ఫుతాయ్

Spread the love

‘ఆ లోతు సుదురు’
‘మెల్లకళ్ళు’
‘దొంగ చూపులు’
కణత మీద కాకి కాలిలా ముడతా”
‘మెరిసే ఎర్రని ఎత్తు చెక్కిళ్ళు’
‘చింపిరి చెవులు’
‘ఏ భావం తెలీని ఆ తెల్ల మొఖం’
“అస్సలలా గాలిలో అటూ యిటూ తిప్పే ఆ చేతుల వల్లే మనకు అతని ఆలోచనలు తెలుస్తాయి’
‘ఒంగిపోయి సన్నగా పీలగా కనిపించేవాడు కానీ నిజానికి చాలా బలమయినవాడు.’
‘వేళ్ళ మధ్య అణా బిళ్ళని యిట్టే వంచేయగలడు’
‘అతని బొటనవేలు ఎంత పెద్దదో’
‘సాగదీస్తూ మాట్లాడేవాడు’
‘గొంతు జీరగా వుండేది’

బెర్గరెట్ యింతలో గట్టిగా కేక వేస్తూ ‘జో! మనం అతని పచ్చ జుట్టు, బవిరిగడ్డం సంగతే మర్చిపోయాం! మనం మళ్ళీ మొదలు పెట్టాలి’ అన్నాడు.

పౌలీన్ అంతా అలా తన తండ్రీ, అత్తల వింత మాటల్ని ఆశ్చర్యంగా వింటూ ‘ఏంటి’ మాటల్నీ, వర్ణననీ వచన కవిత్వంలా గుర్తుంచుకున్నారు. అందులోనూ ఏదో పదకీర్తనలా వల్లిస్తున్నారు’ అంది.

‘పౌలీనా! నువిప్పుడు ఏదైతో విన్నావో అదో పవిత్రమైన ప్రార్ధన. నీవు అది వంశపారంపర్యంగా చెప్పాలి. అది నాతోనూ మీ అత్తతోనూ ముగిసిపోకూడదు తెలుసా!’ అన్నాడు వాళ్ళ నాన్న సమాధానంగా

‘మీ తాతయ్య వున్నాడే ఆయనకి బలే చాదస్థంలే. చిన్న చిన్న విషయాల్ని మర్చిపోయినా వూరుకోడు ఆయన! ఆ పదకీర్తనలో ప్రతీ మాటకూ చాలా విలువనిచ్చేవాడు. ముఖ్యంగా అది ఎలా పుట్టిందో ఆయనకు తెలుసు కాబట్టి దానికి ఆయన “ఫుతాయ్ నఖశిఖ పర్యంతం” అని పేరు కూడా పెట్టాడు. యిక ఆ వర్ణనని.. అన్ని చెప్పుకోదగ్గ వర్ణనల కన్నా ఎంతో గొప్పగా, అరుదైనదీ, అద్భుతమైనదన్నట్లు చెప్పేవాడు. ఎంతో సరళంగా స్పష్టమైన శైలిలో వున్నట్లు భావించేవాడు’.

‘నాకేమీ అర్ధం కావడంలేదు’ అంది పౌలీన్.

‘ఎందుకంటే- నీకు ఫుతాయ్ తెలీదురా తల్లీ! మీ నాన్నాకీ, అత్తకీ చిన్నతనంలో ఫుతాయ్ కన్నా బాగా తెలిసిన వ్యక్తే ఎవరూ లేరని తెలుసా! అసలు మీ తాతగారింట్లో ఫుతాయ్ అంత వాడుక పదం మరొకటి లేదు. నిజం చెప్పాలంటే మేమంతా అతన్ని చూసినట్లే నమ్మేవాళ్ళం.

‘ఆ! అయితే యీ ఫుతాయ్ ఎవరు? ఆశ్చర్యంగా అడిగింది పౌలీన్.

సమాధానం చెప్పకుండా నవ్వడం మొదలెట్టారు వాళ్ళ నాన్న, అత్తయ్యలు. అత్తయ్య మామూలు ప్రకారం పెదాలు విప్పకుండానే నవ్వుతోంది.

పౌలీన్ ఒక్కొక్కళ్ళనీ మార్చి మార్చి చూస్తోంది. ఆశ్చర్యంగా, విచిత్రంగా వుందామెకు. అస్సలు నాన్న యింతలా నవ్వగలరా అనిపించింది. అందులోనూ ఒకే విషయం మీద! వాళ్ళిద్దరి ఆలోచన్లే తలోదారిగా వుంటాయెప్పుడూ.

‘ఈ ఫుతాయ్ ఎవరో చెప్పు నాన్నా! అతని గురించి నేను తెలుసుకోవాలన్నావుగా’ అడిగింది.

‘పుతాయ్! ఎవరంటే తల్లీ! మా తోటమాలీ! అర్తాయ్ ప్రాంతపు నిఖార్సన రైతు బిడ్డ. సెయింట్ ఒమర్‌లో నర్సరీ పెట్టాడు. కానీ సరిగ్గా జనంతో మెలగలేకా, వ్యాపారం చేయలేక నష్టపోయాడు. అతన్ని పనిలో పెట్టుకున్న వాడెవ్వడూ నిమిషం సుఖంగా వుండలేడు’.

ఆ మాటలు వింటూనే మిస్ బెర్గరెట్ నవ్వుతూ అంది ‘అరే!గుర్తుందా! నాన్నగారు యింకు సీసానో, పెన్నులో, లక్కో, కత్తెరో ఆయన టేబుల్ మీద కనిపించకపోతే ‘ఫుతాయ్‌గానీ, యిటువచ్చి వెళ్ళాడా?’ అని అడిగేవాడు కదూ!

‘ఏం చెప్పమంటావ్! ఫుతాయ్‌కి అంత మంచి పేరు లేనే లేదు!’

‘అంతేనా!’ అంది పౌలీన్.

‘అలా కాదులే కానీ! అలాగనీ కాదు కానీ! ఫుతాయ్ విషయంలో ఒక తిరకాసు వుంది. అతను మాకు తెలుసు. మాకు చాలానే పరిచయం వున్నట్లే కానీ…. అతనంటూ ఎవరూ లేరు’ అంది జో.

‘అలా చెప్పేస్తావేంటే!’ విసుగ్గా అన్నాడు బెర్గరెట్.

‘అలా మిస్టరీని విడగొట్టేస్తావేం? నిజమే! ఫుతాయ్ అనేవాడే లేడని నిజంగా ధైర్యంగా అనగలవా? అలా అని ఆమాట మీద నిలవగలవా? జో చెప్పు? అలా ఫుతాయ్ అనే వ్యక్తి లేడని, ఎప్పుడూ ఈ సృష్టిలో లేడని అనేముందు అసలు వుండటం అంటే ఏమిటి? ఉనికి అనేది ఎన్ని విధాలు అని ప్రశ్నించుకోవాలి. ఫుతాయ్ వున్నాడు… వున్నాడు కానీ అతని వునికి ఓ ప్రత్యేకమైనది’ అన్నాడు.

‘నాకు అస్సలేమి అర్ధం కాకుండా పోతోంది’ అంది నీరసపడిపోతూ పౌలీన్.

‘ఒక సత్యం నీముందు ఆవిష్కారమౌతోంది. ఫుతాయ్ పుట్టడమే యుక్త వయస్కుడిగా పుట్టాడు! నేను అప్పటికి చాలా చిన్న పిల్లాడిని మీ అత్తయ్య కూడా చిన్నపిల్లే. మేమోచిన్నింట్లో వుండేవాళ్ళం. మా తల్లితండ్రులు ప్రశాంతమైన రిటైర్డ్ జీవితాన్ని గడుపుతూ వుండేవాళ్ళు. వాళ్ళ జీవితంలోకి ఆ పక్క పట్నంలో వున్న ఓ ముసలావిడ ప్రవేశించిందాకా! అవిడ పేరు కార్మిలియే. పక్కనేవున్న యెన్‌ప్లాసిర్ పట్నంలో పెద్ద రాజ భవంతిలో వుండేది. సుమారు మా ఊరికి 12 మైళ్ళు దూరమనుకుంటాను. కర్మకాలి ఆవిడ మా అమ్మకు అమ్మమ్మ తరపు వేలువిడిచిన మేనత్తనుకో! యిక ఆ సంబంధాన్ని పట్టుకొని ఆవిడ ప్రతీ ఆదివారం మధ్యాహ్నం భోజనానికి వాళ్ళ భవంతికి రమ్మని మా వాళ్ళని బలవంతం చేసేది. వీళ్ళకేమో పరమ బోరు. అలా చుట్టాలు చుట్టాలు కలిసి తినడం మన ప్రాచీన ఆచారమని, మరీ సంస్కారం లేనివాళ్ళు అలాంటి ఆచారాల్ని పట్టించుకోరని ఆవిడ వీళ్ళని ఊదరగొట్టేది. నాన్న పాపం భయంకరంగా విసిగిపోయేవాడు. ఆయన బాధ చూస్తే జాలేసేది. కానీ ఆ ముసలావిడ ఏమీ పట్టించుకునేది కాదు. అమ్మ పాపం ఏదో కాస్త భరించేది. నాన్నంత లేదా యింకాస్త ఎక్కువే బాధపడినా, ఎలానో మొఖం మీద నవ్వు తెచ్చుకునేది’

‘ఆడాళ్ళు బాధలు భరించడానికే పుట్టేది!’ అంది జో.

‘అసలు ప్రతీ ప్రాణి బాధలు అనుభవించడానికేగా పుట్టేది. అమ్మా నాన్న ఎంత ప్రయత్నించినా, కాదన్నా ఆవిడ పిలుపుల్నుంచి తప్పించుకోవటం వీలయ్యేది కాదు. కార్మిలియే బగ్గీ ఆదివారం మధ్యాహ్నమయ్యేసరికి యింటి ముందుండేది. యిక వాళ్ళకి వెళ్ళక తప్పేదికాదు. మొహమాటంతో తప్పించుకోలేక పోయేవాళ్ళు. యిక అది పాతుకుపోయిన ఆచారమయ్యే. ఒక్క విప్లవమే దాన్ని మార్చగలదు. యిక ఓర్చుకోలేక నాన్న తిరుగుబాటు లేవదీశాడు. యిక ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ముసలావిడ యింటికి పోనని ఒట్టేసుకు కూర్చున్నాడు. పాపం అమ్మకు మాత్రం తప్పలేదు. ఏదో ఒక గౌరవప్రదమైన సాకు వెదికే పని ఆవిడ మీద పడింది. అలాంటి పనికి ఆవిడ ఏమాత్రం పనికిరాదు. కపటంగా సాకులు చెప్పటం ఆమెకు చేతగాని పని. నిజం చెప్పాలంటే మంచి మంచి కారణాలున్నప్పుడు కూడా ఆవిడ ఎందుకూ పనికిరాని కారణాల్ని వెదుక్కునేది. ఓసారి యిలాగే హమ్మయ్య! అదృష్టం బావుండీ ‘జో’ కి కోరింతదగ్గు వచ్చింది. మనం చాలా రోజులు, అవిడింటికి పోనఖ్ఖరలేదని సంతోషించింది.

‘అవును నిజమే’ అంది జో.

‘నువ్వు కోలుకున్నాక ఓ రోజు ఆవిడ దిగింది.

‘అమ్మాయీ! నువ్వూ మీ ఆయనా ఈ ఆదివారం మావూరు భోజనానికి వస్తున్నారుగా!’ అంది. అప్పుడు అవసరానికి కావల్సిన అబద్ధం దొరక్క, ఆ అత్యవసర పరిస్థితుల్లో ఎందుకూ కొరగాని, అర్ధంలేని సాకును వెదుక్కుంది అమ్మ. ‘అయ్యో! ఆదివారం నాకు వీలు కాదు. ఆరోజు తోటమాలి వస్తాడు.’ అంది! ఆ మాట వినగానే ఆ ముసలామె డ్రాయింగ్‌రూమ్ మెరిసే అద్దాల్లోంచి బయట దూరంగా పిచ్చిగా పెరిగిన మా తోటను చూసింది. అక్కడ చెట్లు, మొక్కలు జన్మలో కత్తెర మొఖం చూడనట్లు కనిపిస్తున్నాయి.

‘ఏంటీ! తోటమాలి వస్తాడా? దేనికీ ఈ తోటలో పనికా?’

అమ్మ ఒక్కసారి అనుకోకుండా ఆ పిచ్చిగా మొలిచిన గడ్డి, అడ్డదిడ్డంగా వున్న మొక్కల్నిచూసి నాలుక్కరుచుకున్నంత పని చేసి తాను ఏంచెప్పినా అది ఉత్తమాట అయిపోతుందన్నట్లు చూస్తోంది.

‘అసలు అతను సోమవారమో, మంగళవారమో మీ తోటపనికి రావచ్చుగా! ఆ రోజుల్లో పని చేయించుకోవటం మంచిది. మరీ ఆదివారం పని చేయటం తప్పు కదూ! ఏం వారమంతా అంత పనుంటుందా అతనికి?’ అడిగింది ముసలామె.

ఒక్కోసారి యిలాంటి పనికిరాని, అర్ధం పర్ధంలేని కారణాలు కూడా సమాధానాలు దొరక్కుండా తయారయ్యి ప్రత్యర్థుల్ని కలవరపెడుతుంటాయి. ఎంత విషయం వదిలేద్దామనుకున్నా మళ్ళీ మళ్ళీ చుట్టుకుంటూ జిడ్డుగా తయారవుతాయి.

‘యింతకూ మీతోటమాలి పేరేమిటి?’ అంది ముసలావిడ వొత్తిపలుకుతూ కూర్చీలోంచి లేచి.

అమ్మవెంటనే చెప్పింది ‘ఫుతాయ్’.

ఫుతాయ్‌కి పేరంటూ ఒకటొచ్చింది. ఆ తర్వాత ఈ బాధ్యతంతా యిక అతనిదే.

‘ఫుతాయ్! ఆ పేరు నాకు తెలిసినట్లుందే! ఫుతాయ్! అరే! ఆ! నాకతను బాగా తెలుసే! కానీ సరిగ్గా గుర్తుకురావటం లేదు. జనానికి అవసరమైనప్పుడు అతని కోసం అతని యజమాని యింటికి కబురంపేవారు కదా! ఆ ఫుతాయ్ గాడా? బికారి! తిరుగుబోతు! వాడు ఎందుకూ పనికిరాని వాజమ్మ! నువ్వు కాస్త జాగ్రత్తగా వుండమ్మాయి వాడితో’ చెప్పింది ముసలావిడ.

యిక ఫుతాయ్‌కంటూ కాసిన్ని లక్షణాలు మొదలయి, ఉనికిలోకి వచ్చేశాయి.

బెర్గరెట్ స్నేహితులు గోబెన్, జీన్ మార్తో యింట్లోకి వచ్చారు. బెర్గరెట్ ఏ విషయం మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పాడు.

‘మేము ఒకతని గురించి మాట్లాడుకుంటున్నాం. అనుకోకుండా అతను సృష్టిలో వుండటానికి మా అమ్మ కారణమయింది. ఆమె అతన్ని సృష్టించింది. అంతే అప్పట్నించీ అతను ఈ భూమ్మీద వుండటం మొదలెట్టాడు’.

‘క్షమించాలి! యింకొక్కసారి మళ్ళీ చెప్తారా’. కళ్ళజోడు తుడుచుకుంటూ అడిగాడు గోబెన్.

‘ఎంచక్కా చెప్తా’ అంటూ ‘అక్కడసలు ఏ తోటమాలీ లేడు. మా అమ్మ అనుకోకుండా’ తోటమాలి వస్తానన్నాడు. చూస్తున్నాం’ అని చెప్పింది. అంతే! అలా తోటమాలి వున్నట్లే, అతను బతుకుతున్నట్లే అయిపోయింది’ చెప్పాడు బెర్గరెట్.

‘అయ్యా! మహానుభావా! అసలామనిషి లేకపోతే ఎలా భూమ్మీద బతికిస్తున్నట్లు అవుతుందో శలవిస్తారా?’ అడిగాడు. జీన్‌మార్తో.

‘ఏముందీ అతను నిజంగా వుంటే ఎలానో అలాగే’. అన్నాడు బెర్గరెట్.

‘అంటే అతను ఊహల్లో వున్నట్టా!’ అన్నాడు ఎకసెక్కెంగా గోబెన్.

‘ఊహల్లో వున్నట్లు కాదు! అసలంటూ వున్నట్లే!’ అరిచాడు ప్రొఫెసర్ బెర్గరెట్.

‘ఏం మన పురాణ పురుషులు మనుష్యుల్ని ప్రభావితం చేయడంలా! ఆలోచించండి గోబెన్ గారూ! మన పురాణాలు మన మనస్సుకు తెలుసు. నిజం పాత్రలు కాకపోయినా అవి మన జీవితాల్ని, మన ప్రవర్తనల్నీ గాఢంగా ప్రభావితం చేస్తాయి. ఆ ఊహజనిత పాత్రలే కలకాలం గుర్తుండిపోతాయి. అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ, యిలాంటి వాళ్ళే ఫుతాయ్ కన్నా ఏమాత్రం నిజం కాని వాళ్ళే దేశాల్ని ప్రేమతో, ద్వేషంతో, భయంతో, ఆశలతో ఊపేశారు. వాళ్ళు ప్రజల్తో నేరాల్ని, సాహసాల్ని చేయించారు. హారతుల్ని అందుకున్నారు. మనుష్యుల ప్రవర్తనని, చట్టాల్నీ మలిచారు. గోబెన్! యితిహాసాల్ని గుర్తుతెచ్చుకో. ఫుతాయ్ కూడా ఒక పౌరాణిక పాత్రే. మరో అనామకమైన, అతి సామాన్యమైన క్రమంలోదే అనుకో. కానీ అనాగరిక అనామకుడు మన ఉత్తరప్రాంతపు రైతుల్తో దర్జాగా కూర్చున్నట్లు జోర్దో చిత్రాల్లో చూడలేదా? సైకోరాక్స్ షేక్‌స్పియర్ అద్భుతమైన ప్రపంచంలోంచి పరిచయం కాలేదా? మన ఫుతాయ్‌కి అంత అదృష్టం లేదనుకో! అతన్ని మన రచయితలు, కళాకారులూ నిర్లక్ష్యం చేస్తూనే వుండొచ్చు. ఆ పాత్రలంత అభిజాత్యం, మార్మికత, ప్రత్యేకత మనవాడికి లేకపోవచ్చు. చెప్పుకోతగినన్ని లక్షణాలు లేకపోయుండొచ్చు. పాపం! అతను మరీ సాదాసీదాగా, సక్రమంగా ఆలోచించే మనస్సులోంచి పుట్టాడు. అతను అతి సామాన్యమైన, కాస్త రాయటం, చదవటం తెల్సిన అతి మామూలు మనుష్యుల నుంచి పుట్టాడు. వాళ్ళు యితిహాసాలు, అద్భుత సాహిత్యాన్ని ఊహించి రాసేంత సామర్థ్యం వున్నవాళ్ళు కారు. యిప్పటికైనా ఫుతాయ్ గురించిన అసలు విషయాన్ని నీకు అర్ధమయ్యేలా చెప్పాననే అనుకుంటున్నా!” అన్నాడు బెర్గరెట్.

‘ఆ! అర్థమైంది’ అన్నాడు గోబెన్.

‘ఫుతాయ్ వున్నాడు అనేదాంతో నేను ఏకీభవిస్తున్నాను. అతను చాలా మామూలు మంచి వ్యక్తనీ, అసలు ఒకని ఉనికి అంటే అలా వున్నట్లే కానీ, ఉండటానికి నిజంగా పదార్ధంగా శరీరంతో వుండాలని ఏమీలేదనీ అర్ధం అవుతోంది. అది ఒక వ్యక్తికీ, అతనిని మనమెంచే గౌరవార్ధానికీ మధ్యనున్న సంబంధం మాత్రమే’ అన్నాడు గోబెన్.

‘అందులో సందేహమేముంది! ఏ లక్షణమూ ఆపాదించుకోలేకపోతే అసలక్కడ ఏం లేనట్లే. ఎవరో ఎప్పుడో అన్నారు. ‘నేనేమిటో నేనే’ అని సరిగ్గా గుర్తుకురావటం లేదు. అయినా అన్నీ అంతలా జ్ఞాపకం వుండటం కష్టంలే!’ అన్నాడు బెర్గరెట్.

ఆ బుద్ధిలేని మాటల్తో అతను చెప్పొచ్చేదేమిటి? అతన్ని వర్ణించడానికి ఏ లక్షణమూలేదని, ఏ సంబంధాల్తో తూలనాత్మకంగా చెప్పలేమనీ చెప్పడం ద్వారా అతను తనకంటూ ఒక ఉనికిని ఆపాదించుకో లేకుండా చేసుకొని తననితానే కనిపించుకోకుండా చేసుకున్నాడు. యిక అతన్ని గురించి మళ్ళీ ఎవరూ వినలేదనే అనుకొంటున్నారు.

‘నీ మాటల్లో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు!’ అన్నాడు గోబెన్.

‘అదేమంత ముఖ్యం కాదులే!’ అన్నాడు బెర్గరెట్.

ఫుతాయ్ గురించి యింకా చెప్పమని అడిగాడు మార్తో.

‘నువ్విలా అడగటం చాలా సంతోషంగా వుంది’ అంటూ మొదలెట్టాడు ప్రొఫెసర్.

‘ఫుతాయ్ పందొమ్మిదో శతాబ్దం రెండో భాగంలో సెయింట్ ఒమర్‌లో పుట్టాడు. పాపం అతను యింకొన్ని శతాబ్దాల క్రితం ఏ అర్డెన్ అడవుల్లోనో, బార్సిలాండో అరణ్యాల్లోనో పుట్టుంటే మాంచి తెలివైన భూతంలా చక్కని పేరు వచ్చుండేది.’

‘అంకుల్’ టీ’ అంటూ పౌలీన్ వచ్చింది.

‘ఫుతాయ్ భూతమా?’ అడిగాడు జీన్‌మార్తో.

‘ఒకలా చూస్తే చెడ్డవాడే కానీ మరీ అంత దుష్టుడేమీ కాదు. అతనెలా అంటే కొన్ని భూతాల గురించి చాలా భయంకరంగా వింటుంటాం. కానీ మనకు వాటి గురించి తెల్సినకొద్దీ వాటిలో మంచి లక్షణాలు కన్పిస్తుంటాయి. నాకెప్పుడూ అన్పిస్తుంటుంది ‘ఫుతాయ్‌కి న్యాయం జరగలేదని’ కార్మిలియే అతనంటే ఒక దురభిప్రాయంతో మొదలుపెట్టి, అతన్ని వెంటనే ఓ పనికిరానివాడుగా, తాగుబోతుగా, ఒక దొంగగా అనుమానించేసింది. నిజానికి ఆవిడ మనస్సుతో ఆలోచిస్తే అతన్ని సామాన్యురాలైన మా అమ్మ పనిలో పెట్టుకొంది అతను బహుశా ఎక్కువ జీతం అడిగుండకపోయుండొచ్చు. అతన్ని తాను పనిలోకి తీసుకుంటే బావుండేదేమో. తన తోటమాలి మంచి పనివాడే కానీ ఎక్కువ అడుగుతాడు. తన అవసరాలు గుర్తుకొస్తున్నాయి ఆవిడకు. చెట్లని కత్తిరించే సమయం వస్తోంది. యిలా బెర్గరెట్ కుటుంబం తక్కువ జీతానికి పనికి పెట్టుకుంటే, యింకా తక్కువ జీతానికి తను పని చేయించుకోవచ్చు కదా! అసలెప్పుడూ ధనవంతులు, పేదవాళ్ళతో తక్కువ జీతానికి పని చేయించుకోవడం అలవాటేగా! ఆవిడ కళ్ళకు తన యింటిముందు పెరిగిన ‘యూ’ చెట్లన్నీ చక్కగా ప్రహరీ గోడల్లాగో, గోళాల్లాగో, పిరమిడ్‌ల్లాగో చక్కగా కత్తిరించివున్నట్లు కనిపిస్తున్నాయి. అందునా అతి తక్కువ ఖర్చుతో! ‘నేనతని సంగతి చూసుకుంటానులే’ అనుకుందామె. ‘అతను వెధవ పనులు చేయకుండా, దొంగతనం చేయకుండా’ చూసుకోగలను అని ఆవిడనుకుంది. నీకేం నష్టం కాస్తంత ఆదాకూడా అవుతుంది. అసలిలాంటి రోజువారీ కూలీలు పని తెల్సిన వాళ్ళకన్నా బాగా చేస్తారు అప్పుడప్పుడు ఏమైతేనేం యిదో ప్రయోగం అనుకుంటాను అని నిశ్చయించుకొంది. ‘ఒకసారి ఫుతాయ్‌ని నా దగ్గరకు పంపు’ అంది అమ్మతో.

పాపం అమ్మ! నిజంగా ఆత్మని పంపడం వీలైతే పంపి వుండేదే. కానీ ఎలా వీలవుతుంది. ఆ ముసలామె అతనికోసం ఎదురుచూస్తోంది. ఎన్నాళ్ళయినా ఫలితంలేదు. ఆవిడ వదుల్తుందా! ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ తన నిర్ణయాన్ని మార్చుకోదల్చుకోలేదు.

‘అమ్మాయి.  ఫుతాయ్‌కి చెప్పలేదా.. నేను రమ్మన్నానని… అతనికోసం ఎదురు చూస్తున్నానే’ అనేది.

‘ఆ! అతనో విచిత్రమైనవాడు… కాస్త తలతిక్క మనిషి’ అనేది అమ్మ

‘ఆ! యిలాంటి వాళ్ల సంగతి నాకు కొత్తా! ఈ ఫుతాయ్ పుట్టు పూర్వోత్తరాలు నాకు తెల్సులే!’ అనేది.

‘మా భవనానికి పనిలోకి రాకూడదునుకునే పిచ్చివాడు ఎవడూ వుండడు. ఈ ప్రాంతంలో బాగా పేరున్న యిల్లు మాది. ఫుతాయ్ ఒక్కసారి వచ్చాడంటే నేను పని చేయించుకోగల్ను! యింతకూ అతనెక్కడుంటాడో చెప్పు! నేనే వెళ్ళి పిల్చుకొస్తాను’ అందాముసలామె పట్టువిడవకుండా.

అమ్మ బిక్కచచ్చి ‘అతనెక్కడుంటాడో తెలియదు. అతనికో యిల్లూ, వాకిలీ అడ్రస్ లేనట్లుంది. అతన్నీమధ్య నేను చూడలేదు. ఎక్కడో మాయమైపోయాడు’ అంది.

ఆమె పాపం సత్యానికి చాలా దగ్గరగా వచ్చిందనే అనుకోవాలి.

కార్మిలియే కాస్త నమ్మనట్లుగా చూసింది. అమ్మ కావాలనే అతని గురించి దాస్తోందనుకొంది. ఫుతాయ్‌ని పనికి పంపిస్తే తన పనివాడ్ని పొగొట్టుకొంటానేమోననే భయంతో పంపకుండా దాటేస్తోందని అనుకొంది. మనస్సులోనే ఆమెను భయంకరమైన స్వార్థపరురాలిగా చిత్రీకరించేసుకొంది. చరిత్రలో చాలా తీర్పులకు అభిప్రాయాలకు యింతకన్నా పెద్ద పునాదులున్న దాఖలాలు కన్పించవు.’

‘నిజమే!’ అంది పౌలీన్.

‘ఏది నిజం!’ అంది జో సగం నిద్రలోంచి లేస్తూ.

‘చరిత్రలోని సత్యాల్లో చాలావరకు అసత్యాలేనని ఓసారి నువ్వే అన్నావుగా నాన్నా! నిష్పాక్షికమైన భావితరం వుండాలని మస్ రోలాండ్ ఎప్పుడూ అంటూ వుంటుంది. అసలు తనతో జీవిస్తోన్న ఈ తరంవారే నమ్మలేకుండా పక్షపాత ధోరణిలో వుంటే వచ్చే తరం కూడా అలానే వుంటుందనే సత్యం ఆవిడకు ఈపాటికే అర్ధమవ్వాలి కదా అనేవాడివి కదా నాన్నా!’ అంది పౌలీన్.

‘పౌలీన్! దానికీ మన ఫుతాయ్ కథకు సంబంధం ఏమిటి?’ అడిగింది జో.

‘చాలానే వుందిలే అత్తా!’

‘నాకేమీ కనిపించడం లేదోయ్!’

వాళ్ళ వాదన కొనసాగుతుండగానే మధ్యలో మొదలుపెట్టాడు బెర్గరెట్. ‘జరిగిన ప్రతీ అన్యాయాన్నీ సరిచేయగలిగితే యింకో అన్యాయం చేయాల్సిన అవసరమంటూ వుండనే వుండదుగా! భావితరాలు గతించిన వారిని ఎలాంటివారో నిర్ణయిస్తారు. వాళ్ళని ఏ కోణంలో విచారించి తెల్సుకోవాలో, ప్రశ్నించాలో తెలుసుకుంటే బాగానే వుంటుంది. వాళ్ళు నిర్దోషులని తెలియగానే వాళ్ళని మర్చిపోతాం. అస్సలు న్యాయసమ్మతంగా వుండటం సాధ్యమవుతుందా? అసలు న్యాయమంటే ఏమిటి? ఏది ఏమైనా చివరకు, కార్మిలియే మా అమ్మ తనను మోసం చేయటంలేదనీ, ఫుతాయ్, ఆవిడకు కన్పించలేదనే విషయాన్ని ఒప్పుకోక తప్పలేదు. అంతేకాదు ఆవిడ అతని కోసం వెదకడం కూడ మానలేదు. తన చుట్టాల్నీ, స్నేహితుల్నీ, చుట్టుపక్కల వాళ్ళనీ, పని వాళ్ళనీ, వ్యాపారుల్నీ ఆవిడ ఫుతాయ్ గురించి అడుగుతూనే వుంది. అందులో ఒకళ్ళు యిద్దరో మాత్రమే అతని గురించి ఎప్పుడూ వినలేదని అన్నారు. చాలామంది అతన్ని ఎక్కడో చూశామనే అనుకున్నారు. అతని పేరు విన్నాను కానీ మొహమే గుర్తుకు రావడం లేదు అంది వంటావిడ. అరే! అతను నాకు బాగా తెల్సుగా! రోడ్డు సర్వేయర్ చెవిగోక్కుంటూ చెప్పాడు. కానీ ఫలానా అని మాత్రం చూపించలేనన్నాడు. కానీ రిజిస్ట్రార్ బ్లేజ్ గారు ‘నేను మా యింట్లో చెట్లు నరకడానికి పనిలో పెట్టుకున్నాను. తోకచుక్క కనిపించిన సంవత్సరం అక్టోబర్ 19 నుంచి 23వరకు’ అని ఖచ్చితంగా చెప్పాడు.

ఒకరోజు పొద్దున్నే కార్మిలియే గబగబా రొప్పుతూ మానాన్న గదిలోకి వచ్చింది. ‘యిప్పుడే ఫుతాయ్‌ని చూశాను – నిజంగానే చూశాను అలా అనుకున్నానా? కాదు నిజంగానే చూశా! వాడు టన్‌షాన్ గారి ప్రహరీగోడ మీదనుంచి జారుతూ దిగుతుంటే చూశాను. పక్కవీధి చివర్లోకి తిరిగి గబగబ నడిచిపోయాడు. తర్వాత కనిపించలేదు. సందేహం లేదు, యాభై ఏళ్ళోండొచ్చు. సన్నగా కాస్త ముందుకొంగి నడుస్తున్నాడు. బికారీ వెధవలా వున్నాడు మాసిపోయిన కోటుతో” అంది.

‘అలానా! అయితే ఫుతాయ్ అయ్యుండొచ్చు’ అన్నాడు నాన్న.

‘అవును, నేను పేరు పెట్టి పిల్చాను కూడా ఫుతాయ్ అని. అతను వెనక్కి తిరిగి చూశాడు. డిటెక్టివ్స్ ఎవరైనా దొంగని గుర్తించాలంటే అలానే వెనకతాలుగా పిలచి గుర్తిస్తారు తెలుసా! నే చెప్పలే… అది వాడే. మొత్తానికి మీ ఫుతాయ్‌ని పట్టేసానుగా! వాడి మొహం తగలడ… చూడ్డానికి చాలా దుష్టుడిలా వున్నాడు. మీరు మరీ బుద్ధిలేకుండా అలాంటి వాడిని పనిలో ఎలా పెట్టుకున్నారో అర్ధంకావటం లేదు.

అతనెలాంటివాడో మొఖంమీద అచ్చంగా రాసుంది. నేను అతని వీపు మాత్రమే చూశాననుకో! కానీ నామీదొట్టు వాడు ఖచ్చితంగా పెద్దదొంగ. వాడసలు హంతకుడయినా అయుండొచ్చు. వాడి చింపిరి చెవులే చెబుతున్నాయి వాడెలాంటి వాడో.’

‘అహో! అతని చెవుల్ని కూడా మీరు చూశారా? చింపిరిగా వున్నట్టు గుర్తించారా!’ అడిగాడు నాన్న.

‘నా కంటినుండి ఏదీ తప్పించుకోలేదు బాబు! నువ్వు నీ భార్య పిల్లల్తో హత్య కాకుండా బతికుండాలనుకుంటే ఆ ఫుతాయ్‌ని యింట్లోకి అడుగు పెట్టనివ్వద్దు. నామాటగా చెప్తున్నా యింటి తాళాలన్నీ మార్చేసి కొత్తవి వేయించుకో’ అంది.

కొన్నాళ్ళకి కార్మిలియే తోటలోంచి మూడు పుచ్చకాయల్ని ఎవరో దొంగిలించారు. దొంగెవరో దొరకలేదు. ఆవిడకు మాత్రం ఫుతాయ్ మీదే అనుమానం. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్ళుకూడా ముసలావిడ అనుమానాన్ని నిజంగా నిర్ధారించారు దొంగల గుంపులు పల్లె ప్రాంతాల్లో తోటల్ని దోచుకొంటూ వున్న రోజులవి. కానీ ఈ దొంగతనం మాత్రం ఒకే వ్యక్తి చాలా చాకచక్యంగా చేసినట్లుంది. ఏ వస్తువుకీ తగలకుండా, తడినేలమీద కనీసం ఒక్కపాద ముద్రయినా పడకుండా చేశాడంటే ఆ దొంగ ఫుతాయ్ తప్ప మరెవ్వరూ అవడానికి వీలులేదు. యిది మన పోలీస్ సార్జెంట్ గారి అభిప్రాయం. ఆయనకు ఫుతాయ్ గురించి ఆసాంతం తెలుసు. అతన్ని పట్టుకోవాలని ఎంతో ప్రయత్నిస్తూనే వున్నాడాయన.

సెయింట్ ఒమర్ వార్తా పత్రికలో కార్మిలియే మూడు పుచ్చకాయల విషయం పడింది. అందులో ఫుతాయ్ గురించి ఊరంతా అనుకొంటున్న వర్ణనంతా పూర్తిగా వుంది.

‘అతని నుదురు లోతుగా వుంది, మెల్లకళ్ళు, నిలకడగా నిలవని చూపులు, కణత మీద ముడతలు, ఎత్తుగా మెరిసే ఎర్రని చెక్కిళ్ళు, చింపిరి చెవులు, బక్కగా.. పీలగా ముందుకొంగినట్లు కనిపిస్తాడు. కానీ ఊహించనంత బలంగా… అణాబిళ్ళని బొటనవేలు, చూపుడు వేళ్ళ మధ్య పెట్టి ఆ పట్టానే వంచేయగలడు’. ఊళ్ళో యింతకుముందు చాకచక్యంగా జరిగిన దొంగతనాలన్నింటికీ అతనే ఎలా బాధ్యుడో కారణాలను పూసగుచ్చినట్లు వివరించింది ఆ పత్రిక.

ఫుతాయ్ పేరు అట్టుడికిపోతుంది. ఒకరోజు ఫుతాయ్ అరెస్టయ్యాడని, జైల్లో పెట్టారని అన్నారు. అంతలోనే అతను ఫుతాయ్ కాదని ఎవరో రిగోబర్ట్ అనే వాడని తెల్సింది. అతన్ని ఓ పక్షం రోజులు జైల్లోవుంచి పరిశీలించి యిక ఏ నేరమూ మోపలేక అతన్ని వదిలేశారు. ఫుతాయ్ యింకా దొరక్కుండానే తిరుగుతున్నాడు. యింతలోనే యింకో భయంకరమైన దొంగతనానికి పాపం కార్మిలియే బలయిపోయింది. అవిడ బీరువాలోంచి మూడు వెండి చెమ్చాలు మాయమయ్యాయి. దొంగ ఎవరో తెలియలేదు కాబట్టి ఆమె అది ఫుతాయ్ చేతివాటమనే గుర్తించింది. తన బెడ్‌రూమ్‌కి యింకో గొళ్ళెం పెట్టించుకొని రాత్రంతా కునుకు లేకుండానే గడుపుతోంది.

రాత్రి పదయింది.

పౌలీన్ కునికిపాట్లు పడుతోంది.

‘ఫుతాయ్ కార్మిలియే వాళ్ళ వంటామెను ఎలా వలలో వేసుకున్నాడో చెప్పడం మర్చిపోకేం’ అంది బెర్గరెట్‌తో జో.

‘నేనూ అదే అనుకొంటున్నా! అసలు కధలో ఆ భాగం వదిలేస్తే అసలుసిసలైన వ్యవహారాన్ని వదిలేసినట్లేగా! కానీ అది చెప్పాల్సిన సమయంలో చెప్తాంలే’ అన్నాడు బెర్గరెట్.

‘పోలీసులు ఫుతాయ్ గురించి వెదుకుతూనే వున్నారు. కానీ పట్టుకోలేకపోయారు. యిక అతడు దొరకడని తెల్సాక అతడ్ని పట్టుకోవడం గొప్ప సాహసంలా అందరూ భావించడం మొదలుపెట్టారు. అందునా కొందరు కొంటె బుద్ధులకు అడ్డూఆపు లేకపోయింది. సెయింట్ ఒమర్ పట్నంలో, చుట్టుపక్కల్లో అలాంటి వారికి కొదువలేదు. ఫుతాయ్ వీధిలో, పొలంలో, అడవిలో ఒకే సమయంలో కనిపించినట్లు చెప్పేవారు. యిక యింకో లక్షణం అతని పాత్రకు చేరింది. అతనికి ఈ అదృశ్యమయ్యే లక్షణాన్ని ఆపాదించారు చాలామంది ప్రఖ్యాతి పొందిన కథానాయకుల్లాగే. చిటికెలో ఎంతోదూరం ప్రయాణం చేసే వ్యక్తిగా, అకస్మాత్తుగా అనుకోని ఊహించని స్థలంలో కనిపించి అదరగొట్టేవాడిగా చిత్రీకరించారు. ఫుతాయ్ అంటే సెయింట్ ఒమర్ అంతా భయంతో వణికిపోతోంది. ముసలి కార్మిలియే అయితే పుచ్చకాయలూ, మూడు చెమ్చాలూ ఫుతాయ్ దొంగిలించాడని పూర్తిగా నమ్మేసింది. తన పెద్ద భవనంలో నిత్యం భయంతో బతికేది. అడ్డు గొళ్ళాలు, గడులు, తాళాలు ఆమెకు ధైర్యాన్నివ్వలేకపోయాయి. ఆవిడ దృష్టిలో ఫుతాయ్ ఒక భయంకరమైన సూక్ష్మప్రాణి. మూసిన తలుపుల్లోంచి కూడా వచ్చేయగలడు. యింట్లో జరిగిన యింకో విషయం ఆవిడ నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఆమె యింట్లోని వంటకత్తిని ఎవరో పాడు చేశారు. ఆమె బయటకి చెప్పకుండా వుండలేని పరిస్థితి వొచ్చింది. వంటామె తనని మోసం చేసిన వాడి పేరు మాత్రం ఎంతకీ చెప్పలేదు’

‘ఆమె పేరు గుడూల్ కదా!’ అంది జో

‘ఆ! గుడూల్! ప్రేమ, దోమ బారినపడకుండా యిన్నాళ్ళూ ఆమెను, ఆమె పొడుగాటి చీలిన గడ్డమే రక్షించిందని ప్రతీతి. ఆ సంప్రదాయ సాత్విక రాజపుత్రి చుబుకాన్న అకస్మాత్తుగా పెరిగిన ఆ గడ్డమే ఆమె శీలాన్ని యిన్నాళ్ళు కాపాడింది. వయసు మీరిన ఆ గడ్డం ఆమె మంచితనాన్ని యిక కాపాడలేకపోయింది. కార్మిలియే పావం ఎంతగానో అడిగింది. ఆమెను మోసగించింది ఎవరో ఒక్కసారి చెప్పిం తర్వాత ఏడవమని. ఆమె కళ్ళ నీళ్ళు కుక్కుకుంది గానీ చెప్పలేదు బెదిరింపులు, వేడుకోళ్ళూ ఏమాత్రం పనిచేయలేదు. ఆమె నర్మగర్భంగా అడుగుతూనే వుంది. చుట్టుపక్కల వాళ్ళనీ, ఆడా మగా అని లేకుండా వ్యాపారుల్నీ, తోటమాలులని, రోడ్డు సర్వేయర్లనీ, పోలీసుల్నీ అడుగుతూనే వుంది. కానీ ఎవరూ ఆ దుర్మార్గుడి జాడ తెలపలేకపోయారు. మళ్ళీ గుడూల్‌నే అడిగిందావిడ. ‘నిజం చెప్పు నీ మంచి కోసమే అడుగుతున్నా! ఎవరతను?’ నిశ్శబ్దమే సమాధానమయింది. యింతలోనే ఆ ముసలామెకు ఒక మెరుపులా జ్ఞానోదయమైంది. ‘అతను ఫుతాయ్ కదూ?’ అడిగింది. వంటామె ఏడుస్తూనే వుంది తప్ప ఏమి చెప్పలేదు.

‘అవును! ఫుతాయ్! అదే నేను యిప్పటి వరకు ఎందుకు ఊహించలేకపోయాను? అవును ఖచ్చితంగా వాడు ఫుతాయ్! పిచ్చి మొహమా! అరే ఎంత కష్టమొచ్చిందే నీకు. నాకు చెప్పడానికేమి!’

అప్పట్నించీ కార్మిలియే, ఫుతాయ్ వంటామెకు పుట్టిన బిడ్డకు తండ్రి అని చెప్తూనే వుంది. యిక ఆ ఊరి ప్రెసిడెంట్ నుంచి వీధి లాంతర్లు వెలిగించేవాడి పెంపుడు కుక్క వరకు గుడూల్ గురించి, ఆమె పిల్లాడి గురించి ప్రతి ఒక్కరికీ తెల్సిపోయింది. గుడూల్ వెంట ఎవరో పడ్డారనే విషయం ఊర్లో గొప్ప ఆశ్చర్యాన్నీ, నవ్వునీ, ఆసక్తినీ కలిగించింది. ఫుతాయ్ అంటేనే స్త్రీలోలుడిగా, పదహారు వేల గోపికల ప్రేమికుడిగా అభివర్ణించేశారు. యిక ఆ సంవత్సరం పుట్టిన మరో ఐదారుమంది పిల్లల పితృత్వం ఫుతాయ్‌కే దక్కింది. వాళ్ళలో పచారీకొట్టు మార్షల్ గారి పనమ్మాయి, బేకరీపిల్ల, పక్క ఊరి కుంటి అస్మూయి. యిలా ఎక్కడ లేని వాళ్ళూ ఆ ఫుతాయ్ గాడి, ఆ రాక్షసుడి వలలోపడిన బాధితులే!

కనిపించని ఆ ఫుతాయ్ ఊళ్ళో వున్న అడవాళ్ళ ప్రాణాలకు, వర్ణనాతీతమైన కష్టాలకు, బాధలకు కారకుడయ్యాడు. పాతతరం వాళ్ళలెక్కలో చూస్తే తరతరాలుగా ఆ ఊళ్ళో కన్య పిల్లలు నిర్భయంగా వుండేవాళ్ళని తెలుస్తోంది.

అంత పేరొచ్చినా, ఊళ్ళోనూ చుట్టుపక్కల ప్రదేశాలలోనూ అతని ప్రసక్తి వచ్చినప్పుడల్లా మాయింటి ప్రసక్తి తప్పకుండా వినిపిస్తూ వుండేది. మా గుమ్మంలోంచి వస్తూనో, అప్పుడప్పుడూ మా ప్రహరీ గోడమీంచి దూకుతూనో చేతులు గాలిలో వూపుతూనో చాలామందికి కనిపిస్తూ వుండేవాడు. అయితే అతని మొహాన్ని ఎప్పుడూ ఎవరూ చూడలేదు. అతని నీడను, గొంతుని, పాదముద్రల్ని మేము ఎప్పుడూ గుర్తిస్తుండేవాళ్ళం. చాలాసార్లు సాయంత్రాలలో అతని వెనుక భాగాన్ని వీధిచివర మలుపులో తిరిగిపోతున్నప్పుడు చూసేవాళ్ళం. నేనూ, మా అక్క మా అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వుండేవాళ్ళం. కాసేపు చెడ్డవాడిలా, దుర్మార్గుడిలా, కాసేపు చిన్న పిల్లవాడిలా, అమాయకుడిలా అతను రోజురోజుకీ నిజానికి దూరంగా కవితాత్మకంగా మారిపోతున్నాడు. కొంతకాలానికి పిల్లల కాశీమజిలీ కథల్లోకి చేరిపోయేలా వున్నాడు. అతను ఒక పాత్రలోంచి యింకో అద్భుతమైన పాత్రలోకి మారిపోతున్నాడు. రాత్రుళ్ళు వెనకనుంచి వచ్చి పిల్లల కళ్ళు మూసే కథగా, మరీ రాత్రిపూట గుర్ర పిల్లల తోక కొరికే భూతంలా కాదుకానీ, అంత మొరటు, అంత సున్నితం కానీ కొంటె పనుల కృష్ణుడే! మా చెల్లిలి బొమ్మలకు యింకు మీసాలు పెట్టడంలాంటి పనులు చేసేవాడు. నిద్రపోయేముందు అతనిని వినేవాళ్ళం.. అతను కుక్కలతో అర్ధరాత్రి అరవటం, మిల్లు సైరన్‌తో గొంతు కలపటం, అర్ధరాత్రి తాగుబోతుల్తో కలిసి పాడుతున్నట్లుగా వినేవాళ్ళం.

ఈ ఫుతాయ్‌ని మా ముందుంచి ఎంతో పరిచయం వున్నట్లు ఎవరు చేశారు.! అతని జ్ఞాపకాలు మాచుట్టూ వున్న అన్ని వస్తువుల్తోనూ అతనికి సంబంధం కలిగించి అతనిమీద ఆసక్తిని ఎవరు కలిగించారు.? జో బొమ్మలు, యింకుపూసిన కాగితాలు, నలిగిపోయిన పుస్తకాలు, మా తోట చెట్ల నీడల్లో దూరంగా ఎర్రగా మెరుస్తోన్న కళ్ళు. చలిరాత్రి మంచుకో మరెందుకో పగిలిన పూలకుండీ, చెట్లు, వీధులు, బెంచీలు ప్రతీదీ మాకు ఫుతాయ్ ని.. మా ఫుతాయ్, చిన్న పిల్లల ఫుతాయ్. మనవాడే కానీ కన్పించని ఫుతాయ్‌ని గుర్తుచేసేవి. గౌరవంలోనూ, కవితా భావంలోనూ అతను ఏదో అడని మనిషికాదు. మొదటైన సిసీలియన్ కాదు. మరెవరూ కాదు అతను దగ్గర దగ్గరగా దేవుడితో సమానమే!

మా నాన్నకు మాత్రం ఫుతాయ్ మరో విధంగా అన్పించేవాడు. అది ఓ సింబాలిక్ పాత్రలా, గొప్ప వేదాంతిలా అన్పించేవాడు. మా నాన్నకు మానవాళి పట్ల గొప్ప సానుభూతి! వాళ్ళు క్రూరంగా చేసే పనుల్లో తప్ప మామూలు తప్పుల్ని నవ్వుతాలుగానో, సరదాగానో తీసేసేవాడు. ఫుతాయ్ అనే నమ్మకాన్ని మానవాళి మనస్తత్వాల, అన్ని రకాల నమ్మకాల ప్రతీకలా భావించేవాడు. మా నాన్న వ్యంగ్యంగా నిర్లిప్తంగా నిజంగానే ఫుతాయ్ మనిషిగా వున్నట్లే మాట్లాడేవాడు. ఆయన ఒక్కోసారి అతని ప్రతి ముఖకవళికనీ సరిగ్గా, ఖచ్చితంగా వర్ణించమని పట్టుబట్టేవాడు.

అమ్మ ఆశ్చర్యపోయేది.

‘ఎవరన్నా చూస్తే నిజమనుకుంటారు! మీకు నిజంగా తెల్సుకదా అతను లేడని’ అనేది అమ్మ

ఆయన నిర్లిప్తంగా అనేవాడు.

‘మొత్తం సెయింట్ ఒమర్ పట్టణమంతా అతనున్నాడని నమ్ముతున్నారు. నేను కూడా మంచి పౌరుడినే కదా. ఉన్నదాన్ని ఎలా కాదంటాను! ఎవరైనా విశ్వజనితమైన నమ్మకాన్ని కాదనే దానిముందు చాలా ఆలోచించాలి, ఆచితూచి మాట్లాడాలి’ అనేవాడు.

మరీ స్పష్టమైన ఆలోచన కలవాళ్ళు యిలాంటి వాడుకలో వున్న పద్ధతుల్ని గురించి చిరాకుపడ్తారు. అంగీకరించరు మా నాన్న పద్ధతి మధ్యస్థంగా వుండేది. తన సొంత అభిప్రాయాల్ని, ప్రజాభిప్రాయాల ముందు తలవొగ్గేవాడు. ఆ ఊళ్ళో అందరిలానే ఫుతాయ్ వున్నాడనే విషయాన్ని నమ్మేవాడు. కానీ ఫుతాయ్ మీద వచ్చే ఆరోపణల్ని కొట్టిపారేసేవాడు. అది పుచ్చకాయల దొంగతనం కానీండి, వంటావిడ విషయం కానీండీ మంచి ఆలోచనాపరునిలా ఊళ్ళో జరుగుతున్న విషయాల్ని విశ్లేషించి పుతాయ్‌కి వాటితో ఏమాత్రం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసేవాడు.

యిక అమ్మ విషయానికొస్తే అమ్మే అతని పుట్టుకకు కారణమయ్యాననుకొనేది.. ఒక విధంగా అదేనిజం. కానీ నిజానికి ఫుతాయ్ అమ్మ అసంధిగ్ధంలోంచి, కవి ఆలోచనలోంచి కాలిబన్ పుట్టినట్లు పుట్టాడు! ఈ రెండు నేరాలుకి వాటివాటి ప్రత్యేకతలున్నాయి. అమ్మ తప్పు షేక్‌స్పియర్ అంత నేరం మాత్రం కాదు. కానీ ఆమె తన చిన్న అబద్ధం అలా పెరిగి పెద్దదై అనంతమై పోవటం, ఆ చిన్న మారుమాట పెరిగి అనాలోచితంగా ఎదిగి ఎదిగి యింటితో ఆగకుండా మొత్తం పట్నమంతా వ్యాపించి ప్రపంచమంతా పాకే పరిస్థితికి రావటం బాధగా వుండేదామెకు. ఒకరోజు ఆమె తన సృష్టి తనముందే పెరిగి కళ్ళముందు మనిషిగా ప్రత్యక్షమయ్యాడని తెలిసి తెల్లబోయింది.

ఆరోజు కొత్త పనామె వచ్చి ఒకతను అమ్మ గురించి అడిగాడని, అతను అమ్మతోనే మాట్లాడతాను అన్నడంది.
‘అతను ఓ కోటు వేసుకొని వున్నాడు, పల్లెటూరు నుంచి పనికోసం వచ్చిన కూలీలా వున్నాడు’ అంది పనామె.
‘పేరేమిటిట?’ అగిందమ్మ.
‘అతను ఏదో పేరు చెప్పాడు’ అని ‘ఆ! ఫుతాయ్! అని చెప్పాడు’ అంది పనమ్మాయి.
‘అతనిక్కడికొచ్చాడా?!’ అంది అమ్మ ఆశ్చర్యంగా.
‘అవును వంటగది బయట నిల్చొని వున్నాడు’ అందామె.
‘ఏంకావాలిట? అసలు నిజంగా నువ్వతన్ని చూశావా?!
అంది అమ్మ
‘అవును చూశానమ్మా’ చెప్పింది పనామె.
‘ఏమిటట?’
‘ఏమో అమ్మతోనే చెప్తాను అంటున్నాడు’
‘వెళ్ళు ఏం కావాలో అడిగిరా!’ అంది అమ్మ.
పనమ్మాయి వంటగది దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫుతాయ్ అక్కడలేడు. కొత్తపనమ్మాయికి ఫుతాయ్ కనిపించటం ఎప్పటికీ ఎవరికీ అర్ధం కానేలేదు.
ఆ రోజునుంచి అమ్మ ‘బహుశా నిజంగానే ఫుతాయ్ వున్నాడనేమోని’ అనుకోవటం మొదలుపెట్టింది.
బహుశా అతన్ని తను సృష్టించలేదేమో!…….

* * *

అనటోల్ ఫ్రాన్స్

ఫ్రాన్స్ దేశానికి  (16-04-1844 - 12-10-1924) జర్నలిస్ట్, కవి, నవలాకారుడు. 1921 సంవత్సరపు  నోబెల్ బహుమతి గ్రహీత. అనటోల్ ఫ్రాన్స్ తండ్రి పుస్తక విక్రేత. పుస్తకాల మధ్య గడిపిన అనటోల్ ఫ్రాన్స్ లైబ్రేరియన్ గా స్థిరపడ్డాడు. అనటోల్ ఫ్రాన్స్ సృష్టించిన సాహిత్యం విస్తారమైనది. ఈ కథకు మూలం 1907లో అనటోల్ ఫ్రాన్స్ రాసిన Putois అనే కథ.

డా.ఎన్ .శైలజ

కవయిత్రి, అనువాదకురాలు. 'బాల్కనీలో పిచ్చుక', 'తురాయీ చెట్టు', 'ఒంటరి వాన చుక్క' వంటి కవితా సంకలనాలు వెలువరించారు. ఖలీల్ జిబ్రాన్ 'ప్రొఫెట్' ని 'ప్రవక్త' పేరుతో తెలుగులోకి అనువదించారు. అంతేకాక  చైనా దేశపు  ప్రసిద్ధ తావో మతానికి చెం'దిన Tao Te Ching పుస్తకాన్ని తెలుగులో 'మహాపథం' పేరుతొ తెచ్చారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించి ఉద్యోగ విరమణ తరవాత హైదరాబాద్ దగ్గర షాబాద్ లో 'ధ్యానహిత' అను మెడిటేషన్ కేంద్రాన్ని నడుపుతున్నారు.


Spread the love

2 thoughts on “ఫుతాయ్

  1. కథ చాలా ఫిలసాఫికల్ గా ఉంది
    మనిషిలోని అనేక కోణాలను చూయించే దిశగా సాగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *