హొగినేకల్

Spread the love

మేల్కొన్నాను. అయినా కళ్ళు తెరవడానికింకా మనసు రావడంలేదు. చల్లటి రాత్రి హాయైన నిద్ర ఇంకాసేపు కావాలనిపిస్తోంది. ఎక్కడినుంచో తడిసిన మట్టివాసన, విచ్చుకుంటున్న పూలవాసన.

సుదీర్ఘమైన నిశి తరువాత ప్రకృతి జాగృతమవుతున్నట్టుగా ఉంది. జడత్వం చైతన్యవంతం అవుతున్నట్టు, నిశ్శబ్దం స్పందించి రాగం పలుకుతున్నట్టు. నిశీధిలో వేగుచుక్క పొడుస్తున్నట్టు… అంతరాంతరాలల్లో ఏదో ధార సన్నగా మొదలవుతున్నట్టుగా వుంది.

సన్నగా మదలైన ధార క్రమక్రమంగా వేగం పుంజుకుంటోంది. ధారాపాతం రానురాను ఉధృతమవుతోంది. మెల్లగా కళ్ళు విప్పాను. కిటికీలో తెల్లవారి వెన్నెల పడుతోంది. బల్లమీదున్న అలారం గడియారం మరో పదిహేను నిముషాల్లో నన్ను లేపడానికి సిద్ధంగావుంది.

సమయం నాలుగూ పదిహేను, బాత్రూంలోని మొజాయిక్ ఫ్లోర్మీద షవర్ నీళ్ళు దూకుతున్న శబ్దం వినిపిస్తోంది. రాత్రి టాప్ తిప్పడం మరిచానుకాబోలు. రాత్రంతా నీళ్ళు అలా దూకుతూనే ఉన్నట్టున్నాయి. బాత్రూంకెళ్ళి టాప్ ఆఫ్ చేసి వచ్చి కిటికీ పక్కగా నిలుచున్నాను.

టెర్రస్ నుంచి కిందికి అల్లించిన తీవెల నుంచి పువ్వులు రాలుతున్న దృశ్యం రమణీయంగా ఉంది. కిటికీలో నుంచి బెంగుళూరు నగరం కోటి దీపాలు తేలుతున్న సరస్సులా వుంది. రాత్రి కురిసిన జల్లుల్ని గుర్తుకుతెచ్చుకుంటున్నట్టుగా అశోకచెట్లు జలజలమని నీటి బిందువుల్ని రాలుస్తున్నాయి. బాత్రూంలో షవర్ నుంచి నీళ్ళు బొట్లు బొట్లుగా పడుతున్న శబ్దం వినిపిస్తోంది.

‘హొగినేకల్ వెళ్ళాలి’… నిశ్శబ్దాన్ని భంగపరచబోతూ మోగబోతున్న గియారపు మీటను క్రిందకి నొక్కి బాత్ రూంలోకి దూరాను. షవర్ క్రింద నిలుచోగానే జలపాతపు ఊహామనోహరదృశ్యం గోచరించింది. మైసూరు శ్యాండల్ సోపు నురగల మీదుగా జలధారలు జారిపోతూ వుంటే చందన వృక్షాల మధ్య కావేరి ప్రవహిస్తున్నట్లు ఒక వింత అనుభూతి కలుగుతోంది. గది తలుపు మీద తాళం వేస్తున్న గాజుల సవ్వడి, తల తుడుచుకుంటూ వెళ్ళి తలుపు తీశాను.

లీల! ఉదయ సమీరం తాకిడికి ఆమె ముంగురులు విలాసంగా కదులుతున్నాయి. బిగించిన ఆమె పెదవులు పొంగివస్తున్న దరహాసాన్ని ఆపడంవల్ల సుతారంగా వణుకుతున్నాయి. కాఫీ కప్పు ఇస్తుండగా ఆమె గాజుల చేయి జలతరంగిణిలా మ్రోగింది. తలస్నానం చేయడం వల్ల ఆమె నీలి నీలి కేశాలు చెవలును కమ్మి మెడదిగి, భుజాలమీద పొంగి వీపుమీదికి వాలి నడుంమీదకు దూకుతున్నాయి.

ఖాళీ కప్పు తీసుకుని వెనుదిరిగింది లీల. కాలి అందెలు మోగుతుండగా కిందికి దిగిపోతున్న ఆమె దూకిపోతున్న యౌవన జలపాతంలా ఉంది.

ఇంకా చీకట్లు విడివడలేదు. కానీ లీల కనుబొమ్మల మధ్య మెరిసిన ఎర్రటి బొట్టుతో నాకప్పటికే సూర్యోదయమైంది.

కారు రోడ్డుమీద దూసుకుపోతోంది. నగరం బద్ధకంగా నిద్రలేస్తోంది. జనం దినపత్రికల కోసం, తేనీరు సేవించడం కోసం అంగళ్ళముందు గుమికూడుతున్నారు. కొంతమంది యువకులు జాగింగ్ చేస్తున్నారు. ముసలివాళ్ళు చేతి కర్రలు ఊపుకుంటూ మార్నింగ్ వాక్ చేస్తున్నారు.

కారు ముందుసీటులో నేను డ్రైవర్ పక్కనే కూచున్నాను. వెనుక సీట్లో లీల, ఆమె అక్క భారతి, బావ కృష్ణమూర్తి కూర్చున్నారు. లీల ఒడిలో భారతీ కృష్ణమూర్తుల ఏకైక పుత్రిక భవానీ అంటీతో గారాలు పోతోంది.

బెంగుళూరు ట్రాన్స్ఫర్ అయివచ్చిన తరువాత మొదటి రెండు నెలలు సరైన గదికోసం తను పడ్డపాట్లు అన్నీ ఇన్నీ కావు. తరువాత కృష్ణమూర్తిగారి ఇంటిమేడ మీద గది దొరకడం, వారితో పెరిగిన స్నేహం, అల్లుకొన్న సాన్నిహిత్యం అంతా ఒక అరుదైన అదృష్టం లభించినట్టుగా ఉంటుంది తనకి.

ప్రతిరోజూ కనీసం ఒక అరగంటయినా భవానీతో ఆడుకోకపోతే ఏదో వెలితిగా ఉన్నట్టు అనిపిస్తోంది తనకీ మధ్య. తాను గత సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు భవానికి జ్వరం వస్తే రాత్రిళ్ళు తననే కలవరించిందట. లీల స్వస్థలం తిరుపతి దగ్గరే. ఎస్వీ యూనివర్సిటీలో ఎం.ఏ. పూర్తి అయిన తరువాత ఇక్కడేదో ప్రైవేట్ ఫర్మ్స్ లో ఉద్యోగం వస్తే అది చేస్తూ ఆమె అక్కదగ్గరే ఉంటోంది.

తాను గదిలో చేరిన మొదట్లో ఆమె తనపట్ల ప్రదర్శించిన ముభావం, పెట్టిన పరీక్షలు తలుచుకుంటే తనకిప్పటికీ నవ్వు వస్తుంది. ఆమె పెట్టిన అనేక శల్యపరీక్షల్ని తట్టుకుని తన నిరపాయకారిత్వాన్ని నిరూపించుకునేటప్పటికి తన తలప్రాణం తోకకు వచ్చినట్టయింది.

లీల ఒక అసాద్యమైన స్త్రీలా కనిపిస్తుంది. ఒక నిత్యనూతన జీవహేలలా కనిపిస్తుంది. ఎంత గంభీరమైన వాతావరణాన్నైనా తన చిలిపితనంతో, ఆహ్లాదపరచడం, కవ్వించి అంతలో తనకేమీ తెలియనట్టు అభిజాత్యం నెరపడం ఆమెకే చెల్లు.

అయితే ఆమె ఇప్పుడు తన ప్రజ్ఞాపాటవాల ప్రదర్శనకు తన గదినే ప్రయోగశాలగా చేసుకుని తననే పరికరంగా వాడుకోవడం ప్రారంభించడంతో తన పరిస్థితి రానురాను ఊపిరి తిప్పుకోలేనంత ఉక్కిరిబిక్కిరిగా ఉంది.

ఆకాశంలో మబ్బులు మూసుకుని సన్నగా జల్లులు ప్రారంభమయ్యాయి. కారు విండోలకు షట్టర్సు దింపుకున్నాయి. ఫ్రంట్ గ్లాస్‌మీద కురుస్తున్న చినుకుల్ని వైపర్స్ సున్నితంగా చెరిపేస్తున్నాయి.

“తుఫాను వచ్చేట్టుంది” అన్నాను స్వగతంలా. లీల చురుక్కుమన్నట్టుగా నావైపు చూసింది. నేను అనవసరంగా అన్నిటికి భయపడతానని కంప్లయింట్ చేయడం ఆమెకు అలవాటే.

భారతి బ్యాగ్లో నుంచీ షాల్ తీసి కప్పుకుంది. కృష్ణమూర్తి సిగరెట్టు ముట్టించాడు. కారు మెస్టిక్ సర్కిల్లోకి వస్తోంది. రైల్వేస్టేషన్నుంచి జనం కొంతమంది తడుస్తూనూ, మరికొంతమంది గొడుగుల్లోనూ ఓవర్ బ్రిడ్జి వైపు నడుస్తున్నారు. సిటీబస్ స్టాండ్ నుంచి బస్సులు బయల్దేరుతున్నాయి. ఓవర్ బ్రిడ్జి పైన జనప్రవాహం మొదలయింది.

తడిసిన రోడ్డుమీద కారు పడవలా సాగిపోతోంది. కారు కిటికీలోకి ఇళ్ళు, అంగళ్ళు, హోటళ్ళు, స్కూళ్ళు, ఆఫీసులు అన్నీ దూకి అంతలో మాయమవుతున్నాయి.

“రామచామీ, మా కాన్వెంట్ దగ్గర కారు ఆపవూ అంకుల్కు చూపించాలి…’” భవానీ ముందు సీటుపైకి వంగి, డ్రైవరు భుజాల్ని కుదిపి మరీ అడుగుతోంది.

“నేను పోయిన్నెల్లో మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఇప్పుడిప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్స్ ఏమీ లేవు బావా! ఇంతలోనే ఇంత మార్పా?” తెల్లబోతూ అడిగింది లీల.

“దటీజ్ బెంగుళూర్ మీ పల్లెటూరు అనుకున్నావా ఏం..? ఇరవై ముప్పై ఏళ్ళయినా ఎదుగుబొదుగూ లేకుండా అలానే ఉండిపోవడానికి?” నవ్వాడు కృష్ణమూర్తి.

“ఈ రోడ్లు ఒకరోజు చూసినట్లు ఒకరోజు ఉండవు. ఇక్కడ దేనికీ స్థిరత్వం లేనట్టే, ఏ ఘటనా పునరావృతం ఆపుతున్నట్లు తోచదు. ఎప్పుడు నిద్రలేచినా, రాళ్ళ వంక దగ్గరే తెల్లవారినట్టు ఒక జీవితాంతం తరువాత కూడా నాకు ఈ సిటీ అంతుబట్టేటట్టు లేదు. అందుకే కాబోలు రఘురామ్ ఢిల్లీని ఎవర్ ఎక్స్పాండింగ్ అండ్ ఎవర్ అన్నోన్ అంటాడు” అన్నాను. లీల తనను బలపరుస్తున్నట్టుగా నేను మాట్లాడటంతో నాకేసి మెచ్చుకోలుగా జూసింది. వాతావరణ సూచన చేసి ఆమె దగ్గర అప్పుడే పోగొట్టుకున్న కృపను ఈ రూపంలోనైనా పొందగిలిగినందుకు నాకు అమితానందం కలిగింది. కారు ఏదో మలుపు తిరిగింది. మలుపులో కనిపించి మాయమయి గుడిలో కనిపించి కన్పించని దేవుణ్ణి ఓ పావుక్షణంలో కళ్ళుమూసి స్మరించుకున్నాడు రామస్వామి. అతడి నుదుటి నుంచీ విభూతి రాలుతోంది.

నగరం దూరమైంది. పట్టణాలు వెనుకబడ్డాయి. పల్లెలు వెనక్కి పారిపోతున్నాయి. కృష్ణగిరిలో దిగి టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాం! సమయం పదిగంటలు కావస్తోంది. వెచ్చటి ఎండలో గ్రామీణులు అక్కడక్కడా పొలాలకేసి నడిచిపోతున్నారు.

కారు ధర్మపురి దాటింది. పెన్నాగరం దగ్గర జరుగుతున్న సంతను చూసి భవానీ భలే సంబరపడిపోయింది. భారతి చిరుచాపలు కొనే ప్రయత్నం చేసి బేరం కుదరక మానుకుంది.

దూరంగా పచ్చటి కొండలు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఆ కొండల మధ్య ప్రవహిస్తున్నట్టుగా ఉంది కావేరి. కారు ఫారెస్టు ఠాణా దాటి పూర్తి ఘాట్ సెక్షన్లోకి ప్రవేశించింది. బస్సులు, కార్లు, వేన్లు ఎదురౌతున్నాయి.

మైళ్ళ పర్యంతము ఎగుడుదిగుడుగా కనిపిస్తున్న కొండ చరియలలో ఘనీభవించిన ఆకుపచ్చని అలల సముద్రంలా ఉంది అడవి. ఎండపొడలు అడవిమీదుగా ఒకటొకటిగా కదలిపోతున్నాయి. కొండవాగులు ఉరవడిగా ప్రవహిస్తున్నాయి. భవానీతో ఆడుకొనే నెపం మీద తన ఉత్సాహాన్నంతా బాహాటంగా ప్రదర్శిస్తోంది లీల.

మధ్యమధ్యలో ఆమె నాకేసి చూస్తున్న చూపు పచ్చటి చెట్ల మధ్యనుంచీ మంచు తెరలను చీల్చుకుని తళుక్కుమంటున్న ఏడురంగుల వెలుతురు కిరణంలా ఉంది.

పన్నెండు గంటల ప్రాంతంలో కారు హొగినేకల్ చేరుకుంది. వర్షాకాలం కావడంతో కావేరి నిండుగా ప్రవహిస్తోంది. గట్టుమీద ఉండవలసిన అనేక చెట్లు ప్రవాహంలో నిలబడి ఉన్నాయి.

“జలపాతం చూడటానికి ఎటుగా వెళ్ళాలి?” అంటూ ఒక టూరిస్టును వాకబు చేశాము దిగుతూనే. దాదాపుగా నామీదే పడిపోతూ ముందుకు తోసుకొచ్చి, అతనేం చెబుతాడో వింటోంది లీల. జలపాతం తాలూకు ఒక చిన్నపాయను దగ్గర్లోనే చూడవచ్చుననీ, అక్కడే స్నానం కూడా చేయవచ్చుననీ ఫుల్ వ్యూ చూడాలంటే కొంచెం దూరం పక్కకు నడిచి పడవల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పాడతను.

“ముందు హోటల్లో రూం బుక్చేసి లగేజి అక్కడ వేసి వద్దాం పదండీ” అంటూ కారును వెనక్కి తిప్పాడు కృష్ణమూర్తి, హొగినేకల్లో రాష్ట్రప్రభుత్వ టూరిజం వారి టూస్టార్ హోటలూ, ఒక యూత్ హాస్టలూ వున్నాయి.

హోటల్ అధునాతనంగానూ, అందంగానూ ఉంది. హోటల్ ఏ కిటికీని చూసినా కిటికీ ఫ్రేముకు బిగించినట్టున్న ఒక అద్భుత దృశ్యం కనిపిస్తోంది. మధ్యాహ్నం భోజనానికి కనీసం రెండుగంటల ముందు ఆర్డర్ చేయాలని చెప్పడంతో, అయిదు మీల్స్ టిక్కెట్లు కొనుక్కుని కాఫీ తాగి హోటల్లోంచి బయటపడ్డాం.

మెట్లు దిగుతుండగా గాలిలో విసురుగా ఎగిరి నా ముఖంమీద విరుచుకుపడింది లీల పమిట. భారతీ, కృష్ణమూర్తీ ముసిముసిగా నవ్వారు. ఘనకార్యం చేసినదానిలా లీల కూడా పకపక నవ్వుతోంది. గత్యంతరం లేక నేను కూడా నీరసంగా నవ్వక తప్పింది కాదు.

వచ్చేపోయే వాహనాలతో బస్ స్టాండ్ రద్దీగా ఉంది. బస్ స్టాండు చుట్టూ కొన్ని బంకులు, టీ అంగళ్ళు, చిన్న చిన్న హోటళ్ళూ ఉన్నాయి. తరువాత వాకబు చేయగా ఒక మాదిరి చిన్న ఊరే దగ్గర్లో ఉన్నట్టు తెలిసింది. సెంటర్లో ఆరుబయట పెద్ద పెద్ద పెనాలలో చేపల్ని వేయించి అమ్ముతున్నారు.

మసాలా చేపల వాసన వేస్తోంది. భర్త వాటిని ఎక్కడ తినాలంటాడోననే అనుమానంతో భారతి ముక్కు మూసుకుని, ముఖం చిట్లించుకుని భర్త చేతిని పట్టుకుని లాక్కువెళుతోంది.

అరంగేట్రం చేస్తున్నంత శ్రద్ధావిలాసాలతో చీర కుచ్చిళ్ళు ఎత్తిపట్టి జలపాతం దగ్గరకు వెళ్ళడానికి ఉద్యు క్తురాలౌతోంది లీల. భవానిని పైకెత్తుకుని రామస్వామి మెట్లు దిగసాగాడు.

గట్టునుంచీ దాదాపు అరవైగజాల దూరంలో రాతి మంటపం కనిపిస్తోంది. మంటపానికి అటూ ఇటూగా రెండు జలపాతపు పాయలు ప్రవహిస్తున్నాయి. గట్టు నుంచి మంటపం దాకా సిమెంట్ చప్టాల దారి ఉంది. దారి వెంబడి ఉన్న ఇనుప రైలింగ్ చాలాచోట్ల కొట్టుకుపోయి ఉంది.

మామూలు రోజుల్లో అయితే సిమెంట్ చప్టాల క్రింద వున్న తూముల్లో మాత్రమే నీళ్ళు ప్రవహించేటట్టు ఉంది. కానీ ఇప్పుడు నీటిమట్టం బాగా పెరిగి చప్టామీద కూడా అయిదారు అంగుళాల మేరకు నీరు ప్రవహిస్తోంది. దారివెంబడి యాత్రికులందరూ సునాయసంగా నడిచి పోతున్నారు. దూరంగా జలపాతం దూకుతున్న శబ్దం ఈదుర గాలితో కలిసి వినిపిస్తోంది. ప్రవాహంలో నిలబడ్డ చెట్ల నీడలు ఎండలో అందంగా కదులుతున్నాయి.

లీల చీర కుచ్చిళ్ళు ఎత్తిపట్టుకుని మెట్లమీదినుంచీ నీటిలోకి దిగింది. భారతి మొదట కొంచెం తటపటాయించినా అప్పటికే చాలామంది యాత్రికులు చిన్న పిల్లలు, ముసలివాళ్ళతో సహా వెళుతుండడంతో ధైర్యం చేసి భర్త భుజాన్ని పట్టుకుని తానూ దిగేసింది.

ఎటొచ్చీ నేను మాత్రం గట్టుమీదే నిలబడిపోయాను. నాలుగైదు అడుగులు ముందుకువేసి, వెనుదిరిగి నాకేసి చూస్తూ ‘ఊ! నువ్వెప్పుడూ ఇంతే కదా’ అన్నట్టుగా నిలబడిపోయింది లీల.

తప్పదన్నట్టుగా నేను మెల్లగా కృష్ణమూర్తి వెనుకకు నడచి “ఎక్కడో పైన వర్షం పడ్డట్టుంది. నీళ్ళు ఎర్రగా వున్నాయి” అన్నాను.

“మరేం ఫరవాలేదు. ఏమాత్రం ప్రమాదమున్నా ఇంత మంది యాత్రికులు చిన్నపిల్లల్తో సహా అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు” అన్నాడు కృష్ణమూర్తి,

మొదట ధైర్యంగా దిగిన ఆడవాళ్ళు ఓ ఇరవై అడుగులు కూడా వేయకముందే బెంబేలుపడిపోయారు. నది నిజానికక్కడ నెమ్మదిగా ప్రవహిస్తోంది. సిమెంటు చప్టామీద నడవడం కూడా ఏమంత కష్టంగా లేదు. తూముల దగ్గర మాత్రం ఎర్రటినీళ్ళు సుళ్ళు తిరుగుతూ కళ్ళు తిప్పుతున్నాయి.

భారతి, లీల పడిపోతున్న అవస్థను చూసి రామస్వామి ఎత్తుకున్న భవాని నవ్వుతూ చప్పట్లు చరుస్తోంది. లీల బెంబేలుపడిపోయి నా జబ్బపుచ్చుకుందో, లేక జబ్బ పుచ్చుకోవడంకోసం బెంబేలు పడిపోతోందో అర్థం కావడంలేదు.

ఉన్నట్టుండి భయపడ్డట్టుగా చిన్నగా కేకవేయబోవడం, అంతలో తన తొందరపాటుకు తానే నవ్వేయడం తన భారాన్నంతా నాపైన్నే మోపేస్తూ ఆమె నన్నొక మానాన నడవనివ్వడం లేదు. దీనికితోడు లీల ఇలా నాపైన వాలిపోయి నడవడాన్ని చూసి కృష్ణమూర్తి, భారతి ఏమనుకుంటున్నారోనన్న సంశయం ఒకటి నన్ను వేధిస్తోంది. మంటపం ముందున్న ఎత్తైన బండలమీదికి చేరుకున్నాము. మంటపం చుట్టుకుని ప్రవహిస్తున్న నీళ్ళు ఏవో చెట్లు వెనుకకు తిరిగి అదృశ్యమవుతున్నాయి. మంటపం నుంచీ మెట్లు దిగి యాత్రికులు జలపాతం కిందికి వెళుతున్నారు.

మెట్లకు అటూ ఇటుగా అంచెలంచెలుగా వివిధ స్థాయిల్లో యాత్రికులు బోర్లాపడుకుని నువ్వుల నూనెతో ఒళ్ళంతా మర్దన చేయించుకుంటున్నారు. కొంతమంది మెడలకు తగిలించుకున్న ట్రేలలో సోపులు, నూనెసీసాలు, సీకాయి పొడి పొట్లాలు అమ్ముతున్నారు.

దగ్గర్లో ఉన్న చిన్నపాయ దగ్గర ఒక బ్రాహ్మణ కుటుంబం స్నానం చేస్తోంది. నడివయసు దాటిన పెద్ద మనిషి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ భార్యతో నది ప్రశస్తి గురించి చక్కటి ఇంగ్లీషులో వివరిస్తున్నాడు.

“ఆవిడ అచ్చం ఎమ్మెస్ సుబ్బలక్ష్మిలా లేదూ?” లీల కొంచెం గట్టిగానే అందేమో! ఆవిడ ఓసారి వెనుదిరిగి మాకేసి చూసి మళ్ళీ భర్త చెబుతున్నది వినడంలో మునిగిపోయింది.

“కావేరీ నది పడమటి కనుమల్లోని కొడగు ప్రాంతంలో పుడుతుంది. కావేరి జన్మస్థలమైన తలకావేరి

మంచి యాత్రాస్థలం. తరువాత ఈ నది శ్రీగంథం, టేకు, ఎర్రచందనం, ఎన్నో ఔషధాలిచ్చే మూలికలున్న అడవుల్లో ప్రవహిస్తోంది.

కావేరీ నదికి మైసూరులోని కృష్ణరాజ సాగరం దగ్గర, తమిళనాడులోని మేట్టూరు దగ్గర ఆనకట్టలు కట్టారు. నదీ జలాల వల్ల అనేక వేల ఎకరాల్లో వరి, చెఱకు, అరటి, కొబ్బరి తోటలు పెరుగుతున్నాయి. శ్రీరంగం దగ్గర నది రెండుగా చీలి మళ్ళీ కలియడంవల్ల రంగనాథుని ఆలయం కావేరి కౌగిట్లో ఉన్నట్టుంటుంది. కావేరీ నది పుంపు హార్ దగ్గర బంగాళాఖాతంలో కలుస్తోంది. దక్షిణాత్యుల నాగరికతా సంస్కృతులకు కావేరి జీవగర్ర” చెప్పుకుంటూ దంపతులు నడచిపోతున్నారు.

స్నానఘట్టాలలో యాత్రికులందరూ తలారా స్నానం చేస్తున్నారు. సూర్యకిరణాలు నీలి ఆకాశంపై, ఆకుపచ్చటి వృక్ష సమూహాలమీద, దూకుతున్న నదీజలాలమీద, స్నానం చేస్తున్న జనాల శరరాలపైన తళతళ మెరుస్తున్నాయి. తెల్లని పొగ లేపుకుంటూ జలల, దబదబ, హోరు హోరున దూకుతోంది జలపాతం. చెట్లమీదున్న అరుపుల్ని, చప్పట్లను, కేరింతలని జలపాతపు హోరు తనలో లీనం చేసుకుంటోంది.

కృష్ణమూర్తి అప్పటికే ఒంటికి నూనె మర్దన చేసుకోవడం ముగించి జలధారల కిందికి చేరి నీటిపాయల్ని కౌగిలించుకోవడానికి ఉపక్రమిస్తున్నాడు. ఒక చివరిగా నిలబడి భారతి, భవానీకి స్నానం చేయిస్తోంది. తల్లీకూతుళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ సంబరంగా నవ్వుకుంటున్నారు. రామస్వామి బొజ్జమీద గిలిగింతలు పెడుతున్న నీటితో సల్లాపాలు కొనసాగిస్తున్నాడు.

జలపాతం మనుషుల్ని, ఉన్మత్తుల్ని చేస్తోంది, నేనెలా జలపాతం క్రిందికి వెళ్ళానో తెలియలేదు. ఆ తీర్థస్నానం మహోత్సవంలో కలిసిపోవడానికి నాకట్టేసేపు పట్టలేదు.

గట్టున నిలబడిన వారిని ఆహ్వానిస్తున్నట్టుగా చిరుచిరు జల్లులతో తడిపేస్తోంది జలపాతం. మరికొంచెం లోనికివెళ్ళినవారిని జల్లు జల్లుమనే నీళ్ళతో గిలిగింతలు పెడుతోంది. మరింత లోపలికిపోయిన వాళ్ళమీద పిడిగుద్దులు పడ్డట్టుగా దబదబ దూకేస్తోంది. దృశ్యాలను, ధ్వనులను, భావాలను నిర్వచించి, విశ్లేషించి వర్ణించడానికి ప్రయత్నిస్తున్న మానవుడి అల్పత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా, పరిశీలిస్తున్నట్టుగా అవి శాంతంగా, అనర్గళంగా, అవిచ్ఛిన్నంగా దూకుతోంది జలపాతం. లీల జలపాతంకింద నిలబడి వుంది. ఆమె ఆపాద మస్తకమూ జలధారలు జారిపోతున్నాయి. వర్షపు చినుకులకు తత్తళించిపోయే పూరేకుల్లా ఆమె కనురెప్పలు కొట్టుకుంటున్నాయి.

అనంతమైన జలప్రవాహాన్నంతా తానొక్కతే భరిస్తున్నట్టుగా ఆమె ముఖభంగిమలు మారుతున్నాయి. ఆమె జుట్టు పాయలుగా విడివడి భుజాలమీదికి గొంతుకిందికి వీపుదిగి నడుంమీదకు ప్రవహిస్తోంది. ఆమె పసిమిరంగు శరీరంమీద జలపాతం నీలినీలిగా జారిపోతోంది.

హొగినేకల్ కావేరీ జలపాతం లీల సౌందర్య జల పాతపు హోయలుతో కలసి శిలలమధ్యగా ప్రవహించి, వంపులుగా తిరిగి కిందికి దూకి ఎక్కడికో ఆగాధాల్లోకి దూకి అదృశ్యమైంది.

తదేకంగా నేను తనకేసి అలా చూస్తుండడాన్ని లీల చూస్తూనే ఉంది. గమనిస్తున్నందుకు గుర్తుగా అప్పుడప్పుడు కవ్వింపుగా నవ్వుతోంది. అంతలో మళ్ళీ ధ్యానంలో మునిగిపోతున్నట్టుగా కళ్ళు మూసుకొంటోంది. జీవన సాఫల్యంగా ఆనందకావేరి కరుణించి కరిగి దోసెట్లోకి దూకుతుండగా దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్న నాకేసి కృపావాత్సల్య ప్రేమానురాగ దృక్కుల ప్రసరిస్తోంది లీల.

ఈ సౌందర్యలీలా జలపాతం ఏ క్షణమూ ఒక్కలా లేదు. ఇది క్షణక్షణానికీ ఒక్కలా మారుతోంది. ఇదొక అనంత క్షణికాపాతంగా ఉంది. స్నానాలు ముగించి బట్టలు మార్చుకుంటున్నాం. చల్లనిగాలి హాయిగా వీస్తోంది. ఎవరో సన్యాసి మ్రోగిస్తున్న ఘంటారావం మధురంగా వినవస్తోంది. భారతి భవాని జుట్టు తుడిచి టవలుతో ముడివేసింది. కృష్ణమూర్తి విప్పివేసిన బట్టల్ని తడిపి ఆరేస్తున్నాడు. ధూమపానవియోగం భరించలేక కాబోలు రామస్వామి అప్పుడే గట్టుమీదకు ఉడాయించాడు. యాత్రికుల కోలాహలం కొద్దిగా తగ్గింది.

‘లీల తడిసిన వెంట్రుకలు గాలిలో అలలు అలలుగా తేలుతున్నాయి. “ఎలా వుంది జలపాతం?” అన్నాను ఆమెకు దగ్గరగా వెళ్ళి.

“ఇంకా అసలైన జలపాతం చూడందే! ఇదేముంది! ఇదో చిన్నపాయ! పూర్తిగా చూడాలంటే పడవల్లో వెళ్ళాలటగా? మీరు తిరపతిలో కపిలతీర్థం చూశారా? వర్షాకాలం దాని హోరు యూనివర్సిటీ హాస్టళ్ళకు వినిపించేది. కళ్యాణి డ్యాం దాటి బాకరాపేట కనుమ దాటివెళితే తల కోన జలపాతం ఎంత బావుంటుందనుకున్నారు! శివరాత్రికక్కడ సిద్ధేశ్వరుడి గుడి దగ్గర పెద్ద తిరణాలే జరుగుతుంది. అయితే జోగ్ఫాల్స్, శివసముద్రంతో పోలిస్తే ఇవేమీ చెప్పుకోదగ్గవి కావేమో? వెనుజులలోని ఏంజిల్స్ ప్రపంచంలోకెల్లా పెద్ద జలపాతమట!”

లీల వాక్ప్రవహానికడ్డుపుతూ “నాకిదే చాలు తల్లీ! ఈ వడి, ఈ వేగం ఈ పాతం, హోరూ తట్టుకోలేకపోతున్నాను” చేతుల్తో చెవులు మూసుకుంటూ గబగబా అన్నాను.

“ఇలా అయితే అయినట్టే! ఇంకా పడవల్లో ప్రయాణం చేయాలి. అసలైన జలపాతం చూడాలి. మీకంటే ఆడవాళ్ళం మేమే నయం. అసలు భవానే మేలంటే నమ్మాల్సిందే! కదూ భవానీ?” గలగల నవ్వసాగింది లీల.

“అవును జలపాతమంటే నాకేం భయంలేదు. అంకుల్కి భయం” వల్లించింది భవానీ. కృష్ణమూర్తి, భారతి వాళ్ళ నవ్వులో శృతి కలిపారు.

వచ్చినదారివెంబడి వెనుదిరిగాం. సిమెంటు చప్టామీద నడుస్తున్నాం. నీళ్ళు మోకాళ్ళదాకా వస్తున్నాయి. జనసంచారం బాగా తగ్గింది. కృష్ణమూర్తి భవానీ నెత్తుకున్నాడు. భారతి భర్తను పట్టుకొని నడుస్తోంది. లీల ఈసారి మరింత ధైర్యంగా నా భుజం కరుచుకుని మరీ నడుస్తోంది.

“శివసముద్రం, నయగరాలంటే కూడా భయంలేని- దానివి ఇలా నామీద ఎందుకుపడిపోవాలి? కాస్త దూరంగా నడవరాదూ!” అన్నాను జంకుతూనే.

“నేనేం భయపడిపోతానని కాదులెండి మహా! మీకే భయమేస్తుందనీ” తుళ్ళి తుళ్ళిపడుతూ నవ్వసాగింది.. సిమెంటు చప్టానానుకుని ఉన్న నాలుగైదు పెద్ద చెట్ల గుబుర్లు ఒక చెట్టునానుకుని చిరుకోపం నటిస్తూ ఇక కదలనన్నుట్టుగా నిలబడిపోయాను నేను. పెదవులు బిగించి గమ్మత్తుగా నవ్వుతోంది లీల.

ఎవరైనా మాకేసి చూస్తున్నారేమోనని సంకోచంగా చుట్టూ చూశాను. దూరంగా యాత్రికులందరూ తమ సల్లాపాల్లో తాము లీనమై ఉన్నారు. గాలికి కదులుతున్న కొమ్మలనుంచీ ప్రవహిస్తున్న నదిలోకి పువ్వులు రాలుతున్నాయి. పువ్వులు నదిలో తేలుతున్న పడవల్లా ఉన్నాయి. బహుశా ఈ పువ్వులు, కాయలు, విత్తనాలు ఏవో తీరాల్ని తాకుతాయి అక్కడివి వృక్షాలవుతాయి.

మళ్ళీ కదలబోయాను. భుజాలచుట్టూ బిగించిన చేతులతో లీల నన్ను కదలనివ్వడంలేదు. మొత్తంమీద ఆమె ఏదో పరాచికానికి సిద్ధమవుతున్నట్టే ఉంది. చెట్టు నీడ సూర్యకాంతిని జల్లెడపడుతోంది.

పసుపుపచ్చని పువ్వు ప్రవహిస్తున్న నది లీల పసిమి మేనుమీద వింత కాంతుల్ని ప్రసరిస్తోంది. ఆమె ముఖం ఉద్విఘ్నంగా ఉంది. జీవన ప్రవాహంలో మనుగడ అనే పడవకు ఎత్తిన యౌవ్వనం తెరచాపలా ఉంది. ఆమె నేను కిందికి వంగి నీళ్ళలో తేలుతున్న ఒక పువ్వును తీసి ఆమె ముందుంచాను. మరుసటి క్షణాల్ని బహుశా నేనెప్పటికీ మరిచిపోలేను.

ప్రకృతి మానవులమీద కురిపిస్తున్న అనంత ప్రేమానురాగ వర్షిణిలా హొగినేకల్ జలపాతం దూకుతూనే ఉంది. లీల తన చేతులను నామెడ చుట్టూ తిప్పి పైకి పాకి మొదటిసారిగా ముద్దు పెట్టుకుంది. ఒక క్షణం నిశ్శబ్దం. అది కేవలం ఒక క్షణం కాదు. నాకదొక ఆనంద శతాబ్దం.

ఆ తరువాత లీల అన్యమనస్కంగా కదిలింది. ఆకాశంలో మబ్బులాడుతున్నాయి. గాలి రివ్వురివ్వున వీస్తోంది. టైం చూసుకున్నాను. హోటల్కెళ్ళి మరొక్కసారి కాఫీ తాగినట్టయితే రెండింటిలోపల భోజనానికి ముందే వ్యూపాయింట్కెళ్ళి వచ్చేయవచ్చు. ప్రోగ్రాం ఆలోచిస్తూ నడుస్తున్నాను. ఇంతలో యాత్రికుల మధ్య కలకలం చెలరేగింది.

రెండు కొయ్య దుంగలు ఒకదాన్నొక్కటి వొరుసుకుంటూ పడ్డట్టు నీటిలో పెద్ద శబ్దమయింది. సంభ్రమంగా అందరూ అటువైపే చూస్తున్నారు. రెండు మూడు సెకన్ల తరువాత ఒక మనిషి అల్లంత దూరాన పైకి లేచాడు. లేచినవాడు మళ్ళీ దభిళ్ళుమని దొర్లుకుంటూ ముందుకుపడ్డాడు.

“అయ్యో అయ్యో” అంటూ కొంతమంది అతన్ని పట్టుకోవడానికి నదిలోకి దిగారు.

అంతలో ఆ వ్యక్తి లేచి నిల్చున్నాడు. అప్పటికప్పుడు పిచ్చి పట్టబోతున్నవాడిలా అతని ముఖం వికృతంగా ఉంది. అగాధంలోకి కూలిపోతున్నవాడు జారిపోతున్న పట్టుకొమ్మకేసి దీనంగా చూస్తున్నట్టు అతను ప్రవహిస్తున్న జలాలకేసి దీనంగా చూస్తున్నాడు. అతన్ని కృష్ణమూర్తిగా గుర్తుపట్టడానికి నాకంతసేపు పడుతుందని అనుకోలేదు. ఏదో అవాంతరం జరిగింది. “బహుశా ఏదైనా నగ నీటిలోకి జారిపోయిందేమో! అబ్బే అది దొరకదు” అన్నారెవరో. “నగ కాదు బాబూ! అది పిల్లండీ! మూడేళ్ళ పసికందు” వాపోతున్నారు మరెవరో.

“అయ్యో, పాపండీ! మన భవానండీ!” నిట్టనిలువునా ఆక్రోశిస్తోంది భారతి. కొంతమంది ఆమె చుట్టూ చేరి పడిపోకుండా ఆమెను పొదివిపట్టుకున్నారు. పాదాల కింద నేల కదిలిపోతున్నట్టుగా ఆమె నీటిమీదికి కుప్పకూలిపోతోంది. నది పిచ్చిగా ప్రవహిస్తోంది.

“అమ్మ తల్లీ, కావేరికిదేం చెలగాటం తల్లీ? చూస్తూ ఉండగానే బిడ్డను యిచ్చేసి పోవల్సిందేనా?” ఆర్థోక్తిగా ఆగిపోతోందో జాలరి పడుచు.

జనం భారతిని గట్టుమీదకు తీసుకుపోవడానికి తంటాలు పడుతున్నారు. జనాన్ని తోసుకెళ్ళి అక్కను కౌగిలించుకుని భోరుమంది లీల. అక్క చెల్లిళ్ళిద్దరూ ఒకరినొకరు పట్టుకుని విలపిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నవారి ముఖాలమీదా విషాదచాయలు అల్లుకున్నాయి. ఆడవాళ్ళు గుడ్లనీళ్ళు కుక్కుకుంటున్నారు.

పట్టుకున్న వారిని వదిలించుకుని మాటిమాటికి నీళ్ళలో పడిపోవడానికి ఉద్యక్తురాలౌతోంది భారతి. ఆమె పాదాలు నీళ్ళను వదిలిరావడానికి నిరాకరిస్తున్నాయి. ఆ నీళ్ళు ఆమె వదలలేని దాన్ని దోచుకుపోతున్నాయి. జలపాతంలో స్నానం చేయించిన తరువాత తుడిచి ఒడిలోకి తీసుకున్నట్టు కూతుర్ని మళ్ళీ దగ్గరకు తీసుకోవచ్చునేమోనన్న భ్రాంతి ఆమెనింకా వదలడంలేదు. భారతి ఏడుస్తోంది. నాకు జలపాతపు హోరు వినిపించడంలేదు.

బలవంతంగా ఎలాగోలా వచ్చి గట్టుమీద పడ్డాం. మెదడు మొద్దుబారిపోయింది. కళ్ళకు కనిపిస్తున్న దృశ్యాలేవీ మనసులో నిలవడంలేదు. ఒళ్ళంతా చెమటపట్టి వణుకుతోంది. గొంతులో తడి ఆరి నిస్సత్తువతో నడుము నిలవడంలేదు. వరదనీటికి కూలిపోయిన చెట్టులా గట్టుమీద చతికిలబడిపోయాం.

చుట్టూరా చేరిన జనం ఏదో చెప్పుకుంటున్నారు. కొంతమంది ఏడుస్తున్నట్టు కూడా వుంది. ‘నదిలో కొంత ముందుకు వెళ్ళి గాలించినట్టయితే భౌతికకాయం దొరకవచ్చునని’ అంటున్నారు.

అసలది ప్రమాదం జరగాల్సిన ప్రదేశంకాదనీ, అసలక్కడా తూము లేకపోయినట్టయితే ప్రమాదం జరిగేదే కాదని చెప్పుకుంటున్నారు. భారతి స్పృహ తప్పి మట్టిలోపడి దొర్లుతూ మధ్య మధ్యేదో కలవరిస్తోంది. రామస్వామి విలపిస్తున్న భారతిని ఓదార్చబోయి మధ్యలో తానే ఏడ్చేస్తున్నాడు..

ఎంతసేపు గడిచిందో తెలియదు. గంటసేపు గడిచి ఉండవచ్చు. లేదా పట్టుమని పదినిముషాలు గడిచి ఉండకపోవచ్చు. అది కాలాతీతమైన ఒక విషాద సమయం. జీవితాన్నంతా క్షోభపెట్టగలిగిన ఒక క్షణపు విశృంఖల విషాదం!

కృష్ణమూర్తి పిచ్చిగా ప్రవహిస్తున్న నదికేసి, ఆవులిస్తున్న ఆకాశంకేసే చూస్తున్నాడు. ‘ఎందుకిలా జరిగింది’ అంటూ అతని చూపులు చరాచర ప్రకృతిని నిలదీస్తున్నట్టున్నాయి.

ఒకానొక క్షణంలో లేచి నిలబడ్డాడు. ఏదైనా చెయ్యాలి. ఏం చెయ్యాలి? పారిపోయిన ప్రవాహాన్ని వెనక్కి ప్రవహింపజేయలేము. దూకిపోయిన జలపాతాన్ని పైకి తోడలేము. ఎక్కడో పుట్టిన ఒక సెలయేటి పాప ఇక్కడ కాలమనే కావేరిలో కలిసిపోయింది. గాలిలో గాలి, నీటిలో నీళ్ళు, మట్టిలో మట్టి కలిసిపోయాయి. రామస్వామి భుజంమీద వేసిన చేయి చల్లగా తగిలింది. కృష్ణమూర్తినీ, భారతినీ హోటల్గదిలోకి చేర్చాము. భారతి ఒంటిలోని శక్తంతా మండి ఆవిరి అయిపోయేలా హృదయవిదారకంగా ఏడుస్తోంది. అదుపు తప్పిన ఆక్రోశంవల్ల ఆమె వెక్కిళ్ళు పెడుతోంది. ఆమెచేత నీళ్ళు తాగించడం అసాధ్యమవుతోంది. ఆమె నీళ్ళను విషంలా చూస్తోంది.

కృష్ణమూర్తి దిండులో ముఖం దాచుకొని అసహనంగా పొర్లుతున్నాడు. గదితలుపులు వేసి లీలకు చెప్పి నేనూ రామస్వామి హోటల్ మెట్లు దిగి కిందికి వచ్చాము. హోటల్ గాజు కిటికీలను బద్దలు కొట్టుకొని మరీ వినిపిస్తోంది భారతి రోదన. బస్ స్టాండు నుంచి పడవల రేవు చేరుకున్నాము. పెద్ద గంపల్లాంటి పడవల్లో జనం ఒకరొకరుగా కూర్చొంటున్నారు.

ఒకరిద్దరు పడవల వాళ్ళతో రామస్వామి జరిగిన ప్రమాదం గురించి క్లుప్తంగా చెప్పాడు. రేటు గురించి అట్టే పేచీ పెట్టకుండా ఇద్దరు పడవలవాళ్ళు మమ్మల్ని తీసుకుని బయలుదేరారు. పడవలు కదిలాయి.

చెంపలమీద కన్నీటి బొట్లలా పడవలు కదిలాయి. రెండు పెద్ద రాతి బండల మధ్యనుంచీ ఒక పెద్ద పాయ ఉధృతంగా వచ్చి నదిలో కలుస్తోంది. అది మేము స్నానం చేసిన స్నాన ఘట్టం నుంచీ వస్తున్నదే. కానీ అప్పటికే నది అనేక మలుపులు తిరిగి ఉండడం చేత ప్రమాదం జరిగిన స్థలం స్పష్టంగా కనిపించలేదు. ప్రవాహ వేగానికి పడవ వేగంగా కదులుతోంది.

పడవ నడుపుతున్న ముసలివాడు తనకు బుద్ధి తెలిసినప్పటినుంచీ జరిగిన ప్రమాదాల్ని ఏకరువు పెడుతున్నాడు. అతని కళ్ళు విషాదం గూడు కట్టినట్టున్నా పెదవులపైన ప్రతీకారజ్వాలలాంటి విచిత్రమైన హాసం ఉంది. అతని ముఖంమీది ముడతలు కాలం అనే నాగలి జీవితం పొలాలపై దున్నిన చాళ్ళలా ఉన్నాయి.

ఆనందం విషాదాలకు అతీతంగా పూనుకున్న కర్తవ్య నిర్వహణలో అతను తలగుడ్డ గట్టిగా బిగించాడు. అతను తరువాత, అవ్వ, తండ్రి, తల్లి, భార్య, కొడుకులు, కూతుళ్ళు ఇంకా తన స్నేహితులు, ఊరివారి మరణాల్ని గుర్తుకు తెచ్చుకుని ఆనాటి కథలన్నీ వెలికి తోడుతున్నాడు.

అతను ఏ భాష మాట్లాడుతున్నది కూడా అర్థం కావడంలేదు. అతని గొంతుక పర్వతాగ్రాలనుంచీ అగాధాల్లోకి దూకుతున్న జలపాతానికి మల్లే విషాద గంభీరంగా ధ్వనిస్తోంది. దీనికొక గతి మాత్రమే ఉన్నట్టుంది. తర్కమేమీ అక్కడ పనిచేసేట్టు లేదు.

ముసలివాడు చేపలు పట్టుకుని వస్తున్న జాలర్లతో పసికందు శవం గురించి వాకబు చేశాడు. వాళ్ళ సమాధానం వీస్తున్న ఈదురుగాలిలో అస్పష్టంగా వినిపించి గాలిలో కలిసిపోయింది. నదిలో యాత్రికుల తాలూకు వాడిన పువ్వులు, కాగితాలు కొట్టుకువస్తున్నాయి. నదికిరువైపులా వ్యాపించిన ఇసుకమేటల్ని దాటుకుని గహనమైన అరణ్యం వ్యాపించి ఉంది. మేము స్నానం చేసింది మచ్చుకొక జలధారకిందే. ఇప్పుడు జలపాతపు పాక్షిక దృశ్యం కనిపిస్తోంది. ఎత్తైన కొండ చరియల్నుంచీ, బండపేటుల నుంచీ జలధారలు ఒకదానికంటే ఒకటి వేగంగా వచ్చి పడుతున్నాయి.

ఎర్రటి నీటిలో అనేక వృక్షాలు కూలి నదిలో పడి కొట్టుకువస్తున్నాయి. వాటిని గట్టుమీదికి చేర్చడానికి జాలర్లు పెద్దగా అరుచుకుంటూ పడవల్లో చుట్టుముడుతున్నారు. భావోద్రేకం పొంగడంవల్ల ముసలివాడు ఏదో తత్త్యంలాంటి పాటను ఏడుపు గొంతుతో పాడుతున్నాడు.

జలాన్నిచ్చి చెట్లను బ్రతికించిన నది వేళ్ళను కుళ్ళగించి తనతో లాక్కునిపోతోంది. నదిలో కొట్టుకొచ్చిన జంతు కళేబరాలమీద పక్షులు వాలుతున్నాయి.

జాలర్లుచేపలు నిండిన వలలు భుజాన వేసుకుని గట్టెక్కుతున్నారు. వలల్లో చిక్కుకున్న చేపల జీవశక్తి ఇంకొద్ది ఘడియల్లో అడుగంటిపోవడానికి సిద్ధంగా ఉంది. నదిలోతుపాతుల్ని కూలంకషంగా శోధించిన అనుభవంతో బిడ్డ శవంకోసం వెతకడం నిష్ప్రయోజనమని తేల్చేశారు జాలర్లు.

కాసేపు ఆ తీరానికీ, ఈ తీరానికీ తిప్పి ముసలివాడు పడవను జలపాతానికి ఎదురుగా వున్న కొండతీరంలో ఆపేశాడు. యాత్రికులు కొండెక్కి జలపాతం చూడడానికి వెళుతున్నారు. వారి వెనుకే కొండెక్కి పైకి చేరుకున్నాము. నాకప్పుడు జలపాతమంటే ఏమిటో తెలిసింది.

దాదాపు ఒక ఫర్లాంగు మేరా వివిధ స్థాయిల్లో రకరకాల ఎత్తుల్నుంచీ జలపాతం దూకుతోంది. జలపాతం దూకుతున్నంతమేరా తెల్లటిపొగ లేస్తోంది. జలపాతానికొక చివరగా స్నానఘట్టం, మంటపాలు బిందువుల్లా కనిపిస్తున్నాయి. నేల ప్రిదిలిపోతున్నట్టు, బ్రహ్మాండాలు పగిలి సముద్రాలకు గండిపడ్డట్టు మహోధృతంగా దూకుతోంది జలపాతం. జలపాతాన్నంతా అధిగమించి నాకు ఒక చిరుగొంతుక విన్పిస్తోంది. “అవును జలపాతమమే నాకేం భయంలేదు. అంకుల్కే భయం!” అంటూ ఒక నవ్వు దిక్కులు మార్మోగేలా ప్రతిధ్వనిస్తోంది.

బహుశా నేను ఏడుస్తున్నానేమో! భోరుభోరున కిందపడి దొర్లుతూ విలపిస్తున్నానేమో! జుట్టుపీక్కుని, బట్టలు చింపుకుని, ఒళ్ళంతా రక్కుకుని పిచ్చిపిచ్చిగా పెడబొబ్బలు పెడుతున్నానేమో! చేష్టలుడిగి బండరాయిలా కరుడుగట్టుకుపోయానేమో! అనంత జీవిత దుఃఖదాయని హొగినేకల్ దూకుతూనే ఉంది.

ఎనిమిది గంటల ప్రాంతంలో బెంగళూరు చేరుకున్నాము. వెలుగు నావలు తేలుతున్న నదుల్లా వున్నాయి రోడ్లు. సిటీబస్ స్టాండ్ మధ్య ఉన్న ఉన్నతమైన ఓవర్ బ్రిడ్జి ఎక్కిదిగుతున్న జనసందోహం జలపాతంలా ఉంది.

ఉన్నట్టుండి సడన్ బ్రేకులు పడి వాహనాలన్నీ ఆగిపోయాయి. ఒకటి వెనుకగా ఒకటి పోలీసు జీపులు విజిల్ వేసుకుంటూ రోడ్డు మధ్య దూసుకుపోయాయి. అంబు లెన్స్లు వాటి వెనకే పరిగెత్తాయి. ఏం జరిగింది? ఏం జరిగింది? సర్వత్రా మనుషుల తలలు ప్రశ్నార్థకాల్లా లేచాయి.

లేదు. ఏమీ జరగలేదు. మహా అయితే ఏం జరిగుంటుంది. తీరానికీ అగాథానికీ మధ్య ఉన్న సున్నితమైన సరిహద్దు చెరిగి ఉంటుంది. ఒడ్డునున్న మరోచెట్టు ప్రవాహంలోకి ఒరిగి ఉంటుంది. వికసించిన ఒక పువ్వో, దోరమాగుతున్నకాయో, చిరుమొగ్గో, గాలివానకు నేల రాలి ఉంటుంది. మహా అయితే ఏం జరుగుతుంది? రోజూ గుడ్మార్నింగ్ చెప్పే భవానీ ఇంక మేడ మెట్లెక్కి రాదు.

స్నానం చేయనని మారాం చేస్తూ చేతికి అందకుండా ఇల్లంతా లేగదూడలా గెంతే భవానీని, మరింకెప్పటికీ ప్రాధేయపడుతూ వెంటపడాల్సిన అవసరం ఉండదు

భారతికి… లీల హెయిర్ పిన్నులు ఇకమీదట ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటాయి. కారును కడిగేటప్పుడు వాటర్పైపుతో ఇకమీదట ఎవరూ రామస్వామిని తడిపేవాళ్ళు ఉండరు.

కణతలు నొక్కుకుంటూ కళ్ళు మూసుకున్నా. ట్రాఫిక్ కదిలింది. యాంత్రికంగా ఇంటికివెళ్ళి పడుకున్నాము. భయంకరమైన రేపు గుండెల్ని వణికిస్తోంది. అలసిన ఎదలపై మగత నిద్ర మంచులా కురిసింది.

ఉదయం లేచేసరికి బారెడు పొద్దెక్కింది. తోటలో ఏవో అరుపులు వినిపిస్తుంటే వెళ్ళి కిటికీలో తొంగి చూశాను. కృష్ణమూర్తి వాళ్ళ పెంపుడు కుక్క ఆ రాత్రే నాలుగు పిల్లల్ని ఈనింది.

ఇంకా కళ్ళు తెరిచీ తెరవని పిల్లలు తల్లిమీదపడి దొర్లుతున్నాయి. అప్పటికే రామస్వామి, కుటుంబ సభ్యులు లేచి పాచిముఖాలతో ఇంటికొచ్చిన కొత్త అతిథులకేసి చూస్తున్నారు. లీలవైపు చూశాను. వర్షం కురిసిన మేఘాల్లా ఉన్నాయి ఆమె కళ్ళు.

రాత్రి టాప్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నాను. మొజాయిక్ ఫ్లోర్మీద షవర్ నుండి నీళ్ళు దబదబ దూకుతున్నాయి. బాత్రూంలోకి దూరి షవర్‌కింద నిలుచున్నాను. అనాది మానవుల ఆనంద విషాదాశ్రు జలపాతం హొగినేకల్ ఇంకా దూకుతూనే వుంది.

మధురాంతకం మహేంద్ర
1959 జులై 16న చిత్తూరు జిల్లాలో రవణయ్యగారి పల్లె అనే కుగ్రామంలో పుట్టిన మహేంద్ర ప్రాథమిక విద్య దామల్ చెరువులోనూ, కళాశాల చదువులు చిత్తూరులోనూ, తిరుపతి శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలోనూ జరిగింది. వీరి మొదటి కథ 'కనిపించని కోయిల' డిసెంబర్ 1979- జనవరి 1980 భారతి మాస పత్రికలో అచ్చయింది. 'స్వర్ణసీమకు స్వాగతం' అనే నవల రాశారు. జూన్ 1995 ఇండియా టుడే లో తన చివరి కథ 'వ్రతం' అచ్చయింది. పధ్నాలుగు కథలు రాశారు. 'పర్వవేలా తరంగాలు' (కవితా సంపుటి), 'కనిపించని కోయిల' (కథా సంపుటి) ప్రచురించారు.  శ్రీ వేంకటేశ్వరా గ్రామీణ బ్యాంకని పేరున్న గ్రామీణ బాంకుల్లో వుద్యోగం చేస్తూ నంజంపేట, కారణి, గురుపల్లె, మొగిలి, యెరాలవారి పాళెం మొదలైన గ్రామాల్లో చాలాకాలం గడిపారు.
ప్రసిద్ధ కథ రచయిత మధురాంతకం రాజారాంగారి అబ్బా యిగా మాత్రమే గాకుండా, తనదంటూ వొక విశిష్టమైన, విల క్షణమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న అరుదైన రచయిత, కవి, చిత్రకారుడు. ప్రముఖ కథకులు మధురాంతకం నరేంద్ర వీరికి సోదరుడు అవుతారు. 1998 జూన్ 11వ తేదీన తన 39వ యేట అర్ధాంతరంగా యీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *