మాదమొయిసెల్లె ఫిఫి

Spread the love

ప్రష్యన్ కమాండెంట్, మేజర్ గ్రాఫ్ వాన్ ఫార్లేస్బెర్గ్, ఘనమైన తన పడక కుర్చీలో కూర్చుని వార్తా పత్రిక చదువుతున్నాడు. చదువుతూ అందమైన చలువరాతి నేలను పదేపదే బూట్లు వేసుకున్న కాలిమడమతో ఉత్సాహంగా కొడుతున్నాడు; ఒకే చోట అలా కొడుతుండడంతో అక్కడ రెండు గుంతలు కూడా ఏర్పడ్డాయి.యువెల్లి భవనంలో ఆయన ఉన్న మూడు నెలలూ అలా ప్రతిరోజూ బూట్ల మడమలతో ఆ గుంతలలో కొడుతుండడంతో గుంతల లోతు మరింత పెరిగింది. 

అతని ఎదురుగుండా చిన్న టేబుల్ మీద ఉన్న కప్పులో కాఫీ పొగలు కక్కుతోంది. ఆ టేబుల్ మీద సారా సీసాల మరకలు ఉన్నాయి; కాల్చి పడేసిన సిగరెట్లతో టేబుల్ అక్కడక్కడా కాలిపోయింది కూడా. విజయోత్సాహంతో గణాంకాలు నమోదు చేసుకునేందుకు,లేదా ఉబుసుపోక బొమ్మలు గీసుకునేందుకు వాడే పెన్సిల్ చెక్కడానికి ఉపయోగించే చిన్న కత్తితో పెట్టిన  గాట్లు  టేబుల్ పై అక్కడక్కడా  కనిపిస్తున్నాయి.  

బంట్రోతు తెచ్చి ఇచ్చిన ఉత్తరాలు,జర్మన్ వార్తా పత్రికలు చదివి పక్కన పడేసి లేచి నిలుచున్నాడు. పక్కనున్న నెగడు లో మరో మూడు నాలుగు ఆకుపచ్చ కొమ్మలను పడేసాడు మేజర్. వీళ్ళు తమని వెచ్చగా ఉంచుకోవడానికి పార్క్ లోని చెట్లు కొట్టేస్తున్నారు. ఆ తర్వాత లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. వాన కుంభవృష్టిగా కురుస్తున్నది;అది నార్మండీ లో సహజమే. ఆ వానను చూస్తే ఎవరో కోపంతో నీళ్లు పైనుంచి కుమ్మరిస్తున్నట్టుగా ఉంది; ఎంత దంచికొడుతున్నదంటే, ఎదురుగుండా ఉన్నవి కూడా కనిపించడం లేదు;ఏమాత్రం వెలుగు చొరబడిన వాలు కర్ణాల తెరగా తయారయింది; మొత్తం అంతటిని పూర్తిగా ముంచెత్తేస్తున్నది. ఇటువంటి వర్షం రౌఎన్ చుట్టుపక్కల ప్రాంతాలవాళ్ళకు అనుభవమే;ఇది ఫ్రాన్స్ నీటి కుండ. 

ఆ అధికారి కాసేవు నీటితో తడిసిన నేలను చూసాడు.ఆ తర్వాత దాని అవతల కట్టలదాటి పొంగి పొర్లుతున్న ‘అందెల్లో’ని చూసాడు. కిటికీ అద్దం పలక మీద,’వాల్జ్’ వాయిస్తున్నట్టు వేళ్ళతో దరువు వేస్తున్నాడు. అప్పుడు అతనికో శబ్దం  వినిపించి వెనక్కి తిరిగి చూసాడు.వచ్చింది తన కింద పనిచేసే అధికారి, కెప్టెన్ బారన్ వాన్ కెల్విన్ స్టెయిన్. 

మేజర్ మహాకాయుడు. విశాలమైన వక్షస్థలం, విసనకర్ర లాంటి గడ్డం; ఆ గడ్డం పొడుగ్గా అతని ఛాతి అంతా ఒక తెరలాగా  పరుచుకుని ఉంటుంది. అతనిని చూస్తే ఒక మిలిటరీ నెమలి అనిపిస్తాడు; నెమలి రొమ్ము భాగం నుండి విరుచుకు వచ్చిన  ఈకలలాగా ఉంటుంది అతని గడ్డం. అతని కళ్ళు లేత నీలిరంగులో, నిర్దయగా ఉంటాయి; మొఖం మీద ఆస్ట్రియా యుద్ధంలో కత్తి తగిలిన గాయం మచ్చ ఉంటుంది.అతనికి గౌరవనీయుడని, ధైర్యవంతుడని పేరుంది. 

కెప్టెన్ పొట్టిగా ఎర్రగా ఉంటాడు;నడుము దగ్గర బెల్ట్ ని గట్టిగా కట్టుకుంటాడు; అతని ఎర్రని జుట్టు పలచగా, దాదాపు తలపై చర్మానికి అంటుకుని ఉంటుంది.ఆ తలను కొన్ని లైట్ల వెలుగులో చూస్తే, ఒక్కొక్కసారి ఏకంగా భాస్వరం తలకి రుద్దినట్టు అనిపిస్తుంది. అతను ఒకే రోజు రాత్రి రెండు ముందు పళ్ళు  పోగొట్టుకున్నాడు. అయితే ఎలా అన్నది అతనికి  సరిగ్గా గుర్తులేదు. ఆ పళ్ళు లేకపోవడం వలన అతను మాట్లాడేది కొన్నిసార్లు సరిగ్గా అర్థం కాదు. అతని బోడి గుండు చుట్టూ, ఉంగరాలు తిరిగిన బంగారు రంగు వెంట్రుకల వరుసలు ఉంటాయి.  దాని వలన అతనో సన్యాసిలాగా కనిపిస్తాడు. 

కమాండెంట్ అతనితో కరచాలనం చేసి, కలిసి కాఫీ తాగాడు (ఆరోజుకి అది ఆరవ కప్పు).కాఫీ తాగుతూనే తన కింది అధికారి, జరిగిన విషయాలకు సంబంధించి ఇస్తున్న నివేదికను వింటున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కిటికీ దగ్గరకు వెళ్లి పరిస్థితి ఏమంత ఉల్లాసంగా లేదని ప్రకటించారు.మేజర్ కి ఇంటి దగ్గర భార్య ఉంది.ప్రశాంతత ని కోరుకునే మనిషి;చాలా విషయాల్లో రాజీపడగలడు. కానీ కెప్టెన్ అలా కాదు. అతనిది వేగవంతంగా సాగే జీవితం; చవకబారు సత్రాలలో ఉండే అలవాటు; మహిళల సంపర్కం ఆస్వాదించగలడు.గత మూడు నెలలుగా ఈ బందిఖానాలో చిక్కుకుపోయాడు. 

గది బయట నుంచి ఎవరో తలుపు కొట్టిన చప్పుడు. కమాండెంట్ లోపలి రమ్మని పిలవగానే,జవానులలో ఒకడు వచ్చాడు;అతనొచ్చాడంటేనే ఉదయం తీసుకునే అల్పాహారం సిద్ధమైందని అర్థం. భోజనాల గదిలో వాళ్ళకి మరో ముగ్గురు,తమకంటే తక్కువ హోదా గల వాళ్ళు-లెఫ్టనెంట్,ఒట్టోవాన్ గోస్లింగ్ ,ఇద్దరు సబ్ లెఫ్టినెంట్ , ఫ్రిడ్జ్ స్చెం బర్గ్ ,చాలా పొట్టిగా ఉండే  బారన్ వాన్ ఎరిక్, తారసపడ్డారు. ఎరిక్ కి మనుషులను పశువుల్లా చూస్తాడని, ఖైదీలతో కఠినంగా వ్యవహరిస్తాడని,మందుగుండు లాగా పేలుతుంటాడని పేరు. 

అతను ఫ్రాన్స్ లో ఉన్ననాటి నుండి అతనిని తోటివారందరూ మాదమొయిసెల్లె ఫిఫి అనే పిలిచేవారు. అతనికాపేరు పెట్టడానికి కారణం అతను ఒంటికి అతుక్కుపోయే దుస్తులు వేసుకోవడం, చిన్న మణికట్టు కలిగి ఉండటం. అతని ముఖం కూడా పాలిపోయి ఉంటుంది;పెదవిపై ఉండే నూనూగు మీసాలు ఇంకా స్పష్టంగా కనిపించడం లేదు. అతనికి ఫ్రెంచ్ ఊతపదం ఫిఫీ బాగా అలవాటు.ఎవరిపైనైనా,దేనిగురించయినా తన విముఖత వ్యక్త పరిచేటప్పుడు ‘ఫిఫీ డాక్’ అంటాడు. అలా అన్నప్పుడల్లా చిన్న ఈల వేసిన శబ్దం వస్తుంటుంది. 

ఆ భవనంలో భోజనాల గది ఎంతో అందంగా ఉండే పొడవైన గది;అందులో ఉన్న గొప్ప పాతకాలపు అద్దాలన్నిటికి బుల్లెట్లు దెబ్బలు  తగిలి పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ గదిలోని కళాఖండాలన్నీ కత్తుల దెబ్బలకు చీలికలు పేలికలైపోయాయి. వాటిని చూస్తేనే  మాదమొయిసెల్లె ఫిఫి తీరిక వేళల్లో ఏం చేస్తుంటాడో యిట్టె అర్ధం అవుతుంది. 

ఆ గదిలోని గోడకు స్టీల్ చట్రం కట్టు ఉన్న మూడు కుటుంబ చిత్రాలు వెళ్లాడు తున్నాయి-ఒక యోధుడు,ఒక మత గురువు,ఒక న్యాయమూర్తి. వాళ్లంతా పొడవాటి పోర్సిలీన్ పైప్ లలో పొగపీలుస్తుంటారు. అవి చిత్రంలో వేసినవి కావు. వాటిని ఆ చిత్రంలో కన్నాలు పెట్టి దూర్చారు. అందులో సన్నని నడుమున్న ఒక మహిళ మూతిమీద బొగ్గుతో ఒత్తయిన మీసం వేసి ఉంటుంది. ఆ వికృతంగా తయారుచేయబడిన గదిలో అధికారులు మౌనంగా ఫలహారాలు చేస్తున్నారు;ఎడతెరిపి లేకుండా పడుతున్న వానతో వాతావరణం మరింత నిరుత్సాహంగా ఉంది; వ్యాకులత మరింత పెంచేదిగా కనిపిస్తున్నది. ఆ గదిలోని నేలపై పరిచిన ఓక్ చెక్క మాత్రం చాలా దృఢ పడింది. అది మరే ఇతర విడిది గదులలో వేసే రాతి నేలలతో సరిసమానంగా, కఠినంగా ఉంది. 

వాళ్ళు ఫలహారాలు తినడం ముగించగానే, నిరుత్సాహం నుంచి బయటపడటానికి ఎప్పటిలాగా  పొగ పీల్చారు;సారాయి తాగారు. బ్రాందీ,సారాయి సీసాలు చేతులు మారుతున్నాయి. అందరూ కుర్చీలకు అనుకుని కూర్చుని నింపాదిగా గ్లాసులు గుటకలు గుటకలుగా తాగుతూ ఖాళీ చేస్తున్నారు. చాలాసేపటి వరకు ఆ గ్లాసులను నోటి నుంచి దూరంగా జరిపింది లేదు. ఆ చైనా గ్లాసుల చివర్ల ఉన్న పొడవాటి వంపు తిరిగిన కొనలు ఈ అనాగరికులకు ఆనందాన్నిఇస్తున్నాయి. 

వాళ్లు  గ్లాసులు ఖాళీ అవగానే మళ్ళీ నింపుకుంటున్నారు;కేవలం చికాకును వదిలించుకోడానికే. అయితే మాదమొయిసెల్లె ఫిఫి గ్లాసు ఖాళీ చేయడం ఆలస్యం,ఒక సైనికుడు వచ్చి మరో గ్లాస్ అందిస్తున్నాడు. వాళ్ళ చుట్టూ పొగాకు పొగ అలుముకుంది. అందరూ  మత్తులో మునిగి ఉన్నారు;పిచ్చ మత్తు;పనీ పాట లేని మగవాళ్ళు మునిగితేలే మత్తు. అప్పడే ఉన్నట్టుండి దొరబాబు లేచి “దేముడా! ఇలా ఉండటం ఇక  నావల్ల కాదు. మనం ఏం చేయాలో ఆలోచించాలి.” ఆ మాట వినగానే లెఫ్టనెంట్,ఒట్టో వాన్ గ్రోస్లింగ్,సబ్ లెఫ్టనెంట్లు,ఫ్రిట్జ్,”ఏమన్నారు కెప్టెన్?” అన్నారు గంభీరంగా. 

అతను కాసేపు ఆలోచించి,”ఏమిటి? ఎందుకు?” “మనకి కొంచెం ఉల్లాసం కలిగించేది కావాలి. కమాండెంట్ అనుమతిస్తే” అన్నారు. “ఏ రకమైన ఉల్లాసం కలిగించేది కావాలి కెప్టెన్? అని నోట్లోని పైప్ బయటకు తీస్తూ మేజర్ అడిగాడు. “నేను మీకు ఏర్పాటు చేయగలను”అన్నాడు దొరగారు. “నేను, లే దేవోయిర్ ని రౌఎన్ కి పంపించి, అందమైన అమ్మాయిలను తెప్పించగలను. వాళ్ళు ఎక్కడ దొరుకుతారో నాకు తెలుసు. అన్ని వస్తువులు ఇక్కడే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడే రాత్రి మనం ఉల్లాసంగా  భోజనాలు చేయవచ్చు.” 

గ్రాఫ్ వాన్ ఫార్ల్స్ బెర్గ్ నవ్వుతూ,”నీకు నిజంగా పిచ్చెక్కి నట్టు ఉంది” అన్నాడు. 

కానీ, మిగిలిన అధికారులందరూ ఉన్నతాధికారి చుట్టూ చేరి “దయచేసి ఇలా కానిచ్చేయండి,మాకు విపరీతంగా విసుగుపుడుతోంది” అన్నారు. మేజర్ ఆఖరికి గట్టిగా ‘సరే” అని ఆ ప్రస్తావన అంతటితో ముగించాడు. వెంటనే దొరగారు లే దేవోయిర్ కోసం మనిషిని పంపించాడు. అతను ఒక పాత నాన్ కమిషన్డ్ అధికారి. అతనిని నవ్వుతూ ఎవరూ ఏనాడూ చూసి ఉండరు. కానీ అధికారులు ఇచ్చిన ఏ ఆదేశాలనైనా  ఎట్టి పరిస్థితుల్లో నైనా తూ చా తప్పకుండా అమలు చేయగల దిట్ట. ప్రభువుల ఆదేశాలు వినగానే తప్పనిసరిగా అమలు చేయగలనన్న సూచనతో అక్కడి నుంచి కదిలాడు. ఆ తర్వాత అయిదు నిమిషాలకు టార్పాలిన్ కప్పిన ఒక పెద్ద మిలిటరీ వాగన్  బయలుదేరింది-వాన జోరుగా పడుతుండడం వలన అంత బరువును తొందరగా లాగడానికి నాలుగు గుర్రాలు పూన్చిన గుర్రపు బగ్గీ అది. అధికారులందరికీ ఒక్కసారిగా బద్దకం వదిలింది. వారి చూపులలో వెలుగులు నిండాయి. అంతా కులాసాగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. 

అదివరకు పడుతున్నట్టే వాన ఏడతెరిపి లేకుండా జోరున కురుస్తున్నా, మేజర్ వాతావరణం మరీ అంత చీకటిగా లేదని ప్రకటించాడు. లెఫ్టినెంట్ వాన్ గ్రో సింగ్ ఆకాశంలో మబ్బులు వీడుతున్నాయని నమ్మకంగా చెప్పాడు. మాదమొయిసెల్లె  ఫిఫి తనకేం సంబంధం లేనట్టు ఉ0డదలుచుకోలేదు.లేచి మళ్ళీ కూర్చున్నాడు. మెరుస్తున్న అతని కళ్ళు దేనినైనా ధ్వంసం చేయడానికి చుట్టూ వెతుకుతున్నాయి. ఉన్నట్టుండి అతనికి ఎదురుగా చిత్రంలో మహిళకి ఉన్న మీసాలు కనిపించాయి.”మీరు మళ్ళీ వాటిని చూడరు”అన్నాడు. తాను కూర్చున్న చోటి నుంచి కదలకుండానే గురిచూసి రెండు బులెట్లతో చిత్రంలో ఉన్న రెండు కళ్ళు కాల్చేశాడు. 

“ఇప్పుడిక గని తవ్వుకుందాం!” అన్నాడు. సంభాషణ దారిమళ్లింది. ఒక కొత్త ఆసక్తికరమైన విషయం మాట్లాడుకోవడానికి దొరికినట్టు అనిపించింది. ‘గని’ అన్న మాట అతను సృష్టించినదే. అతను ధ్వంసం చేయడానికి వాడే పదం. అతనికి వినోదాన్ని ఇచ్చే పదం. 

ఆ బంగాళా ఖాళీ చేస్తున్నప్పుడు దాని అసలైన  యజమాని కామ్టే ఫెర్నాండో డి ఏమోయ్ యూవీకిల్లె కి తనతో పాటు ఏవస్తువూ  తీసుకెళ్లే సమయం లేకపోయింది. ఒక ప్లేట్ తప్ప మరేదీ దాచుకో లేకపోయాడు. ఆ ప్లేట్ ని మాత్రం ఒక గోడకు కన్నం చేసి అందులో దాచుకో గలిగాడు. అతను బాగా సంపన్నుడు అవడం వలన, మంచి అభిరుచి కలిగి ఉండడం వలన భోజనాలు చేసే గదికి ఆనుకొని పెద్ద డ్రాయింగ్ గది కట్టించుకున్నాడు;అతగాడు పారిపోక ముందు ఆ గది ఒక మ్యూజియం ని తలపించేది.  

ఖరీదయిన ఆయిల్ చిత్రాలు,వాటర్ కలర్ చిత్రాలు,మంచి డ్రాయింగ్ లు గోడలకు అలంకరించి ఉండేవి. టేబుళ్ల మీద,అందమైన అద్దం  బీరువాలలో,వేలాడుతున్న షెల్ఫ్ లలో వేలాది అలంకరణలు చిన్న పూల కుండీలు, శిల్పాలు, డ్రెస్ డైన్ లో రూపొందించబడిన అద్భుతమైన కళాఖండాలు, క్రూరమైన చైనా మనుషులు, పాతకాలం నాటి కొమ్ముతో,వెనీషియన్ గాజుతో తయారు చేసిన అందమైన బొమ్మలు అంత పెద్ద గది నిండా అలంకరించి ఉండేవి. అవన్నీచాలా ఖరీదైనవి, అద్భుతమైనవి. 

ఇప్పుడు వాటిలో ఏవీ మిగలలేదు. అంటే అవి దొంగలించబడ్డాయని కాదు. మేజర్ అందుకు అనుమతించేవాడే కాదు. కానీ  మాదమొయిసెల్లె ఫిఫి కి అప్పుడుడప్పుడూ ‘తవ్వుకోవాలనే’ ఉబలాటం కలుగుతుంది. అప్పుడిక అధికారులందరూ ఒక అయిదు నిముషాలపాటు పండగ చేసుకుంటారు. చిన్న అధికారి డ్రాయింగ్ గది లోపలికి వెళ్లి తనకు కావలిసినవి తెచ్చుకుంటాడు. అతను వెళ్లి చిన్న నాజూకైన చైనా తేనీటి గిన్నెను తెచ్చుకున్నాడు. దాని నిండా తుపాకీ గుండు మందును నింపాడు. ఆ తర్వాత జాగ్రత్తగా ఎందుకూ పనికిరాని ఒక చెక్క ముక్కని దాని ముక్కులో దూర్చాడు. ఆ ముక్కకి నిప్పు అంటించి తన పైశాచిక యంత్రాన్ని తీసుకుని పక్క గదిలోకి వెళ్ళాడు. జర్మన్ లంతా పిల్ల చేష్టలతో నవ్వుతూ ఆసక్తిగా జరగబోయే ఘటన కోసం ఎదురుచూస్తున్నారు.కాసేపటికి భవనాన్ని కుదిపిన పెద్ద శబ్దం రాగానే అందరూ లోపలికి వచ్చారు.

మొట్టమొదట వచ్చిన మాదమొయిసెల్లె ఫిఫి సంతోషంగా చప్పట్లు కొట్టాడు. అక్కడున్న టెర్రకోట వీనస్ విగ్రహం ధ్వంసం అయింది. తల తునాతునకలయింది. ప్రతి ఒక్కరూ విరిగిన ఆకారం ముక్కలను పట్టుకుని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. మేజర్ గదంతటిని ఒకసారి పరీక్షగా చూసాడు. అంతా నీరో చేసిన విధ్వంసం లాగే ఉంది. కళాఖండాల ముక్కలన్నీ గదంతా వెదజల్లబడ్డాయి. అతను బయటకు వెళ్లి నవ్వుతూ :”ఈ సారి ఘన విజయం సాధించాము”అన్నాడు. 

కానీ భోజనాల గదంతా పొగతో నిండిపోయింది.దానికి పొగాకు వాసన తోడయింది. ఎవరూ ఊపిరి పీల్చుకో లేక పోయారు. అందువలన కమాండెంట్ కిటికీ తలుపులు తెరిచాడు.తమ చివరి కాగ్నాక్  గ్లాస్ తాగడం ముగించిన అధికారులందరూ  కిటికీ దగ్గరకు చేరారు. 

బయటనున్న తేమ గాలి లోపలికి వచ్చింది. దానితో పాటుగా ఒక విధమైన చూర్ణాన్ని అక్కడున్న అధికారుల గడ్డాలపై  స్ప్రే చేసింది. వాళ్ళంతా వాన నీళ్లు కారుతున్న ఆకుల వైపు చూస్తున్నారు. లోయంతా పొగ మంచు కురుస్తున్నది. దూరంగా  ఉన్న చర్చి శిఖరం పై కూడా. అది వానని అడ్డుకునేందుకు ఎదిగిన ఒక ‘గ్రె పాయింట్’ లాగా ఉంది. 

వాళ్ళు వచ్చిన దగ్గర నుండి చర్చి గంటలు మోగింది లేదు. ఆ ప్రాంతమంతటిలో  దాడి చేసిన వారు ఎదుర్కొన్న ఏకైక నిరాశ అదొక్కటే. ఆ మత గురువు ప్రష్యన్ సైనికులను గుడిలోపలకి అనుమతించడానికి గాని, వారికి  భోజనాలు పెట్టడానికి గాని నిరాకరించలేదు. శత్రు సైనికులతో పాటు అప్పుడప్పుడు ఒక గ్లాస్ బీర్, లేదా క్లారెట్ కూడా తాగాడు.శత్రువులు అతనిని తమ ఉదారమైన మధ్యవర్తిగా కూడా ఉపయోగించుకున్నారు. కానీ చర్చి గంటలు మాత్రం కొట్టడానికి అతను ఒప్పుకోలేదు. అంతకన్నా కాల్చేస్తే చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. దాడి చేసిన వారికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి  అతను అనుసరించిన పంధా అది. శాంతియుతమైన ,నిశ్శబ్ద నిరసన; ఒక మత గురువుకు, సాధు స్వభావం గల వ్యక్తికి, రక్తపాతం ఎరుగని వాడికి నప్పే పంధా అది. చుట్టుపక్కల 25 మైళ్ళు లో  ఉన్న వాళ్లంతా ఆబ్బె చంటావోయినే నిరసనను మెచ్చుకున్నారు. చర్చి గంటలు మోగించకుండా నిశ్శబ్దం ద్వారా ప్రజల  దుఃఖాన్ని ప్రకటించడానికి పూనుకోవడాన్ని ఆ ప్రాంత ప్రజలంతా హర్షించారు.

గ్రామం అంతా అతని నిరసన వ్యక్తీకరణని ఆసక్తితో గమనించారు. పాస్టర్ కి వెన్నుదన్నుగా నిలవడానికి సిద్దపడ్డారు. ఈ నిశ్శబ్ద నిరసన తమ దేశ గౌరవాన్ని కాపాడేదిగా భావించారు . బెలీఫోర్డ్, స్ట్రన్స్ బర్గ్ ల కన్నా తమ గ్రామ రైతులు దేశ  శ్రేయస్సు ఎక్కువగా కోరుకుంటున్నట్టు  భావించారు. తమకు సరిసమాన గౌరవం దక్కాలనుకున్నారు. తాము వారితో సరిసమానమైన విలువగల ఉదాహరణగా నిలిచామనుకున్నారు.తమ గ్రామం పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని భావించారు. అయితే  అంతమాత్రం చేత వారు ప్రష్యన్ విజేతలకు ఏ లోటు చేయలేదు.

కమాండర్, అతనితోటి అధికారులు, ఇటువంటి తమకు  ఏమాత్రం హాని చేయని వారి  ధైర్యాన్ని చూసి, తమలో తాము నవ్వుకున్నారు. దేశంలో ప్రజలందరూ తమకు అనుకూలంగా ఉంటూ,ఉపకారాలు చేస్తుండడం వల్ల వారి ఈ నిశ్శబ్ద దేశభక్తిని సంతోషంగా సహించారు . లిటిల్ బారన్ విల్హేల్మ్ ఒక్కడు మాత్రం వాళ్ళని కష్టపెట్టడానికి ఇష్టపడ్డాడు. తన పై అధికారులు మర్యాదగా వ్యవహరించడం అతనికి బాగా కోపం తెప్పించింది. ప్రతిరోజూ తన కమాండెంట్ ని ఒక్క సారైనా ఆ గంటలు డింగ్ డాంగ్ అని మోగించడానికి అనుమతి కోరుతుండేవాడు. కనీసం హాస్యానికైనా అనుమతించమని కోరేవాడు. ఎంతో  ప్రేమించే ఒక మహిళ బుజ్జగిస్తూ,తన కోరిక తీర్చమని అడిగేంత మృదువైన స్వరంతో అడిగేవాడు;కానీ కమాండెంట్ ఒప్పుకోలేదు. అతనిని ఓదార్చడానికి  మాదమొయిసెల్లె ఫిఫి బంగళాలో కాల్పులు జరిపాడు. 

అయిదుగురు అధికారులు కలిసి అక్కడ అయిదు నిమిషాలు నిలుచున్నారు. తేమ గాలిని పీల్చుకున్నారు. ఆఖరికి లెఫ్టనెంట్ ఫ్రిడ్జ్ నవ్వుతు,”ఆడవాళ్లు కార్లు నడుపుకుంటూ వెళ్లడానికి అనువైన వాతావరణం కాదు” అన్నాడు. ఆ తర్వాత వాళ్ళంతా ఎవరికి వారు విడిపోయారు. ఎవరి డ్యూటీ కి వాళ్ళు వెళ్లిపోయారు. కెప్టెన్ రాత్రి భోజనాలు సిద్ధం చేయడంలో బిజీ గా ఉన్నాడు. 

సాయంత్రం తిరిగి శుభ్రంగా, తాము నిర్వహించిన పనులు సంపూర్ణంగా సమీక్షించుకునే రోజు తయానట్టురైనట్టు తయారై వచ్చి, సంతోషంగా పలకరించుకున్నారు. కమాండెంట్ జుట్టు పొద్దున్న ఉన్నంత తెల్లగా  లేదు ఇప్పుడు. అతను క్షవరం చేయించుకున్నాడు. కేవలం మీసం మాత్రమే యధాతధంగా ఉంది;అందువలన ముక్కు కింద ఒక నిప్పు చార ఉన్నట్టు అనిపిస్తుంది.

వాన ఇంకా పడుతున్నప్పటికీ వాళ్ళు కిటికీ తలుపులు తెరిచి ఉంచారు. అందులో ఒకడు, గడియ గడియ కి కిటికీ దగ్గరికి వెళ్లి ఏమైనా శబ్దాలు వినిపిస్తాయేమో అని ఓ చెవి ఒగ్గి వింటూనే ఉన్నాడు. ఆరుంపావు కి దూరంగా పెళపెళ మని శబ్దం వచ్చింది. అందరూ గబగబా కిందికి వెళ్లారు. నాలుగు గుర్రాలతో, బండి చక్రాలన్నీ బురద చిమ్ముతూ, ఒక వాగన్ దూసుకుని వచ్చి ఆగింది. ఒక మహిళా, అయిదుగురు అమ్మాయిలు దిగారు. కెప్టెన్ స్నేహితుడు పరిచయం చేసిన లే దేవోయిర్ ఎంతో శ్రద్ధ తీసుకుని వారిని ఎంపిక చేసి పంపారు. 

వాళ్ళని పెద్దగా ఒత్తిడి  చేయాల్సిన అవసరం రాలేదు. గత మూడు నెలలుగా వాళ్ళు ప్రష్యన్ సేనల వ్యవహారాలను చూస్తూనే ఉన్నారు. వాళ్లతో కలిసి ఉన్నారు. సిబ్బంది వ్యవహారాలు తెలిసిన వాళ్ళు మగవారికి అనువుగా మసలుకోవడం మొదలుపెట్టారు.

రాగానే వాళ్ళు భోజనాల గదిలోకి వెళ్లారు. చిందరవందరగా ఉన్న ఆ గది లైట్ల వెలుగులో మరింత చిరాకుగా అనిపించింది. టేబుల్ మీద నచ్చిన వంటకాలు ఉన్నప్పటికీ,అందమైన  చైనా గిన్నెలు ప్లేట్లు ఉన్నప్పటికీ, యజమాని బొక్కలో దాచిన పళ్లెం కనిపించింది;అదో దొంగల సత్రం అనిపించింది. వాళ్లంతా దోపిడీలు చేసిన తర్వాత భోజనాలకు కూచున్నట్టు అనిపించింది. కెప్టెన్ మొహం సంతోషంతో వెలిగిపోతున్నది  ఎంతో  తెలిసిన వాళ్ళ భుజాలపై చేతులు వేసినట్టు  తన రెండు చేతులను ఇద్దరు అమ్మాయిల భుజాలపై వేసాడు; మిగిలిన ముగ్గురు అమ్మాయిలను మిగిలిన ముగ్గురు అధికారులు కోరుకోగా,  అధికారంతో గట్టిగా వద్దని వారించాడు. వారి వారి ర్యాంకులకు అనుగుణంగా అమ్మాయిలను న్యాయబద్ధంగా కేటాయించాడు. తద్వారా పై ర్యాంకులున్న వారికి న్యాయం చేశాడు. అందువలన అనుమానాలు అపోహలు లేకుండా, చర్చలు, అసమ్మతులు లేకుండా, అసహ్యకరమైన దూషణలు లేకుండా చూసుకున్నాడు. అమ్మాయిలందరినీ వాళ్ళ ఎత్తుకి అనుగుణంగా వరుసగా నిలబెట్టాడు. అందరికన్నా పొడుగైన అమ్మాయిని ఉద్దేశించి,”నీ పేరు ఏమిటి?” పమేలా అనింది ఆ అమ్మాయి, కాస్త గొంతు పెంచి. ఆ తరువాత అతడు, ఒకటో నెంబర్  పమేలా ని కమాండెంట్ కి కేటాయించాను. ఆ తర్వాత రెండో అమ్మాయి బ్లాన్డీనా ని  యజమాని హోదాలో ముద్దు పెట్టుకుని, బొద్దుగా ఉన్న ఆమడ ని లెఫ్టనెంట్ ఒట్టో కి కేటాయించాడు; టమాటో లాంటి ఎవా ను సబ్ లెఫ్టినెంట్ ఫ్రిడ్జ్ కి అందరికన్నా పొట్టిగా, నల్లగా,సిరా రంగు నల్లని కళ్ళు,చదునైన ముక్కు, అందరికన్నా వయసులో కూడా చిన్నది,జ్యు మతస్థురాలు అయిన రాచెల్ ని అందరికన్నా చిన్న అధికారి, సన్నగా ఉన్న కౌంట్ విల్హేల్మ్ డి ఎరిక్ కి కేటాయించాడు. 

అమ్మాయిలందరూ అందంగా ఉన్నారు. చక్కని శరీర సౌష్టవం కలిగి ఉన్నారు. ఎవరికీ  ప్రత్యేకమైన రూపురేఖలు లేవు. అందరి శరీర ఆకృతి,రంగు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.

ముగ్గురు యువకులూ వాళ్లకి కేటాయించిన బహుమతులను వెంటనే ఎత్తుకుపోవాలనుకున్నారు- వాళ్ళు నిత్యావసరాలు తీర్చుకుంటారేమో అన్న నెపం పెట్టి. కానీ కెప్టెన్ అందుకు అంగీకరించక, వాళ్ళందరూ ఇక్కడే కలిసి భోజనాలు చేస్తారని చెప్పాడు. అతని మాటే చెల్లింది. అందువల్ల కేవలం ముద్దులతో, పెట్టుకోబోయే ముద్దులను తలుచుకుంటూ గడపవలసి వచ్చింది. 

ఉన్నట్టుండి రాచెల్ గొంతులో ఏదో అడ్డుపడింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగే వరకు దగ్గింది. ముక్కులో నుంచి పొగ బయటకు వచ్చింది. ఆమెను ముద్దు పెట్టుకునే నెపంతో కెప్టెన్ ఆమె నోట్లోకి పొగ ఊదాడు. ఆమె కోపగించుకోలేదు. ఒక్క మాట కూడా అనలేదు. కానీ తనను వేధించిన వాడి వైపు తన నల్లని కళ్ళలో అసహ్యాన్ని నింపుకుని చూసింది. 

అందరూ భోజనానికి కూచున్నారు. కమాండెంట్ కి చాలా సంతోషంగా ఉంది. అతను పమేలా ని కుడి వైపు బ్లాన్డీ ని ఎడమ వైపు కూచో పెట్టుకున్నాడు. నాప్కిన్ మడత విప్పుతూ,”కెప్టెన్ నీ ఆలోచన సంతోషకరంగా ఉంది” అన్నాడు.

లెఫ్టనెంట్ ఒట్టో,ఫ్రిడ్జ్ సొగసైన మహిళలతో మాట్లాడుతున్నంత వినయంగా ఉన్నారు;వారు అతిధులను ఏమాత్రం బెదరగొట్టలేదు;కానీ బారన్ వాన్ కెల్ వెయిన్ స్టెయిన్ సంతోషంతో ఉప్పొంగిపోయి అస్లీల వ్యాఖ్యలు చేసాడు. తన ఎర్రటి జుట్టు తో వేడెక్కి నట్టు ఉన్నాడు. ఆ మహిళపై తన రెండు విరిగిన పళ్ళ మధ్య నుండి  రైన్ యాస ఫ్రెంచ్ భాషలో పొగడ్తల వర్షం కురిపించాడు. నిజానికి ఆ భాష జుగుప్స కరమైనది. 

వారికి ఆ మాటల అర్థం తెలియలేదు. అయితే, వారికున్న విజ్ఞత అతను మాట్లాడే చెత్త  పదజాలం పట్ల, భావ వ్యక్తీకరణ పట్ల  అప్రమత్తత కలిగించింది. అతని ఉచ్చారణలో ఆ పదాలు మరింత వంకరలు తిరిగాయి. వాళ్ళందరూ కలిసి అవే మాటలు ఒకేసారి అంటూ,నవ్వడం మొదలు పెట్టారు. ఆ చెత్త వాగుడు వినడం అతనికి నచ్చుతుందని అనుకున్నారు. అతనికి కావలసినవన్నీ అందించారు. వాళ్ళకి  మొదటి సీసా సారాయి తాగిన వెంటనే మత్తెక్కింది. వాళ్ళ అలవాట్లు, సభ్యత ప్రకారం వాళ్ళకి కుడివైపు, ఎడమవైపు ఉన్న అధికారులపై ముద్దులు కురిపించారు.వాళ్ళ చేతులను గిల్లారు;అరుపులు కేకలతో గోల చేశారు;గ్లాసులకు గ్లాసులు సారాయి తాగారు. ఫ్రెంచ్ పాటలు  పాడారు; ప్రతిరోజూ ప్రష్యన్  సైనికులను కలిసినప్పుడు నేర్చుకున్న  జర్మన్ పాటలు కూడా పాడారు.  

కాసేపటికే మగవాళ్ళకి అదుపు లేకుండా పోయింది. అరుపులు, ప్లేట్లు ,గ్లాసులు బద్దలు కొట్టడం మొదలు పెట్టారు. వారి వెనకనున్న సైనికులు మాత్రం స్థిమితంగా వాళ్ళ వెనక నిల్చుని ఉన్నారు. ఒక్క కమాండెంట్ మాత్రమే పూర్తి  నియంత్రణలో ఉన్నాడు. మాదమొయిసెల్లె ఫిఫి రాచెల్ ని ఒళ్ళో కూచోపెట్టుకున్నాడు,ఉత్సాహం ఆపుకోలేక ఒకసారి ఆమె ఉంగరాల జుట్టును, మెడను ముద్దులతో ముంచెత్తగా, మరోసారి ఆమె భరించలేక  అరిచేంత గట్టిగా గిల్లాడు. అతని క్రూరత్వమే అతని వ్యక్తిత్వం; ఆమెను బాధపెట్టాలని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టాడు. ఆమెను గట్టిగా కౌగిలించుకుని,గులాబీ పెదవులను ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేంతవరకు ముద్దాడాడు. ఊపిరాడక సతమతమవుతున్న ఆమె, అతని ముఖంలోకి చూస్తూ,”ఇంతకింతా అనుభవిస్తావు”అనింది. దానికతను నవ్వుతు,”అనుభవిస్తానులే ” అన్నాడు నిర్లక్ష్యంగా.  

భోజనాలు అయిన తర్వాత షాంపైన్ ఇచ్చారు. కమాండెంట్ లేచి, మహారాణి ఆగస్తా ఆరోగ్యానికి తాగుతున్నామని చెప్తున్న స్వరంలోనే, “మన మహిళలకు” అన్నాడు. ఆ తరువాత ఒకరి తరువాత ఒక్కొక్కరికి శుభాకాంక్షలు చెప్పడం మొదలైంది. మొదటగా అత్యంత కింది స్థాయిలో ఉన్న సైనికులకు, తాగుబోతులకు,అంటూనే అందులో అస్లీల హాస్యోక్తులు కలిపారు. భాష సరిగా రాకపోవడం వలన అవి మరింత అసహ్యంగా మారాయి. ఒకరి తరువాత ఒకరు లేచి మాట్లాడటం మొదలు పెట్టారు;చతురోక్తులు చెప్పాలనుకున్నారు;కానీ మరింత ఎగతాళికి గురయ్యారు;ఇక ఆ మహిళలు ఎంతగా తాగారంటే అందరూ కుర్చీలలో నుంచి పడిపోయారు. కళ్ళు శూన్యంగా చూస్తుండగా, బండబారిన నాలుకలు ప్రతిసారి పిచ్చి పిచ్చి గా మెచ్చుకోలు పలుకుతున్నాయి. 

కెప్టెన్ ఈ ప్రేలాపన లన్నిటికీ శౌర్య పరాక్రమాల ప్రదర్శన అనే భావన  కలగజేయాలని అనుకుంటూ, తాను తాగుతున్న సారా గ్లాస్ ని పైకెత్తి”హృదయాలపై మా గెలుపును” పండగ చేసుకుంటూ అన్నాడు. ఆ తర్వాత ఆగ్నేయ జర్మనీ లోని నల్ల అడవిలో ఎలుగు లాంటి  లెఫ్టనెంట్  ఒట్టో,ఎగిరి గంతేసి పూర్తిగా తాగిన మైకంలో,దేశభక్తిని గురించి వాగడం మొదలు పెట్టాడు;” ఫ్రాన్స్ పై మన గెలుపుకి ఆనందిస్తూ” అన్నాడు. 

బాగా తాగిన మైకంలో ఉన్నందువలన మహిళలు మౌనంగా ఉన్నారు;అయితే రాచెల్ ఒక సారి చుట్టూ చూసింది;వణుకుతూ “చూడండి, కొంతమంది ఫ్రెంచ్ వాళ్ళ ఎదురుగుండా మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు.” కానీ లిటిల్ కౌంట్ ఆ పిల్లని తన ఒడిలో పెట్టుకుని నవ్వడం మొదలు పెట్టాడు;సారాయి మత్తు అతనిలో సంతోషాన్ని నింపింది. హా! హా! హా! నేను ఇంతవరకు అటువంటి వ్యక్తిని చూడనే లేదు. మనం కనిపించగానే వాళ్ళు పరుగులు తీస్తున్నారు!”  కోపంతో ఊగి పోతున్న ఆ పిల్ల “నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు.చెత్త నా  కొడకా!”

ఒక క్షణకాలం అతడామెను స్థిరంగా తన ప్రకాశవంతమైన కళ్ళతో చూసాడు- తాను చిత్రాన్ని తుపాకీతో ధ్వంసం చేయక ముందు చూసినట్టే. వెంటనే,” అహ! అవును. వాళ్ళ గురించి మాట్లాడు ప్రియా!వాళ్ళంత దైర్యవంతులే అయితే మేము ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళమా?”ఆ తరువాత ఉత్సాహం గా, “మేము యజమానులం! ఫ్రాన్స్ మాకే చెందుతుంది!” ఆమె అతని ఒడిలో నుండి ఒక్క ఉదుటున లేచింది. కుర్చీలో ఎగిరి కూచుంది. అతను కూడా లేస్తూ చేతిలో గ్లాస్ ని టేబుల్ మీద పెట్టి మళ్ళీ మళ్ళీ అవే మాటలు అన్నాడు:” ఫ్రాన్స్,ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడి అడవులు,పొలాలు, ఇళ్ళు, అన్ని మాకే  సొంతం!”

మిగిలిన వాళ్ళు కూడా పూర్తిగా తాగిన మైకంలో ఉండడం వలన మిలిటరీ ఉత్సాహంతో పాశవికంగా స్పందించారు. వాళ్ళ వాళ్ళ గ్లాసులు పట్టుకుని,”లాంగ్ లివ్ ప్రష్యా” అంటూ గట్టిగా అరుస్తూ గ్లాసులను ఒక్క గుక్కలో ఖాళీ చేశారు. 

అమ్మాయిలు ఏమాత్రం ప్రతిఘటించలేదు. మౌనంగా ఉండిపోయారు.భయపడిపోయారు. కనీసం రాచెల్ కూడా ఏమి మాట్లాడ లేకపోయింది. ఆమె దగ్గర కూడా ఏ సమాధానం లేకపోయింది. అప్పుడు అక్కడున్న పిల్ల జమీందారు అప్పుడే నింపుకున్న తన షామ్పెయిన్ గ్లాస్ ని జ్యూయిష్ అమ్మాయి తలపై పెట్టి,”ఫ్రాన్స్ లో ఉన్న అమ్మాయిలందరూ కూడా మాకే “అన్నాడు.

ఆ మాటలతో ఆమెకు కోపం నషాళానికి అంటింది. వెంటనే లేచింది; ఆ వేగానికి ఆమె తలపై ఉన్న పసుపు రంగు సారాయి ఆమె నల్లని తల వెంట్రుకలపై, అప్పుడే మతం స్వీకరిస్తున్నట్లు పడింది. గ్లాస్ కిందపడి వేల ముక్కలయింది.ఆమె పెదవులు వణికాయి. ఆమె ఆ అధికారి ఆదేశాలు ధిక్కరించింది. అతనింకా నవ్వుతూనే ఉన్నాడు. కోపంతో ఆమె గొంతు పూడుకుపోయింది. ఉగ్రంగా “అది -అది- అది నిజం కాదు. మీరు ఫ్రాన్స్ మహిళలను పొందలేరు.”

అతను మళ్ళీ కూర్చున్నాడు. నవ్వాడు;సులభంగా తన భావాన్ని చెప్పడానికి ప్రష్యన్ లో,” ఆమె మంచిది;చాలా మంచిది. అటువంటప్పుడు ప్రియా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?” ఆమె ఒక్క సారి బిగుసుకు పోయింది. ఒక్క క్షణం నోట మాట రాలేదు. ఆందోళనలో ఆమెకు అతనేం అంటున్నాడో అర్థం కాలేదు. అర్థం అయిన వెంటనే కోపంతో ఉగ్రంగా :”నేను!నేను! నేను మహిళనే కాను. నేను కేవలం ఒక లంజని. ప్రష్యన్ లకు కావలసింది కూడా వాళ్లే.”

ఆమె మాటలు ఇంకా పూర్తవకుండానే అతను చెంప చెళ్లుమనిపించాడు. అతను కొట్టడానికి మళ్ళి చెయ్యెత్తగానే, ఆమె తినడానికి వాడే చిన్న కత్తిని టేబుల్ మీద నుంచి తీసుకుని పిచ్చ కోపం తో అతని మెడపై ఒక్క పోటు పొడిచింది. అతను అనాలనుకున్న మాటలు గొంతులోనే ఉండిపోయాయి. సగం తెరిచిన నోటి తో,తెరిచి ఉంచిన కళ్ళతో అతను అక్కడే కూలబడిపోయాడు.  

అధికారులందరూ భయంతో కేకలు వేశారు;గందరగోళంగా పరుగులు తీశారు. ఆమె కుర్చీని లెఫ్టనెంట్ ఒట్టో కాళ్ళ మధ్యకి విసిరేసింది .అతను వెంటనే కింద బోళ్ళ పడ్డాడు. ఆమె కిటికీ దగ్గరికి పరిగెత్తింది.వాళ్ళు పట్టుకోక ముందే  తెరిచి ఉంచిన కిటికీ నుండి దూకి పరుగు లంకించుకుంది. ఆ రాత్రివేళలో,వాన కురుస్తున్నాకూడా.

రెండు నిముషాల్లో మాదమొయిసెల్లె ఫిఫి చనిపోయాడు. అక్కడున్న మహిళలని చంపడానికి ఫ్రిట్జ్ ,ఒట్టో కత్తులు దూశారు.వాళ్ళు వాళ్ళ కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు . ఎంతో  కష్టపడి మేజర్ చంపకుండా ఆపగలిగాడు.నలుగురు అమ్మాయిలను ఒక గదిలో బంధించి ఇద్దరు సైనికులను కాపలా పెట్టారు. పలాయనం చిత్తగించిన ఆమెను ఖచ్చితంగా పట్టుకునే పధక రచన జాగ్రత్తగా  చేసాడు. చిన్నపాటి ఘర్షణ జరుగుతుందని, అయితే ఆమెను ఖచ్చితంగా పట్టుకోగలమని అతని భావన.

అప్పటివరకు భోజనాలకు వాడిన టేబుల్ ని ఇప్పుడు లెఫ్టనెంట్ పడుకోడానికి వాడాల్సి వచ్చింది. కిటికీల దగ్గర నలుగురు అధికారులు కాపలా పెట్టారు. అంతా కర్తవ్య నిర్వహణలో ఉన్నట్టు గంభీరంగా దృఢంగా ఉన్నారు. నిలిచి ధారాపాతంగా కురుస్తున్న వర్షంలో, చీకట్లో కళ్ళు పొడుచుకుని ఏమైనా కనిపిస్తుందేమో అని చూస్తున్నారు.ఉన్నట్టుండి ఒక తుపాకీ మోగిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత మరొకటి. ఆ తర్వాత మరొకటి. దూరంగా వరుసగా తుపాకుల మోతలు వినిపిస్తున్నాయి. ఏడుపులు ,కొత్త మాటలతో సవాళ్లు, బొంగురు గొంతుకలో మాటలు వినిపిస్తున్నాయి. 

తెల్లవారేసరికి అంతా తిరిగి వచ్చారు.ఇద్దరు సైనికులు చనిపోయారు. వెతుకులాటలో ముగ్గురు తమ తోటి సైనికుల చేతిలోనే గాయాలపాలయ్యారు. కానీ వాళ్లకు రాచెల్ దొరకలేదు. 

ఆ తర్వాత అక్కడున్న వాళ్ళందరిని భయభ్రాంతులను చేశారు. ఇళ్లు గుల్ల చేశారు.గ్రామం అంతటిని జల్లెడ పట్టారు. చిత్రహింసలు పెట్టారు. మళ్ళీ మళ్ళీ ఇదంతా కొనసాగింది. కానీ ఆ జ్యూయిష్ ఏ మాత్రం జాడని విడువలేదు. 

జనరల్ కి ఈ విషయం చెప్పగానే, సైన్యం లో చెడుఉదాహరణగా నిలుస్తుందని, అందువలన విషయాన్ని బయటికి పొక్కనీయ వద్దని అన్నాడు.కానీ కమాండర్ ని తీవ్రంగా శిక్షించాడు. అతను తన కింది అధికారులకు శిక్షలు వేసాడు. జనరల్,”యుద్ధానికి ఎవరూ ఆనందించడానికి, వేశ్యలతో కులకడానికి వెళ్లరు.” గ్రాఫ్ వాన్ ఫార్ల్స్బెర్గ్ అసహనంతో ఆ జిల్లా పై పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు.అయితే, పగ తీర్చుకోడానికి కూడా ఒక వంక కావలి కదా. అందువలన చర్చి పూజారి కోసం కబురు చేసాడు. బారన్ వాన్ ఎరిక్ అంతిమ సంస్కారానికి చర్చిలో గంటలు మోగించాలని ఉత్తర్వ్యూలు జారీ చేసాడు. 

కానీ ఊహించిన దానికి భిన్నంగా పూజారి తనంతటనే వచ్చి వినయంగా,గౌరవంతో ఉత్తర్వ్యూలు అమలు చేయడానికి సిద్ధపడ్డాడు. ముందు అనేక మంది సైనికులు బారులు తీరి నడుస్తుండగా, చుట్టూ చాలామంది సైనికులు తుపాకులు పట్టుకుని  మార్చ్ చేస్తుండగా,నలుగురు సైనికులు మాదమొయిసెల్లె ఫిఫి భౌతిక కాయం మోసుకెళుతూ యూవిల్లే భవనం దాటి స్మశానికి వెళుతున్నప్పుడు చర్చి గంటలు మోగాయి.ఆ రోజు రాత్రి మళ్ళి చర్చి గంటలు మోగాయి. ఆ తరువాతి రోజు కూడా. ఆ తరువాత ప్రతి రోజు చర్చి లో గంటలు మోగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క సారి రాత్రి గంటలు కొట్టడం ప్రారంభమై సున్నితంగా పొద్దున్నవరకు గంటలు మోగుతూనే ఉంటాయి. రాత్రి చీకట్లో కూడా. కొన్ని సార్లు అందులో ఒక రకమైన సంతోషం కూడా నిండి ఉంటుంది;ఎందుకో ఎవరూ చెప్పలేరు. ఆప్రాంతం రైతులందరూ  అది మంత్రించబడినదని అంటారు. ఇప్పుడు ఒక్కపూజారి, పరిచారకుడు తప్ప ఇంకెవరు చర్చి బురుజు దగ్గరికి వెళ్లడం లేదు. వాళ్ళు వెళ్ళడానికి కారణం, అక్కడ ఒక పేద పిల్ల శోకంతో ఉంది;ఒంటరిగా ఉంది; ఆ ఇద్దరే ఆమెకు కావలసినవన్నీ రహస్యంగా అందిస్తున్నారు.

జర్మన్ సైన్యం అంతా ఊరువదిలి వెళ్లెవరకూ ఆమె అక్కడే వుంది. ఆ తరువాత ఒక రోజు పూజారే ఒక బండి అద్దెకి తెచ్చుకుని, తన బండిలో, తన వద్ద బందీగా ఉన్న ఆమెను రౌఎన్ తీసుకుని  వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఆమెను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు;ఆమె వెంటనే  తాను వచ్చిన చోటికే నడుచుకుంటూ తిరిగి వెళ్ళిపోయింది. ఆమె యజమాని,చనిపోయిందని అనుకున్న ఆమె తిరిగి వచ్చినందుకు చాలా సంతోషించింది. 

కొద్ధి రోజుల తరువాత ఏ పక్షపాత బుద్ధి లేని దేశభక్తుడు ,ఆమెని ఆమెగా ఇష్టపడి, ఆమె ధైర్యానికి మెచ్చుకుని ,ఆమెను ప్రేమించాడు. ఆమెని పెళ్లి చేసుకున్నాడు; ఆమెకూడా చాలా మంది మహిళలలాగే ఒక గౌరవ ప్రదమైన జీవితాన్ని గడిపింది.

ఉషారాణి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *