“నా అక్షరాలు కన్నీటిజడులలోతడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు…”—
అని తన కవిత్వాన్ని నిర్వచించిన, మానవకవిగా మన్నన పొందిన, బాలగంగాధర తిలక్,(1921–1966) “మాకు లోకం ఒక గీటురాయి/మాకు కరుణ చిగురుతురాయి/మేం పరపీడన సహించం/మేం దివ్యత్వం నటించం” —- అంటూ, తన కరుణహృదయాన్ని, ప్రత్యక్షరంలో ప్రస్ఫుటం చేసి, ‘అమృతం కురిసిన రాత్రి’ ద్వారా కవితా సతి నొసట నిత్య రసగంగాధరతిలకమై విలసిల్లినవాడు. మానవతలేని లోకాన్ని స్తుతించలేను,/మానవునిగా శిరస్సెత్తుక తిరుగలేను” — అని నిర్భయంగా చాటిన తిలక్ మహాకవి మాత్రమేకాదు, ఆ లక్షణాలకు లక్ష్యంగా తన కథలను మలచిన మహాశిల్పి కూడా! 1961 లో ‘సుందరి-సుబ్బారావు’, ‘ఊరిచివరి యిల్లు’ అన్నరెండు చిన్న చిన్న సంపుటాలుగా ప్రచురణ పొందిన తిలక్ కథలు, 1967 లో రెండవ ముద్రణను, 1983 లో (29 కథలతో)మూడవ ముద్రణను పొందాయి. ఇప్పటికీ ఈ కథలు ముద్రింపబడుతూనే ఉన్నాయి.
మానవతకు పతాకనెత్తిన కథలు కొన్ని, మానవత్వాన్ని వెక్కిరించిన కథలు కొన్ని, మానవత్వాన్నిమరోకోణం నుండి దర్శించిన కథలు కొన్ని, అన్నీ వెరసి, తిలక్ కథల్లో అంతస్సూత్రంగా కనిపించే తత్త్వం మానవతత్వం. ఈ తత్వం అన్ని కథల్లో సున్నితంగా రూపింపబడిన రచనా శిల్పం తిలక్ ది. ఆయనకవితలు, నాటికలు లాగే, ఆయన కథలు కూడా సుకుమారసుందర పుష్పాలు. “ఒక్క దయామయి అడుగుల సవ్వడి పలుకరించినా, కోటి నవ్వుల్ని వెదజల్లుతాను, ఒక్క దుఃఖితుడు నవ్వినా నేను స్పందిస్తాను”, అన్నతిలక్ స్పందన ప్రతికథలో ప్రతిఫలించిన తీరు అద్వితీయమైనది.
“ఊపిరి సలపని, బతకనివ్వని ఓ పెద్ద శూన్యం యొక్క శాంతి, మృత్యువుయొక్క కాంతి, ప్రతిఫలించే, ‘కదిలే నీడలు’, ‘లిబియా ఎడారిలో’, అన్న రెండు కథలు, యుద్ధకాలంనాటి బీభత్సానికి, యుద్ధం తరువాతి పరిణామాలకు అద్దం పట్టే కథలు. “లోని కంగారుని అణచివేస్తోంది యుద్ధసంక్షోభం. అందరి వెనుకాలా, అన్ని చోట్లా మృత్యువు పొంచి ఉన్నట్లనిపిస్తోంది. ఈ సోల్జర్ల మధ్య నా బాధ ఒక్కటీ విడిగా కనబడదు” అంటూ “ఏముందీ – ఎందుకో వచ్చింది ఏడుపు లాంటి నవ్వు,”…అంటూ యుద్ధకాలంనాటి భద్రతారాహిత్యం మనిషిమీద చూపే ప్రభావాన్ని బహు సున్నితంగా, కరుణరసాత్మకంగా చిత్రించారు తిలక్! యుద్ధం లో చేరి, బ్రతికి ఉన్నాడో, లేదో, తెలియని ఈజిప్ట్ లో సైన్యంలోనున్న భర్త, సైన్యంలో నర్స్ గా చేరిన భార్య, యుద్ధం మూలంగా ఊర్లలో మిగిలిన మనుష్యులకు నిదుర పట్టక, walking disease వచ్చిందన్న కథనాలు, శరణార్ధుల క్యాంప్, అందులో చిన్నాభిన్నతలకు నిదర్శనంగా మిగిలిన జీవితాలు, వెరసి, యుద్ధకాలంలోని ప్రజల కరుణార్ద్ర జీవితాలు, ‘కదిలే నీడలు’గా మారుతున్న విధానానికి అద్దం పడుతుంటే, యుద్ధంలో గాయపడిన దేశాలకరుణార్ద్ర జీవితాలను, యుద్ధం ముగిసిన తరువాత యుద్ధ క్షేత్రాలలోని శరీర ఖండాలు పడే తపనద్వారా, ప్రతీకాత్మకంగా, హృదయవిదారకంగా వివరిస్తుంది, ‘లిబియా ఎడారిలో’ అన్న కథ!
‘అద్దంలో జిన్నా’ అన్న కథలో, తిలక్ భావాలు నేటి సమాజాన్ని గూర్చి చేసిన ఆలోచనలు! ఒక జాతి అంటే తక్కిన మానవసంఘంలో వేరుపడిన ఒక సమూహమట! ఎంతబాగా ఒక జాతిని వేరుచేస్తే అంతా గొప్ప నాయకుడట! “మతం, నీతి బోధనలూ మనిషినీ, మనిషినీ వేరుచేసేందుకు ఉపకరిస్తునాయి.” అంటూ, “ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పి నమ్మించవచ్చు, తర్వాత అబద్ధం అబద్ధమేనన్నా ఎవరూ నమ్మరు. నాయకుడెప్పుడూ నాయకుడిగానే ఉండక తప్పదు. అలా ఉండకపోతే ఆ నాయకుని బ్రతకనివ్వరు” అంటూ వితర్కించి, సత్యం గొంతు నొక్కేసే సమాజాన్ని తమ కథల్లో దర్శింపజేశారు, తిలక్.
ఆకలి ఎన్నో రకాల పనుల్ని చేయించగలదన్న విషయ నిరూపణకు ‘హోటెల్లో’ అన్న కథ ఉదాహరణ! ‘వానవిడిచిన ఆకాశంలా మొహమూ, లోతుకు పోయిన కళ్లు… ‘అంటూ చేసిన పాత్ర పరిచయం లోనే, సుఖదుఃఖాల సంగమమే జీవితం అని చాటారు. కేవలం ఐదు రూపాయల అప్పు…అదీ ఆకలి తీర్చుకునేందుకు చేసిన అప్పుకోసం, ఆ అప్పిచ్చిన వారికి, వంతులవారీగా బలైన ప్రేయసిని, ఆమె కోరికమీదే హత్యచేసిన వ్యక్తి పాడిన విషాదరాగమీ కథ! “ఆమెకి శీలమూ అభిమానమూ వున్నాయి. చంపివెయ్యమంది. ఆలోచించాను. నాకూ నీతీ, ప్రేమా వున్నాయి. ఆమె సుఖం కోసం, ఆమె ఔన్నత్యం కోసం, నా గౌరవ స్వాతంత్ర్యాల కోసం… ఆమె కోరినట్లే ఆమెను కృతజ్ఞతా చిహ్నంగా చంపివేశాను” అన్న ఆ వ్యక్తి ద్వారా మరుగుపడిన మానవత్వాన్ని నిలదీశారు తిలక్. “పరపీడన సహించం, దివ్యత్వం నటించం” అన్నట్లు, దివ్యత్వాన్ని నటించక పోవడం తిలక్ పాత్రల్లోని జీవనాడి.
దారిద్ర్యాన్ని హృదయవిదారకంగా వర్ణించిన తిలక్, ఆ దారిద్య్రం మనిషి హృదయాన్నెంత వికారంగా కనిపింప జేస్తుందో చెప్తారు. “ఆశాకిరణం” కథలో, వెంకటేశ్వర్లు, “ఊరిచివరి యిల్లు” కథలో ముసలిది, ఆకలిచేసే వికటాట్ట హాసానికి బలైపోక, మరో రూపంలో నిలద్రొక్కుకున్న పాత్రలు. భార్యాపిల్లలను పోషించుకోలేక, చేయరాని పనులుచేసి, చివరకు ఆత్మహత్యకు పాల్పడబోతూ, తన పెద్ద కూతురు శీలాన్ని అమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తోంది, అనివిని, క్రుంగి పోవడానికి బదులు పొంగిపోతూ, “ఇంక నేను చావనక్కర లేదు” అని యిల్లుచేరిన వెంకటేశ్వర్లు, ఆకలి రక్కసి చేత తీర్చి దిద్దబడిన సమాజంలోని వైకృతానికి ప్రతిరూపం! అసహ్యించుకోవడానికి కూడా మనస్కరించని పరిధిలో ఆ పాత్రని నడపడం తిలక్ రచనా శిల్పానికి గీటురాయి. వెర్రి ఆనందంతో యిల్లు చేరి, కమ్మగా భోంచేసి నిద్రపోయి, అర్ధ రాత్రి మెలకువ వచ్చిన వెంకటేశ్వర్లు, “అరె! ఏదో తప్పు చేశాను” అనుకున్నాడట! ఇంతకూ ఆ తండ్రి ఆలోచించింది, తన ఆనందానికి, బ్రతుకు భద్రతకు కారణమైన తన కూతురిని యింతవరకూ అభినందించలేదని మాత్రమే! కూతురు కోసం వెదకి, పెరట్లో చెట్టుకింద కూర్చొని ఏడుస్తున్న కూతుర్ని చూసి, “ఈ వేళ కాదులే, మరెప్పుడైనా కృతజ్ఞత చెబుతాను” అనుకొని, వెనుదిరిగి వచ్చి పడుకొని కళ్లుమూసుకొన్నాడట ఆ తండ్రి! అతనిలోని పితృహృదయం మేల్కొందేమోనని మనం అనుకునేట్లు చేసి, గుండెకు గురిచూసి, ‘నగ్నసత్యమ’నే మరో అమ్ముని విసరడం తిలక్ కే చెల్లింది. ప్రతి మనిషినీ, మానవత్వాన్నే కాదు, అనురాగాల్ని కూడా ఆకలి ఎలా గొంతునులిమి చంపేస్తుందో చెప్పి, వెంకటేశ్వర్లుని, ‘ఛీ’ అని ఛీత్కారం కూడా చేయలేని నిస్సహాయతను పాఠకునికి వదిలివేసే శిల్పం తిలక్ ది.
“ఊరిచివరి యిల్లు” అన్న మరో కథ, “విధిచేత క్రూరంగా మోసగింపబడి, నిస్సహాయ స్థితిలోనున్న రమను ఆదుకొని, తన బ్రతుకు భద్రతకోసం ఆమె నెలల పాపను చంపివేసి, ఆమెను వివాహం చేసుకొంటానన్న జగన్నాధాన్ని తన మాటల చాతుర్యంతో పంపివేసి, ఆమె అనుభూతులను మంటగలిపిన సామర్ధ్యం ముసలిదానిది. రమను దయనీయ స్థితిలో ఆదుకున్న ఆ ముసలిదాన్ని మానవతావాది అనాలా?, స్వార్ధం కోసం ఆమె జీవితాన్ని నాశం చేసిన రాక్షసి అనాలా? “ఏం జేయను. నువ్వు ప్రేమించావని, నిన్ను తాను వివాహం చేసుకుంటానని అన్నాడు…. మరి నా బతుకేం కాను పిల్లా! నాకు మాత్రం ఎవరున్నారు పిల్లా నువ్వు తప్ప! వాణ్ణి తగులుకొని చల్లగా పోదామని చూస్తున్నావా! నీ ఆటలు నేను సాగనిస్తానటే….” అన్న ముసలిదాని మాటల్లో కడుపుకూటికోసం స్వార్థం చేసే కరాళ, కర్కశమైన నాట్యాన్ని దర్శింపజేశారు తిలక్. “దేవుడా! రక్షించు నాదేశాన్ని. .. నీతుల రెండు నాల్కలు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాలనుండి” అని తిలక్ అన్నది, బహుశా యీ ముసలిదానివంటివారిని చూసే కాబోలు!
“మంచిగంధంలా పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం” అన్న లక్షణానికి ఉదాహరణగా, ‘దొంగ’ కథ లో గోపాలాన్ని, ‘దేవుణ్ణి చూసినవాడు’ కథలో వీరయ్యనూ సృష్టించాడు తిలక్! భార్యనగలనిమ్మని వేధించే, జూదరి అయిన భర్త అమానుషకృత్యాలకు చలించి, తానూ ఆ గొలుసును దొంగలించడానికే వచ్చినా, మనసు కరిగినవాడై, “ఆడకూతుర్ని కొడతావా దొంగయెదవా’ అంటూ, భర్త చేతి నుండి గొలుసును లాక్కొని, ఆమెకు యిచ్చేయడం తిలక్ మానవత్వానికి ఎగరేసిన పతాక! “ఎవరు బాబూ నువ్వు?” అన్న ఆమె ప్రశ్నకు “నేనా?” అంటూ తెల్లబోయి, “నన్ను గోపాలం అంటారు లెండి.” అని వంచినతల యెత్తకుండా వడివడిగా చీకట్లోకి వెళ్ళిపోయిన గోపాలానికున్న ఒకే ఒక అలంకారం మంచిగంధంలాంటి మానవత్వం! అవే అతని దోషాలను క్షాళనం చెయ్యగల గొప్ప సుగుణం!
ఎవరితోనో లేచిపోయిన భార్య, అర్ధరాత్రి భోరున కురుస్తున్న వర్షంలో పూర్ణగర్భిణిగా తిరిగివస్తే, ధర్మ బలం, దైవబలం లోపించిందని ఊరి జనం గోల చేస్తే, ఆమెను చూసి జాలిపడిన గవరయ్యలోని మానవత్వం, ఆమెకు అన్నం నీళ్లూ ఇస్తే, అతనిలోని మగతనం, “…తెల్లరగానే వెళ్లిపో…. తెల్లవారేక యీ పాకలో కనిపించావా నీకు చావుతప్పదు” అని బెదిరిస్తుంది. “దేవుణ్ణి చూసినవాడు” అన్న ఈ కథలో, మానవత్వానికి, ధర్మభయానికి, గవరయ్య కల ద్వారా తేడాను చూపించారు తిలక్. కలలో దేవుణ్ణి చూసి మాట్లాడి, ఉలిక్కిపడిన గవరయ్య, వేణుగోపాలస్వామి ఆలయ గోపురాన్ని చూశాడట! ప్రకృతియొక్క విలయ తాండవంలో ఏదో సత్యం, కొరడాతో చెళ్లుమని కొట్టినట్లు అర్థమయిం దట! మనసు పొరల్లో ఏదో మెరిసిందట. ఈ మానవత్వం యిచ్చిన ధైర్యమే, “పొండయ్యా పెద్దమనుషులూ! ఇలాంటి యెదవ్వూళ్లో ఉండమన్నా వుండను. నా పిల్లాడిని యీ యెదవల మధ్య పెరగనివ్వను. థూ!” అనేంత ఎత్తుకు ఎదగ నిచ్చింది గవరయ్యను.
సమాజంలో మానవత ఎదుర్కొన్న అవమానానికి, మోసానికి నిదర్శనం, “నల్లజర్లరోడ్డు” అన్న మరో కథ! అంతసేపూ తమ మధ్యే ఉన్న రామచంద్రాన్ని పాము కాటేయగానే, బ్రతుకుభయంతో అతణ్ణి అడవిలోనే వదలి పారిపోదామను కున్న అతని స్నేహితులు, ప్రాణాలకు తెగించి, ఆ అర్థరాత్రి మూలికను వెదకి తెచ్చి, రామచంద్రాన్ని బ్రతికించిన పాముల సిద్ధయ్య కూతురు, ఆ మరునాడు, తన తండ్రిని పాము కాటేసిందని, చావుబ్రతుకుల్లో ఉన్న తండ్రికి సహాయానికి రావలసిందనీ వారిని బ్రతిమిలాడితే, తాము వెళ్లవలసిన కళ్యాణానికి వేళకు చేరాలని, విశ్వాస ఘాతకులై రామచంద్రంతో బాటు, అతని స్నేహితులు వైద్యం చేయించుకోమని రూపాయలనోట్లు విసిరేయడం, మానవత్వం సిగ్గుపడాల్సిన విషయం. ఈవిషయాన్నే, “స్వార్థం కన్నా గొప్పదేదీ యీ ప్రపంచంలో లేదని తెలిసి పోయింది నాకు. ఈ ఆశయాలు, ఆదర్శాలు అన్నీ, ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయాన్ని కలిగించనంతవరకే! ప్రతి మనిషీ లోపల్లోపల ఒక పాము…..” అంటూ, మనిషి లోని స్వార్థాన్ని వివిధకోణాలనుండి పరిశీలించారు తిలక్!
ఎన్నినాళ్ళ కోరికనో తీర్చుకోవాలని, తన దగ్గరకు వచ్చిన లక్ష్మీమోహనరావు తెచ్చిన అతని భార్య మంగళసూత్రాల ద్వారానే, అతని స్థితిగతుల్ని అంచనావేసి, “…. కోప్పడకు పంతులూ, ..మళ్ళీ ఎప్పుడైనా వద్దువుగానీలే, నా మాట విని వెళ్ళు పంతులూ, నాకూ తెలుసు కష్టం అంటే ఏమిటో… “అంటూ(అతని కోరిక) అతనికి కొంత డబ్బు ఇచ్చి పంపిన సానిపాప మనసుపొరల్లో దాగిన మానవత్వానికి అద్దం పట్టే పనిని మనకే వదిలేసే శిల్పం తిలక్ ది. జీవితంలోని యాంత్రికత, జీవనాడి స్పందనల్ని ఎలా గొంతునులిమి పారేస్తుందో, “గడియారపు గుండెల్లో” అన్న కథలో అన్వేషించారు, తిలక్!చక్కని అనుభూతుల్ని పంచుకుంటూ, జీవితాన్ని గడుపుతూండిన రాఘవయ్యశెట్టి గడియారం రాగానే, దాని కనుగుణంగా పనులు చేసుకొంటూ, యాంత్రికంగా మారి స్నేహానుభూతిని కూలద్రోసి, ప్రేయసిని మోసం చేసి, మానవత్వాన్ని కాలరాసి, సున్నితమైన అనుభూతులకు దూరమయ్యాడట! ఒకసారి ఇంట్లో, దొంగలుపడి, దోచుకొన్న వస్తువు లతోబాటు, గడియారాన్ని కూడా ఎత్తుకుపోతే, “గడియారమైతే మళ్ళీ కొనుక్కోలేదు గాని, రాఘవయ్య పనులను చూస్తూ ఇంట్లోవాళ్లు, బయటి వాళ్ళు గంటలను చెప్పుకొనేవారు”, అని వివరిస్తూ, హృదయస్పందనల్ని, యాంత్రిక జీవనంలో మనిషి ఎలా నష్టపోతున్నాడో వివరించారు తిలక్!
మంచిజీవితాన్ని అమర్చుకోవాలని, ఆనందంగా బ్రతకాలని ఆశించి, “ఉంగరం” దొంగిలించి జైలుకెళ్లిన లక్ష్మి అయినా, రేయీ పగలూ కష్టించి కూడబెట్టిన డబ్బును, మనిషిలోని రాక్షసత్వానికి బలిచేసిన వీరయ్య చౌదరి అయినా, మానవతారాహిత్యానికి బలై పోయిన అమాయకులే! అందుకే తిలక్, “వివేకం కన్నా, హేతువుకన్నా, హృదయధర్మం గొప్పది…” అని సిద్ధాంతం చేశారు. అందుకే “జీవితం హాస్యనాటకం” అని గుర్తించిన, “నవ్వు” కథ లోని మూర్తి గాని, హృదయధర్మాన్ని గుర్తించక, జీవితాన్ని నరకం చేసుకొన్న వెంకట్రావు(జీవితం)గాని, కోరరాని కోరికలనుకోరి, మేల్కొన్న హృదయధర్మంతో, ‘పరివర్తన’ చెందిన శంకరం గాని, తన తప్పులేకున్నా, క్షణికావేశంతో ప్రాణత్యాగం చేసిన విశాల(యవ్వనం) గాని , వీరందరూ మనమధ్యే నివసించే సజీవ శిల్పాలు.
“నీకంటే నేను గొప్పవాణ్ణి” అనడానికి ఎవరికీ హక్కు లేదు. ఒకరికి కవిత్వం రాయటంలో ప్రకృతిని ఆనందించే శక్తి ఉంటుంది. మరొకరికి హృదయాన్ని కరడుగట్టించుకొని, చీకట్లని వెదజల్లే శక్తి ఉంటుంది. …ఏమీ తోచక దెబ్బలాడతారు. తెలివి తేటలు ఎక్కువై ప్రభుత్వాలు, యుద్ధాలు విప్లవాలూ, కోర్టులూ కల్పించుకుంటారు. జీవితంలో నగ్నసత్యం తెలుసుకొని, నవలలూ చదివి, సినీమాలు చూసి ఆనందిస్తారు. చివరికి ప్రతి జీవితం ప్రత్యేక జీవితం. ఒకరికీ, ఒకరికీ సంబంధం లేదు. ఆశకు అంతులేదు.అంతానికి ఆశ కారణం, ఇది ప్రపంచం, ఇది జీవితం” (జీవితం)అని జీవితానికిచ్చిన నిర్వచనం, తిలక్ చేసిన మానవపరిశీలనకు ఉదాహరణ! అందుకే తిలక్ కథలన్నీ మనుష్యులకూ, మనిషితత్వానికి సంబంధించిన కథలు. అందుకే తిలక్ కథలన్నీ సమాజాన్ని, ఆ సామాజిక సంస్కృతినిప్రతిబింబింపజేసే సూత్రాలు.
తన అక్షరాలు అంటూ తిలక్ తన రచనలను గురించి చెప్పికొన్న సూత్రాలు వీరి కథలకు కూడా వర్తిస్తాయి. ‘ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు’, అనడంలో తన రచనా వస్తువు అభ్యుదయ సంబంధి అని, ‘కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు’, అనడంలో తన రచనలోని ప్రధాన రసం కరుణ అని, ‘వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు’ అనడంలో తన శైలి రమ్యాంతికమైనదని సూచించారు తిలక్. ఈ లక్షణాలే వీరి రచనలను, ముఖ్యంగా మనం చెప్పుకుంటున్న కథలను మానవత్వంతో పరిమళింపజేశాయని గుర్తించగలం!
ఇంతకూ ఏమీ లేదు. “శతధా విభిన్నమైన ఈ గుండెలో / సంగీతం యింకా వినబడుతోంది/ చావనని నమ్మకం కలిగింది/ చావులేదు నాకని ఎలుగెత్తి చాటాలని పిస్తుంది” అని చాటుకున్న, తిలక్ కవితాత్మను ప్రదర్శించే ఈ కథల్లో కనబడుతున్న తిలక్ రచనాశిల్పం సాటిలేనిదని స్మరించే చిన్న ప్రయత్నం మాత్రమే!
డా. రాయదుర్గం విజయలక్ష్మి
డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు కొత్తగూడెంలో తెలుగు లెక్చరర్ గా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాస్ యూనివర్సిటీలో బౌద్ధం మీద PhD చేసి డాక్టరేట్ పొందారు. గతంలో 'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' పుస్తకం వెలువరించారు. వీరి రేడియో ప్రసంగాలను 'పొరుగు తెలుగు బతుకులు' పేరుతొ క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి సహ-సంపాదకత్వం వహించారు. మిసిమి, పాలపిట్ట, సాహితీ స్రవంతి వంటి పత్రికలలో అనేక సాహిత్య విమర్శ వ్యాసాలు ప్రచురించబడ్డాయి.