సిద్ధార్ధ కవిత్వ విలక్షణత తన మొదటి కవితా సంపుటి దీపశిల తోనే రుజువయింది. తన కవిత్వం బహుళ స్థాయిలో ఆలోచింపజేసే స్వభావాన్ని కలిగిఉంటుంది. ఈ కవి తన అంతర్మథనాన్నితాత్విక ప్రశ్నలతో కలిపి తన కవిత్వంలో చూపిస్తాడు. అస్తిత్వం. మరణం, ప్రేమ, కాలం, వంచన, ఆత్మిక సంఘర్షణ తన కవిత్వం లో కీలకాంశాలు. ఎక్కువ సందర్భాల్లో ఈ మోనోలాగుల్లా తన కవితల్లో తన మనస్సులో జరుగుతున్న సంఘటనలను, ఇతరులకి చెప్పినట్లు, మనం విన్నట్లు చిత్రీకరిస్తాదు. ఇది కేవలం స్వీయ సంభాషణ కాదు; ఒక దృశ్యానికో సందర్భానికో ప్రతిస్పందనగా ఉంటుంది. బాహ్య సంఘటనలు కాకుండా, ఈ మోనోలాగ్లు అంతర్గత వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తాయి. క్లిష్టమైన పదాలతో కొన్నిసార్లు గ్రహించడానికి కష్టంగా అనిపించవచ్చు. అయితే ఇది తన స్పందిస్తున్న విషయఫలితం. అసాధారణ అనుభవాలు అనివార్యంగా కవిత్వాన్ని సంక్లిష్టం చేస్తాయి. ఈ క్రమంలోనే తాను అసాధారణంగా అనిపించే పదాలు, రూపకాలు వస్తాయి. తను కవిత్వాని ఒక ఆత్మిక ఆన్వేషణ సాధనంగా మార్చుకున్నాడు. తన కవిత్వంలో జీవితం మీద అంతర్లీనమైన విశ్లేషణను ఉంటుంది.
సిద్ధార్ధ తన కవిత్వంలో సామాజిక ఇతివృత్తాలు లేదా సార్వత్రిక భావోద్వేగాల కంటే వ్యక్తుల ప్రత్యేకమైన, సంక్లిష్టమైన స్వభావాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు. వ్యక్తుల వ్యక్తిగతతపై తన దృష్టి పోతుంది. ఇది సహజంగానే అసాధారణమైన, కొన్నిసార్లు అస్పష్టమైన శైలికి, విషయాలకు దారితీస్తుంది. అమలులో ఉన్న కవిత్వం పద్ధతులకు ఇది భిన్నంగా ఉంటుంది. నైతికతలలోంచి కాకుండా అనుభవాత్మకతలొంచి విషయాలను మననం చేయటం తన కవిత్వంలో కన్పిస్తుంది.
తాత్విక కవులుగా పిలువబడే వాళ్ళు అస్తిత్వఅర్థం, మానవ స్వభావం గురించిన లోతైన ప్రశ్నలను తమ కవితలలో చిత్రిస్తూవుంటారు. జీవితాన్ని గురించి లోతైన శోధన చేస్తారు. ఒక కవిగా సిద్ధార్థ కూడా తన కవిత్వంలో లోతైన తాత్విక, కళాత్మకతను ప్రదర్శిస్తాడు. తన కవిత్వంతో తత్త్వశాస్త్రం ఒక గాఢమైన సంబంధాన్ని కలిగిఉంటుంది. కవిత్వం, తాత్వికత రెండూ అస్తిత్వం, అనుభవ స్థితులను స్వభావాన్ని సామాన్యమైన భాషను అధిగమించే రీతిలో అన్వేషిస్తాయి. కవిత్వంతన, ఆలంకారికత, సాంకేతిక లోతుతో, తరచూ అస్తిత్వం, కాలం , అనంతం వంటి తాత్త్విక భావనలను సజీవమైన, ఊహాత్మక రూపాల్లో ప్రతిఫలిస్తుంది. తత్త్వశాస్త్రం, వాస్తవికత మౌలిక స్వభావంపై విచారణ చేస్తుంది. సిద్ధార్థ తన కవిత్వంలో ఏక కాలంలో ఈ రెండు పనూలు చేస్తాడు. అందువల్ల తన కవిత్వంలో కళాత్మక సౌందర్యం,తాత్త్విక అంతర్దృష్టి రెండూ కనిపిస్తాయి. తనకి ఇష్టమయిన వ్యక్తుల గురించి రాసేటప్పుతూ సిద్ధార్థ మరింత తాత్వికంగా, కవితాత్మకంగా కనిపిస్తాడు. ఆర్టిస్ట్ మోహన్ కోసం రాసిన గండ దీపం, పండిత్ రవిశంకర్ గురించి రాసిన తంత్రి… తాంత్రికుడూ ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు.
అతనెవరో నాకు ఇప్పటికీ తెలియలేదు. /ఒక ఊరు పుట్టినప్పుడూ …/మొదటిగా పర్రెలీనిన నేలమీద/ నాగలి దున్నినప్పుడూ… ఒక పాట కలలో… విరిగిపడ్డప్పుడూ/ పండుజాబిలి… అమావాస్యకడుపులో/ నిద్రపోతూ నవ్వుకున్నప్పుడు /మా ప్రాంతం గుట్టల్లోకి పిట్టలాగా/ దూరిందిఇతనేనని అంటారు/ అతనిదొక ఉన్మాదపు తటస్థత అని కూడా/ అంటారు./పతంగ్ని పట్టుకుని నిలబడే దారం లాంటోడని కూడా అంటారు/వర్ణయోనిలో వజ్రాసనం వేసుకొని/ప్రాణాయామం చేస్తాడని అంటారు. నిప్పుగుండాలు ఉశ్కె జలపాతాలు’ స్వప్నశీతల నైరుతి రాతలు/ ఇతన్ని పట్టిస్తాయనికొందరంటారు /వాటినే… అతను తాత్కాలికంగా/ముచ్చట్లలో బంధిస్తాడనీ అంటారు/అతనెవరని అడిగితే మాత్రం /ఇప్పటికీ తెల్వదన్నా… అనే అంటాను(గండదీపం)
‘ …..
మహా గురువుల… మహా పాదయాత్ర/ శ్రవణేంద్రియానికి నిర్వాణ సుఖం /ఒక చీమ నిద్రలోకి /కంజుపిట్టల కలల్లోకి/ ఎండిన భూమి సణుగుడులోకి/బర్రెల పుర్రెల ప్రాణసొరంగాల్లోకి /గాలి గాథల్లోకి… నీ సంగీతం/…సమాధులే మబ్బుల్లోకి లేచి/ ప్రాణాయామాలు చేసినట్లు /మానస సరోవరాలు ముచ్చట్లు చెప్పినట్టు/ గాథలు చప్పట్లు కొట్టి /తంత్రులు యక్షిణిలై ఆడి/ గునుగుపూల చుంబన పరిస్పర్శలు/ అంతా నీ సంగీతం/…../తంత్రిని దేహంగా దాల్చిన బాటసారీ…నువ్విక్కడపుట్టనే లేదు /నువ్వెక్కడా చచ్చిపోనూ లేదు/ నీ స్వరతంత్రమంతా… /బ్రహ్మకపాలాన్ని/ పేల్చిన ఊపిరి సంతకం /కొన్ని పగోడాలపైన వివశంగా /కురిసే మలిఝాము వెన్నెల/గడిచిపోయిన శతాబ్దాలూ /మునిగిపోయిన నాగరికతలూ /నీ స్వరాల్లో పూచిన మొగ్గలూ… వాగులూ /ఆకాశంలోని గవ్వలూ… రవ్వలూ… వహ్వాలూ…/.. నాయ్ నా ‘నువ్వు చందమామ చుట్టూ కట్టిన/ శిలాజ తోరణానివిరా/ నా కామాఖ్య భ్రుకుటివిరా /జన్మపేటికవు/ చెంచు శంకరునివి రవివి(తంత్రీ… తాంత్రికుడూ…)
ఈ పై రెండు ఖండికలు కవిత్వం గాఢతతొ , ఆత్మిక ఉద్వేగాన్ని. రసాత్మకతను కలిపివేస్తాయి. ‘గండదీపపు’ వాక్య సముదాయం ఒక అనవగతమైన వ్యక్తిత్వం గురించిన అవగాహన కోసం చేసిన అన్వేషణ. ఈ అన్వేషణ ఒక దైవిక లేదా విశ్వ శక్తిని, దాని గుర్తింపు గురించి చేసిన అన్వేషణ లాగా ఉంటుంది. ఒక వ్యక్తిత్వపు అవ్యక్తతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, స్పష్టమైన, దాదాపు ఆధ్యాత్మిక రూపకాల ద్వారా కూడా వర్ణిస్తుంది. భూమి (నాగలి దున్నడం, నిప్పుగుండాలు, జలపాతాలు) ఖగోళ (చంద్రుడు, కలలు, కాస్మిక్ స్థితులు) సంబంధిత చిత్రణలు ఈ అన్వేషణకున్న విస్తృతికి తార్కణం. “అతనెవరో నాకు ఇప్పటికీ తెలియలేదు” ప్రకటన —అవ్యక్తమైన దానిని అర్థం చేసుకోవడానికి జరిగిన శోధనను తెలియజేస్తుంది. “నిప్పుగుండాలు” “స్వప్నశీతల నైరుతి రాతలు” వంటి ప్రస్తావనలు భౌతిక-ఆత్మికతల సమ్మేళనాన్ని సూచిస్తాయి. తాను ఊహిస్తున్న వ్యక్తి వ్యక్తిత్వం ఈ భూమికి అతీతం అనే భావనను కలిగిస్తాయి.
ఈ కవిత రూపకాలు (metaphors), వైరుధ్యాలతో నిండిన గాఢమైన భాషను ఉపయోగిస్తూ, ఇంద్రియ బౌద్ధిక ఉత్తేజాన్ని కలిగించే ఒక సునిశిత చిత్రపటాన్నిమన ముందు నిలుపుతాయి. “చెప్పుకుంటారు” వంటి పునరావృత పదజాలంతో కవి ఒక లయబద్ధమైన ప్రవాహాన్ని సృష్టిస్తాడు. ఈ సందర్భంలో కవి తాను ఊహిస్తున్న వ్యక్తిత్వం గురించిన వుదంతాలను ప్రస్తావిస్తున్నట్లు అనిపిస్తుంది. గ్రామీణ, ప్రకృతి సంబంధిత చిత్రణలు—నాగలి, గుట్టలు, నిప్పు, చంద్రుడు లాంటి భౌతికాంశాల ప్రస్తావనద్వార సాధారణంగా కనిపించే అంశంలో ఒకానొక అసాధారణత్వం అంతర్లీనంగా కనిపిస్తుంది.
ఆర్టిస్ట్ మోహన్ గురించి రాసిన కవితలగానే పండిత్ రవిశంకర్ గురించి రాసిన ఖండికలో ఒక అసాధారణ వ్యక్తి శాశ్వత స్వభావానికి, సంగీతనికి ఒక కవితాత్మక tribute గా అనిపిస్తుంది. కవిత సంగీతపు రూపాంతర శక్తిని (“నీ సంగీతం”) ఉద్ఘాటిస్తూ, దానిని సాధారణమైన (నిద్రిస్తున్న చీమ, బర్రెల పుర్రెలు) నుండి మార్మికమయిన (సమాధులు మేఘాలలోకి లేవడం, బ్రహ్మ కపాలం) వరకు అన్నింటినీ జీవం పోసే శక్తిగా చిత్రిస్తుంది. ఇక్కడ ప్రస్తావించబడిన వ్యక్తి లేదా కళాకారుడు అసాధారణ సమ్మోహనాశక్తి కలవాడు, “నువ్విక్కడ పుట్టనే లేదు / నువ్వెక్కడా చచ్చిపోనూ లేదు”అనే వర్ణన —ఇది దాదాపు దైవసమానమైన, శాశ్వత ఉనికిని సూచిస్తుంది. “తంత్రిని దేహంగా దాల్చిన బాటసారీ,” “తీగల వాయిద్యం శరీరంగా” లాంటి పదబంధాలు సందర్భం ని అధిబౌతీకస్థాయికి తీసుకెళతాయి.
ఇంగ్షీషులో విలియం బ్లేక్ రాసిన The Tyger అనే కవిత ఒక కళాకారుడు లేదా కవి కాల్పనికతలో ఉన్న అసాధారణ లక్షణాలను చిత్రించే కవిత. ఈ కవిత, ఒక కళాకారుడుది ( బ్లేక్ దృష్టిలోదేవుడు) అసాధారణ శక్తులను, మార్మికమైన శక్తిగా చిత్రీకరిస్తూ, సాధారణ జీవి (పులి) ద్వారా కళాకారుడి సృజనాత్మక ఊహను వెలికితీస్తుంది. “గండదీపం””తంత్రీ… తాంత్రికుడూ” లాంటి సిద్ధార్థ కవితలతో అటువంటి ప్రయత్నమే కనిపిస్తుంది.
బ్లేక్ తన కవితలో “What immortal hand or eye, / Could frame thy fearful symmetry?”అనీ పదబంధాలు దేవుడి అసాధారణ శక్తిని సూచిస్తాయి. దేవుడు ఒక కళాకారుడు లేదా కవిగా చిత్రీకరించబడ్డాడు. అతని ఊహాశక్తి సాధారణ ప్రపంచాన్ని అసాధారణంగామార్చగలదు. బ్లేక్ వాడిన “burning bright”, “fire of thine eyes”వంటి చిత్రణలు దేవుడి విశేష శక్తిని సూచిస్తాయి. సిద్ధార్థ కవితలోని “వర్ణయోనిలో వజ్రాసనం” లేదా “బ్రహ్మకపాలాన్ని పేల్చిన ఊపిరి” వంటి రూపకాలతో సమానంగా కనిపిస్తాయి. అదేవిధంగా “తంత్రీ… తాంత్రికుడూ”లో, కళాకారుడు ఒక సంగీత శక్తిగా, “బ్రహ్మకపాలాన్ని పేల్చిన ఊపిరి”గా చిత్రీకరించబడ్డాడు, ఇది “The Tyger”కవిత లోని దేవుడి “hammer”, “chain”ల గురించిన ప్రస్తావనని గుర్తుచేస్తాయి.
పదం కారాగారమే అంటున్నాడు సిద్ధార్థ . “పదం లేదా భాష ఒక జైలు” అనే భావన సూచించేదేమంటే, భాష అనేది సమాచార వ్యక్తీకరణకు శక్తివంతమైన సాధనం అయినప్పటికీ, అది ఆలోచనలను నిర్బంధించగలదు. అవగాహనను పరిమితం చేయగలదు. ఇంకా వాస్తవికత గురించిన పూర్తి అనుభవాన్ని నిరోధించగలదు. తత్త్వవేత్తలు, కవులు ఎలా పదాలు ఒక బోనులా పనిచేస్తూ, సంక్లిష్ట ఆలోచనలను, భావోద్వేగాలను లేదా సత్యాలను తమ పరిమిత నిర్మాణాలలో బంధిస్తాయో, తరచూ అవ్యక్తమైన లేదా సంపూర్ణమైన దానిని గ్రహించడంలో విఫలమవుతాయో దీర్ఘకాలంగా అన్వేషించారు. ఈ భావనను భాష ఎలా మానవ అవగాహనను రూపొందిస్తుంది, నిర్బంధిస్తుంది అనే దృష్టితో, తాత్త్విక దృక్పథాలు, కవిత్వ ఉదాహరణల అనేకం కనిపిస్తాయి.
“నా భాషా పరిమితులు నా ప్రపంచం పరిమితులను సూచిస్తాయి” (The limits of my language mean the limits of my world.,) అని అన్నాడు విట్గెన్‌స్టైన్(Tractatus Logico-Philosophicus,5.6, P. 204, London, Anthem Press: Lonon, 2021. )
భాష వాస్తవికతగురించిన మన అవగాహనను నిర్మాణం చేస్తుందని, కానీ అదే సందర్భంలో అది మనలను భాషా వ్యవస్థల నియమాలు, సంప్రదాయాలలో నిర్బంధిస్తుందని వాదించాడు. పదాలు “భాషా క్రీడల” సాధనాలుగా ఉంటాయి. వాటి అర్థాలు నిర్దిష్ట సందర్భాలకు అనుసంధానించబడి ఉంటాయి. ఇవి ఆ సందర్భాలకు వెలుపల ఆలోచనలను వ్యక్తీకరించడం లేదా అర్థం చేసుకోవడంలో మన సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి.
హైడెగ్గ ర్కూడా భాషను అస్తిత్వాన్ని (Being) ఆవిష్కరించేదిగా, దాచిపెట్టే సాధనంగాకూడా చూశాడు. తన “భాష” అనే వ్యాసంలో “భాష అనేది అస్తిత్వ గృహం,” అని అన్నాడు. అదే సందర్భంలో అది స్థిరమైన పదజాలంలో అస్తిత్వ సారాంశాన్ని అస్పష్టం చేయగలదని కూడా హెచ్చరించాడు. రోజువారీ భాష, సాంప్రదాయిక వాక్యాలు సమాచారం నిండి ఉండి, మనలను ఉపరితల ఆలోచనా విధానాలలో బంధిస్తుంది. గాఢమైన సత్యాలకు చేరకుండా నిరోధిస్తుంది. భాషకి లేక పదానికి ఉండే ఈ సందిగ్ధత ( ambiguity)గురించిన తాత్విక అవగాహన “నన్నుపలకరించనంతవరకూ పద్యం కారాగారమే” చాలా స్పస్టంగా కనిపిస్తుంది. కవి ఇలా అంటాడు:
మరణం లేని ప్రేమ లేదు/ప్రేమ తగలని మరణం బతికినట్టు కాదు/ఇచ్చలు, కాట్లు, ఆటుపోట్లూ లేని/సుడులు తిరిగే/బాలింతరాలి కడుపు లోపలి పువ్వు/నా పదం’రాత్రి పొడవని కన్ను -/సుగాలి వర్ణాల జగద్దీపం-/దాని మూలన/శయనించని అంత:పురముంది/వెన్నెలూగే నది వాలు ఉంది/నాయనమ్మ చారల చీర దారుల్లో/ నిద్రకాగే మణిద్వీపముంది/ఆమె అండాశయంలోని ముచ్చటుంది/ అచ్చమొక పదమే /కావచ్చు నా ఊరు వాత పెట్టిన సామెత కావచ్చు/ కాండ్రించిన రాత కావచ్చు/ దాని గాయపు నిట్టూర్పు ఏమో ఇక /నన్నింకా ఎవలూ ప్రేమించలేదని/ ఎవతే చెప్పింది పదమేనా?…/ఈ ప్రేమంతా ఉత్త భాష…. నలిగిన యాస నడవడానికింకా ఊతమియ్యే యాదక్కా జిబానంద దాసో…/సుబేదార్ సుందర సంగీత రషీదాఖానో… సదాశివో…
ఈ కవిత మృత్యువు, ప్రేమ, భాషల మధ్య లోతైన సంబంధాన్ని ఆవిష్కరిస్తూ, విశ్వజనీన ఆలోచనలతో స్థానిక సంస్కృతిని మేళవిస్తుంది. “మరణం లేని ప్రేమ లేదు / ప్రేమ తగలని మరణం బతికినట్టు కాదు” అనే పంక్తులు ప్రేమ, మరణాలు ఒకదానితో ఒకటి అవిభాజ్యమని తెలియజేస్తాయి. ప్రేమ తాత్కాలికతలోనే అర్థవంతమవుతుంది, మరణం ప్రేమ లేనిదైతే అసంపూర్ణమని కవి సూచిస్తాడు. “నలిగిన యాస”గా భాషను చిత్రీకరిస్తూ, ప్రేమను వ్యక్తీకరించడంలో భాషకుండే పరిమితను కవి ప్రశ్నిస్తాడు. భాష అనుభవాలను పూర్తిగా ఆవిష్కరించలేని ఒక ప్రతిబంధకంగా చూపిస్తాడు. “సుడులు తిరిగే / బాలింతరాలి కడుపు లోపలి పువ్వు” , “వెన్నెలూగే నది వాలు” వంటి వ్యక్తీకరణాలు కవితకు గొప్ప బలం.
అన్నిటికంటే ముఖ్యంగా ఈ కవిత ప్రేమ, జీవన రహస్యాలను పరిమిత భాషలో వ్యక్తీకరించంలో ఎదురయ్యే సవాలును ప్రతిఫలిస్తుంది. ప్రేమ, అస్తిత్వంల సారాన్ని పట్టుకోవటంలో భాషకున్న పరిమితిని ఈ కవిత ప్రస్తావిస్తుంది. “ఈ ప్రేమంతా ఉత్త భాష…. నలిగిన యాస” అనే వాక్యం, “ఎవతే చెప్పింది పదమేనా?” వంటి ప్రశ్నలు భాషకున్న అసమర్థతను నొక్కి చెబుతాయి.
ఈ కవిత ఆర్ద్రత, విస్మయం, నిరాశలతో కూడిన భావోద్వేగాన్ని రేకెత్తిస్తుంది. “నన్నింకా ఎవరూ ప్రేమించలేదని” అనే కవి ప్రకటన అస్తిత్వ సంబంధమైన సందేహంతో నిండి, ప్రేమను నిజంగా తెలుసుకోవచ్చా లేక భాష ద్వారా వ్యక్తీకరించవచ్చా అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. అదే సందర్భంలో “నలిగిన యాస” అనే సూచన పదాల అసమర్థతపై నిస్పృహను వ్యక్తం చేస్తుంది.
ఈ కవిత పైన చర్చించిన “భాష ఒక ప్రతిబంధక ” అనే భావనతో రుజువు చేస్తుంది. . ప్రేమ “కేవలం ఒక పదం” మాత్రమేనా అని కవి ప్రశ్నించడం, భాషను “నలిగిన” లేదా “ఉత్త” రూపంగా చిత్రీకరించడం విట్గెన్‌స్టైన్, హైడెగర్‌ల తాత్విక ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ భాష సత్యాన్ని ఆవిష్కరిస్తూనే దాన్ని మెరుగుపర్చుతుంది.
ఫ్రెంచ్ తత్త్వవేత్త, గిల్స్ డెలూజ్ (Gilles Deleuze) తన తాత్త్విక భావనలైన విభిన్నత (Difference). రూపొందటం (Becoming), అంతఃస్థితి(Immanence), రైజోమ్(rhizome) వంటి భావనల ద్వారా కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఫ్రేమ్ వర్క్ లను అందిస్తాడు. ఇవి సాంప్రదాయ భాష, ఆలోచనా పద్ధతుల్ని భంగపర్చుతాయి.
డెలూజ్పాశ్చాత్య తాత్విక సంప్రదాయాలు విభిన్నతను సమానత్వం లేదా ఐక్యతకు సంబంధించినదిగా మాత్రమే పరిగణించే దృక్పథాన్నిసవాలు చేస్తాడు. తన దృష్టిలో, రూపొందటం (Becoming) అనేది స్థిరమైన స్వరూపాన్ని నిరాకరించే, నిరంతర మార్పు పరిణామ ప్రక్రియ- ఇది స్థిరమైన “అస్తిత్వం” కంటే “మార్పు”ను ప్రాధాన్యం ఇస్తుంది. అలాగే డెల్యూజ్ దృష్టిలో, అంతర్గతత్వం ( Immanence) అనేది బాహ్య ఆధారాలు లేకుండా, అన్ని అస్తిత్వాలు ఒకే సమతలంలో, అంతర్గత సంబంధాల ద్వారా స్వయంగా రూపొందాటాన్ని చూచించే తత్వం. అంతిమంగా విస్తృతజాలత్వం (Rhizome)అనేది కేంద్రం లేని, శ్రేణీకరణను తిరస్కరించే, అనేక దిశలలో విస్తరించే సంబంధాల వ్యవస్థ. ఇది రేఖీయమైన, నిటారుగా ఉండే చెట్టు వంటి ఆలోచనా నమూనాలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
డెలూజ్ సాహిత్యం , కళను వ్యాఖ్యానపు స్థిర వస్తువులుగా కాకుండా రూపొందే ప్రక్రియగా చూశాడు. తన వ్యాససంపుటి Essays Critical and Clinical (1993)లో, సాహిత్యం అనేది అర్థపు ప్రాతినిధ్యం లేదా సూచకాల కోసం వెతకడం కాకుండా ఒక ఉత్పాదక శక్తి అని వాదిస్తాడు. తాను ఇలా అంటాడు:
Writing is a question of becoming, always incomplete, always in the midst of being formed, and goes beyond the matter of any livable or lived experience. It is a process, that is, a passage of Life that traverses both the livable and the lived. Writing is inseparable from becoming: in writing, one becomes-woman, becomes-animal or vegetable, becomes- molecule to the point of becoming-imperceptible. (p.1)
ఇది కవిత్వానికి కూడా వర్తిస్తుంది, దీనిని డెలూజ్ సాంప్రదాయ భాషను భంగపరిచే ఒక మాధ్యమంగా చూస్తాడు. ఇది స్థిర అర్థాల నుండి తప్పించుకునే కొత్త గ్రహింపులు, భావప్రభావాలను సృష్టిస్తుంది.
రచన ఎప్పుడూ అసంపూర్ణంగా, నిరంతరం రూపొందుతూ ఉంటుంది. తద్వారా అది జీవించిన అనుభవాల అంశాలను అధిగమిస్తుంది. అసలు ఒక వాక్యం రాయడం అనేది స్థిరమైన లేదా పూర్తయిన రూపం కాదని, అందుకు బదులుగా అది నిరంతరం మార్పు చెందుతూ, కొత్త అవగాహనాలను సృష్ఠిస్తూ అమలులో ఉన్న సాంప్రదాయ భాషా నిర్మాణాలను భంగపరిచే ఒక గతిశీల ప్రక్రియ రచన. ఇది కవిత్వం లేదా సాహిత్యం ద్వారా జీవితాన్ని పరిమిత అనుభవాలకు మించి, సరికొత్త అవకాశాల వైపు తీసుకెళ్లే సామర్థ్యాన్ని నొక్కి చెపుతుంది.
డెలూజ్ అంతర్గతత్వ భావన కవిత్వానికి చక్కగా సరిపోతుంది. కవిత్వం కఠిణ నిర్మాణాల నుండి తప్పించుకునే మార్గాలైన పలాయన రేఖలను గుర్తిస్తుంది. అది ఇప్పటికే ఉన్న వాటిని పునరుత్పత్తి చేయడం కాకుండా కొత్త వాస్తవికతలను సృష్టించే సృజనాత్మక ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. డెలూజ్ ప్రకారం, కవిత్వం శక్తి అది అగోచరమైనవాటిని గోచరమైనవిగా మార్చే సామర్థ్యంలో ఉంది, సాంప్రదాయ ఆలోచనను భంగపరిచే శక్తులను కవిత్వం ముందుకు తెస్తుంది. ఆ క్రమంలో అది అర్థాన్ని నిర్ధారించకుండా సందిగ్ధతకు లోనూ చేస్తుంది.
సిద్ధార్ధ కవిత ఉడుత ఇలా నడుస్తుంది:
మనలో ఎంతో కొంత శూన్యం ఉండకపోతే ఎలాగ/లోపల కొన్ని భాగాలు ఖాళీగా ఉంచకపోతే ఎట్ల/అర్థం చేసుకోకుండా జీవించకుండా జీవమివ్వకుండా/దొరికినదంతా లోపలికి/కుక్కుకుంటూ పోతే ఎలాగ/కొంచెం తెలియనితనాన్ని దాచడం ఎంత సుఖం/ఎంకన్నా/కొండ చుట్టూ ఉన్న గాలిలో/కొండ ఉన్నట్టా/లేక కొండలో/గాలి ఉన్నట్టా/దేనికి ఏది బరువు/ఏది దేనిని వదిలించుకుంటుంది/ఖాళీ అవ్వడం/తాడు తెంపడం/తెలుసుకున్నోడికి/ఎంత మజా…/ఏకాంత కాంతి/విభ్రాంతి (మల్లెల తీర్ధం, మహా ఖననం,(పే.47)
ఈ కవిత, గొప్ప తాత్త్విక ధ్వనులతో నిండి ఉంది. డెలూజ్ దృక్కోణాల ద్వారా వ్యాఖ్యానించబడవచ్చు, ఈ కవిత ఖాళీతనం, అనిశ్చితత, ఉనికి- ఉనికి రాహిత్యం ( presence-absence) మధ్య పరస్పర చర్య వంటి అంశాలను పరిశీలిస్తుంది; ఇందులో ఉడుత, కొండ, గాలి వంటి రూపకాల ద్వారా ఈ భావాలను వ్యక్తీకరిస్తుంది. పైన చెప్పుకున్నట్లుగా డెలూజ్ కవిత్వాన్ని రూపొందుతూ ఉండే ప్రక్రియగా చూస్తాడు- ఎల్లప్పుడూ అసంపూర్ణంగా, నిరంతరం మార్పులో ఉంటూ, జీవించిన అనుభవాలను అధిగమిస్తూ. కవితలోని ప్రారంభ పంక్తులు, మనలో శూన్యం అవసరమా అని ప్రశ్నించడం, ఈ భావనతో కలుస్తుంది. సృజనాత్మకత, అర్థ నిర్మాణానికి ఖాళీలు అవసరమని సూచిస్తుంది. ఇది కఠిణ నిర్మాణాల నుండి విముక్తి కల్పిస్తుంది. ఇది కవిత్వం పలాయన రేఖలను గుర్తించే ఆలోచనతో ఉంటుందనే భావనకి కూడా దగ్గరగా ఉంటుంది. స్థిర చట్రాల నుండి తప్పించుకునే మార్గాలు, కొండలో గాలి ఉందా లేదా గాలిలో కొండ ఉందా అనే కవితలోని ప్రశ్నల ద్వారా ద్వంద్వాలను భంగపర్చుతుంది.
ఈ కవితకున్న విస్తృతజాలత్వ స్వభావం దాని అరేఖీయ( non-liner) నిర్మాణంలో, దానికి సంబంధించిన ‘కుక్కుకుంటూ’, ‘తెలియనితనం’ లాంటి పదచిత్రాలనుంచి రూపొందుతుంది. ఈ అంశాలు కేంద్రీకృతం కాని అర్థాల జాలాన్ని(web) ఏర్పరుస్తాయి, డెలూజ్ విస్తృతజాలత్వాన్ని (rhizome) ప్రతిబింబిస్తూ, ఆలోచనలు శ్రేణీకృత కేంద్రం లేకుండా క్షితిజసమాంతరంగా వ్యాప్తి చెందుతాయి. కవితలో ‘విభ్రాంతి’ ద్వారా వ్యక్తమయిన సందిగ్ధత, ఖాళీ అవ్వటాంన్ని అమోదించటం అనేవి డెలూజ్ భావన అంతర్గతత్వంను ప్రతిబింబిస్తుంది, ఇక్కడ కవిత్వం “ఆలోచించవలసినది, ఆలోచించలేనిది” రెండింటిగా పనిచేస్తుంది. ఇది “దేనికి ఏది బరువు” వంటి ప్రశ్నలను పరిష్కరించకుండా నిరాకరించడంలో స్పష్టమవుతుంది, అందుకు బదులుగా కొత్త వాస్తవాల కోసం సృజనాత్మక స్థలాన్ని అవకామిస్తుంది.
కవిత చివరి పంక్తులు- “ఏకాంత కాంతి” “విభ్రాంతి” అనే భావనలను ప్రస్తావిస్తూ- డెల్యూజ్ అభిప్రాయ పడినట్లుగా , కనిపించనిదాన్ని కనిపించేలా చేయగల కవిత్వ శక్తిని ప్రతిబింబిస్తాయి. ఈ కవిత సందిగ్ధతను, అలాగే “తెలుసుకున్నోడికి ఎంత మజా!” అనే ఆనందాన్ని ఆమోదించడం ద్వారా, అనిశ్చితిలోనే ఒక సృజనాత్మక ఆనందాన్ని ప్రస్తావిస్తుంది.
మరింత నిర్ధిష్టం చెబితే ఈ కవిత గిల్స్ డెలూజ్ భావనలను ఈ విధంగా ప్రతిబింబిస్తుంది:
రూపొందటం (Becoming): కవిత ఖాళీ అవ్వడం, తాడు తెంపడం మీద దృష్టి సారిస్తుంది, ఇది స్థిర గుర్తింపులను అధిగమించే ప్రక్రియను చూపిస్తుంది, ఇది డెలూజ్ నిరంతర, అసంపూర్ణ మార్పు భావనకు దగ్గరగా ఉంటుంది.
అంతర్గతత్వం (Immanence): కవితలోని ఉనికి-ఉనికి రాహిత్యం ఇతివృత్తాలు, కొండ-గాలి సంబంధం వంటివి, బాహ్యమైన దేనినీ సూచించకుండా ఒకే వాస్తవికతలో ఉన్నాయి. ఇది డెలూజ్ అంతర్గతత్వ (immanence) భావనకి దగ్గర.
విస్తృతజాలత్వం (Rhizome): కవితకున్న అరేఖీయనిర్మాణం, ఉడుత, కొండ, గాలి, కాంతి వంటి అనుసంధాన చిత్రణలు కేంద్రీకృత పరిష్కారం లేకుండా అర్థాన్నిఒక జాలంలా (web) వ్యాప్తి చేస్తాయి. ఇది డెలూజ్ విస్తృతజాలత్వం (rhizome)భావానని ప్రతిబింబిస్తాయి. స్పష్టమైన సమాధానాలను నిరాకరించడం ద్వారా, కవిత కొత్త ఆలోచనా మార్గాలను తెరుస్తుంది.
డెలూజ్ దృష్టిలో కవిత్వం చేయాల్సిన పని ఇప్పటికే ఉన్న వాటిని పునరుత్పత్తి చేయడం కాకుండా కొత్త ‘వాస్తవికతల సృష్టించటం. అటువంట ప్రయత్నం సిద్ధార్థ కవిత్వంలో కనిపిస్తుంది. సాంప్రదాయ ఆలోచనను భంగపరిచే భావలు తన కవిత్వంలో అనేక చోట్ల కనిపిస్తాయి.
డెలూజ్ తత్త్వశాస్త్రంలో స్థానవిభ్రంశీకరణ (Deterritorialization) అనే భావన మరొకటి ఉంది. భాషా, సామాజిక, లేదా సాంస్కృతిక నిర్మాణాల నుండి విడిపోయి, వాటి స్థిర అర్థాలను లేదా విధులను భంగపరిచే ప్రక్రియను సూచిస్తుంది. కవిత్వంలో, ఇది సాంప్రదాయ భాష, ఆలోచనను అస్థిరపరిచి, పదాలు మరియు రూపాలు కఠిన చట్రాల నుండి తప్పించుకుని కొత్త అర్థాలను సృష్టించేలా చేస్తుంది. ఈ ప్రక్రియ కవిత్వం ఆధిపత్య వ్యవస్థలను సవాలు చేసి, నూతన వ్యక్తీకరణలను ప్రోత్సహించే అవకాశాన్ని కల్పిస్తుంది. కవిత్వా భాష విషయంలో సిద్ధార్థ తన మల్లెల తీరం,మహాఖనం సంపుటిలోని చాలా కవితల్లో ఆ పనే చేశాడు.
సిద్ధార్థ తన చిన్నత్త కి అంకితమిచ్చిన “ఛిన్నాయి” కవిత లోతైన తాత్వికతను ప్రతిబింభిస్తుంది. ఈ కవితలోని చివరి పంక్తుల: ప్రమాణ పూర్తిగా.. / పానమసలే బాగాలేదు/”చీకటిప్పుడు పెద్ద మయా/ దీపం పెనుమయా/ దేవ దీవతా .. నువ్వేమిటే”. ఈ పంక్తులు తాత్విక భావనలను, అస్తిత్వ విచారణ, చీకటి-వెలుగుల సంబంధాన్ని సమన్వయం చేస్తాయి. “పెద్ద మయా” అనే పదం చీకటి సందర్భంలో మాయ భావనను సూచిస్తుంది. ఇది భౌతిక ప్రపంచాన్ని నిజమైన వాస్తవాన్ని కప్పివేసే భ్రమగా చూస్తుంది. కవి తన చిన్నమ్మను ఈ మాయలో ఉన్న లేదా దానిని అధిగమించే వ్యక్తిగా చిత్రీకరిస్తాడు. ఆమె స్వభావం రహస్యమైనదని, లోతైనదని సూచిస్తాడు. “దీపం పెనుమయా” అనే రూపకం చీకటికి వ్యతిరేకంగా ఉంటూ, వెలుగు జ్ఞానం, సత్యం లేదా దైవిక చైతన్యాన్ని సూచిస్తుంది. ఇది అజ్ఞానాన్ని తొలగిస్తుంది. చిన్నత్త ను దీపంతో పోల్చడం ద్వారా, కవి ఆమెను మార్గదర్శనం, జ్ఞానం లేదా ఆత్మిక స్పష్టతకు మూలంగా చూపిస్తాడు. ఆమె ప్రపంచంలోని గందరగోళం లేదా మాయను చీల్చే ప్రకాశవంతమైన ఉనికి కలిగి ఉందని సూచిస్తాడు. చివరి పంక్తి, “దేవ దీవతా .. నువ్వేమిటే”, ఆమెను దైవిక స్థాయికి ఉన్నతీకరిస్తుంది. ఆమె నిజమైన స్వభావం గురించి ప్రశ్నిస్తుంది, అస్తిత్వం గురించిన లోతైన తాత్విక విచారణను ప్రతిబింబిస్తూ, ఆమె మామూలు వ్యక్తి లేదా దైవికమైన వ్యక్తి రెండూ కావచ్చని సాంకేతిస్తుంది. కవితని కవి తన చినత్తకు అంకితం చేయబడినది కావడం వల్ల, ఈ తాత్విక ఆలోచనలకు వ్యక్తిగత సాన్నిహిత్యం తొడవుతుంది. ఆమె కేవలం చినత్త మాత్రమే కాదు , ప్రేరణ, ప్రేమలకు ప్రతీకగా ఉంది. గౌరవనీయమయిన ధోరణితో కూడిన ఆసక్తి ఆమె ఉనికి కవి జీవితంలో లోతైన ఆలోచనలను రేకెత్తిస్తుందని సూచిస్తుంది. వెలుగు, చీకటి, రూపకాల ద్వారా చినత్త అపరిచిత ఉనికిని అన్వేషిస్తాయి.
సిద్ధార్ధ తన స్నేహితుల, తనకు ప్రేరణగా నిలిచిన వాళ్ళ గురించిం, కుటుంబ సంబంధాలలో అత్యంత ఇష్టమైన వాళ్ళ గురించి రాసేటప్పుడు తన భావోద్వేగాలను సార్వత్రిక కళగా మార్చి, సజీవ భాషతో సంబంధాలను ఉద్దీపించే కవితలను రాస్తాడు. ఈ సంపుటిలో పండిత్ రవిశంకర్, మోహన్, సురేంద్రరాజు, వాళ్ళ చిన్నత్త ఇంకా అనేక మంది గురించిన కవితలు ఇందుకు సాక్ష్యం. “ద్విపురుసుడు.. విపురుషాదీ అపురుషుడి అనే శీర్షికతో అంబటి సురేంద్ర రాజు గురించి రాసిన కవితలో ఇనా రాస్తాడు:
మనం మరిచిన జ్ఞాపకాల మీద /ఇసుర్రాయిని తిప్పే వాడెవ్వడు/పూవులు గాలిని ప్రేమించినట్టు /ఏరు లోయను వాంఛించినట్టు/ చీకటి రాత్రిని కప్పుకున్నట్టు/ నిద్రకన్రెప్పను దాచుకున్నట్టు/ చీమూ నెత్తురుని అంతరంగం /కాపాడుతున్నట్టు/అతనున్నాడు.
“పిల్లమాయి” కవిత అపారమైన దుఃఖాన్ని, జ్ఞాపకాలతో వేదనలో మునిగిపోవడాన్ని కేంద్ర ఇతివృత్తంగా చిత్రీకరిస్తుంది. “గుర్తు ఇంకా చెరిగిపోతలేదే అమ్మా” వంటి పంక్తులు మరణం లేదా విడిపోవడం వల్ల కలిగే విషాదం, జ్ఞాపకాల స్థిరత్వాన్ని వ్యక్తపరుస్తాయి. కవిత సజీవమైన చిత్రణల ద్వారా భావోద్వేగ తీవ్రతను పెంచుతుంది. “రక్తపు చూపు”, “నడ్డి విరిగిన వెన్నెముకలో” వంటి వర్ణనలు శారీరక, భావోద్వేగ ధ్వంసాన్ని సూచిస్తాయి, అయితే “చీకటి మసక” “బురదగా భూమిలోకి దిగబడిపోతున్నట్టు” నిరాశను వ్యక్తీకరిస్తాయి. “పాల సమరు” వంటి పదాలు తల్లి పోషణ, త్యాగాన్ని సూచిస్తూ, కోల్పోవడంతో బాధాకరమైన జ్ఞాపకంగా మారతాయి. నరసింహ శతకం, బుద్ధుని సూచనలు వ్యక్తిగత దుఃఖాన్ని సార్వత్రిక ఆత్మిక సందర్భంతో అనుసంధానిస్తాయి.
కబీర్ గంధపుమాల అనే కవితా ఖండిక, స్థానభ్రంశం, పరాయీకరణ, ఆస్తిత్వపు క్షణభంగుర స్వభావం వంటి లోతైన విషయాలలు ప్రతి ప్రతిధ్వనిని కనిపిస్తుంది. ఈ కవితలోని అంశాలు కొంత లోతుగా అవగతం కావటానికి ప్రముఖ పోలిష్ తాత్వికుడు, సామాజిక శాస్త్రవేత్త జిగ్మంట్ బౌమన్ ద్రవాధునికత (liquid modernity) భావన చక్కగా ఉపయోగ పడుతుంది. బౌమన్ ప్రకారం వర్తమాన ప్రపంచంలో సామాజిక నిర్మాణాలు, గుర్తింపులు, సంబంధాలు ద్రవంగా, క్షణభంగురంగా మారిపోయాయి. ఇవి పూర్వపు “ఘన ఆధునికత” (solid modernity)కున్న స్థిరత్వం, శాశ్వతత్వం లేకుండా ఉంటాయి. ఈ ద్రవత్వం అనిశ్చితి, మూలాలు లేని భావన, నిరంతర చలనం అనే భావాన్ని సృష్టిస్తుంది. ఇది సిద్ధార్థ కవితలో కనిపిస్తుంది.
కవిత ప్రారంభ పంక్తులు నిరాశ భావనను వ్యక్తం చేస్తాయి,“అక్కడే ఒక్కో గుక్క జీవితాన్ని తాగుతూ మదమెక్కి రోదిస్తాను గ్నాన శునకాన్నై”ఈ చిత్రణ ద్రవాధునికతలోని స్థానభ్రంశం (displacement) పరాయీకరణను ప్రతిబింబిస్తుంది.
బౌమన్ విశ్లేషణ ప్రకారం ద్రవాధునికతలో వ్యక్తులు స్థిరమైన సామాజిక నిర్మాణాల నుండి విడిపోయి, అర్థం క్షణభంగురంగా ఉండే ఒక ప్రపంచంలో తేలియాడుతూ ఉంటారు. “జీవితాన్ని తాగుతూ” అనే చర్య, క్షణికమైన క్షణాలను గ్రహించడానికి ఒక తీవ్రమైన ప్రయత్నాన్ని సూచిస్తుంది. కానీ ఫలితం బాధ, “క్రిమిపట్టిన కుక్క”తో పోల్చబడింది- ఇది బహిష్కరణ, విడిపోవడం, కోల్పోవడం లాంటి వాటికి చిహ్నం. “క్రిమిపట్టిన కుక్క” అనేది బౌమన్ “వ్యర్ధ జీవితాలు” (wasted lives) భావనను గుర్తుచేస్తుంది. ఇవి ఆధునికత వేగవంతమైన, వినియోగదారుల ఆధారిత ప్రవాహాలచే అంచునకు నెట్టబడినవి. అలా నెట్టబడిన వాళ్ళు ఒంటరి రోధనలో మిగిలిపోతారు. తరువాత పంక్తులు,“కోపంతో .. వలసధారణ పడ్తాను పారిపోయే గ్రామాన్నై / కబీరు విప్పిన గంధపు మాలనై తగలబడి పట్నానికెగిరిపోతాను”ఈ ఇతివృత్తాన్ని మరింత లోతుగా తీసుకు వెళతాయి. “పారిపోయే గ్రామం” పట్టణానికి వలస వెళ్ళడం, ద్రవాధునికత బలవంతపు చలనశీలతను సూచిస్తుంది. ఇక్కడ గ్రామీణ సమాజాలు చెదిరిపోతాయి, ప్రజలు జీవనోపాధి లేదా అవకాశాల కోసం పట్టణ కేంద్రాలకు కొట్టుకుపోతారు. బౌమన్ దీనిని గ్లోబలైజ్డ్ పెట్టుబడిదారీ విధానం ఒత్తిడిలో సాంప్రదాయిక, మూలాలున్న సమాజాల క్షీణతగా వివరిస్తాడు. ఈ క్షీణత సాంస్కృతిక క్షీణత కూడా సూచిస్తుంది. పట్టణానికి ఎగిరి పోవతం అనేది వ్యక్తుల స్వేచ్ఛాయుత చర్య కాదు. గాలిలో బూడిదలా కొట్టుకుపోవడం. బౌమ న్ప్రకారం నిరంతర మార్పు ప్రపంచంలో వ్యక్తులు నిష్క్రియాపరులుగా మిగిలే స్థితిని ప్రతిబింబిస్తుంది.
“నేను కన్పించని సమూహాన్ని సమూహంలో అబద్ధాన్ని అపరిచయ దారువును” అనే కవి ప్రకటన
ద్రవాధునికతలో చేదిరిపోతున్న మానవ సంబంధాలను సాంకేతిస్తుంది. బౌమన్ ఆధునిక సమాజాలు “ద్రవ” సంబంధాలను ఎలా సృష్టిస్తాయో వివరిస్తాడు—ఉపరితల, తాత్కాలిక సంబంధాలు నిజమైన సమాజ భావనను అందించడంలో విఫలమవుతాయి. కవితలో “కనిపించని సమూహం” “సమూహంలో అబద్ధం”గా గుర్తించడం. ద్రవాధునికతలో వ్యక్తిగతత్వ క్షీణతను సూచిస్తుంది. ద్రవాధునికతలో మానవ సంబంధాలు తాత్కాలిక, నాటకీయ చర్యల చేత భర్తీ చేయబడతాయి. “పరాయి మార్గం” సామాజిక బంధాలు బలహీనంగా, గుర్తింపులు విచ్ఛిన్నంగా ఉండే ఒక ప్రపంచంలో వ్యక్తిపై పరాయీకరణ అనివార్యంగా ఉంటుంది. అది వ్యక్తిని సమూహంలో కూడా శాశ్వత బహిష్కృతుడిగా మార్చుతుంది.
ఒకచోట బౌమన్ ఇలా అంటాడు:
Social forms and institutions no longer have enough time to solidify and cannot serve as frames of reference for human actions
and long-term life plans, so individuals have to find other ways to
organise their lives. They have to splice together an unending series of short-term projects and episodes that don’t add up to the
kind of sequence to which concepts like ‘career’ and ‘progress’
could meaningfully be applied.
Liquid Times: Living in an Age of Uncertainty, P.1
“ఎన్నో పొడిరాత్రులు / రక్తప్రసారంలేని మధ్యాహ్నాలు / తడులంటని అస్తమయాలు” ఆని కవి రాసినప్పుడు ద్రవాధునికతలో కాలపు క్షణభంగుర, సారరాహిత స్వభావాన్ని స్పష్టంగా సాంకేతించటం జరిగింది, “పొడిరాత్రులు,” “రక్తం లేని మధ్యాహ్నాలు,” “లాంటి పదబంధాలు నుండి జీవశక్తి కోల్పోయి అర్థరహితంగా మిగిలిన ఒక జీవనశైలిని సూచిస్తాయి. అవి వైవిధ్యంలేని, ఉదాశీన జీవితాలు. బౌమన్ మాటల్లో చెపితే ద్రవాధునికత కాలాన్ని వేగవంతం చేస్తుంది, అనుభవాలను ఉపరితలంలోనే మిగుల్చుతుంది, క్షణికంగా మార్చుతుంది. అంతకంటే ముఖ్యంగా : తొక్కిసలాటలోని పాదాలు.. లక్షలు లక్షలు / పరాయి పాదాలు / పరాయి చిక్కులు / పరాయి తొక్కిసలాటలో.. పరాయి సినిమా / నా దునియా”
అని కవి అన్నప్పుడు వ్యక్తిగత విలువల లేని స్థితి తెలుస్తుంది. ద్రవాధునికథలో వ్యక్తులు తమ జీవితానికే ప్రేక్షకులుగా మారిపోతారు. లక్షలాది మంది తొక్కిసలాటలో మనుషులు గుర్హులేకుండా పోతారు. తమకు ఏమాత్రం స్వంతం కానీ జీవితం గడుపుతూ బాహ్య శక్తులచేత నీయంత్రించబడతారు. బౌమన్ చెప్పే వ్యర్ధ జీవితాలకు ( wasted lives) ఇది సరైయిన ఉదాహరణ.
ఈ కవిత ద్రవాధునికతలో జీవించే వ్యక్తుల అస్తిత్వ సంక్షోభాన్ని ప్రతిధ్వనిస్తుంది. తమ నియంత్రణకు బయటి శక్తుల దాడి గురై , పరిమితమైన సంబంధాల మధ్య, పాత విలువలు చెరిపోయిన ప్రపంచంలో జీవితానికి అర్ధం వెతుకుతున్న వ్యక్తుల స్థితిని చిత్రిస్తుంది.
కవికి బలమైన తాత్విక స్పర్శ ఉన్నప్పుడు తన కవిత్వంలో తత్వశాస్త్రం కవిత్వం తరచూ ఒకదానితో ఒకటి కలిసిపోయి. వాటిని వేరు చేయడం కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే రెండూ భాష, ఆలోచనలు మానవ అనుభవంతో లోతుగా సంబంధం కలిగి ఉంటాయి. రెండూ భాషను సౌందర్యాత్మకంగా, సృజనాత్మకంగా ఉపయోగిస్తాయి. కవిత్వం భావోద్వేగాలను, అంతర్దృష్టిని రేకెత్తించడానికి రూపకాలు, లయ, చిత్రణలను వాడుతుంది. అయితే తత్వశాస్త్రం సత్యాన్ని పరిశీలించడానికి తర్కబద్ధమైన వాదనలు, స్పష్టమైన భావనలను ఉపయోగిస్తుంది. అయినప్పటికీ, ప్లేటో, నీషే వంటి తత్వవేత్తలు తమ రచనల్లో కవిత్వాని చాల సహజంగా చొప్పించారు. వాటికి సాహిత్య స్పర్శ కలిగించారు.
డెరీడా తత్వశాస్త్రం/ సాహిత్యం అనే విభజను నిరాకరించి తాత్విక వాచకాలను సాహిత్య వచకాలుగా, సాహిత్య వాచకాలను తాత్విక వాచకాలుగా విశ్లేషించి చూపాడు. తత్వశాస్త్రం, కవిత్వం రెండూ కూడా మానవ అస్తిత్వాన్ని అన్వేషించడానికి భాషపై ఆధారపడటం, తరచూ వాటి సరిహద్దులను అధిగమించడం సహజంగా జరుగుతూ వచ్చింది. అయితే వీటిమధ్య ఏదోఒక స్థాయిలో వ్యత్యాసం చూపాలంటే తత్వశాస్త్రం సాధారణంగా ఆలోచనా వ్యవస్థలను నిర్మిస్తుంది లేదా విమర్శిస్తుంది. కవిత్వం అనుభవాలను, చిత్రణలను సృష్టిస్తుంది. ఆ విషయాలు అలా ఉంచితే, సిద్దార్థ ఈ సంపుటిలోని కవితలపై తాత్వికభారాన్ని మరింతగా పెంచాడు. ‘ తనువు చాలించినట్టు / మనస్సును చాలిమచగలమ’ లాంటి ప్రశ్నలు వేశాడు.
మొత్తం 245 పేజీలు ఉన్న మల్లెల తీర్ధం- మహా ఖననం చదువుతున్నప్పుడు చాలా సార్లు D.H.Lawrence కవిత Piano గుర్తుకు వచ్చింది. లారెన్స్ కవిత కవికి తల్లిపట్ల ఉన్న గాఢమైన ప్రేమని చిత్రిస్తుంది. ఈ కవిత వయస్సు పెరిగిన వ్యక్తి భావోద్వేగాలను . తన బాల్యపు జ్ఞాపకాల మధ్య ఉన్న అంతరాన్ని చాలా సున్నితంగా చూపుతుంది. ఒక అందమయిన యువతి పియానో వాయిస్తుండగా వింటున్న యువకుడి మనసు అకస్మాత్తుగా తన చిన్ననాటి తల్లి జ్ఞాపకాల వైపు లాగబడుతుంది. గతంలో తల్లి దగ్గర తను పొందిన ప్రేమ, భద్రత తలచుకొని అవి వర్తమానంలో లేదని తెలుసుకున్న ఆ యువకుడి కళ్ళు చెమ్మగిల్లుతాయి. అ యువతి ఆ యువకుణ్ణి తన చిన్నప్పుడు తల్లితో గడిపిన మధురస్మృతులను తిరిగి జాగృతం చేస్తుంది. తల్లి పియానో వాయిస్తున్నప్పుడు, చిన్న పిల్లవాడిగా దాని కింద కూర్చుని వింటున్న అనుభూతిని యువకుడిగా కవి మళ్లీ అనుభవిస్తున్నాడు. తాను కోల్పోయినదాన్ని ఇప్పుడు కావాలని బలంగా కోరుకుంటున్నాడు. అది సాధ్యంకాదు కాబట్టి ‘I weep like a child for the past’ అని అంటాడు. సిద్ధార్థ ఈ సంపుటిలోని చాలా కవితల్లో Piano కవితలో యువకుడిలా కనిపిస్తాడు. చాలా కవితల్లో చిన్ననాటి మాధుర్యాన్ని కోల్పోయిన పెద్దవాడిగా కనిపిస్తాడు. దాటివచ్చిన కాలానికి తిరిగి వెళ్ళి తాను కోల్పోయిన దాన్ని తిరిగి పొందాలనే ఒక అనుభూతి సిద్ధార్థ కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తుంది. అది తన కవితలకు గొప్ప ఉద్వేగాన్నిజత చేస్తుంది. కవికి తల్లి ఒక సాధారణ వ్యక్తిగా కాకుండా, తన భావోద్వేగ కేంద్ర బిందువుగా కనిపిస్తుంది. చాలా సందర్భాలలో తల్లి జ్ఞాపకం నీడలాగా ఉంటుంది. ఇతర స్త్రీలగురించి రాస్తున్నప్పుడు కూడా ‘ నా కొడుకు ప్రేమలో నేను బ్రతికున్నాను ‘ అన్నట్లుగా ఆమె చాయా ఉంటుంది. ఈ కవి ప్రపంచాన్ని వెలుగు వైపు చూసే ప్రయత్నం చేస్తున్నా, హృదయం మాత్రం తిరిగి తల్లి ఒడిలోకి రావాలనుకుంటుంది – అది తల్లి లేకపోయినా, ఆమె తాలూకు ప్రేమ జ్ఞాపకం మాత్రం ఉంటూనే ఉంటుంది. ఆమె తన ‘సమస్త యతల్నిబాపే తల్లి’ . ‘పాట ముచ్చట్లు’ అని ఈ సంపుటికి తాను రాసున్న దాంట్లో ‘ మా అమ్మకు, నాయనాకు నాయనమ్మ తాతల స్మృతులకు ఎప్పటికీ దండాలు ‘ అని రాసుకున్న వాక్యం యాదాలాపంగా రాసుకున్నది కాదు. ‘
సిద్ధార్థ గతంలో ప్రచురించిన సంపుటిలోని కవిత్వానికి ఈ సంపుటిలోని కవిత్వానికి మౌలిక వ్యత్యాసం ఉందని చెప్పలేం కానీ, ఈ సంపుటిలోని కవితలు కొంత భిన్నంగా ఉన్నాయని స్పస్టంగా గుర్తించవచ్చు. ఇవి వస్తూపరంగా, భాష పరంగా మరింత ప్రాంతీమయ్యాయి.
వర్తమాన సంక్లిస్ట సామజిక సందర్భాలు అనేక రూపాలలో అస్థిరపర్చాయి. ఈ అస్థిరతలో మనిషి ఆందోళన పెరిగింది. ఈ ఆందోళనలో మనుషులు utopia ల వైపు కాక Retrotopiaల వైపు చూస్తున్నారు. ‘రెట్రోటోపియా’ (2017) గ్రంథంలో, జిగ్మంట్ బౌమన్ తన ‘Retrotopia’ అనే రచనలో ఒక కీలకమైన భావనను ముందుకు తెచ్చాడు. 21వ శతాబ్దంలో ప్రజలు ఆధునికత, అభివృద్ధి, ఆదర్శవాద, ఊహాత్మక భవిష్యత్తులపై విశ్వాసాన్ని కోల్పోయారు. భవిష్యత్తుపై ఆశలు ఆవిరైపోయాయి, ఫలితంగా, సమాజాలు భవిష్యత్తు వైపుకు కాకుండా, గతం వైపు తిరుగుతున్నాయి. గతంలో మంచి అనేది ఎక్కడ, ఏరూపంలో ఉందో దానికోసం అన్వేషిస్తున్నారు. ‘నోస్టాల్జియా’ – గతంపై ప్రేమ లేదా మక్కువ- ఇప్పుడు సామాజిక శక్తిగా మారింది. ఇది కేవలం వ్యక్తిగత భావన మాత్రమే కాకుండా, రాజకీయాలు, సాంస్కృతిక దృక్పథాలు, వ్యక్తుల గుర్తింపులను కూడా ప్రభావితం చేస్తోంది. ఊహాజనితమైన “మంచి గతం” అనే దృశ్యంపై ఆధారపడుతున్నాయి. భవిష్యత్తు అనిశ్చితి ఎదుర్కొనడం కన్నా, సమాజాలు ఒకప్పుడు ఉందనుకున్న భద్రతను- అది నిజంగా అలాంటిది కాకపోయినా కూడా- ఆశ్రయించాలన్న కోరికను బయటపెడుతుంది. ఇదొక రకంగా తక్షణ సంక్షోభం నుంచి బయట పడే ప్రయత్నంలో ముందుకు వచ్చిన ఆలోచన. అది తిరిగామానం కాదు., తాత్కాలక పురోగ్యమనమే. సానుకూల అర్ధంలో కవి సిద్ధార్థ గతంలో ఉన్న మంచి కోసం వెతుకుతున్నాడు. ఆ క్రమంలోనే తన బంధువులు, స్నేహితులు, ఇంకా సమాజంలో మంచికొసం నిలబడిన వాళ్ళను తన కవిత్వంలో ఆవాహన చేస్తున్నాడు. సంక్షోభాలు మనుషుల మౌలిక ఆలోచనలు మార్పుకి కారణమౌతాయి. కరోనా కాలంలో మనుషులు ప్రకృతికి, సాటి మనుషులకి, మిగతా జీవజాలాలకి దగ్గరయ్యే ప్రయత్నం చేసినట్లు. వర్తమాన సంక్షోభ సమయంలో కవి సిద్ధార్థ గొప్ప సానుకూల దృక్పథంతో గతంలోకి చూస్తున్నాడు “ ఎప్పుడైనా ఈ నిశ్శబ్దం జరిగిపోతుందా/ కూలిపోతుందా/ దగ్ధధూళి పూల దండ అవుతుందా… /వెన్నెల/ దీప సరోవరమవుతుందా…” అనే గొప్ప ఆశావాదంతో.

బి. తిరుపతిరావు
ఆధునికాంతరవాదం, ఆధునిక తత్వశాస్త్ర అంశాలపై పై అనేక విశ్లేషణాత్మకంగా వ్యాసాలు వెలువరించిన బి.తిరుపతిరావు ద్రావిడ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు. పోస్ట్ మోడర్నిజం, బౌమనిజం పుస్తకాలు తీసుకువచ్చారు. ఈస్థటిక్స్,, ఫిలాసఫీ మీద ఇంగ్లీషులో పుస్తకాలు రాశారు. ద్రవాధునికత మీద పరిశోధనా వ్యాసాలు రాస్తున్నారు. సాహిత్యం, కళలు, తత్వశాస్త్ర సంబంధిత విషయాలపై ఆసక్తికరమైన వ్యాసాలు సమర్పిస్తుంటారు.


