శ్రీ శ్రీ సినీ గీతాలు – 9

Spread the love

జోరుగా హుషారుగా  షికారు పోదమా

హాయి హాయిగా తీయ తీయగా

జోరుగా హుషారుగా షికారు పోదమా

హాయి హాయిగా తీయ తీయగా

జోరుగా…..

ఓ… బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే

చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే

ఓ…. ఓఓ… ఓ…ఓ

బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే

చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే

మరువనంటినే మరువనంటినే

ఓ…. ఓఓ… ఓ…ఓ జోరుగా హుషారుగా షికారు పోదమా

జోరుగా…

నీ… వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే

వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే

ఓ… ఓఓ… ఓ…ఓ

వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే

వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే

కలిసిరాగదే కలిసిరాగదే

ఓ… ఓఓ… ఓ…ఓ

జోరుగా హుషారుగా…షికారు పోదమా

జోరుగా…

నా… కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే

కనులు తెరిచి ఎదుట నిన్నే కాంచినాడనే

ఓ… ఓఓ… ఓ…ఓ

కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే

కనులు తెరిచి ఎదుట నిన్నే కాంచినాడనే

వరించినాడనే వరించినాడనే

ఓ… ఓఓ… ఓ…ఓ

జోరుగా హుషారుగా షికారు పోదమా

హాయి హాయిగా తీయ తీయ్యగా

జోరుగా… జోరుగా… జోరుగా… జోరుగా

తెలుగు సినిమా పాటల చిత్రీకరణ శైలిని మార్చి, సినీ పాటలకు నూతన మార్గాన్ని అందించింది 1961లో వచ్చిన ‘భార్యా భర్తలు’ సినిమా కోసం శ్రీ శ్రీ రాసిన “జోరుగా హుషారుగా” అనే పాట. ఈ పాట తెలుగు సినీ గీతాలలోనే ఓ ట్రెండ్ సెట్టర్ అని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. తెలుగు సినిమాలో హీరో చేత ఫుల్ లెంత్ స్టెప్పులు వేయించిన గీతం ఇది. తొంభైలలో సినీ పాటలలో స్టెప్పులతో హీరోలుగా మారే సాంప్రదాయానికి పునాది ఈ పాటతోనే పడింది. ఆధునిక పోకడలకు తెలుగుతనాన్ని జోడిస్తూ శ్రీ శ్రీ రాసిన ఈ పాట తెలుగు దేశాన మారు మ్రోగింది. ఇప్పుడు స్టేప్పుల కోసమే పాటలు రాస్తున్న సినీ కవులు నానా భాషీయ పదాలతో పాటను మమః అనిపించుకుని దాన్నే హిట్ అని ప్రకటించుకుని తెలుగు ప్రజలపై తోస్తుంటే ఆ రోజుల్లో శ్రీ శ్రీ తెలుగుతనం ఎక్కడా చెడకుండా, అక్కడక్కడ గ్రాంధిక పదాలాతోనూ క్లిష్టమైన, ఆసక్తికరమైన పదప్రయోగాలతో ఈ పాటను రాసి మెప్పించడమే కాకుండా, ఆధునికతకు తెలుగుతనాన్ని జోడిస్తే అదెంత అందంగా ఆకర్షణీయమైన గీతంగా రూపుదాల్చుకుంటుందో చేసి చూపించారు. నిజానికి ఆధునిక కవులు తెలుగు సాంప్రదాయ కవిత్వాన్ని చదవాలి, అభ్యసించాలి అని శ్రీ శ్రీ చేసిన ప్రస్తావన మరచిన నవతరం ఎలాంటి భాషా సౌందర్యాన్ని కోల్పోయిందో ఈ పాటను వింటే తెలుస్తుంది.

శ్రీ శ్రీ చాలా పొదుపుగా పదాలను ఉపయోగిస్తారని చెప్పుకున్నాం కదా. ఈ పాటలోనూ ఆయన అదే చేసారు. “జోరుగా హుషారుగా షికారు పోదమా” అనే వాక్యం తెలుగు నాట కన్యాశుల్కంలోని గిరీశం “డామిట్ కథ అడ్డం తిరిగింది” స్థాయిలో సాంస్కృతికంగా ప్రజల భాషా నిఘంటువులోకి చేరిపోయింది. తొంభైలలో హిందీ ప్రజల నడుమ “ఆతీ క్యా ఖండాలా” అనే పాట ఎంతగా చొచ్చుకుపోయిందో చూసినప్పుడు, ఆధునిక ప్రేమికుల భ్రమణ కాంక్షకు ఉదాహరణగా  ఆ పాటను సినీ వర్గాలు ప్రస్తావించబడటం చూసినప్పుడు మన తెలుగులో అరవైలలోనే శ్రీ శ్రీ ఇలాంటిదే ఓ ఆధునిక పాటను రాసి తెలుగు సినిమా పాటల ట్రెండ్ ను మార్చారని తెలుసుకున్నప్పుడు కాస్త గర్వంగానూ అనిపించింది.

ఈ పాటను ఘంటసాల అంతే హుషారుగా పాడారు. ఇక అక్కినేని చేసిన నృత్య గీతాలలో ఈ పాట మొదటి స్థానంలో నిలుస్తుంది. బాల్ రూం, సల్సా స్టైల్ లో ఈ పాటకు చేసిన కొరియోగ్రఫీ నేటి తరాన్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. అయితే నన్ను విపరీతంగా ఆకట్టుకునేది ఈ పాటలో శ్రీ శ్రీ ఉపయోగించిన తేట తెలుగు పదబంధాలు. సినిమా కథలో హీరో విచ్చలవిడిగా తిరిగే యువకుడు. ఎంతో మంది స్త్రీలతో ఒకేసారి స్నేహం చేస్తాడు. నిజమైన ప్రేమ అతనికి తెలీదు. దానిపై నమ్మకం లేదు.  అచ్చం మన మహాకవి శ్రీ శ్రీ లాగే అనమాట (ఈ విషయాన్ని ఆయన తన ‘అనంతం’లో స్వయంగా చెప్పుకున్నారు.) స్త్రీ ఒక అవసరం అన్న భావంతోనే జీవిస్తుంటాడు. హాయిగా జాలీగా పూటకొక్క స్త్రీతో గడుపుతుంటాడు. అయితే వ్యక్తిగతంగా ఇతను చెడ్డవాడు కాడు. స్త్రీ బలహీనత ఉన్నవాళ్ళు, ఎక్కువ మంది స్త్రీల పొందు అందుకున్నవారు స్వభావరిత్యా బలహీనులవవచ్చు కాని చెడ్డవారు కానక్కర్లేదు. మంచి చెడులకు ఎవరికి తోచిన నిర్వచనం వాళ్లు ఇచ్చుకున్నా, ఈ హీరో విషయానికి వచ్చేసరికి, అతను బలహీనతలు ఉన్నవాడే కాని క్రూరుడు, దోపిడీదారుడు కాదన్న మాట. శ్రీ శ్రీ ఈ హీరో వ్యక్తిత్వాన్ని చాలా బాగా పట్టుకున్నాడు కాబట్టే ఇలాంటి పాట ఆయన కలం నుండి రాగలిగింది.

‘జోరుగా హుషారుగా  షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా’ అనే పల్లవి హుషారుగా భాధ్యతల బరువు అనుభవంలోకి రాని యువత మనస్థితికి సరిగ్గా సరిపోతుంది. సాధారణంగా జీవితంలో లక్ష్యం ఏర్పడని స్థితిలో ప్రపంచంలోని ఆనందాన్ని మొత్తం జుర్రుకుని తాగేయాలనే తపనతో, కొత్త సాహసాల కోసం, ఎవరూ నడవని దారుల్లోకి సాగిపోవాలని తపించే కళ్లెం లేని యువత మనస్థితిని వారిలోని కాంక్షను అద్భుతంగా పట్టుకున్న వాక్యలు అవి. జీవితం అనే షికారులోకి హాయి హాయిగా, తీయ తీయగా ప్రయాణించాలనే యువత కోరికలో గమ్యం లేని సంచారం ఉంటుంది. అర్ధం, అన్వేషణ లాంటి పదాలకు చోటు ఉండదు. అలా హాయిగా అన్ని నిబంధనలను అతిక్రమించి, ఆలోచన అనే భారం లేక సాగిపోవడంలోని కిక్కు అనుభవించాలని జీవిత ప్రారంభంలో అనుకోని వారెవ్వరు ? అలాంటి వారందరికీ ఓ ఆంథెంగా (Anthem) ఈ పాట దగ్గరవడానికి ఈ పల్లవే కారణం. 

ఆ వయసులో స్త్రీ పురుషుల నడుమ ఆసక్తికరమైన ఆకర్షణ ఉంటుంది. అందులో అమాయకత్వమూ ఉంటుంది. ఆ అమాయకత్వం కారణంగానే ఆ ఆకర్షణ మధురిమ జీవితాంతం వెన్నాడుతుంది. ఇక్కడ ఆ యువకుడు ఒకో స్త్రీతో అడుగులు కదుపుతూ ఉంటాడు. ఆపోజిట్ సెక్స్ పట్ల ఆసక్తి ప్రధానంగా, కొంత అమాయకత్వాన్ని కూడా కలుపుకుంటూ ఆ తరవాతి చరణం ఇలా సాగుతుంది. ‘ఓ… బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినే, చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే’. ప్రేమ అనే భావనకు ప్రధానంగా శారీరిక ఆకర్షణ మూలం. ఇది పురుషుని విషయంలో ముమ్మాటికీ నిజం. అందుకే ప్రేయసి శరీర వర్ణనను ఎంతో గర్వంగా, హక్కుగానూ చేస్తాడు పురుషుడు. పైగా తాను ప్రేమించే స్త్రీ తనకు బాలగా అంటే చిన్నగా, ఆధారితగా ఉండాలనుకునే కోరిక ఎక్కువ మంది పురుషులలో సహజంగా ఉంటుంది. అందుకే ఇక్కడ హీరో ‘బాల నీ వయ్యారమెంచి’ అంటుంటే అది చాలా సహజంగా ద్వనిస్తుంది.

ఆమెలోని అందం కాదు ఆకర్షణ అతన్ని ఆమెకు చేరువ చేసింది. అందంలో కొంత పరిపక్వత ఉంటుంది. రసికతను మించిన కళారాధన కూడా ఉంటుంది. కాని అప్పుడే యవ్వనంలోకి అడుగు పెట్టిన యువత నడుమ స్త్రీ పురుష ఆకర్షణ మాత్రమే ప్రధాన పాత్ర వహిస్తుంది. యువతులు కూడా పురుషులను ఆకర్షించే నైజాన్ని వంటపట్టించుకుంటారు. కొంత సహజంగా, కొంత కృత్రిమంగా దీన్ని వాళ్లు తమ వ్యక్తిత్వంలో భాగం చేసుకుంటారు. అదే వాళ్లు ప్రదర్శించే వయ్యారంగా బైటికి కనిపిస్తూ ఉంటుంది. ఆ యువతి ప్రదర్శించే అలాంటి వయ్యారానికి అతను ఆకర్షితుడయ్యి అన్ని వయ్యారాల నడుమ ఆమెను ఎంచుకుని, దానికి మెచ్చి ఆమె మోహంలో పడిపోయాను అని చెప్తున్నాడు. అంటే తనికి ఈ విషయంలో ఉన్న స్వేచ్చ, చాయిస్ ని గర్వంగా ప్రస్తావిస్తూ, తన చుట్టూ ఉన్న వయ్యారాల నడుమ ఆమెను ఎంచుకున్నానని ఆమెను సంతోషపెడుతూ, ఆ మోహంలో ఎన్నో ప్రేమ పాఠాలను చదువుకుంటున్నానని చెప్తున్నాడు. తరవాత ‘మరువనంటినే’ అంటూ ఆ పాఠాలను నేను మర్చిపోలేకపోతున్నాను అంటూ ఆమె ముందు గారాలు పోతున్నాడు.

అతన్ని ఆకర్షింఛింది ఆమె వయ్యారం, దాన్ని ఎంచి, మెచ్చి ఆమెను చేరానని అతను ప్రస్తావించడంలో ఈ  ఆకర్షణలో ఆమె పాత్రను తెలివిగా ప్రస్తావించడమూ దాగి ఉంది. పైగా ఆమె వయ్యారాన్ని ఎంచుకోవడంలో అతని చాయిస్ ప్రధానంగా నిలుస్తుంది. ఆ వయసు పురుషునిలోని నిర్లక్ష్యమూ కనిపిస్తుంది. ఈ పాఠాలను మర్చిపోలేకపోతున్నాను అనడంలో అతని భాధ్యతారాహిత్యమూ కనిపిస్తుంది.  అయితే ఈ వయసులోని భాద్యతారాహిత్యం అందంగానూ, ఆకర్షణీయంగానూ ఉంటుంది కాబట్టి ఆ సహజ లక్షణాలతో  నిండి ఉన్నఈ చరణం అంతే తీవ్రంగా శ్రోతలనూ ఆకర్షిస్తుంది.  

‘నీ వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే, వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే’ అనే చరణం దగ్గర ఆ హీరోలో ఒక కాసనోవా కనిపిస్తాడు. ఆమె వన్నె చిన్నలను చూసి అతను వలచాడట. ఇక్కడ కూడా అందం అన్న పదాన్ని వాడి ఆ నాయకుడి ఆకర్షణకు గంభీరతను అంటగట్టట్లేదు కవి. అవి కేవలం వన్నె చిన్నెలు మాత్రమే, ఆ వయసులో పరస్పర ఆకర్షణకు అవే కారకాలు. ఆమె వయసు, ఆపై సొగసు తలచుకుని మురిసిపోతున్నాడట. తనకు పడిపోయిన అమ్మాయి స్థాయిని, ఆమె వయసుతో, సొగసుతో నిర్ణయిస్తూ, తాను ఒక సుందరాంగిని పట్టానని తనను తాను అభినందించుకుంటున్నాడు అతను.

నిజానికి ఈ వయసులోని ప్రేమలన్నీ స్వీయ ప్రధాన స్థాయిలో ఉంటాయి. అంటే సెల్ఫ్(నేను) అన్నదే ముఖ్యం. స్వీయానందం, స్వీయానుభూతి, స్వీయసమ్మతి, స్వీయవిజయం అంతా ఆ వ్యక్తి  చుట్టూనే ఉంటుంది. తన తర్వాతే ఆ ప్రేయసి వస్తుంది తప్ప ఆమె అతనికి పూర్తిగా ప్రధానం కాదు. ఆ అనుభవం అంతా స్వీయ మహిమ (self glorification) చుట్టూనే తిరుగుతుంది. పురుషుడిలో ఇదే ప్రధానంగా ఉంటుంది. దాన్ని చాలా నిజాయితీగానూ, అందంగానూ ప్రస్తావించే చరణం ఇది. పైగా ఇంతగా నీకు పడిపోతే నాతో సరిసమానంగా కలిసెందుకు రావు, రావాలి కదా అంటూ ‘కలిసిరాగదే కలిసిరాగదే’ అంటూ తనకు అనుకూలంగా ప్రవర్తించమని ఆమె ముందు వయ్యారాలు పోతున్నాడు ఆ యువకుడు. “కలిసిరాగదే” అన్న పద ప్రయోగాన్ని ఇలాంటి అల్లరి చిల్లర సినీ గీతాలలో ప్రయోగించగల శ్రీ శ్రీ శైలి నాకిప్పటికీ ఆశ్చర్యమే.

ఈ ఆకర్షణాత్మక స్థితిలో అతిశయోక్తులను అతి సహజంగా పలికిస్తారు యువకులు. ఆమెను కలలోనే కోరి పిలిచాడట. కనులు తెరిచాక అక్కడే నిల్చిన ఆమెను చూసాడట. స్త్రీలు కోరుకునే అందమైన అబద్దాలను కవులు ఇంకా అందంగా అందిస్తారు. కలలోనూ మరో ఆలోచన లేదని, ఆమె అతని నిద్రా, జాగృతావస్థలలో కూడా మనసంతా ఆక్రమించుకుని ఉందని అప్పటి దాకా ఓ అరడజను మందితో నాట్యమాడి కొత్తగా పరిచయం అయిన మరో అమ్మాయితో అందంగా, లాలిత్యంగా అతను విన్నవించుకుంటున్నాడు. ఆమెనే తాను వరించానంటూ ఆమెకు చేరువవుతున్నాడు.

ఇది కథానుసారం రాసిన పాటే అయినా ఆకర్షణ అనే స్థితిలో యువకులు సహజంగా ప్రదర్శించే అతిని, పురుషకోణంలో నిజాయితీగా ప్రకటిస్తుంది. ఏ వాక్యం కూడా ఆకర్షణ స్థాయిని దాటి ఉండదు. ప్రేమ గీతాలు, భావగీతాలు, భక్తి గీతాల నడుమ ఆకర్షణ అనే  సూత్రానికి ఎక్కడా ప్రేమ, స్నేహం లాంటి పదాలతో మోసం చేయకుండా పచ్చి ఆకర్షణను ప్రకటించే గీతం ఇది. యువతలోని ఆ స్థితిని, అందులోని అపరిపక్వతను, సాధారణత్వాన్ని చాలా సహజంగా ప్రకటించే పాట కాబట్టే ఇది యువతరాన్ని ఉర్రూతలూగించింది. వారి సహజ ఆకర్షణలకు  మహాకవి అందించిన అంగీకారంగానూ ఈ పాట చలన చిత్రసీమలో ప్రభంజనం సృష్టించింది. కథకు సంబంధం లేకుండా విడిగా ఈ పాటను విన్నా ఇది యువత మానసికస్థితిని సంపూర్ణంగా అర్ధం చేసుకున్న ఓ మానసిక విశ్లేషకుడు కవిగా మారి రాసిన గీతంగానే ద్వనిస్తుంది.  

ఉందిలే మంచికాలం ముందు ముందునా

అందరూ సుఖపడాలి నందనందనా  (ఉందిలే 2)

ఉందిలే…

ఎందుకో సందేహమెందుకో

రానున్న విందులో నీవంతు అందుకో (ఎందుకో)

ఆ రోజూ అదిగో కలదూ నీ ఎదుట…

నీవే రాజువటా ..ఆఅ..ఆఅ..ఆఅ  (ఉందిలే)

ఏవిటేవిటేవిటీ మంచికాలమంటున్నావు

ఎలాగుంటుందది విశదంగా చెప్పు

దేశ సంపద పెరిగేరోజు

మనిషి మనిషిగా బ్రతికేరోజు (దేశ సంపద)

గాంధి మహాత్ముడు కలగన్న రోజు

నెహ్రు అమాత్యుడు నెలకొల్పు రోజు

ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో

అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో (ఆ రోజెంతో)

భలే భలే బాగా సెప్పావ్

కానీ అందుకు మనమేం చేయాలో

అదికూడా నువ్వే చెప్పు

అందరికోసం ఒక్కడు నిలిచి

ఒక్కనికోసం అందరు కలసి (అందరికోసం)

సహకారమే మన వైఖరి ఐతే

ఉపకారమే మన ఊపిరి ఐతే

పేద గొప్పా భేదం పోయీ అందరూ

నీది నాదని వాదం మాని ఉందురూ

ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో

అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో

ఆఆ.ఆ..ఆఆఅ..ఆఅ..ఆఆ..

ఆఆఅ.ఆఆఅ..ఆ..ఆఆ (2)

తీయగా బ్రతుకంతా మారగా

కష్టాలు తీరగా సుఖశాంతులూరగా

ఆకాశ వీధుల ఎదురే లేకుండా

ఎగురును మన జెండా  ఆఆఅ..  (ఉందిలే 2) ఉందిలే…

పదునుగా దేశ స్థితిగతులను విమర్శిస్తూ, తన అసంతృప్తులను ప్రకటిస్తూ, ప్రశ్నలు లేవదీస్తూ, ఆగ్రహాన్ని కక్కుతూ శ్రీ శ్రీ రాసిన సామాజిక కవిత్వాన్ని చదివినప్పుడు ఆ ఆగ్రహావేశాల మాటున కూడా భవిష్యత్తుపై అంతులేని కోరిక, ఆశ ఆయనలో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తాయి. దేశంలోని అంతటి దుర్భర పరిస్థితులు, మనుషుల స్వార్ధపు చేతలను గమనిస్తూ కూడా భవిష్యత్తుపై ఆయనకున్న నమ్మకం చూస్తే, కమ్యునిజం, సోషలిజం ప్రపంచాన్ని ప్రభావితం చేసి తీరతాయని, ఆ ప్రభావం నుండి భారతదేశం తప్పించుకోలేదని ఆయన ఎంత నమ్మేవారో అర్ధం అవుతుంది. పైగా దేశ యువతపై ఆ సమయంలోని చాలా మంది మేధావుల కన్నా అపారమైన భరోసా ఆయనకుండేదన్నది స్పష్టం అవుతుంది.  నిజానికి యువతరంపై పెద్దతరం వాళ్ళు ఎప్పుడూ అసంతృప్తితోనే రగులుతూ తమ రోజుల్లా ఇప్పటి రోజులు లేవని వాపోతూ ఉండడం సహజం. కాని శ్రీ శ్రీ పంథా పూర్తిగా వేరు. ఆయనకు రాబోయే రోజులపై పూర్తి  నమ్మకం, యువతరం పై ఇంకా ఎక్కువ నమ్మకం. కొన్నిసార్లు తన సమకాలీన తరం కన్నా భవిష్యత్ తరాలను ఆయన ఎక్కువగా ప్రేమించేవారని అనిపిస్తూ ఉంటుంది. దేశంలోని పరిస్థితులను విమర్శిస్తూనే ఇది ఎంతో కాలం సాగదని యువత భవిష్యత్తుకై అద్భుత పునాది వేసుకుంటుందని ఎలుగెత్తి చాటినవాడు శ్రీ శ్రీ.

1964లో ఆయన “ఉందిలే మంచికాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందా నందనా” అని రాసిన పాట ఈ రోజు వింటున్నా అద్భుతమైన ఉత్సాహాన్ని అందిస్తుంది. భవిష్యత్తుపై ప్రేమ పుట్టిస్తుంది. నిరాశావాదం నుండి దూరం చేస్తూ ఆశావాహ దృక్పధాన్ని అందిస్తుంది. శ్రీ శ్రీ దీన్ని కేవలం రాసి వదిలేయలేదు. మంచి రోజులు వస్తాయంటూ అక్కడితో ఆగిపోలేదు. ఆ మంచిరోజులకు మనమేం చేయాలో చెప్పడమే కాకుండా తాను నమ్మిన దారిలో, ఈ పాటలో తానే చెప్పిన బాటలో స్వయంగా నడిచి చూపించారు.

ఒక పాత జానపద కథలో కరువుతో అల్లాడుతున్న ఓ గ్రామంలోని ప్రజలను, వర్షం కోసం సామూహిక ప్రార్ధన చేయడానికి ఊరి మధ్యకు రమ్మంటాడు ఓ సాధువు. ఊరంతా అక్కడికి చేరతారు. వారి మధ్య ఓ చిన్న పిల్లవాడు ఓ గొడుగు పట్టుకుని వచ్చి కూర్చుంటాడు. ఆ ప్రార్ధన తర్వాత వర్షం పడుతుందని, ఇంటికి తడుస్తూ వెళ్ళాల్సి వస్తుందని ఆ చిన్నపిల్లవాడి జాగ్రత్త చర్య అది. అందులో దాగి ఉంది అమాయకత్వం కాదు, ఆ సాధువుపైన అపారమైన నమ్మకం. నాకు ఈ పాట వింటున్నప్పుడు ఈ కథ గుర్తుకు వచ్చి ఆ పిల్లవాడిలో శ్రీ శ్రీ ముఖం కనిపిస్తుంది. భవిష్యత్ తరాలపై కమ్యునిజంపై, యువశక్తిపై అదే స్థాయిలో నమ్మకాన్ని కడదాకా నిలుపుకున్న మహాకవి శ్రీ శ్రీ. ఈ పాటలో ద్వనించేది ఆయనలోని అదే నమ్మకం.

శ్రీ శ్రీ జానపద గీతాల శైలిలో రాసిన ప్రతి గీతం సామ్యవాదాన్ని, ఆదర్శాలను సామన్య జనానికి అందించే రీతిలో ఉంటాయి. ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా’ అంటూ జానపద శైలిలో సాగే ఈ  గీతంతో సమసమాజం అనే కలను సాధారణ ప్రజలకు పంచుతూ, ఆ ప్రపంచం ఎలా ఉండాలో, ఉంటుందో వారి ద్వారా చెప్పిస్తారు శ్రీ శ్రీ. ఎందుకో సందేహమెందుకో, రానున్న విందులో నీవంతు అందుకో’ అంటున్నప్పుడు భవిష్యత్ పై ఎంత అపారమైన నమ్మకాన్ని ఆయన మోస్తున్నారో అర్ధం అవుతుంది. రానున్న విందులో నీ వంతు అందుకో అనడానికి ఎంత ధైర్యం, నమ్మకం సమపాళ్లలో ఉండాలి. అబ్దుల్ కలాం గారు యువతకు కలలు కనమని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం కలలు కనడానికి భయపడే యువతను మేలుకొలపాలని. శ్రీ శ్రీ పంథా దీనికి విభిన్నం. రానున్న విందులో నీ వంతు అందుకోవడానికి సిద్దంగా ఉండమని పీడిత ప్రజలకు చెప్పడం గమనిస్తే ఆయన ఉక్కు ధైర్యానికి పులకరిస్తాం. ఆయన కలలు కనమనరు. అది కల కాదు మీ భవిష్యత్తు అని ఢంకా మ్రోగించి చెప్తారు.  పైగా ‘ఆ రోజూ అదిగో కలదూ నీ ఎదుట, నీవే రాజువటా’ అని నమ్మకాన్ని కలిగిస్తారు.

అప్పుడు అక్కడే ఉన్న ఓ పేదవాడు ‘ఏవిటేవిటేవిటీ మంచికాలమంటున్నావు ఎలాగుంటుందది విశదంగా చెప్పు’ అని ప్రశ్నిస్తాడు. నేటి మన తరం లాగే. దానికి జవాబుగా ‘దేశ సంపద పెరిగేరోజు, మనిషి మనిషిగా బ్రతికేరోజు, గాంధి మహాత్ముడు కలగన్న రోజు, నెహ్రు అమాత్యుడు నెలకొల్పు రోజు’ అని జవాబిస్తాడు కవి. మనది పేదరికంలో కొట్టుకుంటున్న దేశం, మనుషులుగా బ్రతకలేక జీవన సమరంలో నలిగిపోతున్న పీడితుల దేశం, ఇంత బలహీనమైన పరిస్థితుల నడుమ బడుగు వర్గాలకు ఇంత ధైర్యాన్ని ఎలా ఇవ్వగలిగాడు ఈ మహాకవి? నేడు ఆ ధైర్యం ఎంతమందిమి నిలిపి ఉంచుకోగలిగాం? ‘ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో’ అన్నప్పుడు పులకరించిపోతాం. ఉత్సాహంతో పరిస్థితులతో యుద్దం చేయడానికి సిద్దపడతాం. పైగా శ్రీ శ్రీ పదప్రయోగం చూడండి ‘’నేడే రేపు అన్నది సాధారణంగా మనం చూసే ప్రయోగం. నేటి నేడు రాబోయే రేపుగా మారుతుంది అన్న సందర్భం అది. కాని ‘రేపే నేడు’ అని చెప్పడంలో ఆయన అందించే నమ్మకం తిరుగులేనిదిగా అనిపిస్తుంది. మార్పు ఈ క్షణం నుండే మొదలవుతుంది. రేపంటే నేడే. అంటే ఈ క్షణం నుండే ఆ రేపు దిశగా ప్రయాణిద్దాం అన్న బలమైన దీక్ష ఆ వాక్యం ద్వారా వినిపిస్తుంది. ఇది ప్రత్యేకంగా శ్రీ శ్రీ ఆచరించే శైలి. బలమైన పదాలను ఇంకా బలంగా ప్రదర్శించగలగడం ఆయన ప్రత్యేక లక్షణం.

ఇక ఇప్పుడు చాలా ముఖ్యమైన ఘట్టం వస్తుంది ‘భలే భలే బాగా సెప్పావ్, కానీ అందుకు మనమేం చేయాలో అదికూడా నువ్వే చెప్పు’ అని ఆ సామాన్యుడు అడుగుతాడు. నిజానికి ఈ పాటలో గొప్పతనం ఏంటంటే సామాన్యుని శక్తిని చెప్పకుండా చూపించగలగడం. మీ రోజులు బావుంటాయ్. మీరు ముందు ముందు సుఖపడబోతారు అనే బాటలో చాలా నాయక ప్రసంగాలు విని ఉంటాం. కాని ఆ దిశగా నేనేం చేయాలి అని ఓ సామాన్యుడు తిరిగి ప్రశ్నించడమే Power of the common man ని acknowledge చేయడం. మంచి రోజులు వస్తాయి అంటూ ఎదురు చూస్తూ కూర్చోవడం కాదు. ఆ రోజుల  కోసం మనం ఏం చేయాలి అన్నది ఆత్మగౌరవంతో జీవించాలనుకునే ప్రతి ఒక్కరూ సహజంగా వేసుకోవలసిన ప్రశ్న. ఎవరో అందించే స్వేచ్చను అందుకుందాం అనుకోవడం కాదు. ఆ స్వేచ్చను పొందే హక్కును అందుకునే అర్హతను నేనెలా సంపాదించుకోవాలి అన్న దిశగా సామాన్య మానవుడు ఎదగాలి. ఇదే కదా political consciousness అంటే. ఆ బాధ్యతను  విస్మరించిన వ్యక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్న సమాజంలో ఎలాంటి  మార్పు ఆశించలేం. హక్కులను ఆశించడంలో భాద్యతలను నెరవేర్చడం ఉంటుంది. దాన్ని ఇంత చిన్న అర వాక్యంలో శ్రీ శ్రీ ఎంత అద్భుతంగా ఈ పాటలో ప్రకటించారో.

ఆ ప్రశ్నకు ‘అందరికోసం ఒక్కడు నిలిచి, ఒక్కనికోసం అందరు కలసి, సహకారమే మన వైఖరి ఐతే, ఉపకారమే మన ఊపిరి ఐతే’ అంటూ శ్రీ శ్రీ చెప్పే జవాబు అద్భుతమైన సోషలిస్ట్ పాఠం. పైగా ఇది ఆయన సినిమా కోసం రాసి మర్చిపోలేదు. ఆ తర్వాతి దశాబ్దాలలో తెలుగునాట నడిచిన ప్రతి ప్రజా ఉద్యమంలో ముందుండి తన భాద్యతను నెరవేర్చారు. ‘పేద గొప్పా భేదం పోయీ అందరూ, నీది నాదని వాదం మాని ఉందురూ’ అంటూ సామ్యవాదాన్ని ఇంత సింపిల్ గా డిఫైన్ చేసిన ఈ కవి మహాకవే. పైగా ‘ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో, అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో’ అంటూ తానూ ముందు వరసలో అడుగులు కదుపుతూ, ఎంతమందిలో ఉత్సాహాన్ని నింపారో, పోరాటాన్ని జీవిత మార్గంగా ఎంచుకొమ్మని ప్రేరేపించారో ఆయన జీవన ప్రయాణాన్ని ఓ  మారు పరిశీలిస్తే అర్ధం అవుతుంది.

శ్రీ శ్రీ జీవితంలో రష్యాను ఎంతగా ప్రేమించారో ఆయన కవిత్వంతో పరిచయం ఉన్నవారికి తెలుసు. ఇది ఒక ప్రత్యేక దేశంపై గుడ్డి ప్రేమ కాదు. కమ్యునిస్ట్ సిద్దాంతంపై ప్రేమ. స్టాలిన్ మరణానంతరం రష్యా పరిస్థితులను పరిశీలిస్తూనే మావో మార్గాన్ని సమర్ధిస్తూ ఆయన శ్రీకాకుళ ఉద్యమంలో చూపిన చొరవ ఆయనకు ఈ  సిద్దాంతం పట్ల ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. అక్టోబర్ విప్లవం, 1930ల నాటి ఆధునికవాద, వామపక్ష ఉద్యమాల స్ఫూర్తితో, శ్రీ శ్రీ రొమాంటిసిజంను విడిచిపెట్టి సాంఘిక వాస్తవికతను స్వీకరించారు. వామపక్ష భావజాలం ప్రారంభ దశలోని ప్రధాన స్రవంతి మార్క్సిజం నుండి పరిణామం చెంది, రాడికల్ విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమాల పట్ల బలమైన అనుబంధంగా మారి, 1970లో ‘విప్లవ రచయితల సంఘం’ (విరసం)కు ఆయన తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం దాకా ఆయన సాగించిన జీవన ప్రయాణంలో మనకు కనిపించేది భవిష్యత్ సమాజం పట్ల ఆయనలోని అచంచలమైన విశ్వాసమే.

1960ల చివరలో నక్సలైట్, రాడికల్ కమ్యూనిస్ట్ ఉద్యమాలు వేళ్లూనుకుంటున్న తరుణంలో, శ్రీ శ్రీ బహిరంగంగా తిరుగుబాటు వ్యవసాయ పోరాటాలకు తన కలంను జత చేశారు. 1970లో రాడికల్ మార్క్సిస్టు-లెనినిస్ట్ (మావోయిస్ట్) విప్లవ భావజాలంతో సన్నిహిత సంబంధం కలిగి, ప్రధాన స్రవంతి ప్రగతిశీల రచనలను తీవ్రవాద వ్యవస్థ వ్యతిరేక చర్యలతో అనుసంధానించిన విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ శ్రీ. ఆయన కవిత్వాన్ని సౌందర్యాత్మక వ్యక్తీకరణగా కాకుండా, అణగారిన ప్రజలను మేల్కొల్పి, పెట్టుబడిదారీ-భూస్వామ్య యథాతథ స్థితిని కూల్చివేయడానికి ఒక ‘ఆయుధంగా’ భావించారు.

శ్రీ శ్రీ సినీ కవిత్వాన్ని విశ్లేషిస్తూ ఆయన సైద్దాంతిక నమ్మాకాలను ప్రస్తావించడానికి కారణం ఆయన ఇతర సినీ కవులకన్నా ఎందుకు భిన్నమో చెప్పడానికి. అప్పటి తటస్థ సిద్ధాంతకర్తలకు భిన్నంగా, నిరంతరం రహస్య రాడికల్ కేడర్‌లకు మద్దతునిస్తూ, తెలుగు రాష్ట్రాల్లోని వామపక్ష, విప్లవ రచయితల తరాలను ప్రభావితం చేసిన మహా మనీషి శ్రీ శ్రీ. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల కమిటీ (ఏపీసీఎల్‌సీ) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ రోజుల్లో 1975 డిసెంబర్ 1న సికింద్రాబాద్ జైలులో రైతు విప్లవ కార్యకర్తలైన జి. కిష్ట గౌడ్, జె. భూమయ్యలకు విధించిన ఉరిశిక్ష రద్దుకు, శ్రీ శ్రీ తీవ్రంగా పని చేశారు. వారి జైలు గదులను సందర్శిస్తూ, విప్లవ ధిక్కారానికి ప్రతీకలుగా వారిని చిరస్థాయిగా నిలిపిన ప్రముఖ కవితలు, కరపత్రాలు రాశారు. స్వతంత్ర భారతదేశంలో రాజకీయ కార్యకర్తలకు విధించిన మొట్టమొదటి ఉరిశిక్ష అది. దానికి విరుద్దంగా గళం ఎత్తిన కవి శ్రీ శ్రీ. అయన  అణగారిన వర్గాల కోసం కేవలం రాస్తూ ఉండిపోలేదు. వారి తరఫున కార్యాచరణ చేపట్టి తరువాతి తరాలకు మార్గనిర్దేశం చేసారు. భవిష్యత్ తరాలను శ్రీ శ్రీ విపరీతంగా ప్రేమించారు. వారి శక్తి యుక్తుల పట్ల అపారమైన నమ్మకాన్ని ప్రదర్శించారు. ‘అందరికోసం ఒక్కడు నిలిచి, ఒక్కనికోసం అందరు కలసి, సహకారమే మన వైఖరి ఐతే, ఉపకారమే మన ఊపిరి ఐతే’ అని రాసి మరచిపోలేదు. తరువాతి దశాబ్దాలలో ఆ బాటలో నడిచి  చూపించారు. ఆయన జీవించిన విధానమే ఆయన గీతాలకు అంతులేని నిజాయితీని ఆపాదించింది. ఆ నిజాయితీ నేటికీ మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది.

పాట చివరి చరణంలో జనం కలిసి మెలిసి అడుగులు వేసి సాధించుకున్న మార్పుతో ‘తీయగా బ్రతుకంతా మారగా, కష్టాలు తీరగా సుఖశాంతులూరగా, ఆకాశ వీధుల ఎదురే లేకుండా, ఎగురును మన జెండా’ అన్నప్పుడు వింటున్న శ్రోతల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మనమూ గళం కలుపుతాం ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలీ నందనందనా’ అంటూ. మన చుట్టూ ఉన్న అందరూ సుఖపడటమే మంచికాలం అని కొందరు సుఖంగా ఉంటూ అందరూ దిగాలుగా ఉండడం నిజమైన సుఖం కాదనే గొప్ప సందేశాన్ని, మంచికాలం అంటే అందరూ సుఖపడటం అని సులభంగా నిర్వచించిన ఈ పాట తెలుగు సినీ గీతాలలో అతి గొప్ప ప్రభావోత్పదక గీతం. సినిమా సాహిత్యం, సినిమా పాటలను చులకనగా చూడడానికి చాలా మంది సాహిత్యకారులకు ఎన్ని కారణాలు ఉండగలవో, వాటన్నికి ఈ ఒకే  ఒక పాట సమాధానం చెప్పగలదు. ఎటు వంటి సాహితీ మాధ్యమం అయినా, కళా మాధ్యమం అయినా తక్కువ స్థాయిలో ఉండిపోయాయి అంటే, ఆ రంగాలలో శ్రీ శ్రీ లాంటి మహోన్నతుల కొరతే కారణం.

ఈ పాటకు ఘంటసాల గళం అదనపు ఆకర్షణ. ముఖ్యంగా జానపద శైలిలో జరిగే రాగాలాపన శ్రోతలను  మరో ప్రపంచంలోకి నడిపిస్తుంది. పెండ్యాల సంగీత దర్శకత్వం ఈ పాటను సజీవం చేసింది.  


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *