“రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించడం కంటే కూడా తన సమాజం అంతరాత్మగా ప్రతిధ్వనించడమే ముఖ్యం”…. అన్న గోర్కీ మాటలకు నిలువెత్తు ఉదాహరణ చింగీజ్ ఐత్ మాతోవ్ (12-12-1928—-10-06-2008) అన్న రష్యన్ రచయిత. ఒక రచయిత నిబద్ధతకు కొలమానం, ఎటువంటి భేషజాలూ లేకుండా మార్పును ఆహ్వానించడం, ఆవిష్కరించడమేనని నమ్మిన వారు, చింగీజ్ ఐత్ మాతోవ్…! కళాత్మకమైన దార్శనికతలో ఎంత సాధించవచ్చో, దానికున్నశక్తిసామర్ధ్యాలేమిటో, నిరూపించిన రచయిత కూడా! ఈ ప్రపంచానికి ఆయన పరిచయం చేసింది, ఒక అనామకమైన ప్రాంతాన్ని, అక్కడి జీవితాలనే కాదు, ప్రేమ, శాంతి, సమానత్వాల సాధన దిశగా, విశ్వమానవాళి ముందున్న ఉమ్మడి సవాళ్లను కూడా! అయితే సమాజంలో కనిపించే లోపాలు రాజకీయ వ్యవస్థలోనివి కావు అంటూనే, స్వాభావికంగా మానవ నైజంలో భాగమైన వీటిని చక్కదిద్దవలసిన బాధ్యతమాత్రం వ్యవస్థదేనని వాదించేవారు.
తమ రచనల ద్వారా, తమ ప్రాంతమైన కిర్గిస్థాన్ వంటి అప్పటి అనామక ప్రాంతాన్ని, ప్రపంచపటం మీద ఒక గుర్తింపుతో, నిలిపిన రచయిత ఆయన. కిర్గీజ్, రష్యన్ రెండు భాషల్లోను, రచనలు చేసిన వీరి తొలి నవల,’ జమీల్యా’! తరువాత వెలసిన , వీరి ‘తొలి ఉపాధ్యాయుడు’, ‘తల్లి-భూదేవి’ వంటి నవలలు కూడా నూటయాభై ప్రపంచ భాషల్లోకి అనువదింప బడటమే కాదు, ఇప్పటికీ సమకాలీన సమాజానికి అద్దం పడుతున్నాయి అనడం అతిశయోక్తి గాదు. ఆధునికతను అక్కున చేర్చుకునేదెలాగో, ఆమోదయోగ్యంగా చర్చించడమే, వీరి రచనలకు ప్రధాన బలం. ఓ కమ్మ్యూనిస్టు రచయితగా మిగిలిపోకుండా, అన్ని రకాల భావజాలాలకు చెందిన ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారంటే, సమాజంలో వస్తున్న మార్పునూ, ఆ సామాజిక సర్దుబాటును, తమ రచనల్లో ఒడిసి పట్టడంలో వారు చూపిన ప్రతిభ ప్రధాన కారణం . (ఆధారం: రచయిత పరిచయం).
బాల్యంలో నాన్నమ్మ పరిచయం చేసిన కిర్గిజ్ ప్రాంతపు ఆచారాలు, సంప్రదాయాలు, గిరిజన సంస్కృతితో బాటు, తల్లి ద్వారా పరిచయం అయిన రష్యన్ సాహిత్యము, సంస్కృతి ఆయనపై ప్రభావాన్ని చూపాయి. సంప్రదాయాలకు, ఆధునికతకూ మధ్య తలెత్తే వైరుధ్యాలకు, ఒత్తిళ్లకు అద్దంపడుతూనే, సంక్షుభితమైన తనజాతి జన జీవితాలు వీరి రచనల నిండా పలుకరిస్తాయి. అందుకే వారి రచనలలో, పైకి అసాధారణ మైన సున్నితత్వం, కవితాత్మకత ఉట్టిపడుతూనే, అంతఃస్రవంతిగా, సమకాలీన దృక్పథమూ వెల్లివిరుస్తుంటుంది. “కేవలం వ్యక్తిగా మనం ఎంత మార్పును తేవచ్చో చూపారాయన” అని నమ్ముతారు కిర్గీజ్ ప్రజలు, ఈ రచయితను గూర్చి.. దీనికి అచ్చమైన ఉదాహరణగా వీరి ‘తొలిఉపాధ్యాయుడు’ నవలలోని ‘ద్యూయ్ షేన్’ ను చెప్పుకోవచ్చు.
‘కొమ్ సామోల్’ సభ్యుడిగా, కిర్గీజ్ లోని కుర్కురేవు అన్న కొండ ప్రాంతానికి చెందిన గ్రామంలో పిల్లలకు చదువు నేర్ప డానికి, ప్రభుత్వ ఉత్తర్వును పట్టుకొచ్చిన ద్యూయ్ షేన్, ఆ పల్లెలో అక్షర సౌరభాన్ని వెదజల్లిన, తొలి ఉపాధ్యాయుడు. విద్యార్థులలోని ప్రతిభను గుర్తుపట్టి, సమాజానికి ఎదురునిలిచి పోట్లాడి, వారిని తాష్కెంటుకు పంపి, ప్రభుత్వంచేత పైచదువులు చెప్పించిన గురువు, “వెధవ చదువులు మాకొద్దు,” అని యీసడించిన ఆ గ్రామంలో, కాలక్రమంలో బడిని నిర్మించుకోగలిగిన స్థాయికి వలసిన అక్షర మాధుర్యాన్ని పంచినవాడు. తరువాతి తరాల దృష్టిలో, అక్షరమాలలోని అక్షరాలన్నీ రానివాడని, ఎద్దేవా చేయబడినా తనదైన స్వేచ్ఛాపద్ధతిలో అక్షరాలను నేర్పి, పిల్లలలో చదువుపట్ల ఉత్సాహాన్ని నింపిన కళామూర్తి. అయితే ఈ స్థాయికి రావడానికి ముందు ద్యూయ్ షేన్ ఎదుర్కొన్న ప్రతికూలతలు, దానిని గడచిరావడంలో చూపిన సాహసాలు మాత్రం…ఒక ఆదర్శవంతుడైన గురువుకు నమూనాగా అతనిని నిలుపుతాయి.
మొదటిసారి బడిని గురించి మాట్లాడడానికి గ్రామస్థులను సమావేశ పరచిన అతడు, వారినుండి నిరసననే ఎదుర్కొ న్నాడు. ఆశ్చర్య పోయిన అతడు తేరుకొని, “అయితే సోవియట్ ప్రభుత్వ శాసనాలను ధిక్కరించే వారు మీలో ఎవరు? మనం కారు చీకటిలో ఉన్నాము. వెలుగులోనికి రావాలంటే, చదవను, వ్రాయను నేర్చుకోవాలని ప్రభుత్వం కోరుతు న్నది. మన తరువాతి తరాలనైనా వెలుగు దారిలో నడవనిద్దాం, చదువును నేర్పి”అని వారిని నయానా, భయానా ఒప్పించాడు. ఊరి బయట ఏరు దాటిన తరువాత దిబ్బ మీద నున్న పాడుబడిన గుర్రపు శాలలో బడిని పెట్టవచ్చునన్న అతనితో, “నీకు మనసుంటే, నువ్వు బడి పెట్టుకో, శాసనాన్నిఎదిరించడ మెందుకు?” అని అర్థ మనస్కతతోనే అయినా ఆ గ్రామస్థులు అంగీకరిం చడం, అతడు సాధించిన తొలి విజయం. “ఏటిమీద చిన్న వంతెన కట్టడానికి ఊరివారి శ్రమదానం కావాల”నిఅంటూ ఉండగానే, “ నీ తంటాలేవో నువ్వు పడవోయ్, మాకు చేతినిండా పని ఉంది…” అని అంటూ వారందరూ లేచి వెళ్ళి పోయినా, నిరాశపడని ద్యూయ్ షేన్, తానే ఒంటరిగా కష్టపడి ఆ గుర్రపు శాలకు, చుట్టూ మొలిచిన ముళ్ల మొక్కలను కొట్టివేసి, గోడలకు మట్టి మెత్తి బాగుచేసి, నేలమీద పిల్లలు కూర్చోవడానికి అనువుగా గడ్డిని పరచి, బడిని సిద్ధం చేస్తాడు.
ఊరికటువైపున్న అడవిలోనికెళ్లి, ఎండిన పేడకళ్లను ఏరుకు వచ్చే, ఆడపిల్లల గుంపు, బడిగా రూపుదిద్దుకుంటున్న, ఆ శాల దగ్గరకు వస్తారు. తమను చూడగానే, “అమ్మాయిలూ! ఈ బడి మీది. బడికి వస్తారా?”అని , చిరునవ్వుతో తమను పలకరించిన, ద్యూయ్ షేన్ ను చూసి, వారిలో అందరికన్నా పెద్దదైన, అల్తినాయ్, తన కక్కి(పిన్ని) ఒప్పుకుంటే తాను వస్తానని ధైర్యంగా చెబుతుంది. చిన్నప్పుడే తలిదండ్రులను కోల్పోయి, చిన్నాన్న దగ్గర పెరుగుతున్న అల్తినాయ్ జీవితంలో ఆ క్షణం చాలా గొప్పది. ఆమెను బడికి పంపనన్న పినతల్లి మాటలను కాదని, ఆమె పినతండ్రి ఆమెను బడికి పంపడానికి ఒప్పుకోవడం, ఆమె జీవితాన్ని మలుపు త్రిప్పిన సంఘటన. “ఈ అమ్మాయి, మీకు అవసరం లేక పోవచ్చు గాని, సోవియట్ ప్రభుత్వానికి ఈమె అవసరం ఉంది” అని తనపట్ల నమ్మకాన్ని చూపిన ఆ గురువు అంటే ఆమెకు కూడా చాలా ఆరాధన!.
తన విద్యార్థులకు అక్షరాలతోబాటు, బయటి ప్రపంచాన్ని కూడా పరిచయం చేసిన గురువు అతడు. ఆకొండలకు వెలుపల, విశాల ప్రపంచముందని, సముద్రాలున్నాయని, భూమిలో నుండి త్రవ్వితీసిన దానినుండి తయారు చేసినదే తాము రోజూ వాడే కిరోసిన్ అనీ…సోవియట్ నేత లెనిన్ వ్యక్తిత్వం గురించీ…ఇలా ఎన్నో విషయాలను వాళ్ళకు చెప్పి వాళ్ళను ఆ గ్రామపు పొలిమేరలు దాటించి, విశాల విశ్వంలో తామూ భాగస్వాములుకావాలన్న ఆశలను వారిలో నింపుతాడు. ప్రజలు సౌఖ్యప్రదంగా జీవించినప్పుడు, ఈ బడి ఊరిలోపలే తెల్లభవనం లోనికి మారుతుందని, అపుడు అందరూ మేజాలు, బల్లల వంటివాటిని పట్టణాలలో వలె వాడుకోవచ్చని వారి కళ్ళముందు కొత్త ప్రపంచాన్ని నిలుపుతాడు. నెలకొకసారి, తాలూకా ముఖ్య నగరానికి వెళ్ళినపుడు, మరునాడు ఎప్పుడు బడికి వెళ్ళి ద్యూయ్ షేన్ని చూద్దామా అని పిల్లలు పడే తపన కన్న మించిన బహుమానం ఒక గురువుకు వేరే ఏముంటుంది? త్వరత్వరగా అక్షరాలను నేర్చుకోవాలని, ఇసుకమీద, బొగ్గుతో గోడలమీద రుద్ది, రుద్ది నేర్చుకొనే ఆ పిల్లల ఉత్సాహానికి మించిన జీవన సౌందర్యంతో సమానమైది వేరేది? ఇవన్నీ గురువుగా అతడు సాధించిన విజయాలను గానం చేయడం లేదా?!
అందరికన్నా వయసులో పెద్దదైన, అల్తినాయ్ చదువులో చూపించే చురుకుదనాన్ని గుర్తుపట్టి, “నిన్ను పెద్ద పట్నానికి పంపించగలిగితేనా! ఎంతదానవవుతావో!” అని చెప్పడం, అతనిలోని శిష్యుల ప్రతిభను గుర్తుపట్టే లక్షణానికి ప్రతీక. అవసరం వచ్చినపుడు, శిష్యులకు ఆసరాగా నిలవడం మంచి గురువు లక్షణంకూడా. అల్తినాయ్ కి వాళ్ళ పిన్ని, సంచారజాతికి చెందిన వ్యక్తితో, రెండవ భార్యగా పెళ్లికి ఏర్పాటు చేసినపుడు, ఆమెను , వాళ్ళ అమ్మమ్మ తరఫున దూరపు చుట్టాలింటిలో నుంచి ఆమె తరఫున వాళ్ళ పిన్నితో , ‘ఆమెకు మంచి భవిష్యత్తు ఉందనీ, దానిని పాడుచేయవద్ద”ని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు. అల్తినాయ్ దుఃఖాన్ని పోగొట్టడానికి, రెండు పోప్లార్ మొక్కలను తెచ్చి ఇద్దరూ కలిసి నాటి, అవి పెరిగి వచ్చేటప్పటికి, నువ్వు ఉజ్జ్వల భవిష్యత్తులో ఉంటావని , ఆమెకు ధైర్యాన్ని నూరి పోస్తాడు.
వాళ్ళ పిన్నిద్వారా, ముగ్గురు మనుష్యులతో వచ్చి, ద్యూయ్ షేన్ ని కొట్టి, అల్తినాయ్ ని తీసికెళ్లిపోయిన ఆ సంచారతెగ నుండి , మూడు రోజులతరువాత, మిలీషియన్ల సాయంతో ఆమెను విడిపించి తీసుకు వస్తాడు. అమాయకంగా, పసిపాపలా ఉండిన అల్తినాయ్, తాను మలినమయ్యానని తలెత్తుకోలేకపోతుంటే, ఆమెను ఓదారుస్తూ, “అల్తినాయ్! జరిగిందంతా మరిచిపో. ఇహ ఎన్నటికీ ఆ జ్ఞాపకం తెచ్చికోకు. ఓ మాటు శుభ్రంగా స్నానం చేశావంటే, మనస్సు తేలిక పడుతుంది” అంటూ జేబులోంచి చిన్న సుబ్బుముక్కను తీసిచ్చి, ఆమెకు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని నేర్పిన మహా గురువు అతడు. ప్రభుత్వంతో మాట్లాడి, ఆమెను తాష్కెంటులో బడిలో చేర్పించడానికి, ఒక ఆడ మిలీషియన్ కు అప్పగించి, రైలెక్కించాడు. “ఏడవకు, నా తల్లీ! నీకు గొప్ప భవిష్యత్తు ఉంది. మనిద్దరం కలిసి నాటిన, పోప్లార్లను నేను పెంచుతాను. నువ్వు పేరుప్రతిష్టలు సంపాదించుకుని, గొప్పదానివై తిరిగి వచ్చేటప్పటికి, అవి ఎంత అందంగా ఉంటాయో నువ్వే చూద్దువుగాని” అని వీడ్కోలు పలుకుతాడు. ఆ గురువు తీసికొన్న భాధ్యతకు మన కనులు తడుస్తాయి. తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ గా, విశ్వవిద్యాలయంలో ఆశాఖాధ్యక్షురాలిగా ఎదిగిన అల్తినాయ్, ఆ ఊర్లో, గ్రామ సమిష్టి క్షేత్రంలో నిర్మించుకున్న పాఠశాల ప్రారంభోత్సవానికి రావడం, ఒక గురువు కల సాకార మైనదానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తూంది. అవకాశం వస్తే, ఎటువంటి వారైనా ఎన్ని ఎత్తులను అధిగమించగలరో నిరూపించే కథ ఇది. కానీ వారికి, ద్యూయ్ షేన్ వంటి, నిర్వ్యాజోత్సాహ శీలురు అవసరమవుతారు.
వంద పుటల ఈ నవలను ముగించేటప్పటికి, మనస్సు కరిగి నీరవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని, కాలు దెబ్బ తిని, మళ్లీ కుర్కురేవు గ్రామం లోనే, ఉత్తరాలు బట్వాడా చేస్తున్న డ్యూయ్ షేన్ , ఆ ఊరి తొలి గురువని ఆ ఊరి ప్రజలు చాలామందికి తెలియదు. పాఠశాల ప్రారంభోత్సవంతో ప్రారంభ మైన ఈ నవల, ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో, ఆ ఊర అక్షర పరిమళాలను వెదజల్లిన ద్యూయ్ షేన్ గురించి, సంప్రదాయపు సంకెలలను ఛేదించుకొని, ఆధునికతవైపు ఆ ఊరు సాగించిన ప్రయాణంలో అతడి పాత్రను గురించి వివరిస్తుంది.
చివరగా ఒకమాట! ఇది తెలుగు నవలే అన్నంతగా అందమైన అనువాదాన్ని అందించిన వుప్పల లక్ష్మణరావు గారికి, 1962 లో తొలి ముద్రణను పొందిన ఈ నవలను తమ తొలి తెలుగు ముద్రణగా 2008 లో అందించిన హైదరబాద్ బుక్ ట్రస్ట్ వారికి, కృతజ్ఞతలను చెప్పకుండా ఉండలేము.
డా. రాయదుర్గం విజయలక్ష్మి
డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు కొత్తగూడెంలో తెలుగు లెక్చరర్ గా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాస్ యూనివర్సిటీలో బౌద్ధం మీద PhD చేసి డాక్టరేట్ పొందారు. గతంలో 'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' పుస్తకం వెలువరించారు. వీరి రేడియో ప్రసంగాలను 'పొరుగు తెలుగు బతుకులు' పేరుతొ క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి సహ-సంపాదకత్వం వహించారు. మిసిమి, పాలపిట్ట, సాహితీ స్రవంతి వంటి పత్రికలలో అనేక సాహిత్య విమర్శ వ్యాసాలు ప్రచురించబడ్డాయి.