కాంటేంపరరీ సాహిత్యంలో పెద్దింటి అశోక్ కుమార్ నిస్సందేహంగా తెలుగు సాహిత్యానికి గౌరవాన్ని తీసుకువచ్చే కథకులు. మానవ స్వార్ధాన్ని, మనుషుల ద్విముఖతీరును బహిర్గతం చేస్తూనే మనిషితనాన్ని, మానవుని మనసులో నిక్షిప్తంగా దాగున్న మానవత్వపు చెమ్మను పొరలుపొరలుగా కథలలో ఆయన వెలికితీస్తుంటే ఆ మానవీయ స్పర్శ మన హృదయాలను సున్నితంగా మీటుతుంది. ఆ అనుభవం కోసం వీరి కథలను చదవాల్సిందే. ఈయన కథలలో ఉండే మట్టివాసన, ఆధునిక అసహజత్వాలకు దూరంగా జీవించే ఈయన పాత్రలు మన మూలాలలోకి మనల్ని తీసుకెళతాయి. అసలు అందరం ఆ మట్టి మనుషుల వారసులమే కదా. ఆ మట్టి తడి వారసత్వ ఆస్థిగా మనలో లేకపోవడం నిజానికి మనం సిగ్గుపడాల్సిన విషయం. అయితే దాన్నే ఉన్నత జీవనంగా మనల్ని మనం మభ్య పెట్టుకుంటూ ఎండిపోయి ఎడారి మనుష్యులుగా ఎలా మారిపోయామా అనిపిస్తుంది ఈ ‘మాయిముంత’ సంకలనం చదువుతుంటే. ఈ మధ్య కాలంలో ఎవరినీ పవర్ఫుల్ రైటర్ అనలేకపోతున్న నేను కూడా ఈ సంకలనం చదివిన తర్వాత “కామ్రెడ్ లాల్ సలాం” అని అశోక్ కుమార్ కి మౌనంగా ఓ సెల్యూట్ పెట్టకుండా ఉండలేకపోయాను.
ఈ సంకలనంలో మొత్తం పన్నెండు కథలున్నాయి. వీటన్నిటిలో ఇది చాలా బావుంది అని ఒక కథను ప్రత్యేకంగా ఎన్నుకోవడం సాధ్యం కాదు. ప్రతి కథా మరో దానికన్నా గొప్పగా ఉన్నట్లు, ప్రత్యేకమైనదిగానూ, మళ్ళీ మళ్ళీ చదవాల్సినదిగానూ కనిపిస్తుంది. ఈ సంకనలం చదివిన తరువాత ఒక మౌనంలోకి జారుకున్నాను. వెంటనే ఎలా స్పందించాలో కూడా తెలియలేదు.
‘జిద్దు’ కథ చదువుతుంటే కులం అధికారం మాటున మనిషి ఎంత నీచత్వాన్ని నింపుకుని దాష్టికం చేయగలడో అర్ధమవుతుంది. అధికార దాహం పట్ల అసహ్యం కలుగుతుంది. కడుపు నిండిన వాడు కూడా ఆ కడుపు నింపుకోవడంలో చూపే కక్కూర్తి తిండి అంటేనే అసహ్యం పుట్టేలా చేస్తుంది. ఇందులోని ఫకీరోడి ఆక్రోశానికి తోడు నిలవాలనిపిస్తుంది.
“సావు దప్పు” కథ చావులోనూ అహంకారాన్ని ప్రదర్శించే అధికార పక్షపు నైజాన్ని వివరిస్తుంది. ఊరి పెద్ద మనిషి చనిపోతే ఆ చావును గొప్పగా చేయాలనుకునే అధికార వర్గం డప్పు వాయించే వారితొ ప్రవర్తించే విధానాన్ని ప్రశ్నిస్తుంది ఈ కథ. శవంపై చల్లే డబ్బులను ఏరుకోవడానికి పిల్లలు పడే పాట్లు, ఆ చావు ఊరేగింపులో అగ్ర కులాధిపతుల లోభత్వం, నీచత్వం అధికార మదం అసహ్యం పుట్టిస్తాయి. మట్టిలో కలిసిపోయేటప్పుడు కూడా ప్రదర్శించే ఆ డాబు దర్పం వికారం కలిగిస్తాయి. ఇలాంటి ప్రద్రర్శనలు, క్రూరత్వాలు సాంప్రదాయాలుగా ఎలా చెలామణి అవుతున్నాయో అర్ధం కాదు.
“అదృశ్య రూపాలు” కథ ఓ గొప్ప ప్రయోగం. నేల తల్లి, మొలకెత్తకుండా మొండితనాన్ని చూపుతున్న ఓ గింజెతో చేసే సంభాషణ ఈ కథంతా. ఇది చదువుతున్నప్పుడు చలంగారి “ఒక పువ్వు పూసింది” కథ గుర్తుకువచ్చింది. స్త్రీ పురుష సంబంధంలోని మర్మాన్ని ఆ కథ ఎంతలా ఒడిసిపట్టుకుందో ఇక్కడ రైతు పడే నొప్పిని గింజల ద్వారా నేలతల్లికి అంత గొప్పగా చెప్పిస్తారు రచయిత. “ఇసం మింగిన మనిషి” కథ చదివి కన్నీరు కార్చకుండా ఉండలేం. కల్లు రుచు చూసి అందులో కలపాల్సినవన్నీ సరిగ్గా కలిసినయ్యో లేదో చెప్పే ఆశాలుతో గ్రామ కామందులు, ఆ ఊరి తాగుబోతులు, వ్యాపారస్తులే కాకుండా కుటుంబం కూడా ప్రవర్తించిన విధానం మనిషి స్వార్దం, అరాచకత్వాన్ని బైటపెడుతుంటే మనసు విషాదంతో నిండిపోతుంది. ఆశాలు కల్లుకు బానిసయ్యి దానికి దూరంగా ఉండాలని ప్రయత్నించినా వ్యాపారాత్మకత, కుటుంబ సభ్యుల స్వార్ధం అతన్ని మళ్ళీ మళ్ళీ కల్లు దుకాణం వైపుకే నెడతాయి. రచయిత చివర్లో చెప్పినట్లు ఆశాలు నిజంగానే ఇసం గొంతులో దాచుకున్న శంకరుడే” అనిపిస్తాడు. ఈ కథను రచయిత చెప్పిన విధానం అత్యంత గొప్పగా ఉంటుంది. సహజంగా నడిచే సంభాషణలతో రచయిత అభావంగా విషయాన్ని చెప్పుకుంటూ పోతే మనలో రకరకాల భావోద్వేగాలు వచ్చి చేరతాయి.
బతుకమ్మ లోనూ కులాన్ని చూస్తారని, కొందరి బతుకమ్మలను అందరితో కలవనీయరన్న సంగతి నాలాంటి వారికి చాలా కొత్త. అందుకే ఎంతో ఆశ్చర్యంగా చదివిన కథ ‘వర్గమూలాలు’. పుత్టినప్పటి నుండీ హైదరాబాద్ లోనే నా నివాసం. అందరూ కలసి బతకమ్మ లాడడాన్ని చూసిన దాన్ని. అందుకే ఈ కథ నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. తక్కువ కులంవారి బతుకమ్మలను తమతో కలవనీయకుండా ఉండే అగ్రకుల అహంకారం ఈ కథలో కనిపించి నన్ను ఆశ్చర్యపరిచింది.
రైతన్నలు కూలీలుగా మారి తమ శరీరాలను అరగించుకుని చివరకు కూలి పనులకు కూడా పనికి రాని స్థితికి చేరుకుంటే, పని చేయలేని అర్భక స్థితిలో ఆ కుటుంబం పడే బాధ, పని కోసం పడే తాపత్రయాన్ని విషాదంగా చర్చించిన ‘ఇస్తారి’ కథ శ్రమను నమ్ముకున్న మనిషి అసహాయత్వాన్ని ప్రకటిస్తుంది.
“గూడు కుదిరిన పక్షి” లో గోపవ్వ జీవితానికి రచయిత ఇచ్చిన ముగింపు చాలా గొప్పగా ఉంది. కుటుంబం కోసం చేతకాని మగని కోసం జీవితంలో తలవంచి శీలన్ని ఎరపెట్టిన గోపవ్వ ఒక శ్రమ జీవి. కాయ కష్టంతో కుటుంబాన్ని ఓ దరికి చేర్చడమే ధ్యేయంగా జీవించిన స్త్రీ. కాని ఆమె వయసులో తప్పటడుగు వేయాలసిన పరిస్థితులను కల్పించిన భర్త, అతని పిల్లలే వృద్దాప్యంలో పాతివ్రత్యం, శీలం పేరుతో ఆమెను అవమానిస్తుంటే, ఆమెను మానసికంగా, శారీరకంగా హింసిస్తుంటే గోపవ్వ తిరగబడుతుంది. ఆ వయసులో తన కోసం మళ్ళీ పోరాడడానికి సిద్దపడుతుంది. కుటుంబ స్వార్ధాన్నిదాటుకుని వ్యక్తిగా జీవించడానికి సిద్దపడిన గోపవ్వను ప్రేమించకుండా ఉండలేం.
మందుల షాపులో నిజాయితీగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేయాలనుకునే ఓ నిజాయితీపరుడితో వ్యవస్థ ఆడిన ఆట “చెడుగులు’ కథలో ఆలోచింపజేస్తుంది. నిజానికి మంచివాళ్లని చేతకానివాళ్లుగా నిరూపించలేకపోతే మనుషులు తాము పొందిన విజయాలను ఆస్వాదించలేరేమో. వ్యవసాయానికి మనిషి జీవనానికి అవసరం నీరు. ఆ నీటిపై ఆధిపత్యాన్ని సాధించాలని చూసే కామందులపై ఊరిలోని బలహీనులు ఏకమై సాగించిన పోరాటాన్ని “తడిగొంతు” కథ వివరిస్తుంది.
“మాయిముంత” కథ మనిషి ప్రేమకు, తల్లి మనసుకు రచయితి ఇచ్చిన గొప్ప నివాళి. ఈ మధ్యకాలంలో వచ్చిన కథా సాహిత్యంలో విస్మరించలేని గొప్ప కథ. తమ ముగ్గురు కూతుర్లకు మూడు బర్రెలను ఇచ్చిన తల్లి తండ్రుల పట్ల చిన్న కూతిరికి కోపం. తన వంతుకు ఈనని బర్రెను తల్లి తనకిచ్చిందని కూతురు తల్లి తండ్రులతో గొడవ పెట్టుకుని తన బిడ్డ పుట్టుటెంట్రుకల సంబరానికి వారిని దూరం చేస్తుంది. ఊర్లో లేని ఆ కూతురు బర్రె సూడి మీద ఉండి ఆకలికి తాళలేక ఈ దంపతుల అనపచేనుపై పడుతుంది. దాన్ని అదిలించాలనుకున్నా ఇప్పుడే కనేట్టున్న అ బర్రెను చూసి ఆ తల్లి జాలి పడుతుంది. దాన్ని అవస్తను ఓ ఆడదానిగా అర్ధం చేసుకుంటుంది. ఏదన్నా జరిగితే తమపై మాట వస్తుందని భర్త భయపెడుతున్నా పురిటి నొప్పుల బాధను అనుభవించిన ఆడదానిగా ఆమె ఆ నిముషం మంత్రసానిగా మారి ఆ బర్రెకు పురుడు పోస్తుంది.
ఆ బర్రెను ఆమె తన కూతురింటికి పంపింది. కాని అది ఆ నిముషం పురిటికి పుట్టింటికి వచ్చిన బిడ్డగా ఆ తల్లికి కనిపిస్తుంది. భర్త సాయం చేయకపోతే, నేను ఈయన బిడ్డను కంటున్నపుడే ఇంట్లో లేని ఈ మగాడు ఇప్పుడు ఉంటాడా అని నిట్టూర్చే ఆ స్త్రీ మనసును రచయిత పట్టుకున్న తీరు అత్యద్భుతం. ఆ బర్రెకు పురుడు పోస్తూ దీన్ని తల్లిని చేసిన దున్నపోతు నా మగని లెక్క ఎక్కడ గుర్రు కొడుతుందో అని ఆమె అనుకుంటున్నప్పుడు స్త్రీ హ్రుదయాన్ని, ఎప్పటికీ స్త్రీకి చేరువ కాలేని పురుష స్వభావాన్ని రచయిత ప్రస్తావించిన తీరు అబ్బురపరుస్తుంది. మాయిముంత పడలేదని ఆ తల్లి తల్లడిల్లుతుంది. అది పడి పుట్టింది పెయ్య దూడని తెలిసి తల్లి, బిడ్డ క్షేమం చూసి మురిసిపోతుంది. బర్రె కోసం వెతుక్కుంటూ వచ్చిన అల్లుడు బర్రెకు పుట్టింది పెయ్యదూడని మరుసిపోతూ గర్వంగా దాన్ని తీసుకుని వెళ్లిపోతుంటే, అసహాయంగా బర్రె వాళ్లను వెంబడిస్తుంటే “బిడ్డ పుట్టిన్నాడు ఆడబిడ్డ పుట్టిందని అలిగిపోయిండు ఇప్పుడు పెయ్య దూడ పుట్టిందని మురుస్తుండూ” అంటూ అల్లుడిని చూసి నిట్టూరుస్తున్న సాయమ్మ గొప్ప వేదాంతిలా కనిపిస్తుంది. ఇంత చేసి మళ్ళీ తనతో మాట్లాడని తన బిడ్డను తలచుకుని ఆమె క్షేమం కోసం కలవరించే సాయమ్మ తల్లి హృదయం పాఠకులను కదిలిస్తుంది.. ఈ కథను రచయిత రాసిన తీరు ఎంత గొప్పగా ఉంటుందంటె బిడ్డను కనడానికి నొప్పులు పడే తల్లి ప్రసవ వేదన ఎప్పటికీ తీరదని అది జీవితాంతం ఆ తల్లిని విడిచి పోదని రచయిత వివరించిన తీరు మనసును హత్తుకుంటుంది.
అభివృద్ది పేరుతో భూమికి చేస్తున్న గాయలను అంతరించిపోతున్న నీటితో బీళ్ళవుతున్న భూమాత నీడన చిద్రమవుతున్న హృదయాలను వివరిస్తూ అభివృద్ది పట్ల ఆలోచన కలిగించే కథ “పడగనీడ’ “ఆ ఇల్లు మూతవడ్డది’ కథలో కాల్చే బొగ్గు నాది, కాల్చే కంకి నాది, అమ్మేది నేను.. వచ్చే పైస మాత్రం నాది కాదు” అని బాధపడే ధర్మయ్య మన దేశ రైతన్నల పరిస్థితుల పట్ల మనలో ఎన్నో ఆలోచనలకు రేకెత్తిస్తాడు.
ఇది కష్టజీవుల వెతలను మన ముందుకు తీసుకువచ్చే కథా సంకలనం. శ్రమ జీవుల పట్ల ఆధునిక మానవుడు, వ్యవస్థ చూపే స్వార్ధాన్ని, దోపిడిని వివరిచే కథలు ఇవి. మనవీయ కోణంతో శ్రమ జీవుల జీవితాల పట్ల అవగాహనను పెంచుకుని, సిస్టం అభివృద్ది పేరుతో మనకు చూపే త్రిశంకు స్వర్గంలోని మర్మాన్ని అర్ధం చేసుకొమ్మని ఇందులో ప్రతి పాత్ర అభ్యర్ధిస్తుంది. సాహిత్యం సమాజంలోంచి పుట్టాలి. సమాజాన్ని అన్ని దృష్టికోణాలతోనూ పరిచయం చేయాలి. అన్యాయాల పట్ల ప్రశ్నించే గొంతుకగా నిలబడాలి. ముఖ్యంగా మనం కోల్పోతున్న మానవీయ స్పర్శను అనుభవంలోకి తీసుకురావాలి. ఆ బాధ్యతను నూటిని నూరుపాళ్ళు నెరవేర్చిన పెద్దింటి అశోక్ కుమార్ గారి ఈ కథా సంకలనం తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన సృష్టి. ఇది తప్పకుండా చాలా మందికి చేరవలసిన గొప్ప పుస్తకం. మనుష్యులను ప్రేమించేవారందరు చదవాల్సిన కథలు ఇవి.
