శ్రీ శ్రీ సినీ గీతాలు – 7

Spread the love

చిత్రం:  పరువు ప్రతిష్ట (1963)                                                      సంగీతం:  పెండ్యాల

గీతరచయిత:  శ్రీశ్రీ                                                                     నేపధ్య గానం:  ఘంటసాల, సుశీల

   ఆ మబ్బు తెరలలోన దాగుంది చందామామ

   ఈ సిగ్గుపొరలలోన బాగుంది సత్యాభామ

    ఏమంది  సత్యభామ

    ఏమందో ఏమో గాని పరిహాసాలే చాలునంది

    శ్రీవారిని  ఐదారడుగుల దూరాన ఆగమంది

    దూరాన ఆగమంది

    ఈ గాలి  ఊయలా ఊగించు పయ్యెదా (2)

    ఊరించే సైగలతోనే ఏమంది తీయ్యగా

    పరువాల తొందరా నెలరాజు ముందరా(2)

    మర్యాదా కాదని కాదా పలికింది చల్లగా

    పలికింది మెల్లగా (ఆ మబ్బు…)

     సిగలోని పువ్వులు చిలికించి నవ్వులు (2)

     మనకోసం ఏ సందేశం అందించే ప్రేయసీ

     ఆనంద సీమలా అనురాగ డోలలా (2)

     కలకాలం తేలీసోలీ ఆడాలి హాయిగా

     అన్నాయి తియ్యగా

     ఆ మబ్బు తెరలే తొలగి ఆగింది చందమామ

     ప్రేమికుల హృదయము తెలిసి పాడింది చందమామ

     పాడింది చందమామ

     ఆహా..హా..ఆ…ఆ…ఆ….

(విషాదం)

ఆ మబ్భు తెరలలోనా దాగుంది చందామామ అంతులేని చీకటిలోన ఆరింది నాటి ప్రేమ

ఏముంది జీవితాన

పగబూనె లోకమూ మిగిలేను శోకమూ (2)

వేధించే విధితో పోరి వేసారిపోయితి

నేనోడిపోయితి   (ఆ మబ్భు)

పతి ఎంతో దూరమై బ్రతుకంతా భారమై(2)

తనయుని దరి చేరగలేకా చెలియించే నా మతి

కనిపించదే గతి (ఆ మబ్భు)

సినిమాలలో చాలా వరకు వచ్చే పాటలు కథనం కోసం సన్నివేశాల ఆధారంగా రాసినవే. శ్రీ శ్రీ ప్రత్యేకత ఏంటంటే ఆయన రాసిన ఈ సన్నివేశ గీతాలను విన్న వెంటనే ఆ సినిమా చూడకపోయినా కథ మనకు అర్ధం అయిపోతుంది. ‘పరువు ప్రతిష్ట’ సినిమాలో ఒక పాటను యుగళగీతం గానూ, దాన్నే మరో సన్నివేశంలో విషాదం నిండిన సోలోగానూ రాసారు శ్రీ శ్రీ. పెండ్యాల అద్భుత సంగీతం, ఘంటసాల సుశీలల సుమధుర గానం డ్యూయేట్ ను అజరామరం చేస్తే, విషాదంగా సుశీల అదే పాటను మళ్లీ పాడినప్పుడు అందులో కవి చేసిన మార్పులు ఆ సన్నివేశానికి అతికినట్టు సరిపోతాయి. ఒకే ట్యూన్ ను ఆనంద విషాదాలకు అనుగుణంగా చాలా మంది కవులు సినిమా పాటలను రాసారు. వాటి నడుమ శ్రీ శ్రీ రాసిన ఈ గీతం ప్రత్యేకంగా ఉంటుంది.

పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్న ఓ జంట ప్రకృతి ఒడిలో ఆనందంగా విహరిస్తున్నప్పుడు, భర్తనే కాస్త దూరంగా ఉండమని ఈ పాటలో ఆమె వేడుకోవడం వారి రహస్య వివాహాన్ని సూచిస్తుంది. పాట పల్లవి చరణాలలో కొంచెం అటు ఇటుగా పదాలను చివర్లో మార్చి ఆ జంట నడుమ శృంగారాన్ని బహు బాగా పండించారు కవిగారు. ఆ జంటలో ప్రేమభావాన్ని పెంచుతోంది మబ్బుల చాటున దాగున్న చందమామ. కవులు చంద్రుడిని అన్ని సందర్భాలలో ఉపమానంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. కవి చంద్రుని చుట్టూ శృంగారాన్ని అల్లగలడు, మబ్బుల చాటున్న చంద్రుడిలో విషాదాన్ని చూపించగలడు. ఈ పాటలో శ్రీ శ్రీ చంద్రున్ని ఉపమానంగా తీసుకుని రెండు భిన్నమైన సందర్భాలను అవిష్కరిస్తారు.

‘ఆ మబ్బు తెరలలోన దాగుంది చందామామ’ అంటూ పక్కన సిగ్గుపొరల నడుమ నిలిచి ఉన్న చెలిలో సత్యాభామను చూస్తున్నాడు నాయకుడు. కృష్ణుడ్ని ఆడించేది, తన మాట నెగ్గించుకోవడానికి ప్రయత్నించేది ఆయన అష్ట భార్యలలో ఆమె మరి. ఇక్కడ హీరోగా ఉన్నది ఎన్.టి.ఆర్ అంటే తెలుగు జాతి కృష్ణుడే. భార్యతో ఏకాంతం కోసం ఈ అభినవ కృష్ణుడు తహ తహ లాడుతున్నాడు. ఆమె మాత్రం అతనికి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తుంది. అతని మాటలను పట్టించుకోదు. సత్యభామలా మంకు పట్టు పడుతుంది. ఈ పాటను తెలుగు సినిమాలతో పరిచయం ఉన్నవారెవరు విన్నా అక్కడ నాయకుడు ఎవ్వరో గుర్తు పట్టేస్తారు. నాయిక బెట్టు చేస్తుందని అర్దం చేసుకోవడం పెద్ద కష్టమూ కాదు. కాని ఈ సత్యభామ ఆయనకు బావుందట, బావుంది సత్యభామ అంటూ ఏమంది సత్యభామ అంటూ ప్రశ్న వేస్తూ ఈ పల్లవికి భలే లాలిత్యాన్ని చేరుస్తాడు కవి.

చెప్పిన మాట చెప్పినట్లు వినే కృష్ణపత్ని రుక్మిణి. కాని ప్రేమ సంభాషణలలో మరీ అంత అణుకువ రంజుగా ఉండదు. ఢీ అంటే ఢీ  అనే స్త్రీని సత్యభామతో పోల్చడం కవులకు ఇష్టం. ఇక్కడ నాయిక భర్త మాటను వినట్లేదు. అతనికి దగ్గరవడానికి భయపడుతుంది. అతన్ని దూరం నెడుతుంది. మళ్లీ అతనంటే ఎంతో ప్రేమ కాని తాను చెప్పిందే అతను వినాలని పట్టు పడుతుంది. ఆమె పట్టుదల, అతనికి సత్యభామను గుర్తు చేస్తుంది. ఈ రొమాంటిక్ డ్యూయేట్ లో నాయికను సత్యభామతో పోల్చడం శ్రీ శ్రీ చేసిన చమత్కారం. సత్యభామ పాదాలను ఒత్తి మరీ ఆమె ప్రేమను పొందిన ఆ కృష్ణుడి అడుగుజాడల్లో మన నాయకుడు నడుస్తున్నాడని ఎంత సందర్భోచితంగా చెప్పారో కవిగారు.

దీనికి జవాబుగా ఆమె పరిహాసాలు చాలు అని శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమని అంటుంది. ఈ పల్లవిలో పదద్వని ఎంత బావుంటుందో, ఒకే ద్వని ఉన్న పదాలను సందర్భానికి తగ్గట్టుగా ఏరుకోవడంలో శ్రీ శ్రీ తర్వాతే ఎవరయినా అనిపిస్తుంది. ఈ పాటకు అందం ఆ అక్షర ప్రయోగాలే. “ఏమందో ఏమో గాని” అంటూ వచ్చే వాక్యాలను చూడండి అన్నీ ‘గ’, ద, ర అక్షరాలతో కూడిన పదాలే. ‘కాని’ అని కాక ‘గానీ’ అని ఉపయోగించి ఆ ద్వనికి ఎంతో సౌందర్యాన్ని చేర్చారు కవి. “ఏమందో ఏమో గాని, పరిహాసాలే చాలునంది, శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆమంది” మొదటి వాక్యంలో గ రెండొ వాక్యంలో వచ్చే ‘అడుగుల’, ‘ఆగమంది’ అన్న పదాలతో జత కలిసి ఆ పల్లవికి ఎంత అందం తీసుకొచ్చిందో. చిలిపితనం, కొంటేతనం, చమత్కారం ఎంత అందంగా పదాలలో పట్టి బంధించి పాటను తయారు చేసారో శ్రీ శ్రీ. ఇది శ్రీ శ్రీ రాసిన యుగళగీతం అని చాలా మంది అనుకోరు. మహాప్రాణాక్షరాలను, ఒత్తులను, విరివిగా ఉపయోగిస్తూ గంభీరమైన పదప్రయోగాలను శ్రీ శ్రీ కవిత్వంలో చూసి అదే ఆయన శైలి అనుకునే వారికి  ఈ యుగళ గీతం శ్రీ శ్రీ రాసారంటే నమ్మకం కుదరదు. ఇందులో అన్నీ మొదటి అక్షరాలే. ఒత్తులున్న పదాలే లేవు. ఇంత సున్నితంగా పాట రాసింది ఆయనా అనిపిస్తుంది ఇప్పటికి కూడా.  ఇక ఈ చరణాన్ని ఘంటసాల గొంతు మరింత మధురంగా పలుకుతుంది. మొదటి వాక్యంలో సత్యాభామ అని దీర్ఘం తీస్తూ వెంటనే బాగుంది సత్యభామ అని ఆయన అంటుంటే భళే ఉంటుంది.

‘ఈ గాలి ఊయలా ఊగించు పయ్యెదా, ఊరించే సైగలతోనే ఏమంది తీయ్యగా’…  ఈ వాక్యాలలో ఊయల అనే పదానికి ఊగించు, ఊరించు అనే పదాలు జోడి. పయ్యేదా, తియ్యగా. జంట పదాలనిపిస్తాయి. ఈ చరణం వింటుంటే మన పక్కనుండి గాలి తిమ్మెర వీచినట్లు అనిపిస్తుంది. ఆ ట్యూన్, ఘంటసాల గానం ఈ పదాల కలయిక అతి మధురం.  ఊరించే సైగలతో ఆ గాలి ఏమంది తియ్యగా అన్న వాక్యంలోని చమత్కారం గమనించండి, అదే ప్రశ్న, జవాబు కూడా, ఊరించే తియ్యటి సైగలు అంటూ గాలి ఇచ్చే సంకేతాలను సూచిస్తూ, అది నీతో ఏమంది  అని ప్రశ్నించడంలోనే చిలిపితనం ఉంది.  శృంగారాన్ని వ్యక్తీకరించేటప్పుడు కవుల భావుకత దాని స్థాయిని ఉన్నతం చేస్తుంది. ఆ పదాలలో ఏ మాత్రం సున్నితత్వం లోపించినా ఆ భావం వెకిలిగానూ, అధికారంతోనూ, అత్యాశగానూ వినిపిస్తుంది. ఈ రెండు వాక్యాలను ఈ చరణంలో మరో సారి పాడుతూ అక్కడ ఆ పదాలకు ప్రతిస్పందనగా ఆమె గానాన్ని జోడించి అద్భుతమైన శృంగార భావాన్ని ఈ పదాలకు అందించారు సంగీత దర్శకులు. దృశ్యంగా ఊహించుకోగల ప్రతీకాత్మకతతో పాట రాసినప్పుడే అది పండుతుంది. పాట వింటుంటే, ఆ చిత్రీకరణ కళ్ళలో కదలాడాలి. ఇది ఎప్పుడు విన్నా వెన్నెల విహారం చేసినట్లు ఉంటుంది.

దానికి ఆమె అంతే చమత్కారంగా జవాబు ఇస్తుంది. ‘పరువాల తొందరా, నెలరాజు ముందరా’ అంటూ ఆ గాలి చల్లగా చెవిలో ఇది మర్యాద కాదని కాదా పలికింది ఆని ఆమె అమాయకంగా అతన్ని అడుగుతుంది. చరణం చివర్లో ‘పలికింది చల్లగా’ అంటూ వెనువెంటనే ‘పలికింది మెల్లగా’ అని దాన్ని ముగిస్తూ  ఆ గొంతు పలికించిన చిలిపితనం ఇచ్చే సౌందర్యానుభూతిని తిరిగి పదాలలో వర్ణించడానికి మరో మహాకవే రావాలేమో.

ప్రేమ శృంగారం అనుభూతి ప్రధానమైన భావావేశాలు. వాటిని అందుకోవడం కన్నా చేతులు చాచి ఆహ్వానించడంలో ఆనందం ఎక్కువ. అనుభవం కన్నా అనుభూతి ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. చాలా మంది ప్రేమను అనుభవంగా వ్యక్తీకరిస్తారు. దానిలోని రసాస్వాదన పలచన అయిపోతుంది. దాన్నే అనుభూతి ప్రధానంగా వ్యక్తీకరించినప్పుడు ఆ పాట హృదయాన్ని తాకుతుంది. అనుభవం శారీరికం, అనుభూతి మానసికం, శారీరికమైన క్రియకు ముగింపు తప్పదు. కాని అనుభూతి ముగింపన్నదే లేని రసాస్వాదన. అందుకే ఎంతటి వారికయినా అనుభూతి ప్రధాన గీతాలే అమృతప్రాయంగా ఉంటాయి. ఈ పాటకు సంబంధించి చూస్తే, రహస్యంగా ఓ జంట పెళ్ళి చేసుకున్నారు. అతను ఆమెతో ఏకాంతాన్ని కోరుతున్నాడు, ఆమె ఎన్నో అనుమానాలతో భయాలతో అతన్ని దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తూనే లొంగిపోతుంది. పచ్చి శృంగార సన్నివేశం ఇది. కాని ఇందులో శారీరిక వాంఛ మాత్రమే కనిపించకూడదు. వారిద్దరి నడుమ బాంధ్యవం కనిపించాలి, శ్రీ శ్రీ కలం చేసింది అదే. ఆ తర్వాత కథలో వచ్చే వారి ఎడబాటు విధి ఆడే నాటకం తప్ప ఇద్దరూ ఈ ప్రేమ పునాదిగా ఒకరికోసం ఒకరు కలవరిస్తూ జీవిస్తారు. అందుకే ఇది ఫక్తు మొదటి రాత్రి గీతంగా మాత్రమే ఉండిపోకూడదు. శ్రీ శ్రీ ఈ శృంగార గీతంలో చేర్చిన ఆ అనుభూతే ఈ పాటకు ప్రాణం. ఈ కథకు బలం.

తర్వాతి  చరణంలో  ఆమె సిగలోని పువ్వులు నవ్వులు చిలికిస్తున్నాయని, అవి ఏ సందేశం ఇస్తున్నాయో చెప్పమని అడుగుతున్నాడు అతను. ఆ వెన్నెల రాత్రి వీచే గాలి, ఆమె తలలో పువ్వులు తనలో రేకెత్తించే కల్లోలాన్ని అతను ఆమె ద్వారా  వినాలని ప్రయత్నిస్తున్నాడు.  అప్పటిదాక బెట్టు చేస్తున్న ఆమె కలకాలం తేలిసోలి హాయిగా అడాలంటున్నాయంటూ అప్పటిదాకా తాను కష్టంగా పాటిస్తున్న దూరాన్ని తనకే తెలియకుందా తగ్గించేస్తుంది. అతని ప్రేమకు, ఆ వెన్నెల రేయి కలిగిస్తున్న అలజడికి ఆమెలోని ఆ బెట్టు సడలిపోతుంది. ఆమె తనకు దగ్గరవుతోందన్న ఆనందం మనసు నిండగా ఆ ఇద్దరూ కలిసి మబ్బు తెరలు తొలిగి చందమామ ఆగిందని, ఇక్కడి ప్రేమికుల హృదయాలను తెలిసి పాడుతుందంటూ ఆనందాలలో తేలియాడుతూ ఉండగా పాట ముగుస్తుంది.

రహస్యంగా వివాహం చేసుకున్న వారిద్దరూ ఒకటవ్వాలి, ఆమె తల్లి అవ్వాలి తర్వాత కథ నడవాలి. మళ్లీ నాయికా నాయికలు బలహీన మనస్కులుగానో, బాధ్యతలేనివారిగానో కనిపించకూడదు. వారి కలయిక తొందరబాటు చర్యగానూ అనిపించకూడదు. దానికి ప్రేక్షకుల ఆమోదం దొరకాలి. ఇలాంటి కీలక సన్నివేశానికి శ్రీ శ్రీ రాసిన పాట ఇది. ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు ఈ  పాట ఒక్కటి ఒకెత్తు. సినీ కథానాయకుడిగా ఎన్. టి. ఆర్. నటించిన అతి చక్కని పాటల్లో ఇది ఒకటి. చిత్రీకరణ కూడా అంతే అందంగా జరుగుతుంది. సన్నివేశం చాలా సహజంగా, ప్రతి ఒక్కరూ ఆమోదించేట్లుగా ఉంటుంది. వారి కలయిక తప్పదు అనిపిస్తుంది తప్ప, తప్పు అనిపించదు. ఈ రొమాంటిక్ పాటను సన్నివేశానికి కొనసాగింపుగానే కాని అతి లాలిత్యంగా రాసారు  మహాకవి.

ఇదే పాట మరో సారి సినిమా చివర్లో విషాద గీతంగా వస్తుంది. అక్కడ కూడా సన్నివేశానికి ఈ పాటే బలం. తన గతాన్ని ప్రస్తుత జీవితాన్ని, వీడిపోయిన భర్తను, ఎక్కడో పెరుగుతూ తనను గుర్తించలేని కొడుకుని తలచుకుని రోదిస్తూ ఆమె ఈ  గీతాన్ని మళ్లీ పాడుతుంది. అదే దారిలో  వెళ్తున్న నాయకుడు ఆ పాట తనలో రేపిన జ్ఞాపకాల కల్లోలంతో ఆ దిశగా వెతుక్కుంటూ వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం తన జీవితం నుండి వెళ్లిపోయిన భార్యను తిరిగి కలుసుకుంటాడు. అంటే సినిమాను విషాదం నుండి సుఖాంతం వైపుకు తీసుకు వచ్చే ముఖ్యమైన సన్నివేశం ఇదన్నమాట.

ఆ నాడూ ఉన్నది  ఆకాశంలో అదే చందమామ, కాని అప్పుడు అది ప్రేమను, ఆనందాన్ని మోసుకొచ్చింది. ఇప్పుడు అదే మబ్బుల్లో దాగిన చంద్రుడు, కష్టాల కొలిమిలో కాలుతున్న ఆమె జీవితపు విషాదంలా ఆమెకు కనిపిస్తున్నాడు. ‘ఆ మబ్భు తెరలలోనా దాగుంది చందామామ అంతులేని చీకటిలోన ఆరింది నాటి ప్రేమ’ అంటూ ఆమె ఇప్పటి పరిస్తితిని తలచుకుంటూ ‘ఏముంది జీవితాన’ అని నిట్టూరుస్తే, ప్రేక్షకుల ఆమెతో పాటు ఆ బాధను అనుభవిస్తారు.

‘పగబూనె లోకమూ మిగిలేను శోకమూ, వేధించే విధితో పోరి వేసారిపోయితి’ అంటూ తాను ఇంక పోరాడలేనని, అలసిపోయాననే భావనను ప్రకటిస్తూ ‘నేనోడిపోయితి’ అంటూ ఓటమిని ఒప్పుకుంటుంది ఆమె. ఆమె అసహాయ స్థితిని వర్ణించే చరణం ఇది. మొదటి పాట శైలిలోనే అదే లాలిత్యంతో సాగుతుందీ గీతం. కాని  మొదటి సన్నివేశం శృంగారం అయితే ఇది  అత్యంత విషాదం. రెంటిలోనూ ఒకే రకమైన పదాల కూర్పు, అదే లాలిత్యం మొదటిది ఆనందాన్ని కలిగిస్తే ఇది బాధిస్తుంది.

‘పతి ఎంతో దూరమై బ్రతుకంతా భారమై, తనయుని దరి చేరగలేకా చెలియించే నా మతి’ అంటూ తాను పూర్తిగా మతి చలించినదానివలే అయోమయంలో పడి ఉన్నానంటూ ‘కనిపించదే గతి’ అని ఆమె నిట్టూర్చడం ఆమె జీవిత విషాదాన్ని  మొత్తం పరిచి చూపిస్తుంది.

ఒకే ట్యూన్ కు ఆనంద విషాద సందర్భాలకు విడిగా సినీ కవులండరూ రాసిన పాటలను సేకరిస్తే వాటన్నిటి నడుమ ఇది తప్పకుండా ఉంటుంది. ఈ రెండు సన్నివేశాలకు పాటను రాయడం అంత సులువు కాదు. ప్రేమ, వాంఛల మధ్య విభజన రేఖ చాలా పలచన. అది ఎక్కడా చెదిరిపోకుందా పక్కాగా కవి రాసిన గీతం ఇది.

చిత్రం : ప్రేమలేఖలు (1977)                                                    సంగీతం : సత్యం

గీతరచయిత : శ్రీశ్రీ                                                                 నేపధ్య గానం : సుశీల, వాణీ జయరాం

ఆ ఆ ఆ ఆ ఆ ….

ఈ రోజు… మంచి రోజు.. మరపురానిది.. మధురమైనది

మంచితనం ఉదయించినరోజు

ఆ ఆ ఆ ఆ…

ఈ రోజు.. మంచి రోజు… మరపురానిది.. మధురమైనది

ప్రేమ సుమం వికసించినరోజు

తొలిసారి ధృవతార దీపించెను… ఆ కిరణాలే లోకాన వ్యాపించెను

ఆ ఆ ఆ ఆ..

తొలి ప్రేమ హృదయాన పులకించెను… అది ఆనంద దీపాలు వెలిగించెను

చెలికాంతులలో.. సుఖశాంతులతో.. జీవనమే పావనమీనాడు

ఈ రోజు మంచి రోజు… మధురమైనది మరపురానిది

ప్రేమ సుమం వికసించినరోజు

రెండు నదుల సంగమమే అతిపవిత్రము

మతములన్ని ఒకటైతే మానవత్వము (రెండు)

మనసు మనసు లొకరికొకరు తెలిపే రోజు

తీరని కోరికలన్నీ తీరే రోజు

అనురాగాలు..అభినందనలు

అందించే శుభసమయం నేడు

ఈ రోజు మంచి రోజు… మధురమైనది మరపురానిది

మంచితనం ఉదయించినరోజు… ప్రేమ సుమం వికసించినరోజు (3)

శ్రీ శ్రీ సినీ పాటలన్నిటిలోనూ నన్ను వ్యక్తిగతంగా అత్యంత ఆశ్చర్యానుభూతికి లోను చేసిన పాట ‘ప్రేమలేఖలు’ సినిమాలో “ఈ రోజు మంచి రోజు”. చిన్నప్పుడు ఇది పుట్టినరోజు పాట అనుకునేదాన్ని. ఆశ్చర్యంగా ఇప్పటికీ చాలా మంది తెలుగువారు దీన్ని పుట్టినరోజు పాటగానే ప్రస్తావిస్తారు. సాహిత్యం నా జీవితంలో మొదటి స్థానం తీసుకున్నప్పటి  నుండి నేనూ రోజూ వింటున్న పాటలే కొత్తగా, అర్ధవంతంగా వినిపిస్తుంటే, వాటి లోతులలోకి వెళ్లడం అలవాటు చేసుకుంటున్న సమయంలో ఈ పాట నాకు చాలా పెద్ద షాక్ ఇచ్చింది.

ఈ మధ్య కాలంలో సాహిత్యకారులందరినీ (చనిపోయినవారితో సహా) కులం పరిధిలోకి నెట్టి చూసే ఆధునిక విమర్శకులు పెరిగారు. దానికి  శ్రీ శ్రీ కూడా మినహాయింపు కాక పోవడం, దళితవాదం నీడన కొందరు (కొందరు మాత్రమే) ఆయన కులాన్ని ప్రస్తావించి, ఆయన పరిధిని కుచించడం చూసాక బాధ కలిగింది. కొందరు శ్రీ  శ్రీ ని అభ్యుదయ కవి అని పనికిరాని కమ్యునిజాన్ని రుద్దాడని అంటున్నప్పుడు, కొన్ని సంఘాలవారు ఆయన్ని మహా ప్రస్థానం లోనించే తప్ప మరో కోణంలో నుండి చూడలేకపోవడాన్ని గమనిస్తున్నప్పుడు ఒక కవి విస్తృత రచనల గురించి తెలుసుకోకుండా ఆయనపై అభిప్రాయాన్ని నిర్మించుకుని తమ తెలివితక్కువతనాన్ని ప్రదర్శించుకుంటున్న వారి అల్పత్వంపై జాలి కూడా కలిగేది.

శ్రీ శ్రీ ని బ్రాహ్మణ కవిగా, కమ్యునిస్టుగా, నాస్తికుడిగా, విప్లవకవిగా మాత్రమే చూడడం ఆయన్ని సంపూర్ణంగా చదవడం కానే కాదు. తన స్వంత ఆలోచనలతో సినీ సాహిత్యాన్ని ప్రభావితం చేస్తూనే ఎవరూ చేయసాహసించని గొప్ప ప్రయోగాలు సినీ గీతాలలో చేసారు శ్రీ శ్రీ. ముఖ్యంగా ‘ప్రేమలేఖలు’ సినిమాలో ఒక గొప్ప క్రిస్మస్ గీతాన్ని, బైబిల్ సారాంశంతో పాటు క్రిస్మస్ పండుగ ఉద్దేశాన్ని వర్ణిస్తూ ఆయన రాసిన గీతం కొన్ని చర్చీలలో కూడా వినిపించేవారట. ఒక ధర్మంలో పుట్టి మరో ధర్మంలోని మార్మికతను, ఫిలాసఫీని అర్ధం చేసుకుని ఆ సారాన్ని క్లుప్తంగా ఒక పాటలో బంధిచడం అంత సులువు కాదు. ఆ దైవప్రేమ సందేశాన్ని, మానవప్రేమతో రంగరించి, రెంటి ఉద్దేశమూ మనసుల కలయికే అని,  తమ వైరుధ్యాలను మరిచి అందరూ ఒక్కటవడమే ఏసు సందేశాలకు అర్ధం అని, క్రైస్తవ భోధన సారంలోని దార్శనికతతో ఈ పాటను రాసారు శ్రీ శ్రీ.

ఈ పాట ఒక క్రిస్మస్ వేడుక సమయంలో ఇద్దరు స్నేహితురాళ్లు కలిసి పాడతారు. ఒకామె క్రిస్టియన్. మరొకామె హిందువు. క్రిస్టియన్ స్నేహితురాలు క్రిస్మస్ సందేశాన్ని తనకు తన తల్లి తండ్రులు చిన్నప్పటి  నుండి  నేర్పిన ప్రేమ భావాన్ని ఇందులో ప్రస్తావిస్తుంది. ఆమె స్నేహితురాలు అప్పుడే తనను ప్రేమిస్తున్న వ్యక్తి ప్రేమకు తన ఆమోదాన్నితెలుపుతూ, అతనితో బంధాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకుంటుంది. అందుకని తాను అనుభూతిస్తున్న ఆ ప్రేమ గొప్పతనాన్ని, ఇద్దరు వ్యక్తులు ఒకటిగా మారే ఆ సంగమాన్ని ఆమె వర్ణిస్తుంది. మతాలకు అతీతంగా, అనురాగం, స్నేహం, ప్రేమలతో ప్రపంచం అంతా నిండిపోవాలనే ఆశను కవి ఈ పాట ద్వారా మనలో రేకెత్తిస్తారు. ఇక ఇది కేవలం క్రైస్తవ గీతంగా మాత్రమే ఉండదు. వింటున్న ప్రతి ఒక్క శ్రోత ఇది తమ మనసులోని కోరికకు ప్రతిరూపం అని అనుకునేటట్లుంది ఈ రచన.

క్రిస్మస్ బాల ఏసు జన్మను గుర్తు చేస్తుంది. మరపురాని మధురమైన ఉదయానికి అది ప్రారంభం అని నమ్ముతారు క్రైస్తవులు. పాట ప్రారంభం అదే భావంతో ఉంటుంది. “ఈ రోజు మంచి రోజు మరపురానిది మధురమైనది మంచితనం ఉదయించినరోజు” అంటుంది ఆ క్రైస్తవ యువతి. ప్రపంచం కోసం తన రక్తాన్ని ఇచ్చి మంచితనం, క్షమ నేర్పిన మహనీయుడు జన్మించిన రోజు అది. అందుకే అది మంచితనం ఉదయించిన రోజు అని ఆమె పాడుతుంది. ఆమె స్నేహితురాలు ప్రేమను స్వీకరించడానికి నిశ్చయించుకున్న రోజు అదే కాబట్టి దీనికి జతగా అది మంచి రోజని మరపురానిది మధురమైనది అంటూనే తనలో ప్రేమ సుమం వికసించిన రోజు అదని ప్రకటిస్తుంది. నిజానికి ఏసు జననం అంటే ఈ ప్రపంచంలో ప్రేమ సుమం వికసించడమే. అందుకే ఇది క్రిస్మస్ కు సంబంధించిన పాటగానే అనిపిస్తూ వ్యక్తిగత ప్రేమను ఆ యువతి అందుకుంటున్నరోజుగానూ అర్ధం అవుతుంది. ఇది కవి చమత్కారం.

ఇద్దరు యువతులలోనూ ఉన్నది ప్రేమ భావనే. ఒకరి మనసు ఏసు జన్మదినాన్ని తలచుకుని పులకరిస్తుంటే, మరొకామే తన మనసులో విరిసిన ప్రేమ పుష్పాన్ని తలచుకుని పులకరించిపోతుంది. కారణాలు వేరు కాని ప్రేమ భావన, దానిలోని ఆ పవిత్రత ఒకటే. వ్యక్తిగత ప్రేమను సామాజిక ప్రేమను ఇలా ఒకే తాటిపై నిలిపి ఒకేసారి ఆ అనుభూతులను ఇద్దరు వ్యక్తులు  ఆస్వాదిస్తున్న సందర్భాన్ని పాటగా మలచడానికే శ్రీ శ్రీని గేయరచయితగా ప్రత్యేకంగా ఈ సందర్భానికి ఎన్నుకున్నారు.  

తరవాతి చరణంలో “తొలిసారి ధృవతార దీపించెను… ఆ కిరణాలే లోకాన వ్యాపించెను” అంటుంది ఆ క్రిస్టియన్ యువతి. ఏసు జన్మించిన రాత్రి దారి చూపిన దృవతార గురించి వచ్చే ప్రస్తావన ఇది. ద్వేషంతో, పగలతొ రగిలిపోతున్న మానవ సమాజాన్ని ప్రేమ వైపుకు నడిపించడాని వెలసిన ఆ తార చిందించిన కిరణాలు లోకమంతా వ్యాపించాయి. దీనికి బదులుగా “తొలి ప్రేమ హృదయాన పులకించెను అది ఆనంద దీపాలు వెలిగించెను” అంటూ హిందూ ధర్మానికి చెందిన అమ్మాయి బదులిస్తుంది. తొలి ప్రేమ తన హృదయంలో నింపిన పులకరింతను గురించి చెప్తూ తనలో ఆనంద దీపాలు వెలిగాయని ఆమె బదులిస్తుంది. పై వాక్యంలో ‘దృవతార’  క్రైస్తవ మతాన్ని సూచిస్తే రెండో వాక్యంలో దీపాల ప్రస్తావన హిందూ ధర్మానికి ప్రతీక. కాని రెండు వాక్యాలను జాగ్రత్తగా వింటే, మతం ప్రస్తావించే సామాజిక ప్రేమ ఇద్దరు మనుష్యులు జీవితాన్ని పంచుకోవాలనుకునే వ్యక్తిగత ప్రేమ – ఈ రెంటి ఉద్దేశమూ ఉన్నత జీవనమే, మానవతకు రూపాన్నివ్వడమే. అందుకే తరువాతి వాక్యంలో “చెలికాంతులలో, సుఖశాంతులతో జీవనమే పావనమీనాడు” అని  ఇద్దరూ పాటను అందుకుంటారు. ‘పావనం’ అనే పద ప్రయోగం ఈ పాట నేపధ్యాన్ని సూచిస్తుంది. ఇది ఎక్కువగా చర్చీ గీతాలలో వాడే పదం. ఇలా సినీ సన్నివేశాన్ని సందర్భాన్ని, రెండు మతాల, రెండు ప్రేమల సంగమాన్ని ఓ పాటగా రాయడానికి  ఎంత పరిశీలనాత్మకత, భాషపై, సమాజంపై పట్టు ఉండాలి ఎవరికైనా?

చిత్రీకరణలో మొదటి యువతి తండ్రి పియానో వాయిస్తూ ఉంటాడు. చుట్టూ అలంకరణ అంతా క్రిస్మస్ తారలతోనూ కేండిల్స్ వెలుగులతోనూ నిండి ఉంటుంది. ఆ ప్రేమ జంట సమూహంలో స్వరం కలుపుతూ ఉంటుంది. పండుగ అర్ధం కలిసి పంచుకోవడం, ఆ ఉత్సవం వెనుక ఉన్న ప్రేమ తత్వానికి తమ వ్యక్తిగత అనుభవాన్ని జోడిస్తూ, అనుభూతిస్తూ భిన్న మతాలకు చెందిన ఆ ఇద్దరూ దాన్ని అందమైన రోజుగా తమ జ్ఞాపకాలలో పదిలపరుచుకోవడం కదా సంపూర్ణమైన మనిషితనం. మతాలన్నిటిని దాటుకుని వ్యక్తులను ఒకటి చేసే పవిత్ర భావం అది. దాన్ని  ఈ చరణం చాలా గొప్పగా వ్యక్తీకరిస్తుంది.

ఈ చరణం తర్వాత వచ్చే ట్యూన్ It came upon the midnight clear అనే అతి ప్రాచీన క్రిస్మస్ పాటకు సంబంధించినది. క్రిస్మస్ కారేల్స్ సందర్భంలో అన్ని దేశాలలో తప్పకుండా పాడే పాట ఇది. దీన్ని ఈ పాట ట్యూన్ లో భాగం చేసి సంగీత దర్శకుడు సత్యం దీన్ని క్రైస్తవ ప్రేమ సందేశ గీతంగా పరిపూర్ణతను చేకూర్చారు. ఈ భాగం దగ్గరకు వచ్చేసరికి క్రిస్టియన్ సోదరులు ఈ పాటతో మమేకం అయిపోతారు.

క్రిస్మస్ పాటయినా మరేదైనా శ్రీ శ్రీ తన ఫిలాసఫీని జోడించకుండా ఉన్న సందర్భాలు సినీ గీతాలలో చాలా తక్కువ. నిజానికి ఈ పాటలో కూడా అది జరుగుతుందని అనుకోలేం.  ఎందుకంటే  భక్తిభావం ప్రేమ భావం నింపుకున్న ఈ పాటలో సామ్యవాదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందా? శ్రీ శ్రీ తలచుకుంటే ఉండి తీరుతుంది. అది భక్తిగానూ ప్రేమగానూ ద్వనిస్తుంది. అసలు సామ్యవాదం అంటే ఆ రెంటి సంగమమే అని అర్ధం చేసుకున్న అతి తక్కువ మందిలో శ్రీ శ్రీ ఒకరు. అందుకే, తరువాతి చరణంలో “రెండు నదుల సంగమమే అతిపవిత్రము” అంటూ “మతములన్ని ఒకటైతే మానవత్వము” అని ఆ ఇద్దరుతోనూ అనిపించగలిగారు. ఎంత అద్భుతమైన వాక్యం ఇది. మానవత్వం అంటే అన్ని మతాలు ఒకటిగా మారడం. మతం అంటే నమ్మకాలు, ఆచారాలు, నైతిక సూత్రాలు, విశ్వాసాల సంగమం. ఇవన్నీ ఒకటిగా మారడమే కదా సామ్యవాదం అంటే. అది కదా పవిత్రమైన సంగమం అంటే, ఎక్కడెక్కడో తిరిగి, ఎన్నిటినో కలుపుకుని ప్రవహించే నదులు ఒక్కటవ్వడం పవిత్రంగా భావించే మనం దాన్నే మానవ  జీవన సూత్రంగా మార్చుకోగలిగితే, ప్రపంచం ఎంత అందంగా  ఉంటుందో?

సాహిత్యంలో, మత విశ్వాసాల  సంగమాన్ని, సామ్యవాద స్వప్నాన్ని, కథా  సన్నివేశాలతో కలపగల శక్తి వంతమైన కవులు ఎవరన్నా ఉంటే వారికి ఆధ్యుడు శ్రీ శ్రీ  అంటే అతిశయోక్తి కాదు. “మనసు మనసు లొకరికొకరు తెలిపే రోజు తీరని కోరికలన్నీ తీరే రోజు, అనురాగాలు..అభినందనలు అందించే శుభసమయం నేడు” అని తర్వాత ఇద్దరూ కలిసి గానం చేస్తారు. ప్రేమలో పడిన యువతి అనురాగాన్ని కోరుకుంటే, ఏసు మార్గాన్ని స్తుతిస్తున్న యువతి అభినందనలను కోరుతూ అవి అందించిన ఈ రోజు తామిద్దరికీ, ఆ ఆనంద ఘడియల్లో తమతో ఉన్న అందరికీ మంచి రోజు అని పరప్సర శుభాకాంక్షలు తెలుపుకుంటుండగా పాట ముగుస్తుంది.

మన సినీ సాహిత్యం అధ్బుతమైన మత సామరస్యానికి చిహ్నం. హిందీ భాషలో సాహిర్ లుధియాన్వీ అనే ముస్లిం ఉర్దూ కవి గొప్ప హిందూ భజనలు, భక్తి గీతాలు, రాసారు. మరో మతంలోని భక్తి భావాన్ని, ఆ దార్శనికతను అర్ధం చేసుకుని అదే శైలిలో అన్య మతస్థులు రాయడం వెనుక వారి జీవిన విధానంలో ఆచరించిన మత సామరస్యం ముఖ్యంగా పని చేస్తుంది. గుల్జార్ రాసిన సూఫీ గీతాలు ముస్లిం సోదరులకు ఎంతో దగ్గరయ్యాయి. ఆయన రాసిన ‘చయ్య చయ్య’ పాట కూడా సూఫీ భక్తి భావాన్ని ప్రకటించేదే. వసంత్ దేవ్, సంతోష్ ఆనంద్ రాసిన ఖవ్వాలీలు భక్తి గీతాలు ముస్లిం భక్తి భావనను ప్రకటిస్తాయి.

తెలుగులో పురుషోత్తమ చౌదరి (1803-1890) తెలుగులో క్రైస్తవ గీతాలు రాసిన మొదటి కవి. ఈయన సి.పి. బ్రౌన్, త్యాగరాజులకు సమకాలీకుడు. బెంగాళీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన తెలుగు భాషీయుడు. క్రైస్తవుడిగా మారి తెలుగులో ఎన్నో క్రైస్తవ కీర్తనలు రచించాడు. ఈ రోజు ప్రతి చర్చీలో ఈయన కీర్తనలే వినిపిస్తూ ఉంటాయి. కాని మతం అంటే గౌరవం లేని శ్రీ శ్రీ, క్రైస్తవ మత విశ్వాసాలను అర్దం చేసుకుని అందులోని ప్రేమ తత్వాన్ని ఓ పాటకు కుదించి, వ్యక్తిగత ప్రేమలోని అలౌకిక మార్ధవ్యాన్ని క్రైస్తవ ప్రేమ భావానికి సరి జోడుగా కలిపి అందించగలగడం ఆయన ప్రతిభకు తార్కాణం. అందుకే ఈ పాట వ్యక్తిగతంగా నాకు  చాలా ఇష్టం.

ఈ సినిమా మొత్తంలో శ్రీ శ్రీ రచించిన ఏకైక గీతం ఇది. ఆయనతో ఈ ఒక్క పాటను ఎందుకు రాయించుకున్నారో ఈ పాట వింటే అర్ధం అవుతుంది. ఇలాంటి సంక్లిష్ట సన్నివేశాలకి కూడా ఆసువుగా పాటలు రాయగల ప్రతిభ ఆయన సొంతం. ఇలాంటి కవిని ఒక వర్గానికో, కులానికో అంటగట్టి ఉంచేయాలని ప్రయత్నిస్తున్న ఆధునిక కవులు, వాదాల పేరుతో, వాదనల నడుమే ఉండిపోయి నిజమైన సౌభాతృత్వాన్ని అర్ధం చేసుకోలేక, మత సామరస్యాన్ని కాదని విద్వేషాల కోసం కలం చేపట్టి పని చేయడం, అదే ప్రగతిబాట అని కొందరు నమ్మడం చూస్తుంటే తెలుగు సాహితీ భవిష్యత్తు భయపెడుతుంది.

శ్రీ శ్రీ మహాకవి. ఈ విభేధాలన్నిటికీ అతీతుడు. నిజమైన మానవతావాది. దానికి నిదర్శనంగా ఈ పాటను ప్రస్తావించుకోవాలి. 


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *