ఆ వెలుగు రేఖలు ఎక్కడ?

Spread the love

ముందు వరుసలో కూర్చొని నల్లబల్ల వైపు తీక్షణంగా చూస్తూ
ఉపాధ్యాయుల ప్రతి మాటను శ్రద్ధగా వినే ఆ విద్యార్థులు ఎక్కడ ?

ఏదైనా సాధించాలనే సంకల్పంతో
నిత్యం పుస్తకాలతో కుస్తీపడుతూ
సందేహాలను నిస్సందేహంగా వ్యక్తపరిచే
ఆ రేపటి పౌరులు ఎక్కడ?

చిరునవ్వుతో స్వాగతిస్తూ అలుగుతూ, అల్లరిచేస్తూ
ఎంతటి సమస్యనైనా మరిచిపోయేలా చేసే
ఆ మాంత్రికులు ఎక్కడ?

జీవితారణ్యంలో దారితెలియని
జింకపిల్లల్లా సతమతమవుతూ కొన్నిసార్లు,
కొండలను సైతం ఢీకొడతామనే పొట్టేళ్ళలా అతివిశ్వాసంతో కొన్నిసార్లు ...
పరీక్షల పరుగు పందెంలో పడుతూ లేస్తూ ముందుకు పయనించే
ఆ పోరాటయోధులు ఎక్కడ!

అర్థంకాని పాఠాల
ఆ ప్రశ్న గుర్తులకు సరైన సమాధానంగా
నన్ను నేను చెక్కుకోవడానికి, నిత్యం నేర్చుకోవడానికి దారిదీపమైన
ఆ వెలుగురేఖలు ఎక్కడ ?

అమ్మానాన్నలను ప్రేమించేవాళ్ళు
వాళ్ళ కష్టం విలువ తెలిసిన వాళ్ళు
గురువులంటే గౌరవం కలిగిన వాళ్ళు...
ఈ చదువుల ఆలయంలో నిత్యం విహరించే
ఆ సీతాకోకచిలుకలు ఎక్కడ?

*

ఓ పిల్లల్లారా
ఆడపిల్లను కన్నతల్లిదండ్రులకు ఒక్కసారే అప్పగింతలు...
మాకు మాత్రం మీరు వీడ్కోలు పలికే ప్రతిసారి దుఃఖమే!

ఓ రెక్కలొచ్చిన పక్షుల్లారా గుర్తుంచుకోండి
మేమెప్పుడూ మీ వెన్నంటే..!

ఎగరండి...
ఆకాశమే హద్దుగా!

ఎదగండి...
సమున్నత ఆశయాలే లక్ష్యంగా!

ఈ వీడ్కోలు
కావాలి ఒక గొప్ప ప్రారంభానికి నాంది!

( ఇంటర్మీడియట్ పిల్లల వీడ్కోలు సమావేశం అనంతరం...)
కాసుల రవికుమార్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *