మానవతా విలువలను వివరించే కథలు

Spread the love

‘శ్రీకాకుళం సిగపువ్వు’గా ప్రసిద్ధికెక్కిన బలివాడకాంతారావుగారు, కథాసాహిత్యానికి, ఉత్తరాంధ్ర అందించిన ఆణిముత్యం. జీవితానుభవాల ఆవిష్కరణ, వస్తు వైవిధ్యం, సన్నివేశాల వాస్తవిక నేపథ్యం, పఠనీయశైలి…..వంటి విశేషలక్షణాలతో కథను సుసంపన్నం చేసిన కథాశిల్పిఅయిన వీరు, ఉద్యోగ్యరీత్యా భారతదేశం నలుమూలను దర్శించడమే కాదు, ఆయాప్రాంతప్రజల జీవనవిధానాలపట్ల వారి సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రేమ, గౌరవం, అభిమానం కలిగివున్నవారు కూడా! స్వతహాగా మృదుభాషి, మితభాషి అయిన వీరి కథల్లో వేదన, కరుణ, మానవత్వం, మంచిచెడుల సంఘర్షణ, బాధ, జీవితసత్యాల ఆవిష్కరణ … వంటి ఎన్నో విలువైన సౌందర్య దృక్పథాలు పడుగుపేకల్లా అల్లుకొనిఉంటాయి.

ఒక చిన్న విషయాన్ని, అతి చిన్నపరిధిలో ప్రతివాక్యం అర్థవంతంగా చెప్పగలిగిన గొప్ప కథకులు, బలివాడ కాంతారావుగారు. శ్రీకాకుళం జిల్లాలోని మడపాం గ్రామంలో రవణమ్మ, సూర్యనారాయణ దంపతులకు 1927, జూలై మూడవ తారీఖున జన్మించిన వీరు, భారతసైన్యంల్లో, నౌకాదళంలో పనిచేసేవారు. ముప్ఫై ఎనిమిది నవలలు, దాదాపు నాలుగువందల కథలు, నాటికలు, రేడియో నాటికలుగా వెలసిన వీరి రచనలు, నిజాయితీ, నిక్కచ్చితనంతో కూడిన మానవతా పరీమళాలని వెదజల్లుతూ ఉంటాయి. నిరాడంబరత, ప్రాధాన్యం లేని అంశాలను, పాఠకుల అవగాహనకు వదలివేసే నేర్పు, చెప్పిన విషయాలలో సంభావ్యతలు వీరి శైలికి ఔచిత్యాన్ని సిద్ధింపజేస్తాయి. 1987-94 ల మధ్య వెలువడిన కథలతో కూడిన వీరి కథాసంపుటికి లభించిన కేంద్రసాహిత్యఅకాదెమీ అవార్డు, వీరిరచనలపై జరిగిన మూడు పిహెచ్.డి., పరిశోధనలు, పెక్కు ఎం.ఫిల్., పరిశోధనలు…ఇవన్నీ వీరి సాహిత్యానికున్న విలువకు ప్రత్యక్షసాక్ష్యాలుగా నిలుస్తాయి.

ఏ ఒక్క యిజానికో తనను తాను కుదించుకోలేని వీరి సౌమ్యధోరణి, వీరి రచనలకొక విశ్వజనీనతను ఆపాదించి పెట్టింది. తాము రాసిన ప్రతికథకూ ప్రేరణ ఉంది అని చెప్పికొన్న రచయిత, మానవజీవితాల సమగ్రచిత్రణద్వారా, తెలుగు సాహి త్యంలో ఒక చారిత్రిక వాస్తవాన్ని నమోదుచేయడంలో తమవంతు బాధ్యతను నిర్వర్తించారు. విభిన్న యితివృత్తాలతో వెలువడిన వీరి కథలు, భారతదేశంలోని, నలుమూలలనున్న మానవ జీవితాలలోని ప్రతి అంశాన్ని వివరిస్తుంటాయి. అది ఉద్యోగ విషయమే కావొచ్చు, గ్రామీణప్రజల, ముఖ్యంగా గిరిజనుల జీవన విశేషాలే కావొచ్చు, లేదా మనుష్యుల ఆంతరంగిక అనుభూతిప్రధానమైన, కళాసౌందర్యాలే కావొచ్చు… ఏ అంశం తీసికొన్నా,వీరి కథలు ప్రధానంగా మానవతావిలువలను అతి సుందరంగా, సున్నితంగా విడమరిచి చెబుతూనే ఉంటాయి.

1994 లో వెలువడిన తమ కథలసంపుటికి వ్రాసుకున్న ముందుమాటలో,రచయిత తమను ప్రభావితం చేసిన మూడు అంశాలు, తమ రచనాశిల్పాన్ని మెరుగులు పెట్టేందుకు తోడ్పడినవి అని చెప్పికొన్నారు. మొదటిది, తమ ఊర, వేసవికాలంలో, ఒక నెల రోజులపాటు, మహాభారతకథలను, పాటగాళ్లతో సహా ఆడుతూ, పాడుతూ చెబుతుండిన రామస్వామినుండి, ఏ కథను అల్లినా అది రక్తి కట్టే విధంగా చెప్పడం అవసరం అన్న సత్యాన్ని గ్రహించారట! రెండవది, ఒకసారి కోళ్ళ పెంపకం ఈషయంలో తమ ఇరుగుపొరుగువారు, పిల్లలనుండి పెద్దలదాకా పోట్లాడుకుంటుండగా, వారిలో ఒకావిడ అన్నయ్య దూరంగా నిలబడి, పోట్లాటను గమనిస్తున్నాడట! కారణం అడిగితే, “తప్పొప్పులు బేరీజు వేయా లంటే, తీర్పు చెప్పాలంటే దూరంగా ఉండి గమనించాలిగదా!” అన్న అతని జవాబు నుండి, రచయితకు పక్షపాతం ఉండకూడదని గ్రహించారట! మూడవది, తనక్రింది ఉద్యోగికి రెండే వాక్యాల్లో కాన్ఫిడెన్షియల్ రిపోర్టు వ్రాసి, అతని ప్రమోషనుకు కారకుడైన అధికారినుండి, సూటిగా, క్లుప్తంగా కథను చెప్పితే ఫలితం ఉంటుందని గ్రహించారట! అందుకే వీరి రచనలు,సూటిగా, క్లుప్తంగా, రసవంతంగా, ఏ పాత్రమీదా పక్షపాతం లేకుండా ఉన్నాయని గమనించవచ్చు.

ఇతివృత్త స్వీకార విషయంలో తమదంటూ ప్రత్యేకముద్రను కలిగిఉన్న వీరి కథలలో, ఎవరికైనా ముందుగా గుర్తు కొచ్చేకథ, ‘ముంగిసకథ’! వంశధార నదీతీరంలోనున్న తన గ్రామంలో జరిగినట్లుగా చెప్పబడుతున్న కరుణ రసాత్మక మైన కథాకావ్యమిది! వంశధారకు వరదలొచ్చినపుడు, ఇంట్లోకి కొట్టుకొనివచ్చి, ఇబ్బందిపెట్టే ఎలుకలు, పాముల నుండి రక్షణగా డాక్టర్ దంపతులు ఒక ముంగిసపిల్లను పెంచుకుంటారు. దూరదేశాల్లోనున్న తమ పిల్లలమీది ప్రేమనంతా అందుకున్న ఆ ముంగిసను ‘బయ్యన్న’ అని పిలువగానే గజ్జెలు ఘల్లుఘల్లుమంటుండగా, వచ్చి, తన ఆహారాన్ని తినిపోయేదట! ఆ దంపతులు ఊరెళ్ళినపుడు, పక్కింటి గృహస్థు, తమ కోడిపిల్ల గొంతు కొరికిందన్న అభియోగంతో, ఆ ముంగిస కరుణచూపులను లెక్కచేయకుండా, కొట్టిచంపి వంశధారలో పారవేశాడు! మరునాడు తమ కోడిపిల్లలను గొంతుకొరికి చంపిన, మరో ముంగిసను చూసి, బయ్యన్నపట్ల పశ్చాత్తాపంతో మంచం పట్టాడు, అని చెప్పే ఈ కథను చదివి ముగించగానే మనసు బరువెక్కడమే కాదు, చాలా రోజులు, ‘బయ్యన్న’ మనలను వెంటాడుతూనే ఉంటాడు.

వీరి కథల్లో, యిటువంటి ఆర్ద్రతను కలిగించే కథలే ఎక్కువ! మనల్ని ఆలోచింపజేస్తాయి. ఒక అవగాహనను కలిగిస్తాయి. ఆచరింపవలసిన అవసరముందని చెబుతాయి. మనిషి-పశువు; నెమలిసింహాసనం; అద్దం వంటి కథలు అటువంటివే! పేకాటకు. తాగుడికి బానిస అయి డ్యూటీకి సరిగ్గారాని, నాథూరాం వినాయకపాటిల్ లో తనమంచి మాటలతో, ప్రేమ, దయ కలిసిన తనవర్తనతో, మార్పుతెచ్చిన ఆఫీసు అధికారి మానవతావాది. ‘నేను మనిషిగా మారి నా భార్యను ప్రేమగా చూస్తున్నా, ఆమె చెడు తిరుగుళ్లు మానలేదు’ అంటూ, భార్యను హత్యచేసిన కత్తితో ఆ అధికారి యింటికి వచ్చిన నాథూరాం, మనల్ని చాలారోజులు వెంటాడుతూనే ఉంటాడు, మనిషి-పశువు కథలో! చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు పి.యఫ్., ను యిచ్చి, గ్రాట్యుటీని,యివ్వలేదని తెలుసుకున్న ఆఫీసర్, రెండురోజుల్లో వారి వివరాలు తన బల్ల మీద ఉండాలని అనగానే, అతని క్రింది ఉద్యోగి, ‘నెమలిసింహాసనాన్ని’ వెదుకమన్నట్లుంది అంటూ నవ్వుతాడు. కార్యోన్ముఖుడైన ఆ అధికారే, రెండు రోజుల్లో వారి వివరాలను సేకరించి, వారంరోజుల వ్యవధిలో ఆయా కుటుంబాలకు డబ్బును అందజేస్తాడు. P.F., డబ్బు దొంగలపాలు కాగా, డబ్బులేదన్న కారణంతో భార్య తనను వదిలిపెట్టిపోగా, వస్తాదులా ఉండి, చిక్కిశల్యమైన కాంబ్లే అన్న వ్యక్తి, ‘ఈ ఆఫీసు యిల్లు లాటిది. మళ్ళీ నా యింటిని గుర్తు చేశావు…..ఈ డబ్బుతో తిని, తాగి ప్రశాంతంగా చచ్చిపోతాను” అని పలకడం, మన గుండెను గొంతుకలో కొట్టుమిట్టాడేలా చేస్తుంది. మరణించిన భర్త ఉద్యోగాన్ని, తన తమ్మునికిప్పించి, అతడు తననాదుకోక పోయినా రిపోర్టు నివ్వడానికి యిష్టపడని అప్పమ్మ నుండి బంధుత్వాల విలువను గ్రహించిన ఆఫీసర్ సూర్యం, చాలా యేళ్ళ తరువాత తన తమ్ముని చూడడానికి బయలుదేరడం, ‘అద్దం’ కథలోని కొసమెరుపు.

స్వచ్చమైన గిరిజనుల్లో, నాగరికతక నేర్పిన వ్యామోహం, మార్పులకు అద్దంపడుతున్న వివరాన్ని చెబుతుంది, ‘నైజరు తేనె’ అన్న కథ! తమ తండాముందు ఆగిపోయిన కారు పెద్దమనిషిని ఆహ్వానించి, భోజనం పెట్టి, స్వచ్చమైన తేనెను అందించి సాగనంపిన గిరిజనులు, కొన్నేళ్ళ తరువాత తమ తండాకు వచ్చిన అతనిపట్ల ప్రవర్తించిన నిర్లక్ష్యధోరణి, ధనం మీదిఆశ వంటి సంఘటనల ద్వారా వారిలో వచ్చిన మార్పును వివరిస్తారు రచయిత! నాగరికత ముసుగులో పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా మానవసంబంధాలు దెబ్బతింటున్న విధానాన్ని వివరిస్తుందీ కథ!

పంజాబ్ లో తన చెరుకు తోటలో దాగిన దుండగులను పట్టుకోవడానికి, తోటకు నిప్పంటించిన రైతు జీవితం, ప్రేరణగా, ‘వెలుగుతున్న వీరుడు’ అన్న కథ రూపుదిద్దుకున్నది. శతృదేశస్థులు తమ ఊర సైనికులను దింపినారని తెలుసు కున్న ‘రామ్ లుభాయి’ అన్న రైతు, అంతకుముందే తాను తన నాగలి ఉక్కును కరిగించి చేయించుకున్న బళ్లేలను, యువకులకు యిచ్చి, ఆ దుండగులను పట్టుకోవడానికి వారు దాగిఉన్న తన చెరకుతోటను తగులబెట్టిన దేశభక్తికి మన ఒడలు పులకిస్తుంది.

దుఃఖాన్ని జయించేమార్గాన్ని సూచించే కథలు,’పోయింది పొల్లు’, ‘కన్నభూమి కనుగొన్న త్రోవ’ అన్న కథలు! తన ఆరేళ్ళ కూతురు మరణ దుఃఖం నుండి కోలుకోలేని కమల, తన పదేళ్ళ కుమారుని మరణానికి దుఃఖిస్తూనే ఇంటిపని, బయటి పని చేసుకుంటూ పడకలో నున్న ముసలి అత్తగారిని చూసుకుంటున్న వ్యక్తిని చూసి, దుఃఖ భారం నుండి తేరుకుంటుంది, ‘పోయింది పొల్లు’ అన్న కథలో! తన గుడిసెకు మూడువైపులానున్న భవంతుల వారికి తన యిల్లును యివ్వలేక, వారి బాధలు పడలేక, ఒక మార్వాడికి ఆ యింటిని అమ్మి మరోకచోట స్థలం కొనుక్కొని,పాతయింటినుండి బస్తాడు మట్టిని తీసికెళ్లి ఆ చోట యిల్లు కట్టుకోవడం రెండవకథ యితివృత్తం. మార్పు సమాజలక్షణం. సంఘర్షణలకు లొంగి పోకుండా, మార్పును ఆహ్వానించినవారే హాయిగా బ్రదుకగలరని యీ కథ చెబుతుంది.

‘అశాంతి ఒకజబ్బు కాదు. అశాంతి వుండటం వలననే మనిషి అన్వేషిస్తాడు. కానీ, అశాంతితో మనసు మీద పట్టును విడిచిపెట్టిన వాడు పిచ్చివాడవుతాడు. అలాంటి చపలచిత్తులకు అధికారం అప్పజెప్పకుండా మానవజాతి జాగ్రత్త పడాలి.” అని చెప్పే ‘అశాంతి’ అన్న కథ, పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటూ చిక్కుల్లో పడుతున్న మానవజాతికి ఒక హెచ్చరికగా కూడా పని చేస్తుంది.

వీరికథల్లో పతాకస్థాయిలో కనిపించే లక్షణం మానవతను వివరించడం. సంప్రదాయాలను విడిచి పెట్టడమే గాక, IAS అయినా, తన తల్లిదండ్రుల బాగును చూడని కుమారునికి బుద్ధి చెప్పిన తండ్రికథ, ‘చక్రతీర్థ’ అన్న కథ! ఈ తరంలో మరుగున పడిపోతున్న మానవత్వాన్ని ఉలిక్కిపడేలా చేసిన కథ! జగన్నాథుని గుడిలో పూజారిగా పనిచేసి, విశ్రాంతి తీసికొంటున్న ఆ తండ్రి అంతిమ కోరిక ప్రకారం, చుట్టుపక్కల నున్న పండాలందరూ కలసి, అతని అంత్యక్రియలను తామే నిర్వహించి, ‘విషయం నీకు తెలుపుతున్నామ’ని కొడుకుకు ఉత్తరం వ్రాయడం, ఆ కొడుకుతో బాటు మనల్నికూడా ఉలిక్కిపడేలా చేస్తుంది. మనిషి దోచుకుంటాడు, లేదా దోపిడీకి గురియవుతాడు అని చెప్పే ‘అదృష్ట చిహ్నం’ కథలోని రాంబాబు, తన యింట దొంగతనానికి వచ్చిన దొంగ మాటల వలన ఆలోచనలో పడటం మంచి ముగింపు. మానవతను మరువరాదని ప్రతి మనిషినీ హెచ్చరిస్తుందీ కథ! కష్టమంటే తెలియని బాబ్జీ, గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడం, ఆవేదనకు లోను కావడం, ఇప్పటికీ నాలో కూడా ‘మానవరక్తం’ ప్రవహిస్తుంది అని సంతృప్తిని చెందడం, (‘మానవరక్తం’) మానవతకు పరాకాష్ట! రాగయుక్తంగా పద్యాలు పాడగలిగిన మాధవరావుకు ఉద్యోగాన్నిచ్చిన అన్నారావు(గులకరాళ్ళు), కఠినంగా కనిపిస్తూ, అవసరం వచ్చినపుడు, అడగకుండానే సాయం చేసే కృష్ణమూర్తి, మానవతా విలువలకు మంచి ఉదాహరణలు!

ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రతి కథా ఒక చక్కనిదృశ్యకావ్యంలా ఉండటమే కాదు, ప్రతి కథా, పాఠకునికి ఒక చక్కని సందేశం యిచ్చేలా వుండటం, వీరి కథల్లోని విశేషాంశం.కొన్ని కథల ముగింపులు, మనల్ని ఆలోచింప జేస్తాయి. చక్కని వ్యావహారిక శైలితో, మృదువుగా సాగే రచనా విధానం, పిల్లతెమ్మెరలా మనసుకు హత్తుకు పోతుంది. పూసల్లో దారంలా తాత్త్వికత అలుముకున్న కథలు, జీవనతత్త్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. చాలాకాలం మనలను వెంటాడేలా కథలను చెప్పడం వీరికి వెన్నతో పెట్టిన విద్య! అందుకే, మానవజీవన పరిశీలనా తాత్త్వికులు, కళింగాంధ్రతో బాటు, భారతీయులందరి గుండె చప్పుళ్లను తమ కథల్లో వినిపించిన కథక చక్రవర్తి బలివాడ కాంతారావు గారు, అని చెప్పడం అతిశయోక్తి కాదు.

డా. రాయదుర్గం విజయలక్ష్మి

డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు  కొత్తగూడెంలో తెలుగు లెక్చరర్ గా  పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాస్ యూనివర్సిటీలో బౌద్ధం మీద PhD చేసి డాక్టరేట్ పొందారు. గతంలో  'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' పుస్తకం వెలువరించారు. వీరి రేడియో ప్రసంగాలను  'పొరుగు తెలుగు బతుకులు' పేరుతొ క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి సహ-సంపాదకత్వం వహించారు. మిసిమి, పాలపిట్ట, సాహితీ స్రవంతి వంటి పత్రికలలో అనేక సాహిత్య విమర్శ  వ్యాసాలు ప్రచురించబడ్డాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *