అతను నెమ్మదిగా క్షీణిస్తూ ఉన్నాడు. క్షయవ్యాధి సోకిన రోగిలాగా. నేను అతనిని రోజూ గమనిస్తూనే ఉంన్నాను. రోజూ రెండుగంటల కల్లా ఆ హోటల్ కిటికీ కిందనే అందరూ సరదాగా పచార్లు చేసుకునే చోట ఓ బెంచీ మీద కూర్చుని ప్రశాంతంగా ఉన్న సముద్రంవైపు తదేకంగా చూస్తుంటాడు. నడినెత్తిన సూర్యుడు మండుతుంటే, కదలకుండా మెడిటరేనియన్ ని దుఃఖం తో రెప్పవేయకుండా కాసేపు చూస్తాడు.
అప్పుడప్పుడూ మెంటోన్ ను చుట్టుముట్టిన,మబ్బులతో నిండిన ఎత్తైన పర్వత శిఖరాలను ఓరకంట చూస్తుంటాడు; ఆ తరువాత నెమ్మదిగా కాలిపై కాలేసుకుని కూచుంటాడు. ఆ కాళ్ళు సన్నగా పుల్లలలాగా ఉంటాయి. రెండు ఎముకలు తప్ప మరేం ఉండవు అక్కడ. వాటి చుట్టూ ఉన్న ప్యాంటు గుడ్డ గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. కూచున్న తరువాత మెల్లగా పుస్తకాన్ని తెరుస్తాడు;అతని చేతిలోఉన్నది మెస్సీట్ కవితా సంపుటి .రోజూ అదే పుస్తకం తెస్తాడు,చదువుతాడు. ఆ తరువాత ఇక కదలకుండా పుస్తకంలో మునిగిపోతాడు.కళ్ళు,మనసు కూడా పుస్తకం పైనే లగ్నమై ఉంటాయి.వడలిన అతని శరీరం అంతా పుస్తకం చదువుతున్నట్టు ఉంటుంది;అతని ఆత్మ ఆ పుస్తకంలో లీనమైనట్టు ఉంటుంది.ఒక గంట వరకు ఇదే తంతు; గాలి చలిగాలి గా మారి కాస్తంత దగ్గు వచ్చే వరకు అదే పని . ఆ తరువాత లేచి తాను అద్దెకుంటున్న హోటల్ వైపు అడుగులు వేస్తాడు.
అతనొక జర్మన్ దేశస్థుడు;పొడగరి;తెల్లని గడ్డం. రోజూ హోటల్ గదిలోనే ఫలహారం,భోజనం చేస్తాడు. ఎవ్వరితోనూ మాటా మంతీ ఉండదు.
అతని గురించి తెలుసుకోవాలని నాలో ఉత్సుకత చెలరేగింది. నేను ఒక రోజు వెళ్లి అతని పక్కనే బెంచీ మీద కూచున్నాను.
నేనుకూడా ఒక పుస్తకాన్ని చేత్తో పట్టుకుని వెళ్ళాను. చదువుతున్నట్టు కన్పించాలని. నా చేతిలో ఉన్నది కూడా మెస్సీట్ కవితా సంపుటే. నేను ‘రొహ్లు’ చదవటం మొదలు పెట్టాను.
వెంటనే నా పక్కన కూచున్నాయన మంచి ఫ్రెంచ్ లో “నీకు జర్మన్ వచ్చా ” అని అడిగాడు.
“అబ్బే !బొత్తిగా రాదు “అన్నాను.
“అయ్యో! రాదా !వచ్చి ఉంటే బాగుండేది. పక్క పక్కనే కూచున్నాము కదా! మీకు ఈ పుస్తకాన్ని ఇచ్చేవాడిని.నా చేతిలో ఉన్న ఈ అద్భుతమైన పుస్తకాన్ని మీకు చదవడానికి ఇచ్చి ఉండే వాడిని.”
“అదేంటో నేను తెలుసుకోవచ్చా “అది నా గురువుగారు షోపెన్హా రాసిన పుస్తకం. అందులో అతను స్వయంగా రాసుకున్న వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి.చూడండి.మార్జిన్ అంతా తన చేత్తో రాసుకున్న వ్యాఖ్యానాలతో నిండి పోయింది.”
నేను అతనిచేతిలో పుస్తకాన్ని ఎంతో వినయంగా తీసుకున్నాను. చూద్దునుకదా !నాకేం అర్ధం కాలేదు.నాకు గుర్తుపట్టలేని ఆ అక్షరాలు,వాటిని చూస్తే , ఈ భూమిమీద పుట్టిన వారిలోకెల్లా బ్రహ్మాండమైన కలల కని,ఆ కలలు విచ్చిన్నమైన వారి అమరమైన ఆలోచనల లాగా అనిపించాయి.
మెస్సీట్ కవిత నా మనసులో మెదిలింది.
“వోల్టేర్ , మరణంలోనే ఆనందం ఉందని నువ్వు తెలుసుకున్నావా , రంగు కోల్పోయిన నీ బొమికల గూడుపై ఇంకా ఆ వికృతమైన మందహాసం తెలియాడుతూనే ఉందేం ?”
నేను అసంకల్పితంగా,వోల్టేర్ మతాన్ని పిల్ల చేష్టలా వెటకారం చేయడాన్ని, జర్మన్ తత్వవేత్త తిరుగులేని వ్యంగ్యం తో సరిపోల్చడం మొదలు పెట్టాను.నిజానికి ఆ తత్వవేత్త ప్రభావం ఏనాటికీ చేరగనిది.
మనం నిరసన తెలుపుదాం. కోపగించుకుందాం , చీదరించుకుందాం. అయితే ఉత్సుకతతో ఉందాం. షోపెన్హా మానవాళి పై తనదైన తిరస్కార, అపనమ్మకపు ముద్ర వేశాడు.
నిరంతరం ఆనందాన్ని వెతుక్కుంటూ ఉండే ఆయన, అన్ని నమ్మకాలను,ఆశలను ,భావోద్వేగాల ఆదర్శాలను,బ్రాంతులను ,ఆకాంక్షలను ,దెబ్బతిన్న మనసుల స్థైర్యాన్ని ,ప్రేమలను చంపేశాడు, స్త్రీల పట్ల చూపే వీరోచిత ఆరాధన భావాన్ని, మనసులలో చెలరేగే ఊహలను ధ్వంసం చేసాడు; నాస్తిక వాదం ఏనాడూ ప్రయత్నించని బృహత్తర కార్యాన్ని సాకారం చేసి చూపాడు. తన ఎగతాళి ధోరణి నుండి ఏ విషయాన్నీ మినహాయించ లేదు.ఈ రోజుకీ ఆయన ఆలోచనలను మనసుల నుండి సమూలంగా తీసివేసుకోవాలని అనుకునే వారు కూడా ఆ ఆలోచనలనే మొస్తున్నారు.
“అంటే,మీరు షోపెన్హా కి చాల దగ్గరి వారన్న మాట!”
అతను విచారంగా ఓ నవ్వు నవ్వాడు.”అతను చనిపోయే నాటి వరకు.”
అతను తత్వవేత్త గురించి చెప్పాడు. ఈ వింత మనిషి, తన దరిదాపులకు వచ్చిన వారందరి పై ఎంతటి మహిమాన్విత ప్రభావాన్ని చూపించాడో చెప్పాడు. ఈ విగ్రహారాధనా వ్యతిరేకి, ఒక ఫ్రెంచ్ రాజకీయవేత్తతో సంభాషిస్తున్నప్పుటి సంఘటన వివరించాడు. అతడు ఒక గణతంత్ర సిద్ధాంత వాది. ఈ మనిషిని చూడాలనుకున్నాడు. వచ్చి చూస్తే, గోలగోలగా మాట్లాడుకుంటున్న శిష్యగణం మధ్యలో కూచుని ఉన్నాడు. ఎండిపోయి,ముడతలు పడిన మొహం.మర్చిపోలేని నవ్వులతో, అతని ఆలోచనలను,నమ్మకాలను ఒక్క మాటతో చీల్చి చెండాడుతున్నాడు- ఒక కుక్క తాను ఆడుకుంటున్న వస్తువును కొరికి కొరికి ఆణువణువూ ముక్కలు ముక్కలుగా చీల్చేస్తున్నట్టు.
ఆ ఫ్రెంచ్ మనిషి పోతూ పోతూ తానెంత భయబ్రాంతులకు గురయ్యాడో చెప్పాడట:”నేను ఒక గంటపాటు ఓ దయ్యంతో గడిపినట్టు ఉందని”అన్నాడట.
“అతని భయంకరమైన నవ్వు గురించి-చనిపోయిన తరువాత కూడా-తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటే,ఆ కథ నీకు చెప్తాను,అంటూ చెప్పడం మొదలు పెట్టాడు.
“షోపెన్హా అప్పుడే చనిపోయాడు. అందరం తెల్లవారే వరకు తలో రెండుగంటలు శవం పక్కన కాపలా కాయాలని నిర్ణయించుకున్నాము.
“అతడో పెద్ద అపార్ట్మెంట్ లో ఉండేవాడు. అది అతి సాధారణంగా ఉండేది.పెద్దదే అయినా లోపల మసకగా ఉండేది.చనిపోయిన అతని తల దగ్గర రెండు కొవ్వొత్తులు వెలిగించి పెట్టారు.
“నేను నా వంతుగా కాపలా కాయడానికి వెళ్లేసరికి అర్ధరాత్రయింది. నేను మరో కామ్రేడ్ తో పాటుగా కాపలా ఉన్నాను. మా ముందు కాపలా కాసినవాళ్లు మేము వెళ్ళగానే ఇళ్లకు వెళ్లిపోయారు. మేమిద్దరం మంచం లో ఉన్న శవం కాళ్ల దగ్గర కుర్చీలలో కూచున్నాము.
“శవం ముఖం రంగేమీ మారలేదు. నవ్వుతున్నట్టే ఉంది. మాకు బాగా పరిచయమున్న మోహంలో ఆ పెదాలపై చిరునవ్వు అలాగే ఉంది. కాసేపటికి అతను కళ్ళు తెరిచి లేచి మాట్లాడతాడేమో అన్నట్టుగా ఉన్నాడు. అతని ఆలోచన, లేదా అతని ఆలోచనలు మమ్మల్ని చుట్టుముట్టాయి. అతని మేధస్సు లో,ఆలోచనల్లో, మునిగి తేలుతున్నాము. పూర్తిగా అతని ప్రభావంతోనే ఉన్నాము.బతికి ఉన్నప్పటి కన్నా. మాపై అతనికి ఉన్న ఆధిపత్యానికి చనిపోయిన తరువాత కూడా తిరుగులేదని అనిపించింది. ఈ అసమాన వ్యక్తి స్ఫూర్తి శక్తి లో మార్మికత జోడించి ఉన్నట్టు అనిపించింది.
“ఇటువంటి మనుషుల భౌతిక దేహాలు అదృశ్యమౌతాయి. కానీ వారు చిరంజీవులు . వారి గుండె చప్పుడు ఆగిన మరుక్షణం నుంచి, మనల్ని భయపెడతారని నేను ఖచ్చితంగా చెప్పగలను.
“ఆ తరువాత మేము గొంతు తగ్గించి, అతని గురించే మాట్లాడుతున్నాము. అతని ఆలోచన-అదే ఆలోచనలు, సిద్ధాంతాలు, అజ్ఞాత ఙివితపు అంధకారాల లోకి విసిరిన అగ్నికీలల్లాంటి దిగ్బ్రాంతి కలిగించే అతని సూక్తులు నెమరు వేసుకుంటున్నాము.
‘నాతో ఉన్న కామ్రేడ్,”ఇతగాడు లేచి మాట్లాడేటట్టే ఉన్నాడు’ అన్నాడు. ఏ మాత్రం చలనం లేని ఆ ముఖం వంక కాస్తంత భయంతో చూడడం మొదలు పెట్టాము. నెమ్మిదిగా మాకు అసౌకర్యంగా అనిపించడం మొదలయింది; ఊపిరాడనట్టు ఉంది.దాదాపు సృహతప్పుతున్నట్టు అనిపించింది.
నేను తడబడుతూ ,”నాకేమైందో చెప్పలేను కాని, ఖచ్చితంగా అసౌకర్యంగా అయితే ఉంది’ అన్నాను.
“అదే సమయంలో, శవం నుండి కాస్త దుర్గంధం రావడం మేము గమనించాము.
“అప్పుడు నాతోపాటు ఉన్న కామ్రెడ్,’మనం పక్క గదిలోకి వెళ్లి కూచుందాము, తలుపులు తీసి ఉంచుదాము’ అన్నాడు.నేను ఈ ప్రతిపాదనను వెంటనే ఒప్పుకున్నాను.
“నేను మంచం మీద శవం పక్కన స్టాండ్ పై ఉన్న కాండిల్స్ లో ఒక దానిని చేతిలోకి తీసుకున్నాను;రెండో దానిని అక్కడే వదిలేసి ఇద్దరం పక్కనున్న గది చివర్లోకి వెళ్లి కూచున్నాము. అక్కడి నుండి కాండిల్ వెలుగులో మంచం, శవం స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి.
“కానీ.ఇప్పటికీ అతని ఆలోచనలు మమ్మల్ని వెన్నాడుతూనే ఉన్నాయి. అతని అభౌతిక అస్తిత్వం, విముక్తి పొందిన, స్వేచ్చాయుతమైన, అత్యంత శక్తివంతమైన, ఆధిపత్యం మా చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది. ఒక్కొక్క సారి, కుళ్లిపోతున్న శవం నుండి భయంకరమైన వాసన గుప్పుమంటూ మా శరీరం లోపలికి చొచ్చుకొస్తున్నది. మాకు వికారం పుడుతోంది, అసలా స్థితిని సరిగ్గా వివరించలేను.
“ఉన్నట్టుండి మా వెన్నులో వణుకుమొదలయింది. ఒక శబ్దం, చిన్న శబ్దం శవం ఉన్న గదిలోనుండి వచ్చింది. మేము వెంటనే మా చూపులను అటువైపు సారించాము. అప్పుడు మా కళ్ళ పడింది, నిజం ,మేము ఇద్దరం స్పష్టంగా చూసింది- ఎదో తెల్లనిది పక్కమిది నుంచి కిందికి వెళ్ళింది. కార్పెట్ పై పడింది; ఆ తరువాత వాలు కుర్చీ కింద మాయమయింది.
“వెంటనే మరో ఆలోచన లేకుండా మేము పరుగు లంకించుకోవాలనుకున్నాము . పిచ్చి భయంతో పారిపోదామనుకున్నాము. ఇద్దరం ఒకరి మొహం లోకి ఒకరం చూసుకున్నాము. మాగుండెలు వేగంగా కొట్టుకున్నాయి;ఎంత వేగంగా అంటే వేసుకున్న చొక్కా కూడా పైపైకి ఎగిసిపడింది. నేనే మొదట మాట్లాడాను.
“నువ్వు చూసావా?”
“అవును.చూసాను.”
“అతను బతికే ఉన్నాడంటావా ?”
“ఎబ్బే! భౌతిక కాయం కుళ్లిపోవడం కూడా మొదలయింది కదా!”
” ఇప్పుడు మనం ఏం చేయాలి?”
“మనం దగ్గరికి వెళ్లి చూడాలని అనుకుంటున్నాను, అన్నాడు నాతో ఉన్న కామ్రేడ్ చిన్న గొంతుకతో .
“నేను కొవ్వొత్తి కాండిల్ పట్టుకుని శవం ఉన్న గదిలోపలికి అడుగు పెట్టాను. గదిలోని అన్ని మూలాలు జాగ్రత్తగా గమనిస్తూ. ఏదీ కదలడం లేదు. నేను మంచం దగ్గరికి వెళ్ళాను. భయంతో నిర్ఘాంత పోయి ఉన్నచోటనే నిలబడి పోయాను.
“షోపెన్హా ఇప్పుడు నవ్వడం లేదు. వికృతంగా పళ్ళు ఇకిలిస్తున్నాడు. పెదవులు రెండు బిగుసుకుపోయి ఉన్నాయి.బుగ్గలు రెండూ లోతుకు పోయాయి. నేనుతడబడుతూ,”అతను చనిపోలేదు’
“కానీ భయంకరమైన కంపు మా ముక్కులలోకి వస్తోంది. నాకు వాంతి వస్తోంది కూడా. నేను కదలలేక పోయాను. గట్టిగా బిగుసుకు పోయాను. అతనివైపే చూస్తూ నిలబడి పోయాను. ఓ భూతాన్ని చూస్తున్నట్టుగా.
“నాతో పాటు ఉన్న కామ్రేడ్-మరో కాండిల్ చేతిలోపెట్టుకుని ఉన్నాడు-ముందుకు వంగి చూసాడు. మాట్లాడకుండా నా చేతిని పట్టుకున్నాడు. నేను అతని చూపును అనుసరించాను. కింద నెల మీద వాలు కుర్చీ కింద, మంచం పక్కన, నల్లటి కార్పెట్ పైన తెల్లటి పలువరుస మెరుస్తోంది. కరవడానికి సిద్ధంగా ఉన్నట్టు. అవి షోపెన్హా కృత్రిమ దంతాలు.
“శరీరం క్షీణిస్తుండడం వలన దవడలు వదులయ్యాయి. కట్టుడు పళ్ళు కాస్తా నోట్లోంచి జారి కిందపడిపోయాయి.
“ఆరోజు నిజంగా నాకు చాలా భయం వేసింది.కామ్రేడ్.
“సూర్యుడు మెరుస్తున్న సముద్రంలోకి అస్తమించడం మొదలు పెట్టాడు. బక్కచిక్కిన జర్మన్ కూర్చున్న చోటి నుండి లేచాడు. వెళుతున్నానని చెప్పి నమస్కరించి హోటల్ వైపు వెళ్ళిపోయాడు. విశ్రాంతి తీసుకోవడం కోసం.
