అత్తరు పరిమళం లాంటి చరిత్ర… “యామం”

Spread the love

భారతదేశ సాహిత్యంలో నగరాల చరిత్రని చెప్పే రచనలు చాలానే ఉన్నాయి. అయితే నగరాన్ని కేవలం కథా నేపథ్యంగా కాకుండా, ఆ నగరాన్నే పాత్రగా మలిచి, దాని మూడు శతాబ్దాల చరిత్రను, ఆ వీధుల్లో ప్రవహించిన వేలాది జీవితాల జ్ఞాపకాలను, సంస్కృతుల కలయికను, వలసల గాథలను, ప్రేమలను, విషాదాలను ఒక మహాకావ్యాత్మక కథనంగా రూపుదిద్దిన రచనలు చాలా అరుదు. తమిళ రచయిత ఎస్. రామకృష్ణన్ “యామం” అలాంటి అరుదైన నవలల్లో ఒకటి.

“యామం” కేవలం చరిత్రను కథగా చెప్పే ప్రయత్నం కాదు. కాలాన్ని సాహిత్యంగా మలిచే ప్రయత్నం. మనిషి జీవితం చిన్నదే కావచ్చు, కానీ అతను నివసించిన నగరాలు, అతను నిర్మించిన సంస్కృతులు, అతను వదిలి వెళ్లిన జ్ఞాపకాలు ఎంత కాలం నిలిచి ఉంటాయో ఈ నవల గుర్తుచేస్తుంది.

ఇందులో ప్రధాన పాత్ర ఎవరంటే, ఠక్కున చెప్పటం కష్టమే. నవలలో అనేక పాత్రలు ఉన్నాయి. అనేక కుటుంబాలు ఉన్నాయి. అనేక తరాలు ఉన్నాయి. కానీ చివరికి వాటన్నింటినీ మించి నిలిచేది మద్రాసు నగరమే. నేటి చెన్నైగా పరిణమించిన ఆ నగరం ఈ నవలలో ఒక ప్రదేశం కాదు. ప్రాణమున్న మనిషిలాంటి పాత్రే. అది చూస్తుంది. గుర్తుంచుకుంటుంది. మరచిపోతుంది. మారుతుంది. పునర్నిర్మించుకుంటుంది.

నవల కరీమ్ కథతో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి రచయిత మనల్ని పది తరాల వెనక్కి తీసుకెళ్తాడు. సముద్రాలు దాటి వ్యాపారం చేసే మీర్ కాసీం ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. ఆ ప్రపంచంలో వ్యాపారం ఉంది. విశ్వాసం ఉంది. ఆధ్యాత్మిక అన్వేషణ ఉంది. కానీ ఇక్కడ ఆధ్యాత్మికతను సంప్రదాయ భక్తి దృక్పథంతో ఉండదు, మతమంటే కేవలం ఒక నమ్మకం మాత్రమే అన్నట్టు ఉండదు. ప్రశ్నించే దృష్టితో, కొత్త కోణంతో ఉంటుంది. అందుకే ఈ నవలలోని ఆధ్యాత్మిక చర్చలు ఉపదేశాలుగా కాకుండా ఆలోచనలుగా కనిపిస్తాయి.

నవల అంతా ఒక మనిషి లేదా ఒక పాత్ర చేసే ప్రయాణం కాదు. దాదాపు ఏడు జీవితాల కథలు ఇందులో కలిసిపోయి నడుస్తాయి. మామూలుగా చూస్తే ఒకదానికొకటి సంబంధం లేనట్టే అనిపిస్తాయి పాత్రలన్నీ. కానీ కథలన్నింటినీ కలిపేది ఒక నగరం, ఒక కాలం, ఒక పరిమళం. ఆ పరిమళం పేరే… యామం.

సాహిత్యంలో నగరాలను పాత్రలుగా మలిచిన సంప్రదాయం కొత్తది కాదు. కానీ యామంలో మద్రాసు నగరం ఒక ప్రతీకగా మాత్రమే నిలవదు. అది నవలలో జరిగే ప్రతి సంఘటనకు అంతర్భాగమవుతుంది. ఒక వ్యక్తి జననం, ఒక కుటుంబం ఎదుగుదల, ఒక ప్రేమ విఫలం కావడం, ఒక వ్యాపారం అభివృద్ధి చెందడం… ఇట్లా ఇవన్నీ నగర చరిత్రలోని చిన్న అలలుగా మారిపోతాయి.

యామం చదువుతున్నప్పుడు మొదటగా కనిపించేది రచయిత చేసిన అపార పరిశోధన. వలస పాలన ప్రారంభం నుండి ఆధునిక నగర నిర్మాణం వరకు విస్తరించిన చరిత్ర ఈ నవల వెనుక నిలిచి ఉంటుంది. కానీ ఆ పరిశోధన ఎక్కడా అనవసరమైన సమాచారం ఇస్తున్నట్టు అనిపించదు. చారిత్రక సమాచారం కథపై భారంగా పడదు. అది పాత్రల జీవితాల్లో కలిసిపోతుంది. ఎస్. రామకృష్ణన్ ఈ విషయంలో బాలెన్స్ తప్పనివ్వలేదు.

పూల నుండి సేకరించిన సువాసన నూనెలతో తయారయ్యే అత్తర్‌లలో యామం ఒకటి. నవలలో అది కేవలం ఒక వస్తువు కాదు. ఒక ప్రతీక. ఒక జ్ఞాపకం. ఒక అదృశ్య సాక్షి. తరాలు మారిపోతాయి. మనుషులు చనిపోతారు. నగరాలు మారిపోతాయి. కానీ యామం పరిమళం మాత్రం కాలం మీదుగా ప్రయాణిస్తూనే ఉంటుంది.

ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… కాలం. పాత్రలు వస్తాయి, వెళ్తాయి. తరాలు మారిపోతాయి. భవనాలు కూలిపోతాయి. కొత్త నిర్మాణాలు పుడతాయి. కానీ కాలం మాత్రం నడుస్తూనే ఉంటుంది. ఒక మహా నగరం నిర్మానాన్ని కళ్లకి కట్టినట్టు చూపిస్తుంది. అత్యంత ఆసక్తికరంగా ఉండే మరోవిషయం… మద్రాసపట్టణం పుట్టుకని కథలో భాగంగా రచయిత మలిచిన తీరు. ఒక ఆంగ్లేయుడి కథ ద్వారా బ్రిటిష్ వ్యాపారుల భారత ప్రవేశం, డచ్ ప్రభావం, మొఘల్ రాజకీయాలు, షాజహాన్ పాలన వంటి చారిత్రక అంశాలు నవలలోకి ప్రవేశిస్తాయి. ఇవి ఎక్కడా చరిత్ర పాఠంలా అనిపించవు. జీవిస్తున్న మనుషుల అనుభవాలుగా మన ముందుకొస్తాయి.

తెలుగు పాఠకులు యామం ఎందుకు చదవాలంటే…, చరిత్ర అనేది రాజుల గురించి మాత్రమే కాదు. సామాన్యుల జీవనవిధానం కూడా. మనకు ముందు నివసించిన ప్రతీ మనిషీ ఈ నాగరికతలో ఎంతోకొంత మార్పుని మోసినవాడే. అలాంటి మనం మరచిపోయిన మనుషుల కథలు కూడా. ఒక వీధి పేరు వెనుక, ఒక భవనం వెనుక, ఒక బజారు వెనుక, ఒక పరిమళం వెనుక కూడా చరిత్ర దాగి ఉంటుందని ఈ నవల చెబుతుంది.

మద్రాసపట్టణం ఈ నవలలో ఒక భౌగోళిక ప్రదేశం కాదు. అది ఒక సంగమం. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మనుషుల కలయిక. భాషల కలయిక. సంస్కృతుల కలయిక. ఆశల కలయిక. భద్రగిరి, తిరుచిత్రంబలం, కృష్ణప్ప కారయ్యార్, పండారం వంటి పాత్రలు ఈ సంగమానికి ప్రతినిధులు. భద్రగిరి ద్వారా భారతదేశాన్ని కొలవాలని ప్రయత్నించిన వలస ప్రపంచాన్ని చూస్తాం. భారతదేశపు తొలి మ్యాప్ నిర్మాణ ప్రయత్నాల వెనుక ఉన్న చరిత్రను చూస్తాం. కృష్ణప్ప కారయ్యార్ ద్వారా భూమి, వారసత్వం, వ్యవసాయం, టీ సాగు వంటి అంశాలు కథలోకి వస్తాయి. చైనా నుంచి భారతదేశానికి చేరుకున్న “టీ” చరిత్ర కూడా ఇందులో భాగమవుతుంది.
పండారం చేసిన త్యాగం, వైరాగ్యం, అనుబంధం లాంటి అంశాలు మనల్ని కట్టిపడేస్తాయి. ఒక కుక్క సంకల్పం మీద జీవితం సాగించే సన్యాసి పాత్ర నవలలో ఒక విభిన్న తాత్విక కోణాన్ని తీసుకువస్తుంది. మ్యాజిక్‌రియలిజం అంటే ఎలా ఉండాలో చెప్పినట్టు.. అది ఎలా రాయాలో చెప్పే ఒక పాఠం అనుకోవచ్చు. ఈ పాత్రలన్నీ చివరికి మద్రాసపట్టణం అనే మహానగర కథలో భాగమవుతాయి.

అన్నిటికంటే ముఖ్యంగా, యామం మనిషికీ, కాలానికీ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తుంది. మనం శాశ్వతమని భావించే జీవితాలు ఎంత తాత్కాలికమో, మనం మరచిపోయామని అనుకునే జ్ఞాపకాలు ఎంత లోతుగా భూమిలో, నగరాలలో, సంస్కృతులలో నిలిచి ఉంటాయో చూపిస్తుంది.

అందుకే యామం ఒక చదివి పక్కన పెట్టే పుస్తకం కాదు. అది ఒక నగర జీవిత చరిత్ర. ఒక సంస్కృతి రాసుకున్న ఆత్మకథ. ఒక కాలపు స్మృతి గ్రంథం. అన్నిటికంటే మించి, ఒక అద్భుతమైన సాహిత్య కావ్యం.

యామం చదవటం అయిపోయాక, కథ పూర్తవుతుంది. పాఠకుడి అంతరంగంలో ఆ నవల ఇచ్చే అనుభూతి మాత్రం చాలా కాలం మిగిలి ఉంటుంది. గొప్ప సాహిత్యం అందించే అనుభవం అదే. యామం ఆ అరుదైన అనుభవాన్ని అందించే నవల.

పుస్తకం: యామం
వెల: 375/-
తమిళ మూలం: ఎస్. రామకృష్ణన్
తెలుగు అనువాదం: జిల్లేళ్ళ బాలాజి
ప్రతులకు: www.balabooks.in, Amazon
పబ్లిషర్స్: బాలాబుక్స్

నరేష్కుమార్ సూఫీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *