మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె Part 1

Spread the love

~ ఔసులోళ్ళ రమేషు ~

చిన్నప్పటి సంది ఆడు మంచి ఖాస్ దోస్త్ ఉండే. ఓనాడు నేను బడికి పోతుంటే. ‘ఓ కేసు, జర మావోన్ని కూడ తోల్కపో’ అని ఈ రమేష్ గాన్ని నాకు జతేశింది ఆళ్ళమ్మ రాంబాయమ్మ. ఆమెకు ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డెలు. ముసలాయినె సచ్చిపోయినంక ఔసుల దుకాణం పెద్దకొడుకు మురళిమామ అందుకున్నడు. ఇగ మిగిలినోళ్ళంతా ఆ మనిషి చేశే పనిమీదనే బతుకుడు. అట్ల అందరికంటే చిన్నోడైన ఈ రమేసు నా జత వట్టిండు. నాకంటే మూడేండ్లు పెద్దోడే అయినా, అంతకు ముందు మా నాన నడిపే గుడిశెబల్లె ఒకటో తర్గతి దాక సదివినా. మా నాన ఆ బడి లేపేశినంక ఈడు మళ్ళ బడిదొంగ అయిండు. సదువుల మొద్దు అయ్యిన రమేష్గాన్ని అందరం మొద్దోడా అనే పిలుస్తుంటిమి. చెరో పల్క వట్టుకోని బడికి వోతుంటే. జేబులున్న బల్పం చిన్నగ కొరుక్కుంట బడికి అచ్చేటోడు.

ఏదైనా గట్టి పని చెయ్యాల్నటే ‘అరే ఔసులోళ్ళ రమేష్ గాడెక్కర్రా’ అని అడుగుతుండే మా సార్. రెండు అర్రలు ఉండే మా బడిల అయిదో తర్గతి దాక నడుస్తుండే. ఒక సార్ ఒక మేడం. ఇద్దరే ఉంటుండ్రి. మొత్తం కలిపి ఓ వందమందిదాంక నాన్ సింగరేని ఇండ్లల్లనుంచి పోరలం ఉంటుంటుటిమి. పెద్దం పేట, మంగలిపళ్ళె ఊళ్లల్ల బాయిపని చేశేటోళ్ళ పిల్లలైతే మమత బడికి, బాయిపని లేనోళ్ళైతే సర్కార్ బడికి పోవుడు రివాజన్నట్టు. అట్ల ఇద్దరం జతైనం. ఎప్పుడు నా పక్కపొంటే కూసునేటోడు. ఎప్పడికి ఆని శెవులకెల్లి శీము కార్తాంది అని ఎవ్వలు దగ్గరికి రానీయకుండ్రి. మురళిమామకు ఆ ముచ్చట తెల్సినా ఎన్నడు దావ ఖానకు తీస్కపోలేదని మా అమ్మదగ్గర ఊకె చెప్పుకుంట కూసునేది రాంబాయమ్మ. ‘ఆ.. గింతాంత ఊళ్ళే బంగారం పని అచ్చేదేంత, ఆ పిలగాడు సంపాదించేదెంత. ఏం బట్టుకపొమ్మంటవ్’ అనేది అమ్మ. అట్లనే రమేష్ గానికి మొత్తానికి ఒక శెవ్వు ఇనవడకుంట పోయింది.

అట్ల వానికి సరీగ ఇనవడక బల్లె పాఠాలు కూడా అర్థంకాకపోతుండే. సాయింత్రం అందర్నీ కూసోవెట్టి గుణింతాలు సదివిచ్చెటప్పుడు మా నోళ్ళదిక్కే సూశెటోడు. అయినా కూడా ‘క’ గుణితం చెప్పుమంటే ‘ద..కు దీర్ఘమిస్తే దా’ అని పలికి దెబ్బలవడేటోడు. అప్పుడు అర్థంగాలేదు ఆని బాధమాకు. అయినా బీర్కీస డెక్కన్లతోని గిన్నెలు చేసుడు, పాత గుడ్డపేగులతోని బొమ్మల్జేసుడు, పోశమ్మ కాడ గట్టే శిల్కల్ జేసుడు, ఆ వయసులనే… లెవనియ్యబాయి (11 ఏ మైన్) కాన్నుంచి తుమ్మ మొట్లు తెచ్చుడు ఇసోంటి పనులన్నీ మంచిగ చేశేటోడు.

మెల్లగ మెళ్ళగ ఎట్లనో మూడోతర్గతికి అచ్చినం. నాకు ఎక్కాలు అన్నా, లెక్కలు అన్నా ఉచ్చవడేది. చేతిరాతకూడా వంకరతొంకర అక్షరాలతోని ఎట్లనో ఉండేది. కానీ ఈ శెవుటు రమేష్ గాడు మాత్రం ఠక్కటక్క లెక్కల్ జేశేటోడు. చూచిరాత కాపీల వాని రాత సూషి ‘ఇక్కడ మంచిగనే రాస్తవ్, పరిక్షలప్పుడు ఏమైతది నీకు?’ అనేది మా రాజమణి టీచర్. ‘అబ్బ, ఈనిది బంగారి రాతరా’ అనేటోడు మా సోడాల నరేందర్ గాడు. (ఇప్పుడు వీడుకూడా లేడు) అప్పటికి మేం ముగ్గురమే దోస్తులం.

ఇగ పంద్రాగస్టుకో, చబ్బీస్ జనవరికో ఆటల పోటీలు నడుస్తే మాత్రం. అయిదోతర్గతిల పెద్దోళ్ళంతా ‘‘ఈడు మాదిక్కు అంటే.. ఈడు మాదిక్కు’’ అని గుంజుకపోయేటోళ్ళు. ఎవల దిక్కు కబడ్డి ఆటల రమేష్ గాడుంటడో ఆళ్ళు పక్క గెలుస్తరు. అట్ల అట్టకట్టుండి గట్టిగ దొర్కవట్టెటోడు, అంత దొబ్బుగ ఉన్నా చెంగున ఎగిరి దునికెటోడు. అట్లనే ఓనాడు పంద్రాగస్టుకు జెండెత్తే గద్దె కడుతున్నరు. దానికోసానికి ఓ పెద్ద ఇనుప పైపు పట్టుకచ్చిండ్లు సుతారి మేస్త్రులు. ఆటలపోటీలు నడుస్తుంటే మెల్లగ దాన్ని పట్టుకచ్చి అటురెండు ఇటు రెండు ఇటిక పెడ్డలు పెట్టి వాటిమీద ఆ ఇనుప బొంగు పెట్టిండ్లు. ఒకదిక్కు కబడ్డి ఆట లగాంచి నడుస్తున్నది. మొగ పోరగాళ్ళందరం ఆడుంటే. ఆడివిల్లలంతా కొక్కో ఆటకాడ, తాడాట కాడ ఉన్నరు. ఇంకో దిక్కు లోపటి రూములల్ల అయిదో తర్గతి అక్కలందరు చాక్ పీసులతోటి ముగ్గులేస్తున్నరు.

బడంత లొల్లిలొల్లి ఉన్నది. కబడ్డిల నాల్గోతర్గతి కామ సీనన్న గూతవట్టిండు. ‘‘బడ్డిక…. బడ్డిక‘‘ అనుకుంట అచ్చి ముట్టుడు గీత ముట్టిచ్చుకోని లోపటిదాక అచ్చి ఒక్కల్నన్న ముట్టిచ్చుకోని పోవాల్నని సూస్తున్నడు. అట్టకట్ట ఉన్న సీనన్నని పట్టాల్నటే అయిదో తర్గతి అన్నోళ్ళు కూడా బయపడుతుంట్రి. అందరు అట్లనే సూస్తుంటే, ఇటుపక్కనుంచి చెంగన ఎగిరి రొండుకాళ్ళు అందుకున్నడు రమేష్ గాడు. సీనన్నకు ఎటూ నెగులవశం గాలే. ‘బడ్డిక… బడ్డిక..’ అనుకుంటనే పిడాత కిందవడ్డడు. అప్పటిదాంక బీరిపోయి సూశేటోల్లంతా ఆళ్ళ మీద వడ్డరు. సీనన్న ముట్టుడు గీత అందుకుందామని కోశిశ్ వడ్డడు గని ఎటూ నెగులలేక గూత మర్శిండు. ‘‘ఔట్, ఔట్’’ అనుకుంట కీశ్పిట్ట ఊదుకుంట మద్యలకు ఉరికిండు మా సార్. అందర్ని ఇడిపిచ్చి “బీటీం వన్ పాయింట్” అని గట్టిగ ఒర్లిండు.

అట్ల మొత్తానికి అటూ ఇటూ ఆడంగ బీ టీమే గెల్శింది. పెద్దోళ్ళంత సప్పట్లు కొట్టుకుని అలాయ్బలాయ్ తీసుకుంటుంటే. దెబ్బతలిగిన రమేష్ గాడు మాత్రం కుంటుకుంట పక్కకచ్చిండు. మోకాలిపొంట ఇంతమందం తోలు కొట్టుకపోయి రక్తమచ్చింది. ఉమ్మితడి రాశేదానికని జెండ బొంగు పెట్టిన ఇటికెలమీద కూసున్నడు. ఈడు ముడ్డిమోపిండో లేదో ఆ బొంగు కిందికి డొల్లింది. అది కిందవడితే ఒడిశేపోతుండే కానీ అటుపక్కకు మా సార్ బిడ్డ జోతి నిల్సోని ఉన్నది. ఆమెగూడ మా తర్గతిల్నే సదువుతుండే. ఆ డొల్లిన పైపు ఆమె కాలుమీద పడ్డది.

శిన్నపిల్లాయే (మేమేదో పెద్ద మొగోళ్ళం అయినట్టు) దెబ్బతాకేటాల్లకు ‘డాడీ…’ అని ఏడ్సుకుంట ఆన్నే కూలవడ్డది. ఉరికచ్చిండు మాసార్. అచ్చుడచ్చుడే జోతి కాలు దిక్కు కూడా సూడకముందే రమేష్గాన్ని కొట్టిడు. అట్లిట్లగాదు మాదండి దెబ్బలు కొట్టిండు. ఆ దెబ్బలే నాకు పడిఉంటే ఆన్నే పిడాత సచ్చేటోన్ని. కతం ఆరోజు బల్లెకెల్లి ఉర్కినోడు మల్ల బడిమొకం సూల్లేదు రమేసు.. మెల్లమెల్లగ బొగ్గుదెచ్చి అమ్ముడు, ఇంపసామాన్ ఎత్తుకచ్చి అమ్ముడూ సురువుజేశిండు. ఆ తర్వాత ఆళ్ళన్నదగ్గర పని నేర్సుకోని గోదార్ఖని బంగారం షాపుల పనికి కుదిరిండు.

అట్లట్ల నేను అయిదో తర్గతి అయినంక, మా నాన్న వలంటీర్ గా పనిచేస్తున్న హైస్కూల్ల షరీఖ్ అయిన. రోజు అయిదారు కిలోమీటర్లదూరంలో ఉండే హైస్కూల్‌కి పోయొస్తూ పది, తర్వాత ఇంటరు… అట్ల మెల్లగ ఏదో ఒక పని చూస్కొని హైద్రవాద్ల వడ్డ. అప్పుడప్పుడూ ఊరికి పొయినప్పుడు కనిపిస్తుండే రమేషు. అప్పట్లనే రాంబయమ్మా, ఆమె రెండో కొడుకు ఎంకటేషం, ఆమె పెద్దబిడ్డ అరుణవ్వ వర్సగ ఏదో ఒక రోగం తోని సచ్చిపోయిండ్లని విన్న. ఆళ్ల పెద్దక్క సచ్చిపోతే ఆమె బిడ్దనే మేనకోడలి వర్సన వీనికిచ్చి పెండ్లిజేశిండ్లు. కానీ, అప్పటికే వీని తల్కాయల ఏదో రోగం మొదలైంది. పనికి పోవుడు, అచ్చినపైసలల్ల సగం తాగుడు. ఏమన్నా మిగిలితే ఆ పొల్ల చేతుల పెట్టుడు. శింగరేణికింద ఊరు లేశిపోతాంది అని మెల్లమెల్లగ ఒక్కొకలే ఊరు ఇడ్శిపెట్టి పోవుడు మొదలైంది. జనం తగ్గిండ్లు, పనులు తగ్గినయ్. సింగరేణిల బాయి పనోళ్ళు ఎల్లిపోయేటాల్లకు ఆళ్ళమీద బతికెటోళ్ళ్కు కల్జెయ్యి ఆడకుంత అయ్యింది అయినా ఎటు పోవాల్నో అర్థంగానోళ్ళు అట్లనే గోదార్ఖనిల ఏదో ఒక దంద చూస్కోని ఊళ్ళెనే ఉన్నరు.

అదట్లుండంగ ఓనాడు ‘ఈ శెవిటి పంత మొకపోనితోని ఉండ’. అనుకుంటా ఆ పిల్లకూడా దగ్గరి సుట్టం పొలగానితోని ఎళ్ళిపోయింది. ఆమె ఎక్కడికి పోయిందో తెల్వదు, అన్నదగ్గరికే వచ్చి ఉందామంటే అక్కడ జాగలేదు. తల్కాయల రోగం ముదురుతుంటే. ఏం చెయ్యాల్నో అర్థం కాక అట్లనే కూసునేటోడట…

అప్పటికే నాన, అమ్మ వరంగల్‌కి వచ్చేశిండ్లు. మా ఇంటెనుక ఉన్న గుడిశెల ఒక్కడే ఉండేటోడు. నేను ఊరికి పోయినప్పుడు తాగేదానికి మా ఇంట్లనే జమైతుంటిమి ఇద్దరు ముగ్గురు దోస్తులతోని. ఓనాడు అట్లనే అందరం గుద్దవల్గ తాగినం. ‘అరే పాపం రమేష్ గాన్ని పిలుద్దాం మావా’ అంటే ‘ఏ ఆడెందుకు, అంత పిసపిస చేస్తడు ఆడద్దు’ అన్నరు మావోళ్ళు. సరే అని ఓ 90 పక్కకు దాశిపెట్టి ఈళ్ళందరూ ఔటైనంక పోయి చిన్నగ పిలిచిన. అయినా సరే… ఆ చెవిటి మనిషికి ఎట్ల వినిపించిందోగానీ. ఉరికి వచ్చిండు. ఇద్దరం శీకట్లనే కూసున్నం. ఆ 90 మెల్లగ తాగుకుంటనే బాగా ఏడ్శిండు. ‘నన్ను ఐద్రవాదుకు తీస్కపోరాదు’ అనుకుంట కావలిచ్చుకోని ఏడ్శిండు. సరే పొద్దుగాల తీస్కపోత అని చెప్పిన. తెల్లారంగ లేశి హైద్రవాద్ అచ్చేశిన. వాన్ని పురాగ మర్శిపోయిన.

ఓ రెండేండ్లకు ఏదో పనిమీద చిన్నక్కకు ఫోన్ జేస్తే చెప్పింది. ఔసులోళ్ళ రమేసు సచ్చిపోయిండాట గాదుర. అనుకుంట.

‘ఎట్ల?’ అడిగిన.

‘ఆ పోరి వోయినంక మన గుడిశెలనే ఉండేగదా. పని శేతగాక, ఎవ్వలు దగ్గరకు తీయక ఎములాడ గుడికాడ అడుక్కుంట తిర్గిండాట. అక్కన్నే అడుక్కునుడు, ఏన్నోక్కడ పండుడు. ఓనాడు ఎములాడ బష్టాంద దగ్గర ఓ చాయోటల్ కాడ కిందవడి అట్లనే పానం పోయిందాట.’

ఒక్కసారి బచ్పన్ మొత్తం కండ్లముందు తిర్గింది. నా ఫస్ట్ దోస్తుగాడు, శెవిటోడు, రకరకాల బొమ్మలు చేసే కళాకారుడు. కబడ్డీ ఆటల మొనగాడు. బంగారి చేతిరాత గల్లోడు. పదిహేనేండ్లకే బంగారాన్ని మెలితిప్పే స్వర్ణకారుడు. మా రమేష్ గాడు అట్లా చాయ్ హొటల్ ముంగట శవమై పడి ఉన్న దృశ్యం కండ్లముంగట మెదిలి ఏడుపొచ్చింది.

ఇప్పటికీ ఎప్పుడన్న బాగ తాగిన రాత్రి. నన్ను హైద్రవాద్ తీస్కపోరాదు అని నన్ను కావలిచ్చుకొని ఏడ్శినట్టే అనిపిస్తది. ‘మా ఊరిని సింగరేణి మింగకపోతుంటే. మాకిట్లాంటి సావులు వచ్చిఉండేవా రాజేశా?’ అని అడిగినా ఆ ఎములాడ రాజన్న కూడా నోరెత్తడని నాకు తెల్సు.

:: మా బడి ఫొటో పంపించిన Ravi Boddupelli కి శనార్థులతో…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *