కడపటి కోరిక

Spread the love

ఎనభై ఏళ్ళ ఎజుత్తచ్చన్ కొనప్రాణంతో వున్నాడు. నంబియార్ సతి చెయ్యిని ఓమారు తాకి ప్రాణాలు వదలాలని అతని ఆఖరు కోరిక.


నంబియార్ సతి అంటే ఎవ్వరో తెలుసా?

పి.కె. నంబియార్ భార్య!

మరి ఈ పి.కె. నంబియార్ ఎవరంటే మావూళ్ళోని పేరుమోసిన కంట్రాక్టరు, డబ్బు గల ఆసామి!

నంబియార్ భార్య ఇద్దరు బిడ్డల తల్లి. ఆమె పెళ్లయి ఆరేళ్ళు దాటింది.

ఎజుత్తచ్చన్ ‘చివరి కోరిక విని ఆయన బంధువులు ఒకరి మొహాలు ఒకరు చూసుకొన్నారు. వాళ్ళందరూ ఎజుత్తచ్చన్ ఆఖరు ఘడియల్లో ఆయన పూరిగుడిసెలో గుమిగూడారు. ఇరుగుపొరుగువాళ్ళు గుడిసె ముందర నిలబడి ఎజుత్తచ్చన్ వింతకోరిక విని తమలో తామే గుసగుసపోతున్నారు.

“ఈ మగాళ్ళంతా ఇంతే! చచ్చేటప్పుడు కూడా పరాయి ఆడవాళ్ళ చింతే వీళ్లకి!”

“శ్రీదేవిగారూ… చావబోయేవాళ్ల మీద నింద ఎందుకు వేస్తారండీ?” పొరుగింటి నారాయణ మేస్టారి పెళ్ళాం మెల్లగా అంది.
ఎజుత్తచ్చన్ మావూరివాడే. ఆయనంటే నాకెంతో గౌరవం, భక్తిను. “తప్పు చేయనివాళ్ళెవరండీ ఈ ప్రపంచంలో? అయినా తప్పులెన్నడానికి ఇది సమయమా? అన్నీ మరచిపోవాలి. ఈరోజు ఆయనా, రేపు మనం… కాస్త ముందూ వెనకా. అంతే!” వేదాంతధోరణిలో నేనన్నాను.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఎజుత్తచ్చన్ ధర్మరాజులాంటివాడు. ఒకప్పుడు సగం వూరిని కొనే స్తోమత వుండిందాయనకు. అడిగిన వారికీ, అడగనివారికీ దానధర్మాలు చేసి బాగా చితికిపోయాడు. చేతికంది వచ్చిన కొడుకులు ఇల్లు వదిలి దేశాంతరం పోయారు. ఆయనకు చివరకు మిగిలింది ఈ పూరిగుడిసె, ఓ కూతురును, కూతురి కళ్ళన్నీ నాన్న ఆస్తి మీదే వుండేవి.

ఎజుత్తచ్చన్ కూతురి పేరు సుజాతానుదర్శన్.

ఎజుత్తచ్చన్ చివరి ఘడియల్లో ఆయన అల్లుడు సుదర్శన్ కూడా వచ్చాడు.

గుడిసెలో గుడ్డి దీపం వెలుగుతూ వుంది. నేను ఎజుత్తచ్చన్ మంచం పక్కనే నిలబడి, అగరొత్తుల వాసన పీలుస్తూ, అతడు క్షణక్షణం చావుకి దగ్గరవటం గమనిస్తున్నాను.

ఎజుత్తచ్చన్ కాలూ చెయ్యి ఆడించలేని స్థితిలో వడివున్నాడు. ఆయన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతూంది. ఎజుత్తచ్చన్‌ది ఎముకలేని చెయ్యి. తనకున్నదంతా అయిన వాళ్ళకీ, కానివాళ్ళకీ పంచిపెట్టాడు. నాకతను చిల్లిగవ్వకూడా ఇవ్వలేదు. ఉంటేగా ఇచ్చేందుకు?ఎజుత్తచ్చన్ చేసిన ధానధర్మాలకు అంతుంటేగా? చాకలివాని కొడుకును తన డబ్బుతో చదివించి కలెక్టరు చేశాడు. ఊళ్ళో పెద్దధర్మసత్రం కట్టించాడు. వానాకాలంలో బీదాబిక్కి అందులో తలదాచుకొని ఆ ధర్మరాజును తల్చుకునేవాళ్ళు.
అందరి కళ్ళూ ఎజుత్తచ్చన్ వైపే వాలాయి. ఆ ముసలాడు మెల్లమెల్లగా కళ్ళు తెరిచాడు. పెదవులు కదిలించాడు.

“ఏంటి నాన్నా?” కూతురు’ నాన్న ముఖం మీద ముఖం పెట్టి అడిగింది.

“సతి వచ్చిందా?”

సుజాత తండ్రి వైపు నుంచి ముఖం పక్కకు తిప్పి ఏడ్వసాగింది.

అల్లుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.

ఎవ్వరూ మాట్లాడలేదు. శ్మశాన ప్రశాంతత అల్లుకొంది. పొద్దుగూంకుతోంది.

“ఏదో త్వరగా తెమల్చండి” నారాయణ మాస్టారు ఎజుత్తచ్చన్ కాళ్ళు తాకి చల్లబడ్డం చూసి తొందరపెట్టాడు. మాస్టారు మాటలు సుదర్శన్ పట్టించుకోలేదు. ఆయన ముఖం జేవురించిపోయింది. తాను ఏ మొహంపెట్టు కొని బయటికి వెళ్ళగలడు? పదిమందికీ తెలిస్తే పరువేం కాను? లోలోపలే వుడికిపోతున్నాడు.

“చెయ్యడానికేముంది? ఏంలేదు” అల్లుడు గంటకొట్టినట్లు చెప్పేశాడు.

అందరూ నావైపు చూశారు. ‘నీవేమంటావు?’ అన్నట్టు

“ఈయన మన అందరికోసం ఎంత త్యాగం చేశాడు. దేవుడిలాంటి మనిషి ఓ చిన్నకోరిక కోరితే అందరూ నిమ్మకు నీరెత్తినట్లు వుండిపోతే ఎలా?” నేనన్నాను.

“నీ మాటనిజమే అనంత్! కాని నంబియార్ భార్య ఒప్పుకుంటుందంటావా? నంబియార్ దగ్గరకు వెళ్ళి అడిగే గుండెలెవరికున్నాయి?” నారాయణ మాస్టారు ప్రశ్న అందర్నీ కలవరపరిచింది..

“ఏం… గుండ్రాయిల్లా నిలుచుండిపోయారేం?” మాస్టారు మరోసారి అడిగాడు. ఒకరన్నా బదులిస్తేగా? బెల్లంకొట్టిన రాళ్ళల్లా నిలుచుండిపోయారంతా,

నేను ఎజుత్తచ్చన్ వైపే చూస్తూ నిల్చుండి పోయాను. కనుగుడ్లు పైకి వెళ్తున్నాయి. ఊపిరాడుతున్న శబ్దం క్షీణంగా వినవడు తూంది. నేనోసారి దేవుణ్ణి ప్రార్థించాను.

“అనంత్! ఎక్కడికి పోతున్నావ్?” నారాయణ మాస్టారు గడపదాటుతున్న నావెంటవడ్డారు చెప్పులు తొడుక్కుని.
పి.కె. నంబియార్ బి.ఎ. పట్టా పొందిన కంట్రాక్టరు. ఇంగ్లీషు దినపత్రిక తెప్పించుకొని చదివే కొద్దిమందిలో ఆయనొకడు.

ఎజుత్తచ్చన్ చివరి కోరిక వినిపించి ఆయన్ను ఒప్పించవచ్చునని నాకనిపించింది. అసలు ఎజుత్తచ్చన్ కోరిక ఎంత సాధారణమైనదని! ఆయన ఇంకేమైనా అడిగివుండేవాడు.

ఎంతో నమ్మకంతో నేను పి.కె. నంబియార్ ఇంటివైపు గబగబా నడిచాను. ఎండ తీవ్రంగా వుంది. ఏదో శబ్దం అయితే వెనక్కి తిరిగి చూశాను. నారాయణ మాస్టారు ఒగరుస్తూ నావెంట పరుగెత్తుకు వస్తున్నారు.

“నీ ఒక్కడివే వెళ్లటం బాగుండదు బాబూ! వాడేమన్నా అఘాయిత్యం తలపెడ్తే? పిల్లా పాపా గలవాడివి” మాస్టారు మాటల్లో ఆప్యాయత తొంగిచూసింది.

అస్సనార్ కొట్టు దగ్గరకాగానే బీడీ తాగుదామనిపించింది. కాని ఎజుత్తచ్చన్ జ్ఞాపకం వచ్చి ముందుకు సాగాను. సారాయికొట్టు రాగానే, నోరూరింది. కాని ఎజుత్తచ్చన్ చివరి ఘడియలు జ్ఞప్తికి వచ్చి నిలబడకుండా కదిలాను.

చెట్ల గుబురుల మధ్య నంబియార్ బంగళా కనిపించింది.

మా చుట్టు పక్కల అంత అందమైన బంగళాలేదు. దాన్నికడుతున్నప్పుడు మావూరి వాళ్ళంతా నోళ్ళు తెరిచి చూస్తూ వుండిపోయారు. పశువుల సంత జరిగేటప్పుడు తూర్పు దేశం నుంచి వచ్చిన పశువుల యజమానులు, పశువుల తాళ్ళు పట్టుకొని ఆ బంగళావైపే చూస్తూ వుండిపొయ్యేవాళ్ళు.

నారాయణ మాస్టారు నాతోసమంగా నడవలేక అలసిపోయి, చెట్టుకింద నిలబడి, కళ్లద్దాలు తీసి తుడుచుకుంటున్నాడు. ఆయన వొళ్లంతా చెమటతో తడిసిపోయింది.

“బాబూ… నీవువెళ్లి మాట్లాడిరా. నేను ఈ చెట్టుకింద ఆయాసం తీర్చుకొంటాను”

మాస్టారు ఆకాశంకేసి చూడసాగారు. ఒకటో అరో దోబూచులాడుతున్న మబ్బులు కనిపించాయి.

“ఎవరది?” ఖాకీడ్రస్సు మనిషి గేటు దగ్గరకువచ్చి అడిగాడు. బహుశా కాపలా మనిషో, తోటమాలో అయివుండొచ్చు.

“ఏంకావాలి?” నన్నడిగాడు.

“అయ్యగారిని చూడాలి”

“ఇప్పుడు కుదరదు”

నా చింకి బట్టలవైపు చూసే అలా అన్నాడు కాబోలు. అక్కడ ఎజుత్తచ్చన్ ప్రాణాలు పోతూవుంటే… వీనితో ఏం వాదించేది? నమయంవుంటేగా? వాణ్ణి ఓ పక్కకు తోసి నేను గేటులోపలికి దూసుకుపొయ్యాను. “దొంగ! దొంగ! పట్టుకొండి! పట్టుకొండి!” కిందవడ్డ ఆ మనిషి లేస్తూ గట్టిగా అరిచాడు.

ఇంటిముందు కాలుమీద కాలువేసుకొని, కుర్చీమీద కూర్చుని ఇంగ్లీషు పేపరు చదువుతున్న నంబియార్ గారికి నమస్కరించాను. నన్ను చదువుకొన్నవాణ్ణిగా భావించాడనుకొంటా. దొంగకాదనే ధైర్యంతో, తొణక్కుండా నావైపుచూశాడు.

వెడల్పాటి నల్లని అంచుగల లుంగీ, తెల్ల జుబ్బా, మెడలో మెరుస్తున్న బంగారు గులును -ఐశ్వర్యం వుట్టిపడుతోంది నంబియార్ ముఖంలో.

“నీదేవూరు? ఏం పనిమీద వచ్చావు”? నంబియార్ కుర్చీలోంచి కొంచెం కదిలారు. ఆ మహానుభావుడు నన్ను కుర్చీలో కూర్చోమని కాని, కనీసం దగ్గరకు రమ్మని కూడా చెప్పలేదు. నాకేంబాధ అనిపించలేదు. నంబియార్ ఎక్కడ ? అనంత్ ఎక్కడ? వెయ్యిమంది అనంత్ లాంటివాళ్లు కలిసినా ఒక్కనంబియార్తో సమానం కాలేరు.
ఏం జవాబివ్వాలో నాకు తోచిందికాదు.

దేవుణ్ణి తలుచుకొని చెప్పాల్సిందంతా గడగడా చెప్పేశాను. నంబియార్, శ్రద్ధతో విన్నాడు. కాని ఆయన మొహంలో ఎలాంటి భావమూ వ్యక్తంకాలేదు.

“సారీ మిస్టర్… ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరటం మంచిదికాదని వెళ్లి ఎజుత్తచ్చన్‌తో చెప్పు. ఇక నీవు వెళ్లొచ్చు” నంబియార్ నిర్లిప్తంగా చెబుతూ మొహం న్యూస్ పేపర్‌లోకి దూర్చాడు.

“సార్… ఎజుత్తచ్చన్ కొనప్రాణంతో వున్నాడు. అతని కడపటి కోరిక నెరవేరకపోతే అతని ఆత్మకు శాంతి వుండదు”

“ఆత్మ గీత్మ ఇలాంటివేవీ లేవని శాస్త్రవేత్తలు నిరూపించారు. స్వర్గం- మోక్షం ఇలాంటివి అసలేలేవు. నీవు మర్యాదగా ఇక్కడినుంచీ కదుల్తావా లేక…”

“సార్… మీరు పెద్దమనస్సు చూపించాలి దేవుడు మీకు మేలుచేస్తాడు. ఎలాగైనా మీరు…”

“దేవుడు గీవుడు ఎవడూ లేడోయ్… శాస్త్రజ్ఞులు ఈవిషయం ఏనాడో నిరూపించారు” పకపకా నవ్వుతుంటే నంబియార్ బంగారు పళ్లు ఎండలో మెరిసాయి.

ఆయన మనసు కరుగుతుందేమో అని నేను కాస్సేపు అక్కడే నిలబడ్డాను. కాని ఆయన నా వునికినే గమనించకుండా పేవరు చదవటంలో లీనమైపోయాడు. ఇక ఎంత బతిమాలినా ప్రయోజనం లేదని, నేను నిరాశతో కాంపౌండు దాటాను.

“ఇప్పుడేం చేద్దామంటావ్ అనంత్?” చెట్టు కిందినుంచి కదుల్తూ నారాయణ మాస్టారు అడిగాడు.

“మీరు వెళ్లండి మాస్టారు. ఇప్పుడే చావొద్దని మీరు ఎజుత్తచ్చన్ చెప్పండి. ఇంకో అరగంటలో ఆయన కడపటి కోరిక నెరవేరుస్తాను” నేను అక్కడినుంచి కదిలాను.

“అనంత్, ఎక్కడికి పోతున్నావు?”

“మల్లికను ఓసారి చూసొస్తాను మాస్టారూ”

“ఆఁ… ఆయన నోరు వెళ్లబెట్టాడు. నేను మల్లిక ఇంటివైపు నడువసాగాను. మల్లిక ఎవరో మావూరి వాళ్లందరికీ తెలుసు. ఆమె మావూళ్లోని ఓవేశ్య. విరాజపేట నుంచి వచ్చి మావూళ్లోనే వుండిపోయింది. ఆమె తుళు, తమిళం, కన్నడం, మలయాళ భాషలు ధారాళంగా మాట్లాడుతుంది. ముదురు రంగు చీరలు కడ్తుంది. ముఖానికి నాసిరకం పౌడరు పులుముకొంటుంది.

***

“ఎజుత్తచ్చన్ గారూ…” నేను ఆయన మంచంమీద కూర్చొని గట్టిగా పిలిచాను.

“ఎజుత్తచ్చన్ గారూ, ఇలాచూడండి… నంబియార్ గారి భార్యను తీసుకొచ్చాను. కొంచెం కళ్లు తెరవండి. ఆయన కళ్లు తెరవలేడనీ, తెరిచినా మమ్మల్ని సరిగ్గా గుర్తుపట్టలేడని నాకు బాగా తెలుసు.

నేను ఓ మారు ఆయన్ను బాగా కుదిపాను. ఆయన దేహం మంచుగడ్డలా చల్లబడిపోయింది. చుట్టూ మూగిన వారందరూ నిశ్చేష్టులై వుండిపోయారు. ఎజుత్తచ్చన్ గారి మూత పడ్డ కళ్లు కొంచెం తెరుచుకొన్నట్లనిపించింది.

“ఎజుత్తచ్చన్ గారూ, నంబియార్ భార్య … నంబియార్ భార్య వచ్చింది”

నేను మల్లిక చెయ్యితీసి ఎముకలగూడు లాంటి ఎజుత్తచ్చన్ గుండెపై వుంచాను. ఎజుత్తచ్చన్ కళ్లు తెరవకపోయినా, ఆయన కుడిచెయ్యి కొంచెం కదిలింది. ఎండిపోయిన వేళ్లు కాసింత కదిలాయి. ఆయన కుడిచెయ్యి మల్లిక చెయ్యిని కాస్త తాకింది. ప్రేతకళ నిండుకొన్న ఆయన మొహంలో ఓ వెలుగు వెలిగింది అంతే!

నేను చేసింది మంచి పనా? కాదా? ఎన్నోఏళ్ల నుంచీ ఈ ప్రశ్న నన్ను వేధిస్తూ వుంది.

ఎం.ముకుందన్

ఎం.ముకుందన్ గా ప్రసిద్ధి చెందిన మలయాళీ రచయిత మణియంబత్ ముకుందన్ 10 సెప్టెంబర్ 1942 దక్షిణ భారతదేశంలోని పుదుచ్చేరిలో జన్మించారు. కేరళ సాహిత్య అకాడెమీ, కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు, ఎజుతచన్ పురస్కారం వంటి అనేక అవార్డులు అందుకున్నారు.

ఘట్టమరాజు అశ్వత్థనారాయణ

శ్రీఘట్టమరాజు అశ్వత్థనారాయణగారు సుప్రసిద్ధ విమర్శకులు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం తాలూకా రామసాగరం గ్రామంలో జూన్ 6, 1945లో జన్మించారు. ఒకటవ తరగతి నుండి బి.ఏ వరకు అనంతపురంలోనే చదువుకున్నారు. తదనంతరం ఎం. ఏ హిందీ మధ్యప్రదేశ్ లోని సాగర్ విశ్వవిద్యాలయంలో 1965-67 లలో పూర్తి చేశారు. తర్వాత 1967-68 మధ్య హిందూపురం దాసాగోవిందయ్య శెట్టి ఆర్ట్స్, సైన్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో తెలుగు ట్యూటర్ గా పనిచేశారు. 1968-2004 లమధ్యలో కర్నాటక రాజధానైన బెంగలూరులో హిందీ ఉపన్యాసకుడిగా సెయింట్ జోసఫ్ ఆర్ట్స్, సైన్స్ కామర్స్ & విశ్వేశ్వరపురం ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వర్తించి విశ్రాంతి పొందారు.
చిన్నతనం నుండి తెలుగు సాహిత్యంపై మక్కువ పెంచుకొని అధ్యయనం కొనసాగిస్తున్న సందర్భంలో ఎందరో గురువుల పరిచయం వారికి మరెంతో జ్ఞానాభివృద్ధిని పెందింది. ప్రధానంగా ప్రఖ్యాత విమర్శకులైన శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి సాహిత్యాన్ని చదివి బాగా ప్రేరణ పొందారు. వారినే గురువుగా భావించి ఆరాధించి పలవరించారు. మంచి విజ్ఞానం ఏకోశానున్న తేనెటీగాల వాలిపోయే లక్షణం వీరికి మెండు. రాళ్ళపల్లి వారినే స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో విమర్శ వ్యాసాల్ని రాసి పేరు ప్రఖ్యాతులు గడించారు. అంతేకాదు సాహిత్యంలో కొన్ని పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించారు. వాటిలో ఆలిచిప్పలు-ఆణిముత్యాలు, అనంతరాగం, రాళ్ళపల్లి పీఠికలు, రాళ్ళపల్లి సాహిత్య, సంగీత వ్యాసాలు, వదరబోతు చెప్పుకోదగ్గవి. కాగా తాను సుమారు యాబై లేదా అరవై యేళ్ళలో లెక్కకు మించిన పుస్తకాల్ని చదివి చాలా వ్యాసాల్ని వెలువరించారు. అవన్నీ పలు సాహిత్య, మాస, వార, ప్రత్యేక సంచికల్లో ప్రచురితమయ్యాయి. అయితే 2001 నుండి 2004 మధ్యకాలంలో సాహిత్యంలో కొన్ని విశిష్టమైన పుస్తకాలపై వారు రాసిన 30 వ్యాసాలు మూసీ మాసపత్రికలో ధారావాహికంగా అచ్చయినాయి. వాటిని ‘గ్రంథాంతరంగం’ అనే పేరుతో సుప్రసిద్ధ ప్రచురణ సంస్థ ‘ఎమెస్కో’ 2024 డిసెంబర్ లో ప్రచురించింది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *