అమ్మ విలువ చాలా మందికి ఆమె లేనప్పుడే అర్ధం అవుతుందనే మాట తరుచుగా వినిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ ప్రపంచంలో చాలా తేలికగా తీసుకునే బంధం అమ్మదే. అడగకుండానే అన్నీ దొరికే చోటు పట్ల ఎంత ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అయినా తెలిక భావాన్నే ప్రదర్శిస్తారు. అది మానవ నైజం. కాని ఆ చోటు మనది కాకుండా పోయినప్పుడే మన జీవితంలోని లోటు అర్ధం అవుతుంది.
మనల్ని కాచుకునే తల్లి ఉన్నప్పుడు ఎవరైనా ఆమె పడే కష్టాన్ని పెద్దగా పట్టించుకోరు. అది చాలా సహజమైన చర్యగా కనిపిస్తుంది. పైగా ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ మనం ప్రపంచంలోకి దూసుకుపోతున్న కొద్దీ తల్లి చాలా వెనుకపడిన జీవిగా కనిపించడం మొదలవుతుంది. ప్రపంచంలో ఆకర్షణలను అందుకుని ఏదో సాధించామని విర్రవీగుతాం. జీవితం పట్ల కాస్త అవగాహన వచ్చాక, ఆకర్షణల మోజు కొంత తగ్గగానే మనల్ని భూమిపై నిలిపి ఉంచిన ఆ పునాది తల్లి అని అర్దమయి, మనం నిర్మించుకున్న భవంతి ఆ పునాది పైనే అన్నది రుజువయ్యాక అప్పుడు తల్లి గురించి అలోచిస్తాం. కాని అప్పటికే మనం తీసుకున్న నిర్ణయాలు, మన ప్రయాణం కోసం ఏర్పరుచుకున్న మార్గాలు ఆ తల్లిని మానసికంగా మనకు దూరం చేస్తాయి. తల్లి వయసు ఉడిగిపోయి శారీరికంగా బలహీనంగానూ, అందరూ తనకు దూరం అయ్యాక మానసికంగా ఒంటరితనాన్ని ఆస్వాదించే శక్తిని సంపాదించుకున్న మానవిగానూ కనిపిస్తుంది. అపరాధ భావంతో ఆమెకు ఎంతో సేవ చేయాలని, రుణం తీర్చుకోవాలని అనుకుంటాం. కాని అదీ వృద్ధా ప్రయాసే. ఎందుకంటే తల్లి రుణం తీర్చుకునే శక్తి ఏ కొడుకుకీ, కూతురికీ ఉండదు.
పెరుమాళ్ మురుగన తన తల్లి జ్ఞాపకాలను వ్యాసాల రూపంలో రాసిన చిన్ని పుస్తకం ఈ ‘అమ్మ”. అరుణ ప్రసాద్ గారి అనువాదం దీనికి తెలుగుతనాన్ని ఆపాదించింది. మురుగన్ తల్లి ఓ రైతు కుటుంబంలోకి కోడలిగా వచ్చింది. పని తప్ప ఆమెకు మరొకటి తెలియదు. బద్దకస్తుడు, తాగుబోతైన భర్తను పక్కన పెట్టుకుని ఇద్దరు కొడుకులతో జీవితం నెడుతూ కుటుంబం కోసం ఎడతెరిపి లేకుండా చాకిరీ చేసిన స్త్రీ ఆమె. పైసా పైసా కూడపెడుతూ ఓ నాలుగు చీరలు తప్ప తనకేమీ ఉంచుకోని సగటు పల్లెటూరి స్త్రీ ఆమె. ఇందులో ఆమె గురించి రాసినది చదువుతుంటే మన ఇంట్లో అమ్మలు, అమ్మమలు గుర్తుకు వస్తారు. ఇద్దరు బిడ్డలకు మంచి జీవితం ఇవ్వడానికి నిరంతరం శ్రమించింది ఆమె. పెళ్ళి అయి ఇద్దరు పిల్లలు పుట్టాక అప్పుల బాధతో పెద్ద కొడుకు అత్మహత్య చేసుకున్నా, రెండవ కొడుకు తనను కాదని మరో కులం స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆ వ్యథలను, ఒంటరితనాన్ని భరించి జీవించడం నేర్చుకుంది. మురుగన్ ప్రేమ వివాహం కారణంగా ఆమె అతని పెళ్లికి వెళ్లలేదు. అతని మామ అనారోగ్యం గురించి తెలుసుకుని ఒక్కసారి మాత్రమే వియ్యంకుడిని చూడడానికి వాళ్లింటికి వెళ్లిందట. జీవితాంతం ఒక్కతే తన ఇంట్లో జీవించింది. చెట్లను, మేకలను పెంచుతూ ఆఖరిదాకా తన డబ్బు తానే సంపాదించుకుంటూ బ్రతికింది. కోడలిని స్వీకరించినా మర్యాదపూర్వక దూరాన్ని చివరిదాకా పాటించింది.
చివరి రోజుల్లో పార్కిన్సన్ వ్యాధితో కొడుకు ఇంట చేరినా తన శ్రమించే తత్వాన్ని ప్రద్రర్శిస్తూనే ఉంది.
అనారోగ్యంతో భర్త మరణిస్తే ఒంటరిగా ఇద్దరు కొడుకుల భవిష్యత్తు కోశం శ్రమించిన స్త్రీ ఆమె. నిజానికి ఈ వ్యాసాలను చదువుతూ ఉన్నప్పుడు స్త్రీకి భర్త, కొడుకులు ఎంత వరకు తోడు అన్న భావం కలగకుండా ఉండదు. ప్రకృతి ధర్మమే కావచ్చు కాని రెక్కలు వచ్చాక పిల్లలు పరాయివాళ్ళే, ప్రకృతికి దగ్గరగా ఉన్నవారే దీన్ని సహజ పరిణామంగా స్వీకరిస్తారెమో. తండ్రి చనిపోయాక తెల్ల చీర తల్లికి సమాజం ఇస్తుంటే చూస్తూ మౌనంగా ఉన్న మురుగన్ ఆ తర్వాత కొన్నేళ్ళకి తల్లిని రంగు చీరలు కట్టుకోమంటే “నాకు తెల్ల చీర ఇచ్చిననాడే ఈ నోరు ఆ మాట చెప్పి ఉంటే నేను రంగు చీరలే కట్టుకునేదాన్ని’ అని ఆ తల్లి కోడుకు కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పిన మాట లోని విషాదం, కొడుకుల నుండి తల్లులు ఎదుర్కునే ఆశాభంగం ఎంత మందికి అర్ధం అవుతాయి?
వితంతువు పొలంలో నాట్లు నాటడానికి పనికి రాదన్న ఊరిలో వ్యవసాయ మెళుకువలు తెలియని కొడుకులతో ఆమె చేసిన ఒంటరి పోరాటం, చివరకు “నేను గొడ్డుదానిలా ఉన్నా సరే పొలం బంజరు కాకూడదని” తానే నాట్లు నాటిన మొండిధైర్యం ఆమె వ్యక్తిత్వాన్ని ప్రకటిస్తాయి. ఇంట్లో ఒకో గిన్నె కొనడానికి ఆమె పడ్డ కష్టం. ఇంటి స్థలం కోసం పొలం కోసం ఆమె చేసిన పొదుపు, ఇవన్నీ ఇప్పటి తరానికి అర్ధం కాని విషయాలే కావచ్చు కాని ఒక స్త్రీ తన ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి ఎంత శ్రమ పడేదో దాని విలువ తెలియని, అర్ధం కాని సంతానంతో చివరిదాకా ప్రేమను నిలుపుకోవడానికి ఎంతగా మనసులో సంఘర్షించేదో, ఆ వైపుగా ఏ కొడుకూ పూర్తిగా అమ్మ కథ చెప్పలేడు.
ఇందులో మురుగన్ శైలి అదే విధంగా ఉంటుంది. ఆయన గొప్ప రచయిత. కాబట్టి తల్లి కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు రాయగలిగారు. కాని అంతర్లీనంగా తల్లి ఒంటరితనం మనకు తెలుస్తూ ఉంటుంది. తరాల మధ్య అంతరాలు, జీవన పరిస్థితుల మధ్య వైరుధ్యాలు వీటన్నిటి నడుమ స్త్రీ తన కొడుకుల నుండి మానసికంగా తనను తాను విడిపించుకుంటూ ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం ఒంటరిగా ఉంటూ, ఉన్నంత వరకు పిల్లలకు అండగా ఉండడానికి సిద్దపడుతుంది. మురుగన్ తల్లి కూడా అలాగే జీవించారు. కోట్లాది అమ్మల వలే ఆమె ప్రేమమయి. శ్రమ జీవి, అల్ప సంతోషి, కాని ఒంటరి. భర్త ప్రేమను అతని బలహీనతలతో పాటుగా అనుభవించింది ఆమె. కొడుకుల జీవిన మార్గాలు తన ఆలోచలనలు భిన్నంగా ఉంటే దానికీ తన జీవితాన్ని అలవాటు చేసుకుంది. జీవితాంతం శ్రమను నమ్ముకుంది. ఒకానొక సమయంలో పక్షులు, జంతువులనే నేస్తాలుగా చేసుకుని జీవించింది. కొడుకుతో దగ్గరగా ఉంటూనే దూరంగా, దూరంగా ఉంటూనే దగ్గరగా జీవించంది. చివరకు ఆ కొడుకు గుండెల్లో గౌరవంగా ఒదిగిపోయింది. కోడలు ఆమె గురించి అబ్బురంగా తన జ్ఞాపకలకు ముందు మాట రాసి ఆమె పట్ల గౌరవాన్ని ప్రదర్శించేటంత గొప్పగా బ్రతికింది.
ఈ పుస్తకాన్ని మురుగన్ చాలా నిజాయితీతో రాసారు. ఎక్కడా తగ్గకుండానే తల్లి శ్రమ, కష్టంలో ఆమె ఒంటరి పోరును నిజాయితీగా వ్యక్తీకరించారు. సాహితీ ప్రపంచంలో వెలుగు చుక్కగా ప్రకాశిస్తూనే, తన తల్లి నీడ ఇచ్చిన బలాన్ని, ఎల్లప్పుడూ తనకు దారి చూపేది ఆమె ప్రేమే అన్న నమ్మకాన్ని ప్రకటించుకోవడానికి వెనుకాడలేదు. ఇందులో ప్రఖ్యాత తమిళ రచయిత పెరుమాళ్ ముగునగ్ కాదు ‘పెరుమాయి చిన్న కొడుకు’ మురగన్ కనిపిస్తాడు. అందుకే ఈ పుస్తకం పాఠకులకు నచ్చుతుంది.
పుస్తకం పేరు – అమ్మ
పబ్లిషర్ – హైదరాబాద్ బుక్ ట్రస్ట్
అనువాదం – అరుణ ప్రసాద్
