రాధారాణి

Spread the love

రాధారాణి

రచన : శరత్ చంద్ర చటర్జీ

తెలుగు : బొల్లిమంత శివరామ కృష్ణ

సవరణ, నిర్వహణ : కె. కుమార్

చాలా కాలంనాటి సంగతి. సత్యేంద్రనాధ చౌదరి ఒక జమీందారు బిడ్డ. బి.ఏ. ప్యాసయి యింటికి వచ్చేటప్పటికి “ఆ పిల్ల, సరిగ్గా లక్ష్మిలాగ వుంది, ఒకసారి వెళ్ళి నీ కళ్ళతో చూచిరా నాయనా!” అన్నది తల్లి.

సత్యేంద్ర తలకాయ తిప్పుతూ “వద్దమ్మా ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోను. చేసుకుంటే పరీక్ష పాస్ కాలేను” అన్నాడు.

“ఎందుకు పాస్ కాలేవు? కోడలు నా దగ్గర

వుంటుంది. నీవు చదివేది కలకత్తాలో. పెళ్ళి మూలాన నీ చదువుకేమీ అడ్డు వస్తుందో నాకేం అర్థం కావటం లేదు” అన్నది తల్లి.

“ఎలాగైనా వీలుండదమ్మా! ఇప్పుడు నాకు పని ఉంది, వెళతాను” అని బైటికి వెళ్ళబోతూవున్న సత్యేంద్రను తల్లి మళ్ళా పిలిచి “ఒక్క మాట వినిపో నాయనా! నేను వారికి మాట యిచ్చాను. నా మాట దక్కించవా?” అన్నది.

సత్యేంద్ర వెళ్ళబోయినవాడల్లా ఆగి కొంచం అసంతృప్తితో “నన్నడగాపెట్టకుండా వారికెందుకు మాట ఇచ్చావు అమ్మా!” అన్నాడు.

ఈ మాట విని తల్లి మనసులో చాలా బాధపడింది.

“ఏదో నావల్ల పొరపాటు జరిగింది. కాని నీవు నా మాట దక్కించక తప్పదు. అదీకాక ఆమె తండ్రి లేని బిడ్డ, చాలా ధీనురాలు. నా మాట విని వప్పుకో నాయనా!” అన్నది.

“అయితే, మళ్ళా వచ్చి మాట్లాడతాను” అని సత్యేంద్ర బైటికి వెళ్ళిపోయాడు. తల్లి చాలాసేపటి వరకు మెదలకుండా అక్కడే నుంచున్నది. అతను ఆమెకు ఒక్కగానొక్క బిడ్డ. భర్త పోయి ఏడెనిమిదిదేళ్ళయింది. పాపమా విధవ తల్లే ఈ ఏడెనిమిది సంవత్సరాల నుంచీ గుమస్తాల సాయంతో జమిందారీని నిర్వహిస్తూ వచ్చింది. కొడుకు కలకత్తాలో కాలేజీలో చదువుతున్నాడు. ఈ జమీందారీ వ్యవహారాలలో అతనికి జోక్యమే లేదు. కొడుకు ప్లీడర్ పాసయిచ్చిన తర్వాత పెళ్ళి చేసి జమీందారీ భారమంతా కొడుకూ

కోడలినెత్తిన వుంచి తను నిశ్చింతగా వుందామనుకున్నది ముసలి తల్లి. ఈలోగా వివాహం చేసి కొడుకు వున్నత విద్యకు అడ్డు కల్గించననుకున్నది కూడా. కాని మధ్యలో ఆమె వుద్దేశం మారింది.

భర్త చనిపోయిన తర్వాత ఈ ఏడెనిమిదేళ్ళలో వారింట శుభకార్యాలంటూ ఏమీ జరగలేదు. ఆ రోజున ఏదో వ్రతమని వూరందరినీ విందుకు పిలిచారు. స్వర్గీయ అతులచంద్ర ముఖర్జీ పేద యిల్లాలు కూడా తన పదకొండేళ్ళ కుమార్తెను వెంటపెట్టుకు వచ్చింది. సత్యేంద్రుని తల్లికి ఆ పిల్ల చాలా నచ్చింది. కేవలం అందమే కాకుండా ఈ చిన్న వయసులోనే వినయ విధేయతలు, సద్గుణాలు కూడా ఆమెలో మూర్తీభవించి వున్నాయని రెండు మాటలలోనే గ్రహించింది.

అబ్బాయికి పిల్లని చూస్తే ఎందుకు నచ్చదో తర్వాత చూస్తాను అనుకున్నది మనసులో.

మర్నాడు ఉదయాన వంటింట్లోకి భోజనానికి వచ్చి చూచినప్పుడు సత్యేంద్రుడు స్తంభించిపోయాడు. అతనికి వేసిన పీటకు ఎదురుగా వంటినిండా నగలతో వైకుంఠ లక్ష్మీలాగ ఆ పిల్ల కూర్చుని వుంది.

తల్లి కూడా వంటింట్లోకి వచ్చి “కూర్చుని భోంచెయ్యి నాయనా!” అన్నది.

సత్యేంద్రునికి ఒకసారి మత్తు వదిలినట్లనిపించింది. కొంచంసేపు తచ్చట్లాడి “ఇక్కడెందుకు? నేనింకెక్కడైనా అవతల కూర్చుని భోంచేస్తానులే” అన్నాడు.

తల్లి చిరునవ్వుతో “నిజంగా నీకేం పెళ్ళి

చేయబోవటం లేదులే. ఈ చిన్నపిల్ల ముందు నీకంత సిగ్గేందుకు!” అన్నది.

“నాకు ఎవరిముందూ సిగ్గులేదు” అని సత్యేంద్ర అసంతృప్తితోనే ఎదురుగా పీట మీద కూర్చున్నాడు. తల్లి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సత్యేంద్ర రెండు నిముషాలలో ఏదో విధంగా భోజనం ముగించుకుని లేచి వెళ్ళిపోయాడు.

బైట గదిలోకి వెళ్ళి చూచేటప్పటికి స్నేహితులొచ్చి కూర్చుని పేకఆట ప్రారంభించారు. అతను వచ్చీ రావడంతోనే అయిష్టత కనపర్చుతూ “నాకు తలనొప్పిగా వుంది” అని ఒక మూలకు వెళ్ళి పండుకున్నాడు. స్నేహితులకి చాలా ఆశ్చర్యం కలిగింది. చేతులు తక్కువయ్యేటప్పటికి పేక తీసివేసి

చదరంగం పరచారు. సాయంత్రం వరకు అనేక ఆటలు ఆడారు. అనేక పందాలు వేశారు. అనేక చర్చలు జరిగినాయి. అనేక ప్రసంగాలు వచ్చాయి. కాని సత్యేంద్ర అక్కడ నుంచి లేచి ఎవరు ఓడారు, ఎవరు గెల్చారని అడగటంగాని వారి సంభాషణలలో పాల్గొనడంగాని జరగలేదు. ఇవ్వాళ ఇవేవీ అతనికి పట్టలేదు.

స్నేహితులంతా వెళ్ళిపోయిన తరువాత సత్యేంద్ర లేచి తిన్నగా పడకగదిలోకి వెళ్ళబోతూండేప్పటికి తల్లి వంటింట్లోంచి చూచి “ఇప్పటినుంచి పడుకోటానికేనా వెళ్ళేది” అన్నది.

“పడుకోటానికి కాదు, చదువుకోటానికి వెళుతున్నాను. ఎం.ఏ. చదువు అంటే సామాన్యపు చదువు కాదు. నిమిషం పాడు

చేయడానికి వీలుండదు” అని సత్యేంద్ర గబగబా గదిలోనికి వెళ్ళిపోయాడు.

అరగంటయినా అతను ఒక్క పేజీ కూడా చదవలేకపోయాడు. పుస్తకం తెరచి ముందు టేబులు మీదపెట్టి, పడక కుర్చీమీద కాళ్ళారజాపుకు కూర్చుని ధ్యానంతో పైకప్పు కేసి చూస్తున్నాడు. అకస్మాత్తుగా అతని ధ్యానం చెదిరి పోయింది, ‘ఘల్లు’మని మోత వినపడింది. చెవియొగ్గి విన్నాడు. నిమిషం సేపటికి మళ్ళా ‘ఘల్లు-ఘల్లు’మన్న శబ్దం వినిపించింది. లేచి కూర్చున్నాడు. ఆపాదమస్తకం ఆభరణాలు ధరించిన లక్ష్మీ స్వరూపిణి మెల్లమెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వచ్చింది. కోమల స్వరంతో “అమ్మ మీ ఉద్దేశం కనుక్కురమ్మన్నది” అన్నది.

సత్యేంద్రుడు కొంచెంసేపు మెదలకుండా వుండి “ఎవరమ్మ?” అని అడిగాడు.

“మా అమ్మ” అన్నది పిల్ల.

దీనికేమీ సమాధానం దొరక్క సత్యేంద్ర కొంచెంసేపు ఆగి “మా అమ్మనడుగు” అన్నాడు.

పిల్ల గదిలోంచి వెళ్ళబోతూండేప్పటికి చొప్పున “నీ పేరేమిటి?” అని అడిగాడు సత్యేంద్ర.

“రాధారాణి” అని చెప్పి వెళ్ళిపోయింది.

ఆ చిట్టి రాధారాణి మీదనుండి  బలవంతాన ఆలోచన మరల్చి, సత్యేంద్ర ఎం.ఏ. ప్యాసవటానికి కలకత్తా వచ్చాడు.

విశ్వవిద్యాలయ పరీక్షలన్నీ ప్యాసవందే వీలైతే ఆ తర్వాత కూడా ఎలాంటి పరిస్థితులలోనూ పెళ్ళి చేసుకోవద్దని అతను నిశ్చయించుకున్నాడు. సంసార చిక్కుల్లో పడితే మానవుని ఆత్మగౌరవం నాశనమౌతుందని ఇలాంటివి ఇంకెన్నో అతనికి తెలియని కారణాలు మనసులో మెదులుతున్నాయి.

ఎప్పుడైనా, ఎక్కడైనా ఏ స్త్రీ ముఖమైనా కనపడితే దానివెంట మరో చిన్న ముఖం ఉన్నట్టుండేది. చిన్న ముఖం పెద్ద ముఖాన్ని కనిపించకుండా కప్పేస్తూ వుండేది. ఈ విధంగా అతను ఎంత ప్రయత్నించినా ఆ చిన్న ముఖాన్ని మర్చిపోలేకపోయాడు.

అతనెప్పుడూ స్త్రీలయందు ఉదాసీనభావంతో వుండేవాడు. కాని

అకస్మాత్తుగా ఏమి జరిగిందో ఏమో, ఇప్పుడు దారిలో యెక్కడైనా ఏ వయసు పిల్ల కనిపించినా ఆమెను కళ్ళారా చూడాలనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా ఆ వైపు చూస్తూ అకస్మాత్తుగా సిగ్గుతో అతని శరీరమంతా పులకరించినట్లు చప్పున మొహం తిప్పేసుకుంటున్నాడు.

సత్యేంద్ర కి ఈత అంటే చాలా యిష్టం. అతని ఇంటికీ, గంగానదికీ అట్టే దూరం లేకపోవడం వల్ల అతను తరచు జగన్నాథ్ రేవుకు స్నానానికి వెళుతూ వుంటాడు.

అవ్వాళ రేవు దగ్గర పౌర్ణమి జనం గుమికూడివున్నారు. రేవు దగ్గరకు వచ్చి తను రోజూ పొడి బట్టలు పెట్టి స్నానానికి వెళ్ళి వరియా బ్రాహ్మడి వద్దకు వస్తుండేప్పటికి నలుగురైదుగురు ఒక వైపుకు

వింతగా చూస్తున్నారు. తన దృష్టిని కూడా అటే ప్రసరించాడు. చూచీ చూడటంతోనే ఆశ్చర్యంతో స్తంభించిపోయాడు. అతనంతవరకు ఏ స్త్రీలోనూ ఇంత అందం చూడలేదనిపించింది. వయసు పద్ధెనిమిది, పందొనిమిది ఏళ్ళ కన్న ఎక్కువ వుండదు. ఓ మామూలు నల్లంచు చీర కట్టుకుంది. ఒంటిమీద నగలేమీ లేవు. మోకాళ్ళ మీద కూర్చుని నిశ్చలంగా నొసటతిలకం పెట్టించుకుంటూ వుంది. బ్రాహ్మడు ఏకాగ్రచిత్తంతో ఆమె నొసట తిలకం పెడుతున్నాడు.

సత్యేంద్ర దగ్గరకు వెళ్ళి నుంచున్నాడు. బ్రాహ్మడు అతన్ని బాగా ఎరుగును. సత్యేంద్రుని వల్ల అతనికి మంచి దక్షిణలు ప్రాప్తిస్తుండటం మామూలు కాబట్టి ఆ చంద్రముఖి నుండి ధ్యానం మరల్చి తిలకం

పెడుతున్నవాడల్లా వదిలి బాబుగారి బట్టల కోసం చెయ్యి జాపాడు.

ఇద్దరి చూపులు కలిసినై. సత్యేంద్ర తొందర తొందరగా బట్టలు బ్రాహ్మడి చేతికిచ్చి గబగబా మెట్లు దిగి నీళ్ళలోకి వెళ్ళాడు. కాని ఇవ్వాళ ఈదటానికి మనస్కరించక ఏదో విధంగా స్నానం ముగించుకొని బట్టలు మార్చుకునేందుకు పైకి వచ్చి చూచేసరికి ఆ రూపసి అక్కడ లేదు.

ఆ రోజంతా సత్యేంద్రుని మనసు ‘గంగా గంగా’ అని అలమటించింది. మర్నాడు తూర్పు తెల్లవారకముందే అతన్ని గంగమ్మతల్లి ఆకర్షించింది. గబగబా దణ్ణెం మీది తుండు గుడ్డ పైన వేసుకొని గంగా నదికి బయలుదేరి వెళ్ళాడు.

రేవుకు వెళ్ళి చూచేటప్పటికి ఆ రూపసి అప్పుడే స్నానం చేసి పైకి వస్తూ వుంది. సత్యేంద్రుడు గబగబా స్నానం చేసి బ్రాహ్మడి వద్దకు వచ్చేటప్పటికి ఆ రూపసి నిన్నటిలాగే నొసట తిలకం పెట్టించుకుంటూ వుంది, ఇవ్వాళ కూడా చూపులు కలిశాయి. ఇవ్వాళ కూడా అతని శరీరమంతటా పులకలు పరుగులెత్తినాయి. అతను త్వరత్వరగా బట్టలు మార్చుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

******

ఆమె ప్రతిరోజూ పొద్దున్నే స్నానానికి వస్తుందని తెలుసుకున్నాడు సత్యేంద్రుడు. ఇంతవరకు ఇద్దరికీ సాక్షాత్కారం కాకపోవటానికి తను ఆలస్యంగా రావటమే కారణమనుకొన్నాడు.

నది ఒడ్డున ఈ వారం రోజులనుంచి ఎడతెగకుండా ఒకరి చూపులు ఒకరికి కలుస్తూనే వున్నాయి. కానీ ఇంతవరకు ఒకరికొకరు పన్నెత్తి పలుకరించుకొనే అవకాశం లేకపోయింది. కళ్ళతో సంభాషణ జరిగేచోట నోరు మౌనంగా ఊరుకోవటం సహజం. ఆ అపరిచిత రూపసి ఎవరో తెలియదు గాని కళ్ళతో సంభాషించే విద్య మాత్రం బాగా అభ్యసించింది. ఆ విద్యలో ఆమెకు మంచి పాండిత్యం కూడా వుందని సత్యేంద్ర గ్రహించాడు.

ఆ రోజున అతను గంగా నదిలో స్నానం చేసి పరధ్యానంతో ఇంటికి వస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా “ఒక మాట వింటారా” అన్న పిలుపు వినబడింది. తలెత్తి చూచేటప్పటికి ఆ రూపసి రైల్వే లైను పక్కగా నుంచుని

వుంది. ఆమె ఎడమ చంకను ఒక చిన్న నీళ్ళ బిందె కుడి భుజం మీద తడి చీరలు వున్నాయి. ఆమె తలతో సైగ చేసి పిలిచింది. సత్యేంద్ర అటూ ఇటూ చూచి ఆమె దగ్గరకు వచ్చి నుంచున్నాడు. ఆమె ఉత్సుక నేత్రాలతో అతని మొహం వంక చూచి మృదువుగా “ఇవ్వాళ మా పనిమనిషి రాలేదు. దయవుంచి మీరు నన్ను కొంచెం దూరం పంపిస్తే మీ మేలు మరువలేను” అన్నది. ఎప్పుడూ ఆమె ఒక దాసీని వెంటపెట్టుకు వస్తుందని, ఇవ్వాళ ఒంటరిగా వచ్చిందనీ అనుకున్నాడు. సత్యేంద్ర కాదనలేకపోయాడు. ఇది గ్రహించి ఆ రూపసి ఒక చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వుకు ఆమె అడుగులకు మడుగులొత్తని వారెవరు? సత్యేంద్రుడు “పదండి” అని ఆమె వెంట బైలుదేరాడు. నాలుగైదు అడుగులు వేశాక “మా దాసీదానికి జబ్బుగా వుండటం

మూలాన రాలేదు. నేను గంగా స్నానం చేయంది వుండలేను. మీక్కూడా ఈ చెడు అలవాటు బాగా అలవడిందనుకుంటాను” అన్నది.

“అవును, నేను కూడా తరచు గంగా స్నానానికి వస్తూ వుంటాను” అన్నాడు సత్యేంద్ర.

“ఇక్కడ మీరు ఏ వీధిలో వుంటున్నారు?”

“చోర్ బాగ్‌లో వుంటున్నాము”

“మా యిల్లు ‘జోడా పంక్’లో వుంది. మీరు నన్ను పధరియా ఘాట్ మలుపు వరకు పంపించండి. అక్కడనుండి పెద్ద బజారునే వెళతాను.”

“సరే…”

మళ్ళా చాలాసేపటి వరకు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కొంతదూరం వచ్చిన తర్వాత ఆ రూపసి కొంచెం ఆగి చిరునవ్వుతో “చాలు. ఇక మీరు వెళ్ళవచ్చు. మా యిల్లు ఇక్కడకు దగ్గరే. నమస్కారం” అన్నది.

సత్యేంద్ర ప్రతినమస్కారం చేసి తలవంచుకొని గబగబా వెళ్ళిపోయాడు. ఆరోజు అతని మనస్థితి వ్రాయటం చాలా కష్టం. కాని యౌవనావస్థలో మన్మధుని మొదటి బాణాన్ని తట్టుకున్నవారికి బాగా తెలుస్తుంది. ఉన్మాదంతో మత్తెక్కిన వారికి భూమ్యాకాశాలన్నీ పచ్చగా కనపడినట్టు చైతన్య శూన్యమైన అతని మనసంతా ఆ వైపుకే లాగసాగింది.

సత్యేంద్ర మర్నాడు ప్రొద్దున్నే లేచి చూచేటప్పటికి చాలా ప్రొదెక్కింది. ఒక విధమైన బాధా తరంగం అతని హృదయాన్నంతా మధించసాగింది. ఈరోజు వేస్ట్ అయ్యింది అనుకున్నాడు. నౌకరు ఎదురుగా వెళుతున్నాడు. అతన్ని దగ్గరకు పిలిచి గద్దించుతూ “ఇంత ప్రొదెక్కినా లేపలేదేమిరా వెధవా! నీకొక రూపాయి జరిమానా వేశానుపో” అన్నాడు.

పాపమా నౌకరుకు పై ప్రాణాలు పైనే పోయి కళ్ళప్పగించుకొని చూస్తూ నుంచున్నాడు. ఆ కోపంతో తుండుగుడ్డ తీసుకోకుండానే గబగబా బైటికివచ్చి అద్దె బండొకటి మాట్లాడుకొని పధరియా ఘాటుకు పోనివ్వమని దారి వెంట కాళ్ళు పరుచుకొని కూర్చున్నాడు. నదికి వెళ్ళిన తర్వాత రేవు దగ్గర ఆమె కనపడగానే అతని క్షోభంతా

ఒక్కసారి ఎగిరిపోయింది. దారిలో ఒక అమూల్య రత్నం దొరికిందా అనిపించింది.

అతడు బండి దిగగానే ఆ రూపసి చిరపరిచితురాలు లాగా చిరునవ్వుతో ‘ఇవ్వాళ ఇంత ఆలస్యం చేశారేం? నేను అరగంటనుంచి ఇక్కడ నుంచున్నాను. త్వరగా స్నానం చెయ్యండి. ఇవ్వాళ కూడా రాలేదు మా దాసీది” అన్నది.

“ఒక్క నిమిషం ఆగండి” అని సత్యేంద్రుడు గబగబా నీళ్ళల్లో దిగాడు. అతని ఈత ఏమైందో ఏమో, రెండు మునకలు మునిగి ఒడ్డుకువచ్చి “బండి ఏమైంది?” అన్నాడు.

“నేను బాడుగ యిచ్చి పంపించాను” అన్నది రూపసి.

“బాడుగ మీరిచ్చారా?”

“ఫరవాలేదు, పదండి” అని మళ్ళా ఆ మనమోహిని నవ్వుతూ బైలుదేరింది.

సత్యేంద్రుడు మనసంతా యిచ్చి కూర్చున్నాడు. లేకపోతే యిదంతా ఏమిటా అని అతనికి సందేహం కలిగేది.

దారివెంట నడుస్తూ “మీ యిల్లు ఎక్కడని చెప్పారూ, చోర్ బాగ్‌లోనా?” అన్నది రూపసి.

“అవును”

“అక్కడ వుండేదంతా దొంగలేనా ఏమిటి?”

సత్యేంద్ర ఆశ్చర్యంతో “అలా అంటారేం?” అన్నాడు.

“మీరు దొంగల రాజయ్యారు గనుక!” అని రూపసి క్రీగంటితో సత్యేంద్ర కేసి చూచి, చిరునవ్వు లొలకబోసుకుంటూ చంకను బిందె పెట్టి హంసగమనంతో నడువసాగింది.

ఇవ్వాళ ఆమె చంకనున్న బిందె కొంచెం పెద్దదిగా వుంది. బిందెలో కదులాడుతున్న గంగాజలం కలకలనాదంతో “ఓరీ  గుడ్డి యువకుడా ఇదంతా మోసం! కపటం! జాగ్రత్త!” అని వ్యంగ్యంగానూ, తిరస్కారంగానూ హెచ్చరించుతున్నట్లు అనిపించింది.

మలుపు దగ్గరకు వచ్చిన తర్వాత సత్యేంద్రుడు సంకోచంతో “బండి బాడుగ….?” అన్నాడు.

రూపసి వెనక్కి తిరిగి నుంచుని చిన్న స్వరంతో

“ఒక విధంగా అది మీరిచ్చినట్లేగా!” అన్నది.

సత్యేంద్ర ఈ సైగను గ్రహించలేక “నేను ఇచ్చినట్లు ఎలా?” అన్నాడు.

“నా దగ్గర ఇంకా నాదనేది ఏముంది ఇవ్వటానికి? ఉన్నది కాస్తా మీరే దోచుకున్నారయ్యె!” అని చటుక్కున మొహం తిప్పుకుంది నవ్వు కనపడకుండా.

ఈ అభినయం సత్యేంద్ర చూడలేదు. అందుచేత ఈ దొంగతనపు ప్రచ్ఛన్న సంకేతం విద్యుత్ రేఖలాగ అతని  హృదయాంతరాళంలో ప్రవేశించింది. ఈ నడిబజారులోనే ఆమె పాదాల మీద పడాలనిపించింది. కాని తక్షణమే సిగ్గుతో

తల వంగిపోయింది. మళ్ళా తలెత్తి రూపసి మొహం చూడలేక మెదలకుండా సాగిపోయాడు.

రూపసి చెప్పి వచ్చిందో ఏమో దాసీది కాలిదారి మీద నుంచుని అంతా చూస్తూ వుంది. అతను వెళ్ళిపోయిన తర్వాత దగ్గరికువచ్చి “పాపమాయన్ని అలా నాటకమాడిస్తున్నారెందుకు?” ఇంకా నాలుగురాళ్ళు పడలేదా?” అన్నది.

రూపసి నవ్వుతూ “ఆ సంగతి సరేగాని ఇలాంటి మూర్ఖుల ముక్కుకు తాడుబోసి గానుగ తిప్పించమంటే నాకు చాలా సరదా” అన్నది.

దాసీది కొంచెంసేపు పకపకా నవ్వి “నీకు అది కూడా చేతనవునా? నువ్వు ఏమైనా అను,

చూడ్డానికెవరో జమీందారు బిడ్డలాగున్నాడు. ఆ మొహం, ముక్కూ మీ యిద్దరికీ చక్కగా జోడు కలిసింది. మీరిద్దరూ నుంచుని మాట్లాడుతూ వుంటే జంట గులాబీలు వికసించినాయా అనిపించింది” అన్నది.

రూపసి చిరునవ్వు నవ్వుతూ “సరే పద. అంతగా నచ్చితే ఆ గులాబీ పువ్వును నువ్వే పెట్టుకో” అన్నది.

దాసీది ఒక పట్టున వదిలిపెట్టే మనిషి కాదు.

“ఎందుకమ్మా అంత కోపం! నేను బ్రతికివుండగా నీ వస్తువనేది ఏదీ ఇంకెవరికి యివ్వను. నాకా సంగతి బాగా తెలుసు” అన్నది.

కళ్ళార చూచినా అసంభవ విషయాలను

ఎవరితోనూ చెప్పవద్దని జ్ఞానుల వుద్దేశం. కారణం అజ్ఞానులు దానిని నమ్మరుకనుక. పాపం ఈ అపరాధం వల్లనే శ్రీమంత్ జైలుకు వెళ్ళవలసి వచ్చింది.

ఏది యెలావున్నా సత్యేంద్రుడు ఆరోజున ఇంటికి వచ్చి టెనిసన్ కవిత్వం చదివి, డాన్ జావ్‌ను తెలుగులో అనువాదం చేయడానికి కూర్చున్న మాట మాత్రం యధార్థం.

అతనింత పెద్దవాడైనా కూడా ఈ కలకత్తా పట్నపు వీధుల్లో రేవులవద్ద రాత్రింబగళ్ళు ఎంత వింతైన ప్రేమ వరదలు వస్తున్నాయో, వాటి కెరటాలలో మునిగిపోవటం ఎంతవరకు తప్పు లేదో అతనికేమీ అర్థం కాలేదు.

రెండు రోజుల తర్వాత అలాగే స్నానం చేసి

ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో “రాత్రి నేను నాటకానికి వెళ్ళాను. పాపం ‘సరళ’ దుఃఖం చూచి గుండె పగిలిపోయింది” అన్నది రూపసి తలవని తలంపుగా.

సత్యేంద్ర సరళ నాటకం చదవలేదుగాని స్వర్ణలత అను పుస్తకం చదివాడు అందుచేత అతను ధైర్యంగా

“అవును, పాపం చాలా కష్టాలతో చనిపోయింది!” అన్నాడు.

ఆమె ఒక నిట్టూర్పు విడచి “అబ్బ! ఆమెకు ఎంతటి కష్టాలు వచ్చాయి. సరళ భర్తను ఎందుకంత అమితంగా ప్రేమించేదో; మొదటి భార్య ఎందుకు ప్రేమించలేకపోయిందో మీరు చెప్పగలరా?” అన్నది.

సత్యేంద్ర  “వాళ్ళ వాళ్ళ స్వభావం” అన్నాడు.

“అవును, అదే! పెళ్ళి అనేది అందరూ చేసుకుంటారు. కాని పెళ్ళి చేసుకునే ఈ స్త్రీ పురుషులందరూ ఒకరినొకరు సమానమైన ప్రేమతో చూచుకోగలుగుతున్నారా? సుఖాన్ని అనుభవించగలుగుతున్నారా? మరణకాలం వరకూ ప్రేమంటే ఏమిటో కూడా తెలియనివారు అనేకమంది వున్నారు. ఎదురుగా ఎంత ఇంపైన సంగీత వాయిద్యాలు వినబడుతున్నా సరే చెవియొగ్గనివారు వున్నారు.

కొంతమంది దేనికీ కోపగించుకోరు. అసలు కోపగించుకోనేలేరు; లోకులు వారిని పొగుడుతూ, గౌరవిస్తూ వుంటారు. కాని నా

మట్టుకు నేను వారందరినీ నిందించాలంటాను.”

సత్యేంద్ర చిరునవ్వుతో “ఎందుకని?” అన్నాడు.

రూపసి  “వారు ఓర్పు లేనివారు, అసమర్థులు కాబట్టి కొద్దో గొప్పో సుగుణాలున్నా సవితి సరళలో ఎక్కువ లోపాలే వున్నాయి. ఆమె అంత అత్యాచారానికి ఒడిగట్టినా సరళకు కోపం రాలేదు చూచారా?” అన్నది, సత్యేంద్రుడు మాట్లాడలేదు.

“ఐన పెద్ద భార్య ప్రమద ఎంత రాక్షసి అనుకున్నారు! నేనైతేనా గొంతు పిసికేదాన్ని” అని మొదలుపెట్టింది.

సత్యేంద్ర నవ్వుతూ “నువ్వెలా అవుతావు? ప్రమద అనే పేరుగల స్త్రీ నిజంగా ఎవరూ లేరు. అదంతా కవి కల్పన మాత్రమే” అన్నాడు.

రూపసి ఒక పెద్ద నిట్టూర్పు విడిచి “అయితే, కవి అలాంటి కల్పన ఎందుకు చేయాలి? మానవులందరి అంతఃకరణంలో భగవంతుడున్నాడు. ఆత్మ వున్నది అంటారు. కాని ప్రమద చరిత్ర చూస్తూ వుంటే ఆమె అంతఃకరణలో భగవంతుడుగానీ, ఆత్మగాని వున్నట్టు కనపడదే. పెద్ద పెద్ద వాళ్ళ పుస్తకాలు చదవటం, ఆశలు పెంచుకోవటానికిగాని, ప్రేమను పెంపొందించుకోవటానికా ఏమిటి? పుస్తకాలు చదవగానే మనిషిలో ఈర్ష్యా, ద్వేషమూ పుట్టుకొస్తాయి. మానవునిలో ఆత్మా లేదు; హృదయమూ లేదని ఒక

పుస్తకం కూడా రాశాను” అన్నది.

సత్యేంద్ర ఆశ్చర్యంతో ఆమె మొహం కేసి చూస్తూ “మీరు చాలా పుస్తకాలు చదివినట్లుందే!” అన్నాడు.

“ఇంగ్లీషు తెలియదు. తెలుగులో వచ్చిన పుస్తకాలన్నీ చదివాను. ఒక్కొక్కనాడు రాత్రి తెల్లవార్లూ చదువుతూ వుంటాను, ఇదేగా మా బజారు. ఒకసారి యింటికి రండి. నా దగ్గరవున్న పుస్తకాలు చూసిపోదురుగాని” అన్నది రూపసి.

సత్యేంద్ర త్రుళ్ళిపడి “మీ ఇంటికా…” అన్నాడు.

“అవును, మా ఇంటికే పదండి! రాక తప్పదు.”

సత్యేంద్రుని మొహం ఒక్కసారి వెలవెలబోయింది. అతను భయపడుతూ “కాదు, ఇప్పుడు కాదు!” అన్నాడు.

“కాదూ గీదూ! ఏమీ కుదరదు పదండి!”

“ఇప్పుడు కాదు, ఇవాల్టికి పోనీ!” అని సత్యేంద్ర తడబడుతున్నా అడుగులతో తొందర తొందరగా వెళ్ళిపోయాడు. ఇవ్వాళ అతని హృదయం ఆ అపరిచిత రూపసి యందు ఏర్పడిన ప్రేమభారంతో కృంగిపోసాగింది. ఉదయాన్నే గంగలో స్నానం చేసి ఇంటికి వచ్చాడు

******

సత్యేంద్ర మనసులో చాలా విచారంగా వున్నది. అతని కంటతడి ఇంకా ఆరలేదు. తన సౌందర్యరాశి అప్పటికి నాలుగు రోజుల నుంచి గంగా స్నానానికి రావటం లేదు. ఈ నాలుగు రోజులు అతను ఎన్ని విషయాలు ఆలోచించాడో అంతులేదు. అప్పుడప్పుడతనికి ఆమె మరణించిందో, మరణశయ్య మీద వున్నదోనన్న చెడ్డ ఆలోచన కలిగేది.

అతనికి ఆమె వుండే వీధి మాత్రం తెలుసు, కాని ఏ యింట్లోనో యేమో తెలియదు. తలచుకుంటే గుండె పగిలిపోతుంది. ఆమె వెంట వెళ్ళి ఆ రోజునే యిల్లు ఎందుకు చూచి రాలేదా? ఆమె కోర్కెనెందుకు కాదన్నానా? అని పశ్చాత్తాప పడసాగాడు.

అతనికి ఆమెయందు నిజమైన ప్రేమ

ఏర్పడింది. అది తప్పుడు చూపు కాదు. హృదయం నుంచి పుట్టిన ప్రేమ పిపాస, కించిత్తయినా దానిలో మోసానికిగాని, అన్యాయానికిగాని స్థానం లేదు. అదే యదార్థమైన పవిత్ర ప్రేమ!

“బాబు గారూ!”

సత్యేంద్రుడు త్రుళ్ళిపడి తిరిగి చూచాడు. రోజూ ఆమె వెంటవచ్చే దాసీ నుంచుని వుంది.

సత్యేంద్ర ఆతురతతో ఆమె దగ్గరకు వెళ్ళి విచారంగా “ఆమె ఏమైంది?” అని కన్నీరు కార్చాడు.

దాసీది నవ్వుకొని తలవంచుకునే “ఒంట్లో బాగుండలేదు. మిమ్మల్ని చూడాలని

ఆతురత పడుతూ వుంది” అన్నది.

“సరే, పద!”

అని కళ్ళు తుడుచుకుని ఆమె వెనుక కొంచెం దూరం వెళ్ళాక “జబ్బేమిటి? ఏమైనా ఎక్కువైందా?” అని అడిగాడు.

పెద్ద జబ్బేమీ లేదు. కాని జ్వరం మాత్రం కొంచెం ఎక్కువగా వుంది” అన్నది దాసి.

సత్యేంద్ర మనసులో భగవంతుణ్ణి ప్రార్థించాడు. దాసీని ఇంకేం అడగలేదు. ఇంటి ముందుకు వెళ్ళి చూచేటప్పటికి ఇల్లు చాలా పెద్దదిగా కనబడింది. వాకిట్లో ఒక కావలివాడు కునికిపాట్లు పడుతూ కూర్చున్నాడు, నేను వస్తే ఆమె తండ్రి గారికి కోపం రాదు గదా; ఆయన నన్నెరుగడు”

అన్నాడు దాసితో.

“ఆమెకు తండ్రి లేడుగాని తల్లి వుంది. ఆమె లాగానే ఆమె తల్లికి కూడా మీరంటే అమిత ప్రేమ” అన్నది దాసి.

సత్యేంద్రుడు మళ్ళీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళాడు. పైకి వెళ్ళి చూచేటప్పటికి ఒక గది అలంకరించబడి వుంది. దానిలో నుంచి కలకల నవ్వులు, గలగల గజ్జెల రవళులు, డమడమ తబలా మోతలు వస్తున్నాయి. దాసీ ఆ గదిని చూపించి

“ఆ గది లోపలికి పదండి” అని వాకిటి పరదా తొలగించి, “ఇదుగోనమ్మా, మీ ప్రియుడు!” అన్నది.

గదిలోకి చూచేటప్పటికి అతని తల తిరిగిపోయింది. స్పృహ తప్పి

పడిపోతాడేమోననిపించింది. ఎలానో తమాయించుకొని గుమ్మం పట్టుకొని చతికిలపడ్డాడు.

ఆ గదిలో బల్లమీద పరుపులు పరిచి వున్నాయి. దానిమీద ముగ్గురు మనుష్యులు కూర్చొని వున్నారు. వారిలో ఒకడు తబలా, ఒకడు హార్మోనియం ముందు పెట్టుకొని వున్నారు. మూడవ వాడు తాగుతున్నాడు. ఇదంతా చూస్తే ఆమె నాట్యం చేస్తూ వుందా అనిపిస్తూ వుంది. ఒంటినిండా నగలు, కాళ్ళకు గజ్జలు, కళ్ళకు సుర్మా వున్నాయి. ఆమె కాళ్ళ గజ్జెలతో గలగలమంటూ వచ్చి సత్యేంద్రుని చేయి పట్టుకుని “పిచ్చివాడా! ఇటు చూడు, నీ ఎగతాళి, వేళాకోళాలు ఇక పనికిరావు. అవంటే నాకు అమితరోత” అన్నది.

ఆమె చేయి తగలగానే సత్యేంద్రుడు ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లు కంపించిపోయాడు.

“నా పేరు శ్రీమతి బిజిలీ. మరి నీ పేరేమిటి చెలికాడా? సుద్దా? మొద్దా?” అన్నది రూపసి.

అందరూ ఫక్కుమన్నారు. ఆ దాసీది నవ్వుతూ కిందపడిపోయి, “భలే దానివమ్మా! రంగంలోకి దింపటం నీ తర్వాతనే” అన్నది.

“బిజీలీ కొంచెం కోపం తెచ్చిపెట్టుకొని “నోరు ముయ్యి. అట్టే యిదిగా వాగకు” అని సత్యేంద్రతో “రండి ఇక్కడికి వచ్చి కూర్చోండి” అని సత్యేంద్రని లాక్కొచ్చి బలవంతంగా ఒక కుర్చీ మీద కూచోబెట్టింది.

సారాయి తాగుతున్న మనిషి లేచివచ్చి

సత్యేంద్ర పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి యేడుస్తూ “నేను మహా పాతకుణ్ణి బాబూ! నాకు కొంచెం మీ పాదధూళి…” అన్నాడు.

హార్మోనియం వాయిస్తున్న వ్యక్తి కొంచెం తెలివిలో వున్నాడు. “పాపం, అతన్నెందుకలా అనవసరంగా తమాషా పట్టిస్తారు?” అని సానుభూతి చూపించాడు.

బిజిలీ నవ్వుతూ “భలే! అనవసరమేముంది? నిజంగా తమాషా కనుకనే ఇవ్వాళ మీ అందరిముందూ ఇతన్ని తీసుకొచ్చి తమాషా చూపిస్తున్నాను. అయితే “మొద్దూ నా మీద ఒట్టు వేసుకొని నన్ను గురించి ఏమి కలలు కన్నావో నిజం చెప్పు? నేను ప్రతిరోజూ గంగా స్నానానికి వస్తూ వుంటాను. కాని బ్రాహ్మణ స్త్రీని గానీ, ముస్లిం పడుచునుగానీ, క్రిస్టియన్

కన్యనుగానీ కాను. ఇంత వయస్సు వచ్చిన హిందు వనితను చూచి నన్ను విధవనో, సధవనో అనుకొని వుంటావు అయితే ఏమనుకొని ప్రేమకోసం తిరిగావో చెప్పు! నన్ను పెండ్లి చేసుకోవాలనుకున్నావా? లేకపోతే మోసపుచ్చి ఎక్కడికైనా లేపుకుపోదామనుకున్నావా?” అన్నది.

మళ్ళా అంతా ఫక్కున నవ్వారు. కాని సత్యేంద్ర తలెత్తలేదు. మనసులో ఏమాలోచించుకున్నాడో ఏమో!

బిజిలీ చకితురాలై “అయ్యో నా మతిమరపు తగలడ! ఓ శ్యామా! త్వరగా వెళ్ళి బాబుగారికి ఫలహారం తీసుకురా! పాపం స్నానం చేసి వచ్చారు. ఇంతసేపటి నుంచీ నేను పరిహాసమాడుతూ కూర్చున్నాను” అన్నది.

కొంచెం సేపట్లో దాసీది ఫలహారం తీసుకొచ్చింది. బిజిలీ దాన్ని తన చేతిలోకి తీసుకొని సత్యేంద్ర పాదాల వద్ద మోకరిల్లి కూర్చొని కొంచెం తల పైకెత్తి, “ఇదిగో, తీసుకొని తినండి” అన్నది.

ఇంతసేపటినుంచి సత్యేంద్రుడు తన ఆత్మ శక్తినంతటినీ కేంద్రీకరించి నిభాహించుకుంటూ వచ్చాడు. ఇక తమాయించుకోలేక తల పైకెత్తి మెల్లగా “నేను తినను” అన్నాడు.

“ఎందుకని కులం భ్రష్టమైపోతుందా? నేనేమైనా మాలదాన్నా? మాదిగదాన్నా?”

“మీరు ఆ జాతి వారైతే నాకు తినటానికి అభ్యంతరముండేది కాదు. మీరు

వారందరికంటే హీనులు” అన్నాడు, సత్యేంద్ర ప్రశాంతంగా.

బిజిలీ కిలకిల నవ్వుతూ “మొద్దు బాబుకి కూడా బాకు పట్టటం చేతకానట్టుంది” అన్నది.

“నా పేరు సత్యేంద్ర కాని మొద్దు కాదు. నేనేం బాకులు దూయటం నేర్చుకోలేదు. కాని పొరపాటని తెలిసిన మీదట దాన్ని దిద్దుకోవటం మాత్రం నేర్చుకున్నాను” అన్నాడు సత్యేంద్ర.

బిజిలీ ఇంకేదేదో అనాలనుకున్నది కాని, అనలేక చివరికి “అయితే, నేను ముట్టుకున్నది తినవా ఏమిటి?” అన్నది.

“తినను.”

ఈసారి బిజిలీ లేచి నుంచుని కుపితస్వరంతో “నువ్వు తినక తప్పదు. ఇవ్వాళ కాకపోతే రేపో, రేపు కాకపోతే ఎల్లుండో తింటావు” అన్నది.

సత్యేంద్ర తలకాయ తిప్పి “ఇదిగో చూడండి, పొరపాట్లనేవి అందరికీ జరుగుతూ వుంటాయి. నాది ఎంత పొరపాటో గ్రహించారా? కాని మీరు కూడా చాలా పొరపాటు పడుతున్నారు. ఇవ్వాళ కాదుగదా, రేపు కాదుగదా, ఇంకా నాలుగు ఏళ్ళున్నా తినను. ఈ జన్మలోనే కాదు, ముందు జన్మలో కూడా నువ్వు ముట్టుకున్నది తినను. నాకు సెలవు ఇవ్వండి. నేను ఇక వెళ్ళిపోతాను. మీ నిట్టూర్పులతో నా రక్తం శుష్కించిపోతూ వుంది” అన్నాడు.

ఆమె మొహం మీద ఒక విధమైన ఈర్ష్యా ఛాయ ఆవరించింది.

“పోనీ బిజిలీ, ఈ పూట ఆనందాన్నంత మంటకలిపాడు” అన్నాడు ఒకడు.

బిజిలీ మెదలకుండా సత్యేంద్ర మొహం కేసి చూస్తూ నుంచున్నది. ఇంత వినయవిధేయతలున్నవాడు – ఇలా మాట్లాడతాడని ఆమె ఎన్నడూ వూహించలేదు.

సత్యేంద్ర లేచి నుంచునేటప్పటికి బిజిలీ కోమల స్వరంతో “కొంచెంసేపు కూర్చోండి” అన్నది.

“ముక్కుతాడు కొంచెం సందొదులు అమ్మా!”

అన్నాడు ఒక త్రాగుబోతు.

సత్యేంద్ర గదిలోంచి బైటికి వచ్చాడు. బిజిలీ గబగబా ముందుకు వచ్చి వాకిటికి అడ్డంగా నుంచుని “వాళ్ళు చూస్తారని వెనకాడానుగాని లేకపోతే అప్పుడే చేతులు జోడించి నావల్ల చాల అపరాధం జరిగిందని మిమ్మల్ని వేడుకునేదాన్ని” అన్నది.

సత్యేంద్ర దీనికేమీ సమాధానమివ్వకుండా మొహం తిప్పుకున్నాడు.

ఈసారికి నన్ను క్షమించండి. ఆ ఎదురుగా వున్న గదిలోనే నా పుస్తకాలున్నాయి. ఒకసారి వచ్చి చూసి పోండి” అన్నది రూపసి మళ్ళా.

“చూడనవసరం లేదు” అని సత్యేంద్రుడు

మెట్ల వైపు సాగాడు. బిజిలీ అతని వెనక నడుస్తూ “రేపు మళ్ళా కనపడతారా?” అన్నది.

“కనపడను.”

“ఇంకెన్నటికీ కనపడరా?”

“లేదు.”

దుఃఖంతో బిజిలీ గొంతు నిండుకొచ్చింది గద్గద స్వరంతోనే “కనపడనంటే నాకు నమ్మకం కలగడం లేదు. కనపడకపోతే మానే నా ఒక్క మాటయందు నమ్మకముంచుతారా?” అన్నది.

ఆమె గద్గద స్వరంచూచి సత్యేంద్ర ఆశ్చర్యపడ్డాడు. కాని ఈ పదిహేను రోజుల

నుంచీ చూస్తున్న నాటకం ముందు ఇదేమీ కాదనిపించింది. అయినా అతను వెనక్కి తిరిగి నుంచున్నాడు. బిజిలీ అతని మొహంలోకి గాఢంగా చూచింది. కాని దానిలో విశ్వాస చిహ్నాలున్నట్టు ఎక్కడా కనిపించలేదు. కాని ఇంకా చేసేదేముంది?

“నమ్మేది ఏం మాట?” అన్నాడు సత్యేంద్ర.

బిజిలీ నోరు మెదల్చింది కాని మాట పెదవులు దాటి పైకి రాలేదు. కన్నీటి కళ్ళను ఒకసారి తెరచి మళ్ళా మూసుకుంది. సత్యేంద్రుడు తలెత్తి చూచాడు కన్నీళ్ళలో కూడా కపటముంటుందా? బిజిలీ తలెత్తకుండానే సత్యేంద్ర తన్ను పరీక్షిస్తున్నాడని గ్రహించింది. కాని నోటిలోంచి మాట బైటికి పెకిలి రాలేదు.

ఆమె అతన్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తుంది. ఆ ప్రేమకణాల్లో ఒక్కదాన్నైనా సార్థక పరచుకోవాలన్న లాలసతో తన రూపరాశిని; శరీరాన్ని అవసరమైతే ప్రాణాల్ని కూడా త్యాగం చెయ్యటానికి సిద్ధంగా వుంది. కాని అది నమ్మేది ఎవరు? జడ్జి యెదుట వెయ్యి నేరాలు మొహానపెట్టుకు నుంచుని, ‘నా వృత్తి నేరాలు చేయటమే అయినా నేనీసారి నిర్దోషురాల’నని నోటితో అంటే నమ్ముతాడా! ఆలస్యమైనకొద్దీ జడ్జీ తనకు మరణశిక్ష విధిస్తాడేమోనని అనుమానపడసాగింది.

సత్యేంద్ర పరధ్యానంతో “నేను ఇక వెడతాను” అన్నాడు.

బిజిలీ తలెత్తలేకపోయింది. కాని ఈసారి ఆమె నోట్లోంచి మాట వచ్చింది. “వెళ్ళండి.

నేను నమ్మిన దాన్ని మీరు నమ్మకుండా అపరాధి కాకండి. ప్రతి వారిలోను అంతర్యామి వున్నాడు. మరణ మాసన్నమయ్యేవరకు అతన్ని వదిలిపోలేడు” అన్నది.

కొంచెంసేపు మెదలకుండా వుండి “దేవాలయాలన్నిటిలోను దైవపూజ జరగని మాట నిజమే. దానిలో వుండే వారంతా దైవాలు కారు. వారిని చూచి తలవంచకపోయినా కాలదన్ని మాత్రం పోలేవు” అంటూ, కాళ్ళ చప్పుడు విని తలెత్తి చూచింది. సత్యేంద్ర మెల్లగా నడిచిపోతున్నాడు.

స్వభావానికి వ్యతిరేకంగా విద్రోహం చేయవచ్చును. కాని దాని అస్తిత్వాన్ని సంపూర్తిగా రూపుమాపలేము. ఆడదానిని

శారీరకంగా అనేక అత్యాచారాలు చేయవచ్చును కాని ఆమెలోని స్త్రీత్వాన్ని మాత్రం నాశనం చేయలేము. బిజిలీ నర్తకియైనా స్త్రీయేగా! జీవితంలో అనేక వడుదుడుకులు చేయటం వల్ల అపరాధినియైనా ఆమెలో స్త్రీత్వపు అస్తిత్వమున్నది గదా! కొంచెంసేపైన తర్వాత ఆమె గదిలోకి తిరిగి వచ్చేప్పటికి మృతప్రాయమైన ఆమె నారీ ప్రకృతియే అమృత స్పర్శతోనో మేల్కొన్నది. ఈ కాసేపట్లో ఆమెలో కలిగిన మార్పును ఆ త్రాగుబోతులు కూడా గ్రహించారు.

“నీ కళ్ళు ఎర్రగా వున్నాయేం బిజిలీ? వాడెంత పిచ్చిముండాకొడుకు కాకపోతే ఇలాంటి అమూల్య వస్తువులను కూడా నోట పెట్టకుండా పోతాడా! పోతే పోయాడులే, ఇటుతే…” అని స్వయంగా పళ్ళెం దగ్గరకు

లాక్కుని తినసాగాడు.

కాని ఈ మాటల్లో ఒక్కటి కూడా బిజిలీ చెవిని పడలేదు. అకస్మాత్తుగా ఆమె దృష్టి పాదాల మీద పడింది. కాళ్ళ గజ్జెలు ఇంకా అలాగే వున్నాయి. అవి విషసర్పాల్లాగ చుట్టుకున్నాయి. వెంటనే ఆమె వాటిని విప్పి విసిరి పారేసింది.

“గజ్జెలు విప్పి వేశావేం?” అని ఒకడు అడిగాడు.

బిజిలీ తలెత్తి చూచి చిరునవ్వుతో “ఇక వీటి అవసరం లేదు” అన్నది.

“అంటే…?”

“త్యజించటమే.”

ఫలహారం పుచ్చుకుంటున్న రసికుడు ఏమి రోగము వచ్చిందే?” అన్నాడు.

బిజిలీకి నవ్వు వచ్చింది. “ఏ రోగం వల్ల అయితే వెలుగుతో చీకటి, సూర్యునితో నిశి వస్తుందో, ఆ రోగంతోనే మీ బిజిలీ ఇవ్వాలా చిరమృతి నందింది” అన్నది నవ్వుతూ.

******

ఆ తర్వాత నాలుగేళ్ళ నాటి సంగతి. కలకత్తాలో ఒక పెద్ద భవంతిలో జమిందారు కొడుకు అన్నప్రాశన మహోత్సవము జరుగుతుంది. విందులన్నీ పూర్తయినాయి. ముందు పందిట్లో సాయంత్రం మేజువాణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రకరకాలైన అభినయాలు, నృత్యాలు, పాటకచేరీలు

జరుగుతున్నాయి.

నర్తికలు పందిట్లో ఒక ప్రక్కన కూర్చుని వున్నారు. మేజువాణీ చేసేది వీరే. భవంతి పైఅంతస్తు వరండాలో పరదాచాటున రాధారాణి ఒక్కతే కూర్చుని నర్తికలను చూస్తూ వుంది, పేరంటాళ్ళు ఇంకా రాలేదు.

సత్యేంద్ర వెనకనుంచి నిశ్శబ్దంగా వచ్చి “ఇంత ధ్యానంతో చూస్తున్నావేమిటి?” అన్నాడు.

రాధారాణి భర్త మొహంకేసి చూచి నవ్వుతూ “ఏమీ లేదు! ఆ నర్తకి ఎలా అలంకరించిందో చూస్తున్నాను. తలవని తలంపుగా ఇలా వచ్చారేం?” అన్నది.

“పాపం నువ్వు ఒంటరిగా కూర్చున్నావు,

కొంచెం చూచిపోదామని వచ్చాను” అన్నాడు సత్యేంద్ర నవ్వులాటగా.

“చాల్లే, పోండి”

“నిజంగా…! అయితే, వారిలో నీకెవరు అందంగా వున్నారో చెప్పు!”

రాధారాణి వ్రేలితో మామూలు దుస్తులతోనున్న ఓ నర్తకిని చూపించి “ఆమె” అన్నది.

“ఆమె చాల బలహీనంగా వుంది. జబ్బు మనిషి” అన్నాడు సత్యేంద్ర.

“అయినా ఆమె అందరికంటే అందంగా వుంది. కాని పాపం పేదరాలుగా కనపడుతూ వుంది. తక్కినవారిలా ఒంటిమీద నగలేమీ

లేవు.”

“కావచ్చు. కాని వారిలో ఎవరెంత మొత్తం పుచ్చుకుంటారో తెలుసా?”

“తెలియదు.”

సత్యేంద్రుడు ఒక్కొక్కరినే చూపిస్తూ “వారిద్దరికీ ముప్పయ్యేసి రూపాయలు. ఆమెకు ఏభై యివ్వాలి. నువ్వు పేదరాలవని అంటున్న ఆవిడ రెండు వందల రూపాయలు పుచ్చుకుంటుంది” అన్నాడు.

రాధారాణి ఆశ్చర్యంతో “రెండు వందల రూపాయలా? బాగా పాడుతుందా ఏమిటి?” అన్నది.

“ఇప్పుడు ఎలా పాడుతుందో

తెలియదుగాని, నాలుగైదేళ్ళ క్రితం బాగా పాడేదని అంతా అనుకుంటూ వుంటారు”

“ఇంత డబ్బిచ్చి తీసుకొచ్చింది ఎందుకు?”

అంతకు తక్కువకు ఆమె రాదు. అది కూడా చాలా కష్టంమీద బ్రతిమాలి బామాలి ఒప్పించాల్సి వచ్చింది.”

రాధారాణి మరింత ఆశ్చర్యంతో “డబ్బివ్వటం కాకుండా ఇంకా బ్రతిమాలటం కూడానా?” అన్నది.

సత్యేంద్ర కుర్చీ దగ్గరకు లాక్కు కూర్చుని “అసలు మొదటి సంగతి. ఆమె ఆ వృత్తి వదిలిపెట్టింది. రెండవది, ఆమెలో ఎన్ని రూపగుణాలు, శక్తి సామర్థ్యాలు వున్నా ఇంత డబ్బు ఒక్కసారి ఎవ్వరూ ఇవ్వరు.

అందుచేత ఆమె పట్టుమని ఎక్కడికీ రాదు. ఇవన్నీ కాకుండా నా పట్టుదల… మూడవ కారణం…” అన్నాడు.

రాధారాణి మూడో కారణాన్ని నమ్మలేదు, ఆమె కుతూహలంతో దగ్గరకు వచ్చి “నీ పట్టుదల సరేగాని, ఆమె వృత్తి ఎందుకు వదిలిపెట్టిందో తెలుసా?” అన్నది.

“వింటావా?”

“ఆ చెప్పు!”

సత్యేంద్ర క్షణంసేపు మెదలకుండా వుండి “ఆమె పేరు బిజిలీ… అయితే రాణీ! యిక్కడికి ఇంకెవరైనా వస్తారేమో? లోపలకు వెళదాం పద!” అన్నాడు.

“వెళదాం పద” అని రాధారాణి లేచి నుంచున్నది.

******

భర్త పాదాల వద్ద కూర్చుని రాధారాణి విషయమంతా విన్న తర్వాత చివరికి పయట చెంగుతో కన్నీళ్ళు తుడుచుకొని “అందుకని ఇవ్వాళ ఆమెను అవమానపరచి పగ తీర్చుకుంటారా? మీకు ఈ బుద్ధి ఎందుకు పుట్టింది?” అన్నది.

ఇటు సత్యేంద్రకి కూడా చెప్పేప్పుడు మధ్య మధ్య అనేకసార్లు గొంతు నిండుకొచ్చింది. “అవును పగ తీర్చుకుంటున్నాను. ఈ విషయం మన ముగ్గురికి తప్ప యింకెవరికీ తెలియదు” అన్నాడు.

రాధారాణి మాట్లాడకుండా మళ్ళా ఒకసారి పయట చెంగుతో కన్నీరు తుడుచుకొని బైటికి వెళ్ళిపోయింది.

పెద్దలతో పందిరంతా నిండి వుంది. ఆపై వరండాలోంచి ముత్తయిదుల కిలకిల నవ్వులు పరదాలు దాటి బైటికి వస్తున్నాయి. నర్తకులందరూ మేజువాణీ దగ్గరకు వచ్చారుగాని బిజిలీ మాత్రం తలవంచుకొని ఇంకా అక్కడే కూర్చుని వుంది, ఆమె కనుకొలనుల వెంట కన్నీరు కారుతూ వుంది. మొదట్లో ఆమె బాగా ధనం కూడబెట్టింది. కాని దీర్ఘమైన ఈ అయిదు సంవత్సరాలలోనూ అంతా ఖర్చయింది ధనా భావంవల్లే గత్యంతరంలేక అయిదేళ్ళ క్రిందట పట్టుదలతో పరిత్యజించిన వృత్తిని మళ్ళా ఇవ్వాళ స్వీకరించవలసి వచ్చింది, కాని ఆమె సభికుల ముందు తలెత్తి

నిలబడలేకపోయింది. తన శరీరం ఇలా స్వాధీనం తప్పిపోయిందని గంటకుముందు ఆమె వూహించలేదు.

“మిమ్మల్ని పిలుస్తున్నారు!”

బిజిలీ తలెత్తి చూచింది. పన్నెండు, పదమూడేళ్ళ కుర్రవాడు ఎదురుగా నుంచున్నాడు. అతను పై వరండాకేసి చూపించి, “అమ్మగారు మిమ్మల్ని పిలుస్తూ వున్నారు” అన్నాడు.

బిజిలీకి నమ్మకం కలుగలేదు. “ఎవరు పిలిచేది?”

“ఆ అమ్మగారు పిలుస్తున్నారు.”

“నువ్వెవరవు?”

“వారి నౌకరును,”

బిజిలీ తలకాయ తిప్పి “లేదు, నన్ను పిలిచి వుండరు. నువ్వు పొరపడ్డావేమో! మళ్ళా ఒకసారి వెళ్ళి అడిగి రా” అన్నది.

కుర్రవాడు కొంచెంసేపు వున్న తర్వాత మళ్ళీ వచ్చి

“మీ పేరేగా బిజిలీ! మిమ్మల్నే పిలిచేది రండి. మీకోసం నుంచుని వున్నారు” అన్నాడు.

బిజీలీ వెంటనే కాళ్ళగజ్జెలు విప్పి అక్కడ వేసి, ఆ కుర్రవానివెంట లోపలికెళ్ళింది బహుశా విశేషమైనపనేమైనా వుండి, యజమానురాలు పిలిచిందేమోననుకుంది. రాధారాణి బిడ్డనెత్తుకుని పడకటింటి

గుమ్మం వద్ద నుంచుని వుంది. కొంత భయంతోనూ, కొంత సంతోషంతోనూ బిజిలీ ఆమె ఎదుటకు వెళ్ళి నుంచున్నది. రాధారాణి అత్యంతాదరంతో ఆమె చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకెళ్ళి బలవంతాన కుర్చీ మీద కూర్చోబెట్టి “నన్నెరుగున్నావా అక్కా!” అన్నది నవ్వుతూ.

బిజిలీ చికితురాలై ఆమె మొహంకేసి చూస్తూ నుంచున్నది. రాధారాణి తన చంకనున్న బిడ్డను చూపిస్తూ “నువ్వు నీ చెల్లెల్ని గుర్తించకపోతేమానే,  వీణ్ణీ కూడా గుర్తించకపోతే చాల కోపం వస్తుంది” అని ఆమె నవ్వసాగింది.

ఈ నవ్వు చూచినా కూడా బిజిలీ నోటి వెంట మాట రాలేదు. అంధకారపూరితమైన ఆమె మనోకాశం క్రమంగా స్వచ్ఛంకాసాగింది.

బిజిలీ తదేక ధ్యానంతో ఆ పిల్లవానికేసి చూచి చప్పున రెండు చేతులూ జాపి తీసుకొని హృదయానికేసి గట్టిగా హత్తుకుని ఏడ్వసాగింది.

“ఇప్పటికైనా గుర్తించావా అక్కా!” అని అడిగింది రాధారాణి.

“ఆ గుర్తించాను చెల్లీ!”

“సముద్రాన్ని మథించి, దానిలో వచ్చిన గరళాన్ని నువ్వు త్రాగి అమృతాన్ని నాకు దానం చేశావు వారు నిన్ను ప్రేమించారు. కాని నేను పొందగలిగాను” అన్నది రాధారాణి.

బిజిలీ సత్యేంద్ర ఫోటో ఒకటి తీసుకొని తదేక ధ్యానంతో చూస్తూ “విష స్వరూపమేగా

అమృతం చెల్లీ! ఆ విషయం కూడా ఈ పరమపాపిష్టిని చిరంజీవిగా చేసింది! అయినా నేను వంచితురాలను” అన్నది.

రాధారాణి దీనికేమి సమాధానమివ్వకుండా “వారిని ఒక్కసారి కలుసుకుంటావా అక్కా?” అన్నది.

బిజిలీ క్షణంసేపు కళ్ళు మూసుకొని “నాలుగేళ్ళ క్రితం వారు ఈ కులతను చూచి ఏవగింపుతో మొహం తిప్పుకు వస్తున్నప్పుడు మళ్ళా కనపడతారు. మళ్ళా కలుసుకుంటారని సగర్వంగా అన్నాను. కాని ఆనాటి నా గర్వం నిలవదు. ఆనాటి నా గర్వాన్ని భగవంతుడు ఎందుకు అణచాడో ఇవ్వాళ తెలిసి వస్తుంది” అని పయట చెంగుతో కన్నీరు తుడుచుకుని “భౌతిక కష్టాల మూలంగా నేను భగవంతుణ్ణి

నిర్ధయుడు, నిష్ఠురుడు అని అనేక నిందలు వేశాను. ఈ పాపిష్టిదానియందు ఆయనెంత దయ చూపాడో నాకు ఇప్పుడు తెలుస్తుంది. వారు మళ్ళా వచ్చినట్లయితే నేనూ నాశనమయ్యేదాన్ని. వారినీ నాశనం చేసేదాన్ని” అన్నది.

రాధారాణి దుఃఖాతిరేకంతో ఏమీ మాట్లాడలేకపోయింది.

“మళ్ళా ఎప్పుడైనా కనపడితే వారి పాదాలంటి క్షమాపణ కోరుకుందామనుకున్నాను. ఇక ఆ అవసరమేమీ లేదు. నాకు ఫోటో మాత్రం యివ్వు చెల్లీ! నాకు ఇంతకంటే కావాలసిందేమీ లేదు. కోరినా భగవంతుడు ఇక సహించడు. సరే, ఇక నేను వెళతాను” అని బిజిలీ లేచి నుంచున్నది.

రాధారాణి రుద్ధకంఠంతో “మళ్ళా ఎప్పుడు కనపడతావు అక్కా?” అన్నది.

“లేదు, ఇక కనపడను. నాకొక చిన్న యిల్లు వుంది. దాన్ని అమ్ముకొని వీలైనంత త్వరలో ఇక్కడనుంచి వెళ్ళిపోతాను.

అయితే ఒక్క సంగతి అడుగుతాను, చెబుతావా చెల్లీ! ఇంతకాలం తర్వాత తలవని తలంపుగా నన్ను ఎందుకు జ్ఞప్తికి తెచ్చుకున్నారు? పిలవటానికి వచ్చిన మనిషి మారుపేరు చెప్పవలసిన అవసరమేమొచ్చింది?”

సిగ్గుతో రాధారాణి మొహం ఎర్రబడిపోయింది. తల వంచుకుని మెదలకుండా కూర్చుంది.

బిజిలీ కొంచెంసేపు మౌనంగా వుండి”నన్ను అవమానించటానికె కదూ! అందుకేనా? అంతకు తప్ప నన్ను ఈ విధంగా ఇక్కడకు రప్పించిన కారణమేముంటుంది” అన్నది.

రాధారాణి తల మరీ వంగిపోయింది. బిజిలీ నవ్వుతూ “దీనిలో నువ్వు సిగ్గు పడవలసిన అవసరమేముంది చెల్లీ? కాని వారుకూడా చాలా పొరపడ్డారు. నా వద్ద నాదనేది ఏముంది, నాకు అవమానం జరగటానికి? సర్వస్వం వారికే అర్పించాను. అలాంటప్పుడు నా అవమానం వారి అవమానం కాదూ?” అన్నది.

“నమస్కారం అక్కా!”

“నమస్కారం చెల్లీ! నిన్ను ఆశీర్వదించే అధికారం నాకు లేకపోయినా

హృదయపూర్వకంగా నీ  పసుపు కుంకుమ కలకాలం ఉండాలని  భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.”

శరత్ చంద్ర చటర్జీ
బొల్లిమంత శివరామ కృష్ణ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *