అంతులేని కరుణకు నిలువెత్తు సాక్ష్యం చేగువేరా
డా. రాయదుర్గంవిజయలక్ష్మి
వ్యక్తికీ, సమాజానికీ మధ్య పరస్పర సంబంధాలున్నా, ప్రతి వ్యక్తీ తనదైన ఒక సమాజానికి కేంద్రమే అవుతారు. కాని కొందరు వ్యక్తులు మాత్రమే చరిత్ర నిర్మాతలు కాగలరు. నిరంతర ప్రవాహశీలత గల ఉత్సాహం, నిజాయితీతో కూడిన
పట్టుదల, రాజీలేని పోరాట పటిమ, నిర్భాగ్యుల స్థితికి చలించే కరుణాంతరంగం, ఇవన్నీ గల విప్లవకారుడు, ‘ప్రవహించే ఉత్తేజం’ చేగువేరా కూడా అటువంటి చరిత్ర నిర్మాతే!
లాటిన్ అమెరికాలోని అర్జెంటీనాలో రోజారియో పట్టణంలో 1928 జూన్ 14న జన్మించిన చేగువేరా, సెలియాదలాసిర్నా, ఎర్నెస్తో గెవారాలింఛ్‌ల తొలి చూలు సంతానం. ఎర్నెస్తో గువేరా దలాసిర్నా అనేపేరు, అమెరికన్
సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి సాగిన పోరాట నేపథ్యంలో ”చేగువేరా’గా మారింది. అర్జెంటీనా భాషలో ‘చే’ అనేది పలకరింపు పదం. ఎర్నెస్తో ఎవరితో మాట్లాడినా, ‘చే’ అనే పలకరింపు మాటతో ప్రారంభించేవాడట! అందుకే అందరూ
అతనిని ‘చేగువేరా’గా అని పిల్చుకున్నారు.
‘ప్రవహించే ఉత్తేజం చేగువేరా’ కాత్యాయని గారు రాసిన పుస్తకం ఇటీవల చదివిన మంచి పుస్తకాల్లో ఒకటి. చదువుతున్నంతసేపే కాదు, తర్వాత కూడా చేగువేరా వ్యక్తిత్వం మనల్ని ఆలోచింపచేస్తుంది. మూడేండ్ల ప్రాయం నుంచీ ఆస్తమాతో బాధపడే చేగువేరా చిన్నతనం నుండీ అరుదైన, విలక్షణమైన వ్యక్తిత్వంతో ఎదిగాడు. తల్లి నుంచి స్ఫూర్తిని పొందిన ‘చే’ ఎవరైనా తన మీద జాలి చూపితే సహించేవాడు కాదు. సరైన బట్టలు, బూట్లు లేకుండా అడవుల్లో
ప్రయాణించేటప్పుడు కూడా యీ గెరిల్లా యోధుడు, ఒకవైపు తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతూనే, ఎవరి సాయమూ తీసుకోక తన ఆయుధ సామాగ్రి వగైరాలను తానే మోస్తూ, దళ కమాండర్‌గా తన దళాన్ని ఒక్క త్రాటిమీద నడిపించగలిగిన సున్నిత మనస్కుడు. కొన్ని విషయాల్లో ఎంత మొండిగా, దురుసుగా నిర్లక్ష్యంగా
ప్రవరిస్తాడో, మరికొన్ని విషయాల్లో చాలా సున్నితంగా స్పందించే లక్షణం గలవాడు.
అసాధ్యమనుకున్న పనిని సాధించేవరకు పట్టువదలని తత్వం గల ‘చే’ పన్నెండేళ్ళ వయస్సులోనే అల్తా గ్రాసియా (కార్దోబా ప్రాంతంలోనిది)లో నివసిస్తున్న జర్మన్ల దగ్గరికెళ్ళి, నాజీల దురాక్రమణల గురించి వ్యతిరేకంగా ప్రచారం
చేసినవాడు. ప్రజలకు సేవ చేసేందుకని ఇంజనీరింగ్ కోర్సులో చేరినా, పక్షవాతానికి గురైన అమ్మమ్మ మరణవేదనా, ఆస్తమాతో చాలాకాలంగా తను అనుభవిస్తున్న బాధా – ఎర్నెస్తో చేగువేరా దృక్పథాన్ని మార్చివేశాయి.
ఇంజనీరింగ్ చదువును మానేసి, వైద్య విద్యలో చేరేందుకు అతనిని ప్రోత్సహించాయి.
వెల్లువెత్తే కరుణశీలతను స్వభావంగా కలిగిన గొప్ప విప్లవోద్యమ నాయకుడు చే. క్యూబా విముక్తోద్యోమ పోరాట కాలంలో గాయపడినవారు తమవారైనా, శత్రు సైనికులైనా వారికి కావలసిన వైద్యసేవల్ని అందించేవాడు చేగువేరా. కాంగో
విమోచనోద్యమ కాలంలో కాంగోయిన్ల పిప్పి పళ్ళను పీకే కార్యక్రమాన్ని కూడా ఉద్యమ స్థాయిలోనే చేయగలిగాడు. ఇంతెందుకు? బొలీవియన్ పోరాట కాలంలో తాను బందీగా దొరికిపోయి శత్రు స్థావరానికి తీసుకుపోబడుతున్న సమయంలో కూడా గాయపడిన శత్రు సైనికులకు చికిత్స నందించగలిగిన కరుణాశీలి. పేదరికంలో మగ్గుతూ, సామ్రాజ్యవాదుల చేతుల్లో, పెట్టుబడిదారుల చేతుల్లో ఘోరంగా మోసగింపబడుతున్న ప్రజలకు విద్య అవసరాన్ని గుర్తించినవాడు చే.
గెరిల్లా శిక్షణా కాలం నుంచి కూడా. తానెక్కడికి వెళ్తే అక్కడి అట్టడుగు ప్రజలకు చదువు నేర్పడం, వారికి వైద్యసేవల్ని అందించడం, క్రమశిక్షణ నేర్పడం – అనే పనుల్ని ఎప్పుడూ మరిచిపోని మానవతావాది చే. మెడిసిన్ చదువుతున్న రోజుల్లోనే మోటారు సైకిలుపై చేసిన లాటిన్ అమెరికా యాత్ర, రెండుసార్లుగా తిరిగిన దాదాపు 5,000 మైళ్ళ ప్రయాణం చేగువేరాకు ఎన్నో సత్యాలను ఆవిష్కరించింది. కజ్‌కో ప్రాంతపు ప్రకృతి సౌందర్యం, చారిత్రక విశేషాలు ‘చే’ను ఎంతగా ఆకర్షించాయో అంతకన్నా ఎక్కువగా, ఇండియన్ తెగల జీవన గతులు అతనిలో ఆవేదనను కల్గించాయి. శ్రామికుల దుర్భరమైన జీవితం, నియంతల నీతిబాహ్య పరిపాలన, నరక కూపాల వంటి రాగి గనులు. ఆ కార్మికుల దయనీయమైన జీవితాలు, కనీస అవసరాలకు కూడా నోచుకోని తెగల ఆవాసాలు, కుష్టువ్యాధి పీడితుల కాలనీలూ, రైతాంగం మీద సాగుతున్న దోపిడీలు, విద్యావంతులు, ధనికులు – మోసగాళ్ళుగా దళారీలుగా మారి దోపిడీవర్గాలకు
ఊడిగం చేయటం, కన్నబిడ్డలు రోగాలతో మరణిస్తున్నా నిర్లిప్తంగా, నిస్సహాయంగా చూస్తుండి పోతున్న నిరుపేద తల్లిదండ్రులూ – పేదరికం మానవ సహజమైన స్పందనల్ని కూడా చంపేస్తోందని గ్రహించి చలించిపోయాడు చేగువేరా.
”ఘనత వహించిన అమెరికా యాత్రల వల్ల నేను గతంలో అనుకున్న దానికన్నా ఎంతో మారిపోయాను” అని డైరీలో రాసుకున్న ‘చే’ లాటిన్ అమెరికా రాజకీయ పరిణామాలను శ్రద్ధగా అధ్యయనం చేశాడు.
ఎక్కడికి వెళ్ళినా పుస్తకం జేబులో వేసుకెళ్ళే నిరంతర పాఠకుడు చేగువేరా పుస్తకాల నుండి, యాత్రల వలన కలిగిన ప్రత్యక్ష సాక్ష్యానుభవాల నుంచి కూడా, సమాజాన్ని తన మేధతో కొలవడం నేర్చుకున్నాడు. తన భవిష్యత్తు కార్యక్రమాల్ని ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకున్నాడు. మెడిసిన్ పూర్తికాగానే, వెనిజులాలో ప్రాక్టీసు చేస్తానని ఇంట్లో చెప్పి ‘అమెరికా పోరాట యోధుడు మీకు వీడ్కోలు చెబుతున్నాడు’ అని బయలుదేరిన చేగువేరా బొలీవియాను చేరుకున్నాడు. గ్వాటిమాలాలో కుప్పకూలిన ప్రజాస్వామ్యపు విషాదాన్ని మోసుకుంటూ మెక్సికో చేరిన చేగువేరాకు మెక్సికోలో ఫైడల్ కాస్ట్రో పరిచయం లభించింది.
చేతిలో చిల్లిగవ్వ లేకుండా, దొరికిన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, వదిలేస్తూ, లాటిన్ అమెరికా బడుగు వర్గాల జీవితాల్లో చైతన్యాన్ని నింపాలని పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటూ, నిరంతరం పరితపించే ‘చే’ – యీ కాలంలోనే కొన్ని పరిశోధనా పత్రాలు రాశాడు. చదరంగం, బ్యాట్‌మింటన్ బాగా ఆడగల్గిన చే, ఫొటోగ్రఫీలో కూడా కృషి చేశాడు. ఒక్క క్షణం కూడా వృధా కానీయకుండా జీవించగల కళను సొంతం చేసుకున్నాడు ‘చే’. 1956 నవంబర్ 26న ‘గ్రాన్‌మా’ నావలో క్యూబాకు చేరుకున్న చేగువేరా ఫైడల్ నాయకత్వంలో సాగిన గెరిల్లా పోరాట ఫలితంగా 1958లో అమెరికా సామ్రాజ్యవాదం నుండి క్యూబాకు విమోచనను కలిగించగల్గిన కృషిలో గణనీయమైన పాత్రను పోషించాడు.
విదేశీ రాయబారిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా పదవులను నిర్వహించిన చేగువేరా తన శాఖలో ఎన్నో సంస్కరణల్ని అమలు చేశాడు. ప్రజలకు విద్యనందించే ప్రణాళికలు, నిరుద్యోగ సమస్యను పారద్రోలే ప్రయత్నాలు, ఆర్థిక విధానాల్ని
మెరుగుపరచేందుకు తగిన నిర్మాణాత్మక కార్యక్రమాలు – ఎన్నిటినో నిర్వహించారు. ఎన్నో వ్యాసాలు, ఉపన్యాసాల ద్వారా నిర్మొహమాటంగా అభిప్రాయాల్ని వ్యక్తీకరించే చేగువేరా వ్యక్తిత్వం ప్రజల ఆదరాభిమానాలను
పొందింది.
కాని ప్రవాహం ఒకేచోట ఆగిపోవడం కుదరని పని. కాంగో విముక్తోద్యమంలో పాలుపంచుకోవాలన్న కోరికతో క్యూబా నుండి 1965 ఏప్రిల్‌లో బయలుదేరి వెళ్ళిన చే 1965 నవంబర్‌లో కాంగో పోరాట విరమణ తర్వాత, 1966 జూలైలో మారువేషంతో తన దళ సభ్యులతో పాటు మళ్ళీ బొలీవియాను చేరుకున్నాడు. బొలీవియా ప్రజల నిర్లిప్తతతో కూడిన భాగస్వామ్య రాహిత్యం, గెరిల్లాలలో క్రమశిక్షణా రాహిత్యం – వంటి కారణాలు యోధుడు చేగువేరా పనిని క్లిష్ట తరం
చేశాయి. ఎన్నో విపత్కర పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ, నిరంతరం తన వెన్నంటి వుండే అస్తమాను లెక్కచేయక, ఒకవైపు యుద్ధాలు చేస్తూ, కొత్త ప్రణాళికలు నిర్మించుకొంటూ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే వైద్య సేవనందిస్తూ, వారి ఆలోచనల్ని ప్రేరేపిస్తూ, ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని నింపుకుంటూ దళ సభ్యులకు ఉత్తేజాన్నిస్తూ, కొత్త సభ్యుల్ని చేర్చుకోవటం శిక్షణ నివ్వటం చేస్తూ, నిర్మాణాత్మకంగా సాగుతూ చేగువేరా 1967లో అక్టోబర్ 8వ తేదీకి, ‘యూరో’ లోతు ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సమీపంలో పొలంలో పనిచేసుకుంటున్న రైతు అందించిన సమాచారం మేరకు సైనికులు
చుట్టుముట్టారు. దాదాపు మూడుగంటల పోరాటం తర్వాత బొలీవియా సైనికులకు బందీగా దొరికాడు చేగువేరా. తాము చేగువేరాను బంధించామని తెలిసిన బొలీవియన్ సైనికుల ఉద్వేగం ఊహాతీతం. హైకమాండ్ ఆదేశాన్ననుసరించి 1967
అక్టోబర్ 9 మధ్యాహ్నాం 1.10 కి చేగువేరాను కాల్చి చంపారు. గుర్తింపు కోసం చేగువేరా చేతులను మణికట్టుదాకా అక్టోబర్ 10వ తారీఖున తొలగించి 11వ తేదీ వేకువ ఝామున భవన నిర్మాణపు పునాదుల కోసం తీసిన గోతుల్లో పడేసి, మట్టితో పూడ్చేశారు. అప్పుడు సైనికాధికారిగా వుండి రిటైర్ అయిన కెప్టెన్ వర్గస్ సెలినన్ వలన దాదాపు 28 సం||ల తర్వాత వల్లనే గ్రాందే విమానాశ్రయంలో చే శరీరాన్ని పూడ్చి పెట్టారన్న సత్యం లోకానికి తెలిసింది.
1995 నవంబర్ – డిసెంబర్ నెలలో ఫోరెన్సిక్ నిపుణుల పరిశోధనల తర్వాత చేగువేరా, అతని సహచరుల అస్థి పంజరాలను క్యూబాకు తీసికెళ్ళి సమాధి చేసి జ్ఞాపక చిహ్నాలు నిర్మించారు. చేగువేరా జీవితం మనలో అంతులేని ఆలోచనల్ని, ఆవేదనల్ని, ఆశ్చర్యాన్ని కూడ కలిగిస్తుంది. నిరాడంబరంగా బ్రదికిన ‘చే’ తన కుటుంబానికి ఆస్తిని
కూడబెట్టలేదు. కాని చే మరణానంతరం అతనికి సంబంధించిన ప్రతి వస్తువు, ఆ వస్తువులకు ఏర్పడిన బోలెడన్నీ నకళ్ళూ కూడ ఎంతో ధనాన్ని సామ్రాజ్యవాదులకు సంపాదించి పెట్టాయి. అతని వస్తువులు ప్రజలకు ఆరాధనీయ వస్తువులయ్యాయి.
ఆస్తమాతో పోరాటం సాగిస్తూనే చెక్కు చెదరని మనో దారుఢ్యంతో చివరి నిముషం వరకు బ్రతికిన చేగువేరా క్యూబా విప్లవ చరిత్రలో, ప్రజల సంస్క ృతిలో వేసిన ముద్ర సాటిలేనిది. నిజాయితీ రూపుదాల్చిన ‘చే’ను క్యూబాకో, బొలీవియాకో
పరిమితం చేయలేం. ”ప్రపంచంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మనం గాఢంగా ప్రతిస్పందించడం చాలా అవసరం.’ – అని తన పిల్లలకు రాసిన ఉత్తరంలో పేర్కొన్న చేగువేరా రాజకీయాల్లోని మంచి చెడులకు, పరిమితులకూ, అతని ఉత్తరాలు నిదర్శనాలు.
రచయిత్రి మాటల్లోనే చెప్పాలంటే, ”… చావంటే భయం లేక పోవటమూ, జీవితం మీద ప్రేమలేక పోవటమూ వొకటి గాదని… ” చెప్పిన గొప్ప మనీషి చేగువేరా. చే ఉద్యమ చరిత్రను స్ఫూర్తిదాయకంగా చెప్పడంలో కాత్యాయని కృతకృత్యులయ్యారు.
***

డా. రాయదుర్గం విజయలక్ష్మి
డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు కొత్తగూడెంలో తెలుగు లెక్చరర్ గా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాస్ యూనివర్సిటీలో బౌద్ధం మీద PhD చేసి డాక్టరేట్ పొందారు. గతంలో 'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' పుస్తకం వెలువరించారు. వీరి రేడియో ప్రసంగాలను 'పొరుగు తెలుగు బతుకులు' పేరుతొ క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి సహ-సంపాదకత్వం వహించారు. మిసిమి, పాలపిట్ట, సాహితీ స్రవంతి వంటి పత్రికలలో అనేక సాహిత్య విమర్శ వ్యాసాలు ప్రచురించబడ్డాయి.














