ళంత బస్టాండ్ కొచ్చి మా బస్సులనే ఎక్కిండ్రు. ఆ ఫోన్ల మతలబ్ నమ్మాలో? వద్దో గూడా మాకు అర్ధం గాలేదు. మేం ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా బామ్మర్ధులు ఫోన్లే ఎత్తలేదు. దాంతోటి ఇగ మేము ఏదైతే అదే ఐతదని బయల్దేరొచ్చినం.
ఇదంతా చూస్తాంటే, ఆ సమయంల అట్లా మాకా ఫోన్ చేయనికి ముసలాయన ముందల్నే ఎవలకో పైసలిచ్చి ఏర్పాటు చేసినట్టుంది? లేకపోతే ఆ రాత్రి మీద అట్లా మాకు ఫోన్ ఎవరు? ఎందుకు చేస్తారు? అసలేం జరిగిందో ఆ దేవునికే ఎరుక, సచ్చిపోయిన మా మామకే ఎరుక” అంటూ చెప్పుకొచ్చాడు పెద్దల్లుడు. ఇంతలో.. ఏ కార్యానికైనా పాటికి పదిసార్లు పిలిస్తేనే గాని రాని నర్సయ్య పంతులు రావడం చూసిన సర్పంచ్ తో సహా అక్కడున్న వాళ్ళంతా పక్కకు తప్పుకుని దారిచ్చారు.
నిశ్శబ్దంగా లోపలికెళ్లి చూసిన పంతులు, నేరుగా సర్పంచ్ దగ్గరికొచ్చి “ఎప్పుడు మా ఇంటికి రాని సూరయ్య నాలుగు రోజులకింద పొద్దున్నే వచ్చి కాస్సేపు అదో ఇదో మాట్లాడినంక ‘మీతోటి ఒక పనిబడి వచ్చిన్నయ్యా! అంటే ఏందో చెప్పమన్న. దానికతను ‘నాకాడ ఐదు వేల రూపాయలున్నై, జర వాట్నీ మీకాడ వుంచురి. నా బతుకు ఏసైమంల ఎట్లుంటదో? ఏరే వాల్లు అక్కరకు పైసలు గావాల్నంటే ఎమ్మటే ఇస్తరో? లేదో? తెలవదు. మీకాన్నయితె ఎప్పుడంటే అప్పుడు నమ్మకంగా దొరుకుతై అనుకుంట, నేను ససేమిరా ఎంత వద్దన్నా వినకుండా నాచేతిల పైసలు పెట్టి పోయిండు. ఇప్పుడిదంతా జూస్తుంటే అతను కావాలనే నా దగ్గర ఆ పైసలు పెట్టి పోయినట్టుగా అర్ధమైతుంది!” అంటూ నిశ్శబ్దంగా కన్నులను కమ్మెస్తున్న చెమ్మను పై మీది తువ్వాలతో ఒత్తుకున్నాడు.
పంతులు చెప్పడం ముగించగానే అప్పటిదాకా అక్కడ నిల్చున్న గొల్ల కోటయ్య సర్పంచ్ ముందుకొచ్చి “అయ్యా! ఈ సూరయ్య తాత రెండు నెల్ల కింద పనిమాల మా మేకల దొడ్డి కాడి కొచ్చి బిడ్డా! రెండు మేకపోతులకు ఎన్ని పైసలైతయంటా అడిగిండు.
సుమారో పాతిక వేలు ఐతుండొచ్చు అన్ననో లేదో ఎమ్మటే రొండిన దోపుకున్న పంచ చెంగులో కట్టి వుంచిన నోట్ల కట్టను బైటికి తీసి, నా చేతిలో పెట్టి తొందర్లనే మా ఇంట్లో ఉప్పలమ్మ పండగ జరుగబోతుంది, అప్పుడు ఎవరో ఒకరొచ్చి అడిగి నప్పుడు రెండు పోతుల్ని ఒప్పజెబ్దువుగాని అన్నడు. అది ఇందుకేనేమో” స్వరం జీరబోతుంటే చెప్పుకొచ్చాడు.
ఎట్లా తెలిసిందో గాని! తిర్మలగిరి నుంచి పోలీసులొచ్చి “ఏంది సర్పంచ్ సాబ్! ఇక్కడెవరో ముసలోడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది నిజమేనా?” అంటూ అడిగారు.
“ఆత్మహత్య గాదు పాడు గాదు. తను డెబ్బై ఐదు ఏండ్ల ముసలోడు. ఈ మధ్య ఒంట్లే మంచిగుండట్లే. రాత్రి పన్నోడు పన్నట్టే హార్ట్ ఎటాక్ వచ్చి పోయిండు. ఉరి బోసుకోలేదు పాడులేదు. అట్లని ఏదన్నా పురుగుల మందు గూడ తాగలేదు. నిజంగ పురుగుల మందు తాగితే ఇల్లంత మందువాసనోస్తది గదా? ఆదే గాకుండ మందు తాగినోడు కక్కుకుంటడు, కిందపడి కొట్టుకుంటాడు. అక్కడ అటువంటి జాడేలేదు. ఎట్లపన్నోడు అట్లనే కట్టెసర్శక పోయినట్టు అయిపోయి కదలక మెదలక పండుకొని పానమోదిలిండు” అంటూ చెప్పుకొచ్చాడు సర్పంచ్ నాగరాజు
అతని మాటలు విన్న పోలీస్ లిద్దరూ లోపలికెళ్లి చూసొచ్చి “చూడండ్రి సర్పంచ్ సాబ్! ఆ ముసలోడు కప్పుకున్న దుప్పటి తీసి చూస్తే, పక్క మీద ఈ డబ్బుల కట్ట వుంది. లెక్కపెట్టి చూడండి ఎంతుందో? ఏమో” అంటూ సర్పంచ్ చేతికి అందించారు.
సర్పంచ్ వెంటనే లెక్కపెట్టి చూస్తే పాతికవేలున్నాయి. ఆ ముచ్చట విన్న ఊరు ఊరంతా విస్తుబోయి చూస్తుంటే “అబ్బా! మనిషంటే అట్లా బతికి చావాలే సర్పంచ్ సాబ్! మరి మేం పోతున్నం గాని అసలా ముసలోడు ఎట్లా చచ్చుండొచ్చునంటారు?” అంటూ మరోసారి తమ పోలీస్ సందేహాన్ని వ్యక్తం చేశారు పోలీసులు .
“ఎట్లా అంటే ఏంజెప్పాల? ఎవ్వరికి భారం గాకుండా సచ్చిపోవాలనుకున్నాడేమో?! అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకొని ఆ దర్భశయ్య మీద పడుకుని, ప్రాణ దీపం ఆరిపోయిం దాకా అట్లనే ఊపిరి బిగబట్టిండు గావచ్చు” తను ఊహించిన మేరకు వివరించిన సర్పంచ్ నాగరాజు పోలీసులను పంపించి, ఊరి వాళ్ళ దిక్కు చూస్తూ “ఇగ కార్యక్రమాలు మొదలు పెట్టండయ్యా!” అన్నాడు.

సిరంశెట్టి కాంతారావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *