తల్లిదండ్రుల హత్య

Spread the love

అతను ఒక పిచ్చివాడని వాదించాడు అతని తరపు న్యాయవాది; లేకపోతే, ఇటువంటి వింత నేరాన్ని ఎవరు మాత్రం ఎలా సమర్థించగలరు?

ఒకరోజు పొద్దున్న, సెయిన్ నది పక్కన ఉన్న గడ్డిలో రెండు శవాలు కనిపించాయి. ఒకటి ఆడది, రెండోది మగవాడు.వాళ్ళు అందరికీ బాగా పరిచయం ఉన్న ధనవంతులు. యవ్వనంలో ఉన్న వాళ్ళు కాదు. అయితే,అంతకు ఒక సంవత్సరం ముందే పెళ్లి చేసుకున్నారు. ఆ మహిళ, మూడేళ్ల కింద భర్తను కోల్పోయింది.

వాళ్లకి శత్రువులు ఉన్నట్టు ఎవరికీ అనుమానం లేదు. వాళ్ళని ఎవరూ దోచుకోలేదు. ఒక పొడుగాటి ఇనప చువ్వతో తలపై మోది,దారి పక్క నున్న నదిలోకి పడేసినట్టు అనిపిస్తోంది.

పరిశోధనలో స్పష్టంగా ఏ ఆధారాలు దొరకలేదు. పడవ నడిపే వాడిని అడిగినా ఏ సమాధానం చెప్పలేకపోయాడు. పక్క గ్రామంలో ‘బూర్జువజీ’ గా పిలువబడే వడ్రంగి- అతడి అసలుపేరు జార్జ్ లూయి,శ్రధ చూపడం మానేసిన తర్వాత, పరిశోధాన పూర్తిగా కుంటుపడింది.

అడిగిన ప్రశ్నలన్నిటికీ అతనిచ్చే ఒకే ఒక్క సమాధానం,”నాకు ఆ మనిషి రెండేళ్లగా తెలుసు. ఆ మహిళ ఆరు నెలలుగా తెలుసు. నేను బాగా పనిచేసి పెడతాను కాబట్టి,వాళ్ళ ఇంటి ఫర్నిచర్ రిపేర్ చేయడానికి నన్ను తరచుగా పిలిచేవాళ్ళు.”

“నువ్వెందుకు చంపేసావు?”అని అడిగితే అతను మొండిగా ఇచ్చే సమాధానం,”నాకు చంపాలనిపించింది.చంపేశాను.”

న్యాయవాదులు ఇంతకంటే అతని దగ్గర నుంచి మరే సమాధానం రాబట్ట లేకపోయారు.

నిజానికి ఇతగాడు వాళ్ళ అక్రమ సంతానం. అతనిని చిన్నప్పుడు సంరక్షణకు ఇచ్చారు. కానీ ఆ తర్వాత వదిలించేసుకోవాలనుకున్నారు. అతని పేరు జార్జ్ లొయ్. బాగా తెలివైన వాడు; మంచి అభిరుచి ఉంది; తన పరిచయస్తులెవరికీ లేని సంస్కారాన్ని అలవాటు చేసుకున్నాడు. అందుకే అందరూ అతన్ని

‘బూర్జ్యువజీ’ అని పిలవడం మొదలుపెట్టారు. మరో పేరు పెట్టి పిలిచే వాళ్లే కాదు. వడ్రంగం పని చేస్తూ, అందులో మంచి నైపుణ్యాన్ని సాధించాడు. అతనిని సోషలిస్ట్ మూఢ భక్తుడని కూడా అంటారు. అతనికి కమ్యూనిస్టు సిద్ధాంతాలంటే నమ్మకం. హత్యలకు సంబంధించిన నవలలన్నీ బాగా చదువుతాడు. రాజకీయ ఆందోళలను ప్రభావితం చేయగల మనిషి. కార్మికులు, కర్షకులు పాల్గొన్న బహిరంగ సభలలో మంచి తెలివైన ప్రసంగాలు చేయగలడు.

అతని న్యాయవాదే, ‘ఇతడు పిచ్చోడని’ వాదించాడు.

“అతడు, బాగా డబ్బు ఉన్న, ఎంతో ఉదారులైన  ఖాతాదారులను చంపేసాడంటే ఎవరైనా ఎలా నమ్మగలరు?వారి దగ్గరి నుండి 3000 ఫ్రాంకులు సంపాదించుకోగలిగాడు- అలా అని అతని లెక్కలు వ్రాసుకునే  పుస్తకాలు చెప్తున్నాయి. అందువల్లనే అతన్ని పిచ్చోడనవలసి  వచ్చింది; కేవలం ‘బూర్జవజీ’లందరి మీద ఉండే ప్రతీకారంతోనే వీళ్లను కూడా చంపి ఉండవచ్చు.” ‘బూర్జువజీ’ అని అతనికి పెట్టిన పేరును, న్యాయవాది చాలా తెలివిగా వాడుకున్నాడు.

“ఈ పిచ్చోడి బుర్ర పాడు చేయడానికి ఈ మాత్రం దురదృష్టం సరిపోదూ! అతనికి తల్లి దండ్రులు  లేరు; రిపబ్లిక్ పార్టీ విధేయుడు.నేను అంటున్నది ఏమంటే,ఇతడు ఒకప్పుడు అణచి వేసిన రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు; ప్రభుత్వం నిషేధించి, తరిమేసిన వాళ్లనే ఇప్పుడు మళ్లీ చేతులు చాచి మరీ ఆహ్వానిస్తున్నారు. నిజానికి,ఆ పార్టీకి దోపిడీలు, దొంగతనాలు, హత్యలు సాధారణ విషయాలు.” అని న్యాయవాది కోర్టులో తన వాదనను సమర్థించుకున్నాడు.

“ఈ పిచ్చి సిద్ధాంతాలను ప్రజలు ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. అవి మనుషులను సర్వనాశనం చేశాయి. అతను రిపబ్లికన్ల ప్రసంగాలను విన్నాడు,జీర్ణించుకున్నాడు.వాటిని ఇప్పుడు మహిళలు కూడా అనుసరిస్తున్నారు. అవును మహిళలు కూడా;ఎం.గబిటా,ఎం.గ్రేవీ రక్తాన్ని కోరుకుంటారు; ఇతగాడు తీరిక వేళలో వాళ్ల ఉపన్యాసాలు వింటాడు.వాటి వలన బాగా  ప్రభావితం అయ్యాడు. ఇతను కూడా ‘బూర్జువజీల’ రక్తాన్ని కోరుకున్నాడు.”

“మనం శిక్షించాల్సింది ఇతన్ని కాదు, పెద్ద మనుషుల్లారా, మనం శిక్షించాల్సింది కమ్యూన్ని.”

అంటూ న్యాయవాది తన వాదనను కొనసాగించాడు.

అందరూ న్యాయవాది వాదనలను అంగీకరించారు. న్యాయవాది కేసు గెలుస్తాడని అనుకున్నారు కూడా. ఎవరూ అతనిని వ్యతిరేకించలేదు.

ఆ తరువాత  జడ్జ్, సాధారణంగా అందరు నిందితులనీ అడిగే ప్రశ్న అడిగాడు.

“ఖైదీ! నువ్వు నీ తరఫున ఏమైనా మనవి చేసుకో దలుచుకున్నావా?”

ఆ మనిషి లేచి నిలబడ్డాడు.

పొట్టిగా, గోగునారలాంటి జుత్తు, ప్రశాంతంగా స్పష్టంగా ఉన్న బూడిద రంగు కళ్ళు. బలంగా, ఖంగుమని మోగే గొంతు.సన్నగా కనిపించే ఆ అబ్బాయి పై అభిప్రాయం,అతని మాటలు వినంగానే మారిపోతుంది.

అతడు చాలా గట్టిగా ప్రకటన చేస్తున్నట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రతి పదాన్ని అందరికీ అర్థమయ్యేలాగా స్పష్టంగా పలుకుతున్నాడు.

“అయ్యా! నేను ఒక పిచ్చివాడి లాగా పిచ్చాసుపత్రికి వెళ్ళదలచుకోలేదు. అంతకన్నా చావునే ఎంచుకుంటాను. జరిగిందంతా మీకు చెప్తాను.” 

“నేను ఈ పురుషుడిని, ఆ స్త్రీని చంపిన మాట నిజం. ఎందుకంటే వాళ్లు నా తల్లిదండ్రులు. ఇప్పుడు కథ వినండి.విని మీ తీర్పు ఇవ్వండి.

“ఈ మహిళ కొడుకును కని, వాడిని పెంచడానికి వేరొక చోటకి పంపించింది.ఆ తోడుదోంగ, తీసుకెళ్లిన పిల్లవాడిని ఎక్కడ పెట్టాడు, ఏం చేశాడు, అని కూడా కనుక్కో లేదు. వాడిని వాడి ఖర్మకు వదిలేసింది.నా పుట్టుకకు నేను సిగ్గుపడుతున్నాను, అంతకంటే ఎక్కువ ఈ చావుకు. వదిలేసిన తర్వాత పెంచడానికి ఇవ్వాల్సిన నెలసరి జీతాన్ని కూడా పంపించడం మానేశారు. ఎందుకంటే, డబ్బులు అందకపోవడం వలన సంరక్షణకు ఇచ్చిన వాళ్ళు తిండి పెట్టరు, నిర్లక్ష్యం చేస్తారు.అందువలన బిడ్డ చనిపోతాడు” అనే భావన.

కానీ,”నన్ను పెంచిన ఆమె చాలా నిజాయితీ గల మనిషి. కన్న తల్లి కన్నా చాలా గొప్పది, మంచిది. నన్ను బాగా పెంచింది. ఆమె తన విధిని నిర్వర్తించి తప్పు చేసింది. నిజానికి నన్ను చనిపోనిచ్చి ఉండవలసింది. ఏ గ్రామాలలోని కుప్ప తొట్టిలో పడేసినా, నేను చనిపోయి ఉండేవాడిని.”

” కానీ, నేను పెరిగాను. జీవితాంతం ఒక మచ్చను మోస్తూ పెరిగాను. మిగిలిన పిల్లలు అందరూ నన్ను’లం…’కొడుకంటూ పిలిచేవాళ్ళు. వాళ్ళకి  ఆ మాట అర్థం తెలియదు. ఇంట్లో అందరూ మాట్లాడటం విని అంటూ ఉండి ఉంటారు. నాకు కూడా దాని అర్థం తెలియదు. కానీ అదేదో అవమానకరమైన సంబోధనగా అనిపించేది. “

“నేను నా బడిలో అందరికంటే చాలా తెలివైన వాడిని. ఒక మంచి వ్యక్తిని అయ్యుంటే వాడిని. గౌరవం పొంది ఉండేవాడిని.మంచి జ్ఞానినై ఉండేవాడిని- నా తల్లిదండ్రులు అత్యంత నీచమైన నేరానికి ఒడిగట్టకపోయి ఉంటే.

“అసలు నేరం జరిగింది నాకు. నేనొక బాధితుడిని. నేరస్తులు వాళ్ళు. నాకు ఏ రక్షణా లేదు. జాలి లేదు. వాళ్లకి నన్ను ప్రేమించాల్సిన బాధ్యత ఉండింది. కానీ నా వాళ్ళు నన్ను వదిలేశారు.”

“నేను నా జీవితం వాళ్ళకి అర్పించాల్సి ఉండేది. అందరికీ జీవితం ఒక వరమయితే, నాకు మాత్రం అదొక శాపం.ఇంత అవమానకరంగా నన్ను వదిలేసిన తర్వాత, నాకు మిగిలిందల్లా ప్రతీకారమే. నా పట్ల వారు చేసింది అత్యంత హేయమైన, అమానవీయమైన నేరం. అవమానకరం. రాక్షసత్వం. అది ఏ మానవమాత్రుడి పట్ల జరగకూడని నేరం.” 

“అవమానించబడిన మనిషి తిరగబడతాడు. దోచుకోబడ్డవాడు బలవంతంగా నైనా తాను పోగొట్టుకున్నది తిరిగి సంపాదిస్తాడు. నమ్మకద్రోహం చేయబడిన వాడు, హింసించబడినవాడు, అవమానించబడినవాడు చంపుతాడు. వాళ్లందర్నీ మీరు క్షమిస్తారు.నేను కూడా దోచుకోబడ్డాను, మోసగించబడ్డాను, హింసించబడ్డాను. నైతికంగా దెబ్బకొట్ట బడ్డాను. అందువలన నా కోపం మరింత ఎక్కువగా ఉంటుంది. మరి నన్ను ఎందుకు క్షమించలేరు?”

 “నేను ప్రతీకారం తీర్చుకున్నాను. చంపేశాను. అది నా చట్టపరమైన హక్కు. నాకు బలవంతంగా కట్టబెట్టిన జీవితానికి బదులుగా, వారి ప్రియమైన జీవితాన్ని లాక్కున్నాను.

మీరు దాన్ని తల్లిదండ్రుల హత్య అని అనవచ్చు. నన్ను అసహ్యించుకుని, భరించలేని భారంగా పరిగణించే వాళ్ళు నా తల్లిదండ్రులెలా అవుతారు? నా పుట్టుకే వాళ్ళకి భయానకం. నా జీవితం అవమానకరం. వాళ్లు వాళ్ల సుఖాన్ని వెతుక్కున్నారు. అనుకోకుండా బిడ్డను కన్నారు. బిడ్డ పుట్టినట్టు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు నా వంతు వచ్చింది. నేను అదే పని చేశాను.”

“కానీ ,ఈ మధ్య కాలం వరకు నేను వాళ్లను ప్రేమించడానికి సిద్ధ పడ్డాను.

నేను ముందే చెప్పినట్టుగా, ఈ మనిషి నా తండ్రి. నా దగ్గరికి రెండేళ్ల కిందట వచ్చాడు. నేనేమీ అనుమానించలేదు. అతను రకరకాల ఫర్నిచర్ ని ఆర్డర్ చేశాడు-అతడు పూజారి దగ్గర నుంచి రహస్యంగా నా వివరాలు కనుక్కున్నట్టు ఆ తర్వాత  నాకు తెలిసింది.”

“అతడు తరచుగా నా దగ్గరకు వస్తుండేవాడు.  చాలా పనులు అప్ప చెప్తుండేవాడు.దండిగా డబ్బులు చెల్లిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఏదో ఒక విషయం మీద నాతో ముచ్చట్లు పెట్టుకునేవాడు. నాకు కూడా క్రమంగా అతని మీద అభిమానం పెరిగింది.”

 “ఈ ఏడు మొదట్లో అతడు తనతో పాటు తన భార్యను కూడా తీసుకొచ్చాడు. అంటే మా అమ్మని. ఆమె వస్తున్నప్పుడు వణుకుతూ వుండింది. ఏదైనా నరాల జబ్బుతో బాధపడుతున్నదేమో అని అనుకున్నాను. కూర్చోవడానికి చోటు చూపించాను.ఒక గ్లాసుడు మంచినీళ్లు అడిగింది. ఏమీ మాట్లాడలేదు. చుట్టంతా, అంటే నేను పని చేస్తున్న ప్రదేశాన్నంతా, జాగ్రత్తగా పరిశీలించి చూసింది. అతను అడిగిన ప్రశ్నలన్నిటికీ, ,’అవును, కాదు’ అని మాత్రమే సమాధానాలు చెప్పింది. ఆమె కొంత మతి స్థిమితం కోల్పోయినట్టు నాకు అనిపించింది.”

“ఆ రోజు ఆమె ప్రశాంతంగా, పూర్తి నియంత్రణలో ఉంది. ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పారు. నాకు ఒక పెద్ద ఆర్డర్ ని కూడా ఇచ్చారు. ఆ తర్వాత నాకు మరో మూడుసార్లు కనిపించారు. నాకు ఏమాత్రం అనుమానం రాలేదు. కానీ ఒక రోజు ఆమె నాతో నా జీవితం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. నా చిన్నతనం గురించి నా తల్లిదండ్రుల గురించి.”

“‘అమ్మా!నా తల్లిదండ్రులు దిక్కుమాలిన వాళ్ళు.నన్ను వదిలించుకున్నారు’ అని చెప్పాను.వినగానే ఆమె గుండెను గట్టిగా పట్టుకొని కిందపడిపోయింది. స్పృహ తప్పింది. వెంటనే నాకు,”ఆమె నా తల్లి” అని అనిపించింది. అయినా ఏమాత్రం బయటపడకుండా జాగ్రత్త పడ్డాను. ఆమెను నెమ్మదిగా గమనించాలని అనుకున్నాను.”

 ” నేను కూడా వారి గురించి వివరాలు సేకరించడం మొదలు పెట్టాను. వాళ్ళిద్దరూ కిందటి జూలై నెలలో పెళ్లి చేసుకున్నారని, నా తల్లి మూడేళ్ల కిందట తన భర్తను కోల్పోయిందని తెలుసుకున్నాను. వాళ్ళిద్దరూ, నా తల్లి మొదటి భర్త బతికున్నప్పుడు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూనే ఉన్నారని వదంతులు ఉన్నాయి. అయితే దానికి ఎటువంటి రుజువు లేదు.ఉన్న రుజువు అల్లా నేనే. ‘ఆ రుజువును’ మొదట్లో వాళ్ళు జాగ్రత్తగా కప్పి పెట్టారు. ఆ తర్వాత నా జీవితం పూర్తిగా నాశనం చేద్దామనుకున్నారు. “

“ఒక రోజు సాయంత్రం ఆమె వచ్చింది. యధావిధిగా తన భర్తను వెంట తీసుకొచ్చింది. ఆ రోజు వాళ్ళు బాగా చలించిపోయి ఉన్నారు. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె వెళ్తున్నప్పుడు, నువ్వెంతో నమ్మకంగా ఉంటావు. కష్టపడి పని చేస్తావు. అందుకని  నువ్వు తప్పనిసరిగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఏదో ఒక రోజు నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో. నా పెళ్లి నాకు ఇష్టం లేని వాడితో జరిగింది. ఇష్టం లేని వాళ్ళతో పెళ్లి జరగడం లోని బాధ నాకు బాగా తెలుసు. నేనిప్పుడు ధనవంతురాన్ని. పిల్లలు లేరు. యావదాస్తికి యజమానురాలిని. స్వేచ్ఛ ఉన్నదాన్ని.”

“ఆమె చేతిలో ఉన్న సీల్డ్ కవర్ని తీసి నా చేతిలో పెట్టింది-‘ఇది నా పెళ్లి ద్వారా సంక్రమించినది’, అనింది”

 నేను నేరుగా ఆమె కళ్ళల్లోకి చూశాను.”నువ్వు నా తల్లివా”అని అడిగాను.

ఆమె వెంటనే రెండు అడుగులు వెనక్కి వేసింది. తన చేతుల్లో ముఖాన్ని దాచుకుంది.నావైపు చూడకుండా, అతడు, అదే నా తండ్రి, ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి “నీకేమన్నా పిచ్చి పట్టిందా?” అంటూ అరిచాడు.

” మీరిద్దరూ నా తల్లిదండ్రులని నాకు కచ్చితంగా తెలుసు. ఇలా నన్ను మోసం చేయలేరు. ఒప్పుకోండి. నేను మీ రహస్యాన్ని కాపాడతాను. మీరంటే ఏ రకమైన దురభిప్రాయాన్ని పెట్టుకోను. నేను నాలాగే ఉంటాను. ఒక వడ్రంగిలాగా.”

“అతను ద్వారం వైపు కదిలాడు.ఆమె ఏడుస్తున్నది. తన కొడుకుకి అండగా నిలవాలనుకుంది. ఆమె వైపే చూస్తూ నేను నిలబడిపోయాను. ఆమె నా తల్లి కాదని అనుకోనే సాహసం చేయలేక పోయాను.”

“ఆ తర్వాత అతని మొహం పాలిపోయింది. తమ తప్పుడు వ్యవహారం బయటపడుతుందని తీవ్రంగా భయపడిపోయాడు. వాళ్ల ప్రతిష్ట, గౌరవం మంట కలుస్తాయి అనుకున్నాడు.”

 “నువ్వు ఒక పనికిమాలిన వాడివి. మా దగ్గర నుంచి డబ్బులు కాజేయాలని అనుకున్నావు. నీలాంటి అలగా మనుషులకు సహాయం చేయడం వలన మాకు దొరికిన ప్రతిఫలం ఇది!” అన్నాడు.

“నా తల్లి కంగారు పడిపోయింది. పదే పదే ,’ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బయటికి వెళ్లి పోదాం’ అంటూ ఉండింది.

అతడు ద్వారం దగ్గరికి వెళ్ళంగానే తలుపు మూసివేసి ఉండడం గమనించాడు.’నువ్వు వెంటనే తలుపు తీయకపోతే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశావని, మాపై దాడి చేశావని నేరం ఆరోపించి నిన్ను జైల్లో వేసేట్టు చూస్తాను’ అన్నాడు.

“నేను ప్రశాంతంగా ఉన్నాను. తలుపు తీశాను. ఇద్దరు చీకట్లో అదృశమయ్యారు.”

” అప్పుడు నేను ఒక్కసారిగా అనాధనయిన భావన కలిగింది. అందరూ వదిలేసిన వాడిని, దూరంగా నెట్టివేయబడిన వాడిని. తీవ్రమైన విచారంతో, కోపంతో, అసహ్యంతో సతమతం అయ్యాను.విరక్తి నన్ను ఆవరించింది. నా శరీరంలోని అణువణువు, అన్యాయాన్ని, సంకుచిత్తాత్వాన్ని, అగౌరవాన్ని, ప్రేమ తిరస్కారాన్ని  ప్రతిఘటించింది. నేను పరిగెత్తుతూ వాళ్లను వెంబడించాను. వాళ్లు సెయిన్ వైపు వెళుతున్నారు- చట్టాన్ స్టేషన్ ని చేరడానికి.”

” నేను తొందరలోనే వాళ్ళని చేరుకున్నాను. రాత్రి చిమ్మ చీకటిగా ఉంది. నేను వాళ్ళ వెనక నెమ్మదిగా చడీ చప్పుడు చేయకుండా వెళ్ళాను.  వాళ్లని అనుసరిస్తున్న శబ్దం వాళ్లకి వినిపించలేదు. మా అమ్మ ఇంకా ఏడుస్తూనే ఉంది. మా నాన్న,’ ఇదంతా నీ తప్పే. నువ్వు ఎందుకు వాడిని చూద్దామనుకున్నావు? మనం ఉన్న స్థితిలో వాడితో కలవడం సాధ్యమయ్యే పని కాదు. మనం బయట నుంచే వాడికి సహాయం చేయగలిగి ఉండేవాళ్ళం. కనిపించకుండానే. ఇటువంటి భయంకరమైన కలయకల వల్ల ఉపయోగం ఏమిటి? మనం వాడిని ఎన్నటికీ గుర్తించలేము’ “అన్నాడు.

“అప్పుడు నేను వాళ్ళ ముందుకొచ్చి, ఓహో! అయితే, మీరే నా తల్లిదండ్రులు అన్నమాట. మీరు ఒకసారి నన్ను వదిలించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వదిలించుకుంటున్నారు. మళ్లీ నన్ను దూరంగా తోసేస్తున్నారు” అన్నాను.

“అప్పుడు, అయ్యా! అతడు నన్ను కొట్టాడు. ఆ దెబ్బ, నా గౌరవం మీద పడింది, నా చట్టం మీద, నా దేశం మీద పడింది. అతను నన్ను కొట్టగానే నేను అతని కాలర్ పట్టుకున్నాను. అతడు జేబులోంచి తుపాకిని తీశాడు.”

” నేను కోపంతో రగిలి పోయాను. ఏం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. నా జేబులో కంపాస్ ఉండింది. దాంతో అతడిని కొట్టాను. కొట్టగలిగినంత గట్టిగా.’సహాయం చేయండి. ఇక్కడ హత్య జరుగుతున్నది’ అంటూ ఆమె అరుస్తూ, నా గడ్డం గట్టిగా పట్టుకుని లాగింది. ఆమెను కూడా చంపి ఉంటాను. నేను ఆ క్షణం ఏం చేశానో నాకేం తెలుసు?” 

ఆ తర్వాత ఇద్దరూ నేల మీద పడి ఉన్నారు. ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళిద్దరినీ నేను పక్కనే పారుతున్న సెయిన్ నదిలో పడేసాను.

“జరిగిన విషయమైతే అదే. ఇప్పుడు మీరు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధమే.”

ఖైదీ కూర్చుండి పోయాడు; అసలు విషయాలన్నీ బయటపెట్టిన తర్వాత, కోర్టు కేసును వాయిదా వేసింది. ఆ తర్వాత, తొందరలోనే విచారణకు వస్తుంది.

మీరే గనుక న్యాయవాది అయితే, దీనిని తల్లిదండ్రుల హత్య అని అంటారా?

ఉషారాణి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *