ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడెమీ అవార్డు ను 2023 కోసం, “రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు” అన్న కథా సంపుటికి అందుకున్న శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి (1945 -) గారు ప్రముఖ కథా రచయిత! దాదాపు 75 దాకా ఉన్న శాస్త్రిగారి కథలనుండి, ఒక పన్నెండు కథలను ఎంచుకొని, ఛాయా రిసోర్స్ సెంటర్, హైదరాబాద్ వాళ్లు ప్రచురించిన పుస్తకం ఇది. తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న నవ్యసాహిత్యపరిషత్ స్థాపకులు, శ్రీ తల్లావజ్ఝల స్వామీ శివశంకర శాస్త్రిగారి మనుమడు, శ్రీమతి మహాలక్ష్మి, శ్రీ కృత్తివాస తీర్థులు గారి పుత్రులు అయిన పతంజలి శాస్త్రిగారు, ఆంగ్ల భాషలో ఎం.ఏ., చేయాలనుకొని పురాతత్త్వ శాస్త్రంలో ఎం.ఏ., పి హెచ్.డి., లను సాధించి, అధ్యాపకులుగా, కళాశాల ప్రిన్సిపాలుగా ఉద్యోగవిరమణను పొందిన వారు. 1961 నుండి కథలను రాస్తూ ఉన్న శాస్త్రిగారు, ఆరు కథాసంపుటులను, మూడు నవలలను, ‘గుండె గోదారి’ అన్న ఒక కవితా సంపుటిని, పెక్కు వ్యాసాలను వెలయించిన వీరు, గొప్ప పర్యావరణ వేత్త కూడా!
“ఓరవాకిలిగా వేసిఉన్న గదిలాంటివి నా కథలు చాలభాగం. మనం తలుపు తోసి లోపలికి వెళ్తే ముఖ్యంగా వాటి ఆంతరిక ప్రపంచం కనిపిస్తుంది” అని శాస్త్రిగారు చెప్పుకున్నట్లు,వారి కథల్లో, ఒక ఆలోచన, ఒక చింతన, ఒక ప్రవాహ శీలత … పాఠకుని, విమర్శకుని కూడా తమతోపాటే లాక్కెళతాయి. క్లుప్తత, గుప్తత నిండిన వీరి కథలు, చదివినవెంటనే అర్థమయ్యేవి కావు. ఆలోచించే అవకాశాన్ని కల్పించడం, ఆలోచించినకొలదీ గాఢత అర్థకావడం వీరికథల లోని విశేషలక్షణం! వీరికథలకున్న మరో ప్రత్యేకత, కథావస్తువు, కథ చెప్పేతీరు తో బాటు వచనం కూడా ఆ రెండింటినీ శాసించడమే కాదు అనుసరించి సాగడం కూడా. (vide: నండూరి రాజగోపాల్ గారు.. చినుకు పత్రిక ఎడిటర్)అన్న మాటలు గమనింపదగినవి. ‘నా కథలు ఎక్కడ ముగుస్తాయో, అక్కడ ప్రారంభమవుతాయి’ అన్నది తమ కథలను గురించిన రచయిత అభిప్రాయం. అందుకే వీరి కథలను చాలామంది కథల్లా వరుసబెట్టి ఏకబిగిన చదివి ముగించలేము. ప్రతి కథ, మనలను అంతులేని ఆలోచనా సంద్రంలో ఈదనిస్తుంది. ఎనలేని భారంతో మన ఆలోచనలను నింపేస్తుంది. కథంతా పరచుకున్న ప్రాకృతికమైన వెలుగులు, మనల్ని సేదతీరుస్తూనే, కథలోని ఆంతరిక ప్రపంచాన్ని కొంతైనా దర్శించాలన్న ప్రయత్నం చేయిస్తాయి. ఈ ప్రయత్నంలో ఎంతవరకు సఫలీకృతులము అవుతామో నిశ్చయంగా చెప్పలేని స్థితికి తోసివేయబడినా, ఒక గొప్ప కథను, చదివామన్న ఆనందం చాలాకాలం మనలను వెన్నంటే ఉంటుంది.
‘రామేశ్వరం కాకులు….’ అన్న ఈ పుస్తకం కూడా దీనికి మినహాయింపుకాదు. మొదటి కథ నుండి, పన్నెండవకథ ‘రోహిణి’ వరకు కూడా ఇదే స్థితి లోనే మునిగి ఉంటాము. తండ్రిగారు చిన్నపుడు చెప్పిన ‘ఎవ్వరినీ అనుకరించకు, నీకు తెలియని విషయాలను గూర్చి మాట్లాడటం గాని, రాయటం గాని, తెలుసునని నటించడం గాని చేయకు’ అన్నమాటలను మంత్రం లా అనుష్టించే వీరి కథలన్నీ వాస్తవితకు చాలా దగ్గరగా ఉన్నవే! అందుకే మన మనస్సులను అంతగా కల్లోలపరుస్తాయి. ఒక చిన్న పల్లెటూరిలో, ఒక స్కూల్ మాస్టారి కూతురిగా చదువుకుంటున్న పద్మ, రాంబాబు మాయమాటలను నమ్మి, పట్నం వెళ్ళి, చివరికి పడుపు వృత్తి లోకి నెట్టి వేయబడుతుంది. ఇదే వస్తువుతో సాహిత్యంలో లెక్కకు మిక్కిలి కథలు ఉన్నాయి. కాని రామేశ్వరం కాకులు అన్న ఈ కథ, ఇక్కడినుండే ఆరంభమవుతుంది. దేశాలు తిరుగుతూ, రామేశ్వరం నుండి ఒకరోజు తన దగ్గరకు వచ్చిన వరహాలు నుండి “రామేశ్వరం నీ చివరి చిరునామా! అందరి ఆత్మలు అక్కడికి వచ్చి వెడతాయి.” అన్న మాటలను వినగానే, పెద్ద చక్రం నుండి ఒక శూన్యంలోకి జారినట్లనిపించిందట ఆమెకు! చెవుల్లో దూరం నుంచి అలలు విరిగిపడ్డం వినిపించిదట! ఆమె నిద్రనిండా సముద్రం నిండిపోయిందట! ఆమె నది అయిపోయిందట! రామేశ్వరం వెళ్లిపోవాలని గట్టిగా నిశ్చయించుకుంది. పోలీస్ రెయిడ్ లో పట్టుబడి, ‘కోర్టుకు రాను, ఇక్కడి నుండి పంపివేస్తే, మా యింటికి వెళ్ళి అమ్మకు డబ్బులు ఇచ్చేసి రామేశ్వరం వెళ్లిపోతాను’ అని బతిమాలుతున్న ఆమె, ఎస్ ఐ కి తన కాళ్ళ దగ్గర నీలం కుప్పలా కనిపించిందట! చెప్పినట్లుగానే గంట తరువాత తిరిగి వచ్చిన పద్మకు తన ఫోన్ నెంబర్ ను యిచ్చి, రామేశ్వరం ఎలా వెళ్లాలో చెప్పి పంపిన ఎస్.ఐ. కి ఆమె నాలుగు రోజుల తరువాత ఫోన్ చేసి, ఎక్కడున్నావు? అన్న అతని ప్రశ్నకు జవాబుగా, “సముద్రంలో ఉన్నాను సార్.. మోకాళ్ళ లోతు నీళ్లల్లో ముందుకు నడుస్తూనే ఉన్నాను. సముద్రం నా మీదకే వస్తోంది సార్!…”అని చెప్పడంతో కథ ముగుస్తుంది. ఇక్కడినుండి మన ఆలోచనలు మొదలవుతాయి. ఈ కథకు ఇదే సరైన ముగింపా? అన్నది ఒక ప్రశ్న! పద్మ వ్యక్తిత్వాన్ని మొదటినుండి సున్నితంగా మలుచుకుంటూ వస్తున్న రచయిత, ఆమెను నదితోనే పోల్చారు. ఆమె వీపు మీద తిరుగుతున్న అలలను వివరిస్తూనే ఉన్నారు. ఆమె కరుణ రసాత్మకమైన హృదయాన్ని వివరిస్తూనే, అంతులేని వెలుగులతో ప్రకాశిస్తున్న ఆమె కనులలోని మార్మికతకు అద్దం పడతారు. ఆ వెలుగులే, ఎస్.ఐ. కి చనిపోయిన తన అక్కను గుర్తుకు తెచ్చి, పద్మ పట్ల అతనిలో ఒక మెత్తటి భావాన్ని కలిగిస్తుంది. తల్లిపట్ల తన బాధ్యతను తీర్చుకొని, రామేశ్వరం వెళ్లాలన్న ఆమె కోర్కె అతనికి తప్పక తీర్చవలసిన కోర్కెనే అనిపిస్తుంది. తాను చేస్తున్న పనిపట్ల అయిష్టతను చూపుతున్న ఆమె పట్ల తాను చేయగలిగింది ఆమెనుకోర్టుకు తీసికెళ్లడం కాదని , రామేశ్వరం పంపడమే సబబైన కార్యం అన్న నిర్ణయాన్ని తీసుకున్నాడు.. విషాద మోహనంగా పలికిన ఈ కథ మనలను వెంటాడుతూనే ఉంటుంది. ‘సమాంతర వాస్తవికత తన కథల ప్రధాన లక్షణం’ అని చెప్పుకున్న రచయిత మాటలను గుర్తుకు తెచ్చుకుంటాము.
ఈ సంపుటిలోని కథలన్నీ మనలను ఇంతలా ఆలోచింప జేసేవే! ముదిమి వయస్సులో భార్యాభర్తలు ఇరువురికీ వచ్చే మోకాళ్ళనెప్పి అన్న నేపథ్యంతో, తన పనిని అయినా, ఇతరుల పనిని అయినా జాగ్రత్తగా చేసే వరదాచార్యుల జీవితాన్ని వివరించిన, అతని శీతువు అన్న కథ ముగిసేటప్పటికి, న్యూస్ పేపర్ అందుకోవడానికి, తైలం సీసాను తీసుకోవడానికి, రెండవసారి కాఫీ తేవడానికి కలుక్కుమనే మోకాళ్లతో బాధపడేవరదాచార్యులు, ఆయన భార్య యిద్దరే మన కళ్ళముందు మిగులుతారు.
తమ స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటూ, ప్రజలకొరకు ఏమీ చేయని రాజకీయ నాయకులు, రాబోయే జన్మలో గాడిదలుగా పుడతారని, బుద్ధునితో, జాతక కథలలో వలె అతీత కథను గాక,
భవిష్యత్ కథను చెప్పించే రచయిత, అలా గాడిదగా మారిన గారపాటి రాఘవరావు అన్న మంత్రి, తన ఆ మరుజన్మలో కూడా గాడిదల సమస్యల పరిష్కారం కోసం ఒక సభను ఏర్పాటు చేశాడని ( గా.రా.) మనలను అవాక్కయ్యేలా చేసే ఈ కథ మిస్టికల్ రియలిజం కు ఒక గొప్ప ఉదాహరణ! ఫైలు మీద సంతకం చేయడం కోసం, నిజాయితీపరుడైన స్వామి గారి యింటికి సూటుకేసు తో వస్తానన్న గోపాలరావును నిర్దాక్షిణ్యంగా తరిమివేసిన స్వామిగారు, ఆ డబ్బులతో తమ యింటికి కావలసిన మార్పులను చేసుకోవాలని చూసే అతని భార్యాపిల్లల అసహనంతో కూడిన మంచుగాలి, కథ చాలా అందమైన కథ. ఎక్కడా బోర్ కొట్టించని వచనంతో , భార్యాపిల్లలు తమ అసహనాన్ని పుల్కాల మీద మాత్రమే చూపించగలిగిన నిశ్శబ్ద నిరశనతో సాగే ఈ కథ, నెమ్మదిగా చేయి పట్టి నడిపించేలా మలచడం రచయిత ప్రజ్ఞకు ఉదాహరణ!
ఎంతో అన్యోన్యంగా ఉన్నామనుకుంటూ మోనాటనిగా బ్రదికే ఆలుమగలు తమమధ్య నిశ్శబ్దంగా ఒక ఏనుగును పోషిస్తున్నారని చెప్పే (అతనూ, ఆమే, ఏనుగూ) కథ, ప్రక్కవారిని గురించి పట్టించుకోక, తనస్వార్థాన్ని మాత్రమే చూసుకుంటూ, తాను చేసిన తప్పును ఒప్పుకున్నా, ఇంకా జైలు శిక్ష అంటారేమిటి ? అని ఆశ్చర్యపోయే అతను, తననెవరో హత్యచేయడానికి వెంటబడుతున్నారన్న భ్రాంతికి లోనవుతున్న రెడ్డిగారు, ( అతనివెంట ), ఆఫీసు ఉద్యోగుల్లో అస్తిత్వ పోరాటాల మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలతో ( కె.ఎల్. గారి కుక్కపిల్ల) కూడిన ఈ కథలు నిజంగా చదవనీయక చేయవలసినవి. కాని శాస్త్రి గారి కథనశైలి వాక్యాలవెంట మనలను పరిగెత్తిస్తాయి. గవర్నమెంటు ఆఫీసులకు సంబంధింన కథలను రాయవలసి వచ్చినపుడు, తమనుతాము చిన్నవయస్సులోకి కుదించుకుంటారు శాస్త్రిగారు అన్న మాటలకు అర్థం, వారా వాతావరణాన్ని అర్థంచేసుకోవడానికి పడే తాపత్రయానికి గుర్తు. బహుశ ఈ లక్షణమే ఈ కథలను చదివించే స్థాయికి చేర్చిందేమో!
రైలు ప్రయాణాల్లో తటస్థపడే ఘటనతో రాసినకథ, వెన్నెల వంటి వెలుతురు గూడు. అన్న కథ! అంతసేపూ తన పక్క సీట్లో నిద్రబోతున్న అందమైన స్త్రీని గురించి,రకరకాలుగా ఊహించుకున్న వ్యక్తి, ఆమె రైలు దిగగానే, వెలిగి పోతూన్న ముఖంతో ఆమె నడుం చుట్టూ చేతులు వేసి అతుక్కుపోయిన కొడుకును చూసి, వాళ్ళిద్దరినీ వెన్నెలవంటి వెలుతురు గూళ్ళుగా భావించడం, తాను అప్పుడే పుట్టి, బయటపడిన స్పృహకు లోనూ కావడం గొప్ప అనుభూతి. నిజంగానే రచయిత ఈ లోకానికి ఇచ్చిన గొప్ప బహుమానం ఈ కథ!
ఉర్వి సౌందర్య రహస్యాన్ని ఆమెను ప్రశ్నించి తెలిసికోలేక, ఆ సౌందర్య రహస్యాన్ని తెలుసుకోవాలని, అడవుల్లోకి వెళ్ళి ఎవరెవరినో ప్రశ్నించి, చివరికి ప్రకృతిలోని బృహత్తరమైన సౌందర్యాన్ని చూసి, బాణం నుంచి తప్పించుకున్న జంతువులా పారిపోయి వచ్చిన అతను, చివరకు పళ్లను కోసే కత్తితో ఆమెను చంపేస్తాడు. అతనికి పేరు పెట్టక పోవడం, ఆమెను ఉర్వి అనడమే కాదు, ఆద్యంతం సున్నితంగా, మార్మికంగా సాగిన ఈ కథను ఇంత బీభత్సంగా ముగించడం శాస్త్రిగారికే చెల్లింది. ముగింపు చాలా రోజులు వెన్నాడుతుంది మనలను. బాగా ఆలోచిస్తే పర్యావరణానికి మనం కలిగిస్తున్న ఛిద్రతకు ప్రతీకగా ఈ కథను మలిచారు అని అనిపిస్తుంది.
ఈ పుస్తకంలో ఉన్న మరోరెండు కథలు రామాయణ కాలానికి చెందిన కచ్ఛపి సీత, బుద్ధుని చారిత్రక కాలానికి చెందిన రోహిణి అన్న కథలు. అరణ్యవాసానికి సీతారాములతోబాటు లక్ష్మణుడు కూడా వెళ్ళగా ఊర్మిళ పదునాలుగేండ్లు నిదురలో మునిగి ఉంది అన్నది అవాల్మీకమైన విషయమైనా, రామాయణానికి ఒక అందమైన చేర్పు! అక్క సీత అరణ్యవాసానికి వెడుతూ చెప్పిన మాటలను, గుర్తుకు తెచ్చుకుంటూ, తనకు దొరికిన చిన్న తాబేలుకు సీత అన్న పేరు పెట్టుకొని, ‘తనలోకి తాను ఇమిడిపోగలిగితే, అన్ని భయాలకీ, బాధలకి, వియోగాలకి అతీతంగా ఉండగలగడా’న్ని అనుభూతం చేసుకుంటే, ‘నిరాయుధుడైన శత్రువు మీదికి లంఘించి దాడిచేస్తున్నట్లు అనిపించే ఉద్వేగాలన్నీ ఉపశమించినట్లు… ‘ అని అర్థం చేసుకోవడాన్ని, ఒక తాబేలునుండి గ్రహించినట్లు చెప్పడం ఊర్మిళ కథకు మరొక అందమైన చేర్పు! కాల్పనికాలైనా మూలానికి మెరుగుపెట్టే చేర్పులు ఇవి!
ఎప్పుడైనా మూడవ ప్రపంచ యుద్ధం జరగడం సంభవిస్తే దానికి కారణం నీటి సమస్యే అవుతుంది అన్నది ఇప్పటి బహిరంగ రహస్యం. ఈ సమస్యకు పరిష్కారాన్ని చరిత్రనుండి గ్రహించడానికి చేసిన ప్రయత్నం రోహిణి కథలో చూడవచ్చు. శాక్య, కోలియ గణతంత్ర రాజ్యాల నడుమ ప్రవహిస్తున్న రోహిణీ నది నీళ్ళు, ఒక సంవత్సరం రెండు రాజ్యాలలోని వ్యవసాయానికి సరిపోక పోవడం అన్న సమస్య , రైతులమధ్య గొడవగా పరిణమించి, రాజ్యాలమధ్య యుద్ధానికి దారితీస్తుంది. ‘సమస్య ప్రధానం కాదని, సమస్యను అర్థం చేసుకునే దృష్టి ముఖ్యమని, దానివలన పరిమితులు అర్థం అవుతాయని’ చెప్పే ఈ కథ లో బుద్ధుని ఉపదేశం గమనింపదగినది. “… పేదలు, నీటికీ అన్నానికి దూరమైనవారు ఉన్నపుడు, సంఘం సుఖంగా ఉండదు. మంచి జరుగవలసిన వారికి మంచి జరగనపుడు, ఘర్షణ ఏర్పడుతుంది. దీన్ని గుర్తించడానికి ఎరుక అవసరం. ….దాన్ని గుర్తించలేకపోవడమే మీ సమస్య. అదే దుఃఖ హేతువు. పొలాలను పండించే మీకు సత్యం తెలుసు. అవసరం తెలుసు, మరి ఇది అధికారుల, రాజుల సమస్య ఎలా అవుతుంది?” అని చెప్పిన బుద్ధుని మాటలు వారిలో ఎరుకను జాగృతం చేశాయనడాన్ని , “జల ఊరినట్లు వారిలో స్నేహభావం చమరించింది..” అన్న మాటలద్వారా సూచించారు రచయిత! ఏ సమస్యకైనా పరిష్కారం, ఆ సమస్యను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడమేనని, అప్పుడు మాత్రమే పరిష్కారం స్ఫురిస్తుందని చెప్పే బౌద్ధ నీతిని వివరించిన కథ యిది..
ఈ పుస్తకం లోని ప్రతి కథా మనలను ఆలోచింపజేస్తుంది. కనిపించే విషయాలతో బాటు ఇంకా తెలియవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పడమే కాదు, వైవిధ్యమే జీవనాడిగా కలిగిన ఈ కథలు, మన సాంస్కృతిక, చారిత్రక, ప్రకృతి సంపదలను మన జీవితాలకు అనుసంధానం చేస్తూ చెప్పిన విధానం మనల ను ఆకర్షిస్తుంది అన్నమాట అక్షరసత్యం.
డా. రాయదుర్గం విజయలక్ష్మి
డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు కొత్తగూడెంలో తెలుగు లెక్చరర్ గా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాస్ యూనివర్సిటీలో బౌద్ధం మీద PhD చేసి డాక్టరేట్ పొందారు. గతంలో 'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' పుస్తకం వెలువరించారు. వీరి రేడియో ప్రసంగాలను 'పొరుగు తెలుగు బతుకులు' పేరుతొ క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి సహ-సంపాదకత్వం వహించారు. మిసిమి, పాలపిట్ట, సాహితీ స్రవంతి వంటి పత్రికలలో అనేక సాహిత్య విమర్శ వ్యాసాలు ప్రచురించబడ్డాయి.