‘Environment’ అన్న ఆంగ్లపదానికి పరిసరాలు, పర్యావరణం అని అర్థాలున్నాయి. ప్రజ్ఞాశీలుడైన మనిషికిచరాచరాజీవరాసులతో కూడిన ప్రకృతితో బాటు, తన చుట్టూ ఉన్న మానవసమాజం కూడా పరిసరమే అవుతుంది. ఇతర ఏ ప్రాణికి లేని విధంగా, కుటుంబ వ్యవస్థను రూపొందించుకొన్న మనిషికి మాత్రమే, నేను, మేము, నాది, మాది అన్న మాటలు వాడుకలో ఉన్నాయి. ఈ స్వార్థపు మాటలను , మనము, మనది… అని మార్చుకోవలసిన అవసరాన్ని- అంటే వ్యష్టిని సమిష్టిగా రూపొందించుకోవలసిన అవసరాన్ని గుర్తించిన బౌద్ధం, “మనము” అంటే ఒక్క మానవ సమాజము మాత్రమే కాదు, సకల చరాచరజీవరాసులున్న ప్రకృతి మొత్తం – అని గుర్తించమంటుంది.
మనిషి తప్ప, ప్రకృతిలోని యితర జీవరాసశులు ఆకలివేసినపుడు మాత్రమే స్వయంగా వేటాడి తింటాయి. ఆకలితీరగానే తమ ఆహారజీవులు తమ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా,మైత్రీభావనతో సుఖంగా బ్రదికేస్తూ ఉంటాయి. కాని మనిషి మాత్రమే – ఆహారాన్ని వండి తినడం నేర్చిన మనిషి మాత్రమే – కుటుంబ వ్యవస్థను రూపొందించుకొన్న మనిషి మాత్రమే … ఆహారపు ముడిసరకును, తన తరువాతి తరాలు కూడా ఆడంబరంగా బ్రదకడానికి కావలసిన ధనరాశి నిల్వలను కూడబెడుతూ, జీవనానందాన్ని, ప్రశాంతతను మరిచిపోయి, యాంత్రికంగ జీవిస్తూ ఉంటాడు. ప్రకృతిలోని జీవరాసులు కొన్నిటిని మచ్చిక చేసికొని సేవలు చేయించుకోవడం నేర్చుకున్న మనిషి – తనకన్న బలహీనులైన మనుష్యులు కొందరిని కూడా స్వార్థంతో సేవకులుగా మలుచుకొన్న మనిషి – పరిసరాల సమతుల్యతను మరిచిపోతున్నాడు. అలవోకగా అనుభవించవలసిన జీవనోత్సాహాన్ని, సునామీ గమనంలా బీభత్సం చేసుకుంటున్నాడు. పరిసరాలను తన స్వార్థంతో కలుషితం చేసుకోవడంతో ఆగక, తన భవిష్యత్తరాలకు కూడసుఖజీవనాన్ని – ఆనందమయమైన, ఆరోగ్యమయమైన జీవనాన్ని – దూరం చేస్తున్నాడు. నేటి సమాజంలో “పర్యావరణ అవగాహన, పరిరక్షణ” అనేవి ప్రధాన సమస్యలుగ మారాయంటే మనిషి తన పరిసరాల నెంతగా పాడుచేసికొంటున్నాడో, వాటిపట్ల అవగాహన, పరిరక్షణ కలిగి ఉండవలసిన అవసరం ఎంత ఉందో తెలుస్తూంది. ఈ విశ్వ సమస్యను గురించి, రెండున్నర సహస్రాబ్దాల క్రితం ఏర్పడిన బౌద్ధంలోని అవగాహనను తెలిసికోవడమే యీ వ్యాసోద్దేశం!
స్వచ్ఛమైన ప్రాకృతిక సౌందర్యాన్వేషణలో తేలియాడుతున్న కాలంలో, క్రీ.పూ. ఆరవశతాబ్దంలో ఏర్పడిన బౌద్ధం అంటే ఒక జీవనవిధానం! మరణాన్ని కూడ ఆనందంగా ఆహ్వానించడాన్ని నేర్పే ఒక జీవనవిధానం. సహానుభూతి, సృష్టిలోని ప్రతిజీవరాశిపట్ల కలిగి ఉండవలసిన సహానుభూతిని, చూపవలసిన మహాకరుణను, తృష్ణారహితంగ జీవించవలసిన అవసరాన్ని ఉద్బోధించే జీవన విధానం. ఆర్యాష్టాంగ మార్గాలతో బాటు, ‘శీలము, సమాధి, ప్రజ్ఞ’ లతో కూడిన అప్రమత్తజీవితాన్ని నేర్పే జీవన విధానం! ప్రతీత్య సముత్పాదం తోబాటు, పంచశీల దశపారమితలతో మానవత్వాన్ని పరిఢవిల్ల జేసే జీవన విధానం. ఇటువంటి బౌద్ధానికున్న పరిసరాల అవగాహనను గురించి చూద్దాం!
అహింసామార్గంలో చరిస్తూ, జంతుబలులను నిషేధించడం బౌద్ధం సాధించిన తొలి విజయంగా గమనించగలం! వేలకొలది పశువుల బలిరక్తంతో, తడిసిన మధ్యయుగపు చరిత్రను మార్చివేయడమే గాక, ‘జంతుబలి’ అంటే పశువులను బలియివ్వడం కాదని, మనలోని ‘అహం’ అన్న పశువును బలివ్వడం మాత్రమేనని, మతసిద్ధాం తాలను తిరగరాసుకొనే అవసరాన్ని కలిగించిన బౌద్ధం సాధించిన తొలి విజయం అహింసా విజయమే!
అతిసామాన్యంగా జీవించడంలోని ఆనందాన్ని పరిచయం చేసిన బౌద్ధం, తుమ్మెద పువ్వులరంగును, సువాసనను పాడు చేయకుండ, ఏ విధంగా మకరందాన్ని గ్రహిస్తుందో, అదే విధంగా భిక్షువులు గ్రామాలలోని ప్రజలకు ఎటువంటి కష్టనష్టాలను కలిగించకుండా, భిక్షను గ్రహించాలి (ధమ్మపథం ,పుప్ఫవగ్గ-6) అనడం, పువ్వుల రంగు, వాసనలకేమాత్రం హాని చేయకుండా, తుమ్మెద తేనెను గ్రహించినట్లు గృహస్థు అవసరమైనంతవరకు మాత్రమే ధనాన్ని కూడబెట్టుకోవాలి(సిగాలోవాద సుత్త) అనడం వలన జీవితంలో సున్నితత్త్వం ఎంత అవసరమో అన్నవిషయాన్ని ప్రకృతినుండి గ్రహించిన విధానం ద్వారా గమనించవచ్చు. అవసరార్థానికి పనికి వచ్చినదే కూడబెడితే చాలని, అంతకుమించి అవసరం లేదని చెప్పడమ వలన మనిషి ఎంత పొదుపరిగ జీవించాలో నేర్పుతుంది బౌద్ధం!
అడవులను నరికి వేయరాదని చెప్పే బౌద్ధం, నదీజలాలను, సముద్రజలాలను కలుషితం చేయరాదని, మత్తుపదార్థాలను తయారుచేయడం, ఆయుధాలను తయారు చేయడం కూడదని చెప్పే బౌద్ధం, తన జీవిక కోసం మనుష్యులు ఆయుధాలను అమ్మడం, మత్తు పదార్థాలను అమ్మడం వంటి వ్యాపారాలు చేయడం సమ్యగ్జీవనం కాదు ..అని అంటుంది.
వృక్షసంపదను, సకల జీవరాశులను రక్షించవలసినది రాజుబాధ్యత(కుటదంత సుత్త)గా గుర్తించిన బౌద్ధం, ప్రతివిషయం కార్యకారణ సబంధం కలిగి ఉంటుంది కాబట్టి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే మానసిక స్థితి అవసరమంటుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పరస్పరం సహకారంతో ప్రవర్తిల్లుతూ, మనిషికి కావలసిన జీవనాన్ని సమకూర్చుతున్నట్లే, మనుష్యులు, చెట్లు, జంతువులు, భూమి కూడ పరస్పర సహాయసహకారాలతో ప్రవర్తిల్లినపుడు సుహృద్వాతావరణాన్ని ఏర్పరచుకోగలరని చెప్పే బౌద్ధం, మానవుల రక్షణ అంటే ఒక్క ప్రజలరక్షణమాత్రమే రాజు కర్తవ్యం కాదని, ప్రకృతిలోని చతుష్పాదాలు, పక్షులు మున్నగు వాటి పరిరక్షణ కూడ (చక్కవత్తి సిహనాదసుత్త)రాజు ఆచరించవలసిన ధర్మమే అని అంటుంది.
ప్రకృతిలో తనతోబాటే జీవిస్తున్న సకల జీవరాశులను గుర్తించడం,గౌరవించడం,వాటి జీవితాలనుండి నేర్చుకోవలసిన మంచి ధర్మాలను నేర్చుకోవడం వంటి లక్షణాలు మనిషిలోని ఆధికారిక ప్రవృత్తిని తగ్గించే మార్గం అనే బౌద్ధం, మనకు మన జీవితం ముఖ్యమైనట్లే ఇతరులకు కూడా ఎవరికి వారికి వారి వారి జీవితాలు ముఖ్యం కాబట్టి, పరస్పరం గౌరవనీయస్పందనలు కలిగి ఉండటం అవసరం (కరణీయ మెత్త సుత్త)అంటుంది.
తొలుత ప్రకృతిపట్ల క్రూరంగా ప్రవర్తించిన శక్రుడు, తన పేరాశను వదిలి ప్రకృతిని ప్రేమించడం నేర్చుకొని, ఉద్యానవనాలను పెంచడం, చెరువులను, బావులను త్రవ్వించడం, బాటలు వేయించడం, ప్రజలకోసం పండ్ల తోటలను పెంచడం వంటి ప్రజోపయోగ కార్యక్రమాలను చేయడం ద్వారా ఉన్నతపదవిని అధిష్టించాడు అంటుంది బౌద్ధం. చెట్ల పెంపకం, నీటి వనరులను ఏర్పరచుకోవడం వంటి పనుల గొప్పతనాన్ని గుర్తించిన బౌద్ధం, పొదుపుగా జీవించడంలోని ఆనందాన్ని గుర్తిస్తూనే, కోరికలు లేకుండా బ్రదకడం అంటే సత్యము, జ్ఞానము… వీటి స్వరూపాలపట్ల అవగాహనలేకపోవడం గాదని, ప్రకృతిలోని యితర జీవరాశులపట్ల కూడ సమైక్యతాభావంతో జీవించడమేనని అర్థం చెబుతుంది. నిందించడం, చెడుమాటలతో ఇతరుల మనస్సును నొప్పించడం కూడ ‘హింస’యే నని గుర్తించిన బౌద్ధం, భిక్షద్వారా లభించిన ఆహారంలో తినగా మిగిలిన దానిని, పశుపక్ష్యాదులకివ్వాలని, అవి తినగా యింకా మిగిలివున్న ఆహారాన్ని పచ్చిక లేని చోట, ప్రవాహం లేని చోట మట్టిలో కలపాలని (వినయపిటకం) చెబుతుంది.
తన మామిడితోటలోని పండ్లను భిక్షువులు స్వీకరించవచ్చునని రాజు భిక్షుసంఘాన్ని కోరగా, పండిన పండ్లనే కోయాలని, పూత పిందెలకు హానిని కలిగించరాదని చెప్పే బౌద్ధం(వినయపిటకం), చెట్లు చేమలకు హాని కలిగించడం భిక్షువులకు నిషిద్ధం అంటుంది. మామిడి పండును తిని టెంకను పాతి, దానికి నీళ్ళు పోసిన బుద్ధుడు, మొక్కలను పెంచడం పట్ల అవగాహనను కలిగిఉన్నాడని గమనించగలం. ప్రకృతిలోని సమస్త వస్తువులపట్ల, బౌద్ధాని కున్న అవగాహనకు గొప్పనిదర్శనం, “మిళిందపన్హ” లోని ఉపమలు. చెరువులోని నీటిని త్రాగడానికి ముందు, నీటిని తేరనివ్వడం, శుభ్రపరచుకొని త్రాగడానికి ఉపయోగించడం దగ్గరి నుండి కొండలపై నుండి జారిపడే వర్షపు నీరు సముద్రంలో కలియడం వరకు,చెట్ల ఆకులు వినిపించే సంగీతం, విత్తనాలను మొలకెత్తించగలిగిన నేలతల్లి వర్ణనలను ఉపమలద్వారా మనోహరంగా వర్ణించే “మిళిందపన్హ, ఎన్నో సంక్లిష్టమైన ప్రశ్నలకు సులభతరంగా జవాబులను చెబుతుంది.
తానుకూడా వ్యవసాయదారుడినే అని చెప్పే బుద్ధుని మాటలు గమనార్హాలు. శ్రద్ధ బీజంగా, ధ్యానం వర్షంగా, ప్రజ్ఞ కాడిగా, మనస్సు దుక్కిగా, పగ్గంసతీ నాగలి కర్రుగా, సత్యంతో కలుపు తీస్తూ, ప్రయత్నం ఎద్దుగా, వ్యవసాయం చేస్తూ, శరీర నిగ్రహాన్ని పాటిస్తూ ఉండే (కసిభారద్వాజసుత్త – సుత్త నిపాత) తాను కూడ రైతునే అని చెప్పే బుద్ధుడు, తన భిక్షు సంఘానికి నిర్దేశించిన సూక్తులు పర్యావరణ అవగాహనకు గొప్ప ఉదాహరణలు!
నీటిప్రాముఖ్యాన్ని గుర్తించిన బౌద్ధం, నీటి సేకరణ, రక్షణలను గురించి కూడా ఆలోచించింది. బౌద్ధభిక్షువులు గ్రామాలలో నివసించడం గాకుండా, గ్రామపరిసరాలలో నీటివనరులున్న ప్రాంతంలో నివసించడం చారిత్రక సత్యమైతే, ఈనాడు ‘కాంటూర్ బండింగ్’ పద్ధతిద్వారా వర్షపునీటిని, ముఖ్యంగా పర్వతాల మీదనుండి కురిసే వర్షపు నీటిని శుభ్రపరచి, త్రాగునీటికి, వ్యవసాయానికి ఉపయోగించుకునే పద్ధతిని ప్రాచీన కాలంలోనే బౌద్ధులు ఆచరించడం అత్యంతాశ్చర్యాన్ని గొలిపే సత్యం. పర్వతాలమీద కురిసి క్రిందకు ప్రవహిస్తున్న వాననీటిని, ఒకదారిగుండా ప్రవహించేలా చేసి, క్రింద నీటి తొట్టెలను నిర్మించి, ఆ నీటిని వాడుకొనే పద్ధతికి బౌద్ధులు ఆద్యులు కావడం అజంతాగుహలు, తొట్ల కొండ, బావికొండ చారిత్రక ఆధారాలు మనకు చెప్పే సత్యాలు.
వర్షపునీరు, వ్యవసాయానికి ఉపయోగపడగా, మిగిలిన వర్షపు నీటినే సముద్రంలో కలిసేలా చేయాలని, అలా కాకుండా, కురిసే వాననీటినంతా వృధాగా సముద్రంలో కలుపరాదని చెప్పే, ప్రాచీన రాతిశాసనాలు బౌద్ధం రాజమతంగా గల శ్రీలంకలో నేటికీ లభిస్తుండటం గమనార్హం. చెట్లను నరికి వేయడం, అడవులను కొట్టి వేయడం వంటివి పర్యావరణానికి హాని కలిగించడమే అని చెప్పే బౌద్ధనీతి, శ్రీలంకలో రాజశాసనాలుగా వెలువడి ఉన్నాయి.
భిక్షువులు తాము నివసించే ఆరామపు గదులను, పరిసరాలను, స్నానపు గదులను, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవడమెలాగో చెప్పే వినయపిటక సుత్తాలు పరిసరాల పరిశుభ్రతపట్ల బౌద్ధులకున్న అవగాహనకు గుర్తు!
వస్తువులు పాతవైనపుడు, వాటిని re-cycling పద్ధతిలో ఉపయోగించుకొనే నేటి వైజ్ఞానిక పరమైన విషయానికి నాంది బౌద్ధంలోనే దొరుకుతుంది. చెత్తమీద లభించే పాత బట్టలను శుభ్రపరచి, కత్తిరించి, కుట్టి చీవరాలుగా ధరించిన బుద్ధుడు, పాంసుకూలుడు అని పిలువబడిన బుద్ధుడు, తన భిక్షు సంఘంలో కూడ యీ పద్ధతిని అమలు చేశాడు. ఒకసారి కౌశాంబి లో రాణి, ఆరామానికి ఐదువందల చీవరాలను దానం చేసిన విషయం తెలిసిన రాజు ఉదయనుడు, ‘భిక్షువులు వాడుతున్న పాత చీవరాలను ఏం చేస్తారు?’ అని ఆనందుని ప్రశ్నిం చాడు. వాడడానికి పనికి రాని పాత చీవరాలను, పరుపు తొడుగులుగా కుట్టుకుంటామని, చిరిగిన పరుపు తొడుగులను నేలమీద ఆస్తరిణులు(దుప్పట్లు)గా పరచుకుంటామని, పాడైన ఆస్తరిణులను కాలిక్రింద పట్టాలుగా వాడుకుంటామని, పాడైన కాలి పట్టాలను శుభ్రపరచి అలుకు గుడ్డలుగా ఉపయోగిస్తామని, పాడైన అలుకు గుడ్డలను దంచి, మట్టిలో కలిపి ప్లాస్టర్లు చేయడానికి ఉపయోగిస్తామని ఆనందుడు చెప్పిన జవాబును విని, ఆశ్చర్యానందాలను పొందిన రాజు, ‘బౌద్ధ భిక్షువులు ఏ వస్తువులను వృధా చేయరు కదా!’ అని సంతోషించి మరొక ఐదువందల చీవరాలను భిక్షుసంఘానికి దానం చేశాడట!(వినయపిటకం).
బౌద్ధం చెప్పే పరిసరాల అవగాహన, పరిరక్షణలను చక్కగా ఆచరణలో చూపిన మగధరాజు, అశోకచక్రవర్తి! బాటలప్రక్కన చెట్లు నాటించడం, పక్షులకు నివాసయోగ్యమైన రావి మున్నగు చెట్లను నాటించడం, బాటసారుల దాహార్తిని తీర్చడానికై, ప్రతి యెనిమిది క్రోసుల దూరానికి దిగుడు బావులను త్రవ్వించడం, బాటల ప్రక్కల బాటసారుల ఆకలిని తీర్చేందుకని మామిడి మొదలైన పండ్ల తోటలను పెంచడం, మనుష్యుల కొరకే గాక, పశుపక్ష్యాదుల కొరకు కూడ వైద్యశాలలను నిర్మించడం, మందులకు పనికి వచ్చే చెట్ల వేర్లను, పువ్వులను, మొక్కలను దిగుమతి చేసుకోవడమే గాక, తన రాజ్యంలో మందుమొక్కల సాగును చేయడమే గాక, జంతుబలులను క్రమంగా నిషేధించడం, అన్ని పండుగలను,పరిశీలించి, జంతుబలులు లేనివి, ఆడంబరాలు కానివి అయిన కొన్ని పండుగలను, ఉత్సవాలను జరుపుకొనేందుకు మాత్రమే అనుమతించడం …ఇవన్నీ అశోకచక్రవర్తి అహింసావాదాన్ని, రాజు కర్తవ్యాలను అతడు పాటించిన విధాన్ని మాత్రమే గాక, పర్యావరణ సమతుల్యత పట్ల అశోకచక్రవర్తికి గల అవగాహనను కూడా చెబుతున్నాయి.
లుంబినీవనంలో పౌర్ణమిరాత్రి ప్రాకృతిక సౌందర్యంలో జన్మించడం, రావిచెట్టు నీడన జ్ఞానోదయం పొంది, నలభై సంవత్సరాల పూర్తి కాలం కాలినడకన దేశాటన చేస్తూ, సద్ధర్మాన్ని ఉపదేశిస్తూ, రెండు సాలవృక్షాల మధ్య మహా పరినిర్వాణం చెందిన బుద్ధు డు గొప్ప ప్రకృతి పరిశీలకుడు. తనకు తెలిసిన ధర్మం అడవిలోని చెట్ల ఆకులంత కాగా, తాను ఉపదేశిస్తున్న ధర్మం పిడికెడు ఆకులంత మాత్రమే అని భిక్షువులకు బదులీయడం, పూలవాసనలు గాలికి ఎదురీదలేవని, గాలికి వ్యతిరేకదిశలో కూడ పయనించగలిగినది మంచిపనులకు సంబంధించిన కీర్తి మాత్రమే (దమ్మపద..పుప్ఫవగ్గ-11) నని గుర్తించడం, తుమ్మెదలు పువ్వులపట్ల సున్నితంగా ప్రవర్తిస్తాయని గమనించడం వంటివన్నీ,బుద్ధునికున్న పర్యావరణ అవగాహనకి, బుద్ధుడెరిగిన ప్రాకృతిక రహస్యాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే! అందమైన ఉపమాలంకారాలను ఉపయోగించి, బోధించే బుద్ధ బోధలోని ప్రాకృతిక సౌందర్యాన్ని ధమ్మపదం చెబుతుంటే,ఉపమల సౌందర్యాన్ని ప్రాకృతిక సౌందర్యంతో మిళితం చేసి, క్లిష్టమైన తాత్త్వికాంశాలను సులభతరంగా వివరిస్తుంది ప్రథమ శతాబ్దికి చెందిన మిళిందపన్హ!
క్రీ.పూ. ఆరవశతాబ్దంలో పర్యావరణం కాలుష్యం కాని శతాబ్దంలోనే, పర్యావరణం పట్ల సానుకూల అవగాహన, స్పందనలను కలిగి ఉండటమే గాక, పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న ఆలోచన, వస్తువులను వృధా కానీయక, మరోరూపంలో రూపాంతరం చెందించి, వాడుకొనే పద్ధతులు, వాననీటిని వాడుకోవడం, పరిసరాల పరిశుభ్రత గురించిన ఆలోచన, అవగాహన, కార్యాచరణపద్ధతులను కలిగి ఉండటమేగాక, కార్యాచరణ బద్ధతకు ఆంతరంగిక పరిశుద్ధత అవసరమని గుర్తించి, అష్టాంగమార్గాలను,బ్రహ్మ విహారాలను ఉపదేశించిన బుద్ధునికన్న, గొప్ప పర్యావరణవేత్త మృగ్యం అనడం అతిశయోక్తి గాదు!
ఉపయుక్త గ్రంథాలు:
- శ్రీ బుద్ధచరియ.. అనువాదం : సుకన్యాపుత్ర ధర్మకీర్తి బిక్ఖు., ప్రచురణ: ఆనందబుద్ధవిహారట్రస్ట్ ,సికింద్రాబాద్ ; ప్రథమ ముద్రణ; 2002
- వినయపిటకము అను: మోక్షానంద స్వామి, మోక్షానందాశ్రమము, నిజామాబాదు, ప్రథమ ముద్రణ; 2010
- బుద్ధుని సూత్రసముచ్చయము ;అను: అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి : ఆనందబుద్ధవిహారట్రస్ట్,సికిందరాబాద్ ప్రథమ ముద్రణ: 2008
- ధమ్మపదం: అను.:మోక్షానందస్వామి : మోక్షానందాశ్రమము: నిజామాబాద్: ప్రథమ ముద్రణ: 2009
- మిళిందపన్హ: అను: బోధచైతన్య: ఆనందబుద్ధ విహార ట్రస్ట్: ప్రథమ ముద్రణ: 2001

డా. రాయదుర్గం విజయలక్ష్మి
డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు కొత్తగూడెంలో తెలుగు లెక్చరర్ గా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాస్ యూనివర్సిటీలో బౌద్ధం మీద PhD చేసి డాక్టరేట్ పొందారు. గతంలో 'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' పుస్తకం వెలువరించారు. వీరి రేడియో ప్రసంగాలను 'పొరుగు తెలుగు బతుకులు' పేరుతొ క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి సహ-సంపాదకత్వం వహించారు. మిసిమి, పాలపిట్ట, సాహితీ స్రవంతి వంటి పత్రికలలో అనేక సాహిత్య విమర్శ వ్యాసాలు ప్రచురించబడ్డాయి.










