మామూలుగా కాగితం పైన కలంతో బొమ్మలు వేయడమే కాకుండా స్కూటరెక్కి వెళ్ళి రోజుకు ఇన్ని గంటలు అనే ఉద్యోగం చేసేవాడు మా మంచి ఆర్టిస్ట్ చంద్రగారు. ఒకరోజు చంద్ర గారు రిటైర్ అయిపోయే గంట కొట్టింది. ఆ రోజుని ఎంత సెలబ్రేట్ చేశారో మా ఇంకో మంచి ఆర్టిస్ట్ మోహన్ గారు. ఇట్లాంటి చిన్నచిన్న చిట్టి ముచ్చటలకు ఆయన ఇంకా చిన్నచిన్న బొమ్మలు వేసి, నాలుగంటే నాలుగు , ఎనిమిదంటే ఎనిమిదే వాక్యాలతో మంచి ఆహ్వాన పత్రిక ప్రోజ్ రాసేవాడు. అవెంత బావుండేవో మాటల్లో చెప్పలేను. మాటల్లో చెప్పగలిగింది ఒకటే , మోహన్ గారు ఈ లోకం నుండి పోతూ పోతూ తనతో పాటు మంచి వాక్యాన్ని కూడా పట్టుకు వెళ్ళిపోయాడు. తెలుగు వచనాన్ని దిక్కు లేకుండా చేసి.
ఇదిగో ఇట్లా పనికిమాలిన ఉద్యోగాలు చేస్తూ టైమ్ అంతా వేస్ట్ చేసిన చంద్ర ఇప్పుడు ఒకచోట కుదురుగా కూర్చుని బోలెడన్ని బొమ్మలు వేస్తాడని ఆయన రిటైర్మెంట్ రోజున సంబరం చేశాడు మోహన్ గారు. ఇప్పడు ఎందుకీ పాత స్మృతి అంటే. రిటైర్మెంట్ అనే మాటని పట్టుకుని. స్టెత్ స్కోప్ పట్టుకుని హడావుడిగా గడియారం ముల్లులు కాళ్ళకు తొడుక్కుని టిక్కుమ్ టిక్కుమ్ అంటూ ఎప్పుడూ నడుస్తూనే ఉండే మా అమ్మ ఆ డాకటర్ గిరి పని మానేసి ఎప్పుడూ పుస్తకాలు పుచ్చుకుని చదువుతూ ఉండాలని నా కోరిక. ఇప్పటికీ ఎంత పని ఉన్నా రోజుకో పుస్తకం చదవనిది తను నిద్రపోదు, పుస్తకాన్ని నిద్రపోనివ్వదు , అది కాదు విషయం. తనకు సమయం ఉన్నప్పుడల్లా నా ఎదురుగా కూర్చునో, ఫోన్ లో పలకబడో “ఏయ్ ! అన్వర్, ఇదిగో ఈ కథ విను ఎంత బావుందో” అని వినిపించేది. ఇప్పుడు అంతగా కుదరడం లేదు కానీ ఒకానొక సమయంలో మేమిద్దరమూ కూర్చుని గంటలకొద్ది సమయాన్ని పుస్తకాలు చదువుతూ, వినిపించుకుంటూ గడిపేసేవాళ్ళము. రీడింగ్, ఆయా ప్రపంచ సాహిత్యం గురించి మాట్లాడుకోవడం, ఇంకా ఏమేమి కొత్త పుస్తకాలు ఉన్నాయా అని వెదుక్కోడం , వాటిని చదువుకోవడం ఎంత సత్సంగో మాటల్లో చెప్పేది కాదు. పండగలప్పుడో, సెలవురోజులలోనో క్లినిక్ లో ఎక్కువ జనసందడి ఉండదు కదా కన్సల్టింగ్ రూమ్ లో మా అమ్మ కూర్చుని ఉంటే నేను పామర్రు నుండి హైదరాబాద్ అంత దూరంలో మా ఇంటి మంచం మీద సాగిలబడి కిలోమీటర్లకొద్ది కథలని చదువుతూ తనకు వినిపిస్తూ ఉండేవాడిని. చదువు భలే హాయయినది . కలిసి చదువుకోవడం, చదువుకున్న దాని గురించి కబుర్ల మీద కబుర్లాడుకోవడం చాలా అంటే చాలా నాణ్యమైన కాలక్షేపం. జీవఫలం.
అవన్నీ పోయాయబ్బా! అని అనుకునే ఒకానొక మంచిరోజుల్లో బాపుగారి బొమ్మలతో హరివిల్లు అని పుస్తకం వచ్చి ఉండింది. ఈ రోజుల్లో లా చిటికెన వేలి గోరంత అభిప్రాయాలు, పుస్తక సమీక్షల అల్పభాగ్యాలు , అచ్చయ్యే పత్రికా కాలమూ కాదు, దానికి తోడు నేను చాలా అసాధ్యమైన మనిషిని. బాపుగారి పుస్తకం గురించి ఒక రివ్యూ రావాలి ఆదీనూ ఏ దిక్కూ దివాణం లేని పత్రికలో కాదు తెలుగులో అత్యంత వ్యాప్తి ఉన్న పెద్ద పేపర్లో రావాలి. ఎవరు పడితే వాళ్లు రాయడం కాదు. ఒక పర్వతమంత పని గురించి దాని తలపై ఏనుగు మందంత మేఘమే గొడుగు పట్టాలి. అందుకని నేను సరాసరి ముళ్ళపూడి వెంకటరమణ గారినే రివ్యూ రాసి ఇవ్వమని అడిగాను. నేను ఇట్లా అడిగిన విషయం విని పెద్ద పేరున్న నామిని సుబ్రమణ్యనాయుడు గారు , అబ్బే అని పెదవి విరిచారు ”బాపు పుస్తకం మీద రమణో లేదా బాపు వాళ్ళ నాయనమ్మో రాయడం ఏమంత గొప్ప” అని నాపై తేలిక పోయాడు. బ్యాడ్ ఐడియా అని నవ్విపోయాడు. నేను అట్లాంటి నవ్వులు ఎకసెక్కాలు లెక్కచేసే రకం కాదు. రమణ గారితో ఆయన నవ్వంత అందమైన రివ్యూ రాయించాను, అదీను ముందు వరుసల్లో చెప్పినంత వేలిగోరంత రివ్యూ కాదు సింగల్ డమ్మీ పేజీలో సగానికి పైగా రివ్యూ. మహా అంటే మహా నాణ్యమైన రివ్యూ. కంటిచూపు సాగినంత కన్నుల విందు రివ్యూ. ఇంతకూ చెప్పవచ్చేదేమిటంటే , ఒక మంచిపని మన కళ్ళముందుకు, అందుబాటులోకి వచ్చినపుడు దాని గురించి ఒక మంచిమాట చెప్పడానికి మాది మాది సేమ్ బ్లడ్ గ్రూప్, మేమూ మేమూ ఇరుగ్స్ పొరుగ్స్, మా వేలు విడిచిన చినమామయ్య గారి భార్య తొడి కోడలు మొగుడి కొడుకుకు , నాకు ఒకే బ్యాంకు లో ఖాతా ఉంది కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పడం ఏం బావుంటుంది అని మోహమాటపడడం తాలూకు స్పెల్లింగ్ నా నిఘంటువులోనే లేదు. ఇంకా చెప్పాలంటే నా దగ్గర అసలు డిక్షనరీ యే లేదు. ఇది మంచి పని, ఇది ఎన్నదగిన విషయం అని అనిపించినపుడు చెప్పే తీరాలి.
ఇదిగో ఈ రోజు మా భార్గవి గారు తన చదువు కథ అనే పుస్తకం తెచ్చింది. దానిని నేను చదివాను. చదువు అనేది ఊరికే కదలక మెదలక మస్తిష్కంలో ఒక కదలిక అవకుండా కూర్చొంటే మరేం గొడవ లేదు. ఈ పుస్తకంలో నా బాధ ప్రపంచపు ఘోష అనే సందేశం కూడా ఏమీ ఉండదు. పుచ్చుకున్న వాళ్ళకు పుచ్చుకున్నంత. వర్షపునీటిని ధరించిన చెట్టుకొమ్మ మన నెత్తిమీద చల్లని నీటి బిందువుల అభిషేకం చేయవచ్చు, పూలని దాల్చిన అదే కొమ్మ మన నెత్తి మీద పూలవానా కురిపించవచ్చు, సువాసనాల బరువు నీ చుట్టూ నా చుట్టూ నింపవచ్చు. ఇదిగో ఈ పుస్తకం చదువుతూ, ఈ పేజీల దీపపు కాంతిలో నేను ఎన్ని మిణ మిణ మిణుగురుల దీపముద్రల వెంట నడిచానో నాకు తెలుసు. ఈ పుస్తకం నాకు మునుపెన్నడూ విని ఉండని ఏలూరిపాటి అనంతరామయ్య గారిని పరిచయం చేసింది, ఆయన్ని భక్తిగా అనుసరించి వఝల రంగాచార్య అనే పెద్దమనిషి మాటలు కూడా విన్నాను ఆయన నాకు పొతనని ఎలా చదవాలో నేర్పారు, పోతన గారు నాకు సరస్వతీ దేవి సాక్షాత్కారం చేయించారు. ఒక్కసారిగా తెలుగు పద్యపు సొబగు దారి నుండి కాస్త మళ్లించి ఇదే పుస్తకం నాకు బెంగాలీ దారుల్లోకి తీసుకెళ్లింది. ‘విరాజ్ బహు’’బడదీది’ ‘ఆనంద్ మఠ్’ ‘కపాల కుండల’ ‘ దుర్గేశ నందిని’ .. సాహిత్యాన్ని, దానికి వడ్డాది పాపయ్య, బాపు గారు వేసిన బొమ్మలను వెదికి చూడటానికి కన్నులు తెరిపించింది. విద్వాన్ విశ్వంగారి మాణిక్యవీణ వినిపించింది, పాత ఆంధ్రప్రదేశ్ పత్రికల పుటలు తెరిచి బుజ్జాయిగారు చిత్రించిన ప్రకాశం పంతులుగారి జీవిత చరిత్ర బొమ్మలకథని కన్నులకు కట్టింది. వి ఏ కే రంగారావు గారి ‘చిత్రరథుని చైత్రయాత్ర’ లో విహారం చేయించింది. యవ్వనాన్ని పూని, ‘జ్యోతి ‘అనే పత్రికను అడ్డుపెట్టుకుని బాపు రమణ అనే ఇద్దరు కొంటెవాళ్ళు- కోణంగి మనుషుల విశ్వరూపం పుటలు తెరిపించింది. ఇంత మంచి పత్రిక ఒకప్పుడు మన ఆస్తిగా ఉండిందా అని కనుదోయిని నిబిడాశ్చర్యం కమ్మించింది. ఈ పుస్తకపు వాక్యపు వరుసలో కొట్టుకు పోతూ నేను ఆర్. వసుంధరాదేవి గారు రాసిన పుస్తకాలు మొత్తం సంపాదించుకున్నాను. భయం , భక్తి, జంకు ఎరగకుండా ఆవిడ చేసిన విశ్వనాథ సత్యనారాయణ ఇంటర్యూ చదివే అదృష్టం దక్కించుకున్నాను. మళ్ళీ మరోసారి అంటూ ఆచంట జానకీరామ్ అనే అద్భుత మానవుడినీ, శ్రీపాదవారి అనుభవాలు – జ్ఞాపకాలూనూ అనే అత్యద్భుత ఆత్మకథనూ గుండెలకు హత్తుకున్నాను. చేబోలు శంబూశాస్త్రి అనే అతి పొడవైన, అతి వెడల్పైన ఒకే ఒక తెలుగు సాహితీ పాత్రకి వేయినొక్కవసారి సాష్టాంగ దండ ప్రణామ మయ్యాను. ఈ పుస్తకపు పేజీలు తిరగేస్తూ మళ్ళీ చందమామని ఎక్కాను ఆక్కడ వెయ్యినొక్కరాత్రుల మెలకువ పూర్తి చేశాను. బ్రాహ్మణీకం, అరుణ, అమీనా, మైదానం, జీవితాదర్శం, మ్యూజింగ్స్.. చలం. ఒకే ఒక్క చలం.
వారసత్వం, ఐశ్వర్యం, ఎండమావులు, అరుణోదయం, జీవితం, గడ్డు రోజులు, అనుభవం, సవతి తల్లి, పంచకల్యాణి, అనామిక, ఆడజన్మ, నీకేం కావాలి, ప్రేమించిన మనిషి.. కొ.కు. ఒకే ఒక్క కొడవటిగంటి కుటుంబరావు. నండూరి రామమోహనరావు పేరు పెట్టుకుని తెలుగు రచనలు చేసిన మార్క్ ట్వేయిన్ , తాహితీ దీవుల్లో పసుపు బత్తాయి రంగుల్లో ది మూన్ అండ్ సిక్స్ పెన్స్ రాసిన సోమర్సెట్ మామ్. ఒక పేరా? ఒక రచనా? ఒక పుస్తకమా? ఒక పత్రిక ? తొంభై పేజీల ఈ చిన్న పుస్తకం నడిపించిన దారిలో నేను ఎన్ని కొత్తదారులు వెదుకున్నానో, ఎన్ని కొత్త పుస్తకాల ఊసులు తెలుసుకున్నానో, ఎంతెంత ఆకలి పెంచుకున్నానో చెబితే తెలిసేది కాదు. ఈ పుస్తకం వేసిన దారిలో ఇంకా తెలుగు రచయితలు తమ చదువు కథలని వినిపిస్తే ఎంత బావుండు? ఇంకా ఇంకా పుస్తకాలు తెలిస్తే ఎంత బావుండు అనే ఆశ ఒక దురాశ మాదిరి, ఒక బహుళ పంచమి జ్యోత్స్న మాదిరి నన్ను కమ్ముకుని కూర్చొంటే, ఆ పుణ్యం అంతా ఈ చిన్నపొత్తానిదే , ఆ భార్గవీ దేవిదే . హేప్పీ ఓల్డ్ యియర్ 2025 మరియూ హేప్పి రీడింగ్ కూడా .
-అన్వర్.

