I
తూర్పు ఫ్రాన్స్‌లోని బౌర్బాకి లో ఓటమి పాలైన తర్వాత జరిగిన సంగతి ఇది. ఆ భయంకరమైన పోరాటం తర్వాత, ఛిన్నాభిన్నమై, సర్వనాశనమై, అలసిపోయిన సైన్యం స్విట్జర్లాండ్‌లో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ యుద్ధం కొద్ది రోజులు మాత్రమే జరిగి ఉండకపోతే లక్షా యాభై వేల మంది సైనికులు కచ్చితంగా మరణించి ఉండేవారు. ఆకలి, భయంకరమైన చలి, కనీసం బూట్లు కూడా లేకుండా మంచులో కఠినమైన పర్వత రహదారుల గుండా బలవంతంగా నడవడం వల్ల, ‘ఫ్రాంక్-టైరర్స్’ -స్వచ్చందంగా సైన్యం లో చేరి, తుపాకులు పట్టుకుని, ప్రత్యర్థులతో పోరాడి, శత్రువులను అంతం చేసేందుకు సిద్ధపడిన వాళ్ళం-అయిన మేము తీవ్రంగా బాధలు పడ్డాము. ఎందుకంటే మాకు ఉండేందుకు గుడారాలు లేవు, తినడానికి తిండి కూడా దాదాపుగా లేనట్టే . బెల్ఫోర్ట్ వైపు వెళుతున్నప్పుడు ఎప్పుడూ ముందు వరుసలో, జూరా మీదుగా తిరిగి వస్తున్నప్పుడు వెనుక వరుసలో ఉండేవాళ్లం. జనవరి ఒకటవ తేదీన పన్నెండు వందల మందితో ఉన్న మా చిన్న బృందంలో, మేము స్విస్ భూభాగాన్ని చేరుకునే సరికి కేవలం ఇరవై రెండు మందిమి-పాలిపోయి,బక్కచిక్కి, చింపిరి బట్టలతో ఉన్న అభాగ్యులం-మాత్రమే మిగిలాము.
అయితే,అక్కడ మేము సురక్షితంగా ఉన్నాము, విశ్రాంతి తీసుకో గలిగాము. దురదృష్టవశాత్తు యుద్ధంలో ఓడిపోయిన ఫ్రెంచ్ సైన్యం పట్ల, అక్కడివారు చూపించిన సానుభూతి, బాగోగులు చూసుకున్న తీరు అందరికీ తెలిసిన విషయమే. మేమంతా కొత్త జీవితాలను పొందాము. యుద్ధానికి ముందు ధనవంతులుగా, సంతోషంగా ఉన్నవారు కూడా మునుపటి కంటే ఎక్కువ సౌకర్యాలను పొందామని చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి-ప్రతిరోజూ తినడానికి మాకు ఏదో ఒకటి దొరికేది, ప్రతి రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలిగేవాళ్లం అంటే ఎంత అదృష్టం!
అయితే, కాల్పుల విరమణ అమలు కాని ఫ్రాన్స్ తూర్పు భాగంలో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. బెసాన్‌కాన్ శత్రువులను అదుపులో తీసుకున్నందుకు ప్రతీకారంగా, శత్రుసేనలు ఫ్రాంచే కామ్టే ను సర్వ నాశనం చేశారు. కొన్నిసార్లు వారు సరిహద్దుకు చాలా దగ్గరగా వచ్చారనే వార్త కూడా మా చెవులలో పడింది. మాకు, వారికి మధ్య నిఘా రేఖను ఏర్పాటు చేయడానికి స్విస్ దళాలు కవాతు చేసుకుంటూ వెళ్లడం మాకళ్ళారా చూశాము.
అది మమ్మల్ని చాలా బాధ పెట్టింది. అప్పటికి మేము ఆరోగ్యం, బలం పుంజుకున్నాం; పోరాడాలన్న కోరిక రగులుకుంది. మాకు దాదాపు పది కిలోమీటర్ల దూరంలో జర్మన్లు విజయాలు సాధించి, కొవ్వెక్కి ఉన్నారని వార్తలు మా చెవిలో పడ్డాయి. ఇది మాకు అవమాన. ఖైదీలుగా పట్టుకున్న వారి రక్షణలో ఉండడం వల్ల మేము శత్రువులపై పోరాడలేకపోతున్నామని, శక్తిహీనులమయ్యామనే భావన మమ్మల్ని నిలవనీయలేదు.
ఒకరోజు మా కెప్టెన్ మాలో ఐదారుగురిని పక్కకు తీసుకెళ్లి, ఈ విషయంపై చాలా సేపు ఆవేశంగా మాట్లాడాడు. ఆ కెప్టెన్ చాలా మంచివాడు. అతను జౌవ్స్ లో సబ్‌లెఫ్టినెంట్‌గా పనిచేశాడు. ఎత్తుగా, సన్నగా, ఉక్కు లాంటి దృఢత్వంతో ఉండేవాడు. యుద్ధ సమయం అంతా జర్మన్లకు ముచ్చెమటలు పట్టించాడు. అతను పనీ పాటు లేకుండా ఉండలేకపోయాడు. కేవలం ఒక ఖైదీగా , ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూర్చోవడం అతనికి అస్సలు నచ్చలేదు.
“నాశనం అయిపోను! మనకు రెండు గంటల దూరంలో చాలా మంది ఉహ్లాన్‌లు (గుర్రపు దళం లోని రౌతులు -అశ్వికులు)ఉన్నారని తెలిస్తే మీకు బాధగా లేదా? పట్టుదల గల ఆరుగురు మనుషులు, ఏరోజైనా సరే, వారిలో ఒక గుంపును చంపేయ గలిగిన సత్తా మన దగ్గర ఉన్నప్పుడు, ఆ దిక్కుమాలిన వాళ్ళు మన పర్వతాలలో, మన యజమానుల లాగా తిరుగుతున్నారని తెలిస్తే, మీకు మతి పోవడం లేదా? నేను ఈ బాధ ఇక భరించలేను, నేను అక్కడికి వెళ్లాల్సిందే.”అన్నాడు మాతో.
“కానీ ఎలా కెప్టెన్?”
“ఎలాగా, అది అంత కష్టమైన పనేం కాదు! గత ఆరు నెలల్లో మనం ఇటువంటివి సాహసాలు ఎన్ని చేయలేదని! స్విస్ వాళ్ల కంటే గట్టివాళ్ల పకడ్బందీగా అడవులను కాపలాకాస్తున్నప్పుడు బయటపడినట్లుగానే! మీరు ఫ్రాన్స్‌లోకి చొరబడాలని కోరుకునే రోజు, మిమ్మల్ని అక్కడికి చేర్చే బాధ్యత నాది.”
“అది సరే; కానీ చేతిలో ఎలాంటి ఆయుధాలు లేకుండా ఫ్రాన్స్‌లో మనం ఏం చేయగలం?”
“ఆయుధాలు లేకుండా ఎలా వెళ్లడమని భయమా? మరేం ఫరవాలేదు. దేవుడి మీద ఒట్టు, మనం వాటిని అక్కడే సంపాదించగలం!”
“మీరు ఒప్పందాన్ని మరచిపోతున్నట్టున్నారు” అని మరొక సైనికుడు గుర్తు చేశాడు; ” స్విస్ వారు ఖైదీలను ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్ళడానికి అనుమతించారని ‘మాన్‌ట్యూఫెల్’ కు తెలిస్తే, మనకు ఆశ్రయం ఇచ్చినవాళ్ళు ఇబ్బంది పడవలసి వస్తుందేమో! “హెచ్చరించాడు.
“అబ్బే,అవన్నీ పసలేని వాదనలు.నేను వెళ్లి కొంతమంది ప్రష్యన్లను చంపాలనుకుంటున్నాను; నాకు కావాల్సింది అంతే. నేను చేసినట్లు చేయడానికి మీకు ఇష్టం లేకపోతే,వెంటనే ఆ విషయం చెప్పేయండి. నేను ఒంటరిగా వెళ్ళగలను; నాకు ఎవరి తోడూ అవసరం లేదు.”అన్నాడు కెప్టెన్.
సహజంగానే, మేమంతా అభ్యంతరం వ్యక్తం చేశాము. కానీ కెప్టెన్ మనసు మార్చడం సాధ్యపడకపోవడంతో, అతనితో పాటు వస్తాం అని మాట ఇవ్వక తప్పలేదు. ఇప్పటివరకు ఏ కష్ట సమయంలోనూ అతను మమ్మల్ని విడిచిపెట్టలేదు, కాబట్టి అతన్ని ఒంటరిగా వదిలేయడానికి మాకు మనస్కరించలేదు; అలా ఆ ప్రయాణం ఖరారు అయింది .
II
కెప్టెన్ కి ఒక సొంత ప్రణాళిక ఉంది. దాని గురించి అతను కొంతకాలంగా ఆలోచిస్తున్నాడు. ఆ పథకాన్ని ఇప్పుడు అమలు చేయడం ప్రారంభించాడు. ఆ ప్రాంతంలో అతనికి తెలిసిన ఒక వ్యక్తి ఒక బండిని, ఆరు జతల రైతుల బట్టలను బదులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. గ్రుయెర్ జున్నుతో నింపిన బండి అడుగు భాగంలో గడ్డి కింద మేము దాక్కోవచ్చు. బండిలో తీసుకు వెళు సరుకులను శత్రువుల నుండి రక్షించుకోవడానికి తనతో పాటు ఇద్దరు స్నేహితులను తీసుకెళ్తున్నట్లు కెప్టెన్ కాపలాదారులను నమ్మించాడు. ఒక స్విస్ అధికారి మాత్రం బండి వైపు కాస్తంత అనుమానంగా ఎగాదిగా చూసాడు,కానీ అది నిజానికి,కేవలం తన సైనికులను ఆకట్టుకోవడానికే. ఒక్క మాటలో చెప్పాలంటే, అధికారులకు కానీ, సైనికులకు కానీ అసలు అనుమానం రానేలేదు.
కెప్టెన్ చేతిలోని కొరడాను ఝుళిపిస్తూ, గుర్రాలను “పద పద “మంటూ అదిలించాడు.మేం ముగ్గురం నింపాదిగా బండి కింద పెట్టెలో కూర్చుని చుట్ట కాల్చుకుంటున్నాము. నా పెట్టె ముందు భాగంలో ఉన్న చిన్న రంధ్రాల ద్వారా మాత్రమే గాలి లోపలికి వస్తుండటంతో నాకు ఊపిరాడలేదు. దానికి తోడు భయంకరమైన చలి కారణంగా నేను దాదాపు గడ్డకట్టుకుపోయాను.
“పద పద” అని కెప్టెన్ మళ్ళీ గుర్రాలను మళ్లీ అదిలించాడు, కాసేపటికి ఆ గ్రుయెర్ జున్నుతో నిండిన బండి ఫ్రాన్స్‌లోకి ప్రవేశించింది.
శత్రువులు స్విస్ నిఘా సామర్థ్యాన్ని నమ్మడం వలన, ప్రష్యన్ సరిహద్దులలో కాపలా అంత పటిష్టంగా లేదు. అక్కడున్న సార్జెంట్ ఉత్తర జర్మన్ భాషలో మాట్లాడాడు,కానీ, మా కెప్టెన్ ‘ఫోర్ కాంటన్స్‌కు’ చెందిన అపభ్రంశ జర్మన్ భాష లో మాట్లాడాడు;అందువలన ఒకరి మాట మరొకరికి అర్థం కాలేదు. అయితే మా సార్జెంట్ చాలా తెలివిగా నటించాడు; తనకు అంతా అర్ధమైనట్లు నమ్మించాడు. దాంతో అతడు మా ప్రయాణాన్ని కొనసాగించడానికి అనుమతించాడు; అలా ఏడు గంటల పాటు ప్రయాణం చేసిన తర్వాత, దారి పొడవునా కాపలాదారులు అడ్డుపడుతూ ఆపుతూ ఉన్నా, సమాధానాలు చెప్పుకుంటూ, చీకటి పడే సమయానికి శిథిలావస్థలో ఉన్న జురా లోని ఒక చిన్న గ్రామానికి చేరుకున్నాము.
ఇప్పుడు మేము ఏం చేయాలి? మా దగ్గర ఉన్న ఏకైక ఆయుధం కెప్టెన్ చేతిలోని కొరడానే. రైతుల దగ్గరి నుండి మేము తెచ్చుకున్న బట్టలు,మా యూనిఫాంలు తప్ప మాదగ్గర ఇంకేమి లేవు. తినడానికి ఆ గ్రుయెర్ జున్ను ఒక్కటే ఉంది. మా దగ్గర ఉన్న సంపదల్లా మా మందుగుండు సామాగ్రి ఒక్కటే;అంటే కొన్ని పెద్ద పెద్ద జున్ను ముక్కల మధ్యలో మేము దాచిపెట్టిన తూటాల ప్యాకెట్లు. మా దగ్గర సుమారు వెయ్యి తూటాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి సరిగ్గా రెండు వందలు వచ్చాయి. కానీ మాకు రైఫిల్స్ కావాలి, అవి కచ్చితంగా చేస్‌పాట్స్అయి ఉండాలి. అదృష్టవశాత్తూ, కెప్టెన్ సృజనాత్మకతతో ఆలోచనలు గల ధైర్యవంతుడు. అందుకే అతనికి ఒక ఉపాయం తట్టింది:
మాలో ముగ్గురం పాడుబడిన గ్రామంలోని ఒక సెల్లార్‌లో దాక్కోగా, అతను ఖాళీ బండిలో ఒక వ్యక్తిని వెంటపెట్టుకుని బెసాన్‌కాన్ వరకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ పట్టణం ముట్టడించబడి ఉంది కానీ,ఆ కొండల మధ్య ఉన్న పట్టణంలోకి ఎవరైనా సులభంగా ప్రవేశించవచ్చు. సరిహద్దు గోడలకు పది మైళ్ల దూరం వరకు ఉన్న పీఠభూమిని దాటి, ఆపై కాలిబాటలు, లోయల గుండా నడుచుకుంటూ లోపలికి వెళ్ళవచ్చు. వారు తమ బండిని ఓమన్స్ వద్ద జర్మన్ల మధ్యలో వదిలేసి, రాత్రి పూట కాలినడకన అక్కడి నుండి తప్పించుకున్నారు; డౌబ్స్ నదికి సరిహద్దుగా ఉన్న ఎత్తైన ప్రాంతాలను చేరుకోవడానికి అలా చేశారు; మరుసటి రోజు వారు బెసాన్‌కాన్‌లోకి ప్రవేశించారు, అక్కడ చాలా చేస్‌పాట్స్ రైఫిల్స్ ఉన్నాయి. ఆయుధాగారంలో దాదాపు నలభై వేల ఆయుధాలు మిగిలి ఉన్నాయి. ధైర్యవంతుడైన మెరైన్ ఆఫీసర్ జనరల్ రోలాండ్, కెప్టెన్ చెప్పిన సాహసోపేతమైన పథకాన్ని విని నవ్వుకున్నాడు, కానీ అతనికి ఆరు రైఫిల్స్ ఇచ్చి “గుడ్ లక్” చెప్పాడు. అక్కడ అతను తన భార్యను కూడా కలుసుకున్నాడు. తూర్పున ప్రచారం ప్రారంభించడానికి ముందు ఆమె కూడా మాతో పాటే యుద్ధంలో పాల్గొంది;అనారోగ్యం కారణంగా మాత్రమే ఆమె బౌర్బాకి సైన్యంతో కొనసాగలేకపోయింది. ఆమె ఇప్పుడు కోలుకుంది. అంతకంతకూ తీవ్రమవుతున్న చలిని ఎదుర్కోవలసి వస్తుందని, ఎన్నో కష్టాలు పడవలసి వస్తుందని తెలిసినా ఆమె వాటిని లెక్కచేయకుండా తన భర్తతో పాటు పోరాడడానికి వెళ్లాలని పట్టుబట్టింది. అతను ఆమె పట్టుదలకు తలొగ్గక తప్పలేదు. అలా వారు ముగ్గురూ, కెప్టెన్, అతని భార్య, మా సహచరుడు తమ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు. నిజానికి అక్కడకు వెళ్లడం కంటే తిరిగి రావడం చాలా కష్టం అనిపించింది. ఎవరికీ కనిపించకుండా ఉండటం కోసం వారు రాత్రి పూట మాత్రమే ప్రయాణం చేయాల్సి వచ్చింది. వారి దగ్గర ఆరు రైఫిల్స్ ఉండడం వలన ఎవరికీ అనుమానం రాకుండా చూసుకోవలసిన వచ్చింది. ఏదేమైనప్పటికీ, మమ్మల్ని వదిలి వెళ్లిన వారం తర్వాత, కెప్టెన్, అతని భార్య, కెప్టెన్ తో పాటు వెళ్లిన మనిషి మా దగ్గరకు తిరిగి వచ్చారు. పోరాటం తిరిగి ప్రారంభం కాబోతోంది.
III
అతను వచ్చిన మొదటి రోజు రాత్రే ఆ పోరాటాన్ని స్వయంగా ప్రారంభించాడు. చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలిస్తాననే నెపంతో ప్రధాన రహదారి వెంట వెళ్లాడు.
మాకు కోటగా ఉపయోగపడబోయే ఆ చిన్న గ్రామం నిర్జీవంగా ఉంది. గ్రామంలో పేదల ఇళ్ళ సముదాయం ఉంది, అందులో కొన్ని ఇళ్లు సరిగ్గా నిర్మించుకోలేదు. ఆ గ్రామం ఒక నిటారుగా ఉన్న కొండ వాలుపై ఉంది, గ్రామం చివరలో చెట్లతో నిండి ఉన్న ఒక మైదానం ఉంది.ఆ ఊరి వారు అక్కడి కలపను అమ్ముతారు; వారు ఆ కలపను వాలుల గుండా క్రిందికి పంపుతారు, స్థానికంగా వాటిని ‘కూలీస్’అని పిలుస్తారు. ఇవి మైదానానికి దారితీస్తాయి. అక్కడ వారు ఆ కలపను కుప్పలుగా పేర్చి, సంవత్సరానికి మూడుసార్లు కలప వ్యాపారులకు అమ్ముతారు. ఈ అమ్మకాలు జరిగే స్థలాన్ని, ప్రధాన రహదారి పక్కన ఉన్న రెండు చిన్న ఇళ్ల ద్వారా గుర్తించవచ్చు. ఇవి త్రోవ పక్కన సత్రాలు గా ఉపయోగపడతాయి. కెప్టెన్ ఈ కూలీస్‌లో ఒకదాని ద్వారా అక్కడికి వెళ్లాడు.
అతను వెళ్లి సుమారు అరగంట అయ్యింది. మేము లోయ పైభాగంలో కాపలాగా ఉన్నప్పుడు, మాకు ఒక తుపాకీ పేలుడు వినిపించింది. ట్రంపెట్ ఊదిన శబ్దం విన్నప్పుడే తన దగ్గరకు రావాలని, అంతవరకు కదల కూడదని మా కెప్టెన్ ఆదేశం. ఆ ట్రంపెట్ మేక కొమ్ముతో తయారు చేయబడింది, మూడు కిలోమీటర్ల దూరం వరకు దాని శబ్దం వినిపిస్తుంది; కానీ మాకు ఎలాంటి శబ్దం వినిపించక పోవడం తో మేము తీవ్రమైన ఆందోళనలో ఉన్నప్పటికీ, మా రైఫిల్స్‌ను పక్కన పెట్టుకుని మౌనంగా వేచి ఉన్నాం.
ఈ కూలీస్ గుండా క్రిందికి దిగడం ఏమంత కష్టం కాదు; సులభంగా జారుకుంటూ రావచ్చు; కానీ మళ్లీ పైకి వెళ్లడం చాలా కష్టం; చెట్ల కొమ్మలను పట్టుకుని పైకి ఎగబాకాలి, ఒక్కోసారి చేతులు, కాళ్ళతో బలాన్నంతా కూడగట్టుకుని పాకాల్సి వస్తుంది. ఒక గంట గడిచిపోయింది, కానీ అతను రాలేదు; పొదల్లో ఏ కదలికా లేదు. కెప్టెన్ భార్యకు ఓపిక నశించింది. ఏమయి ఉంటుంది? మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మేము విన్న ఆ కాల్పుల శబ్దం శత్రువులదా? మా నాయకుడిని- ఆమె భర్తను-ఎవరైనా చంపారా లేదా గాయపరిచారా? మాకు ఆలోచనలు అంతుబట్టలేదు; అతను చనిపోయి ఉండొచ్చు లేదా అతని ప్రయత్నం విజయవంతం అయి ఉండవచ్చని నేను అనుకున్నాను; అతను ఏమి చేశాడో తెలుసుకోవాలనే ఆత్రుత, కుతూహలం మాత్రమే నాలో ఉన్నాయి.
అకస్మాత్తుగా మాకు అతని ట్రంపెట్ శబ్దం వినిపించింది. మేము ఊహించినట్లుగా అది క్రింది నుండి కాకుండా, మా వెనుక ఉన్న గ్రామం నుండి రావడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. దాని అర్థం ఏమిటి? అది మాకు ఒక మిస్టరీ. కూడా అతను చనిపోయాడని, మమ్మల్ని ఉచ్చులోకి లాగడానికి ప్రష్యన్లు ఆ ట్రంపెట్ ఊదుతున్నారని మా అందరికీ అనిపించింది. కాబట్టి మేము ట్రిగ్గర్‌పై వేళ్లు పెట్టి, జాగ్రత్తగా కాపలా కాస్తూ, కొమ్మల కింద దాక్కుని గుడిసె దగ్గరకి తిరిగి వచ్చాము; కానీ మేము ఎంత బతిమాలినా వినకుండా, అతని భార్య ఒక ఆడుపులిలా ముందుకు ఉరికింది. ఆమె తన భర్త మరణానికి పగ తీర్చుకోవాలని అనుకుంది, ఆమె తన రైఫిల్‌కు కత్తి ని అమర్చుకుంది. మాకు మళ్లీ ట్రంపెట్ శబ్దం వినిపించింది కానీ అప్పటికి ఆమె మాకు ఇక కనిపించలేదు; కొద్దిసేపటి తర్వాత, ఆమె పిలుపు వినిపించింది:
“రండి! రండి! అతను బతికే ఉన్నాడు! అది అతనే!”
మేము వేగంగా పరిగెత్తాం. గ్రామం ప్రవేశద్వారం వద్ద కెప్టెన్ తన పైపు తాగుతూ కనిపించాడు, కానీ విచిత్రంగా, అతను గుర్రం మీద ఉన్నాడు.
“ఆహ్! ఆహ్!” అని అతను మాతో అన్నాడు, “ఇక్కడ చేయాల్సింది ఏదో ఉందని మీకు అర్థమై ఉంటుంది. నేను అక్కడ ఒక ఉహ్లాన్ ని కింద పడేసి, అతని గుర్రాన్ని తీసేసుకున్నాను; వారు అడవికి కాపలా కాస్తున్నారని అనుకున్నాను, తీరా చూస్తే తాగుతూ, విందులు చేసుకుంటున్నారు. వారిలో ఒకడు, గుమ్మం దగ్గర కాపలా ఉన్నవాడు, నన్ను చూసే లోపే నేను వాడి కడుపులో ఒక బుల్లెట్ దింపి, మిగతా వారు బయటకు వచ్చేలోపు, గుర్రం ఎక్కి క్షణాల్లో అక్కడి నుండి ఉడాయించాను. ఎనిమిది లేదా పది మంది నన్ను వెంబడించి ఉంటారు అని అనుకుంటున్నాను; కానీ నేను అడవుల గుండా అడ్డదారిలో వచ్చాను కాబట్టి కొద్దిగా అక్కడక్కడా గీసుకుంది, బట్టలు కాస్త చిరిగాయి, అయితే ఇక్కడకి చేరుకోగలిగాను. ఇప్పుడు నా ప్రియమైన మిత్రులారా,శ్రద్ధగా,జాగ్రత్తగా వినండి! ఆ దుర్మార్గులు మనల్ని పట్టుకునేంత వరకు శాంతించరు. మనం వారికి రైఫిల్ బుల్లెట్లతో స్వాగతం పలకాలి. రండి; మన స్థానాలకు వెళ్దాం!”
మేము బయలుదేరాము. మాలో ఒకరం గ్రామానికి చాలా దూరంలో ఉన్న కూడలిలో అతని స్థానంలోకి వెళ్ళాం ; మైదాన ప్రాంతం నుండి గ్రామంలోకి ప్రవేశించే ప్రధాన వీధి ప్రవేశద్వారం వద్ద నేను ఉన్నాను, మిగిలిన ఇద్దరు, అంటే కెప్టెన్, అతని భార్య, చర్చికి సమీపంలో, గ్రామం మధ్యలో ఉన్నారు. ఆ చర్చిగోపురం ఒక పరిశీలనా కేంద్రం గా, కోటగా మాకు ఉపయోగపడింది.
మేము మా స్థానాలకు వెళ్లిన కొద్దిసేపటికి మాకు ఒక కాల్పుల శబ్దం వినిపించింది. దాని తర్వాత మరొకటి, ఆపై రెండు, తర్వాత మూడు. మొదటిది స్పష్టంగా చేస్‌పాట్ నుండి వెలువడిన శబ్దం—దాని పదునైన శబ్దం ద్వారా ఎవరైనా దానిని గుర్తించగలరు, అది కొరడాతో కొట్టినట్లు ధ్వనిస్తుంది—మిగతా మూడు, అశ్వికుల చిన్న తుపాకుల నుండి వచ్చాయి.
కెప్టెన్‌కు చాలా కోపం వచ్చింది. శత్రువులను గ్రామంలోకి ప్రవేశించనియ్యాలని, గ్రామం వైపు కవాతుచేస్తూ వస్తే కొంత దూరం వారిని వెంబడించాలని,వారు ఇళ్ల మధ్యకు చొచ్చుకు వచ్చిన తర్వాత నాతో కలవాలని, గ్రామం ప్రవేశించడానికి ముందు పెట్టిన కాపలాదారుకు ఆదేశాలు ఇచ్చాడు. వారు గ్రామం మధ్యలో కి వచ్చిన తరువాత వారిపై పెట్రోలింగ్ బృందాలు, రెండు వైపుల నుండి కాల్పులు జరపాలని,ఏ ఒక్కరినీ తప్పించుకోనివ్వకూడదని మా పధకం;అవసరమైతే మేము ఆరుగురం, పదిమంది ప్రష్యన్లను చుట్టుముట్టేలా మా స్థానాలను ఏర్పాటు చేసుకున్నాము.
“ఆ మూర్ఖుడు పీడెలాట్ వారిని రెచ్చగొట్టాడు” అన్నాడు కాప్టెన్.“ఇక వారు గుడ్డిగా ముందుకు రావడానికి సాహసించరు. అంతేకాకుండా, వాడు కచ్చితంగా ఎక్కడో ఒకచోట బుల్లెట్ దెబ్బ తిని ఉంటాడు, అందుకే వాడి నుండి ఎటువంటి శబ్దం రాలేదు. వాడికి ఇది తగిన శాస్తే; నేను చెప్పినట్లు చేసి ఉండవలసింది?” అని కోపగించుకున్నాడు.ఆ తర్వాత కాసేపటికి, అతను తన గడ్డం లోపలే, “ఏది ఏమైనా పాపం కుర్రాడి గురించి నాకు బాధగా ఉంది; వాడు చాలా ధైర్యస్తుడు, చాలా బాగా తుపాకీ గురిపెట్టి కాల్చగలడు!”అని గొణుక్కున్నాడు.
కెప్టెన్ ఊహలు నిజమయ్యాయి. మేము సాయంత్రం వరకు వేచి చూశాము, కానీ ఉహ్లాన్‌లు కనిపించలేదు; మొదటి దాడి తర్వాత వారు వెనక్కి తగ్గారు; కానీ దురదృష్టవశాత్తూ మాకు పీడెలాట్ కూడా కనిపించలేదు. అతను చనిపోయాడా లేదా ఖైదీ అయ్యాడా? రాత్రి అయిన తర్వాత, మనం వెళ్లి వాడి కోసం వెతుకుదామని కెప్టెన్ ప్రతిపాదించాడు, దాంతో చీకటి పడ్డాక మేం ముగ్గురం బయలుదేరాము. గ్రామం కూడలి దగ్గర మాకు విరిగిన రైఫిల్, కొద్దిగా రక్తం కనిపించాయి;అక్కడి నేలంతా తొక్కేసినట్టు ఉంది;మేము అక్కడ ఉన్న అన్ని పొదలూ వెతికినా ఎక్కడా మాకు గాయపడిన వ్యక్తి గాని, మృతదేహం గాని కనిపించ లేదు; అర్ధరాత్రి దాటే వరకు వెతికినా. మా దురదృష్ట సహచరుడి జాడ తెలుసుకోకుండానే వెను తిరిగి వచ్చాము.
“ఇది చాలా విచిత్రంగా ఉంది,” అని కెప్టెన్ గొణిగాడు. “వారు వాడిని చంపి ఎక్కడో పొదల్లో పడేసి ఉంటారు;వాడిని బతికుండగా పట్టుకునే అవకాశం లేదు, ఎందుకంటే అలా జరిగి ఉంటే వాడు సహాయం కోసం కేకలు వేసి ఉండేవాడు. నాకిది అస్సలు అర్థం కావడం లేదు.” అతను అలా అంటుండగానే, ప్రధాన రహదారిపై ఉన్న సత్రం వైపు నుండి ప్రకాశవంతమైన మంటలు పైకి ఎగిసిడుతూ ఆకాశాన్ని వెలుగులతో నింపాయి.
“దుర్మార్గులు! పిరికిపందలు!”అని అతను అరిచాడు.”పగ తీర్చుకోవడానికి ఆ మార్కెట్ ప్లేస్‌లోని రెండు ఇళ్లకు వారు నిప్పు పెట్టి ఉంటారని నేను పందెం కాస్తాను, ఆపై ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడి నుండి పారిపోతారు. ఒక మనిషిని చంపి, రెండు ఇళ్లకు నిప్పు పెట్టినందుకు వారు సంతృప్తి చెంది ఉంటారు. సరే. కానీ దీనిని ఇలాగే వదిలేయ కూడదు. మనం వాళ్ల కోసం వెళ్లి వేటాడాలి; పోరాటాల కోసం వారు తమ వేడుకలను వదులుకోడానికి ఇష్టపడరు.”
“అదే సమయంలో మనం పీడెలాట్‌ను కూడా విడిపించ గలిగితే ఎంత అదృష్టం!” అని మాలో ఒకరు అన్నారు.
మేము ఐదుగురం కోపంతో, ఆశతో బయలుదేరాము. ఇరవై నిమిషాల్లో మేము వాలు అడుగు భాగానికి చేరుకున్నాము. సత్రానికి వంద గజాల దూరంలో ఉన్నప్పుడు కూడా మాకు ఎవ్వరూ కనిపించలేదు. అక్కడ ఉన్న ఆ ఇంటి వెనుక మంటలు ఉన్నాయి, ఇంటి పైకప్పు పైన మంటల ప్రతిబింబం మాత్రమే మాకు కనిపించింది. అయితే,దాడి జరగవచ్చుననే భయంతో మేము నెమ్మదిగా నడుస్తున్నాము. అకస్మాత్తుగా పీడెలాట్ గొంతు మాకు వినిపించింది. అయితే, అది వింతగా ఉంది; నోట్లో గుడ్డ కుక్కినప్పుడు గట్టిగా అరిచినట్లుగా—మందకొడిగా, అణిచివేయబడినట్లుగా. కానీ స్పష్టంగా వినిపిస్తోంది. అతను బొంగురుపోయిన గొంతుతో రొప్పుతున్నట్లుగా ఉంది, ఆ నిర్భాగ్యుడు “సహాయం చేయండి! కాపాడండి!” అని పదే పదే అరుస్తున్నాడు.
మేము ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలన్నీ పక్కనపెట్టి , రెండు అంగల్లో సత్రం వెనుక భాగానికి చేరుకున్నాము. అక్కడ ఒక భయంకరమైన దృశ్యం మా కంటపడింది.
IV
పీడెలాట్ సజీవ దహనం అవుతున్నాడు. అతను మండుతున్న కట్టెల కుప్ప మధ్యలో, ఒక కొయ్యకు కట్టబడి గిలగిల కొట్టుకుంటున్నాడు. మంటలు వాడిని దహించివేస్తున్నాయి. మమ్మల్ని చూడగానే, అతని నాలుక గొంతులో అతుక్కుపోయినట్లు అనిపించింది; వాడు తల దించుకున్నాడు, ప్రాణాలు వదిలేస్తున్నట్లుగా అనిపించాడు. ఆ మంటల కుప్పను పడగొట్టి, నిప్పును చెదరగొట్టి, అతడిని కట్టేసిన తాడును కోయడానికి మాకు ఒక్క క్షణం కూడా పట్టలేదు.
పాపం! వాడిని ఎంత భయంకరమైన స్థితిలో చూశామో! క్రితం రోజు సాయంత్రం అతని ఎడమ చెయ్యి విరిగినట్టుంది; అప్పటి నుండి వాడిని దారుణంగా కొట్టినట్లున్నారు, ఎందుకంటే, వాడి శరీరం నిండా గాయాలు, కమిలిన గుర్తులు, రక్తం మరకలు ఉన్నాయి. మంటలు అతన్ని దహించడం ప్రారంభించాయి. వాడి నడుముపై ఒక పెద్ద కాలిన గాయం, కుడి వైపు తొడపై మరొకటి ఉన్నాయి. వాడి గడ్డం, జుట్టు కాలిపోయాయి. పాపం పీడెలాట్!
ఈ దృశ్యం చూసిన మాకు ఎంత కోపం వచ్చిందో మాటల్లో చెప్పలేము! లక్ష మంది ప్రష్యన్ల మీదకైనా దూసుకెళ్లాలన్నంత పగ. ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరిక తో రగిలి పోతున్నాము. కానీ ఆ పిరికిపందలు పారిపోయారు. ఇప్పుడు వారిని ఎక్కడని వెతక గలం? ఈలోగా కెప్టెన్ భార్య పీడెలాట్‌కు సపర్యలు చేస్తూ, చేతనైనంతగా అతని గాయాలకు కట్టు కడుతోంది. కెప్టెన్ ఉద్వేగంతో అతని చేయి పట్టుకున్నాడు. కొన్ని నిమిషాల తరువాత వాడు స్పృహలోకి వచ్చాడు.
“గుడ్-మార్నింగ్, కెప్టెన్; మీ అందరికీ గుడ్-మార్నింగ్,” అన్నాడు. “ఆహ్! ఆ దుర్మార్గులు, నీచులు! ఏకంగా ఇరవై మంది వచ్చారు.”
“ఇరవై మందా?”
“అవును; వాళ్లంతా ఒక ముఠాగా వచ్చారు, అందుకే నేను కెప్టెన్ ఆదేశాలను దిక్కరించి వారిపై కాల్పులు జరిపాను. లేకపోతే వారు మీ అందరినీ చంపేసేవారు; వారిని ఆపడానికే నేను ప్రాధాన్యత ఇచ్చాను. అది వారిని భయపెట్టింది, ఆ కూడలి దాటి ముందుకు రావడానికి వారు సాహసించలేదు. వారు ఎంత పిరికివారంటే… నలుగురు వ్యక్తులు ఇరవై గజాల దూరం నుండి నన్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు, ఆ తర్వాత కత్తులతో నరికారు. నా చెయ్యి విరిగింది, కాబట్టి నేను ఒక చేత్తో మాత్రమే నా బయోనెట్ ని ఉపయోగించగలిగాను.”
“కానీ నువ్వు సహాయం కోసం మమ్మల్ని ఎందుకు పిలవలేదు?”
“నేను అలా చేయకుండా జాగ్రత్తపడ్డాను, ఎందుకంటే మీరు పిలవగానే వచ్చేవారు; ఇరవై మందితో కేవలం ఐదుగురున్న మీరు పోరాడి నన్ను రక్షించుకోలేరు, మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోలేరు.”
“నిన్ను అలా పట్టుకెళ్లడానికి మేము అనుమతించే వాళ్లం కాదని నీకు తెలుసు కదా, మిత్రమా.”
“నేనొక్కడినే చనిపోవడానికి ఇష్టపడ్డాను, అర్థం చేసుకోండి! మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం నాకు ఇష్టం లేదు, అది కేవలం ఒక ఉచ్చుగా మారేది.”
“సరే, మనం దాని గురించి ఇక మాట్లాడొద్దు. నీకు కొంచెం ఉపశమనంగా ఉందా?”
“లేదు, నాకు ఊపిరి ఆడటం లేదు. నేను ఇంక ఎంతో సేపు బతకనని నాకు తెలుసు. ఆ మృగాలు! వాళ్ళు నన్ను ఒక చెట్టుకు కట్టేసి, సగం చచ్చేదాకా కొట్టారు, ఆ తర్వాత నా విరిగిన చేతిని పట్టుకుని కుదిపేశారు; కానీ నేను ఒక్క శబ్దం కూడా చేయలేదు. వాళ్ళ ముందు అరవడం కంటే నా నాలుక కొరుక్కోవడమే మంచిది అనుకున్నాను. ఇప్పుడు నేను పడుతున్న బాధను మీకు చెప్పగలను, కన్నీరు కార్చగలను; అది నాకు సాంత్వననిస్తుంది. ధన్యవాదాలు, నా మంచి మిత్రులారా.”
“పాపం పీడెలాట్! కచ్చితంగా మేము నీ పగ తీర్చుకుంటాం!”
“అవును, అవును; మీరు అలా చేయాలనే నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా,మన కెప్టెన్ చంపిన అశ్వికుడి భార్యగా, ఆ గుంపులో ఒక మహిళ చలామణి అవుతున్నది. ఆమె అశ్వికుడి లాగా దుస్తులు ధరించి ఉంది. నిన్న నన్ను అత్యంత దారుణంగా హింసించింది ఆమే. నన్ను తగలబెట్టాలని సూచించింది కూడా ఆమే; కట్టెలకు నిప్పు పెట్టింది కూడా ఆమే. ఓహ్! ఆ దుర్మార్గురాలు, ఆ మృగం! ఆహ్! నేను ఎంత బాధపడుతున్నానో! నా నడుము, నా చేతులు!” అంటూ వాడు భయంకరమైన నొప్పితో గిలగిల కొట్టుకుంటూ, ఆయాసంతో కింద పడిపోయాడు. కెప్టెన్ భార్య వాడి నుదుటిపై ఉన్న చెమటను తుడుస్తుండగా, మేమంతా చిన్నపిల్లల్లా దుఃఖంతో, కోపంతో కన్నీరు కార్చాము. వాడి చివరి క్షణాలను నేను మీకు వివరించ లేను; వాడు అరగంట తర్వాత చనిపోయాడు, అంతకుముందే శత్రువులు ఏ దిశగా వెళ్లారో మాకు చెప్పాడు. అతను చనిపోయాక వాడిని పూడ్చి పెట్టడానికి కొంచెం సమయం తీసుకున్నాము, ఆపై కోపంతో, ద్వేషంతో రగిలిపోతూ వారిని వెంబడిస్తూ బయలుదేరాము.
“అవసరమైతే మొత్తం ప్రష్యన్ సైన్యం మీద పడదాం,” అని కెప్టెన్ అన్నాడు; ” మనం పీడెలాట్ మరణానికి ప్రతీకారం తీర్చుకుందాం. ఆ దుర్మార్గులను మనం పట్టుకోవాలి. వారిని పట్టుకోలేకపోతే చనిపోవడానికైనా సిద్ధపడదామని ప్రమాణం చేద్దాం; ఒకవేళ నేను ముందుగా చనిపోతే, నా ఆదేశాలు ఇవే: మీరు పట్టుకున్న ఖైదీలందరినీ వెంటనే కాల్చి చంపాలి, ఇక ఆ అశ్వికుడి భార్య విషయానికొస్తే, ఆమెను చంపే ముందు తీవ్రంగా హింసించాలి.”
“ఆమె ఒక మహిళ కాబట్టి ఆమెను కాల్చి చంపకూడదు,” అని కెప్టెన్ భార్య అంది. “మీరు బతికుంటే, ఒక మహిళను కాల్చి చంపరని నాకు తెలుసు. ఆమెను హింసిస్తే సరిపోతుంది; కానీ ఈ వేటలో మీరు చనిపోతే, నేను కోరుకునేది ఒక్కటే, నేను ఆమెతో పోరాడాలి; నా స్వహస్తాలతో ఆమెను చంపుతాను, ఒకవేళ ఆమె నన్ను చంపితే, మిగతావారు ఆమెను ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు.”
“మనం ఆమెను అవమానిద్దాం! ఆమెను తగలబెడదాం! ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేద్దాం! పీడెలాట్ మరణానికి ప్రతీకారం తీర్చుకుందాం! కంటికి కన్ను, పంటికి పన్ను!” ఇలా సాగాయి మా ఆలోచనలు.
V
మరుసటి రోజు ఉదయం మేము అనుకోకుండా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉహ్లాన్‌ల స్థావరంపై దాడి చేశాము. మా ఆకస్మిక దాడికి ఆశ్చర్యపోయిన వారు గుర్రాలను కూడా ఎక్కలేకపోయారు, కనీసం తమను తాము రక్షించుకోలేకపోయారు; కొద్ది నిమిషాల్లోనే మా సంఖ్యకు సమానంగా ఐదుగురు ఖైదీలను పట్టుకున్నాము. కెప్టెన్ వారిని ప్రశ్నించాడు;వారి సమాధానాలను బట్టి ముందు రోజు మేము ఎదుర్కొన్నది వారినేనని మాకు అర్థమైంది. అప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. వారి లింగ నిర్ధారణ మాలో ఒకరికి అప్పగించబడింది. మా స్నేహితుడిని హింసించిన మహిళా అశ్వికురాలు వారిలో ఉందని తెలిసినప్పుడు మా ఆనందానికి అవధులు లేవు.
మిగతా నలుగురిని మాకు వీపు చూపేలా నిలబెట్టి, మా రైఫిల్స్‌తో అక్కడికక్కడే కాల్చి చంపాము; ఆ తర్వాత ఆ మహిళపై మా దృష్టి సారించాము. మేం ఆమెను ఏం చేయబోతున్నాం? మేమంతా ఆమెను కాల్చి చంపాలనే అనుకున్నామని నేను ఒప్పుకోవాలి. ద్వేషం, పీడెలాట్ ని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక, మాలో జాలిని చంపేసింది. ఒక మహిళను కాల్చబోతున్నామన్న విషయాన్ని మేము మర్చిపోయాము, కానీ ఒక మహిళ (కెప్టెన్ భార్య) మాకు ఆ విషయాన్ని గుర్తు చేసింది; ఆమె బతిమాలడంతో, మేము ఆమెను ఖైదీగా ఉంచాలని నిర్ణయించుకున్నాము.
ఆ విధంగా దయ చూపించినందుకు పాపం కెప్టెన్ భార్య తీవ్రమైన శిక్షను అనుభవించాల్సి వచ్చింది.
మరుసటి రోజు, కాల్పుల విరమణ తూర్పు ఫ్రాన్స్‌కు కూడా పొడిగించబడిందని మేము విన్నాము. దాంతో మా చిన్న పోరాటాన్ని ముగించాల్సి వచ్చింది. మాలో ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు, కాబట్టి మేం మొత్తం నలుగురం మాత్రమే మిగిలాము: కెప్టెన్, అతని భార్య మరో ఇద్దరం. మేము బెసాన్‌కాన్ కు చెందినవారం, కాల్పుల విరమణ జరిగి నప్పటికీ ఆ ప్రాంతం ఇంకా ముట్టడిలోనే ఉంది.
“మనం ఇక్కడే ఆగిపోదాం,” అని కెప్టెన్ అన్నాడు. “యుద్ధం ఇలా ముగుస్తుందని నేను నమ్మలేకపోతున్నాను. దరిద్రం!! ఫ్రాన్స్‌లో ఇంకా మగవాళ్ళు మిగిలే ఉన్నారు; వారు ఏమిటో నిరూపించుకోవాల్సిన సమయం ఇది. వసంతకాలం వస్తోంది, ఈ కాల్పుల విరమణ కేవలం ప్రష్యన్ల కోసం వేసిన ఒక వల మాత్రమే. విరమణ కాలంలో ఒక కొత్త సైన్యం తయారవుతుంది; ఒక మంచి ఉదయాన మనం మళ్లీ వారిపై దాడి చేస్తాం. మనం సిద్ధంగా ఉండాలి, మన దగ్గర ఒక బందీ కూడా ఉంది -మనం ఇక్కడే ఉందాం.”
మేము మా నివాసాన్ని అక్కడే ఏర్పాటు చేసుకున్నాము. చలి విపరీతంగా ఉంది, మేము ఎక్కువగా బయటకు వెళ్ళలేదు. ఆ మహిళా ఖైదీని ఎప్పుడూ ఎవరో ఒకరు గమనిస్తూనే ఉన్నాం .
ఆమె విచారంగా ఉంటూ, ఎప్పుడూ ఏమీ మాట్లాడేది కాదు, లేదా కెప్టెన్ చంపిన తన భర్త గురించి మాత్రమే మాట్లాడేది. ఆమె అతని వైపు ఎప్పుడూ క్రూరంగా చూసేది, ఆమెలో పగ తీర్చుకోవాలనే పిచ్చి కోరిక రగులుతోందని మాకు అనిపించింది. పీడెలాట్‌ను ఆమె, భయంకరమైన చిత్రహింసలకు గురిచేసినందుకు ఇదే తగిన శిక్ష అని మాకు అనిపించింది, ఎందుకంటే ఏమీ చేయలేని నిస్సహాయమైన ప్రతీకారకాంక్ష ఎంత తీవ్రమైన బాధ!
అయ్యో! మా సహచరుడి పగ ఎలా తీర్చుకోవాలో తెలిసిన మేము, ఈ మహిళ కూడా తన భర్తను చంపిన పగ ఎలా తీర్చుకోవాలో అని ఆలోచిస్తుంటుందని ఊహించి, అప్రమత్తంగా ఉండాల్సింది. నిజానికి ప్రతి రోజు రాత్రి మాలో ఒకరం ఆమెకు కాపలా ఉండేవాళ్ళం. మొదట్లో గోడకు అమర్చిన పెద్ద ఓక్ చెక్క బెంచీకి ఆమెను ఒక పొడవైన తాడుతో కట్టి ఉంచేవాళ్ళం. కానీ, పోనుపోను మాపై ఆమెకు ఎంత ద్వేషం ఉన్నప్పటికీ, ఎప్పుడూ తప్పించుకోవడానికి ప్రయత్నించకపోవడంతో, తీసుకుంటున్న జాగ్రత్తలను కాస్త సడలించాము. ఆ బెంచీ మీద కాకుండా, ఆమెను వేరే చోట, కట్టేయకుండానే నిద్రపోవడానికి అనుమతించాము. మాకు భయమెందుకు? ఆమె గది చివరన ఉంటుంది, గుమ్మం దగ్గర ఒక మనిషి కాపలా ఉంటాడు, ఆ కాపలాదారుడికి, ఆమెకు మధ్య కెప్టెన్ భార్య, ఇద్దరు పురుషులు పడుకుంటారు. ఆమె ఒంటరిగా, ఆయుధాలు లేకుండా నలుగురి మధ్యలో ఉంది, కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు అని అనుకున్నాము .
ఒక రోజు రాత్రి మేము నిద్రపోతున్నప్పుడు, కెప్టెన్ ఆమెకు కాపలా కాస్తున్నాడు. అశ్వికుడి భార్య తాను పడుకునే మూలలోనే ఎప్పటికంటే చాలా నిశ్శబ్దంగా పడుకుని ఉంది. అంతేకాదు,మాకు బందీ అయినప్పటి నుండీ ఏనాడూ నవ్వని ఆమె, ఆ రోజు సాయంత్రం మొదటిసారి చిరునవ్వు కూడా నవ్వింది. అయితే, అకస్మాత్తుగా అర్ధరాత్రి భయంకరమైన అరుపు విని మేమంతా నిద్రలేచాము. మేము తడుముకుంటూ వెళ్లి, కోపంతో నేలమీద దొర్లుతూ పోట్లాడుకుంటున్న జంటపై పడ్డాము-వారు కెప్టెన్, అశ్వికుని భార్య. మేము వారిపై పడి, క్షణాల్లో వారిని విడదీశాము. ఆమె అరుస్తూ, నవ్వుతోంది, అతను మృత్యు వేదనతో గిలగిల కొట్టుకుంటున్నాడు. ఇదంతా చీకటిలో జరిగింది. మాలో ఇద్దరం ఆమెను పట్టుకున్నాము, దీపం వెలిగించినప్పుడు, ఒక భయంకరమైన దృశ్యం మా కంటపడింది. కెప్టెన్ రక్తపు మడుగులో నేలపై పడి ఉన్నాడు, అతని గొంతుపై ఒక పెద్ద కోత ఉంది;అతని రైఫిల్ నుండి తీయబడిన బయోనెట్, ఎర్రగా, నోరు తెరుచుకున్నట్లున్న ఆ గాయంలో గుచ్చుకుని ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడలేక పోయాడు; కొన్ని నిమిషాల తర్వాత అతను చనిపోయాడు.
అతని భార్య కంటతడి పెట్టలేదు. ఆమె కళ్ళు పొడిగా ఉన్నాయి, ఆమె గొంతు బిగుసుకుపోయింది. ఆమె అశ్వికుని భార్య వైపు స్థిరంగా, భయాన్ని కలిగించే ప్రశాంతమైన క్రూరత్వంతో చూసింది.
“ఈ మహిళ నా సొంతం,” అని ఆమె అకస్మాత్తుగా మాతో అంది. “ఒకవేళ ఆమె నా భర్తను చంపితే, నా ఇష్టం వచ్చినట్లు ఆమెను చంపడానికి నాకు అనుమతి ఇస్తూ మీరు వారం క్రితమే నాకు ప్రమాణం చేశారు; మీరు మీ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. మీరు ఆమెను పొయ్యికి వెనుక వైపుకు నిటారుగా ఉండేలా గట్టిగా కట్టేయండి, ఆపై మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కానీ ఇక్కడి నుండి చాలా దూరంగా వెళ్ళండి. ఆమెపై నా పగ నేనే తీర్చుకుంటాను. కెప్టెన్ మృతదేహాన్ని వదిలేయండి, మేం ముగ్గురం, అతను, ఆమె, నేను ఇక్కడే ఉంటాం.”
మేము ఆమె మాట విని, వెళ్ళిపోయాము. మేము జెనీవాకు తిరిగి వెళుతున్నందున, ఆమె మాకు అక్కడికి ఉత్తరం రాస్తానని హామీ ఇచ్చింది.
VI
రెండు రోజుల తర్వాత నాకు ఈ ఉత్తరం అందింది, దానిలో మేము అక్కడినుండి బయలుదేరిన మరుసటి రోజు తేదీ ఉంది, అది ప్రధాన రహదారిపై ఉన్న ఒక సత్రంలో రాసినది.
“నా మిత్రమా: నేనిచ్చిన మాట ప్రకారం నీకు ఉత్తరం రాస్తున్నాను.ఇప్పుడు నేను ఆ సత్రంలో ఉన్నాను, ఇక్కడే నా ఖైదీని ఒక ప్రష్యన్ అధికారికి అప్పగించాను.
“నా మిత్రమా, పాపం ఈ మహిళ జర్మనీలో ఇద్దరు పిల్లలను వదిలి వచ్చిందని నేను నీకు తెలియచేయాలి. తన పిల్లలు, వారి తాతయ్య ,నాయనమ్మల దగ్గర ఉన్నారని, తాను ఎంతో ప్రేమించే తన భర్తను ఒంటరిగా యుద్ధ ప్రమాదాలకు వదిలేయడం ఇష్టంలేక ఆమె అతడిని అనుసరించిందట. ఇదంతా నేను నిన్ననే తెలుసుకున్నాను;ఇది నా ప్రతీకారం తీర్చుకోవాలనుకునే ఆలోచనలను, మానవత్వం తో నింపింది . సజీవ దహనం చేయబడిన పీడెలాట్‌ను గుర్తుచేసుకుని, ఈ మహిళను అవమానిస్తూ, ఆమెను అత్యంత భయంకరంగా హింసిస్తూ, ఆమెను కూడా అదే విధంగా మరణంతో బెదిరించి, సంతోషాన్ని అనుభవిస్తున్న క్షణంలో, ఆమె నా వైపు చల్లగా చూసి ఇలా అంది:
“‘ఫ్రెంచ్ మహిళా, నన్ను ఎందుకు నిందిస్తున్నావు? నీ భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం సరైన పని అని నువ్వు అనుకుంటున్నావు, అంతే కదా?’
“‘అవును,’ అని నేను బదులిచ్చాను.
“‘సరే,నన్ను తగలబెట్టడం ద్వారా నీ పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావు. నేను చేసింది కూడా అదే.నేను నా భర్త ను చంపిన వాడిపై పగ తీర్చుకున్నాను- నీ భర్త నా భర్తను చంపాడు.’
“నువ్వు ఈ పగను ఆమోదిస్తున్నావు కాబట్టి, దానిని భరించడానికి సిద్ధంగా ఉండు,”అని జవాబు ఇచ్చాను
“‘నేను భయపడను.”
“నిజానికి ఆమె ధైర్యం కోల్పోయినట్లు కనిపించలేదు. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది, నేను కలపను, ఎండిన ఆకులను ఒకచోట చేర్చి, వాటిపై కొన్ని తూటాల పొడిని వెర్రిగా విసురుతున్నప్పుడు, ఆమె వణకకుండా నా వైపు చూసింది, ఆ తూటాల పొడి ఆమె చితిని మరింత దారుణంగా మార్చడానికోసం వేసాను.
“నేను ఒక్క క్షణ కాలం హింసించాలన్న నా ఆలోచనలను సందేహించాను. కానీ, కెప్టెన్ అక్కడ పాలిపోయి రక్తంతో తడిసిపోయి ఉన్నాడు, అతను తన పెద్ద, గాజు లాంటి కళ్లతో నా వైపే చూస్తున్నట్లు అనిపించాడు. నేను అతని పాలిపోయిన పెదవులను ముద్దాడిన తర్వాత, మళ్ళీ నా పనిలో నిమగ్నమయ్యాను. అయితే అకస్మాత్తుగా నా తల ఎత్తగానే, ఆమె ఏడుస్తుండటం చూసి నేను ఆశ్చర్యపోయాను.”
“‘అంటే నువ్వు భయపడుతున్నావా?” అని నేను ఆమెతో అన్నాను.
“‘లేదు, కానీ నువ్వు నీ భర్తను ముద్దాడటం చూసినప్పుడు, నేను నా భర్త గురించి, నేను ప్రేమించే వారందరి గురించి ఆలోచించాను.”
“ఆమె ఏడుస్తూనే ఉంది, కానీ అకస్మాత్తుగా ఆగిపోయి, తడబడుతున్న మాటలతో, హీనస్వరం తో :
“‘నీకు పిల్లలు ఉన్నారా?”అని అడిగింది.
” అప్పుడే నా ఒంట్లో వణుకు పుట్టింది, ఎందుకంటే, పాపం,ఆ మహిళకు పిల్లలు ఉన్నారన్న విషయం నేను ఊహించాను. ఆమె నన్ను తన రొమ్ము దగ్గర ఉన్న పాకెట్‌బుక్‌ను తెరిచి చూడమని కోరింది. నేను తెరిచి చూస్తే, అందులో ఇద్దరు చిన్నారుల ఫోటోలు ఉన్నాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. జర్మన్ పిల్లలకు ఉండే దయగల, సున్నితమైన ముఖాలతో,బొద్దుగా ఉన్నారు. అందులో లేత రంగు జుట్టు తో రెండు కుచ్చులు, పిల్లల చేతివ్రాతతో-పెద్దపెద్ద అక్షరాలతో-ఉన్న ఒక ఉత్తరం ఉన్నాయి, అది జర్మన్ భాషలో ఉంది. అది ఇలా మొదలైంది:
“‘నా ప్రియాతి ప్రియమైన అమ్మ..”
“ఆ ఉత్తరాన్ని చూసిన నాకు కన్నీళ్లు ఉబికి వచ్చాయి, ఆమె కట్లు విప్పేసాను; సత్రం వరకు ఆమెతో వెళ్లాను. ఆమెని అక్కడ వదిలి వచ్చేసాను. ఇక ఆమె స్వేచ్ఛాజీవి. ఆమె కన్నీళ్లు కారుస్తూనే నన్ను ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు నేను నా భర్త దగ్గరకు మేడపైకి వెళుతున్నాను; నా ప్రియమైన మిత్రమా, నా భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకోలేని నేను అతని ముఖం చూడలేను.వీలైనంత త్వరగా వచ్చి మా రెండు మృతదేహాలను తీసుకొని వెళ్ళు”.
నేను వెంటనే బయలుదేరాను, నేను అక్కడికి చేరుకునే సరికి ఆ గుడిసె వద్ద ప్రష్యన్ పెట్రోలింగ్ బృందం ఉంది; పరిస్థితి ఏమిటని నేను అడిగితే, లోపల ఫ్రాంక్-టైరర్స్ కెప్టెన్, అతని భార్య, ఇద్దరూ చనిపోయి ఉన్నారని చెప్పారు. నేను వారి పేర్లు చెప్పాను; నాకు వారు తెలుసని వాళ్ళు గ్రహించారు; వారి అంత్యక్రియలు నిర్వహించడానికి నాకు అనుమతి ఇవ్వమని వేడుకున్నాను.
“ఇప్పటికే ఎవరో వచ్చి ఆ బాధ్యత తీసుకున్నారు,” అని సమాధానం ఇచ్చారు. “వారు మీకు తెలిసిన వాళ్ళే కాబట్టి, మీకు ఇష్టమైతే లోపలికి వెళ్ళండి. వారి అంత్యక్రియల గురించి వారి స్నేహితురాలితో మాట్లాడుకోవచ్చు.”
నేను లోపలికి వెళ్ళాను. కెప్టెన్,అతని భార్య ఒక మంచం మీద పక్కపక్కనే పడుకుని ఉన్నారు, వారిపై ఒక దుప్పటి కప్పి ఉంది. నేను దానిని ఎత్తి చూశాను, భార్య కూడా తన భర్త చనిపోవడానికి కారణం అయిన గాయం లాంటిదే చేసుకుందని గ్రహించాను.
మంచం పక్కన, వారి ప్రాణ స్నేహితురాలని నాకు చెప్పిన ఆ మహిళ కూర్చుని, చనిపోయిన వారిని చూస్తూ, ఏడుస్తూ ఉంది.
ఆమె అశ్వికుని భార్య.
