“మెత్తం చ సబ్బ లోకస్మిన్ భావయే అపరిమానమ్
ఉద్ధం అధో చ వీరియం చ అసంభావం అవేరం అసపథమ్”(మెత్తసుత్త.. 8)
(-సమస్త విశ్వశాంతికై, అపరిమితమైనది, అమోఘమైనది, ద్వేషరహితమైనది, శత్రుత్వము లేనిది, అయిన మైత్రీ భావనను పెంపొందించుకో)… అన్నది బౌద్ధం నేర్పే ఎన్నో ప్రధాన అంశాలలో పేర్కొనదగిన ఒక అంశం.
క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో
బుద్ధునిచేత ప్రతిపాదింపబడిన ధర్మం బౌద్ధం! మనిషిని మనిషిగానే గుర్తించినది, తన ఆలోచనల ప్రతిఫలనమే తన జీవితం అని మనిషికి నేర్పినది, సమతా భావాన్ని బోధించినది, దుఃఖ కారణాన్ని కనుగొంటే దుఃఖ నివారణ సులభమని చెబుతూ, దానికై ఆచరించవలసిన ఆర్యాష్టాంగమార్గాన్ని ఉపదేశించినది బౌద్ధం!
తాను పుట్టిన భారత దేశంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, ఆధునిక యుగంలో బౌద్ధ భిక్షువు అనగారిక దమ్మపాలుని ద్వారా నలుగురు భిక్షువులతో క్రీ.శ. 1891 జూన్ 10 వ తారీఖున బుద్ధగయలో మళ్ళీ పునరుజ్జీవనాన్ని పొందిన బౌద్ధం ప్రజల చేతనలో నిక్షిప్తమై, వర్తనలో కనబడుతున్న బౌద్ధం భారతదేశంలో తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. త్రిపిటకాచార్యులు, మహా మహోపాధ్యాయులు రాహుల్ సాంకృత్యాయన్ రచనల వలన, డా.బి. ఆర్.అంబేడ్కర్ 1956 లో ఐదు లక్షల మందితో కలిసి స్వీకరించిన బౌద్ధ దీక్ష వలన, అంతకు పూర్వం 1956 లోనే ప్రపంచ వ్యాప్తం గా జరిగిన బుద్ధజయంతి ఉత్సవాల వలన …. ప్రపంచం తన దృష్టిని బౌద్ధం వైపు సారించింది. 1902 లో తిరుపతి వెంకట కవులకావ్యం, “బుద్ధ చరిత్రము” తెలుగు సాహిత్యంలో వెలువడిన తొలి బౌద్ధ కావ్యం! క్రమంగా బౌద్ధ ఇతివృత్తా లతోవివిధ ప్రక్రియలలో వెలువడిన తెలుగు సాహిత్యము, తెలుగు బౌద్ధానికొక ఉత్కృష్ఠమైన స్థానాన్ని కలిగించింది. బౌద్ధ సాహిత్యంలో తొలి పరిశోధన చేసిన ఘనతకూడా (1982, మదరాసు విశ్వవిద్యాలయము) తెలుగు సాహిత్యానికే దక్కింది.
ప్రస్తుతమీ ‘మహాబోధి’ పుస్తకం, బౌద్ధ కథల సంకలనం. మానవ ప్రవర్తనకు దగ్గరగా ఉండే సాహిత్య ప్రక్రియ కథ. మంచి కథకు జీవితానుభవం పరిపుష్టిని కలిగిస్తుంది. ఆ అనుభవచైతన్యమే, జీవన విలువలుగా ప్రోది అవుతాయి. బౌద్ధ కథలలో నేటికీ పనికి వచ్చే ఎన్నో జీవన విలువలు సజీవంగా ఉండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దుఃఖాన్ని తొలగించు కోవడానికి, నైతిక విలువలను కాపాడుకోవడానికి, సమస్యలను అర్థం చేసికొంటే పరిష్కారం సులభమని చెప్పడానికి, ఇలా సామాజిక సంబంధాలను బలపరచుకోవడానికి, మానవ ప్రవృత్తిలో కనిపించే విభిన్న కోణాలకు సమాజంలోని లోపాలే కారణమని చెప్పడానికి …. ఇలా ఎన్నో అంశాలను ఈ కథలు చర్చిస్తాయి.
తెలుగులో బౌద్ధసాహిత్యా న్ని పరిపుష్టం చేస్తున్న కథాప్రక్రియను గమనించి నట్లైతే, బౌద్ధ జాతకకథలు తెలుగులో తొలుత పద్య కావ్యాలుగా వెలువడినా, తరువాత చిన్న చిన్న కథలుగా పాళీ భాషనుండి అనువదింపబడినాయి. రవీంద్రుని ‘కథా ఓ కాహిని’ కథలు తెలుగులో కథలు _ గాథలు’ పేరిట (బెజవాడ గోపాలరెడ్డి గారిచే)వెలువడిన అనువాద కథలు, దీనితోబాటు, ‘లోకక్షేమగాథలు’, ‘దమ్మపదగాథలు’ వంటివి వచనరూప అనువాదాలే అయినా, అవి బౌద్ధ సాహిత్యాన్ని పాళీ నుండి తెలుగులోనికి దిగుమతి చేసికున్న కథలు. అలాగాక, బండారు అచ్చమాంబతో ప్రారంభ మైనదిగా చెప్పబడుతున్న తెలుగుకథా ప్రక్రియలో అనుభవాలకు దగ్గరగా ఉండే ప్రక్రియగా, అంతర్లీనంగానున్న చైతన్యాన్ని వెలికితెచ్చే క్రమంలో వాస్తవ అంశాలకు కొంత కల్పనను జోడించి బౌద్ధాన్ని తడిమిన కథలు చాలానేఉన్నాయి.
“బౌద్ధం భారత దేశాన్నుంచి తరిమివేయబడినప్పుడే దేశం నైతికంగా ఆత్మహత్య చేసుకుంది”.. అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన గురజాడ అప్పారావు గారి కథ, “.. మీ పేరేమిటి?” ఈ సంకలనంలోని మొదటి కథ. అశ్వఘోషుని బుద్ధ చరిత్రను చదివిన తరువాత మాస్టారు, తన తరగతి పిల్లలతో “ ఏమో అనుకున్నాం గాని. బుద్ధుడు గొప్పవాడేనర్రా”అంటూ అంతకు ముందులా విద్యార్థులను, “మీరు వొట్టి బౌద్ధులు” అని తిట్టడం మానేశారనడం, విజయ నగరానికి ఎనిమిదిమైళ్ళ దూరంలో నున్న రామగిరి కొండగుహల్లోని బౌద్ధ విగ్రహాలు వైష్ణవ, శైవ మతసంబంధ పూజలందు కోవడం వంటి ఎన్నో వివరాలను అందిస్తూ నేటి భారతంలో బౌద్ధం పొందిన మార్పుల్ని క్షుణ్ణంగా వివరిస్తుంది, ఈ కథ.. అసలు కథతో బాటు.
ఆదిమకాలంలో సాంఘిక ఉద్యమంగా విస్తరించిన బౌద్ధం, తథాగతుని నిర్వాణానంతరం హీనయాన,మహాయాన శాఖలుగా విడిపోయిన కొన్నిశతాబ్దాల తరువాత, ఆంధ్ర, కళింగ రాజ్యాలలో పరపతిని కోల్పోయిన బౌద్ధం గురించి ఒక బౌద్ధ భిక్షువు చేసిన యాత్ర ద్వారా వివరిస్తూ సాగిన “జాతక కథ” సమాజంలోని అసమానత లను ప్రశ్నిస్తూ, ఎవరికి వారిగా చూసినప్పుడు, ప్రతి యొక్కరి హృదయం దేనినో ఒక దానిని కోరే భిక్షాపాత్రలా ఉంది… అన్న సందేశంతో మనల్ని ఆలోచింపజేస్తుంది. సమాజంలో మార్పు వచ్చినపుడే అందమైన సమాజం ఏర్పడగలదని చెబుతుంది.
క్రీశ.ఐదవ శతాబ్దంలో భారతదేశం గర్వింపదగిన నాలందా విశ్వవిద్యాలయం తురుష్కుల చేత అగ్నికి ఆహుతికావడం, అక్కడ విద్యార్జన కోసం వెళ్ళిఉండిన దీపాంకారుడు అన్న బౌద్ధభిక్షువు ద్వారా బౌద్ధం మళ్ళీ వేరూనుకోవడానికి బౌద్ధ గ్రంథాలను కాపాడటమేమార్గం అని, రాజుల ప్రాపకం కన్నా సాధారణ ప్రజల సహానుభూతి, అవగాహనలే బౌద్ధానికి ముఖ్యం అని చెప్పే “తూరుపుగాలులు” కథ, దుఃఖనివారణ మార్గాన్ని అన్వేషిస్తూ, నిరాహారంగా మరణపు అంచులదాకా వెళ్ళిన సిద్ధార్థునికి, వృక్ష దేవత మ్రొక్కుబడిని తీర్చుకోవడానికై తెచ్చిన పాయసానాన్ని దానం చేసి, అదే రాత్రి సంబుద్ధిని పొందడానికి సాయపడిన “సుజాత” కథ బౌద్ధ సాహిత్యంలో గొప్ప కథలు.
మూడవ ప్రపంచయుద్ధం అంటూ వస్తే అది నీటి సమస్యతోనే అన్నది జగమెరిన సత్యం. బుద్ధుని కాలంలోనే, శాక్య కోలియ గణతంత్రరాజ్యాల మధ్య ప్రవహించే రోహిణీ నదీ జలాలకోసం ఒక క్షామకాలంలో యుద్ధం దాకా వెళ్ళిన ఇరు రాజ్యాలను మైత్రీ భావనతో ఆలోచింపజేసి యుద్ధాన్ని మాన్పిన బుద్ధుని కథ “రోహిణి” అన్న కథ. “ “మీ ఎరుకతో ఆలోచించండి. ..అశాంతి ఎప్పుడు ప్రబలుతున్నది?…పేదలు, నీటికీ,అన్నానికీ దూరమైనప్పుడు సంఘం సుఖంగా ఉండదు. మంచి జరుగ వలసిన వారికి మంచి జరగనప్పుడు ఘర్షణ ఏర్పడుతుంది. దీన్ని గుర్తించడానికి ఎరుక అవసరం. అంటే ఎంతవరకు అవసరమో దాన్ని గుర్తించలేకపోవడమే మీ సమస్య. అదే దుఃఖ హేతువు. పొలాలను పండించే మీ అందరికీ సత్యం తెలుసు. అవసరంతెలుసు.మరి ఇది అధికారుల సమస్య ఎలా అవుతుంది? …ఆలోచించినప్పుడుమాత్రమే అది సాధ్యమవుతుంది…” అని చెప్పి శాస్త వెళ్ళిపోయిన తరువాత, ఇరువర్గపు రైతుల మనస్సుల్లో జల ఊరినట్లు స్నేహభావం చమరించింది. .. అని, యుద్ధాన్ని మాన్పిన కథ ఏకాలానికైనా తగిన కథ.
బుద్ధుని కాలంలోనే ఆంధ్ర దేశం లోకి బౌద్ధం ప్రవేశించిందని తెలిపే “బావరి” అన్న గురువు కథ, జ్ఞానోదయానంతరం బుద్ధుని నుండి తొలిసారి ఉపదేశాన్ని పొందిన ఆంధ్రుడు కొండన్న, ఈ బావరి మరిదే అన్న విషయం; నేత వస్త్రాలపై చిత్రించి ఆంధ్రులు పంపేనమూనాలను అనుసరించి అజంతా శిల్పాలు చెక్క బడేవి అన్న వివరాలు (నాగసాల) బౌద్ధ యుగం నాటి విలువైన చారిత్రికాంశాలకు ఆటపట్టై విలసిల్లుతున్న కథలు. ఆ కాలంలో కూడా బుద్ధునిపట్ల వ్యతిరేకతను కలిగిన వారుండేవారని, క్రమంగా వారిలోపరివర్తన కలిగి బౌద్ధ దీక్షను స్వీకరించే వారని బోధిసత్త్వావదాన కల్పలత సాక్ష్యం పలుకుతోంది. నేలంతా బంగారు నాణాలను పరిచి, చక్రవర్తినుండి ఆ నేలను కొని, శ్రావస్తి లో బౌద్ధారామాన్ని కట్టించిన అనాథపిండకుడు, పేదలకు ప్రతినిత్యం అన్నదానం చేసే గొప్ప దాత కూడా!అతడు దయ తలచి తనయింట చోటిచ్చిన క్షుద్రదేవతోపాసకురాలు కలాపిని స్వానుభవంతో అసలైన మైత్రి ఏదో తెలుసుకొని తన తప్పును దిద్దుకోవడాన్ని చెప్పే “పరిపాకం” మనలను ఆలోచింపజేసే కథ! ఆనాటి సాంస్కృతిక వివరాలను చూపిన కథ కూడా!!
బౌద్ధం అంటే అపారమైన ప్రేమను కలిగిన అడివి బాపిరాజు గారి “భోగీర లోయ” అజంతా గుహల చిత్రనిర్మాణం నేపథ్యంగా సాగిన ఒక అందమైన కథ! తొమ్మిదవ శతాబ్దం నాటికి బుద్ధుడు దశావతారాల్లో చేర్చబడినాడన్న చారిత్రికాంశాన్ని వివరించే కథ కూడా!!
పిలకా గణపతి శాస్త్రిగారి “సిద్ధార్థాన్వేషణ” , పుట్టిన ప్రాణి గిట్టక తప్పదని మరణాన్ని గురించి తన శిశువును పోగొట్టుకున్న తల్లి, ‘కిసాగోతమి’కి ఎరుకను కలిగించిన కథ. మందలో తప్పిపోయిన ఆవును వెదికి పట్టుకొని ఆలస్యంగా వచ్చిన ఆలవీ గ్రామానికి చెందిన గోపాలుని కోసం వేచి యుండి మొదటగా అతని ఆకలిని తీర్చిన తరువాతే అతనితోబాటు అందరికీ ధర్మాన్ని ఉపదేశించిన బుద్ధుడు, తన శిష్యులసందేహాన్ని నివృత్తి చేస్తూ, గోపాలుని ‘జీవ చైతన్య మైన క్షుద యాతన’ను గురించి, ‘కర్తవ్యపాలన’ పట్ల అతని కున్న దీక్షను గురించి వివరిస్తున్న “గోపాల గవేషణ” మనలను వెన్నాడే కథ!
బౌద్ధంపట్ల రాజకీయ నాయకులకు,ఎక్కువ శాతం ప్రజలకు ఉన్న అవగాహనా లేమిని ప్రశ్నిస్తూ సాగిన, “బుద్ధం శరణం గచ్ఛామి” కథమనలో ఆలోచనలను రేపుతుండగా, భార్యను, పిల్లవాడిని వదిలి, తన క్లాస్ మెట్ తో వెళ్లిపోవాల నుకున్న రహీమ్, అజంతా శిల్పాలను దర్శించిన స్ఫూర్తితో జ్ఞానోదయాన్ని పొంది ఔరంగాబాదు నుండి వెనక్కి తిరిగి రావడాన్ని చెప్పే “మహాభినిష్క్రమణం” నేటి సమాజాన్ని ఆలోచింపజేసేకథ!
క్రీ,పూ. ఆరవ శతాబ్దం నాటికే వైద్య విధానంలో ఎంతోముందంజ వేసిన బౌద్ధం అవయవమార్పిడి ని కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. అదే సాంప్రదాయంలో రెండవ శతాబ్దానికి చెందిన నాగార్జునాచార్యు నికి గొప్ప భిషగ్వర్యు డు అన్న పేరుంది. ఎవరికి లొంగని మొండి రోగం తో మరణపు అంచుల దాకా వెళ్ళిన ఒక మహాశిల్పికి తన వైద్యంద్వారా స్వస్థతను కలిగించి, అతని కళను అమరావతీ స్తూప నిర్మాణంలో ఉపయోగించుకున్న కథ, “సంఘం శరణం గచ్ఛామి” అన్న కథ!
నేటి విశాఖ చుట్టుప్రక్కల చాలా బౌద్ధ ఆరామాలు న్నాయి. పావురాళ్ల కొండ, తొట్లకొండ, బావి కొండ , విశాఖారామం వంటివి. క్రీ.పూ.184 లో మగధ సామ్రాజ్యం లోని పాటలీపుత్ర నగరంలోనున్న ‘కుక్కుటా రామం’ లోనున్న బుద్ధునిభిక్షాపాత్రను, వందలాది బౌద్ధ బిక్షువులను సంహరించిన పుష్య మిత్రశుంగుని నుండి కాపాడి, విశాఖారామం చేరి, అక్కడి నుండి శ్రీలంకకు చేర్చిన మహాకాశ్యప భిక్షు, ఆయనశిష్యుడు చంద్రకీర్తిల వివరణతోబాటు , బౌద్ధ సాహిత్యాన్ని లిపి బద్ధం చేయవలసిన అవసరాన్ని గుర్తించడం, ఆనాడున్న వివిధ మతాలు, మత స్వేచ్చ, బ్రిటిష్ వారు చేపట్టిన త్రవ్వకాలు…. మొదలైన పెక్కు అంశాలను గూర్చి విస్తారంగా చర్చించబడిన “విశాఖ” అన్న కథ అశోకుని తరువాత భారతదేశంలో బౌద్ధం గురించి, బౌద్ధ భిక్షువుల స్థితిని గురించి వివరించే కథ! బౌద్ధంలోని భిక్షుణీ దీక్షను స్పృశించే నేపథ్యం తో అలనాటి కళింగ ప్రాంతపు ఆంధ్రుల వర్తకం, నౌకా వ్యాపారాలను, భిక్షువుల పట్ల గృహస్థులకు ఉండిన భక్తిని వివరించే కథ “పూర్ణ చంద్రోదయం” అన్న కథ!
బుద్ధుడికి ప్రకృతితో నున్న అందమైన స్నేహాన్ని చెప్పే “భద్రం మిత్రమా!” కథ అందమైన అనుభూతిని కలిగిస్తూ ఉండగా, అంతా శూన్యమే అన్న బౌద్ధ సిద్ధాంతానికి అద్దంపట్టే కథ “పిలుపు” అన్న కథ!
1910 లో ఆంధ్ర భారతిలోప్రచురింపబడిన గురజాడ “…మీపేరేమిటి?”కథ నుండి 2025 లో ప్రచురణను పొందిన “పిలుపు” కథ దాకా పరి పరి విధాలుగా బౌద్ధాన్ని దర్శింపజేసిన ఈ కథల్లో . రేపటి తరాన్ని బౌద్ధం ఎలా ప్రభావితం చేయగలదు అని ప్రతిభావంతంగా చెప్పిన మరొకథ, “లిటిల్ బుద్ధాస్” అన్న కథ! అమెరికాలో పిల్లలకు చిత్రలేఖనం నేర్పించే ఒక ఉపాధ్యాయుడు సుధీర్, ఒక గణేశ్ చతుర్థికి బుద్ధుని జీవితాన్ని నిర్యాణం దాకా యాభై మందిపిల్లలతో నాటకంగా వేయించాడు. సైన్స్ ప్రాజెక్టు లలో కూడా పిల్లలకు తగినంత ప్రోత్సాహమిచ్చిన సుధీర్, తన ప్రాజెక్ట్ పూర్తి కావడంతో భారతదేశానికి తిరిగివచ్చిన సుధీర్, చాలా కాలం తరువాత అమెరికాకు వెళ్లవలసి వచ్చింది. ఒకప్పుడు బుద్ధునినాటకంలో రాహులునిగా వేసిన చిన్న పాప, ప్రస్తుతం మెడిసిన్ చదువు తున్న దీక్షితమాటలు, ఇతర విద్యార్థుల మాటలు సుధీర్ కే కాదు మనకు కూడా అంతులేని ఆనందాన్ని కలిగిస్తాయి. ఆ నాటక ప్రభావంతో బుద్ధుని గురించి మరికొంత తెలిసికొన్న ఆ పిల్లలు, అప్పటికే ఒక సేవా సంస్థను, ఓపరిశోధనా సంస్థను స్థాపించుకున్నారని, “పాత్ వే టుఎన్ లైటెన్ మెంట్” అన్న సంస్థ ద్వారా బౌద్ధంపై లోతైన పరిశోధనలు చేయాలని సంకల్పించు కున్నారని, తమతో పాటు ఇతర విశ్వవిద్యాలయాలనుండి మరికొందరు చేస్తున్న పరిశోధనల్లో అంతర్గత ఎజెండా ఒకటే నని…. చాలా కాలం క్రితమే మానవుని దుఃఖ కారణాలను, వాటి నివారణ మార్గాలను బుద్ధుడు చెప్పాడని, దాన్ని సైన్స్ పరంగా రుజువుచేయటమే తన పరిశోధన అని..
అది విన్న సుధీర్, యథాలాపంగా చేజారిన గుప్పెడు విత్తనాలు మొలకెత్తి, గొప్ప వృక్షాలై తీయని పండ్లను ఇస్తాయని తానెప్పుడూ ఊహించలేదని, ఎక్కడో ప్రపంచసింహాగ్రాన నిలబడి, ఆకాశం వైపు కాంతి గోళాలను విసరుతున్నారని, పాత మంచిని, కొత్త పద్ధతిలో ఆవిష్కరిస్తున్న తన విద్యార్థులను మైత్రీధారను ఊపిరిగా పీల్చి మనవలసిందని మనస్సులోనే ఆశీస్సులు పలుకుతాడు.
నిజంగానే ఈ తరం బౌద్ధం గూర్చి ఆలోచించ వలసిన విధానం ఇది.
రెండుపదులకథలతో వెలువడిన ఈ మహాబోధి సంకలనం లో బౌద్ధయుగం నాటి చారిత్రిక, సాంస్కృతిక విశేషాలతో బాటు, బుద్ధుని తరువాత ఆంధ్రదేశంలో బౌద్ధం పొందిన వ్యుత్థాన పతనాలను గురించి కూడా వివరాలున్నాయి. బుద్ధుని కాలంలోనే బౌద్ధం నేటి తెలంగాణా లోని ఆనాటి అస్సకగణతంత్ర రాజ్యం ద్వారా ధక్షిణాపథంలో ప్రవేశించిందన్న చారిత్రక సత్యాన్ని తెలిపే కథలున్నాయి. నేటి సమస్యలను మైత్రీ భావన నిండిన మానవత్వంతో ఎలా పరిష్కరించుకోవచ్చో తెలిపే కథలున్నాయి. నేటి యువత మీద బౌద్ధం ఎలా సానుకూల ప్రభావాన్ని చూపగలదో తెలుపుతూ, దాని కొనసాగింపుగా సమాజానికి ఒనగూరే కరుణతో, మానవత్వంతో కూడిన ప్రయోజనం ఎటువంటిదో తెల్పే కథలున్నాయి. అన్నిటికీ మించి … ఈ కథలను వ్రాసినవారు కథల పట్ల, బౌద్ధంపట్ల అభిమానాన్ని కలిగిన వారే గాని బౌద్ధులు కారు, అయినప్పటికీ బౌద్ధ సాహిత్యాన్ని తెలిసికొని వ్రాసినవారే అన్న అంశం, ఈ పుస్తకాన్ని చదివి ముగించి నపుడు మనకు కలిగే ఆనందం… వీటిని అంచనా వేయడానికి కొలమానాలు లేవు అన్నసత్యం బ్రహ్మానందసహోదరమైన ఆనందాన్ని కలిగిస్తాయి అనడం మాత్రం అక్షరసత్యం!!

డా. రాయదుర్గం విజయలక్ష్మి
డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు కొత్తగూడెంలో తెలుగు లెక్చరర్ గా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాస్ యూనివర్సిటీలో బౌద్ధం మీద PhD చేసి డాక్టరేట్ పొందారు. గతంలో 'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' పుస్తకం వెలువరించారు. వీరి రేడియో ప్రసంగాలను 'పొరుగు తెలుగు బతుకులు' పేరుతొ క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి సహ-సంపాదకత్వం వహించారు. మిసిమి, పాలపిట్ట, సాహితీ స్రవంతి వంటి పత్రికలలో అనేక సాహిత్య విమర్శ వ్యాసాలు ప్రచురించబడ్డాయి.










