టాల్ స్టాయ్ ‘అన్నా కెరనినా’ నవల.. సుఖపడే సంసారాలన్నీ ఒకలాగే ఉంటాయి. సుఖం లేని సంసారాలకు మాత్రం దేని బాధలు దానివి.. అనే వాక్యంతో మొదలవుతుంది.
“ఉండే రైతుకు వాన వచ్చినా ఒక్కటే రాకపోయినా ఒకటే. జరుగుబాటు లేని రైతును చూడు. వానికి వాన వస్తేనే సేద్యం ఉంటుంది. వాన వస్తేనే బతుకు ఉంటుంది. వారి ఇంట్లో వాన వస్తేనే పండగలు అయినా దేవరలు అయినా టయానికి జరుగుతాయి. టయానికి వానలు లేవంటే అదును తప్పేది వానొక్కటే కాదు. మొత్తం రైతు బతుకే అదుపు తప్పుతుంది”.. ఇవి ‘ఉడుకోడు’ కథలో ఒక పాత్ర ద్వారా బాలాజీ చెప్పిన మాటలు.
ఇదే పుస్తకంలో 11 నెలల జీతగాడి కథలో.. రచయిత ఇలా అంటాడు ‘ఎరుకుల కుటుంబాల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ.. అన్ని కతలూ ఒకేలా ఉండవు. ఎన్నో మలుపులు, ఎన్నో చిత్రవిచిత్రాలు, మరెన్నో విషాదాలూ..
టాల్ స్టాయ్ ‘సుఖపడే సంసారాలన్నీ ఒకలాగే ఉంటాయి. సుఖం లేని సంసారాలకు మాత్రం దేని బాధలు దానివి’ అంటాడు. బాలాజీ రాసిన కథల్లో సుఖపడే సంసారాలేవీ లేవు. సుఖపడే సంసారాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన వర్గం వారి జీవితంలో సుఖం లేదు కాబట్టే బాలాజీ ఈ కథలు రాయాల్సి వచ్చింది.
‘ఒక మనిషి గురించి నిజాలు మాట్లాడాలనుకుంటే ఒక వరుస క్రమంలో ఏమీ మాట్లాడలేం. ఒకదాని తర్వాత ఒకటిగా ఏవేవో గుర్తుకు వస్తాయి. అన్నీ కలవరపెడతాయి. కన్నీళ్లు తెప్పిస్తాయి. ఊహించినవో, కల్పించినవో అయితే ఆ కథలు రచయిత చెప్పినట్లే ఉంటాయి. కానీ ఇవి కల్పితాలు కావు కదా. ఇవి జీవితాలు కదా, మనం చెప్పినట్లు అవి ఉండవు. మా ఎరుకల జీవితాలు ఎట్లా ఉంటాయో ఎట్లా కొనసాగాయో, మా తాత గాడిదల పైన ఉప్పు అమ్మే కాడ్నించి, మా నాయన ఎట్లా ఉద్యోగస్తుడైనాడో, అటవీ శాఖలో గుర్రంపైన తిరిగే ఫారెస్టర్ చిన్నయ్య పెద్ద కూతురు జయమ్మను, కాబోయే మామగారి ఇంటికి తిరిగి తిరిగి ప్రాధేయపడి, ఆ ఫారెస్టర్ చిన్నయ్యను ఒప్పించి మరీ ఎట్లా పెళ్లి చేసుకున్నాడో అదంతా ఓ పెద్ద కథ..’ అంటూ రచయిత ఈ పుస్తకంలో ఎలాంటి కథలు రాశాడో ఎవరి జీవితాలు రాశాడో తన మొదటి కథలోనే చెప్పేశాడు.
‘మా తప్పు ఏంది సామి’ అనే కథలో.. అప్పుడు చాలా కష్టపడి కట్టుకున్న ఇళ్ల స్థానంలో ఇప్పుడు కాలనీలో కొత్త ఇండ్లు కనపడతాయి. అక్కడక్కడ కొన్ని ఇండ్లు గత చరిత్రకు సాక్ష్యాలుగా మొండి గోడలతో తలుపులు, వాకిళ్లు కిటికీలు లేకుండా కనిపిస్తాయి. ఒక్కొక్క ఇంటిది ఒక్కో కథ కాదు ఒక్కో మనిషికో కథను ఆ ఇండ్లు వినిపిస్తాయి. ఏ ఇంటి ముందు నిలబడినా ఏదో ఏడుపు ఏళ్లనాటిది సన్నగా అయినా వినపడకుండా ఉంటుందా? ఆ రక్త గాయాలు కన్నీళ్లు కనపడకుండా పోతాయా. ఆ చెమట చుక్కల వాసన రాకుండా ఉంటుందా. ఎన్నో దౌర్జన్యాలతో, ఎన్నో అవమానాలతో, నిలువెల్లా గాయాలతో, ఇక్కడ బతకలేక ఎక్కడో బతుకుదారుల్ని వెతుక్కుంటూ ఇండ్లు, ఊర్లు విడిచిపెట్టి పోయిన వాళ్ళ కతలు ఎన్నో! ఎన్నెన్నో! అంటాడు రచయిత.
==========
ద్యూయ్ షేన్ బడి అంటే చాలామందికి తెలీదేమో కానీ చింగీజ్ ఐత్ మాతోవ్ నవల ‘తొలి ఉపాధ్యాయుడు’ అంటే మాత్రం చాలా మందికి తెలుసు. ఒక మారుమూల పల్లె ప్రాంతంలో బడి ముఖం చూడని వారికి మొట్టమొదట పాఠాలు చెప్పి అక్కడి నుంచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విద్యావంతుల్ని తయారుచేసిన ద్యూయ్ షేన్ జీవితం గురించిన నవలే తొలి ఉపాధ్యాయుడు.
బాలాజీ కథలో ఉడుకోడుగా గుర్తింపు పొందిన ఎరుకల నరసింహులు జీవితం కూడా తొలి ఉపాధ్యాయుడు నవలకి ఏమాత్రం తీసిపోదు.
చింగీజ్ ఐత్ మాతోవ్ ది రష్యా సరిహద్దుల్లోని కిర్గిస్తాన్ అనే చిన్న దేశం. ఇతను కూడా గిరిజనుడే. చిన్నప్పుడే తండ్రిని కోల్పోతాడు. నానమ్మ ఇతడిని చిన్నప్పుడు గాయకులు, కథకులు, జానపదుల దగ్గరకు తీసుకెళ్లి గిరిజన సంచార సంస్కృతిని ఎరుక పరుస్తుంది. మరోవైపు తల్లి రష్యన్ సాహిత్యాన్ని, సంస్కృతిని దగ్గర చేస్తుంది. ఈ రెండింటి కవితాత్మకమైన కలబోతే చింగీజ్ ఐత్ మాతోవ్ సాహిత్యానికి ప్రధాన భూమిక అని సాహిత్య కారులు అంటారు. బాలాజీ జీవితం కూడా అలాగే సాగింది.
రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించడం కంటే కూడా తన సమాజం అంతరాత్మగా ప్రతిధ్వనించడమే ముఖ్యమని గోర్కీ చెప్పిన మాటలను చింగీజ్ ఐత్ మాతోవ్ శిరసా వహించారని అంటారు. ఆయనకు కొనసాగింపే పలమనేరు బాలాజి. బాలాజీ తన అంతరాత్మతో పాటు తన సమాజం అంతరాత్మ కూడా ప్రతిధ్వనించే రచనలు చేశారు. అవే ఏకలవ్య కాలనీ కథలు.
=============
గుగీ వా థియాంగో ఈ పేరు తెలియని రచయితలు ఉండరనుకుంటా. ఇటీవల వృద్ధాప్యంతో వారు మరణించారు. తూర్పు ఆఫ్రికాలోని కెన్యా దేశానికి చెందిన వీరు ప్రపంచ ప్రఖ్యాత రచయిత. నవలా రచయితగా, వ్యాసకర్తగా, నాటక రచయితగా, పత్రికా రచయితగా, సంపాదకుడిగా, విద్యావేత్తగా సామాజిక కార్యకర్తగా సుప్రసిద్ధులు. తన జీవితాన్ని మూడు భాగాల ఆత్మకథగా రాశారు. ఇందులో మొదటిది ఏడవకు బిడ్డా (వీప్ నాట్ చైల్డ్).
ఇందులో కామౌ ఇలా అంటాడు.. “ఒక్కటి గుర్తుంచుకో తెల్లవాడు తెల్లవాడులా ప్రవర్తించడంలో అర్థం ఉంది. అతన్ని క్షమించవచ్చు. కానీ ఒక నల్లవాడు తన తోటి వాళ్ళ మధ్య తెల్లవాడిలా ప్రవర్తించడం మాత్రం దారుణం.. అది క్షమించరానిది”
‘ఎర్రమన్ను ముగ్గుపిండి’ కథలో తల్లిదండ్రులను పట్టించుకోని, కులం పేరు చెప్పుకోని కొడుకుల గురించి బాలాజీ రాశాడు.
తూర్పు ఆఫ్రికాలోని కెన్యాలో నిలబడి గుగీ వా థియాంగో చెప్పిన మాటలు ఆసియా ఖండంలోని దక్షిణ భారతదేశంలోని పలమనేరులో నిలబడి బాలాజీ రాసిన రాతలు రెండూ ఒకటే.
ఎక్కడైనా అణచివేతకు గురయ్యే మనుషుల ఆలోచనలు అనుభూతులు ఆవేదనలు అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి అనటానికి గుగివాథియాంగో, పలమనేరు బాలాజీ రచనలే ఉదాహరణ.
గుగీ వా థియాంగో ‘ఏడవకు బిడ్డా’ నవలలోని నుగోతో తన కొడుకుతో “చదువు అనేది గొప్ప వరం రా జోరో! ఆ వరాన్ని నువ్వు పొందాలి మనిషికి చదువుని మించిన పెన్నిధి లేదు” అంటాడు. రచయిత అంతటితో ముగించకుండా ‘ఈ మాట నుగోతో అంతరాంతరాల నుంచి వచ్చింది కాదు. నిజానికి అతని దృష్టిలో చదువును మించిన పెన్నిధి వేరే ఉంది. అతనికి ఈ ప్రపంచంలో భూమి తర్వాతే అన్నీ. అయితే తమ భూములు తిరిగి సాధించుకోవడానికి విద్య ఒక్కటే మార్గమని అతడు నమ్ముతాడు’ అంటాడు రచయిత.
ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన తంగలాన్ సినిమా కూడా ఇదే.
తమకంటూ పొలం ఉండడం అందులో పంటలు పండించుకోవడం స్వతంత్రంగా జీవించడం ఆత్మగౌరవంగా ఎవరైనా భావిస్తారు. మూలవాసులైన గిరిజనులు భూమికి వారసులు కాకపోవడం విషాదం.. వారి ఉనికినే నాగరికులు సహించలేకపోవడం దుర్మార్గం. వీటినే పలమనేరు బాలాజీ తన కథల్లో చెప్పారు.
ఏకలవ్య కాలనీ ఎరుకుల జీవన గాథల్లో ఇదే ఉంది.
===============
గుడులు, బడులు, చదువులపైన బాలాజీకి చాలా స్పష్టమైన ఎరుక ఉంది. ఈ పుస్తకం అంతా చదువు ప్రాధాన్యత పరుచుకుని ఉంది.
‘పదకొండు నెలల జీతగాడి కథ’లో ఈ పేరా చూడండి “ఇదేందో తెలుసా మే. చాలా గొప్ప గొప్ప పుస్తకాలు. పెద్ద పెద్ద ఆఫీసర్ల పిల్లకాయలు చదివేది. మన ఎరికిలోల్ల ఇళ్లల్లో ఎవరి పిల్లోల్ల కాడా ఈ పుస్తకాలు ఉండవు. ఇలాంటి పుస్తకాలు చదవతా ఉంటే చాలు, పిలకాయలు చాలా గొప్పోళ్ళు అయిపోతారు చూస్తా ఉండు” అంటాడు
‘దేనికి భయపడొద్దు’ కథలో.. మునిదేవర పండగ ఇంకా మొదలు కాకముందే పోలీసు మునిరత్నం నేరుగా గుడి ముందుకు వచ్చేసాడు. మనోళ్లు నలుగురు ఎప్పుడన్నా యాడన్నా ఉడ్డ చేరినప్పుడు వినిపించాల్సింది దేవుడి పాటలు కాదు కదా అని క్షణాల్లో క్యాసెట్టు మార్పించేశాడు. కుల నిర్మూలన పాటలు అంబేద్కర్ పాటలు ఎస్టీ కాలనీలో..
‘ఉడుకోడు’ కథలో.. “మనం ఎప్పుడూ వెనకడుగు వేసే ప్రశ్న లేదు. ఎంతకాలం ఈ వెనుకబాటుతనం. ఇంకెంతకాలం ఈ కుల రాజకీయాలు. ప్రతి ఇంట్లో దేవుడి ఫోటోలు కాదు ఉండాల్సింది, మంచి పుస్తకాలు ఉండల్ల. మనలో ఏ ఒక్కడు తక్కువ చదివే దానికి లేదు. ఎరికిలోల్లు అందరూ ఎక్కువే చదవల్ల… గుడి బదులు లైబ్రరీ కడితే చాలు. అందరూ ముందుకు వచ్చి తలా ఒక చెయ్యి వేస్తే కానిది ఏముంది..” అని బాలాజీ ఒక పాత్రతో చెప్పిస్తాడు.
ఇదే కథలో ఇంకోచోట.. “గుడి ఎందుకురా ఎరికలి నా కొడుకల్లారా.. ఇంకెన్ని గుడులు కడతార్రా.. ఇంకా ఎంతమంది దేవుళ్ళని మొక్కుతార్రా.. గుడి వద్దు లైబ్రరీనే కట్టాల. పుస్తకాలు పెట్టాల ఈ పిలకాయలు అంతా చదువుకోవాల..” అని ఉడుకోడుతో చెప్పిస్తాడు.
‘ఏకలవ్య కాలనీ’ కథలో.. ఈవారం పేపర్లో వచ్చిన ఉద్యోగ ప్రకటనల క్లిప్పింగ్స్ గుడి లోపల గోడలపై అంటించమని చెప్పినప్పుడు ఒక ముసలతడికి ఉన్నట్లుండి కోపం ముంచుకొచ్చేసింది.
“ఏమైనా ఇది గుడి అనుకున్నావా ఇంకేమైనా అనుకున్నావా. నువ్వు ఇట్లే గుడిని పాడు చేస్తా ఉంటే మేము ఒప్పుకోం” అంటూ నా ముందుకు వచ్చి అడ్డంగా నిలబడ్డాడు.
“పెద్దాయనా తప్పుకో.. ఇప్పుడు దేశంలో మనుషులకి ముఖ్యంగా మనలాంటోల్లకి కావలసింది గుళ్ళు కాదు.. స్కూళ్లు, ఆసుపత్రులు, ఉపాధి కేంద్రాలే” అంటూ ముందుకు కదిలాను..
==============
డాక్టర్ వి.చంద్రశేఖర రావుది తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన శైలి. ఆయన వాక్యం, ఆయన ఎంచుకునే వస్తువు పాఠకుడిని విభ్రమానికి గురిచేస్తాయి. మనం కథ చదవడం మొదలుపెట్టామంటే చివరి వరకు తనతో తీసుకెళ్లి పోతుంది. దీనికి కారణం రచయిత జీవితంలో, రచయిత సామాజిక వర్గంలోని ఘర్షణ కథలోకి తర్జుమా కావడమే.
పలమనేరు బాలాజీ రాసిన కథలు కూడా అలాంటివే. ఇందులో రెండు కథలు డాక్టర్ వి.చంద్రశేఖర రావు శైలిని పోలి ఉన్నాయి. దీనికి కారణం బాలాజీ కూడా అణగారిన వర్గం నుంచి రావడం, తన సమాజం ప్రతినిధిగా రచనలు చేయడమే.
===========
చింగీజ్ ఐత్ మాతోవ్ నవల
‘తొలి ఉపాధ్యాయుడు’ (ద ఫస్ట్ టీచర్) 1962 లో వచ్చింది
గుగి వా థియాంగో నవల ‘ఏడవకు బిడ్డా’ (వీప్ నాట్ చైల్డ్) 1964 లో వచ్చింది.
రష్యా చైనా సరిహద్దుల్లోని కిర్గిస్తాన్లో, తూర్పు ఆఫ్రికాలోని కెన్యాలో తమ వారి ఆత్మగౌరవం కోసం 60 ఏళ్ల క్రితం వారు రచనలు వస్తే.. తెలుగులో ఇంత కాలానికి తను, తన సమాజం ఏంటి అనే ఎరుకతో ఎరుకల కథలను గ్రంథస్థం చేసిన మొదటి వ్యక్తి పలమనేరు బాలాజి.
========
మూలవాసుల జీవితం కెన్యా నుంచి పలమనేరు దాకా..
రామాయణ కాలం నుంచి నేటి దాకా.. ఒకే రకంగా ఉంది. ఈ ఎరుకుతో వచ్చిన రచనలే చాలా తక్కువ. ముఖ్యంగా తెలుగులో..
గుగీ వా థియాంగో చెప్పినట్టు “తెల్లవాడు తెల్లవాడిలా ప్రవర్తించడంలో అర్థం ఉంది. అతన్ని క్షమించొచ్చు. కానీ ఒక నల్ల వాడు తన తోటి వాళ్ళ మధ్య తెల్లవాడిలా ప్రవర్తించడం మాత్రం దారుణం.. ఇది క్షమించరానిది”
ఈ ఎరుకతో మొట్టమొదటి కథల పుస్తకం తెచ్చిన వ్యక్తి పలమనేరు బాలాజి. ఒక రకంగా చెప్పాలంటే ఈయన ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎరుక ఉన్న ఏకలవ్యుడు. ఇలాంటి ఏకలవ్యులు తెలుగు సాహిత్యంలోకి మరింత మంది రావాల్సిన అవసరం ఉంది.
========
ఏకలవ్య కాలనీ
ఎరుకల జీవన గాథలు
పుస్తకం కొరకు :
నవోదయ బుక్ హౌస్ హైదరాబాద్,
శేషు కొర్లపాటి హైదరాబాద్, 79895 46568, అనేక బుక్స్ విజయవాడ,9247253884

సుంకోజీ దేవేంద్రాచారి
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సుంకోజి దేవేంద్రాచారి వందకు పైగా కథలు, ఏడునవలలు రాశారు. 'అన్నంగుడ్డ, ఒకమేఘం కథ, దృశ్యాలు మూడు ఒక ఆవిష్కరణ' కథల సంపుటాలు, 'నీరు నేల మనిషి, రెక్కాడినంత కాలం' నవలలు పుస్తకాలుగా తెచ్చారు. వీరు గ్రామీణ క్రీడలపై రాసిన కథనాలు 'మనమంచి ఆటలు' పుస్తకంగా వచ్చింది. ముఫ్ఫై కి పైగా కథలకు, మూడు నవలలకు పోటీల్లో బహుమతులు పొందారు. కలకత్తాలోని భారతీయ భాషాపరిషత్ పురస్కారం, రంగినేని యల్లమ్మ, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు, కె.ఎన్.జయమ్మ స్ఫూర్తి పురస్కారాలు అందుకున్నారు. కేంద్రసాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శాంతినికేతన్ వెళ్లి వచ్చారు. వీరితో కేంద్రసాహిత్య అకాడమీ 2013లో కథాసంధి నిర్వహించింది.

తన ఆస్తిత్వాన్ని తమ వారి పట్ల వారి జీవన విధానం పట్ల పూర్తి అవగాహనతో సంవేదనతో జీవితాన్ని సహజంగా చిత్రించిన బాలాజీ సార్ కథలను గొప్పగా విశ్లేషంచినందుకు ధన్యవాదాలు సర్. ఇందులో నాకు గూగి మాటలు “తెల్లవాడు తెల్లవాడిలా ప్రవర్తించడంలో అర్థం ఉంది. అతన్ని క్షమించొచ్చు. కానీ ఒక నల్ల వాడు తన తోటి వాళ్ళ మధ్య తెల్లవాడిలా ప్రవర్తించడం మాత్రం దారుణం.. ఇది క్షమించరానిది” చాలా హత్తుకున్నాయి. బాలాజీ సార్ కు అభినందనలు.