దళిత కార్మికుల సమ్మె చరిత్రను తిరగరాసిన నవల

Spread the love

తెల్ల ఏనుగు:
నవల : జయమోహన్:
మూలం: తమిళం:
అనువాదం: కుమార్, అవినేని భాస్కర్

ప్రసిద్ధ చరిత్రకారుడు ఈ.హెచ్. కార్ “history is a dialogue between present and past societies” అంటాడు. చరిత్ర కొనసాగే సంవాదం అయితే గతంలో జరిగిన ఒక ఘటనని కేవలం కొన్ని తేదీలతో, కొందరు వ్యక్తులతో ముడిపెట్టేసి చేతులు దులుపుకోవటం కాదు.

ఆ ఘటనల వెనుక గల ఆర్థిక, సామాజిక కారణాల విశ్లేషణ కూడా చరిత్రలో ఒక భాగం. అంతే కాదు ఒక ఘటన చరిత్రలో మొదట నమోదు అయినా కొత్త సత్యాల, ఆధారాల దారాల  కొసలేమైనా దొరికితే  అప్పటికే నమోదైన ఘటన కన్నా  ముందేమైనా అలాంటి ఘటన జరిగిందా లేదా అని శోధించి పూర్వాపరం చేయటం కూడా చరిత్ర నిర్మాణంలో ఓ భాగం.

ఉదాహరణకి దక్షిణ ఆఫ్రికా నుంచి గాంధీ తిరిగొచ్చాక ఆయన నాయకత్వంలో బలవంతంగా నీలిమందు పండించాలన్న బ్రిటష్ ప్రభుత్వ నిర్దేశాలకు వ్యతిరేకంగా 1927లో జరిగిన చంపారణ్ ఉద్యమం ప్రథమ ఉద్యమం కాదు. బీహార్లో చంపారణ్ రైతుల ఉద్యమం కన్నా ఎంతో ముందే బెంగాలులో రైతులు 1859 అంటే సిపాయిల తిరుగుబాటు జరిగిన మరో రెండు సంవత్సరాలకు బ్రిటిష్ ప్రభుత్వ నిర్దేశాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. ఆ రైతుల తిరుగుబాటుకు ముందు దీనబంధు మిత్రా “నీల్ దర్పణ్” అన్న నాటకం రాసాడు. కానీ నీలిమందు పంటకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం గురించి చరిత్ర  తిరగేస్తే చంపారణ్ ఉద్యమం గురించి మాత్రమే తెలుస్తుంది. (ఈ విషయంపై చంద్రలత గారు రాసిన “నీలంపురాశి” తెలుగులో వచ్చిన గొప్ప నవల)

అలాగే భారతదేశంలో జరిగిన  ప్రథమ సంఘటిత శ్రామికుల సమ్మె గురించి చరిత్ర తిరగేస్తే 1926లో బొంబాయిలో టెక్స్టైల్ మిల్ వర్కర్స్ అత్యధిక గంటల పని, అతి తక్కువ వేతనం, మిల్లుల్లో శ్రామికులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు వ్యతిరేకంగా జరిపిన సమ్మె గురించి మాత్రమే చెబుతుంది. కానీ  అంతకంటే సుమారు అర్థ శతాబ్ది ముందు, సరిగ్గా చెప్పాలంటే 48 ఏళ్ల ముందు అంటే 1878లో భీకర కరువు తాండవిస్తున్న సమయంలో దక్షిణ భారతదేశంలో మద్రాసు రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి సమ్మె గురించి మాత్రం చరిత్ర తెలియజేయదు. అందునా ఆ సమ్మె జరిపినది కేవలం దళితులే అన్న విషయం అసలు తెలియజేయదు. ఆ సమ్మె గురించి రాసిన నవలే జయమోహన్ గారి “తెల్ల ఏనుగు”.

దళితులు మాత్రమే జరిపిన మొదటి సమ్మె గురించి జయమోహన్ గారు నవల ఎందుకు రాయాల్సి వచ్చిందంటే జయమోహన్ గారి కథల సంపుటి నెమ్మి నీలం చదివిన వారికి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు కానీ ఆయన సత్య శోధకుడు కావడమే ప్రధాన కారణం.

జయమోహన్ గారు ఈ నవల రాసేందుకు ప్రేరణ  అప్పటి మద్రాసు ప్రసిడెన్సిలో గొప్ప సామాజిక కార్యకర్తగా పేరు పొందిన వి. కల్యాళ సుందరం  (26.08.83–17.09.53) గారి స్వీయచరిత్ర చదవటం. ఆ చరిత్రలో 1921లో మే 20 న మద్రాసు కార్మిక సంఘం ఇచ్చిన సమ్మె ప్రస్తావన వచ్చింది. ఇక్కడే నవలా రచనకు కారణమైన ఆ కార్మికోద్యమ చరిత్ర గురించి ముందు స్థూలంగా తెలుసుకుందాం.

1890లో మన దేశంలో మొట్టమొదటి కార్మిక సంఘం ఎన్.ఎమ్. లోఖండే నాయకత్వంలో ఏర్పడింది. దాని పేరు బొంబాయి హ్యాండ్ మిల్స్ అసోసియేషన్. ఆ తరువాత క్రమేపి కలకత్తాలో 1905లో ప్రింటర్స్ యూనియన్,

1907లో బొంబాయిలో పోస్టల్ యూనియన్, 1910లో బొంబాయిలో కామ్గార్ హితవర్ధక్ సభా, 1918లో మద్రాసు కార్మిక సంఘం ఏర్పడ్డాయి. మద్రాసు కార్మిక సంఘం ఏర్పడ్డానికి ముఖ్య కారకులు బి.పి. వాడియా, వి. కల్యాణ సుందరం. ఆ తరువాత దేశంలో కార్మిక సంఘాలన్నీ సంఘటితమై 1920లో All India Trade Union Congress (AITUC) అనే సంస్థ స్థాపించబడింది.

1921లో మద్రాసులో బకింగ్హామ్, కర్ణాటిక్ మిల్లుల కార్మిక సంఘాలు మొట్టమొదటిగా  సమ్మెకు పిలుపునిచ్చాయి. అనిమియత పనివేళలు, అతి తక్కువ జీతాలు, పనిచేసే చోట దుర్భర వాతావరణం ఈ సమ్మె పిలుపుకు ముఖ్య కారణాలు. ఈ సమ్మె చాలా నెలల పాటు కొనసాగింది. సమ్మెలో పాల్లొనాల్సిన కార్మికులలో అత్యధికులు దళితేతరులు. ఆ కార్మికులలో దళితులు కొందరు ఉన్నా దళితులను సంఘటితం చేసిన నాయకుడు ఎమ్.సి. రాజా (పూర్తి పేరు మైలై చిన్నపిళ్ళై తంబి రాజా 17.06.1883–23.08.1943)

మద్రాసు కార్మిక సంఘం పిలుపు నిచ్చిన సమ్మెను సమర్థించలేదు. ఆ కారణంగా కార్మిక ఉద్యమ చరిత్రలో ఎమ్.సి. రాజా ఒక విద్రోహిగా చిత్రించబడ్డారు. కానీ ఆ సమ్మెను సమర్థించకపోవడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే 1878లో మద్రాసు ఐస్ హౌసులో పనిచేస్తున్న దళితులు, అక్కడ అతి దుర్భర పరిస్థితులకు వ్యతిరేకంగా జరిపిన సమ్మెను నిర్దాక్షణ్యంగా అణిచివేయడానికి కారకుడు, ఆ కంపెనీలో యాజమాన్యంలో భాగస్తుడైన అయ్యంగార్ అనే అగ్ర కులానికి చెందిన ఓ వ్యక్తి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ ఐస్ హౌసులో దళితులు మాత్రమే పనిచేసేవారు. అందుకు గల కారణాలు తెలుసుకోవాలంటే ఆ నాటి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంత కుల వ్యవస్థ, సామాజిక పరిస్థితుల గురించి స్థూలంగానైనా తెలుసుకోవాలి.

1750 నుంచి 1880ల మధ్య కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతం ఎన్నో కరువులను ఎదుర్కొన్నా 1876–1878ల మధ్య వచ్చిన కరువు సమయంలో లక్షల మంది చనిపోవడానికి కారణమయ్యింది. ఈ కరువు  మైసూరు, హైదరాబాదు, బొంబాయి నుంచి పంజాబ్ వరకు ప్రభావం చూపింది. అందుకనే ఈ కరువుని the great famine of 1876-78 అని చరిత్రలో పేర్కొన్నారు.

కుల వ్యవస్థ భారతదేశమంతటా సంక్లిష్టంగా ఉండేది కానీ మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఆ సంక్లిష్టత ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు.

ప్రధానంగా వ్యాపార కులస్థులైన శెట్లలోనే వారు జరిపే వ్యాపారం బట్టి వారి స్థానం నిర్ణయం అవుతుంది. ఉదాహరణకి బంగారు నగల వ్యాపారం, ధాన్యం వ్యాపారం చేసేవారు పై స్థాయి వారు. ఎందుకంటే వారికి జమీందారులతో, రాజులతో నేరుగా వ్యాపార సంబంధాలు ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసే కోమట్లు వ్యాపార కులంలో కింది స్థాయి వారు. నిజానికి మద్రాసు పట్నం ఏర్పడ్డాక మొదట వచ్చి స్థిరపడింది ఈ కోమట్లే. కానీ తరువాత వచ్చిన శెట్లు జమీందార్లు, రాజులతో వ్యాపారం చేయడం వల్ల కోమట్ల కన్నా త్వరగా ధనవంతులై ఓ ప్రత్యేక స్థానం సమాజంలో పొంది మద్రాసులో కొన్ని గుళ్ళు తమ కోసం ప్రత్యేకంగా కట్టుకున్నారు. కోమట్లు శెట్లు కట్టిన గుళ్ళలోకి వెళితే అదెంత పెద్ద తీవ్ర అంతర్గత కుల కొట్లాటగా మారిందంటే అప్పటి గవర్నర్ జోసెఫ్ అల్కాట్ (1717-20) జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

అగ్రవర్ణాలలోనే అంతర్గతంగా ఇంత వివక్ష ఉన్నప్పుడు సమాజంలో దళితుల పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించవచ్చు. 1876-78 మధ్య తీవ్ర వర్షాభావంతో ఏర్పడిన కరువుతో గ్రామాల్లో దళితులు జీవనోపాధి కోసం వస్తూ దారిలోనే లక్షల మంది చనిపోయారు (కరోనా మొదటి దశలో కాలినడకన సొంత ఊర్లకు వచ్చిన వారి కష్టాలే చూడలేకపోయాం) అలా మద్రాసు చేరుకున్న వారిలో కూడా కాస్త కూస్తో ఆరోగ్యంగా ఉన్నవారినే పట్నం లోపలికి అనుమతించారు. అనారోగ్య బారిన పడ్డవారిని ఆదుకోకుండా పట్నం పొలిమేరల దాకా కూడా చేరనివ్వలేదు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం.

అలా మద్రాసు చేరిన దళితుల్లో కొందరు మద్రాసు ఐస్ హౌసులో పనికి చేరారు. ఐస్ హౌస్ అంటే రిఫ్రిజరేషన్ టెక్నాలజీ ద్వారా ఐసు తయారుచేయడానికి ముందు అమెరికాలో న్యూ ఇంగ్లాండ్లో ఘనీభవించిన సరస్సుల నుంచి సేకరించిన మంచు గడ్డలు ఓడల ద్వారా దిగుమతి చేయబడి నిలువచేయబడేది. అక్కడ నుంచి ఐసు కావలసిన వారికి అమ్మేవారు. అందుకనే ఆ రోజుల్లో ఐస్ చాలా ప్రియమైన వస్తువుగా ఉండేది. అలా దిగుమతి చేయబడిన ఐసు కరిగిపోకుండా ఉండేందుకు ఎండ పొడ కూడా తగలని చీకటి గొదాములలో నిలువ చేసేవారు. అందుకు అక్కడ పనిచేసేవారికి విపరీతమైన నిరంతర శారీరక శ్రమ ఉండేది. నగ్న పాదాలతో ఆ చీకటి గొదాములో నిరంతరంగా పాదాల కింద పారే చల్లటి నీటిలో నిలబడి పనిచేయాలి. కరువులో మద్రాసుకు వలస వచ్చిన దళితులు గత్యంతరం లేక చాలా తక్కువ కూలీకి ఆ పనిలో చేరేవారు. ఐస్ హౌస్లో పనిచేసే  దళితులు ఆ కఠిన పరిస్థితులకు వ్యతిరేకంగా సమ్మె ఎలా చేసారు? అన్నదే నవలలో ప్రాధమిక కథాంశం.

శ్రీశ్రీ తన దేశ చరిత్రలు (మహాప్రస్థానం) కవితలో ఒకచోట

“ఇతిహాసపు చీకటి కోణం

అట్టడుగున పడి కాన్పించని

కథలన్నీ కావాలిప్పుడు”

అన్నట్లుగా దళితులకు ముఖ్యంగా తమిళనాట దళితులకు అంబేద్కర్ వంటి నాయకుడైన ఎమ్.సి. రాజా 1921లో మద్రాసు కార్మిక సంఘం పిలుపునిచ్చిన సమ్మెను ఎందుకు సమర్థించలేదు? అంత మాత్రాన అతడు చరిత్రలో ‘విద్రోహి’ గా ఎందుకు చిత్రించబడుతున్నాడు అన్న జిజ్ఞాస, ఆ చీకటి కోణం కథేమిటి? అన్న ఆలోచనే రచయిత జయమోహన్ చరిత్ర శోధించి భారతదేశ కార్మిక పోరాట చరిత్రలోనే  కేవలం దళితులు జరిపిన మొట్టమొదటి సమ్మె గురించి నవల ఈ నవల రాయడం వలన చరిత్ర పుటలలో మరుగున పడిన ఆ చారిత్రక సత్యం వెలుగు చూసింది.

బ్రిటిష్ హయాంలో అందునా దళితులు మాత్రమే చేసిన సమ్మె విజయవంతం అవ్వడం ఓ పగటి కల లాంటిదే కానీ భారతదేశంలో కార్మికోద్యమ చరిత్రలో ఆ సమ్మె ప్రస్తావింపబడలేదు. అది వెలుగు చూడాల్సిన చారిత్రక అవసరం ఉంది కనుక ఈ నవల జయమోహన్గారు రాసారు.

కథలో ముఖ్య పాత్ర ఎడెన్ బర్న్. ఎడెన్ ఐరిష్ జాతీయుడు. తండ్రి పశువుల పోషణ చేసుకుంటూ చాలా సాధారణమైన జీవితం గడుపుతుంటాడు. కుటుంబ పశుపాలన వృత్తి కాకుండా చదువు వైపు దృష్టి మళ్ళుతుంది. చదువుకుని ఆ నాటి అందరి ఐరిష్ యువకుల్లాగే బ్రిటిష్ సామ్రాజ్య ఆధీనంలో ఉన్న భారతదేశంలో, మద్రాసు రాష్ట్రంలో పోలీసు ఆఫీసరుగా వచ్చి చేరుతాడు.

పన్నెండవ శతాబ్దంలోనే ఇంగ్లండ్ ఐర్లాండును ఆక్రమించి తన ఆధీనంలో తెచ్చుకుంది. ఐరిష్ ప్రజలు కూడా తెల్ల చర్మం కలవారే అవడం వలన బ్రిటిష్ ప్రభుత్వం వారి పట్ల, నల్ల జాతీయుల పట్ల ఉన్నంత తీవ్ర వివక్ష చూపేది కాదు. కానీ బ్రిటిష్ యంత్రాంగంలో తన దేశీయుల పట్ల బ్రిటిషర్లకు ఎంతో కొంత వివక్ష ఉందన్నది ఎడెన్కు తెలుసును. బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే అధికారుల ఇళ్ళల్లో, క్లబ్బుల్లో శారీరక శ్రమ చేసేది భారతీయ దళితులే. ఏడెన్ కవిత్వ ప్రేమికుడు ముఖ్యంగా రొమాంటిక్ కవులలో అగ్రగణ్యుడైన షెల్లీ వీరాభిమాని మాత్రమే కాదు స్వయంగా కూడా కవి. అందుకనే కథలో అనేక రకాల సందర్భాలలో షెల్లీని తలుచుకుంటాడు. సాధారణ పాఠకుడికి షెల్లీ కవిత్వంతో పరిచయం లేకపోయినా ఆయన కవిత్వ ఉటంకింపు అర్థం చేసుకోగలడు. ఏడెన్ పాత్ర వ్యక్తిత్వ చిత్రణకు ఆ ఉటంకింపు ప్రతిబింబంలా పనిచేసింది.

దళితులని సంఘటితపరిచే కార్తవరాయన్తో ఏడెన్కు పరిచయం అవుతుంది. కార్తవరాయన్ నేనొక మాల వైష్ణవుణ్ణి అని చెబుతూ “సమాజ సేవకుణ్ణి కాదు గానీ నా దగ్గరకి వచ్చిన వారికి నాకు వీలైనంత సహాయం చేస్తుంటాను” అంటాడు. కార్తవరాయన్ ద్వారానే ఏడెన్కు మద్రాసు రాయపురం సెయింట్ పీటర్ చర్చ్ ఫాదర్ రెవరెండ్ జాన్ బ్రెన్నన్ పరిచయం అవుతుంది. కార్తవరాయన్ పాత్ర ఆనాడు దళితుల్లో విద్యావంతులైన అతి కొద్దిమందిలో ఒకడికి ప్రతీక. తన చదువు వలన కలిగిన చైతన్యంతో తనకు తెలిసిన విషయాలను నిష్పక్షపాతంగా తనకు తానే విశ్లేషించుకుంటూ, తన కుల అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడే మనిషి.

తన మతమైన క్రైస్తవం పట్ల పెద్దగా నమ్మకం లేక, విధిగా చర్చుకు హాజరు కాని ఏడెన్కు కార్తవరాయన్ ద్వారా మొదట పరోక్షంగా పరిచయమైన వ్యక్తి బ్రెన్నన్. బ్రెన్నన్ ఆస్ట్రియన్ దేశస్థుడు. బ్రెన్నెన్ ద్వారానే ఏడెన్ భారతదేశంలో కులాలు, ప్రతీ ఒక్క కులంలోనూ ఉన్న అంతర్గత వివక్షలు, వివిధ క్రైస్తవ చర్చుల్లో ఆనాటి నుంచే కొనసాగుతున్న వివక్షల గురించి తెలుసుకుంటాడు.

హవల్దార్ నారాయణన్ ఏడెన్ కింద పనిచేసే చిన్న పోలీసు ఉద్యోగే అయినా అంటరాని తనమనే జాడ్యం ఎంత తీవ్రమైనదో ఏడెన్ నేరుగా గ్రహిస్తాడు.

లెఫ్టెనెంట్  కల్నల్గా బ్రిటిష్ ఆర్మీలో పనిచేసి తరువాత పోలీసు ఉద్యోగిగా చేరిన వ్యక్తి. ఏ. బ్రిటిష్ ప్రభుత్వ దృష్టిలో ఒక పోలీసు ఎలా ఉండాలో అలా ప్రవర్తించే మనిషి.

అమెరికన్ కంపెనీ ట్యూడర్ అండ్ కంపెనీలో ముఖ్యమైన షేర్ హోల్డర్లలో ఒకడు.. బ్రిటిష్ ప్రభుత్వ సానుకూల పరిపాలనకు అవసరమైన ఎన్నో కట్టడాలకు కాంట్రాక్టు తీసుకుని, ప్రభుత్వ యంత్రాంగానికి అతి చేరువైన వ్యక్తి.

కథలో ముఖ్యమైన పాత్రలు ఇంకా చాలా ఉన్నా అతి ముఖ్యమైన పాత్రలను రేఖా మాత్రంగా పరిచయం చేసాను.

శరణ్ కుమార్ లింబాలే నవల “సనాతనం” దళితుల చరిత్రను తిరగరాస్తే, జయమోహన్ గారి “తెల్ల ఏనుగు” భారతదేశ కార్మికుల సమ్మె చరిత్ర అందునా దళిత కార్మికుల సమ్మె చరిత్రను తిరగరాసిన నవల.

ఆర్.ఎస్. వెంకటేశ్వరన్.

వెంకటేశ్వరన్ గారి విద్యాభ్యాసం బెర్హంపూర్ లో జరిగింది. సుప్రీమ్ కోర్టులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉంటున్నారు. మంచి చదువరి, కవి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *