ఏకం!

Spread the love

ఎప్పుడు కార్లో వెళ్తున్నా ఏవో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఓ ఐదుగురు మనుషులు అంత ఇరుగ్గా తమ శరీరాల్ని కుదించుకొని కూర్చోవాల్సిన పరిస్థితి కార్లో తప్ప ఇంకెక్కడా ఎదురుకాదు. మానవజాతి చరిత్రలోనే ఇలాంటి వింత పరిస్థితి మునుపెప్పుడూ లేదు.

పూర్తిగా ఛార్జి ఐన బేటరీలో ఉండే స్థిర విద్యుత్తులా భావజాలం మన లోపలెప్పుడూ నిండి ఉంటుంది. ఒకరినొకరు మాటల్తో తాకగానే మార్పిడి మొదలవుతుంది. ఏక ధ్రువాలు దూరం జరిగి భిన్న ధృవాలు ఆకర్షించుకుని, మళ్ళీ కలసినవన్నీ దూరం జరిగి – చివరికి మిగిలేవి ఎడతెరిపిలేని మాటలే! కారులో చాలా దూరం కలిసి ప్రయాణం చేసేప్పుడు మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గర అవుతారు. అలానే ఒకరి నుంచి ఒకరు దూరంగా కూడా అవుతారు!

సాహిత్యంలో భావజాలానికున్న స్థానం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. జె.కరుణాకర్ కథలతో మొదలైనాయి మా మాటలు. ‘ఆయనవన్నీ ఒక భావజాలం నుండి పుట్టిన కథలు’ అని గోపాలన్ కొద్దిగా విసురుగా చెప్పాడు. అది తమిళ సాహితీలోకంలో ఎడతెరిపి లేకుండా నలిగిపోతూన్న అయిదు రూపాయల నోటు లాంటి ఒక చర్చాంశం. ఎన్నో చేతులు మారి మాసిపోయి చివరలు నలిగి పోయిన నోటు లాంటిది!

“భావజాలం లేకుండా సాహిత్యం లేదు. ఈ మధ్యన ఏ భావజాలమూ లేకుండా రాయడమే లక్ష్యమంటూ కొందరు ప్రయత్నించారు. అది లోలోపల అదుపు చేసిపెట్టుకుని వదిలిపెట్టిన అపానవాయువులాంటిదని ఇప్పుడు అర్థమవుతూ ఉంది” అన్నాను. ఇలా మనం చెప్పాలనుకున్నదాన్ని ఒక పదునైన ఉపమానంతో పోల్చి చెప్పేస్తే ఆ తర్వాత మాట్లాడ్డం సులభం.

“భావజాలమేదైనప్పటికీ దాన్ని ఎలా చెప్పారన్నదే సాహిత్యానికి కొలబద్ద. ఏకపక్షంగా సాగే భావోద్వేగంతో చెప్పారా? అవతలి వైపును చూపించకుండా కేవలం ప్రచారంలా ఉందా? అందరూ వెలిబుచ్చే సాధారణమైన అభిప్రాయంలా ఉందా? సాహిత్యపు పరిధిని దాటి రాజకీయ, సామాజిక, వ్యక్తిగత వాదాలను బలవంతంగా తెచ్చి పెట్టినట్టుందా? చూడాల్సింది వీటినే! వీటిల్లో దేనికి సమాధానం అవునని వచ్చినా అది సాహిత్యం కాదు.”

“ఒక రచయిత తనకు తాను తెలుసుకున్న ఒక కొత్త విషయాన్ని కథలో చెప్పినట్లైతే అది గొప్ప సాహిత్యం అవుతుంది. అలా రాయబట్టే టాల్‌స్టాయి, దస్తోవ్స్కీ, థామస్ మన్రో, విక్టర్ హ్యూగో వంటి వాళ్ళు మాస్టర్స్ అయ్యారు.” నేనిలా కొంత శ్రమపడి చేసిన నిర్వచనం నాకు పూర్తి సంతృప్తినిచ్చింది.

మాటల మధ్య కొంచెం విరామం వచ్చినప్పుడు చర్చిస్తున్న విషయానికి బ్రేక్ పడింది. అఱివు స్టీరింగును త్రిప్పినపుడు అతని మోచేయి నాకు తగిలింది. కారు సిగ్నల్ దగ్గర కుడివైపుకు మళ్ళింది.

“సరే, ఇంక సాహిత్యం గురించి చాల్లే. ఈ కారు లోపల సాహిత్యపు ఘాటు ఎక్కువైంది” అన్నాడు సుందర్.

“ఇలా ఒకరినొకరు ఒరుసుకుంటూ ఇరుక్కుని కూర్చోవాల్సిన పరిస్థితులు ఈ భూమ్మీద ఇంతకు ముందెప్పుడైనా ఉన్నాయా?” అన్నాను.

“గుహల్లో బతికే కాలంలో ఇలానే ఉండుంటుంది” అన్నాడు కృష్ణస్వామి.

“తిరుకోవిలూర్లో ఒకసారి ఇలాంటిదే జరిగింది. పొయ్‌గై ఆళ్వార్ ఒకసారి వానలో ఒక ఇంటి ముందున్న చిన్న అరుగుపై ఒద్దికగా తల వాల్చారు. అపుడు బూతత్తు ఆళ్వారు అక్కడికి వచ్చి తను నిలబడటానికి కొంత చోటడిగారు. ‘ఒక్కరైతే పడుకోవచ్చు. ఇద్దరైతే కూర్చోవచ్చు, రండి!’ అంటూ ఆయన జరిగి చోటిచ్చారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నపుడు పేయాళ్వారు అక్కడికి వచ్చి తనగ్గూడా కొంత చోటిమ్మని అడిగారు. ‘ఒక్కరైతే పడుకోవచ్చు. ఇద్దరు కూర్చోవచ్చు. ముగ్గురు నిలబడవచ్చు’ అని చెప్పి సర్దుకున్నారు. ముగ్గురూ ఒకర్నొకరు ఒరుసుకుని నిలబడి శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ మాట్లాడుకుంటున్నారు.”

“నాలుగో మనిషి అక్కడి కొచ్చుంటే ఏదో ఓ కొత్త వేదాంతమో సిద్ధాంతమో పుట్టుండేది” అన్నాను. “లేదా ఒక హత్య జరిగి ఉండేది.”

“నాలుగో మనిషిగా వచ్చింది సాక్షాత్తు శ్రీమహావిష్ణువే అని నానుడి. వాళ్ళప్పుడు అక్కడ నిలుచున్న ఆ స్థలమే ఇప్పుడు ఉలగళంద పెరుమాళ్ దేవళమైంది” అన్నాడు సుందర్.

“శ్రీమహావిష్ణువేంటి? అలా కొట్లాడుకునే చోటికి రావడమేంటి? ఏకాంతంగా ఉన్న చోటికే కదా శ్రీ మహావిష్ణువు వచ్చేది?” అని రాఘవన్ అడిగాడు.

“ఏకాంతం అంటే ఏమిటి? ఏక – అంతం. ఒకటి మాత్రమే మిగిలుంది అని! వాళ్ళు ముగ్గురూ మాట్లాడి మాట్లాడి చివరికి చేరుకున్న చోట ఒకటి మాత్రమే మిగిలుంది. అదే శ్రీమహావిష్ణువు!” అన్నాడు సుందర్.

“జె.కె. ఇలా పెళ్ళిళ్ళకు వస్తారా? నేనెప్పుడూ చూడలేదు” అన్నాను.

“అవును, నాకూ ఆశ్చర్యంగానే ఉంది! ఆఖరికి తన కూతురి పెళ్ళిలో ఆయన కనబడ్డా ఆశ్చర్యపోతాను నేను” అన్నాడు రాఘవన్.

“దయాళన్ ఆయనకు చాలా దగ్గరి మిత్రులు. రాకపోకలు తప్పనిసరి కదా! జె.కె. ఇలాంటి విషయాల్లో చాలా కలివిడిగా ఉంటారు. ఆయన స్నేహితులంటే చాలా ఇష్టపడతారు” అన్నాడు అఱివు.

“ఔనౌను. ఆయన స్నేహితులంతా గత యాభై అరవై ఏళ్ళుగా కలిసి మెలిసి ఉన్నారు” అన్నాడు సుందర్.

“ఇలాంటి లౌకిక విషయాలతో ఆయన్ను ముడిపెట్టడం కష్టంగా ఉంది. ఆయన రాసింది ఇలాంటి సాంసారిక విషయాల గురించే అయినప్పటికీ ఆయన వీటికి అతీతుడు. వేరే ఎక్కడో దూరంగా నిల్చుని ఇదంతా గమనిస్తూ ఉంటారు” అని జత కలిపాడు రాఘవన్.

“పెళ్ళనేది కేవలం లౌకిక విషయమా ఏమిటి? అందులో కూడా ఒక పరమార్థం ఉంది కదా?” అన్నాడు గోపాలన్.

“పెళ్ళిలోనా? చూడబోతే చివరికి ఫస్ట్ నైట్ అనేదే పరమార్థం అని చెబుతారు కాబోలు” అన్నాను.

“కాదు, నిజంగానే! పెళ్ళి తంతులో ఓ గొప్ప ఎలివేషన్ ఫీల్ ఉందనేది నా అభిప్రాయం. ఏదో ఉంది… అందులో” అన్నాడు గోపాలన్. “పెళ్ళనేది ఎంత ప్రాచీనమైన ఆచారం? జాగ్రత్తగా గమనిస్తే పెళ్ళి మంత్రాలకు మూడువేల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ ఆచారాలన్నీ ఏదో ఉద్దేశ్యంతో నిర్దేశించారనిపిస్తుంది. కవితాత్మకమైన ఒక గొప్ప నాటకంలానో… ఒక ఆదర్శవంతమైన ఆచారంలానో… అందులో ఏదో పవిత్రత ఉంది!”

“పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవుతాయి.”

“అవునవును, షడ్రసోపేతమైన విందు భోజనాలు మాత్రం కేటరింగ్ వాళ్ళు నిర్ణయిస్తుంటారు.”

“నేను ఏదో తమాషాకనడం లేదు. సీరియస్‌గానే చెప్తున్నాను. వివాహ జీవితం కేవలం లౌకికం మాత్రమే అని అనుకోను. చెప్పాలంటే ‘సంసార సాగరం… భవ బంధాలు…’ అని మనం చెప్పుకునేదంతా పెళ్ళి గురించే. కానీ పెళ్ళి అలాంటిది కాదు. ప్రేమా అలాంటిది కాదు. ఇద్దరు వ్యక్తులు ‘మనం మన జీవితాల్ని పంచుకుందాం. మన మనసుల్ను ఒకరికొకరు పూర్తిగా ఇచ్చిపుచ్చుకుందాం’ అనుకునే ఆ సందర్భం సామాన్యమైనది కాదు. కానీ పెళ్ళిలో దైవీకమైనదేదో ఒకటుంటుంది. ఆ ‍డివినిటీని కొందరు జీవితాంతం అనుభవించకపోవచ్చు. కానీ పెళ్ళప్పటి ఫోటోల్లో చూస్తే వాళ్ళు ఒక తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు” అన్నారు గోపాలన్ .

“మొహాల మీద ఫోకస్ లైట్లేస్తారుగా!”

“సరే! ఇంక నేను మాట్లాడేదేముంది?”

“లేదు, లేదు మీరు కానివ్వండి. క్రిష్, మీరు ఊరుకోండీ!”

“ఇంకేం లేదు.”

“లేదు, చెప్పండి. వినడానికి ఏదో బావుంది.”

గోపాలన్ కొనసాగించాడు “ఈ మనస్సనేది ఉందే… అది చాలా ప్రైవేట్. అంతకంటే ప్రైవేట్ – మనుషుల జీవితాల్లోని సుఖదుఃఖాలు. అలాంటప్పుడు ఇలా ఇద్దరు కలిసి ప్రతిజ్ఞ చెయ్యడం యావత్ ప్రకృతినే సవాలు చెయ్యడం కాదా?”

“అదే చెబుతున్నాను. ఇట్స్ ఆల్ సో అన్నేచురల్ అని!” అన్నాడు రాఘవన్.

“ఔను. అలాగైతే సాహిత్యం, సంగీతం అన్నీ మనం సృష్టించుకున్నవే… అన్నేచురల్. ధ్యానం, తపస్సు ఇవన్నీ కూడా అన్నేచురలే. ఇవన్నీ కూడా మనిషి ఊహలు, ప్రయత్నాలు మాత్రమే. ‘యోగ చిత్తవృత్తి నిరోధః’ అని పతంజలి అంటారు కదా. చిత్తవృత్తి మాత్రమే ప్రకృతి సహజమైనది. దాన్ని నిరోధించాలని చేసే యోగం కృత్రిమమైనది.”

ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే గోపాలన్ అంత తీవ్రంగా మాట్లాడుతుంటే మిగిలినవాళ్ళు నిశ్శబ్దంగా  ఉన్నారు.

“నేనొక మాట చెప్పనా?” అన్నాడు రాఘవన్.

“చెప్పండి!” అన్నాను.

“లేదు. నేను ఏమైనా అతిగా మాట్లాడినట్లు అనిపిస్తే క్షమించాలి. ఎందుకంటే మీరు పెద్దలు, పిల్లాజెల్లా కలిగిన వాళ్ళు.”

“ఛ, ఛ, ఉత్తి మాటలే కదా? పర్లేదు, చెప్పండి.”

“గోపాలన్ చెప్పింది నిజమే! ప్రకృతికి వ్యతిరేకంగా చేసే ఒక సంకల్పమే పెళ్ళి. అయితే మానవుడు పెళ్ళిని ఎందుకు అంగీకరిస్తున్నాడు? ఏ విధమైన సానుకూల దృక్పథంతోనూ కాదు. పూర్తిగా భయంతో మాత్రమే. మనిషికి జన్మతః సంక్రమించింది ఒంటరితనమే. దీనికి ఆల్టర్నేటివ్  లేదు. సంపూర్ణమైన ఏకాంతం! దాన్నెవరూ మార్చగలిగింది లేదు. ఆ ఏకాంతానికి భయపడే వాడొక సమాజాన్నంటూ సృష్టించుకున్నాడు. కుటుంబాన్ని ఏర్పరచుకుంటున్నాడు. తన సొంత వాళ్ళు… తనకంటూ ఓ జాతి… పిల్లలు… అన్నీ దాని కోసమే!”

“అయితే వాడికి తెలుసు, ఇదంతా తాను సృష్టించుకున్న మాయేనని… ఎప్పుడో ఒకప్పుడు తొలిగిపోతుందని! అందుకని వాడే ఈ వ్యవస్థను వీలైనంతవరకు మరింత దృఢపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. బాసలు చేస్తాడు. సంకల్పిస్తాడు. దాని చుట్టూ ఆచారాలను ఏర్పరచుకుంటాడు. పెద్దల మీద ప్రమాణాలు చేస్తాడు. దేవతల మీద ఒట్లు పెడతాడు. నిప్పు, నీరు, మట్టి సాక్ష్యాలుగా ప్రమాణాలు చేస్తాడు. అదికూడా చాలదని ఊరందర్ని పిలిచి భోజనాలు పెట్టి మరీ ఒట్లు పెడతాడు. అంతకు మించి రిజిస్టర్ ఆఫీస్‌కు వెళ్ళి ప్రభుత్వానికి కూడా కాయితం రాసిస్తాడు. ఎందుకంత భయం? ఇదేదో పెద్ద పవిత్ర కార్యం అని చెప్పడానికి అసలేముంది ఇందులో?” రాఘవన్ అడిగాడు.

అతను బాగా వాదించగలడు. ఆ మాటల వల్ల మేము కొంత ప్రశాంతతను కోల్పోయాం. అందుకని అందరం కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాం.

“మీరు చెప్పారు కదా? సాహిత్యం, కళలు, ఆధ్యాత్మికత అన్నీ కూడా ఆ ఒంటరితనాన్ని తరిమివేసేందుకే అని! ఒక మనిషి ఇంకో మనిషి మనస్సులోకి ప్రవేశించడం కుదరదు. నేరుగా కుదరదు కనుక దొడ్డి దారిలో ప్రవేశించాలని అనుకుంటున్నాడు. కిటికీల్లోంచి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఇంటి కప్పుకు కన్నం చేసి లోపలికి దూకాలని ప్రయత్నం చేస్తాడు. అవే కోవకు చెందినవి కదా… కళలు, సాహిత్యం, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా” అన్నాడు రాఘవన్.

“ఎంత ప్రయత్నించినా ఒక మనిషి మరో మనిషితో పరిపూర్ణమైన సంబంధాన్ని ఏర్పరుచుకోడం వీలుకాని పని. అనుమానమే అక్కర్లేదు. మనిషి గట్టిగా సీలు వేసిన గంగాజలమున్న పాత్ర లాంటివాడు. లోపలికి వెళ్ళడానికి దారే ఉండదు” అన్నాడు రాఘవన్.

“గంగాజలం ఉండే పాత్రను ఆఖర్నెప్పుడో కదా పగల గొడతారు?” అన్నాడు సుందర్. ఆయనెందుకు ఆ మాటన్నాడో ఎవరికీ అర్థం కాలేదు.

“పెళ్ళి మంటపాన్ని చేరుకున్నాం. కొంచెం నవ్వు మొహాలు పెట్టుకోవచ్చుగా!” అన్నాడు అఱివు.

“మనమేమైనా పోట్లాడుకున్నామా? గోపాలన్ హండ్రెడ్‌వాలా టపాసుల సరాన్ని ముట్టిస్తే దాని మీద రాఘవన్ థౌజెండ్‌వాలా సరం వేశాడు. మన చెవులు మూసుకు పోయాయి. అంతేకదా!” అన్నాడు సుందర్. “ఒక మైసూరుపాకు నోట్లో వేసుకుంటే అన్నీ తెరుచుకుంటాయి. ఇప్పుడేమైందనీ?”

“జె.కె. వచ్చారా?”

“వచ్చుంటే తెలిసేదిగా?”

వాకిట్లో దయాళన్ మాకు స్వాగతం పలికాడు. “రండి, రండి. లోపలికి రండి.”

ఆయనే మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళాడు. చాలా పెద్ద కళ్యాణ మంటపమది. ఒక పెద్ద మైదానంలా ఉంది. నిండా జనం. ఎక్కువభాగం ఆడవాళ్ళు. పట్టు చీరలతో ఆ మంటపం అంతా రంగురంగుల సీతాకోక చిలుకలతో నిండి పోయినట్టుంది. 

ఎదురుగా మండపానికి చివర వధూవరులు నిలబడున్న వేదికుంది. పెళ్ళి కూతురు వేషధారణ పురాతన కాలం ఉత్తర భారద్దేశపు మహారాణిని తలపిస్తూ ఉంది. నిండు జరీ బట్టలు. ఎర్రటి మేకప్. అలంకరించిన శిరోజాలు. మెరిసే రాళ్ళ నగలు. పెళ్ళి కొడుకు ఒంటి మీద అప్పుడే యూరప్ నుండి దిగొచ్చాడా అన్నట్టు లేత నీలిరంగు సూటు, మెరిసిపోతున్న బూట్లు!

“తూర్పు పడమరల సంగమంలా!” అన్నాను.

“ఔను. మునుపైతే ఆ సూట్ అలాగే బీరువాలో ఉండేది. మా నాన్న ఇప్పటికీ దాచి పెట్టుకోనున్నాడు. ఈ రోజుల్లో కనీసం ఫరవాలేదు; ఎప్పుడైనా ఫారిన్ వెళ్ళే అవకాశాలున్నాయి.”

“ఆ మహారాణి బట్టల్ను ఏం చేసుకుంటుంది? అవి మీదేసుకుని ఆఫీస్‌కు వెళ్ళగలదా?”

“ఊర్కోండి. మీ మాటలు విని ఎవరైనా అలా ఆఫీసుకు వెళ్తే ఇంకేమన్నా ఉందా? ఇంకందరూ పొలోమంటూ బయలుదేరుతారు. మౌంట్ రోడ్డు ట్రాఫిక్కంతా ఆ రంగులతో నిండిపోయి కళ్ళు బైర్లు కమ్ముతాయి.”

“అబ్బాయిని అమ్మాయిని దీవించి రావొచ్చుకదా” అన్నాను. “క్యూ చిన్నదిగా ఉంది.”

“ఔను. అదే చేత్తో భోజనం కూడా చెయ్యొచ్చు” అన్నాడు గోపాలన్. “ఇక్కడ ‘బాసుంది’ బావుంటుంది.”

“మెడ్రాసు రుచుల్నే భరించిన నాలుక…” అన్నాడు సుందర్. “దానికో దణ్ణం!”

“వచ్చే జన్మలో ఆదిశేషువులాగా వెయ్యి నాలుకలతో పుట్టి దేశం నలుమూలలా రుచులు ఆస్వాదించాలని ఆశీర్వదిస్తున్నా!” అన్నాడు రాఘవన్.

“దేశం మొత్తానికే విషం పెట్టెయ్యగలడు ఈ మనిషి!”

వేదిక మీదికెళ్ళి పెళ్ళి కుమారుణ్ణి ఆశీర్వదించాం. అందరం కలిసి నిలబడి గ్రూపు ఫోటోకు చిరునవ్వులు చిందించాం. ఆ కొత్త పెళ్ళి జంటకు మాలో ఎవ్వరితోనూ పరిచయం లేదు. అందుకని మౌనంగా ఓ చిరునవ్వును మామీదికి విసిరారు.

కిందికి దిగేటప్పుడు మాత్రమే నేను వేదికకు మరో చివర వేణువు వాయిస్తున్న మనిషిని చూశాను.

“అరె! ఆయన మణి కదా?”

“అవును.”

“ఆయనా వేణువు వాయిస్తున్నారు? నిజంగా ఆయనేనా? అరె! నేను రికార్డ్ ప్లే అవుతోందనుకున్నాను.”

“ఆయనే! మామూలు కచ్చేరికి యాభై వేలైతే పెళ్ళి కచ్చేరికి రెండు లక్షలు!” అన్నాడు అఱివు.

అయితే అంత పెద్ద జనసందోహంలో ఒక్కళ్ళు కూడా ఆయన్ను వినడం లేదు. అందరూ ఆ వేదికకు వెన్ను చూపించి నిల్చుని మాట్లాడుతున్నారు. నవ్వుతున్నారు. ఒకర్నొకరు గుర్తుపట్టి పలకరించుకుంటున్నారు. బహుమతులు పట్టుకుని పెళ్ళి వేదిక వైపుకు వెడుతున్నారు. దిగి వస్తున్నారు. కనిపించిన పరిచయస్తుల్ని పోగేసుకుని భోజనానికి వెళుతున్నారు.

“ఎవ్వరూ వినడం లేదే?” అన్నాను నేను.

“పెళ్ళిలో కచ్చేరి అంటే అంతే కదా! అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే నాలుగింతలు రేటెక్కువ” అన్నాడు గోపాలన్.

నేను వెళ్ళి ముందు వరుసలో నిలబడ్డాను. మణి కొంచెం మత్తులో ఉన్నట్లనిపించారు. కళ్ళ కిందంతా త్రాగుబోతుల ఆస్తులైన ఉబ్బిపోయిన చర్మం, వలయాలు, కొద్దిగా వేలాడుతున్న దవడలు. కళ్ళొక్కటీ మూసుకొని మెల్లగా ఊగుతూ పూర్తిగా అందులో లీనమైపోయి వాయిస్తున్నారు.

“ఆయన మాట్లాడితే మాట తడబడుతుందేమో కానీ ఫ్లూటు మాత్రం స్పష్టంగా, అమోఘంగా వాయిస్తున్నారు” అన్నాడు సుందర్.

ఆ వేణువు నించి వచ్చే మృదువైన సంగీతం చుట్టూ ఉన్న అన్ని స్పీకర్లనుండీ వినిపిస్తూ గాలినంతా ఆక్రమించింది. అయితే గుంపులోంచి బిగ్గరగా వినపడే మాటల శబ్దం ఆ సంగీతాన్ని ముంచేస్తోంది.

“జె.కె. వచ్చేశారు” అని అఱివు నా భుజం మీద తట్టాడు. “రండి, వెళ్ళి పలుకరిద్దాం.”

“ఔనౌను” అంటూ నేను వాకిటి దగ్గరకెళ్ళాను. మా వాళ్ళు కూడా నా వెంటే వచ్చారు.

“ఆయన కూడా చిలుము పీల్చుకునే వ లో ‌వచ్చి ఉంటాడుగా?” అన్నాడు రాఘవన్.

పెద్ద కారు వచ్చి నిలబడింది. తెల్ల పంచె, చొక్కాలో ఉన్న జె.కె. నెరిసిన తల వెంట్రుకలను భుజాల వెనక్కి తోసి కారు నుంచి దిగారు. మీసాన్ని సవరించుకుంటూ దగ్గరికి వచ్చిన దయాళన్ వైపు చూశారు.

“ఏఁవయ్యా” అంటూ ఆయన భుజం మీద ఓ సారి చెయ్యేసి తర్వాత నన్ను చూసి చిరునవ్వు నవ్వారు.

క్షణంలో ఆయన ముఖ కవళికలు మారాయి. కళ్ళల్లో ఒక వెలుగు “మణి గదా! ఇక్కడికి కూడా వచ్చేశాడా?”

అలానే లోపలికి వెళ్ళారు. ఆయన వెళ్తూంటే ఏనుగుకు దారి వదిలినట్టు గుంపంతా రెండుగా చీలింది. నేరుగా వెళ్ళి మణికి ఎదురుగా నిలబడ్డారు. వెనక్కి తిరక్కుండానే ఒక కుర్చీ వేయమని చేత్తో సైగ చేశారు. కుర్చీ వచ్చిన వెంటనే కూర్చుని కాలు మీద కాలు వేసుకున్నారు. చేతులు కట్టుకొని కొంచెం వెనక్కి వాలి అలా వింటూండిపోయారు.

ఆ పాటను ముగించి మణి కళ్ళు తెరవగానే జె.కె. ను చూశారు. పలచగా నవ్వుతూ తలూపారు. జె.కె. చిరు నవ్వును సమాధానంగా ఇచ్చారు.

మణి తరువాతి పాటను ప్రారంభించారు. అంతవరకు లేని మధురిమ ఆ వేణువులో ఇప్పుడొచ్చి కూచుంది. మునుపటి పాటలో ఉండిన చింత ఇప్పుడు చెవిన పడ్డం లేదు; అది నా ఊహే కావొచ్చు. అయితే ఇప్పుడు వినపడుతున్న సంగీతం మాత్రం చాలా కొత్తగా ఉంది.

వేణువు మోగుతూనే ఉంది. మెల్లగా పొగలా వ్యాపించి మెలికలు తిరిగింది. పట్టు తెరలా మెత్తగా వయ్యారాలు పోయింది. బంగారు వర్ణపు త్రాచులా… అందంగా పక్కకు తిరుగుతున్న నెమలి కంఠంలా…  మెల్లగా విచ్చుకొన్న తెల్లని కొంగ రెక్కల్లా… రెక్కలు కదల్చకుండా వలయాకారంలో ఆకాశాన సంచరిస్తున్న గ్రద్దలా… దాని నీడలా… దూరంగా మెరుస్తూ సాగుతున్న సెలయేరులా…. 

మళ్ళీ ఇంకో విరామం. అప్పుడు తెలిసొచ్చింది… అక్కడంతా అలుముకున్న నిశ్శబ్దం! ఎవరికి వాళ్ళు తమకు తెలియకుండా తామే దూరంగా జరిగి పోతే జె.కె. చుట్టూ ఉన్న స్థలం మాత్రం ఖాళీగా ఉంది, అగ్ని శిఖలతో కాలి బూడిదైన వలయంలా!

మళ్ళీ ఇంకో పాట. ఏ పాటను వాయించాలని ఆయన అడగనూ లేదు. ఈయన చెప్పనూ లేదు. అది వాళ్ళిద్దరికే తెలుసు. వాళ్ళిద్దరూ చెరో ఒడ్డునా ఉన్నారు… ఒకే నాణేనీకి చెరో వైపులా.

తరువాత పాటను అందుకున్నప్పుడు మణి పెదవుల విప్పిన శబ్దం కూడా వినబడింది. జె.కె. కదలకుండా అలా చూస్తూ కూర్చుని ఉన్నారు.

నేనిద్దరినీ చూస్తూ కూచున్నాను. సంగీతం పైకెగిసి ఎగిసి సుడులు తిరిగి కరిగి కరిగి జ్వలిస్తూ పరుగులెత్తుతూంటే ఒక దశలో జె.కె. వేణువు వాయిస్తుంటే మణి వింటూ ఉన్నారు. జె.కె. వేణుగానం వినిపిస్తూ స్వయంగా తన పాటను తనే వింటున్నారు. అక్కడ వాళ్ళిద్దరూ మాత్రమే, కాదు, కాదు… ఒక్కరే ఉన్నారు. అసలు వాళ్ళిద్దరూ అక్కడ లేరేమో!

ఒక ఘడియలో మణి వేణువును కిందికి దింపారు. ఆయన కళ్ళ నుండి నీళ్ళు కారుతున్నాయి. జె.కె. లేచి బయటకు నడిచొచ్చి కారులో కూర్చున్నారు.

దయాళన్ పరిగెత్తి బయటకెళ్ళేసరికే కారు బయలుదేరి వెళ్ళిపోయింది. దయాళన్ సంభ్రమంతో నిలబడిపోయారు.

“పిల్లల్ని ఆశీర్వదించకుండానే వెళ్ళిపోయారే! వెనక్కి పిలవనా?” అంది దయాళన్ భార్య.

“ఒద్దు. రోజూ  ఆయన ఇంట్లో కొలువు తీరతారుగా. అక్కడికి పిలుచుకొని పోదాం” అన్నాడు దయాళన్.

మంటపంలో ఉన్న వాళ్ళందరూ నివ్వెరపోయారు. శరీరాలను కదిలించిన శబ్దాలు. మెత్తని మాటల సవ్వడి. కుర్చీలను జరుపుతున్న సవ్వడి. ఒకరిద్దరి నవ్వుల సవ్వడి.

మణి తన వేణువును అలాగే వదిలిపెట్టి లేచి వెళ్ళిపోయారు. ఆయన శిష్యుడు వాటిని పెట్టెలో సర్దాడు. మృదంగాన్ని ఒరలో పెట్టాడు. వయొలిన్ విద్వాంసుడు పెట్టెతో బాటు పైకి లేచాడు.

“వెళదామా?” అన్నాను మావాళ్ళతో.

గోపాలన్ నిట్టూర్చాడు.

మేము దయాళన్‌తో చెప్పి బయటకు నడిచాము. బైట వాహనాల ప్రవాహం; మనుష్యులను ఎక్కించుకుంటూ. మా కారు తెచ్చేందుకు అఱివు వెళ్ళాడు.

ఉన్నట్టుండి ఏదోలా అనిపిస్తే నేను రాఘవన్ వైపు చూశాను. ఆయన కళ్ళనుండి నీళ్ళు కారుతూ మసక వెలుతురులో మిలమిల మెరుస్తున్నాయి.

“ఏమైందేమైంది?” అనడిగాను.

“ఏం లేదు” అన్నారు.

గోపాలన్ “ఏమైంది? ఎందుకు?” అనడిగాడు.

“వదిలెయ్యండి” అన్నాను.

“ఏం?”

“వదిలెయ్యండి. తరువాత మాట్లాడదాం.”

గోపాలన్ మార్చి మార్చి మమ్మల్నిద్దరినీ చూస్తూ ఉన్నాడు. కారు వచ్చి ఆగింది. అందరం ఎక్కాం.

కారు మెల్లగా రోడ్డు మీదకు వచ్చింది. రంగు రంగుల దీపాలతో వెలుగుతున్న నగరపు రోడ్డు. విపరీతమైన వాహనాల రద్దీ. మనుష్యుల ప్రవాహం. అలసిసొలసి ఉన్న ముఖాలు. కీచుమనే వాహనాల శబ్దాలు. ఒకరిని ఒకరు తోసుకుంటూన్న జనాలు… శబ్దాల సమ్మేళనం. వెలుగుల సమ్మేళనం. వీటన్నిటి మధ్యలో మాటలుడిగిపోయి మేము వెళుతూ ఉన్నాం.

మూలం : ఏకం (https://www.jeyamohan.in/130424/) April 13, 2020

Jeya mohan

జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దంపట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

jeyamohan.writer@gmail.com

డా. రాయదుర్గం విజయలక్ష్మి

డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు  కొత్తగూడెంలో తెలుగు లెక్చరర్ గా  పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాస్ యూనివర్సిటీలో బౌద్ధం మీద PhD చేసి డాక్టరేట్ పొందారు. గతంలో  'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' పుస్తకం వెలువరించారు. వీరి రేడియో ప్రసంగాలను  'పొరుగు తెలుగు బతుకులు' పేరుతొ క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి సహ-సంపాదకత్వం వహించారు. మిసిమి, పాలపిట్ట, సాహితీ స్రవంతి వంటి పత్రికలలో అనేక సాహిత్య విమర్శ  వ్యాసాలు ప్రచురించబడ్డాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *