ముత్రాసిగూడెం 

Spread the love

ఊళ్ళల్ల బేరం చేసుకుంట అబ్బా అందరితో మంచిగుండేటోడు. పతొక్కరు ఆయన్ని మంచిగ చూసుకునేటోళ్లు. అరుసుకునేటోళ్లు. ‘ఇగో ఈ కోడిపెట్ట తీస్కపోయి పిలగాండ్లకు పెట్టు, ఇగో ఈ సెనక్కాయలు తీస్కపో పిల్లలకి, మొక్కజొన్నకంకులు తీస్కపో ఇంటికి, ఇగో ఈ దూలం,మొగురం తీస్కపో’ ఇట్లా ఆయనని ఆదుకున్నోళ్లు, అక్కునజేర్చుకున్నోళ్లు, కడుపలది తీసి పెట్టినోళ్లు ఎందరో ఆ ఊళ్ళల్లో !

పొగాకు వాడకం ఎక్కువగా ఉండేది, బీడీలు తాగేటోళ్లు -అప్పట్ల కూజా బీడీలు -ఫేమస్. పువ్వాకు  బేరం కూడా బానే ఉండేది. ఇంకా తినేడివి, అవికాక మసాలదినుసులు… ఉద్దెర అడిగినా కాదనకుండా ఇచ్చేటోడు. గుర్తుపెట్టుకొని ఇయ్యాలే అనేటోడు. అట్లా కలిసిమెలిసి ఉండేడిది ఆయన తత్వం.

ఆయనంటే ఇష్టంతో కూడిన చనువు. మేం అబ్బ వెంట వెళితే ‘ఏందన్నా ! పొలగాండ్లను కూడా తిప్పుతున్నవేందే -సదువుకునేటోళ్లని బడికి పోనీయక’ అనేటోళ్లు. 

‘ముత్రాసిగూడెం’లో పిట్టల పెంటయ్య ఇంట్ల కొంచెం స్వతంత్రం. వాళ్ళు ముత్రసోళ్లు . మా అబ్బ పెంటయ్య గారి ఇంటామెని ‘అక్కా’అని పిలిచేంత దగ్గరితనం. తమ్ముడా’అని పిలిచేది ఆమె. మాక్కూడా వరసలు పెట్టి పిలుపులుండేవి ఆ ఇంట్ల. అత్తమ్మ, అని, మామ అని, వాళ్ళ పిల్లల్ని -బిక్షం,శీను – బావ అనే పిలుపులు. చుట్టాల ఇంటికి పోయినట్లుగా ఉండేది. వాళ్ళింట్ల అన్నం తింటే ఆ రుచి ఇప్పటికీ మరిచిపోలేను. ప్రేమతో పెట్టిన అన్నపు రుచి అది. విలువకట్టలేం. శుభకార్యాలకు వెళ్లినా మంచిగ చూసుకునేటోళ్లు. మా ఇంట్ల ఏం శుభకార్యం జరిగినా వాళ్ళు కూడా అట్లనే వచ్చేటోళ్లు. మా నాన్నని మంచిగ చూసుకున్నరు. అర్సుకున్నరు. అసుంటోళ్లు ఇంకున్నరు. రెడ్డిబోయిన శ్రీహరి, బిక్షమయ్య, మాడె నాగయ్య, వడ్ల భద్రయ్య… శానా పేర్లున్నయి.

అటువంటి ఇళ్ళని మానాన్న సంపాదించుకున్నడు – యాడ పుట్టిండో, యాడ తిరిగిండో, కానీ అందర్ల శభాష్ అనిపించుకుండు.

అట్లా చీమలెక్కన ఒక్కో కర్ర, ఒక్కో పనిముట్టు పేర్చుకుని ఇల్లు కట్టిండు. కొన్నాళ్ళకు ఒక ఆవును కొన్నడు. ఎర్రావు. దాన్నే బుజ్జావు అని పిలిచేటోళ్లం. అది వచ్చినంక ఇల్లు తీరు మారింది.  ఇంటిముందు పందిరి గుంజకు దాన్ని కట్టేసినంక పచ్చిగడ్డి వేసి శ్రద్ధగా చూసేటోళ్లం. కొన్నాళ్ళకు అది కట్టింది. మంచి మొనగాడి కోడెదూడను కన్నది. గిడసది కాదు, మంచి సాలు. ఆ తర్వాత కొన్ని గొడ్లు, కొన్ని మేకలు ఇంటికొచ్చాయి. గొడ్లకోసం. ముందు పందిరి. ఆ తర్వాత కొట్టం – ఇలా పెరిగింది ఇల్లు. ఇంటిముందట పేడ, గడ్డి, రొచ్చు, దోమలు, ఈగలు -అన్లనే బర్కత్ అయ్యింది. బతుకుల అన్నం దొరికింది.

ఆ రోజుల్ల జొన్నన్నమే. పొద్దుగాల పెద్దరోట్ల జొన్నలు తొక్కాలే పొట్టు పోయిందాక. ఆ తర్వాత నీళ్ళల్ల పొట్టు పోయిందాక కడిగి, కలినీళ్లు పోసి ఎసరపోసి పొయ్యిమీద పెట్టాలె. జొన్నగంజి తాగేటోళ్లం. ఇప్పటి టిఫిన్ లాగా, ఇప్పటి రాగి జావ లాగా !

జొన్నన్నంల కూరో, గోంగూర పచ్చడో, మామిడికాయ పచ్చడో, చింతతొక్కో వేస్కోవలె. కొంచెం చల్ల ఉంటే, పిసుక్కోని తింటే, అంచుకు ఈ తొక్కులో, పచ్చడ్లో ఉంటే దాని మజా వేరు.అదే స్కూలుకు పోయినా, చేనుకు పోయినా రాతెండి టిపిన్ల కట్టుకుని పోవాలె. ఏడ ఏలయితే ఆడ తినడం . మోదుగాకులు కోసి, ఇస్తరి కుట్టుకుని అందుల తింటే ఇంక బాగుంటది.

*

పాలు పుష్కలం. అప్పట్ల టీ బెల్లంతో కాసేడిది. నీళ్లల్ల చాపత్త, బెల్లం వేసి మరగనిచ్చి, మరగనిచ్చి, పాలు పోసి మళ్ళీ మళ్ళీ మరిగిచ్చి  అప్పుడు గాని టీ తాగకపోయేది. ఓ గంటన్నర ఆ పొంతపొయ్యి మీద కట్టెలు ఎగదోసి ఎగదోసి చివరికి ఆ అమృతపానీయ సేవనం అన్నమాట. పెద్ద పెద్ద ఇత్తడి గ్లాసుల్లో టీ తాగడం. అబ్బో – అదో అడ్వెంచరస్ టీ కత.

ఆ లోపున పిల్లలం అందరం బిందెలు తీసుకుని బుగ్గకిపోయి నీళ్లు మోసి మోసి గాబు నింపాలి. కుడితి గాబు నింపాలి. పొద్దున ఆ పని మా చిన్నతనంల తప్పనిసరి. గడ్డికోసేందుకు ఊళ్ళ గొడ్లు న్నోళ్లు కొడవల్లిక్కులతో రెడీ. మా ఇంట్లకు కూడా గడ్డిమోపులు రావాల్సిందే. గడ్డికి పొండ్రా ‘అంటే పోవుడే ! పోవాలె, గడ్డిమోపు తేవాలె – ఆ తర్వాతే బడి.

*

బాల్యం ఇలాగే గడిచింది, ఇట్లనే చేసినం, ఇట్లున్నం అని గీతగీసినట్లుగ గడపలేదు. ఒక్క కాలంలనే గొడ్లు కాసుడు, గడ్డి కోసుడు, ఐస్ క్రీములు అమ్ముడు, కిరాణకొట్ల జీతం ఉండుడు -ఆ పనులు ఈ పనులు అనుకుంట-  పనులు చేసుకుంట చదువు సదువుకుంట సిన్నతనం గడిసింది. అవన్నిటిని యాద్ చేసుకుంట, ఆ కాలంలకి వెనక్కి పోవుకుంట రాయాలే. రాస్త. ఒక్కొక్కరోజు వాటిపొంటి పోవుకుంట, ఇమ్మర్సగ రాయాలే.

*

Kavi Yakoob

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *