కెరటాలు మోసుకొచ్చిన సముద్ర బరువును
బతుకు తీరంవెంట రిటైల్ గా అమ్ముకొన్నట్లు
హోల్సేల్ మార్కెట్ లో కష్టాలకు
మనిషి తాకట్టుదారుడుగా మారిండు
సుఖదుఃఖాలను తిన్న మౌనం
విసిరిన ఒడిసెలరాయి తాకి
గిలగిల కొట్టుకున్న గుండెతడి
వెచ్చటి గతాన్ని
చల్లని వర్తమానంలో ప్రశ్నిస్తుంది
వాదాలకు రవాణా నేస్తమైన నాలుక
రుచుల బేధాలను ఎప్పుడో అన్లోడ్ చేసింది
మాటల తుఫానుకు లొంగి
మానవత్వాన్ని అబద్దానికి అప్పుగా ఇచ్చింది
పలిగిన పాదాలు
నేల ముఖంపై పువ్వులై
వికసిత పరిశోధనలకు ద్వారాలు తెరిచినట్లు
ఊరూ వాడా తేడా లేకుండా
అవినీతిరోడ్లు టోల్ గేట్లను ఎత్తినవి
నిద్రచాలని సోమరితనం
పెట్రోమాక్స్ బల్బుల్లా వెలిగిపోతుంది
గాసం నిండుకున్న ఇల్లు
గోవిందనామాల గడియకై ఎదురుచూస్తుంది
పేదరికాన్ని తినాలని చూసే
నేటి తరం చదువులు
చిలుక్కొయ్యకు వేలాడుతున్న బూజులా
బడి సంచులు చెదపురుగులతో
సహవాసం చేస్తున్నవి
కంచుట్లో చొరబడ్డ ఈగలు దోమలతో
గంజిమెతుకులు వర్గపోరు చేయలేక
పెత్తందారులకు తలవంచినట్లు
ఆకలి చావుకు అడ్రస్ గా మారినవి
పొద్దొంగని నేలపై కొమ్మల సందున
పసిబాలుడై మొలిచిన వెలుతురు పిట్ట
రోజూ కళ్ళముందు మెదలాడే లోకాన్ని
సోషల్ మీడియాగా మారి రికార్డ్ చేస్తున్నాడు
పేల్లుపేళ్లుగా కన్నోళ్ల కలలు కూలుతున్నవి
కుంపటిలోని ఉనుకలా మానవీయత
బూడిద కుప్పలై రాలిపోతున్నవి
కాలం విషనాగు పడుగలా సాగుతుంది
మనిషి బరువైన నీడను
మోయలేక పోతున్నడు
సవాళ్ల నిప్పులపై
నిలదొక్కుకుని నడుస్తలేడు
అందుకే మనిషితనంపై ఆడిట్ జరగాలి
ఓ దిక్కు సంఘర్షణల సర్జికల్ స్ట్రైక్
వెచ్చటి నెత్తురుపూటిక ఇంకో దిక్కు
చిత్తడిలా పేరుకుంటున్న
ఆలోచనల చెత్తబుట్టను
డంపింగ్ యార్డు కు పంపాలి
నిత్యం మానవ నైజంపై ఆడిట్ జరగాలి

