ఏ ఊరు? అని అడిగింది చింతామణి. సమాధానం రాలేదు. చింతామణి చురుకుగా చూసింది. ఇహనో, ఇపుడో “ వాన పడేట్టుగా ఉంది వాతావరణం. చీకటి పడుతున్న వేళ అవ్వకపోయినా, ఆకాశం పూర్తిగా మబ్బుతో మూసేసి వుండటం వల్ల, చీకటి తొందరగానే పడిపోతున్నట్టు అనిపిస్తోంది. షెడ్ ని ఆనుకొని ఉన్న ఇంట్లో విద్యుద్ దీపాలు వెలిగాయి. వాటి వెలుతురు కిటికీ ఊసల్లోంచి షెడ్ లోపలికి ప్రసరిస్తోంది. షెడ్ కి కొంచెం దూరం లో రోడ్ మీద చిన్న చెక్క బల్ల మీద పాల ప్యాకెట్లు పెట్టుకుని గోపాల్ బేరం కోసం ఎదురుచూస్తున్నాడు. అక్కడికి వంద మీటర్ల దూరంలో ఉన్న మెయిన్ రోడ్ మీoచి రయ్యిరయ్యిమని వాహనాలు జోరుగా పోతున్నాయి. సందు చివర నుంచి తోవ లేకపోవడం వల్ల – ఈ సందు లోపలికి అట్టే వాహనాలు రావు. సందు చివర “ఐదు అంతస్తుల మేడతో మూసేసి ఉంది. దానికి తోవ ఆ పక్కన ఉంది.
తూర్పు పడమరలు సందు ని ఆనుకుని ఐదేసి అంతస్తుల అపార్టుమెంట్లతో అలరారుతూ వుండటం వల్ల సూర్య చంద్రులకి ఈ గోపాల్ షెడ్ వైపు చూసే అవకాశం బహు తక్కువ. పెద్ద రోడ్ పెరిగి పెరిగి ఎత్తుగా అయినందువలన సన్నపాటి సందు రోడ్ కి మూడు అడుగుల దిగువన ఉంటుంది ఏ మాత్రం వాన పడినా నీటి ప్రవాహం సందు లోకి ప్రవేశించి చికాకు పెడుతూ ఉంటుంది. ఉన్నట్టుoడి టపా టపా చిన్న గాలితో రెండు చినుకులు పడ్డాయి. ఎక్కడో దూరంగా ఉరిమింది గోపాల్ నిదానంగా లేచి పాకెట్స్ పెద్ద సంచి లో వేసి బల్ల ని అలానే వదిలేసి, షెడ్ లోకి వచ్చి పక్క నుంచి ఇంట్లోపలికి వెళ్లాడు, ఆ ఇల్లు కూడా పైన పఫ్ ప్యానెల్ వేసిన షీట్ తో ఉన్న షెడ్డే. మళ్లీ ఇంటి బైటకి వచ్చి షేడకేసి చూసి లైట్ వేశాడు. షెడ్లో ఉన్న గెదల్లో చిన్న అలజడి.
ఆ చిన్న షెడ్ లో దగ్గర దగ్గర ఇరవై గేదెలు ఉన్నాయి అన్నీ ఇంచు మించు ఒకే సైజ్ లో ఉన్నాయి, పోషణ తో నిగ నిగ లాడుతున్నాయి. నిలబడి కొన్ని పడుకొని కొన్ని ఉన్నాయి. గోపాల్ చింతామణి ని చూసాడు. పక్కనే ఉన్న కొత్తగా వచ్చిన గేదెని చూశాడు. అన్నీ మేత తిన్నాయో లేదో చూసాడు. ఎందుకో నిట్టూర్చి ఆకాశం వైపు చూసి దండం పెట్టాడు. కాళ్లు ఈడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు. సన్నగా వాన మొదలు అయింది.
చింతామణి తన పక్కనే దీనంగా నిలబడి ఉన్న తనకంటే చిన్నగా తనకంటే పొట్టిగా తనకంటే లేతగా, తనకంటే బలం తక్కువ ఉన్న ఆ కొత్తగ వచ్చిన గేదె ని చూసి మళ్లీ అడిగింది. “ ఏ ఊరు అంటే మాట్లాడవు ఏమే? మబ్బు మొహం వేసుకొని చూస్తావ్ ?” అని కసిరింది. పక్కనే ఉండి నెమరు వేసుకుంటున్న నిదానం అని గోపాల్ ముద్దుగా పిలుచుకునే గేదె నెమ్మదిగా తల ఎత్తి చింతామణి తో.. “వుండవే చింతామణి పాపం అలవాటు పడనీ అని చెప్పి కొత్త గేదె వైపు తిరిగి” మాట్లాడాలే అడుగుతుంది కదా చెప్పు చింతామణి అక్క మంచిది మాట కలిపితే మనసు నిమ్మళిస్తుంది” అని ఆరిందా లాగ చెప్పింది. “ అది — అలా గడ్డి పెట్టు దానికి అని శాంతించింది చింతామణి. అపుడు పక్కనే ఉన్న కొత్త గేదె నోరు విప్పింది. కళ్ల నీళ్లతో మాట్లాడటం మొదలు పెట్టింది “గడ్డి పెట్టిందా? ఏది ఎక్కడ?” ఎన్నాళ్లు అయింది గడ్డి తిని మా ఊరు, మా చేలూ, మా నేల, మా గాలి, మా పచ్చదనం, మా చెరువులు..అని పలవరిస్తూ దుఃఖించడం మొదలు పెట్టింది. నిదానం దానిని ఓదార్చింది “ ఒసేయ్ నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావ్, ఊరు మారావు. కంగారు పడకు మమ్మల్ని చూడు ఈ మిగతా జీవులని చూడు అన్నీ కోతల్లో నీలా బెంబేలు ఎత్తినవే. కొంచెం సర్దుకోవడం అలవాటు చేసుకోవాలి. అని సర్ది చెప్పింది. చింతామణి కొత్త గేది వైపు సాభిప్రాయం గా చూసి తల విదిలించి మీది ఏ ఊరే” అని నెమ్మదిగా మార్దవంగా అడిగింది. అపుడు కొత్తగా వచ్చిన గేదె నెమ్మదిగా ‘గొంప’ అంది.
అది ఎక్కడ ఉందే ? అంది నిదానం. ఉందిలే నాకు తెలుసు అంది చింతామణి. నీకు అన్ని ఎలా తెలుస్తాయే? అంది నిదానం. చూస్తే తెలుస్తాయి, వింటే తెలుస్తాయి. పట్టించుకుంటే తెలుస్తాయి. నాకు ఆ ప్రాంతం అంత తెలుసు. నేను అక్కడ నుంచి వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ ఉంటాను కదా, ‘రావికమతం’ దగ్గిర కదా మీ ఊరు” అంది. గొంప గేదె తల ఊపింది మరి మీ ఊరు నుండి ఎందుకు ఒచ్చేసావు? “ఎందుకంటే ఏటి చెప్పమంటావు. ఊర్లు ముసిలి అయిపోతున్నాయి అప్ప..ఏ ఇంట్లో చూసినా, ముసిలి దగ్గులూ, రాలిపోతున్న పెంకులు, పెచ్చులు ఊడిపోతున్న గోడలు, పాత ఇళ్లు ఖాళీ అయిపోతున్నాయి, కొత్త ఇళ్లు మనుషులు లేక బోసిపోతున్నాయి. కాస్త చిల్లర ఆడుతున్న మనుషులు అంతా పిల్లల చదువులకి అని పట్నాలకు వెళ్లిపోతున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. పురుగుమందు అరిగించుకోలేక పొలాలు మాడిపోతున్నాయి. అప్పులు కట్టలేక ఆ పురుగు మందులు తాగి మనుషులు పైకి వెళ్లిపోతున్నారు, అందరూ పశువులు తీసేస్తున్నారు, ఇంట పుట్టిన దానిని అని కూడా చూడకుండా నన్ను చుట్టాలకి వదిలేశారు. ఆళ్లు నన్ను వడ్డాది సంతకి తోలేశారు. అక్కడ పడమట నుంచి వచ్చిన ‘వీరబాబు’ అనే బ్రోకర్ నన్ను కొన్నాడు. అక్కడ నుంచి వాన్ ఎక్కించి తిప్పి ఈ ఊరు తీసుకొచ్చారు. చిట్టు, తౌడు తినబుద్ధి కావడం లేదు. కుడితి తాగాలనిపించడం లేదు. “ మరి మీ యజమాని నిన్ను అమ్మేస్తూ బాధ పడలేదా?నిదానం అడిగింది.
గొంప గేదె జాలి చూపులు చూసింది, మా యజమాని సూరి బాబు. అతని భార్య కనక నన్ను ప్రేమగా చూసేది. ఆవిడ నా కన్నా ముందే ఇల్లు ఖాళీ చేసేసి సామాన్లు సర్ది చిన్న వేన్ ఎక్కించి నా మెడ పట్టుకుని చాలా సేపు ఏడ్చింది. చోడవరం పంచదార ఫ్యాక్టరీ మూసీడం వల్ల ఆళ్లకి రావాల్సిన బకాయిలు ఆగిపోయాయి. కౌలు పంట గిట్టుబాటు కాలేదు. ఆళ్ల సొంత భూమి తనఖాలో ఉంది. పిల్లలకి చదువు అబ్బలేదు వ్యవసాయం చెయ్యరు పొట్ట చేతో పట్టుకొని పట్నాలకి పోయారు ఆడ పిల్లకి పెళ్లి చేసి పంపేసింది. భోగాపురం దెగర ఏదో ఒక మావిడ తోట కాపలాకి జీతానికి కుదురుకుని మొగుడు పెళ్ళాలు ఇద్దరూ వెళ్ళిపోయారు. నన్ను బాకీ కింద ఆళ్ళ చుట్టాలకి అప్పజెప్పారు పాలు ఒట్టిపోయాయి. వాళ్లు నా కూతురిని నాకు కాకుండా చేశారు దుర్మార్గులు. నాశనం అయిపోతారు. అని క్రోధం తో తిట్టింది. తిట్టి ఏడుస్తోంది చింతామణి దానిని అలానే చూస్తూ ఉండిపోయింది. కొంత సేపటికి గొంప గేదె తెప్పరిల్లింది. నిదానం మోర పైకి ఎత్తి ఏదో ఆలోచనలో పడింది దానికి ఏవో జ్ఞాపకాలు కదిలినట్టు ఉన్నాయి నిశబ్దంగా ఉండిపోయింది. ఇంతలో లోపలి నుంచి గోపాలు బైటకి ఒచ్చాడు. అతని కళ్లు ఎర్రగా ఉన్నాయి. జుట్టు చెదిరిపోయి ఉంది. వస్తూ వస్తూ తలుపు దభేల్మనీ వేశాడు. విసురుగా గేదెల షెడ్ లోపలికి వచ్చాడు. బయట చినుకులు తగ్గాయి. మెరుపు మెరిసింది ఎక్కడో వాన పడుతున్నట్లు ఉంది. చల్లగా గాలి వీస్తోంది. గోపాల్ చేతిలో ఉన్న మందు సీసా ఎత్తి గడ గడ తాగేశాడు వంగి చింతామణి మొహంలో మొహం పెట్టాడు గప్మనీ మందు వాసన కొట్టింది “నమస్తే చింతామణి మేడమ్ లవ్ యు” అన్నాడు చింతామణి చిరాకుగా మొహం తిప్పుకుంది. “ఓస్ ఓస్ ఏం పోస్ కొడుతున్నావే, నీ హొయలు హోషు దర్జా చూసి చింతామణి అని పేరు ఎట్టుకొని పూజిస్తుంటే మొహం తిప్పుకుంటోంది బొత్తిగ విశ్వాసం లేదే నీకు. నువ్వూ నా పెళ్ళాం లా తయారు అవుతున్నావు చూస్తాను చూస్తాను బలిసికొట్టుకుంటున్నావు, ఏదో ఒక నాడు నువ్వు తగ్గిపోతావు ఆ రోజు నేను తగ్గను ఖబర్దార్!! నేను ఎటో నీకు చూపిస్తాను” అని జర్రున జారి పేడలో పడ్డాడు. చింతామణి నిదానం నవ్వాయి. గొంప గేదె కూడా ఆ దృశ్యం చూసి చిన్న చిరునవ్వు నవ్వి అయ్యో పాపం అంది. గోపాల్ తమాయించుకొని లేచి నెమ్మదిగా తూలుకుంటూ అవతలకి వెళ్ళిపోయాడు.
చింతామణి అటే చూస్తూ వుంది. గొంప గేదె ఏటి అలా చూస్తున్నావు అప్పా అని అడిగింది. చింతామణి నిట్టూర్చి.. గోపాల్ గాడిని చూస్తుంటే “ చిరాకు జాలి కోపం అన్ని వస్తాయే నాకు..వాడికి మనం తప్ప మనుషులతో పెద్దగా పని ఉండదు..పెళ్ళాం చెప్పింది చెయ్యడం తప్ప మరో పని చేతకాదు. చాలా ఊర్లు తిరిగాక చాలా డబ్బులు పోగొట్టుకున్న ఈడిని ఈళ్ళ బామ్మర్ది తీసుకొచ్చి ఈ షెడ్ కట్టించి ఈ ఫారంలో పెట్టాడు. ఈడి మొదటి భార్య ఈడిని వదిలేసి వెళ్లిపోయింది అదిగో లోపల ఉన్నది ఈడి రెండో భార్య. ఆవిడ భర్త ఏదో ఆక్సిడెంట్ లో పోతే తెచ్చి ఈడికి తగిలించారు. ఈడు మనిషి మంచోడే కానీ ఆడు ఎందుకు బ్రతుకుతున్నాడో ఆడికే బోధ పడటం లేదు. పాలు పితకడం కోసం నిద్ర లేవడం, పిడకల కోసం పేడ ఎత్తడం, మళ్లీ సాయంత్రం గబగబా పాలు తీసేసి మందు వేయడం, పాలు అమ్మిన డబ్బులు బామ్మర్ది చేతిలో పెట్టడం, ఆడు పెట్టే దొబ్బులు తినడం. ఇదీ ఆడి దినచర్య. ఇది అంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా మనం ఈ మనుషుల కోసం బ్రతుకుతున్నాం.
ఇక్కడ ఈ షెడ్ లో ఉన్న మన అప్పజెల్లెళ్లు అందరూ నీలాంటి, నాలాంటి ఈ గోపాల్ గాడి లాంటి వాళ్ళే కానీ మనం వీడి కంటే చాలా అదృష్టవంతులం. ఎందుకో తెలుసునా? గోపాల్ గాడు చాలా మందికి సమాధానం చెప్పుకోవాలి. ఆడి బామ్మర్దికి, ఆడి పెళ్ళానికి , ఆడి బామ్మర్ది పెళ్ళానికి..చివరికి మనకి, పాలు కొనుక్కున్న వాళ్ళకి, బ్యాంకోళ్లకి..కానీ మనం.. దొరసాని బ్రతుకు మనది. మన పాల కోసం పిల్లలు ఏడుస్తారు మన పాల కోసం ఎక్కడో దేవుడు ఎదురు చూస్తాడు మనకి చిరాకు దొబ్బితే ఎడమకాలితో పాల బకెట్ తన్నేస్తాం. ఆడి బాబు తో చెప్పుకుంటాడు. ఎండ వచ్చినా, వాన వచ్చినా , కరెంటు పోయినా , షెడ్ తడిచిపోయినా మనకి జ్వరాలు వచ్చినా జబ్బులు వచ్చినా ఆడిదే పూచీ. మనం కేరేపిన్. నిజమే పాలు పెరగడం కోసం మనకి మందులు వాడతున్నారు పాలు పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఎంత చేసిన ఆడు ఆనందంగా లేడు. ఆడే కాదు మనుషులు చాలా మంది ఆనందంగా ఉన్నట్టు కనబడటం లేదు కానీ ఆడికి అయినా మనకి అయినా సత్యం ఒక్కటే, మనం ఈ మనిషి వెధవలతో తిరిగి కొంత చెడ్డాం. పూర్తిగా పాడు అయిపోతున్నాం. రేపటి గురించి వాళ్ళ లాగే మనమూ ఆలోచిస్తునామ్. బాధ పడతున్నాం. నన్ను చాలా ఊర్లు తిప్పారు రెండు సార్లు కబేళా కి కూడా తీసుకెళ్లబోయారు. ఏదైనా జరగొచ్చు మన చేతిల్లో ఏమీ వుండదు చాలా మంది జీవితాలు అలానే ఉంటాయి నీ కొమ్ములు వాడి ఎన్నాళ్ళు అయింది నువ్వు. నా కొమ్ములు బారుగా కత్తులాగ ఉంటాయి. వాడే అవకాశమే లేదు నీ కొమ్ములు మెలితిరిగి అలంకారంగా మిగిలాయి. ఎందుకంటే మనం అడివి లో లేము మనుషుల మధ్యలో ఉన్నాము. మనం పోరాటం మర్చిపోయాము ఆ అవసరం కూడా లేదు మన జీవితంలో పచ్చ గడ్డి ఒక ముగిసిపోయిన కల. శుభ్రమైన చెరువులో స్నానం ఒక అందమైన జ్ఞాపకం. చింతామణి ఏదో ఒక లోకం లో ఉన్నటు మాట్లాడుతోంది. నువ్వు వచ్చిన గ్రామాలు అన్నీ నాకు తెలుసు చెరువులు ఆక్రమించేశారు పిల్లల్ని గేదెలు కాయనివ్వడం లేదు పిల్లలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పశువుల ఆసుపత్రులు మూసేశారు. బళ్లు వ్యవసాయానికి వాడటం లేదు. అందుకే దున్నపోతులు ఎక్కడా కనబడటం లేదు. నువ్వు ఎన్నాళ్ళు అయింది దున్నపోతుని చూసి. మన జాతి మనుషుల సరదా కోసం నడుస్తోంది పాల కోసం మనల్ని వీర్యం కోసం పోతుల్ని పెంచుతున్నారు మనుషులు. ఇప్పుడు పాలు కూడా వద్దు అంటున్నారు. ఉన్నట్టు ఉండి జనం అంత పాలు మానేస్తే మనకి ఈ పెట్టె తిండి కూడా పెట్టరు అసలు మనల్ని చంపుకు తినేస్తారు తప్ప బ్రతకనివ్వరు.
మనిషికి మనం కావాల్సిన అన్నాళ్ళు మనల్ని చూసుకుంటాడు. నీకు నచ్చిన నచ్చకపోయినా నకరాలు దొబ్బకుండా. కుడితి తాగు వారానికి ఒక రోజు దూరంగా ఉన్న ఒక చెరువుకి తీసుకెళ్తాడు దాని నిండా కెమికల్స్ కలిసిపోయిన నీళ్లు వస్తాయి దిగడానికి మొదట కష్టంగా ఉంటుంది తరువాత అలవాటు అయిపోతుంది ఎక్కువ ఆలోచించకు. అప్పుడు మనం మనుషుల లాగా అయిపోతాం. సుఖం ఉండదు కాబట్టి ఈ క్షణం నిజం..ఈ షెడ్ ఏ నిజం. ఈ మేత నిజం. రేపటి సంగతి రేపు. ఎండ వస్తుంది, చీకటి పడుతుంది, మన వల్ల గోపాల్ గాడు వాడి బామ్మర్ది బ్రతుకుతున్నారు అని, ఎక్కడో ఏ ఆస్పత్రిలోనూ ఏ జబ్బు మనిషికో మన పాలు అందుతాయి అన్న నమ్మకం తో ఆనందంగా గడుపుదాం సరేనా ఈవేళ్టినుంచి నువ్వు మాలాగే సిటీ గేదె వి. ఈ సిటీ లో ఉన్న మనుషుల్లో చాలా మంది మన లాగే ఎక్కడ ఎక్కడి నుంచో వచ్చినోళ్లే. ఇష్టం లేకుండా వచ్చి ఇష్టం లేకుండా బతికి ఇష్టం లేకుండా చచ్చిపోతున్నారు. అది మనకి అనవసరం వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. మనం అలా బ్రతకొద్దు ఇష్టం తో బ్రతకాలి ఇష్టంగా బ్రతకాలి పొద్దు పోయింది తిండి తిను అరిగించుకో నిద్రపో జంతు ప్రపంచంలో మన తోటి జాతులు అన్ని నెమ్మది నెమ్మదిగా అంతరించి పోతున్నాయి మనం ఇంకా ఉన్నాం ఇది నిజం. ఇంకా ఉంటాం అది నమ్మకం. మనిషికి తోడుగా ఉన్న అంత కాలం ఉంటాం, ఉందాం. సరేనా అంది ఆదరంగా. ఇంకో మాట నీ ఆనందం కోసం ఈ ప్రపంచం ఏమీ పూచీ పడదు మన ఆనందం మనదే, మన వెలుగు మనదే, మన బ్రతుకు మనదే, మనల్ని మనమే వెలిగించుకోవాలి తెలిసిందా? అంది. గొంప గేదె ఉత్సాహంగా చూసింది, తన మెడతో ప్రేమగా చింతామణి ని స్పృశించింది నిదానం ఇద్దర్నీ ఆప్యాయంగా చూసింది పల్లెటూరి గొంప గేదె గొప్ప ఆత్మ విశ్వాసంతో ఆ క్షణం సిటీ గేదెగా మారి బోర విరుచుకుని నిలబడి మేత తినడం ప్రారంభించింది. గేదెలు అన్నీ హర్షాతిరేకoతో చూస్తున్నాయి.

